Tuesday, December 24, 2024

డా. అంబేద్కర్ ఎందుకు రాజీనామా చేశారు?

భారతదేశాన్ని లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దటంలో నెహ్రూ, డా. అంబేద్కర్ లు పరస్పరం సహకరించుకొంటూ పోషించిన పాత్ర అనన్యసామాన్యమైనది. డా. అంబేద్కర్ కు రాజకీయపరంగా నెహ్రూ ఇచ్చిన మద్దతుతో గొప్ప ఆధునిక విలువలు కలిగిన రాజ్యాంగం రూపుదిద్దుకొంది. డా. అంబేద్కర్,పండిత నెహ్రూల సంస్కరణాభిలాషకు హిందూకోడ్ బిల్ అద్దం పడుతుంది. మతవాదులు ఈ బిల్లును తీవ్రంగా అడ్డుకొన్నారు. ఈ మతవాదుల దూకుడుకు నెహ్రూ కూడా రాజకీయంగా కొంత తగ్గవలసి వచ్చింది. 1949 నుంచి దాదాపు రెండేళ్లపాటు పార్లమెంటులో హిందూకోడ్ బిల్లుపై చర్చలు జరిగాయి. కొలిక్కి రాలేదు.

ఈ బిల్లును పార్లమెంటులో డా. రాజేంద్ర ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జి, పట్టాభి సీతారామయ్య పండిత్ గోవింద మాలవ్య, బిహారీలాల్ భార్గవ, దుర్భంగా మహరాజా లాంటి వారు వ్యతిరేకించారు. పార్లమెంటు వెలుపల హిందూ మతగురువులు, ధార్మిక నాయకులు ఈ బిల్లును తీవ్రంగా తూర్పారపట్టారు.
 
వీరందరి వాదన ఒకటే – ఈ బిల్లు హిందూ ధర్మశాస్త్రాలపై ఆధారపడి లేదని, పాశ్చాత్యప్రభావంతో కూడిన చట్టం అని, ఇది మన సంస్కృతిని సంప్రదాయాలను మార్చటానికి ప్రయత్నిస్తున్నదని. వేల సంవత్సరాలుగా కాలపరీక్షకు తట్టుకొని నిలబడ్డ హిందూ సామాజిక ఆచారవ్యవహారాలకు ఈ బిల్లులోని అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. అంతేకాక మతవిషయాలపై పార్లమెంటుకు చట్టాలు చేసే యోగ్యత లేదని మతవాదులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసారు.
ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో- డిశంబరు 11, 1949 న వెయ్యిమంది సనాతనవాదులు పండిత గోవింద మాలవ్య నాయకత్వంలో పార్లమెంటును ముట్టడించారు. (ఆంధ్రపత్రిక డిశంబరు 13, 1949)

ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి పునఃపరిశీలన చేయటానికి డిశంబరు 19, 1949 న పార్లమెంటులో జరిగిన ఓటింగులో పదకొండు మంది మాత్రమే బిల్లుకు అనుకూలంగా ఓట్ చేయటాన్ని బట్టి హిందూ కోడ్ బిల్లు ఏ మేరకు సనాతనులనుండి ప్రతిఘటనను ఎదుర్కొందో అర్ధం చేసుకొనవచ్చును. (ఆంధ్రపత్రిక డిశంబరు 20, 1949)

సెలక్ట్ కమిటీ రెండేళ్ళ పాటు పరిశీలించిన అనంతరం కూడా హిందూ కోడ్ బిల్ పార్లమెంటులో ఆమోదం పొందలేదు.
 
హిందూ కోడ్ బిల్ ఆమోదం పొందనందుకు డా. అంబేద్కర్ సెప్టెంబరు 27, 1951 న లా మినిస్టర్ గా రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖలో "పార్లమెంటు ప్రస్తుత సమావేశాలలోనే హిందూ న్యాయశాస్త్ర సవరణ బిల్లు నెగ్గవచ్చుననే నమ్మకంతో ఇంతవరకూ పనిచేసానని, ఆ ఉద్దేశంతోనే బిల్లులోనుంచి "వివాహం విడాకులు" భాగాన్ని ప్రత్యేకించటానికి కూడా అంగీకరించానని, ఇప్పుడు ప్రభుత్వము దానిని పూర్తిగా చంపివేసినందున రాజీనామా చేస్తున్నానని" డా. అంబేద్కర్ తెలియచేసారు. (ఈ లేఖలో డా. అంబేద్కర్ ప్రభుత్వ ఇతరవిధానాలతో తాను వ్యతిరేకిస్తున్నట్లు ఎక్కడా చెప్పి ఉండలేదు. - అక్టోబరు 13 1951 ఆంధ్ర పత్రిక)
 
పండిత నెహ్రూ ఈ లేఖకు ఆరోజే జవాబిస్తూ "హిందూ న్యాయసవరణ బిల్లు ఉపసంహరించబడి నందుకు డా. అంబేద్కర్ పొందిన ఆశాభంగాన్ని తాను గుర్తించినట్లూ, అయితే విధీ, పార్లమెంటు నియమాలూ తమకు ప్రతికూలించినట్లు, ఆ బిల్లు నెగ్గనిదే నిజమైన అభివృద్ధి ఉండదు కనుక దానికోసం ఇంకా తాను పాటు పడబోతున్నట్లూ తెలియచేసాడు.

హిందూ మహాసభ, జన సంఘ్, రామ రాజ్య పరిషద్ లాంటి మతవాద పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయగా, కాంగ్రెస్ లోని కొందరు మతవాదులు కూడా వారితో జతకలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడైన పట్టాభిసీతారామయ్య “ఈ బిల్లు విషయంలో జాగ్రత్తగా నడవకపోయినట్లయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతింటుంది” అని నెహ్రూను హెచ్చరించాడు. ఇలాంటి తీవ్ర ప్రతికూలతల మధ్య బిల్లును ఆమోదింపచేయటం పండిత నెహ్రూ చేతిలో కూడా ఉండకపోవచ్చు. ఈ పరిణామాలు డా.అంబేద్కర్‌ను తీవ్రంగా నిరాశపర్చాయి.

హిందూ కోడ్ బిల్ లో ఏముంది?

హిందూ సమాజంలోని కుటుంబ, వివాహం, వారసత్వం వంటి వ్యక్తిగత చట్టాలను క్రోడీకరించి ప్రవేశపెట్టిన ఒక సమిష్టి చట్టాల సముదాయాన్ని హిందూ కోడ్ బిల్ అంటారు. హిందూకోడ్ బిల్ ఒక విప్లవాత్మక చట్టం. హిందూ కుటుంబం, వివాహం లాంటి అంశాలు ఎలా ఉండాలనేది హిందూ ధర్మ శాస్త్రాలు ఏనాడో నిర్ణయించాయి. కానీ వాటిలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, స్వేచ్ఛ ఉండదు. లింగ, కుల వివక్షలు ఉంటాయి. వాటిని తొలగించి మానవ సంబంధాలను ఆధునిక భావనలకు అనుగుణంగా నిర్వచించి, హిందూ సమాజాన్ని స్వేచ్ఛ, సమానత్వాలకు సిద్ధం చేయటం హిందూకోడ్ బిల్ ముఖ్య ఉద్దేశం.

