Saturday, January 10, 2015

కవుల కవి - శ్రీ ఇస్మాయిల్

          ఇస్మాయిల్ కవిత్వంలో నినాదాలు, సిద్దాంతాలు, వాదనలు కనిపించవు.   ఇంకా చెప్పాలంటే ప్రకృతి కనిపించినంతగా జీవితం కనిపించదు కూడా. అయినప్పటికీ ఆయన కవిత్వాన్ని అభిమానించే వారిలో  కవులు ముందుంటారు వారి వారి కవిత్వ కమిట్మెంట్లు వేరైనప్పటికీ.  ఆ విధంగా ఇస్మాయిల్ కవుల కవి.  
          ఇస్మాయిల్ కవిత్వంలో సౌందర్యం, కరుణ, జీవనోత్సాహాలు నిశ్శబ్దంగా శబ్దిస్తూంటాయి. జీవితంలో తారసిల్లే అనేక సందర్భాలకు, దృశ్యాలకు, వస్తువులకు ఈయన కవిత్వగౌరవం కల్పించాడు. మనుషుల రసదృష్టి పై అచంచలమైన విశ్వాసంతో కవిత్వాన్ని పలికించాడు. కవితలో దండుగ పదాల్ని శుభ్రంగా తుడిచేసి సుందర స్వరూపాన్ని మాత్రమే మిగిలేట్లు చేయటం ఇస్మాయిల్ కవిత్వశైలి.

ధనియాల తిప్ప
అంతా ఒక తెల్ల కాగితం.
అందులో ఒక మూలగా
ఒక అడ్డుగీతా
ఒక నిలువు గీతా -
తెరచాప ఎత్తిన పడవ.
కిందిది నదీ
పైది ఆకాశమూ
కావొచ్చు.

          సుమారు ముప్పై ఏళ్ళ క్రితం వ్రాసిన పై కవిత లో ఒక దృశ్యం ఇప్పటికీ సజీవంగానే కనిపిస్తుంది.  నదీ ఆకాశం కలుసుకొన్న చోట ఒక పడవ.  తెరచాప నిలువుగీత, పడవ అడ్డుగీత.  అంతే అంతకు మించేమీ లేదు.  ఇదే దృశ్యాన్ని నాబోటి వాడు నది ఆకాశాన్ని ముద్దిడే సుదూర మైదానపు దారులలో ఒంటరి పడవ ప్రయాణం అంటో వెలిసిపోయిన అలంకారాలతో, పదాల డమడమలతో కవిత్వీకరించవచ్చు.  కానీ ఇస్మాయిల్ కవితలో ఒక దృశ్యం మాత్రమే పదాల ద్వారా వ్యక్తీకరించబడింది.  అది చాలా నిశ్శబ్దంగా చదువరి హృదయంలో పడవలా సాగుతుంది.  అందుకే శ్రీ వెల్చేరు నారాయణరావు ఒకచోట “...... మాట తనను తాను నిశ్శబ్దం చేసుకుంటే ఒక అపూర్వ శక్తిని సంపాదించుకోగలదని -  ఆ పనిని మాటచేత చేయించగలిగిన వాడు ఇస్మాయిల్ ఒక్కరే  అని అంటారు.

          చట్రాలు, తిరగళ్ళు కవిత్వానికి కట్టి ఊరేగిస్తున్న కాలంలో ఆ పద్దతికి ఎదురొడ్డి  ఇస్మాయిల్ కవిత్వం  నిలబడటం ఒక చారిత్రిక సత్యం. అలా తెలుగు సాహిత్యంలో ఒక విస్మరింపజాలని అధ్యాయంలా ఇస్మాయిల్ నిలిచిపోయారు.  కవికి  అనుభవంతప్ప వేరే ఆస్తి, అస్త్రం  ఉండకూడదని ఇస్మాయిల్ భావించాడు. ఆయన కవితల్లో అనుభవసారం ఒక పదచిత్రంగా, ఒక ప్రతీకగా రూపుదిద్దుకొని పఠిత హృదయంలో దీపమై వెలుగుతుంది.

          ప్రాపంచిక సంగతులను పారలౌకిక విషయాలతో గొప్ప నేర్పుతో అనుసంధానించటం ద్వారా గొప్ప కవిత్వానుభవాన్ని కలిగించటం  ఇస్మాయిల్ కవిత్వంలో చాలా చోట్ల కనిపిస్తుంది.

