Thursday, June 12, 2008

నిర్మాల్యం

నిర్మాల్యం

(రాత్రివేళలో నగరాల్ని శుభ్రంచేసే వాళ్లను చూసి)


ఒక పగలు ముదుసలై కాల గర్భంలో కలసి పోయాకా

వాళ్లు రోడ్లపై గంగానదీ ప్రవాహమౌతారు.


మనమేమో

ఆరోజు అనలేకపోయిన మాటలను,

చెయ్యలేకపోయిన పనులను, కలలు కలలు గా

నెమరువేసుకొంటూంటాం.

దేహం నిద్రాదేవి పొత్తిళ్లలో పాపాయవుతుంది.


వాళ్లు మాత్రం

నగరం విసర్జించిన నాగరికతను

ఏరిపారేస్తూంటారు.


నిషిద్ద కారీ బ్యాగుల్ని, వ్యర్ధ జీవాల్ని, జీవవ్యర్ధాల్ని,

పుటుక ధన్యమైందనుకొంటున్న సిగరెట్ పీకల్ని,

గుట్కా సాషేల్ని, కిళ్లీ పెంటికల్ని,

కన్యత్వాన్ని కోల్పోయిన కండోముల్నీ

మత్తు వదిలించుకున్న మద్యం బాటిళ్లని,

చరిత్రలో కలసిపోయిన వార్తల శకలాల్ని,

ప్లాస్టిక్ పువ్వుల్నీ, నవ్వుల్నీ, లవ్వుల్నీ, ఒకటేమిటి,

నగరం విసర్జించిన నాగరికతను

వాళ్లు ఏరిపారేస్తూంటారు.


దేవదేవుని ప్రసాదాన్ని అందరికీ తినిపించిన

పాలిథీను అడ్డాకుల్ని, భక్తిమైకు నిశ్శబ్ధతని,

పిల్లవాణ్ణి స్కూలుకు వెళ్లేలా చేసిన చాక్లెట్ల రేపర్లని,

పెన్నుముక్కల్నీ, జ్జానభారానికి అలసిన కన్నీటి చుక్కల్నీ,

ఇంజక్షను సిరంజీల్ని, బాధల బేండేజీల్ని,

అబార్షండ్ శిశువునీ, రక్తాన్ని, చీమునీ, దు:ఖాన్ని, దోపిడీని,

ప్లాస్టిక్ విస్తరాకుపై మిగిలిన మెతుకుల్నీ,

పాలకంటే ఎక్కువ ఖరీదైన నీటిని దాచిన బాటిల్స్ నీ,

వాహనాల గొట్రుకు ఉక్కిరిబిక్కిరై

పండుటాకుతో కలసి రాలిపోయిన పచ్చనాకునీ,

ఒకటేమిటి

నగరం విసర్జించిన నాగరికతను,

వాళ్లు చీపుళ్లతో, తట్టలతో ఏరిపారేస్తారు.


అపుడు నగరం స్నానం చేసినంత ఫ్రెష్ గా తయారై

మరో రేపు (రేప్ ?) కి సిద్దమవుతుంది.





బొల్లోజు బాబా

17 comments:

  1. మీ కవిత బావుంది. దీన్ని చదవగానే నాకు కె.వి. నరేందర్ గారు రాసిన "చీపురు" కథ గుర్తొచ్చింది. ఆ కథా వస్తువు కూడా మీ కవితా సారమే. ఈ కథ విపుల మార్చ్ 2007 సంచిలో ప్రచురితమైంది. ఈ కథని నేను హిందిలోకి అనువదించాను. ప్రస్తుతం అది పరిశీలనలో ఉంది. అభినందనలు.
    కొల్లూరి సోమ శంకర్
    www.kollurisomasankar.wordpress.com

    ReplyDelete
  2. చాలా బావుంది.

    ReplyDelete
  3. కొ్ల్లూరి సోమ శంకర్ గారికి,
    స్పందించినందుకు ధన్యవాదములు.
    మీరుదహరించిన చీపురు కధను నా దృష్టికి రాలేదు. ఈ సారి ప్రయత్నించి చదువుతాను.