ఈ బిల్లును సంప్రదాయ మత వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూ ధర్మశాస్త్రాలు నిర్ధేశించినట్లు హిందువులు జీవిస్తారని; ధార్మిక విషయాలలో చట్టాలు చేసే హక్కు పార్లమెంటుకు లేదని అంటూ ఆందోళనలు చేసి హిందూ బిల్ ను అడ్డుకొన్నారు.
హిందూ బిల్ లో ప్రతిపాదించిన అంశాలను గమనిస్తే, డా. అంబేద్కర్ ఎంతటి దార్శనికత కలిగిన మనిషో, ధర్మశాస్త్రాల నిర్ధేశించినట్లుగా హిందూ కుటుంబం నడుచుకోవాలి అంటూ మతవాదుల ఎంతటి మూర్ఖపు వాదన చేసారో అర్ధమౌతుంది.

హిందూ కోడ్ బిల్---

1.బాల్యవివాహాలను నిషేదించింది. వివాహవయస్సు నిర్ణయించి, వధూవరుల పరస్పర అంగీకారంతో వివాహం జరగాలని చెప్పింది.
2.కులాంతర, మతాంతర వివాహాలను అనుమతించింది
3.స్త్రీలకు దత్తత తీసుకొనే హక్కు కల్పించింది
4.స్త్రీలకు విడాకులు ఇచ్చే హక్కు కల్పించబడింది. (ఈ క్లాజుకి భారతీయ సమాజం కుప్పకూలిపోతుందని పార్లమెంటులో మతవాదులు గగ్గోలు పెట్టారు)
5.విడాకులు తీసుకొన్న మహిళ జీవన బృతిగా మనొవర్తిపొందే హక్కు కల్పించింది
6.బహుబార్యత్వాన్ని నిషేదించింది
7.కుమార్తెలకు, కుమారులతో సమానంగా తండ్రి ఆస్తిలో హక్కు కల్పించింది. పెద్ద కొడుకుకు మాత్రమే ఆస్తిలో హక్కు కలిగి ఉండే ఆచారాన్ని నిషేదించింది.
8.స్త్రీలు ఆస్తిని కొనుగోలు చేసే హక్కు కల్పించింది
9.తండ్రితో సమానంగా పిల్లలకు తల్లి సహజ సంరక్షకురాలిగా ఉండే హక్కు కల్పించింది
10 స్త్రీలకు సమాన హక్కులు కల్పించబడ్డాయి

పైన చెప్పిన అంశాలన్నీ స్త్రీ స్వేచ్ఛ, సాధికారికతకు సంబంధించిన అంశాలు. భారతదేశం రెండువేల సంవత్సరాలుగా పాటించిన సామాజిక విలువలకు ఇవి పూర్తిగాభిన్నమైనవి, కొత్తవి.
ధర్మశాస్త్రాలలో బాల్య వివాహాలు ఉంటాయి. కులాంతర వివాహాలు చేసుకోరాదు. స్త్రీలకు తండ్రి ఇచ్చిన స్త్రీధనంపై హక్కులు తప్ప మరే విధమైన ఆస్తి హక్కులు లేవు. భర్త దేశాంతరాలు పట్టిపోయినా, నపుంసకుడైనా విడాకులు కోరవచ్చు తప్ప మరే ఇతరకారణాలతో కాదు. మనోవర్తి లేదు. బహుభార్యత్వం ఉంది. పెద్దభార్య పెద్ద కొడుకే ఆస్తికి వారసుడు. స్త్రీపురుషులు సమానులు కాదు. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, ముసలితనంలో కుమారుని సంరక్షణలో ఉండాలని స్త్రీకి స్వాతంత్రం లేదని మనుధర్మశాస్త్రం చెప్పింది.

ధర్మశాస్త్రాలలో చెప్పిన అంశాలు భారతీయ సంస్కృతి అని, వాటిని రాజ్యాంగంలో పొందుపరచాలని మతవాదులు పోరాడారు. ప్రజాస్వామిక లక్షణాలతో ఉన్న హిందూకోడ్ బిల్ ను వ్యతిరేకించారు. బిల్లును పార్లమెంటులో ఓడించారు. లౌకిక ప్రజాస్వామిక విలువలు కలిగిన దేశాన్ని నిర్మించాలని కలలు కన్న డా. అంబేద్కర్ ను తీవ్ర నిరాశకు గురిచేశారు. నిరసనగా డా. అంబేద్కర్ లా మంత్రిగా రాజీనామా చేసారు. స్వతంత్ర భారతదేశంలో ఒక అంశాన్ని విభేదిస్తూ చేసిన మొట్టమొదటి రాజీనామా ఇది.

ముగింపు

ఆ తదనంతరం 1955-56 మధ్య ఈ బిల్లును- the Hindu Marriage Act, Hindu Succession Act, Hindu Minority and Guardianship Act, and Hindu Adoption and Maintenance Act అనే పేర్లతో దఫదఫాలుగా చట్టాలుగా చేయటం జరిగింది. నేడు భారతీయ మహిళ స్వేచ్ఛగా, సాధికారంగా జీవనం సాగిస్తున్నదంటే డా. అంబేద్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్ మరియు దాన్ని సాకారం చేసిన పండిత నెహ్రూ దృఢ సంకల్పమే కారణం.
****
రాజ్యాంగం ఆర్టికిల్ 44 లో ప్రజలందరకూ ఒకటే వ్యక్తిగత చట్టాలు అమలుకావాలంటే యూనిఫార్మ్ సివిల్ కోడ్ (UCC) తీసుకురావలసి ఉంటుందని రాసుకున్నాం. భారతదేశం వైవిధ్యభరితమైనదని మైనారిటీలకు సంబంధించి వారు కోరుకుంటే UCC లోకి రావచ్చని పండిత నెహ్రూ అప్పట్లో వ్యాఖ్యానించారు.

UCC తీసుకొస్తే ముస్లిములకు ఉండే నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవటం, 16 ఏళ్ళకే వివాహ వయస్సు లాంటి హక్కులను కోల్పోతారు. ట్రిపుల్ తలాక్ హక్కు ఇప్పటికే తొలగించారు. ముస్లిమ్ సమాజాన్ని ఏదో చేసేయ్యాలని హిందుత్వవాదులు UCC తీసుకొస్తామని పదే పదే ప్రకటనలు చేస్తుంటారు.
నిజానికి UCC వల్ల హిందూ సమాజం కూడా గణనీయంగానే ప్రభావితమౌతుంది. హిందూ కోడ్ బిల్ భారతదేశపు హిందువులలో ఉండే భిన్నత్వాన్ని గౌరవిస్తుంది. UCC వస్తే సిక్కులు కృపాణం ధరించటం, కొన్ని చోట్ల గిరిజనులు ప్రత్యేక వివాహ చట్టాలను కలిగి ఉండటం, హిందూ ఉమ్మడికుటుంబం పేరిట పొందే ప్రత్యేక టాక్సు మినహాయింపులు వారసత్వ హక్కులు, గోవా లాంటి ప్రాంతాలలో హిందువులు పొందే కొన్ని ప్రివిలేజస్, ఉత్తరాఖాండ్ లాంటి చోట హిందువులు పాటించే విభిన్నమైన ఆచారాలు లాంటివి కోల్పోవలసి ఉంటుంది.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని 2018 లో లా కమిషన్, గొప్ప సాంస్కృతిక వైవిధ్యం కలిగిన భారత దేశంలో UCC సాధ్యంకాదు వాంఛనీయం అసలే కాదు అని రిపోర్ట్ ఇచ్చింది.