పాట
సెలయేరా, సెలయేరా!
గలగలమంటో నిత్యం
ఎలా పాడగలుగుతున్నావు?
చూడు, నా బతుకునిండా రాళ్ళు.
పాడకుంటే ఏలా?

          లోపల చిరుగుల బనీనుతో కృష్ణదేవరాయుల రాజసాన్ని పలికించే రంగస్థల నటుడో లేక గొంతుమూగబోయినా  హృదయంతో అద్భుతగీతాలను గానంచేసిన కృష్ణశాస్త్రో, కళాకారుడెవరైనప్పటికీ నిత్యం గలగలమంటో పాడటంలోని అనివార్యతలాంటి జీరనేదో ఈ కవిత పట్టిచూపుతుంది.  సౌందర్యభాషలో తాత్వికతను చెప్పినట్లుంటుంది.

          కవిత్వం కరుణను ప్రతిబింబించాలని నమ్మిన వ్యక్తి ఇస్మాయిల్. జీవితాన్ని ప్రేమించి జీవనోత్సాహాన్ని గానం చేసిన సౌందర్య పిపాసి. కవిత్వంపై సామాజిక స్పృహ అనే బరువును వేసి బలవంతంగా మోయించిన రోజులవి.  మోయలేము అనే కవుల్ని అకవులు అని నిందించే కాలంలో, ఇస్మాయిల్ గారు ఒక్కరే నిరసించి మనం రోజూ చూసే విషయాలని, చిన్నచిన్న అనుభవాలనే కవిత్వంగా మార్చి ఇదీ అసలైన కవిత్వమని ప్రకటించారు.  బాగా దాహం వేసినప్పుడు చల్లని మంచినీళ్ళు తాగితే ఎంతో హాయిగా ఉంటుంది.  ఇది మనం అనేకసార్లు అనుభవించిన ఒక అత్యంత  సాధారణమైన అనుభవం.  కానీ ఈ అనుభవమే ఇస్మాయిల్ గారి చేతిలో పడి చక్కని కవితగా రూపుదిద్దుకొంది..... ఇలా.....
దాహం
వేసవి గాడ్పులకి
దాహపు ఖర్జూరచెట్టు
యెడారి గొంతులో
అమ్ములపొదిలా
విచ్చుకుని
గరగరలాడుతోంది.
చల్లటి నీళ్ళు
గొంతు దిగుతోంటే
ఎంత హాయి//

          యెడారిగొంతు, ముళ్లతో ఖర్జూరచెట్టు విచ్చుకోవటం, గొంతులో గరగర వంటి పదచిత్రాలన్నీ ఒక అనుభవాన్ని ఎంతో అందంగా, హాయిగా (గరగరగా) మన అనుభూతికి తెస్తాయి.
          ఇస్మాయిల్ కవిత్వంలో డబుల్ మెటాఫెర్స్ అద్భుతంగా ఒదిగిపోయి కవితకు అందాన్ని, లోతైన అర్ధాన్ని ఇస్తాయి.  ఆయన పదచిత్రాల సౌందర్య రహస్యం అదే కావొచ్చు.

వాన వచ్చిన మధ్యాహ్నం
బరువెక్కిన సూర్యుడు
బతకనీడు భూమిని
ఉదయమ్మొదలు
ఊపిరాడనీడు
సర్వాన్ని అదిమిపట్టి
వీర్యాన్ని విరజిమ్మాడు.
ఆకల్లాడదు.
ఏ కాకీ ఎగరని
ఏకాకి ఆకాశం.
ఇంతలో హటాత్తుగా
ఇలకు కలిగింది మబ్బుకడుపు.
వేవిళ్ళ గాలులు
వృక్షాగ్రాల్ని వూపాయి.
ధాత్రీచూచుకాలు నల్లపడ్డాయి.
తటాకాల చెంపలు తెల్లపడ్డాయి.///

