డా. బి.ఆర్.అంబేద్కర్ గారి 125 వ జయంతి సందర్భంగా ....
భారతదేశపు రాజకీయ చిత్రాన్ని, సామాజిక వ్యవస్థను ఒక జ్ఞాన సూర్యునిలా ప్రకాశింపచేసిన అజరామరుడు, ప్రాతఃస్మరణీయుడు డా. బి.ఆర్. అంబేద్కర్. అలాంటి మహానుభావుని జీవితచరిత్రను "మహర్షి అంబేద్కర్" అనే పేరుతో గేయకావ్యాన్ని వెలువరించారు ప్రముఖ పద్యకవి శ్రీ గుర్రం ధర్మోజీ గారు.
శ్రీ గుర్రం ధర్మోజీ సంస్కృతాంధ్ర భాషలలో అనేక రచనలు చేసిన ప్రముఖ పద్యకవి. తెలుగులో అనేక ఉదాహరణ కావ్యాలు (ప్రత్యేకమైన చందోరీతి) రచించిన పండితుడు. "మహర్షి అంబేద్కర్" కావ్యంలో అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన 275 పద్యాలు ఉన్నాయి. ఇవి చక్కని నడకతో, మాత్రా చందస్సులో ఉంటూ అంబేద్కర్ మహాశయుని జీవితంలోని వివిధ అంశాలను గొప్పగా దృశ్యమానం చేస్తాయి.
డా. బి.ఆర్. అంబేద్కర్ జీవితచరిత్రను డా. బోయి భీమన్న, శ్రీ దాసి బసవయ్య, మొదలగు మహాత్తమ పండితులు మనకు వచనంలో అందించారు. ( శ్రీ గుర్రం ధర్మోజీ గారు కూడా ఇదివరలో సంస్కృత శ్లోకాలలో అంబేద్కర్ సుప్రభాతం రచించారు).
"మహర్షి అంబేద్కర్" రచన పాడటానికి లయబద్దంగా, సరళంగా గేయరూపంలో ఉంటుంది. గేయాల్లో కనిపించే చక్కని పదపొహళింపు, లయ, సందర్భోచితంగా పరిమళించే కవిత్వపు సుగంధాలు చకితుల్ని చేస్తాయి. పఠితులను ఆలోచింపచేసి చైతన్య పరుస్తాయి.
డా. బి.ఆర్. అంబేద్కర్ జననాన్ని చిన్న చిన్న పదాలతో వర్ణించే పద్యాలు ఇవి. వీటిలో అంబేద్కర్ ను భారతదేశ జ్ఞాన తిలకంగా, ఒక ఉదయించే సూర్యునిగా అభివర్ణించటం వారు జీవితపర్యంతం నెరపిన సేవకు, తగిన స్థానం కల్పించటంగా అర్ధం చేసుకోవాలి. చిక్కని చీకట్లు చీల్చటం అన్నప్రయోగం భావస్ఫోరకం.
విశాల భారతదేశపు
లలాట ఫలకస్థలాన
చలిత ప్రభాకలితము
జ్వలిత జ్ఞానతిలకము
బానిసత్వ బ్రతుకులందు
చిక్కని చీకట్లు చీల్చ
మహర్లందు మహర్షిగా
అంబేద్కర్ ఉదయించెను.
స్కూల్లో లెక్కల మాస్టారు ఇచ్చిన ఒక లెక్కకు విద్యార్ధులు జవాబు చెప్పలేనప్పుడు, తరగతి గది బయట ఉన్న అంబేద్కర్ దానికి సమాధానం ఇవ్వటానికి ముందుకొచ్చిన సందర్భంలో ధర్మోజీ గారు చెప్పిన ఈ పద్యం లోని పదాల నడక, పోతన 'అడిగెదనని కడువిడుజను' ... పద్యానికేమీ తీసిపోదు.
ఉత్త 'రా'కుమారులట్టులవారలు
ఉత్తరమీయకతత్తరపాటున
బిత్తరపోవుచునిస్సహాయులై
నిరుత్తరులౌచునిలుచుంటే (ఇది గేయ పద్యం, చందో బద్దం కాదు గమనించగలరు)
ఆతను అంటరానివాడు లోనికెట్లా వచ్చెదడని తోటి విద్యార్ధులు అభ్యంతరం పెట్టగా, బాల అంబేద్కర్ మనసులో చెలరేగిన ఆలోచనలు, తగిలిన గాయం ఎలా ఓ గేయంగా మారిందో చూడండి
నేనే? పాపం చేశాననుచు
చిన్నమనస్సునెన్నో ప్రశ్నలు
మెదడును తొలిచే పదునగుబాకులు
నెమ్మనమున ఉమ్మెత్తలగుత్తులు.
మొత్తం పద్యం బరువు అంతా పదునగుబాకులు, (తరువాతకాలంలో జాషువాగారిని గుచ్చిన బాకులే), ఉమ్మెత్తలగుత్తులు అన్న పదాల వద్ద ఉంది. ఆ బాకులు శరీరానికి తగిలినవి కాదు, మెదడుకి తగిలాయట. మనసున ఉమ్మెత్తలగుత్తులు మొలచాయట. ఎంత గొప్ప సందర్భోచిత ప్రయోగాలివి.
