భారతదేశ చరిత్రలో భక్తి ఉద్యమం (7-17 వ శతాబ్దాలు) అత్యంత గొప్ప ఆధ్యాత్మిక, సామాజిక విప్లవం. బ్రాహ్మణాధిపత్యం పట్ల వ్యతిరేకత, హెచ్చుతగ్గుల కులవ్యవస్థపట్ల నిరసన, సమానత్వభావన, వ్యక్తిగత ఆధ్యాత్మిక అనుభవం లాంటివి భక్తి ఉద్యమం ప్రచారం చేసిన ప్రధాన అంశాలు. ఇది తమిళ ఆళ్వార్లు, నాయనార్లతో మొదలై ఉత్తరభారతదేశంలో వ్యాపించింది.
బ్రాహ్మణాధిపత్యాన్ని, వైదిక క్రతువులను, హెచ్చుతగ్గుల వర్ణవ్యవస్థను నిరసించిన బౌద్ధం క్రమేపీ క్షిణించటంతో ఆ భావధారకు కొనసాగింపుగా ప్రజలు భక్తి ఉద్యమాన్ని నిర్మించుకొన్నారు. బౌద్ధం ఆనాటి ప్రజల భాష అయిన పాళి భాషలో తన బోధనలను ప్రచారం చేసినట్లుగానే భక్తి ఉద్యమం కూడా తమిళం, కన్నడం, మరాఠి, హిందీ, పంజాబీ లాంటి స్థానిక భాషలద్వారా ప్రజలను ప్రభావితం చేసింది. బౌద్ధం, చార్వాకం అంతరించిపోవటం వల్ల కలిగిన ఆధ్యాత్మిక శూన్యతను భక్తి ఉద్యమం భర్తీ చేసింది. నిజానికి బౌద్ధాన్ని బలవంతంగా నిర్మూలించినా, ప్రజల సామూహిక జ్ఞాపకాలలోంచి బౌద్ధం తొలగిపోలేదు. దాని తాలూకు సారం కొన్ని కొన్ని మార్పులతో భక్తి ఉద్యమం రూపంలో కొనసాగింది.
భక్తి ఉద్యమం ఏం చేసింది?
భక్తి ఉద్యమకారులు కులఅసమానతలను ఖండించారు. సంస్కృతాన్ని తిరస్కరించారు. దేవుని చేరుకోవటానికి మధ్యలో పూజారి అవసరం లేదన్నారు. పూజలు, క్రతువులు, యజ్ఞాలు, యాగాలు, వేదాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రస్తావన లేదు. భక్తితో ఎవరైనా లింగ, కులాలకు అతీతంగా దేవుడిని చేరుకోవచ్చు అని చెప్పారు. ఈ ఉద్యమాన్ని కబీర్, గురునానక్, రవిదాస్, తులసీదాస్ తుకారాం, లాంటివారు తీర్చిదిద్దారు. వీరు ఈ అంశాలను ప్రజలలో బలంగా ప్రచారం చేసారు
1. బ్రాహ్మణ ఆధిపత్యాన్ని, కుల వివక్షను తిరస్కరించటం:
ఆధ్యాత్మిక ప్రపంచంలో బ్రాహ్మణుల గుత్తాధిపత్యాన్ని, వేదాచారాలను చర్మకారకుటుంబానికి చెందిన రవిదాస్, దళితుడైన చొఖమేళా లాంటి సాధువులు బహిరంగంగా ఖండించారు.
గురు రవిదాస్ 1433 CE లో జన్మించి 1528 CE లో బెనారస్ లో మరణించాడంటారు. ఇతనిపై ముస్లిం సూఫీ సాధువుల ప్రభావం ఉండేది. ఇతను గొప్ప వాగ్గేయకారుడు.
“కాశీలో పుట్టిన పండితులారా, నేను కూడా ఉన్నతకుటుంబంలోనే పుట్టాను. నా వృత్తి తోలుతో ముడిపడి ఉంది, కానీ నాహృదయం ప్రభువుని కీర్తించటంలో గర్వపడుతుంది”
పై వాక్యాల ద్వారా గురురవిదాస్ తన వృత్తిని చెప్పటమే కాక, అది ఏ రకంగాను బ్రాహ్మణ పుట్టకకు తక్కువకాదని ప్రకటిస్తున్నారు. ఇది ఒకరకంగా ఆనాడు అమలులో ఉన్న వర్ణవ్యవస్థపట్ల ధిక్కారమే.