బొల్లోజు బాబా



















ప్రాచీన గాథలు పుస్తకంపై డా. సుంకర గోపాల్ స్పందన

ఇదే ఆకాశం ,ఇదే నేల మీద వందల ఏళ్ళ క్రితం ఏం జరిగిందో అప్పటి మనుషులు వారి తాలూకా జీవనం ,జీవన సౌందర్యం ఎట్లా ఉండేదో ఊహించుకుంటే భలే ఉంటుంది. బహుశా ఎన్ని సౌకర్యాలు అప్పుడు ఉండకపోవచ్చు.ప్రకృతి ఉంది. నది ఉంది.చంద్రుడు ఉన్నాడు. చుక్కలు ఉన్నాయ్. తాజాతనంతో కూడిన గాలి ఉండవచ్చు. చేలల్లో, వీధుల్లో, నదీతీరాల్లో,ఋతువుల మధ్య ,కొండల మీద, వాళ్ళు ఎలా బతికారో పేరు తెలియని కవులు రికార్డ్ చేశారు. అప్పటి ప్రపంచ సౌందర్యాన్ని భౌతికంగానూ, మానసికంగానూ ఈ ప్రాచీన గాథలు మన హృదయాల్లోకి పంపుతాయి. చదువుతూ చదువుతూ ఉంటే మన ముందు అప్పటి వాతావరణం లీలగా కనిపిస్తుంది. మనల్ని అక్కడికి ప్రయాణింప చేస్తాయి.సంగం కవిత్వం దక్షిణ భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించే సాహిత్యమని వేరే చెప్పక్కర్లేదు.హాలుని గాథా సప్తశతి లోని గ్రామీణ ప్రజల సాంఘిక జీవనంతో పాటు , స్త్రీ పురుష సంబంధాలు , ప్రకృతి వర్ణనలు మనల్ని అలోచింపచేస్తూనే, ఆనందింపచేస్తాయి. ఇట్లా వజ్జా లగ్గము ,కువలయ మాల ,సేతుబంధ, అమర శతకం,ఋతు వర్ణనలు ఇంకా మరి కొన్ని వాటితో కలిపి 11 అంశాలను ప్రాచీన గాధ లుగా బొల్లోజు బాబా
అనువాదం చేశారు. అయితే ఇందులో భీముని భాగం అనువాదాలు మూలానికి దగ్గరగా ఉన్నాయనిపిస్తోంది. అనువాదకుడు వాటిని ఎంతవరకు లోపలకి తీసుకున్నాడనేది ,వాటిని చదువుతూ ఉన్నప్పుడు

అర్థం అయిపోతుంది. ఏది ఏమైనప్పటికీ ప్రాచీన గాథలు చదువుతుంటే అద్భుతమైన కవిత్వ అనుభూతి సహృదయ పాఠకుడు పొందగలడు. అట్లాంటి అనుభూతిని నాకు ప్రసారం చేసిన బాబా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పుస్తకాన్ని కొని చదవడం ద్వారా మన డబ్బు వృధా కాదు.
 
ముచ్చట గా మూడు అనువాదాలు

నా ఇంటి స్తంభాన్ని ఆనుకొని నిలిచి
"నీ కొడుకు ఎక్కడ "అని అడుగుతున్నావు
వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు
అతనికి జన్మనిచ్చిన ఈ గర్భం ఒక కొండ గుహ
పులి కొంతకాలం ఇక్కడ నివసించి వెళ్ళిపోయింది
ఎక్కడో ఏదో యుద్ధ భూమిలో అతను నీకు దొరుకుతాడు
(పురనానూరు-86)

ఊరి పెద్ద కూతురు చాలా అందగత్తె
ఊరిలోని మగాళ్ళందర్నీ
దేవతలుగా మార్చేసింది
ఎవరు రెప్పలు మూయరు
ఆమెను చూస్తున్నప్పుడు( గాథా సప్తశతి)

ఓ వేటగాడా
ఒక బాణం సరిపోతుంది కదా
ఎందుకు పొదిలోంచి మరొకటి తీస్తున్నావు
మా ఇరు దేహాలలో ఉండేది ఒకే ప్రాణం (వజ్జా లగ్గము)

డా. సుంకర గోపాల్



Thursday, December 19, 2024

ఈ దేశానికి నెహ్రూ తప్పించిన ఉపద్రవం

ఈ రోజు భారతదేశం ఎదుర్కొంటున్న పేదరికానికి, మతకలహాలకు, చైనా సమస్యకు, రాజ్యాంగసమస్యకు, ఒకప్పటి దేశవిభజనకు ఒకటేమిటి సకల అవస్థలకు జవహర్ లాల్ నెహ్రూయే కారణమని హిందుత్వవాదులు తమ ప్రచారయంత్రాంగంతో హోరెత్తిస్తారు. మరణించి 60 ఏళ్ళవుతున్నా నేటికీ నెహ్రూని భారతదేశానికి పట్టిన ఒక అరిష్టంగా, ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన ఒక చారిత్రిక ద్రోహిగా చిత్రీకరించటం జరుగుతోంది. కొందరైతే మరీ చిత్రంగా నెహ్రూ పూర్వీకులు ముస్లిమ్ మూలాలు కలిగి ఉన్నారని (కలిగిఉండటం ఏదో నేరంలా) అబద్దాలు ప్రచారం చేసారు.

నెహ్రూ ప్రధానమంత్రిగా నివసించిన భవనంలో ఆయన మరణానంతరం1966 లో Nehru Memorial Museum and Library ని స్థాపించారు. దీని పేరుమార్చబడి నెహ్రూ ఉనికి నేడు నామమాత్రంగా మిగిలింది. నెహ్రూ పాఠాలు క్రమేపీ పాఠ్యపుస్తకాలనుండి తొలగించబడుతున్నాయి. 75 వ భారత స్వాతంత్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని Indian Council for Historical Research వారు ప్రచురించిన ఒక పోస్టర్ లో నెహ్రూ చిత్రం లేదు. జైలుశిక్షరద్దుచేయమని బ్రిటిష్ వారిని క్షమాపణ అడిగిన చరిత్ర కలిగిన సావార్కర్ చిత్రం ఉంది. ముప్పై ఏళ్లపాటు బ్రిటిష్ వారితో పోరాడి, తొమ్మిదేళ్ళు జైళ్లలో మగ్గిన జవహర్ లాల్ నెహ్రూ పాత్ర ఈ దేశస్వాతంత్రోద్యమంలో గాంధిసరసన నిలుపదగినది.