          పై కవితలో వీర్యం, కడుపు, వేవిళ్ళు, నల్లబడ్డ చూచుకాలు ఇవన్నీ ఒక స్త్రీ గర్భవతి అవ్వటాన్ని సూచిస్తాయి.  అదే విధంగా విపరీతమైన ఎండకాసిన తరువాత వానపడటం అనే విషయాన్ని సూర్యుడు, భూమి, ఆకు అల్లాడకపోవటం, మబ్బులు, గాలులు, ధాత్రి నల్లపడటం, తటాకాలు తెల్లబడటం వంటి వర్ణనలు తెలియచేస్తుంటాయి.  రెంటి మధ్య సమన్వయాన్ని బరువెక్కిన సూర్యుడుమబ్బుకడుపు, ధాత్రీచూచుకాలు, తటాకాల చెంపలు అనే పదబంధాల ద్వారా సాధించి కవితకు  అద్భుతమైన లోతును వచ్చేలా చేసారు. చివరలో వర్షాగర్భంలో వర్ధిల్లే శిశుపిండాన్నిఅంటూ కవి తనను తాను ప్రకటించుకోవటం, ఆ అనుభవాన్ని హృదయానికి హత్తుకొనేలా చేస్తుంది.  ఇదే రకమైన శైలిలో వ్రాసిన సంజె నారింజ అనే కవితలో....

దినపు రేకలపైన వాలెను
ఇనుని సీతాకోకచిలుక//
గులక రాళ్ళ పిట్టలతో
కులుకు తరుశాఖ ఏరు//
వొంగిన సాయింత్రపు రంగుల ధనసు
విసిరే గాలి బాణం
          పై కవితలో దినాన్ని పుష్పంగా, సూర్యుడ్ని సీతాకోక చిలుకలా, ఏరుని వృక్షంగా, గులకరాళ్ళని పిట్టలుగా, ఇంధ్రధనస్సుని గాలి బాణంగా పోలుస్తూ ఒక దృశ్యాన్ని  పదచిత్రాలుగా పేనిన కౌశలం అబ్బురపరుస్తుంది.
          వానని అనేక మంది కవులు అనేక విధాలుగా వర్ణించారు. కానీ ఈ విధంగా వర్ణించటం ఇస్మాయిల్ కే సాధ్యం.
శ్రావణ మంగళవారం
సాయంత్రం
ఒకానొక మబ్బు డస్టరు
అకస్మాత్తుగా ప్రవేశించి
భూమ్మీది వెర్రి రంగుల్నీ పిచ్చిగీతల్నీ
పూర్తిగా తుడిచేసి,
మెరిసే వానసుద్దముక్క పట్టుకొచ్చి
వీధుల్లో కళ్ళనీ
రోడ్లపై పడెల్నీ
లోకంలో కాంతినీ
వెయ్యిపెట్టి గుణించేసి
చెయ్యూపి వెళ్ళిపోయింది///
          ఈ కవితలో కూడా మబ్బుడస్టరు, వానసుద్దముక్క వంటి పదబంధాల ద్వారా అద్భుతమైన పదచిత్రాల్ని నిర్మించి ఒక సుందరదృశ్యాన్ని కళ్లముందు నిలుపుతారు.

          స్వారీ అనే కవితలో ఒక మనోహర సందర్భాన్ని ఇస్మాయిల్ వర్ణించిన తీరు గమనిస్తే ఏ చదువరి మనసు కవిత్వ ఆర్గాజం పొందదు!
స్వారీ
కళ్ళెం లేని గుర్రమెక్కి
పళ్ళు గిట్ట కరచి
ఏ శత్రు సంహారం కోసమో
వైచిత్ర సమరంలోకి
స్వారి చేసే యోధురాలామె.
మళ్ళీ, యుద్ధాంతాన
కళ్ళు తేలేసి
నిర్వికల్ప సమాధిలో
సర్వాంగాలూ స్తంభించే
యోగిని కూడాను.

