Friday, March 30, 2012

మూల్యాంకనం



జవాబు పత్రాన్ని పట్టుకోగానే
ఓ ఏడాది కాలాన్ని
చేతిలోకి తీసుకొన్నట్లుంటుంది.
ఏదో అపరిచిత జీవితాన్ని
తడుముతున్నట్లనిపిస్తుంది.

పాస్ మార్కులు వేయమంటూ
కన్నీటి ప్రార్ధనో, వెయ్యినోటో, ఫోన్ నంబరో
లేక శాపాల బెదిరింపో వంటి చేష్టలు
బిత్తరపరచినా
ఇన్నేళ్ళ చదువులో ఎక్కడా తగలని
ఒక వాక్యమో, కొత్త కోణమో, వివరణో
తళుక్కు మన్నపుడు
కవిత్వం చదివినంత
ఆనందమౌతుంది.

జవాబు పత్రాల్ని మెదడు తూకం వేస్తే
హృదయం మూల్యాంకనం చేస్తుంది.

ఈ స్టూడెంట్ కి
మమ్మీ డాడీ దీబెట్టి బెస్టాఫ్ లక్ చెప్పారో లేదో
హైలైటర్స్, స్కెచ్ పెన్ లు కొనివ్వలేదు కాబోలు
స్కేలు కూడా లేదేమో..
పేపరు మడతే మార్జినయ్యింది.
ఈ అక్షరాలు వ్రాసిన చేయి
పొలంపనులు చేసిందో, రాళ్ళు మోసిందో
పెట్రోలు కొట్టిందో లేక అంట్లే తోమిందో
అక్షరాల నిండా మట్టి వాసన ... మట్టి వాసన...
హృదయానికి మట్టివాసన ఎంతిష్టమో!

జవాబులు సరిగ్గా రాయకపోవటానికి కారణం
ఒక్క చదవకపోవటమేనా... లేక
ఆ సమయంలో జబ్బుచేసిందా?
ముందురోజు తండ్రికి తలకొరివి పెట్టాడా?
పెళ్ళిబట్టలలో నేరుగా పరీక్షహాలుకు వచ్చిందా?
సమస్యలనుంచి రేపు పారిపోవాలనుకొంటున్నాడా?
ఖాళీ జవాబు పత్రం ప్రశ్నల పత్రమౌతుంది

పేపర్లు దిద్దటం అంటే ఒక్కోసారి
పత్రికల్లో పతాక శీర్షికలవటం కూడా
ఆత్మహత్యగానో, అత్యుత్తమ రాంక్ అనో.

బొల్లోజు బాబా

12 comments:

  1. నిజంగా ఇంత అంతర్మధనం తరువాత ఫలితాలు వెల్లువడతాయన్నమాట!!!
    చాలా బాగా వివరించారుగా మాస్టారూ...:-)

    ReplyDelete
  2. చాలా బావుందండీ!

    ReplyDelete
  3. చాలా బాగుందండి :)

    ReplyDelete
  4. పద్మార్పితగారు, సాధారణంగా మెదడు పేపర్లను తూకం వేసేస్తుంది. కానీ కనిపించని దృశ్యాలను హృదయం చూడటానికి ప్రయత్నిస్తుంది అప్పుడప్పుడూ. థాంక్యూ.
    మహెక్ గారు మూలాగారూ థాంక్సండీ.
    ఫణీంద్ర గారికి, మీకు నచ్చటం చాలా సంతోషంగా ఉందండి. థాంక్యూ సర్.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  5. మూల్యంకణాన్ని కూడా మంచి కవితగా మలచారు.చాలా బావుందండి

    ReplyDelete
  6. పేపర్లు దిద్దుతుంటే ఎన్ని రకాల ఆలోచనలో కదా..మీ కవిత వాటి మధ్య ... బావుంది మాష్టారూ..

    ReplyDelete
  7. ChakkagA cheppAru bAbA gArU.diddE vAdiki tappa, inta bada untundi ani evarikI aalochanalOki kUDA rAni vishayAnni. chAlA chakkagA undi vEdana :-)

    ReplyDelete
  8. kavithaloni realism chaala touchyga undhi, excellent baba garu

    ReplyDelete
  9. బొల్లోజు బాబా గారు! హృదయానికి మట్టివాసన సేనా ఇష్టమండి, .........
    .....................................
    .................................................
    ..............................................................ఈ బ్లాగు మొత్తం మట్టివాసనోస్తున్దనుకోండి !

    ReplyDelete
  10. "జవాబు పత్రాల్ని మెదడు తూకం వేస్తే
    హృదయం మూల్యాంకనం చేస్తుంది"
    "ఖాళీ జవాబు పత్రం ప్రశ్నల పత్రమౌతుంది"

    నిజంగా అద్భుతమైన వాక్యాలు...అలోచింపజేసే వాక్యాలు..

    ReplyDelete
  11. ముప్పై యేళ్ళు పేపర్లు దిద్దిన అనుభవంగల నన్ను నేను అద్దంలో చూసుకున్నట్టుంది మీ కవిత చదువుతుంటే.. చాలా బాగుంది. ధన్యవాదాలు.

    ReplyDelete