“ఏ రాజ్యంలో అయితే ప్రజలు రెండవ మూడవ శ్రేణులుగా జీవించరో, ఆంక్షలులేక స్వేచ్చగా సంచరించగలరో, ఆ రాజ్యం రవిదాసుకు సంతోషం కలిగిస్తుంది ” లాంటి రవిదాస్ వాక్యాలు ఇరవయ్యోశతాబ్దపు మార్టిన్ లూదర్ కింగ్ “I have a dream” స్పీచ్ ను తలపిస్తాయి.
చొక్కమేళ మరాఠా భక్తిసంప్రదాయ కవి. 14 వ శతాబ్దం. ముస్లిమ్ పాలనలో ఆథ్యాత్మిక అన్వేషణ చేసిన మహర్ కులస్థుడు. విఠోబా దేవుని పట్ల అపారమైన భక్తిని ప్రదర్శించాడు. ఇతనిని బ్రాహ్మణ పండితులు ఆలయంలోకి అనుమతించలేదు. ఆ కారణంగా సొంత ఆలయాన్ని నిర్మించి సమాంతర ఆధ్యాత్మిక కేంద్రాన్ని స్థాపించాడు. వేదాలను, హిందూ ధర్మాలను అంగీకరించలేదు. చొక్కమేళా ఒక గోడ కూలిపోవడం వల్ల మరణించాడని చెబుతారు.
భక్తికవులు అంధవిశ్వాసాలను, మూఢనమ్మకాలను తొలగించే ప్రయత్నం చేసారు. జోతిష్యాలను, పుణ్యనదీ స్నానాలను, విపరీతమైన పూజాక్రతువులను వీరు తమ రచనలద్వారా ఖండించారు.
కబీర్ ఒకచోట- రాళ్ళకి మొక్కితే మోక్షం వస్తుందనుకొంటే నేను పర్వతానికే మొక్కుతాను; ఒక తిరగలికి మొక్కండి అది మనుషుల ఆకలితీరుస్తుంది” అంటూ విగ్రహారాధనను విమర్శిస్తాడు. అదే విధంగా “మసీదు ఎక్కి నిత్యం అలా బిగ్గరగా ఎందుకు అరుస్తావు, దేవునికేమైనా చెవుడా” అని ముల్లాలను ప్రశ్నిస్తాడు.
.
2. ఆధ్యాత్మికసాధనకు స్త్రీలు కూడా అర్హులే అనే విషయాన్ని అనేక భక్తికవయిత్రులు నిరూపిస్తారు. అక్కమహాదేవి, ఆండాళు, మీరాబాయి, జనాబాయి, సోయరా భాయ్, లల్లేశ్వరి లాంటివారు ముఖ్యులు. వీరు కులం లింగం, సామాజిక ఆంక్షలను అధికమించి దైవం పట్ల తమ అచంచలమైన భక్తిని ప్రకటించారు.
అక్కమహాదేవి అనేక వచనాలలో కులాన్ని, కుల ఆధారిత వివక్షను తిరస్కరించారు. ఈమె అనుసరించిన వీరశైవం – స్త్రీపురుషులు ఇరువురు సమానమేనని, కులవివక్ష, మూఢనమ్మకాలు, జంతుబలులు, తీర్థయాత్రలు కూడదని ప్రవచించింది.
"ఒక వ్యక్తి శీలవంతుడు కావాలంటే
అతను తన కులాన్ని విడనాడాలి" (5/691) అని స్పష్టంగా చెబుతుంది అక్కమహాదేవి.
.
3. హిందూ ముస్లిమ్ ల ఐక్యత:
భక్తి సాధువులు కొందరు హిందూ ముస్లిముల మధ్య విభజనను చెరిపివేసారు. వీరిలో కబీరు ప్రముఖుడు. ఇతను హిందువా ముస్లిమా అనేది ఎవరూ తేల్చలేకపోయారు. ఒక కథనం ప్రకారం కబీరును ఒక హిందూ వితంతువు కని గంగానది ఒడ్డున విడిచిపెట్టగా, ముస్లిమ్ నేతకుటుంబానికి చెందిన నీరు, నీమా దంపతులు ఇతనిని పెంచుకొన్నారని అంటారు. అలా కబీరును ముస్లిముగా పరిగణిస్తారు.
హిందూ ముస్లిమ్ ఐక్యతకు ఇతను ఒక్క చిహ్నంగా చెబుతారు. ఇతను హిందూ ముస్లిమ్ మతాలలోని మూఢభావాలని సమానంగా విమర్శించాడు
మసీదు దేవుడు నివసించే స్థలమైతే, మిగిలిన భూమి ఎవరిది? రాముడు విగ్రహాలలో పవిత్ర స్థలాలలో ఉంటాడా? - అయితే అక్కడ అతన్ని ఇంతవరకూ ఎవరూ ఎందుకు కనుగొనలేదు? – లాంటి కబీర్ వచనాలు ఇతని మతపరమైన విశాల దృక్ఫథాన్ని తెలుపుతాయి.