          ఇస్మాయిల్ కవిత్వంలో కనిపించేమరో గుణం సున్నితత్వం.  అనేక కవితల్లో ఈ లక్షణం స్పష్టంగా కనిపిస్తూంటుంది.
చిగిర్చే చెట్లు
నడచివచ్చి నిశ్శబ్దంగా
నా కిటికీ దగ్గిరాగి
హటాత్తుగా
పటేలుమని
వంద వాయిద్యాలతో
వికసించిన బ్యాండుమేళంలా
ఒక రోజు
అకస్మాత్తుగా
చివురించిన చెట్టు
గవాక్షం వద్ద నన్ను ఆపేసింది.///
          పై కవితలో చెట్టు చివురించటాన్ని వందవాయిద్యాల బ్యాండుమేళం అంటున్నాడంటే, అది కవి దృష్టిలో ఎంత పెద్దదో, ఈ కవెంత సున్నితమనస్కుడో అర్ధం చేసుకోవచ్చును. అందుకనే ఈయన కవిత్వంలో సూర్యకిరణాలు, చందమామలు, సాయింత్రపు కలువలూ, పక్షుల కిలకిలలు, నదిలోనీడలు, గదిలో కాంతులు, ఆకాశపు దీపాలు, కొత్తచినుకులు, సొట్టబుగ్గల బావులు, చెట్టుపై వాలినచిలకలు, పసిపాపలు, గులకరాళ్లు వంటి అనేక కవితావస్తువులు కనిపిస్తూంటాయి.  వీటన్నింటిని మనం నిత్యం చూసేవే అయినా ఆధునిక జీవనపు రణగొణల్లో పడి ఆ అందాలకు అంధులం అవుతాం దాదాపుగా.  అలాంటి సున్నితమైన విషయాలతోనే ఇస్మాయిల్ కవిత రచన చేసారు.  చిన్న చిన్న అనుభవాలని అందమైన పదచిత్రాలలో బంధించి మనకందించారు.
          పడిలేచిన అనేక కవిత్వరీతుల వెల్లువల్లో కొట్టుకుపోకుండా మూడున్నర దశాబ్దాలపాటు తనదైన శైలిలోనే ఇస్మాయిల్  కవిత్వాన్ని వెలువరించారు.  రాజకీయ కవిత్వాలు తమ ప్రాసంగితను కోల్పోయాక సేదతీర్చేది ఇస్మాయిల్ మార్కు కవిత్వమే అనటంలో సందేహంలేదు.  ఆయన తను సాగిన బాటలో ఎందరో అభిమానులను పోగేసుకొన్నారు. ఆయన శిష్యులుగా ఎంతో మంది అదేబాటలో పయనించి తర్వాతికాలంలో మంచి కవులుగా పేరుతెచ్చుకొన్నారు. గోదావరి శర్మ, విన్నకోట రవిశంకర్, ఆకెళ్ళ రవిప్రకాష్, తమ్మినేని యదుకుల భూషణ్, మూలా సుబ్రహ్మణ్యం, కొండముది సాయికిరణ్, బి.వి.వి. ప్రసాద్, హెచ్చార్కె, నామాడి శ్రీథర్, శిఖామణి, అఫ్సర్ వంటి కవులకు ఇస్మాయిల్ అభిమాన కవి.  అలా ఇస్మాయిల్ కవుల కవిగా  కీర్తిశేషులయ్యారు. 


బొల్లోజు బాబా

Wednesday, January 7, 2015

ఇల్లు


ఇంటికెళ్లటం  ఒక వ్యసనం
LSD ట్రిప్ కోసం పక్షులన్నీ
సాయింత్రానికల్లా
ఠంచనుగా గూళ్లకు చేరుకొంటాయి.

ఇంటికెళ్లలేకపోవటం ఒక విషాదం
పెద్దపులిని
నమ్మించలేకపోయిన ఆవు కోసం
లేగదూడ జీవితాంతం
అరుస్తూంటుంది.


బొల్లోజు బాబా

Sunday, January 4, 2015

ఫ్రాగ్మెంట్స్ - 7


1.
రాలిన పత్రాల్ని
లోనికి లాగేసుకొని
పూవులుగా అందిస్తాయి
తరువులు

2.
ఏమివ్వాలో తెలీక
రెండు పక్కటెముకల్ని
అక్కడ పెట్టి
నిశ్శబ్దంగా
వచ్చేసాను

3.
హింసించే ఈ బరువుల్ని
వదిలించుకొని
భారరహితమౌదామా?
చూడు
ఆ సీతాకోకచిలుక
ఎంత తేలికగా
ఎగురుతోందో!

4.
నిత్యం నీ స్వప్నాలలో
నీతో సంభాషించే అమ్మాయి
ఈ రోజు నా కల్లోకి వచ్చి
ముద్దిచ్చిన విషయం
నువ్వేనాటికీ స్వప్నించలేవు

5.
ఒక సంఘటన
ముక్కలు ముక్కలుగా
వెదజల్లబడింది
ఎవరి శకలం వారిదే.
వీడికి ఏనుగు తోక
దొరికినట్టుంది


బొల్లోజు బాబా

Thursday, January 1, 2015

Wednesday, December 31, 2014

నూతన సంవత్సర శుభాకాంక్షలు

నా మిత్రులకూ, వారి మిత్రులకూ
నూతన సంవత్సర శుభాకాంక్షలు
మీ స్నేహానికి ధన్యవాదములు.