ఎందుకు ఇంతవిషప్రచారం అంటే, భారతప్రజల సామూహిక చేతనలోంచి నెహ్రూ జ్ఞాపకాలను తుడిచివేయటమే లక్ష్యం. ఎందుకు తుడిచివేయాలి అనే ప్రశ్నకు ఒకే ఒక సమాధానం – ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా కాక లౌకిక, ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దినందుకు.
****
స్వాతంత్రోద్యమంలో నెహ్రూ జైళ్ళలో ఉన్నప్పుడు “Glimpses of World History, Discovery of India లాంటి గొప్ప చారిత్రిక విశ్లేషణాత్మక రచనలు చేసాడు. ఈ రచనలు శాస్త్రీయ దృక్ఫథంతో, సమాజంపట్ల ఆధునిక అవగాహనతో సాగుతాయి. స్వతంత్ర్య భారతదేశాన్ని నిర్మించటంలో నెహ్రూ పోషించిన పాత్రకు ఈ అవగాహనే ఆధారం.

ఐదువేల సంవత్సరాలక్రితపు సింధులోయనాగరికతనుండి మొదలుపెడితే, ఆర్యులు, ఇరానియన్ లు, గ్రీకులు పార్తియన్ లు, సింథియన్ లు, హూణులు, అరబ్బులు, టర్కులు, క్రిష్టియన్ లు, జొరాష్ట్రియన్ లు , మొఘలులు ఎందరో భారతదేశంలో ప్రవేశించి తమదైన ముద్రను భారతీయ సంస్కృతిపై వేసారు. శతాబ్దాలపాటు సాగిన విదేశీ వాణిజ్యం, వలసలు, పరస్పరకలయికల ద్వారా భిన్న ఆచారాలను, సంస్కృతులను స్వీకరించటం, అనుకరించటం, తనలో కలుపుకోవటం ద్వారా భారతదేశ ఆత్మ భిన్నత్వానికి ప్రతీకగా నిలిచిందని నెహ్రూ విశ్వసించాడు. వేదఋషులు, బుద్ధుడు, అశోకుడు, అల్లావుద్దిన్ ఖిల్జి, అమీర్ ఖుస్రో అక్బర్, వివేకానందుడు, గాంధి లాంటి వారి ఆలోచనలు భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని తీర్చిదిద్దాయని నెహ్రూ భావించాడు.
***
"జవహర్ లాల్ నెహ్రూ నా వారసుడు. రాజాజి కాదు, వల్లభాయ్ పటేలు కాదు. నేను వెళిపోయాకా నా ఆదర్శాలను కొనసాగించే వ్యక్తి నెహ్రూ అని నమ్ముతాను" అని గాంధీ 1942 నుంచే చెప్పసాగాడు. గాంధీ భావజాలాన్ని నెహ్రూ అంది పుచ్చుకొన్నాడు. వీళ్ళిద్దరి ఆలోచనలను “గాంధి-నెహ్రూ మోటిఫ్” గా నేడు చరిత్ర కారులు గుర్తిస్తున్నారు. ఈ గాంధి-నెహ్రూ మోటిఫ్ లో ప్రచలితమయ్యే సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, పేదలపట్ల పక్షపాతం, శాస్త్రీయ దృక్ఫథం అనే విలువలు భారతీయ ఆత్మగా చెప్పబడ్డాయి. పై విలువల ఆధారంగా నెహ్రూ స్వతంత్ర భారతదేశాన్ని తీర్చిదిద్దాడు.
****
దేశవిభజన ప్రపంచంలోనే అతిపెద్ద మానవ విస్థాపనం. ఐదు లక్షల మంది చనిపోయారు. మిలియన్ల కొద్దిప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆధునిక భారతదేశం ఎదుర్కొన్న మొదటి సంక్షోభం ఇదే. దేశవ్యాప్తంగా ఎక్కడచూసినా మతకల్లోలాలు. దేశానికి పెద్దదిక్కు అయిన మహాత్మాగాంధి మతోన్మాదానికి బలి అయ్యారు.

విభజిత భారతదేశాన్ని లౌకిక, ప్రజాస్వామిక విలువలపై నిర్మించాలని సంకల్పించిన గాంధి-నెహ్రు మోటిఫ్ పరీక్షకు పెట్టబడిన కాలం అది. హిందూమత ప్రాతిపదికన దేశనిర్మాణం జరగాలని పెద్ద ఎత్తున అల్లర్లు చుట్టుముట్టాయి. ఇంటిరిమ్ ప్రధానిగా ఉన్న నెహ్రూ, ఆనాటి డిప్యూటి ప్రధాని హోమ్ మంత్రిగా ఉన్న వల్లభాయ్ పటేల్ మద్దతుతో ఆర్.ఎస్.ఎస్. సంస్థను నిషేదించి సుమారు 25 వేలమంది దాని కార్యకర్తలను బందీ చేయించాడు.

ఇలాంటి దశలో ప్రజలందరకీ ఓటుహక్కుతో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడటం నెహ్రూ తీసుకొన్న అతిపెద్ద సాహసోపేతనిర్ణయం. ఈ రోజు భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం అని పిలవబడుతుందంటే ఆనాడు నెహ్రూ వేసిన పునాదే కారణం.

1951 ఎన్నికలు - భారతదేశం మతప్రాతిపదికన హిందూరాష్ట్రంగా ఉండాలా లేక లౌకిక, ప్రజాస్వామ్య దేశంలా ఉండాలా అనే రెండు నిర్ణయాలమధ్య జరిగిన రిఫరెండంగా భావించవచ్చు.
హిందూ రాష్ట్రంగా దేశాన్ని తీర్చిదిద్దాలని కోరుకొన్న హిందూ మహాసభ, జన సంఘ్, రామ రాజ్య పరిషద్ పార్టీలు 6 శాతం ఓట్లతో 489 సీట్లలో10 లోక్ సభ స్థానాలను పొందగా భారతదేశాన్ని ప్రజాస్వామ్య, సెక్యులర్ దేశంగా తీర్చిదిద్దుతామనే హామీతో ఎన్నికల బరిలో దిగిన నెహ్రూ నేత్రుత్వంలోని కాంగ్రెస్ 364 సీట్లు దక్కించుకొంది. ఇది ఆనాటి ప్రజల విజ్ఞత. వారు ఈ దేశం లౌకిక ప్రజాస్వామిక దేశంగా ఉండాలని కోరుకొన్నారు. నిజానికి చారిత్రికంగా అదే భారతదేశ ఆత్మ.
****
మతవాదులనుండి భారతదేశం ఎదుర్కోబోతున్న ప్రమాదాలను నెహ్రూ ఆనాడే గుర్తించాడు. ఆర్ ఎస్ ఎస్ పై విధించిన నిషేదాన్ని రెండేళ్ళ తరువాత తొలగించినపుడు “ఆర్ ఎస్ ఎస్ సంస్థ ఫాసిజ లక్షణాలను కలిగి ఉంటుంది, దాని కదలికలపై నిఘా పెట్టండి” అని నెహ్రూ వివిధ ముఖ్యమంత్రులను కోరాడు.

"భారతీయజనసంఘ్, మతం, సంస్కృతి పేరుతో ప్రజల మధ్య విషాన్ని, ద్వేషాన్ని వ్యాపింపచేస్తుంది" అని తన ఎన్నికల ప్రచారంలో విమర్శించాడు.

