Tuesday, September 27, 2016

"మేకింగ్ చార్జీలు లేవు" అనబడే ఒక సామాజిక వైఫల్యం


ఈ రోజు మార్కెట్ సెంటర్ లో
మహాకవి కనిపించాడు.
గాల్లో ఏదో వ్రాస్తున్నట్లు వేళ్ళు తిప్పుతూ
తనలో తనే ఏదో మాట్లాడుకొంటూ
ఓ విస్మృత సామ్రాజ్యంలా నడుచుకుపోతున్నాడు

మార్కెట్ నిండా మహాకవి పద్యాల్ని
చైనా వస్తువుల్లా కుప్పలు పోసి అమ్ముతున్నారు.
ఎవరో కుర్రవాడు మహాకవి వెంటబడి
"సార్ తీసుకోండి సార్, నాణ్యమైన కవితలు సర్"
అంటూ ప్రాధేయపడుతున్నాడు.
"పొద్దున్న నుంచీ ఏమీ తినలేదు సర్" అరచాడా కుర్రవాడు
"నేనుకూడా" అని గొణుక్కుంటూ సాగిపోయాడు మహాకవి.

నియాన్ లైట్ల వెలుగులో షాపుకు వేలాడదీసిన
కవిత్వ పుస్తకాల్ని చూస్తూ ఓ క్షణం ఆగాడు మహాకవి
"రండి సార్ రండి నిన్నే వచ్చిన సరుకు"
అంటూ షాపువాడు పిలుస్తున్నాడు.
మహాకవి వడివడిగా ముందుకు కదిలాడు.

మహాకవి కవిత్వ ఆథరైజ్డ్ షో రూమ్ వద్ద
క్యూలైన్ కొంచెం కొంచెం పెద్దదవుతూంది.
కులవృత్తిని కోల్పోయిన ఒకనాటి మహాకవి
సెక్యూరిటీ గార్డు వేషమెత్తి షోరూమ్ కి
కాపలా కాస్తున్నాడు.

"బ్రహ్మాండమైన ఆఫర్
మేకింగ్ చార్జీలు లేవు మహాప్రస్థానం 2.0" అంటో
వీధిమలుపు వద్ద రంగురంగుల హోర్డింగ్
విద్యుత్ కాంతులలో వెలిగిపోతుంది.

కొంతమంది యువకులు మహాకవిని గుర్తించి
అతనితో సెల్ఫీ తీసుకోవటానికి ప్రయత్నిస్తుంటే
"నేను కాదు, నాకేం తెలీదు" అంటూ వారిని తప్పించుకొని
జారిపోయిన ఫాంటును పైకి లాక్కుంటూ
గుంపులోకలిసిపోయి మాయమయ్యాడా మహాకవి

బొల్లోజు బాబా

ఈ కవిత సూర్య దినపత్రికలో ప్రచురింపబడినది. ప్రచురణకు స్వీకరించిన ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను.

1 comment:



  1. మేకింగు చార్జి లేదోయ్!
    పాకిందమ్మా జిలేబి ఫారిన్ కల్చర్!
    షోకేసులందు సెల్ఫీ
    వేగము లందున మహాకవి కనబడుటలే :)

    జిలేబి

    ReplyDelete