కొబ్బరి కాయల దొంగ దొరికాడట
చెట్టుకు కట్టేసి కొడుతున్నారంటే
చూట్టానికి వెళ్ళాను.
అతను తల దించుకొని ఉన్నాడు
చీప్ లిక్కర్ వాసన గుప్పుమంటోంది.
వ్యసనం అతని ఆత్మను తినేసింది
ఆత్మ లేని ఆ వికార దేహం
రక్త గడ్డలా ఉంది.
వాడి కుటుంబాన్ని తల్చుకొంటే జాలనిపిచింది.
వీధికొక్కటి చొప్పున
వెలిసిన గిలిటన్ల వేట్లకు
ఊర్లకు ఊర్లు కబేళాలుగా
మారుతున్న దృశ్యశకలమిది.
ఉన్నది కనుక తాగుతున్నారు
తాగుతున్నారు కనుక ఉంచుతున్నాం
నరంలేనిదే నాలుక కదా!
లిక్కర్ వైద్యం ఇన్సూరెన్స్ ఎక్స్ గ్రేషియా అంటూ
ప్రాణం చుట్టూ అన్ని
వ్యాపారాలు ముడివేసుకొన్నపుడు
జీవితం ఎంత చవకో
అతణ్ణి చూస్తే అర్ధమౌతుంది.
“ఇది వరకు తిండి కోసం దొంగతనాలు చేసేవారు
ఇప్పుడు మందుకోసం చేస్తున్నారు” ఎవరో పెద్దాయన
గొణుక్కొంటున్నాడు.
అభివృద్ధంటే అదేనేమో!
బొల్లోజు బాబా