1952 ఎన్నికలలో విజయం సాధించాకా నెహ్రూ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీలకు రాసిన ఒక ఉత్తరంలో “ఈ ఎన్నికలలో మతతత్వ శక్తులతో మనం నేరుగా కలబడి విజయం సాధించటం గొప్ప విషయం. కానీ ఈ విజయం సంపూర్ణం కాదు. మతతత్వ శక్తుల పట్ల మనం మరింత అప్రమత్తతతో ఉండాలి” అని హెచ్చరించాడు.

“మతం ఆధారంగా ఎవరైనా మరొక వ్యక్తిపై చేయి ఎత్తితే, ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని వనరులను అతనిపై ఉపయోగించి అతన్ని నిలువరిస్తాం” అంటూ 1951 లో మహాత్మగాంధి జయంతి రోజున చేసిన ప్రసంగంలో అన్నాడు.

మతతత్వ శక్తులపట్ల నెహ్రూ అంచనాలు వాటిని నిలువరించిన విధానం పై మాటల ద్వారా అర్ధం చేసుకొనవచ్చు.
****

భారతదేశంలో ఉన్న భిన్న భాషలు, సంస్కృతులు, మతాలు, సామాజిక ఆర్ధిక స్థితిగతులు అన్నీ మనుగడసాగించాలంటే స్వేచ్ఛాయుత పరిస్థితులల్లో ప్రజాస్వామ్యం ఉండాలని నెహ్రూ అభిప్రాయపడ్డాడు. దాదాపు ఇదే భావనను సమకాలీనంగా "మతతత్వ ఫాసిజం వల్ల భారత ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లనుంది" అని అమర్త్యసేన్ అంటారు.

దేశం యొక్క సార్వభౌమత్వం ఆ దేశం ఆర్ధికంగా నిలదొక్కుకున్నప్పుడే సిద్ధిస్తుంది అని నమ్మిన నెహ్రూ అనేక పబ్లిక్ రంగ సంస్థలను స్థాపించి పారిశ్రామికీకరణకు; పెద్దపెద్ద ఆనకట్టలను నిర్మించి వ్యవసాయాభివృద్ధికి; వివిధ ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పి విద్యాభివృద్ధికి; అనేక పరిశోధనా సంస్థలను స్థాపించి శాస్త్ర సాంకేతిక ప్రగతికి బాటలు వేసాడు. సాహిత్య అకాడెమి, లలిత కళా అకాడమీ, సంగీత్ నాటక్ అకాడమీలు స్థాపించి సాంస్కృతిక పరిరక్షణ చేసాడు. ఇవన్నీ ఆధునిక భారతదేశపు పునాదులు.

ముగింపు

1. నెహ్రూ పాలనని మతాన్ని వేరు చేసాడు. భిన్నత్వాన్ని అంగీకరించి ప్రజలందరూ ఒకరిని ఒకరు గౌరవించుకొంటూ, కలుపుకొనిపోతూ కలిసిమెలసి జీవించాలని ఆకాంక్షించాడు. ఇది మతవాదులకు నచ్చలేదు. మెజారిటేరియన్ మతంగా హిందూమతం ఇతరులపై ఆధిపత్యం సాగించాలని వారు ఆశించారు. దీనికి నెహ్రూ తనజీవితకాలంలో అనుమతించలేదు.

2. దేశవిభజన విషయంలో నెహ్రూ తొందరపడ్డాడని మతవాదులు ఆరోపిస్తారు. దేశవిభజన ఆనాటికి ఒక చారిత్రిక ఆవశ్యకత. జిన్నా నాయకత్వంలోని ముస్లిమ్ లీగ్ పాకిస్తాన్ ఏర్పాటుపై గట్టిగా పట్టుబట్టింది. “డైరెక్ట్ యాక్షన్” కు పిలుపునిచ్చింది.

ఇలాంటి సందర్భంలో దేశవిభజన నిలుపుచేసే శక్తి నెహ్రూకి కానీ గాంధీకి కానీ లేకుండాపోయింది.

మతకల్లోలాలలో చెలరేగిన హింస తన ప్రాణాలకు ప్రమాదం కలిగించే నేపథ్యంలో కూడా - నెహ్రూ వీధుల్లో తిరుగుతూ ఇరుపక్షాలను సర్ది చెప్పేందుకు యత్నించాడు. బీహార్‌లో ఒక సందర్భంలో, "నేను హిందూ-ముస్లిం అల్లర్ల మధ్యదారిలో నిలబడి ఉన్నాను. ఇరుపక్షాలకు చెందినవారు ఒకరిపై ఒకరు దాడి చేయాలనుకుంటే, అది నా శవం మీదుగా చేయాలి" అని నెహ్రూ అన్నాడు. నెహ్రూ ఆ మాటలు పలికినప్పుడు, ఆయనను ఉన్నత వర్గానికి చెందిన ఒక విలాసవంతులైన వ్యక్తిగా చిత్రించే ధోరణికి భిన్నంగా అనిపిస్తుంది.

విభజనానంతర దేశాన్ని రాజకీయంగా స్థిరపరచటం, శాంతిని పునరుద్దరించటం, ప్రగతి పథంలో నడిపించటం లాంటి కీలక అంశాలలో నెహ్రూ పాత్ర చాలా విలువైనది.

3. జవహర్ లాల్ నెహ్రూ పండితుడు. చరిత్రను, ప్రపంచ గమనాన్ని అర్ధం చేసుకొన్న పండితుడు. మానవజాతి పరిణామక్రమంలో మతం ఆదిమ లక్షణంఅని, స్వేచ్ఛ, సమానత్వం ఆధునిక లక్షణాలని ఎరుక కలిగినవాడు. భారతదేశ వైవిధ్యం, బహుళతపై అవగాహన కలిగినవాడు. స్వతంత్రభారతదేశాన్ని లౌకిక, ప్రజాస్వామిక దేశంగా మలచాడు.

గాంధీ హత్యద్వారా అల్లకల్లోలం సృష్టించి, నెహ్రూను ఒంటరిని చేసి దేశాన్ని హిందూరాష్ట్రంగా చేసెయ్యాలని ఆశించిన మతతత్వ శక్తులను శాయశక్తులా ఎదుర్కొన్నాడు. హిందూ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకొన్నాడు. ఇది మతవాదులకు నచ్చలేదు. నెహ్రూ పై హిందుత్వవాదుల ద్వేషానికి మూలాలు ఇక్కడ ఉన్నాయి.

4. సోమనాథ్ ఆలయం, అయోధ్య లాంటి హిందూ ఆలయాలను పునర్నిర్మించటంలో నెహ్రూ అలసత్వం ప్రదర్శించాడనే మరొక విమర్శ చేస్తారు. ప్రభుత్వానికి మతానికి సంబంధం ఉండకూడదనేది నెహ్రూ ఆలోచన. అంతే కాక చారిత్రిక దాడులలో జీర్ణమైన ఆలయాలజోలికి పోవటం ”గాయాలను” పెద్దవిచేసుకోవటమే అనే భావన కూడా ఉండొచ్చు.