Saturday, December 27, 2014

S/o మాణిక్యం -- ప్రతిభావంతమైన కవిత్వం

           
                  ప్రముఖ కవి శ్రీ సీతారాం  1995లో వెలువరించిన కవితా సంకలనం పేరు S/o మాణిక్యం.  కవిగా సీతారాం నిర్వచనాలకు లొంగడు. జీవించిన క్షణాలను నేర్పుగా కవిత్వంలోకి వొంపుతాడు. అంతర్ముఖత్వము, మార్మికత, అధివాస్తవికతలు  ఇతని కవిత్వానికి లోతైన గాఢత నిస్తాయి. దానిమ్మకాయ వొలుచుకు తిన్నట్లు సీతారాం కవిత్వాన్ని ఓపికగా పొరలుపొరలుగా విప్పుకోవాలి.  సామాజికాంశాల సారాన్ని వైయక్తిక అనుభవాల ద్వారా వ్యక్తీకరిస్తుంది ఇతని కవిత్వం. 

          ఈ సంకలనంలోని కవితలు, మానవ వేదనజీవనానుభవాలు, సమాజపు పోకడల వల్ల మారుతున్న సాంస్కృతిక అస్థిత్వము గురించిన చింతనలతో కూడి చదువుతున్నప్పుడు నిండైన కవిత్వానుభూతిని కలిగిస్తాయి. కొన్ని కవితల్లో మోనిర్మాణ శైలి కనిపించినా ఇతని కవిత్వాన్ని మోకవిత్వంతో పోల్చలేం. 

నా కాలాన్ని నువ్ మొదలెట్టావ్ సరే
కలకాలముంటుందా నాపై
నీ మెత్తటి నవ్వు ...... (నాలుగ్గంటల యాభైనిమిషాలప్పుడు)

నిన్నకూడా ఇలాగే కూర్చొని
నిలబడి
నడిచీ
కొంత నవ్వీ
ఎవరితోనో పోయి
తిరిగివస్తూ కూడా
ఇవన్నీ ఇలాగే ఎందుకున్నాయి ....... (అలవాటు-ఆత్మహత్యాచారిక) --- వంటి వాక్యాలు సీతారాంని మోనీడగా అనుకొనేలా చేస్తాయికొందరు  సీతారాం కవిత్వాన్ని పాత చితి-కొత్త చింత అని విమర్శించారు కూడా.  “మోకవిత్వంలో ఉండే కొరుకుడుపడని తనం, అధిసున్నితత్వం సీతారాం కవిత్వంలో కనిపించదు. సీతారాం కవిత్వంలో చాలా చోట్ల వాక్యాలు గరుకు గరుకు గా తగుల్తాయి.

నాచుట్టూ ఉన్న పిల్లల్లో నేనొక్కడ్నేగా
మంచిబట్టలు లేనివాడ్ని
కాళ్ళకు చెప్పుల్లేక మట్టి తొడుక్కున్న వాడ్ని
నెల నెలా డబ్బులు ఇవ్వలేక వాళ్ళలాగా
నీ ప్రేమకు దూరమయ్యాను ....... (గుడ్నై ట్టీచర్)

ఏ వచ్చీపోయే విమానంలోనూ నీ శవపేటిక దిగక
మనిషి రాకపోతే పోయే
తన శవాన్నైనా పంపకపోయాడా
అంటూ
ఆ విమానాలు దిగే స్థలంలో నిలబడి చూస్తున్నా........ (పంకజవల్లి కన్నీళ్ళు) ----- లాంటి వాక్యాలను మోకవిత్వంలో చూడలేంఅలాంటి వాక్యాలు వ్రాయటానికి సామాజిక నేపథ్యం కూడా కారణమౌతుంది

          ఆర్ధిక, రాజకీయ కారణాలుగా మారుతున్న సామాజిక స్థితిగతులు, సాంస్కృతిక పరిణామాలు ఈ సంకలనంలో అనేక కవితలలో ప్రతిబింబించాయి.