షేక్ ఫరీదుద్దీన్ గంజ్షకర్ (1173-1265), షా అబ్దుల్ కరిమ్ (1536-1623), షా ఇనాయతుల్లా (1655 – 1718) లాంటి సూఫీ సన్యాసులు హిందూ ముస్లిముల ఐక్యతను బోధించి ఇరుమతస్థులలో సమాన ఆదరణ పొందారు.
నానక్ సాహెబ్ (1469-1539), దాదు దయాళ్ (1544-1603), యారి షా (1668-1725), బుల్లా సాహెబ్ (యారి షా శిష్యుడు), దరియాసాహెబ్ (1700-1780), తులసి సాహెబ్ (1760- 1842) లాంటి మహనీయులు హిందూ ముస్లిమ్ ల ఆద్యాత్మిక ఐక్యత, ఐహిక సామరస్యతల కొరకు ఎంతో కృషిచేసారు.
హిందూ ముస్లిమ్ ల మధ్య సాంస్కృతిక భావనలను ఇచ్చిపుచ్చు కోవటంలో స్త్రీలు కూడా పాటుపడ్డారు. నాని బాయి, మాతా బాయి (వీరు దాదు దయాళ్ కుమార్తెలు), దయాబాయి, క్షేమాబాయి మొదలగు వారు ఒకనాటి హిందూ ముస్లిమ్ సఖ్యతను బలపరచిన సాధకురాళ్ళు
నామదేవ్ వంటి భక్తి కవులు హిందూ ముస్లిమ్ ల మధ్య ప్రేమానుబంధాలను పెంపుచేసారు. . అజ్మీర్లోని మొయినుద్దీన్ చిష్తీ దర్గా మరియు పంఢర్పూర్లోని తుకారామ్ యొక్క విఠోబా ఆలయం అన్ని మతాల భక్తులను ఆకర్షించాయి.
గౌడియ వైష్ణవ సంప్రదాయ స్థాపకుడైన శ్రీ చైతన్య మహాప్రభుకు (1486-1533) బుద్ధిమంత ఖాన్ అనే ముస్లిమ్ అత్యంత సన్నిహితుడైన సేవకునిగా వ్యవహించేవాడు.
నజీర్ మహమ్మద్ , ఫకీర్ హబీబ్, సయ్యద్ మర్తూజా లాంటి కవులు –కృష్ణభక్తితో గీతాలు రచించారు.
ముస్లిమ్ యోగి వావర్ తొ అయ్యప్ప స్వామి, బీబి నాంచారితో వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆథ్యాత్మిక సంబంధాలను ఉత్త భక్తి కథలుగా కొట్టిపారేయలేం. వాటివెనుక మన పూర్వీకులు నిర్మించదలచిన సామరస్యతను అర్ధంచేసుకోవాలి.
4. హిందుత్వ vs భక్తి ఉద్యమం
కులాలకు అతీతంగా ప్రజలందరూ సమానమని; భిన్నమతాల మధ్య సామరస్యం ఉండాలని, క్రతువులు బ్రాహ్మణాధిక్యతను తిరస్కరించటం; ప్రేమ ఆరాధన ద్వారా భగవంతుడిని చేరుకోవచ్చునని మధ్యవర్తుల ప్రమేయం అవసరం లేదని భక్తి ఉద్యమం పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఇది ప్రజలలోని బహుళత్వాన్ని అంగీకరిస్తూ, అదే సమయంలో వారిని కలిపి, సహిష్ణుతతో జీవించేలా చేసే భావజాలం. దీనికి పూర్తి వ్యతిరేక భావజాలం హిందుత్వ.
హిందుత్వ అనేది 1920 లలో సావార్కర్ ప్రతిపాదించిన ఒక భావజాలం. ఇది భారతదేశాన్ని హిందూదేశంగా నిర్వచించాలని కోరుకుంటుంది. ఒకే మతం, ఒకే సంస్కృతి, ఒకే భాష లాంటి మెజారిటేరియన్ భావనలపై దేశాన్ని పునర్నింమించాలని ఆకాంక్షిస్తుంది.