5. నెహ్రూ మిశ్రమ ఆర్ధిక విధానాలను విమర్శిస్తారు కానీ భారతదేశం ఆర్ధికంగా, సామాజికంగా పరిపుష్టి చెందటంలో మిశ్రమ ఆర్ధిక విధానాలే కారణం. ఈనాడు పబ్లిక్ రంగ సంస్థలు, విమానాశ్రయాలు, గనులు, పోర్టులు, అడవులు, టెలికామ్, ఇన్సూరెన్స్ లాంటి ప్రజల ఆస్తులు విక్రయానికి గురవుతూ, ఎవరి జేబులు నిండుతున్నాయో ఆలోచిస్తే నెహ్రూ ఆర్ధికవిధానం ప్రజలకు ఏ మేరకు మేలు చేసిందో అర్ధమౌతుంది.

6. నేటి హిందుత్వ వాదులు నెహ్రూ కి ప్రత్యామ్నాయంగా పటేల్ ని సావార్కర్ ని ప్రతిష్టిస్తున్నారు. గాంధి, నెహ్రూ, పటేల్ లు దేశభక్తులు. దేశ సమగ్రత కోరుకొన్నారు. ముగ్గురూ సమన్వయంతో దేశాభ్యున్నతికొరకు కలిసి పనిచేసారు. గాంధి 1948 లో, పటేల్ 1950 లో మరణించటంతో నెహ్రూ ఒంటరి అయిపోయాడు. ఇక భారతదేశ చరిత్రలో వీరసావార్కర్ పాత్ర వివాదాస్పదమైనది ఇతను నేడు సర్వత్రా నడుస్తున్న హిందుత్వ ఐడియాలజీకి ఆద్యుడుగా చెప్పుకోవచ్చు. ఇది విభజన, ద్వేషం నింపుకొన్న మార్గం. గాంధి- నెహ్రూ- పటేల్ ల మధ్య ఇమడనిది.

1951 ఎన్నికలలో నెహ్రూకు 75% స్పష్టమైన ప్రాతినిధ్యం ఇచ్చారు ప్రజలు. డా.అంబేద్కర్ సహాయంతో జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర్య భారతావనికి గొప్ప రాజ్యాంగాన్ని ఏర్పరచి, లౌకిక, ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దారు. నేడు కొందరు నెహ్రూ పేరును భవనాలకు సంస్థలకు తొలగిస్తూ, అతనిపై అబద్దాలు కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు. వాటి వెనుక ఉద్దేశం ఒకటే, మెజారిటేరియన్ వాదాన్ని ఒప్పుకోలేదన్న కోపం. ఎందుకు ఒప్పుకోలేదో ఏనాటికైనా సత్యం అందరూ తెలుసుకొంటారు. ఈ దేశానికి నెహ్రూ తప్పించిన ఉపద్రవాన్ని గుర్తుచేసుకొంటారు.

బొల్లోజు బాబా






Saturday, December 14, 2024

ప్రాచీన గాథలు- అనువాద కవిత్వం


ప్రాచీన గాథలు.

ప్రాచీన గాథలు పుస్తకం కావలసిన వారు 7989546568 నంబరు లేదా chaayabooks com వెబ్సైట్ వద్ద పొందవచ్చును.

పేజీలు 254, ఆఫర్ ధర 250/- రూపాయలు, ఫ్రీ షిప్పింగ్.

అమజాన్ లో లభించు లింకు



బొల్లోజు బాబా







Friday, November 29, 2024

ప్రార్థనా మందిరాల వివాదం: చట్టం, సమాజం, సమతుల్య దృక్పథం


ఇటీవలి కాలంలో మసీదులు, దర్గాలు, చర్చిల కింద శివలింగాలు ఉన్నాయని, వాటిని తవ్వి బయటపెట్టాలని, హిందువులకు ఆ ప్రదేశాల్లో పూజలు చేసుకోవటానికి అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేసే వాదనలు పెరుగుతున్నాయి. ఈ వాదనలు సాధారణంగా మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉండటం గమనార్హం.

ఈ రకమైన ప్రచారాల వెనుక అసలైన ఉద్దేశాలు ఏమిటి?

మతసామరస్యానికి చెక్ పెట్టడం: దేశంలో ఇప్పటికే మెరుగులేని స్థితిలో ఉన్న మతసామరస్యాన్ని పూర్తిగా చెరిపేయడం.

ప్రజల దృష్టిని మళ్లించడం: అసలు చర్చించాల్సిన ముఖ్యమైన ఆర్థిక, సామాజిక సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చి, నిరర్థకమైన వాదనలపై దృష్టి పెట్టించడం.

రాజకీయ లబ్ధి: మెజారిటీ మతాన్ని దేశపు అధికారిక మతంగా తీర్చిదిద్దాలని ప్రయత్నించడం.

చట్టం ఏమంటుంది?

1991లో భారతదేశ పార్లమెంట్ ప్రవేశపెట్టిన Places of Worship Act ప్రకారం,

1947, ఆగస్టు 15 నాటికి ఏ ప్రార్థనా స్థలం ఏ మతానికి చెందుతుందో, అది ఆ మతానికి మాత్రమే చెందుతుంది.

ఈ చట్టం ప్రకారం, ఎటువంటి ప్రార్థనా స్థలాన్నీ ఇతర మతాలకు మార్చడం నిషిద్ధం.

నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠినమైన శిక్షలు ఉంటాయి.

చట్టం రామజన్మభూమి వివాదానికి మినహాయింపు ఇచ్చింది, కానీ దేశంలోని ఇతర అన్ని ప్రార్థనా స్థలాలకు ఈ చట్టం వర్తిస్తుంది.

చట్టాన్ని దాటి బయటకు వెళ్తున్న ప్రస్తుత పరిస్థితి

నేడు కొన్ని వర్గాలు చట్టాన్ని అవమానిస్తూ ఇతర మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాలను హిందూ మతంలోకి మార్చాలని కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నాయి. ఈ చర్యలు సమాజంలో విభజన, ద్వేషాన్ని పెంచడం తప్ప మరేమీ చేయవు.

ఈ తవ్వకాల పరిణామాలు

మన దేశం గొప్ప వైవిధ్యానికి నిలయం. మతం, సంస్కృతి, సంప్రదాయాలలోనూ ఈ వైవిధ్యం ప్రస్ఫుటమవుతుంది.

చరిత్రపరమైన సమస్య: తవ్వకాల్లో హిందూ మతానికి సంబంధించిన వస్తువులు మాత్రమే బయటపడతాయనే నమ్మకానికి ఆధారాలు లేవు.

సామాజిక విబేధం: ఇటువంటి చర్యలు వివిధ మతాల మధ్య విభేదాలను మరింతగా పెంచుతాయి.

సంస్కృతికి వ్యతిరేకం: వైవిధ్యానికి మించిన విలువ మనకు లేదు. మన దేశ సౌందర్యం ఈ వైవిధ్యంతోనే నిలబడింది.

మనకు కావాల్సినది ఏమిటి?

అన్ని మతాలకు సమానమైన గౌరవం, సమాన హక్కులు కల్పించడమే భారత రాజ్యాంగం మూలసిద్ధాంతం.

మతసామరస్యం: ప్రతి మతాన్ని గౌరవించడం, పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడం మన బాధ్యత.

చరిత్రను సరిదిద్దడం కాదు: చరిత్రను ఆధునిక రాజకీయ అవసరాలకు ఉపయోగించడాన్ని నిరోధించాలి.