//నువ్వేమైనా మహా అన్దగత్తెవా?
నిన్ను అమ్ముకునేందుకు
అంచేత నిన్నీ సంసారపు డస్ట్ బిన్లో
వేశాను ................. (సూపర్ మోడల్)

//చరిత్రకోసం మనం కొందరం
హిందువుల మయ్యాం
ముస్లిములమూ అయ్యాం
కానీ, మనుషులం కాలేక పోయాం
ఎవరి పదవులకోసమో
మనం చిక్కటి నెత్తుటి మతాలమయ్యాం//........(ఇలా చివరకి మతాలమయ్యాం కదా)

//నీ తండ్రి నిస్సహాయతని వెక్కింరింతలో శిక్షిస్తూ
ఎవరికో రెండో పెళ్ళానివయ్యావట కదా
నీ కోరికలేదీ తీరనందుకే
పిల్లల సంచిలోని కనేపేగును తొలగించుకొన్నావటగా
ఆడపిల్లలు పుడతారని భీతిల్లావా
నీకెప్పుడూ చెప్పలేదు గానీ
అప్పట్లోనే పెళ్లాడాను నిన్ను
కానీ, నీ హృదయాన్ని ఎవరికో ఉత్తరాల్లోరాసి
నా చేతులతోనే పంపుతుంటే
నీతో చెప్పకుండా వచ్చేశాను ............. (తమిళగీతం)    ---- లాంటి కవితలు సమాజ పోకడలను, ఆధునిక జీవన అవ్యవస్థలను ఎత్తిచూపుతాయి.   కొన్ని కథనాత్మకశైలిలో వ్రాసినా ఎక్కడా కవిత్వ సాంద్రత తగ్గినట్లనిపించదు.

          జీవితంలో ఎదురయ్యే కొన్ని సంఘటనలు కవిలో అలజడి కలిగిస్తాయిఆలోచనలు రేకెత్తిస్తాయి. సామాన్య కవి వాటిని కథనాత్మక శైలిలో చెప్పగలడుకానీ పరిణితి చెందిన కవిమాత్రమే దానికి ఒక తాత్విక దృక్కోణాన్ని అద్ది కవిత్వీకరిస్తాడు.   “S/o మాణిక్యంసంకలనంలోని కొన్ని కవితలలో అలాంటి సందర్భాలలోని మానవ వేదన  ఆర్థ్రంగా ఆవిష్కృతమై మంచి అనుభూతిని కలిగిస్తుంది.

పొత్తిళ్ళలో పువ్వులాంటి పాప
లేత చిరునవ్వు కాసేపు
లేత ఏడుపు కొంచెం సేపే
నవ్వుకి ఆకలి లేదు
పాప ఏడ్చిందంటే ఆకలికి పిలుపునిచ్చిందనే
ఎదురుగా ప్రయాణికులూ-పులులూ
***
పులులు చూస్తున్న కొద్దీ
ఆమె వస్తువుగా మారిపోతుంది
పోనీ, నువ్వు
పాలు నిండిన వక్షాలనే అనుకొన్నావా?
***
అవి
పసికందుల
అన్నం ముద్దలూ కావచ్చు. ........... (ఓ రైలు ప్రయాణికుడి సందేహానికి?)


తీగల్లోంచి
వాటి గొంతుల్లోంచి వొంపిన మాటల్లో
స్వరాలు గుర్తు పట్టుకున్నాక
మాట్లాడే మాటలకు అర్ధాలుండవు
సంభాషణంతా చెప్పని మాటల్లో మిగుల్తుంటుంది
మాట్లాడనంతసేపూ
మాటలకివతలో అవతలో సంచరిస్తాం
తీరా ముగించాక మొదలవుతాయి
చెప్పాల్సిన మాటలన్నీ.   ..........  (ఫోనో పోనీమ్)

          ఈ సంకలనంలో కనిపించే అనేక కవితలలో స్త్రీ ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందిదీన్ని కొందరు కవిత్వ భాషలో Burden of Woman” అని అంటారు కానీ చాలా సందర్భాలలో కవితలలో కనిపించే ఆమె”  నిజజీవిత స్త్రీ కాకపోవచ్చు, కవిచూసే ఒకానొక జీవనపార్శ్వానికి ప్రతినిధో లేక ప్రతీకో

ఓనాటి సాయంకాలం ఆమె వేళ్ళు
చదరంగం బల్లమీద వేగంగా కదిలినప్పుడు
నా పావులన్నీ ఓటమి అంచుల మీద పోరాడుతూ
పరాజయం నీడలోకి కూలాక
ఆమె గెలుపుని
నా ఓడిపోయిన పెదవుల్తో నవ్వాను//............ (అనుభవ గీతంలోకి...!)