    ఈ కవిత వ్రాయటానికి ప్రేరణ, చాన్నాళ్ల క్రితం, సెకండ్ షో సినిమాచూసి వస్తుంటే, మా ఆఫీసు అటెండరు, రోడ్లు శుబ్రం చేస్తూ కనపడ్డాడు. బండి ఆపి వానితో మాట్లాడి,, కుటుంబ ఖర్చులకోసం, ఇలా పార్ట్ టైముగా చేస్తుంటాను అని తను చెప్పగా తెలుసుకొన్నాను.
    ఆ అనుభవం మనసులో ముద్రించుకు పోగా, ఇంటికొచ్చి వ్రాసుకొన్న కవిత ఇది.

    ఇది మీవంటి వారికి నచ్చటం ఆనందంగా ఉంది.

    ధన్యవాదములతో
    బొల్లోజు బాబా

    ReplyDelete
  4. hi babaya

    'I think the best from you' that is what dad said. I will try to translate (or cpoy the theme)
    thanks for the comments.

    eager to be in india...Bobby

    ReplyDelete
  5. oka manishi badani chusi tana badagaa bavincha galigthe antaku minchi kaviki kavitanam emundandi.meelo adi pushkalam ga undi.
    Ee abiprayam meeku nachaaka poina kshaminchali.endukante nenu phaktu sri sri abimanini.aayana antadu lokam bada naa baada ani mahaprasthanam lo.ikkada kuda naaku ade feel kanipinchindi.

    simply superb.thanks

    ReplyDelete
  6. కవితంతా చెత్తతో నింపేసారే.
    శ్రీను

    ReplyDelete
  7. శ్రీను గారు
    ఈ కవితలో నెను మన నాగరికత సృష్టిస్తున్న మోద్రన్ చెత్తను అన్యాపదేశంగా చెప్ప ప్రయత్నించాను.

    కారీబాగులు, ప్లాస్టిక్ వస్తువులు, వాహనాల గొట్రు, ఇంజక్షన్ సిరంజులు, అబార్షండ్ శిశువులు, నీరును కూదా వ్యాపార వస్తువుని చేసిన తెలివితేటలు, తరగిపోతున్న పచ్చదనం ఇవన్నీ మన ఆధునిక నాగరికత సృష్టించిన చెత్త.
    ఈ చెత్తనె మనమందరం రోజూ తయారుచేస్తున్నాం, వదిలిపెడుతున్నాం..
    బహుసా ఈ కవితలో మీకు చెత్త మాత్రమె కనిపించటం నా దురదృష్టం.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  8. బాబా గారు...
    మీ blog లోని కవితలన్నీ చదివాను...
    సరళమైన బాషతో... ఆలోచింప చేసే భావంతో...
    చాలా చాలా బావున్నాయి....

    ReplyDelete
  9. బాబా గారికి,
    Excellent! Really you excel yourself in all your endeavors.కవిత చాలా బాగుంది.
    ఒక పగలు ముదుసలై...చాలా చక్కటి ప్రయోగం.
    నగరం విసర్జించిన నాగరికతని వాళ్ళు ఏరిపారేస్తుంటారు. చాలా అధ్భుతమయిన భావన. మీలాటి వారిని చూసే కాబోలు '... కాదేది కవితకనర్హం' అన్నారు శ్రీ శ్రీ.