ముగింపు

ఇటువంటి అనవసర వాదనలు మన దేశ బలం అయిన వైవిధ్యాన్ని దెబ్బతీయవచ్చు. మతసామరస్యాన్ని, మన సంప్రదాయ విలువలను కాపాడుకోవడం మనందరి బాధ్యత. చట్టాన్ని గౌరవించడం, వివేకంతో నడుచుకోవడం, విభేదాలను పక్కన పెట్టి సమైక్యతను బలపరచడం అత్యవసరం.

- బొల్లోజు బాబా

Saturday, November 9, 2024

సనాతనవాదులకు మాక్స్ ముల్లర్ అంటే ఎందుకు అంత ద్వేషం

1. జననం విద్యాభ్యాసం

మాక్స్ ముల్లర్ (1823-1900) జర్మనీలోని డెస్సౌ అనే ఊర్లో , 6, డిశంబరు 1823 న జన్మించాడు. 1843 లో సంస్కృతం, గ్రీక్, లాటిన్ ప్రాచీనభాషల అధ్యయనంలో Leipzig యూనివెర్సిటీనుండి డిగ్రీ పొందాడు. ఫ్రొఫెసర్ Brockhaus వద్ద సంస్కృతం నేర్చుకొని 1844 లో మొదటగా హితోపదేశ అనే సంస్కృత గ్రంథాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. వేదాలను అనువదించటం కొరకు రాతప్రతులను సేకరించటం మొదలుపెట్టాడు.

2. ముల్లర్ ఏం చేసాడు

మాక్స్ ముల్లర్1848 లో ఆక్స్ ఫర్డ్ లో స్థిరపడ్డాడు. ఆక్స్ ఫర్డ్ యూనివెర్సిటీలో ప్రాచీన భారతీయ భాషల అధ్యయన కేంద్రానికి ఇతను వ్యవస్థాపకుడు. ఋగ్వేద అనువాదం మొదటి సంపుటిని “ఋగ్వేద సంహిత” పేరుతో 1849 లో వెలువరించాడు. కొన్నేళ్ళకు మరో ఐదు సంపుటాలు తీసుకొచ్చాడు. 1874 నాటికి ఋగ్వేద అనువాదం పూర్తయింది. ఇతర వేదాలపై వ్యాసాలు రాసాడు తప్ప పూర్తి అనువాదం చేయలేదు.

ముల్లర్ రచనల ద్వారా యూరోపియన్ సమాజంలో హిందూమతం పట్ల ఆసక్తి పెరిగింది. సంస్కృతభాషపై ముల్లర్ చేసిన రచనలలో “Handbook for the Study of Sanskrit,” a “Sanskrit-English Dictionary and Grammar,” లాంటి పుస్తకాలు అప్పట్లో సంస్కృతం నేర్చుకోవాలనుకొనే వారికి ఎంతగానో ఉపయోగపడేవి.

సంస్కృత సాహిత్యాన్ని సరైన దృక్పథంతో అధ్యయనం చేస్తే, గొప్పమానవీయ విలువలు కనిపిస్తాయి. గ్రీకు సాహిత్యం కూడా మనకు బోధించలేని పాఠాలు దానిలో దాగి ఉన్నాయి అని ముల్లర్ సంస్కృత వాజ్ఞ్మయాన్ని ప్రశంసించేవాడు .

హిందు, బౌద్ధ, జైన, ఇస్లామ్ మతాలకు చెందిన గ్రంథాలను “Sacred Books of the East” అనే పేరుతో 50 సంపుటాలుగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తీసుకొని వచ్చింది. వీటికి ముల్లర్ ఎడిటర్ గా వ్యవహరించాడు.

మాక్స్ ముల్లర్ ప్రపంచ మతాల తులనాత్మక అధ్యయనానికి ఆధ్యుడు. 1856 లో “Comparative Mythology” పేరుతో ముల్లర్ ప్రతిపాదించిన కొత్త రీసెర్చ్ ప్రక్రియకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు వచ్చింది. వివిధ సంస్కృతుల మధ్య సంబంధాలను, వాటి పరిణామక్రమాన్ని తులనాత్మక విశ్లేషణ చేయటం చేయటం ద్వారా వాటి చారిత్రిక సంబంధబాంధవ్యాలను అంచనా వేయవచ్చు అనేది ఇతని ఆలోచన. ఉదాహరణకు ఈ పద్దతిలో – భిన్న నాగరికతలలో సూర్యుడిని ఏ విధంగా దర్శించారో గమనించటం ద్వారా ఆయా నాగరికతల చారిత్రిక పరిణామాన్ని పోల్చవచ్చుననేది ఇతని ప్రతిపాదన.

ముల్లర్ ద్వారా భారతీయ ఆథ్యాత్మిక గ్రంథాలు ప్రపంచానికి పరిచయం అయ్యాయి. భాష, పురాణాలు, మతం ఈ మూడింటి ద్వారా మానవ ఆలోచనా పరిణామాన్ని పట్టుకోవటానికి ఇతను ప్రయత్నించాడు. ఋగ్వేద అనువాదం ముల్లర్ కు గొప్ప పేరు తీసుకొచ్చింది. 

3. వేదాల్లో ఏమున్నాయి

వేదాలను ప్రమాణంగా అంగీకరించేవారు, వేదాలను వ్యతిరేకించేవారు అనే రెండు సమూహాలుగా ప్రాచీన భారతదేశం విడిపోయింది. వేదాలను అంగీకరించినవారిని వేదావలంబులు/హిందువులు అని, తిరస్కరించిన బౌద్ధ, జైన, ఆజీవిక, చార్వాక, కాపాలిక విశ్వాసులను "వేదబాహ్యులు" అనీ విభజించారు. వేదాలు మనుష్యులెవరూ రాయనివి అంటారు.

వేదాలు నాలుగు. ఋగ్వేదంలో దేవతల కీర్తనలు; యజుర్వేదంలో యజ్ఞముల నిర్వహణా విధానం; సామవేదంలో పాడుకొనేందుకు వీలుగా మలచిన కీర్తనలు. అథర్వణవేదంలో క్షుద్రశక్తులకు సంబంధించిన మంత్రాలు ఉన్నాయి.

ఈ నాలుగు వేదాలనే మరలా నాలుగు భాగాలుగా చేసారు. అవి సంహితలు (మంత్రాలు), బ్రాహ్మణాలు (క్రతువుల విధానాలు), ఆరణ్యకాలు (వేదాంత చర్చలు) ఉపనిషత్తులు (ఆథ్యాత్మిక బోధనలు). ఇవీ వేదాలలో ఏమున్నాయి అనే ప్రశ్నకు పండితులు ఇచ్చే స్థూల వివరణ.

వేదాలను దళితబహుజన దృక్ఫథంతో తరచి చూసినపుడు ఈనాటి అనేక సామాజిక అవ్యవస్థలకు మూలాలు వేదసాహిత్యంలో ఉన్నాయని అర్ధమౌతుంది.