గడపలో కూర్చున్నాను
నా వెనుక
గదిలో ఆమె గొంతు
ఎప్పుడొచ్చిందో తెలీదు
తల తిప్పుదును కదా
నా చేతిలో
ఆమె తింటూ తింటూ ఉన్న
బిస్కట్ ముక్క
పిచ్చివాడ్ని
ఆ రాత్రంతా నిఘంటువులు
వెతికాను.  ....................... (సగం తుంచిన బిస్కట్ ముక్క)

          అజంతా కవిత్వానికి మృత్యువు ఒక కాన్వాస్అనేకమంది కవులు మృత్యువుని నేరుగానో పరోక్షంగానో స్పృశిస్తూ కవితలు వ్రాసారు S/o మాణిక్యం సంకలనంలో కూడా మృత్యువుని ధ్వనించే అనేక పదచిత్రాలు, ప్రతీకలు కనిపిస్తాయి.

//ఎవరికి దొరికాడు మనిషి
ఒక్క చావుకి తప్ప// ..... (అనుకోకుండా వెళ్తున్నా.....)

//దుఃఖమెప్పుడూ దేహంలోనే ఉంటుంది
గుండెప్పుడూ దుఃఖ నదిమీది నౌకలా
అటూ ఇటూ ఊగుతూనే//
నువ్వు దుఃఖాన్ని నవ్వుతూ ఉండు
నా మరణ వార్త వినేదాకా. ......... (ఆ తరువాత)

// అతనూ చనిపోతాడు
ఆమెకంటే ముందో వెనకో//
పోతూ పోతూ ఈ లోకానికి ఒక మాట
మా ఇద్దర్నీ అక్కడే కాల్చండి
అది చెట్టవుతుంది
నేను నీడనవుతాను అని.  .......... (అతనూ-ఆవిడా)........ పై వాక్యాలు ఎప్పుడో వచ్చే మృత్యువు పై భీతితో వ్రాసినవి కావుఇక్కడ మృత్యువు మాత్రమే పూడ్చగలిగే ఒక శూన్యం గురించి చెపుతున్నాడు కవి.  ఇది వైయక్తిక అనుభవం కాదు, సామాజికమైనది, సార్వజనీనమైనది. సమాజ శిఖరంపై నిల్చొని మృత్యుగీతాన్ని ఎలుగెత్తి పాడేవాడికి బతుకుతున్న క్షణాల పట్ల ఎక్కువ అవగాహన ఉంటుంది.

          ఈ కవిత్వంలో ఒక అనుభూతిలోకం ఉంది, మానసిక స్థితిని అధివాస్తవికపద్దతిలో చిత్రించిన వైనం ఉంది, అందమైన పదచిత్రాలున్నాయి, నూతన అభివ్యక్తి ఉంది. ఒక్కమాటలో చెప్పాలంటే Intellectual Poetry ఇది.

          S/o మాణిక్యం సంకలనంలో  మొత్తం 76 కవితలున్నాయి. కొన్నింటికి  పాదవిభజన చేయలేదు.   ఈ పుస్తకానికి శ్రీ ప్రసేన్, శ్రీ రమణమూర్తి లు ముందుమాటలు, శ్రీ సీతారాం, శ్రీ వంశీకృష్ణ, శ్రీమతి కె. అంజనీ బాల, శ్రీమతి వి. శ్రీదేవి లు వెనుక మాటలు వ్రాసారు. కవర్ పేజ్ శ్రీ అక్బర్ డిజైన్ చేసారుకాపీల కొరకు జుగాష్ విలి, లిటరరీ సర్కిల్, చెంచుపేట, తెనాలి -2.  (పుస్తకంలో ఉన్న పాత అడ్రసు)
                                                                                                                                                                 
బొల్లోజు బాబా 

Friday, December 26, 2014

ప్రశాంతత


కనుల లోతుల్లోకి
ఒక దృశ్యం
రాలి పగిలి
శకలాలై వర్షించింది
హృదయం 
తన జలాల్ని
తానే పైకి లేపి
నౌకల్ని లోనికి
లాగేసుకొంది.

ప్రశాంతత
అనంత నీలిమలా.....