దీనివల్ల ఈదేశంలో అనాదిగా పరిఢవిల్లన భిన్నత్వం విచ్చిన్నమౌతుంది. భిన్నభావజాలాలు ఒకే మూసలోకి ఒదగాలి. సాంస్కృతిక వైవిద్యం నశించిపోతుంది. సామాజిక హోదాపరంగా అంచులలో ఉండే స్త్రీలు, బహుజనులు, మైనారిటీలకు హిందుత్వలో చోటు ఉండదు.
ఒకే దేవుడు (ఎక్కువగా ఉత్తరాది వైష్ణవం), ఒకే ఆరాధనా విధానం, ఒకే సంస్కృతి, ఒకే భాష లాంటివి ప్రజల స్వేచ్ఛను హరించి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. దీని ప్రభావంచే- హిందూమతం అంటే ఇతరమతాలను దూషించే మతంగా తయారుచేసారు. ఇతర విశ్వాసాలను ఎంత ద్వేషిస్తే అంత గొప్ప హిందువు అనే భావనలను చిన్నపిల్లలలో కూడా బలంగా నాటుకుపోయేలా చలామణీ చేస్తున్నారు.
భారతదేశ చరిత్రలో బౌద్ధం, చార్వాకం లాంటివి ఈ రకపు సాంస్కృతిక ఆధిపత్యాన్ని ధిక్కరించి పుట్టిన విశ్వాసాలు. వాటి కొనసాగింపే భక్తిఉద్యమాలు. – 7/8 శతాబ్దాలలో ఆది శంకరాచార్యుని ఆధ్వర్యంలో బ్రాహ్మణ మతం హిందూమతంగా స్థిరీకరింపబడుతున్న సమయంలో, మరల ఈ దేశ బహుజనులు– వేదాలులేని, కులవ్యవస్థ లేని, సంస్కృతభాష లేని, బ్రాహణ వర్గం లేని, లింగవివక్షలేని ఒక గొప్ప ఆథ్యాత్మిక సంప్రదాయాన్ని హిందూమతానికి సమాంతరంగా ఏర్పాటు చేసుకొన్నారు. చాలా స్పష్టంగా, బలంగా కులవ్యవస్థను, బ్రాహ్మణాధిక్యతను వ్యతిరేకించారు. హిందూ ముస్లిం ఐక్యతను కోరుకున్నారు.
ముగింపు
ఆథ్యాత్మికత అనేది ప్రజలందరి మానసిక అవసరం, హక్కు కూడా. దానిని సంస్కృతమంత్రాల చాటున, ఆలయప్రవేశ నిషేదం చాటున, ఆయుధాలు ధరించిన దేవుళ్ల చాటున, పెద్దఎత్తున వనరులు అవసరపడే క్రతువుల చాటున పండితులు దాచిపెట్టారు. ఒకప్పటి ఆలోచనాపరులు బౌద్ధిజం చార్వాకం లాంటి ప్రత్యామ్న్యాయ ఆలోచనలతో బ్రాహ్మనిజాన్ని, బ్రాహ్మణాధిక్యతను ఎదుర్కొన్నారు.
7/8 శతాబ్దాలకు వచ్చేసరికి క్రమేపీ భారతదేశంలో బౌద్ధాన్ని క్షీణింపచేయగలిగారు పండితులు. ఆదిశంకరాచార్యుడు చేసిన అథ్యాత్మిక దండయాత్రలో (నా బ్లాగులో చూడుడు “ఆదిశంకరాచార్యుడు-ఆథ్యాత్మిక దండయాత్ర”వ్యాసం) బౌద్ధం దాదాపు కనుమరుగైంది. దేశజనాభాలో 80 శాతం ఉండే బహుజనులు ఈ మొత్తం తతంగంలోని గుట్టును గుర్తించారు. కులవివక్ష, బ్రాహ్మణాధిక్యత కొరకే ఇదంతా అని గ్రహించారు. ఈ నేపథ్యంలో – బ్రాహ్మనిజానికి వ్యతిరేకంగా బహుజనులు నిర్మించుకొన్న ఆథ్యాత్మిక ఉద్యమం- భక్తి ఉద్యమం.
బ్రాహ్మణులతో, బ్రాహ్మనిజపు భావజాలంతో తీవ్రంగా పోరాడిన ఈ భక్తికవులలో చాలామంది అనుమానాస్పదంగా మరణించటం ఆశ్చర్యం కలిగించక మానదు.
• కబీరు (c. 1440–1518) భౌతిక దేహం దొరకలేదు. దుస్తుల లోపల దేహం బదులు పూలు కనిపించాయట. హిందూ బ్రాహ్మణులు కబీర్ ను ఎన్నో కష్టాలపాలు చేసినట్లు అనేక కథలు కలవు.