ఈ రోజు అసంఖ్యాక దళిత, బహుజన యువత అంబేద్కరిజం తమకు ఆదర్శమని ప్రకటించుకొంటున్నది. ఎందుకు అంటే కారణం ఈ చిన్ని పద్యంలో కనిపిస్తుంది
తనేకదా దళితులకు తలపు
తనేకదా పోరునకు పిలుపు
తనేకదా ఉద్యమపు గెలుపు
గుండెలలో సదా నిలుపు
దళితబహుజనేతరలకు కూడా అంబేద్కర్ ఆదర్శనీయుడే ఎందుకంటే ఈ రోజు ఆయన ఉపన్యాసాలను చదివితే, అంబేద్కర్ యొక్క రాజనీతిజ్ఞత, నిబద్దత, తర్కం, ముక్కుసూటిదనం, పోరాటపటిమ, సహనశీలత వంటి ఉదాత్త లక్షణాలెన్నో ఆశ్చర్యం కలిగించకమానవు. ఒక్క మనిషి ఇన్ని కోణాల్లో, అంతటి వ్యతిరేకతలో తన వ్యక్తిత్వాన్ని, భావజాలాన్ని ఎలా నిలుపుకోగలిగాడా, చివరివరకూ ఎలా కొనసాగించగలిగాడా అని ప్రస్తుతతరమే కాదు భావితరాలు కూడా చేతులుజోడించి నమస్కరించే మూర్తిమత్వం అంబేద్కర్ ది.
అలాంటి అంబేద్కర్ ఉపన్యాసం పై ధర్మోజీ గారు గొప్ప పద్యాలు వ్రాసారు
ఉపన్యాసమన ఉపన్యాసమా?
అంబేద్కరుని ఉపన్యాసము
అద్భుతమైన విన్యాసము
అచ్చెరువొందే ఉపన్యాసము
మాటలు కావవి మంటలు కాని
మాటలు కావవి ఈటెలు కాని
పదములు కావవి పదును కత్తులు
గాధకాదని బాధయెకాని
డా. బి.ఆర్. అంబేద్కర్ బాల్యము, అమెరికా లండన్ లలో ఆయన విద్యాభ్యాసము, మహద్ ఉదంతం, సైమన్ కమిషన్ ఎదుట వాదనలు, రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రాతినిధ్యం, బౌద్దమతస్వీకరణ, హిందూకోడ్ తిరస్కరణకు నిరసనగా రాజీనామా, రమాభాయి నిష్క్రమణ, రాజ్యాంగనిర్మాణం, మహాభినిష్క్రమణం వంటి అనేక అంశాలతో "మహర్షి అంబేద్కర్" పుస్తకం ఎంతో ఆసక్తికరంగా ఆ మహాశయుని సంపూర్ణ జీవితాన్ని మనకనుల ముందు నిలుపుతుంది.
డా. బి.ఆర్. అంబేద్కర్ 125 జయంతోత్సవాల సందర్భంగా వెలువరించిన ఈ పుస్తకం ఒక చక్కని స్మరణ, నివాళి.
ప్రతిఒక్కరు చదివి ప్రేరణనొంది, మరో పదిమందికి ఈ పుస్తకాన్ని బహూకరించి వారిలో కూడా ఉత్తేజాన్ని నింపాల్సిన సమయం ఇది.
శ్రీశ్రీ బుద్దమతావలంబసహితం, శ్రీభీమరాయం శుభం
శ్రీశ్రీ జ్ఞానవిధాన భాస్కరసమం శ్రీబాబసాహేబునం
శ్రీ సక్పాలసుతంనమామిసతతంసాంబేద్కరం భాసురం
భీమాబాయిసుతం సదా హితకరం శ్రీబుద్ద ధర్మాశ్రితం ..... అంటూ శ్రీ ధర్మోజి అంబేద్కర్ పై వ్రాసిన సంస్కృత శ్లోకంతో ఈ గేయసంపుటి మొదలై, మరో సంస్కృత మంగళాశాసనంతో ముగుస్తుంది.
*******
రచయిత గురించి
పేరు: గుర్రం ధర్మోజి
రచనలు: శ్రీ అంబేద్కర్ సుప్రభాతం (సంస్కృతం), శ్రీ భీమరాయ ప్రభాత గీతి (గేయం), శ్రీ భీమరాయ ఉదాహరణ కావ్యం, ఆంధ్రకేసరి ఉదాహరణ కావ్యం, క్రీస్తు సుప్రభాతం (సంస్కృతం), అయ్యప్ప సుప్రభాతం (సంస్కృతం), నాన్న (గేయకావ్యం), మహర్షి అంబేద్కర్ (గేయ కావ్యం)
వృత్తి: తెలుగు లెక్చరర్, రాజోలు డిగ్రీ కళాశాల
ఫోన్.నం.9949263267
వెల 10 రూ.
దొరకు చోటు
జి. ధర్మోజీ రావు, తెలుగు లెక్చరర్
ప్రభావతి పబ్లికేషన్స్
రాజోలు, తూ.గో.జిల్లా., ఆంధ్రప్రదేష్.
పి.ఎస్. ఈ పోస్టుకు లైకులు కామెంటులు చేయటం బదులు, వీలయితే ధర్మోజి గారికి ఫోన్ చేసి/మెసేజ్ పెట్టి (9949263267/dharmoji92@gmail.com) అభినందనలు తెలపండి.
తనకాలాన్ని, ఆలోచనల్ని కరిగించి కొన్ని వాక్యాల్ని సృష్టించి సమాజానికి ధారవోసే ఒక కవికి అంతకన్నా మనమేం ఇవ్వగలం!
బొల్లోజు బాబా