    ReplyDelete
  10. navvulni--dukkhaanni,doopidiini cetta uudcee vaallu etlaa uudceestaaroo artham kaaleedu.solidnii,abstractnii kalipi kotteestee laabhameemiti?oka vaastavam-oka uuha prayoojanaatmakamgaa samaantaramgaa nadavaalikadaa.kavitaku patishthamaina nirmaanam kanipincadu.chandrasekhar

    ReplyDelete
  11. చంద్ర శేఖర్ గారికి
    మీ వాదన అర్ధమయ్యింది. కవిత్వంలో ఏదైనా సాధ్యమే. అందుకే కవిత్వాన్ని " అందమైన అబద్దం" అని కూడా నిర్వచించవచ్చు.
    వచనంలో అయితే మీరన్నట్లు వస్తువులను మాత్రమే ఊడ్చినట్లు చెప్పాలి. కానీ కవిత్వానికి ఈ నియమాలు అక్కర లేదు. ఉదాహరణకు: ఆశారాజు గారు వ్రాసిన ఒక అద్భుత వాక్యం: తెల్లవారుజామున స్త్రీలు అరుగులపై రాత్రిమిగిల్చిన చీకటిని చీపుర్లతో ఊడ్చేస్తున్నారు. (బహుసా ఇవే వాక్యాలు కాక పోవచ్చు). ఇందులో వస్తువు లేదు గమనించారా?
    ఇక ఈ కవితలో తుడవటం అనేది, గుడిపక్క, బడిపక్క, హాస్పటల్ పక్క జరిగేటప్పుడు నేను ఆ ఆ ప్రాంతాలలో జరిగే విషయాలను చెప్పాను. ప్రతీచోటా వస్తువుతో మొదలేట్టి మీరన్నట్లు ఆబ్స్ట్రాక్ట్ పదంతో ముగించాను. (ఎందుకంటే వస్తువులు మాత్రమే ఉంటే అది వచనమౌతుందనే భావంతో ). ఆ ఆ ప్రాంతాలలో ఆరోజు జరిగిన అభౌతిక అంశాలను కూడా (ఉదా: కన్నీరు, దు:ఖం, దోపిడీ, నిశ్శబ్దత మొ. వి.) చెప్పాలని ప్రయత్నించాను.

    మీరన్నట్లు ఇది నిర్మాణాన్ని పాడుచేస్తున్నాయని నేను భావించటం లేదు.
    చదివి స్పందించినందుకు సదా ధన్యవాదములు.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  12. "నగరం విసర్జించిన నాగరికతను ఏరిపారేస్తూంటారు" ఈ ఒక్క వాక్యం చాలు కవితలోతుల్ని కొలవడానికి. ప్రతిసారి మీరిలా గుండేనో,మెదడునో,హృదయాన్నో,ఆలోచననో కదిలించేస్తే ఎలా?

    ReplyDelete
  13. ఓ సినిమాలో అన్నట్టు, "ఈ కవితలో చాలా information ఉందండీ!" :-)
    Informationతో బాటు కవిత్వం కూడా ఉంది. అయితే కవితకి సంబంధించిన వరకూ information ఒకరకమైన చెత్తే(కాలుష్యమే!). దాన్ని ఏరేస్తే ఈ కవిత మరింత గొప్పగా ఉంటుందని నా అభిప్రాయం.

    ReplyDelete
  14. kameswararao gaaru
    yeah you are right to some extent. i expressed it already in my previous answers. thank you for commenting.
    bollojubaba

    ReplyDelete
  15. బాబా గారికి నమస్కరించి,
    నిజమే కదా ఎంత మంది భిక్ష పెడితే ఈ మాత్రం సాఫీగా సాగి పోతుంది జీవితం అనిపించింది.నేను మాత్రమే నీటుగా ఉంటే సరిపోదు అనే అవగాహన కూడా కల్గింది.ధన్యున్ని.
    రీసర్చ్ లు చేసే వారికి దీనిలో విమర్శ కనిపిస్తుంది... పాటించేది సామాన్యుడు కాబట్టి ఈ కవిత సామాన్యులను అద్భుతంగా ఆకట్టుకొంటుంది. నాకు తెలుసు అనుకునే వాడికే దీనిలొ information కనపడుతుంది... ప్రతి పదాన్ని జీర్నించుకునే ఎందరో వ్యక్తులకు ఇది దారి దీపం. బాబ గారి సున్నిత హృదయాన్ని మనస్పూర్తి గా అభినందిస్తూ

    ఒక సామాన్యుడు..
    నరసింహ మూర్తి

    ReplyDelete