• తుకారం (c. 1608–1650) మరణించినపుడు ఆకాశం నుండి పుష్పకవిమానం వచ్చి అతనిని తీసుకొని వెళ్ళిందని ఒక కథ ఉండగా, అతనిని పండితమతవాదులు హత్యచేసారు అని మరొక కథ కూడా ఉంది
• నామ్ దేవ్ (c. 1270–1350) సాంప్రదాయవాదుల పిర్యాదుపై రాజదండనకు గురయ్యాడని కథనం కలదు.
• మీరాబాయి (c. 1498–1546/57) ద్వారకలోని కృష్ణుని విగ్రహంలో ఐక్యం చెందిందట. అప్పటికే చాలాసార్లు కొందరు బంధువులు ఆమెను నియంత్రించటానికి ప్రయత్నించారు.
• చైతన్యమహాప్రభు (1486–1534) పూరీ జగన్నాధునిలో ఐక్యం అయ్యాడట.
• నందనార్ నయమ్నార్ అగ్నిలో దహించుకొని పునీతుడయ్యాడట.
• చక్రధర స్వామి (1194), తల నరకగా అది తిరిగి దేహానికి అతుక్కొందట. అలా ఆయన చిరంజీవిగా హిమాలయాలలో సంచరిస్తున్నాడట.
• గురుబాలక్ దాస్ 19 వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో జీవించిన భక్తి సంప్రదాయానికి చెందిన సంత్. కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఇతను చేస్తున్న బోధనలు ప్రజలలో విస్తరిస్తున్నాయని తెలిసిన అగ్రవర్ణ హిందువులు ఇతన్ని కత్తులతో పొడిచి చంపేసారు.
తనకు వ్యతిరేకంగా నిర్మించిన ఏ సామాజిక ఉద్యమాన్నైనా హిందుమతం తనలో కలిపేసుకోవటం అనాదిగా జరుగుతూనే ఉంది. బుద్ధుడినే ఒక విష్ణ్వావతారంగా చేసి మింగేయబోయారు. అలాగే ఈ భక్తి ఉద్యమాన్ని కూడా బ్రాహ్మనిజం తనలో రకరకాల మార్గాలలో కలుపుకొంది. తమిళ ఆళ్వారులు, నయనారులు కులమతాలకు అతీతంగా అందరూ పాడుకోవాలని రాసుకొన్న గీతాలను నేడు ప్రధాన తమిళ ఆలయాలలో జరిగే వ్యవస్థీకృత నిత్య పూజలలోకి చేరాయి.
బహుజనులకు ఆలయ ప్రవేశం ఉండాలని పోరాడిన రామానుజాచార్యుడిని ఇప్పుడు ఒక బ్రాహ్మణ శాఖ కైవశం చేసుకొంది. కబీరు, మీరాబాయి, ఆండాల్, రవిదాస్ లాంటివారు గొప్ప యోగులుగా హిందూ మతంలో కుదురుకొన్నారు. వారు చెప్పిన బోధనలు వెనుకకు వెళిపోయాయి.
దేవుడు హృదయంలో ఉంటాడు తప్ప బ్రాహ్మణుడి జన్మ హక్కులో కాదు అంటూ నామ్ దేవ్ కులవ్యవస్థ, బ్రాహ్మణాధిక్యతపై తీవ్రమైన విమర్శ చేసాడు. భక్తి కవులు స్థానిక భాషలో గీతాలు కూర్చటం సంస్కృతాధిపత్యాన్ని ధిక్కరించటమే. కబీరు, గురునానక్ లాంటి వారు రామ్ రహీమ్ ఒక్కరే అంటూ గ్రామాలలో తిరుగుతూ తమ గీతాలద్వారా ప్రచారం చేయటం ఒకరకంగా భిన్న సమూహాల మధ్య గోడలను బద్దలుకొట్టటం, వంతెనలను నిర్మించటం. అక్కమహాదేవి శివునితో నగ్నంగా నడిచినా, ఆండాలు విష్ణువుని విభునిగా చేసుకొన్నా- అవన్నీ పురుషాధిక్యతను తిరస్కరించటం గా చూడాలి.
భక్తి ఉద్యమం - వర్ణవ్యవస్థకు, క్రతువులకు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. దీనికి ముస్లిమ్ పాలకుల సూఫీ వేదాంతం తోడయ్యింది. ప్రజలందరూ కులమతాలకు అతీతంగా ఆథ్యాత్మిక సాధన చేయవచ్చు అని చెప్పిన భక్తి ఉద్యమ నిర్మాణంలో హిందూ మత ప్రమేయం తక్కువ.
బొల్లోజు బాబా