బొల్లోజు బాబా

Sunday, December 21, 2014

నీకసలు స్వప్నించే అర్హత ఉందా.....



నా పెదవుల్ని
నీ పెదవుల మధ్యకు తీసుకొని
ఒక గాఢ చుంబనం
నా చేతులు నీ భుజాల్ని
గట్టిగా పట్టుకొన్నాయి.
మూసుకొన్న కనుల వెనుక......

రాత్రిరోడ్డుపై నల్లని ప్రయాణం
వానల్ని మింగిన వాగు గలగలలు
చల్లని గాలులతో శ్వాసిస్తోన్న తరువులు
బొట్లుబొట్లుగా అరుస్తోన్న నిద్రరాని పిట్ట
చలిగాలికి స్వరం పెంచిన కొలను కప్ప
మీదపడి మరణించిన సాయింత్రాన్ని
మోసుకు సాగే హృదయం.

విరిగిన కిరణాలతో ఉదయించింది
అదే సూరీడా లేక వేరే సూర్యుడా!
స్పర్శలోంచి సుఖం ప్రవహించినట్లుగా
దుఖఃస్వప్నం లోంచి  స్మృతులు
సీతాకోకచిలుకలై పైకెగురుతాయి.

“నీకసలు స్వప్నించే అర్హత ఉందా”
అనడిగావు కదూ!
నిన్నూ నన్నూ
ప్రేమలోనో క్షమలోనో
కలుపుతున్నవి ఈ స్వప్నాలే కదా!
నేను స్వప్నిస్తున్నాను కనుకనే
నువ్వొచ్చి వెళిపోతున్న విషయం
పదే పదే గుర్తుకొస్తోంది.


బొల్లోజు బాబా

Saturday, December 20, 2014

ప్రకృతి


వానపాములు తూనీగలు
తొండలు కప్పలు పిట్టలు
గుంటనక్కలు రాబందులు
ఒకదానికొకటి గోరుముద్దలు
తినిపించుకొనేవి. 
అన్నింటినీ మింగేసి
మనిషి మనిషిని తింటున్నాడు.
పాపం! జగమేలే పరమాత్మ
ఎవరితో మొరపెట్టుకొంటుంది?

బొల్లోజు బాబా

Wednesday, December 3, 2014

బాబా కవిత్వంలోని జీవనది అదే! ---- అఫ్సర్



జీవనది లోపలికి  ప్రవహించడం అనే అనుభవం ఎలా వుంటుందో అనుభవించి పలవరించాలంటే ఈ పుస్తకంలోకి అడుగు పెట్టాలి మీరు! అయితే, ఏ కొంతైనా తడవడానికి మీరు సిద్ధంగా వుంటేనే ఈ జీవనది మిమ్మల్ని తనలోకి స్వీకరిస్తుంది. బొల్లోజు బాబా “ఆకుపచ్చ తడిగీతం” ఇప్పుడు రెండో సారి చదువుతున్నప్పుడు వొక కవిని కేవలం కవిగా కాకుండా poet as a self గా చూడడం ఎలానో అర్థమవుతోంది, మనకి తెలీదు కానీ కవిత్వం కూడా వొకprivacy statement.  దాని Intensity ని ఇప్పటివరకూ వేరే వేరే రూపాల్లో చెప్పడానికి నిరాకరిస్తూ, లేదా సంకోచిస్తూ వచ్చిన విషయాల్ని  చెప్పడం కోసమే self అనే తన సందుకని తెరుస్తూ వెళ్తాడు. బాబా కవిత్వంలోని జీవనది అదే! జీవితం ఆయన్ని ఎంతగా తడిపిందో అదంతా అక్షరాల్లో పిండే శక్తి ఆయనకి వుంది. వొక సాయంత్రం మీరు ఆ నది పక్కన నడుస్తూ వెళుతున్నప్పుడు గాలీ, నదీ గుసగుసలాడుకుంటున్నప్పుడు, ఆకాశం దానికి సాక్ష్యంగా నిల్చొని వున్నప్పుడు ఈ కవి విన్నాడని ఇదిగో ఈ కవిత్వంలో తెలుస్తోంది!         ----- అఫ్సర్

ఆకుపచ్చని తడిగీతం కవితా సంకలనాన్ని ఈ క్రింది లింకు లో పొందవచ్చు

https://www.scribd.com/doc/248711440/Akupachani-tadi-geetham