ఎ. నిచ్చెన మెట్ల వర్ణవ్యవస్థ:
వేదాలపై ప్రధాన విమర్శ నిచ్చెనమెట్ల వర్ణవ్యవస్థను ప్రతిపాదించి, సమాజంలో దానిని స్థిరపరచటం. ఋగ్వేదంలో పురుషసూక్తంలో భగవంతుని ముఖంనుండి బ్రాహ్మణులు, భుజములనుండి క్షత్రియులు, తొడలనుండి వైశ్యులు, పాదములనుండి శూద్రులు ఉద్భవించారని చెప్పబడింది. దీని ఆధారంగా సమాజం భిన్న అంతస్థులుగా విభజింపబడింది. శూద్రులు పై మూడు వర్ణాలవారిని సేవించుకోవాలని చెప్పబడింది. ఈ నాలుగు వర్ణాలకు వెలుపల చంఢాలురు (అస్పృశ్యులు) ఉంటారు. నేటికీ కూడా సమాజంలో అవే విభజనలు కొనసాగటానికి వేదాలే కారణమని డా. బి.ఆర్. అంబేద్కర్, మహాత్మా ఫూలే లాంటి ఆధునిక కుల వ్యతిరేక మేధావులు విమర్శించారు.

బి. కర్మకాండలకు ప్రాధాన్యత:
వేదాలలో యజ్ఞయాగాదులకు, కర్మకాండలకు విపరీతమైన ప్రాధాన్యత ఉండటం, ఆ ప్రక్రియలో జరిగే అసంఖ్యాకమైన జంతుబలులలో ఉండే హింసను, అశాస్త్రీయతను- బౌద్ధం, ఆజీవికం, చార్వాకం లాంటి మతాలు వ్యతిరేకించాయి.

సి. స్త్రీలు, శూద్రులకు స్థానం లేదు:
ఈ వైదిక కర్మకాండలలో స్త్రీలకు, శూద్రులకు ఏ రకమైన పాత్ర లేకపోవటం కూడా వేదాలపట్ల ఒక విమర్శ.

సి. అనార్యప్రజలపై దాడి వారి నగరాల దహనం:
వేదాలు ఆర్యుల సాహిత్యం. ఆర్యులు c2000 BCE లో Pontic-Caspian steppe (ఉక్రయిన్, రష్య, కజకిస్తాన్) ప్రాంతాలనుంచి భారతదేశంలోకి ప్రవేశించిన Yamnaya Steppe pastoralist లు. వీరు భారతదేశం రావటానికి ముందే ఇక్కడ స్థానిక ప్రజలు వేల సంవత్సరాలుగా హరప్పా నాగరికతను నిర్మించుకొన్నారు. ఇది మూలవాసుల సంస్కృతి.

ఈ ఆర్యులు తాము రాసుకొన్న వేదాలలో శత్రువుల పురాలను/మూలవాసుల నగరాలను నాశనం చేయమని ఇంద్రుని ప్రార్థించే సూక్తాలు అనేకం ఉన్నాయి. ఇంద్రునికి పురందరుడు (నగరాలను ధ్వంసం చేసేవాడు) అని పేరు. ఈదేశ మూలవాసులైన అనార్య స్థానిక తెగలకు చెందిన వ్యక్తులను, అసురులు, దస్యులు అని వేదాలలో పిలిచారు

ఇంద్రుడు 30 వేలమంది దాసుల్ని., వృత్రాసురుడిని చంపినట్లు ఋగ్వేదంలో ఉంది. (4.30.210). మధ్య ఆసియానుంచి వలస వచ్చిన ఆర్యులు స్థానిక హరప్పా నగరాలను, ప్రజలను ధ్వంసంచేయటంగా ఈ ఉదంతాలను అర్ధం చేసుకోవాలి.

శత్రువుల గర్భంలోని పిండాలను కూడా నాశనం చెయ్యాలని దేవతలను కోరుతూ ఆర్యులు రాసిన సూక్తులు వేదాలలో ఉన్నాయి. అనార్య రాజైన శంబరాసురుడు తమ సంస్కృతిని కాపాడుకోవటం కొరకు ఇంద్రునితో పోరాడినట్లు వేదాలలో ఉంది.

ఆవిధంగా ఆర్యులు స్థానిక అనార్యులపై సాగించిన దండయాత్రలు వేదాలలో విపులంగా వర్ణించబడ్డాయి. ఆర్యులు స్థానికులపై దండయాత్ర జరిపినట్లు చెప్పటానికి వేదాలే గొప్ప సాక్ష్యం. Steppe ancestry ని సూచించే R1 haplogroup జన్యువు పై సాగించిన ఆధునిక ప్రయోగాలు కూడా ఆర్యుల వలస జరిగినట్లు నిర్ధారిస్తున్నాయి.

4. సనాతన పండితుల అభ్యంతరాలు ఏమిటి?
.
ఎ. రహస్యం బట్టబయలు:
హిందూ పండితులు వేదాలను, సంస్కృత భాషను దాదాపు మూడు వేల సంవత్సరాలనుండి కాపాడుకొంటూ వచ్చారు. వేదాలను శూద్రుల ఎదుట చదవరాదని, ఎవరైనా శూద్రుడు వేదాలను వింటే వారి చెవుల్లో సీసం పొయ్యాలని లాంటి ఆంక్షలు విధించి వేదాలను తమకు మాత్రమే చెందిన రహస్యసొత్తుగా నిలుపుకొన్నారు.

1783 లో సుప్రీమ్ కోర్టు జడ్జ్ విలియం జోన్స్ సంస్కృతం నేర్చుకోవటానికి ప్రయత్నించగా, బ్రాహ్మణులు ఎవరూ నేర్పటానికి అంగీకరించలేదు. అతను ఒక అబ్రాహ్మణ వైద్యుని వద్ద నేర్చుకొన్నాడు. 1786 నాటికి సంస్కృత గ్రంథాలను ఇంగ్లీషులోకి అనువదించగలిగే ప్రావీణ్యాన్ని సంపాదించగలిగాడు. మనుస్మృతిని జోన్స్ ఇంగ్లీషులోకి తానే అనువదించాడు.

వేదాలను అనువదించటం ద్వారా ఈ గుట్టును బట్టబయలు చేసాడు మాక్స్ ముల్లర్. హిందూమతానికి ఆయువుపట్టైన ఈ వేదాలలో ఏముందో ప్రజలందరూ తెలుసుకొని బ్రాహ్మణులు ఇన్ని శతాబ్దాలుగా ఈ సమాజంపై తమ ఆధిపత్యం నిలుపుకోవటం కొరకు ఎన్నెన్ని పన్నాగాలు పన్నారో అందరికీ తెలిసిపోయింది. ఈ అవమానకర పరిస్థితులనుండి ఎదుర్కోవటానికి- మాక్స్ ముల్లర్ వేదాలను తప్పుగా అనువదించాడని; కలోనియల్ కోణంలోంచి చూస్తూ పవిత్రమైన వేదాలను అందులోని రహస్యాలకు వక్రభాష్యం చెప్పాడని; లక్షల సంవత్సరాల భారతీయ చారిత్రిక కాలక్రమాన్ని తప్పుగా చూపాడని సనాతన పండితులు వాదించటం మొదలుపెట్టారు.

వేదాలలో గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయని, ఆధునిక బహుజన మేధావులు చెబుతున్నట్లు అందులో అనార్యుల అణచివేత, వర్ణవ్యవస్థమూలాలు లాంటి విషయాలు ఏమీ లేవని ఇంకా వంచించేందుకే సనాతన పండితులు ఇలాంటి వాదనలు చేస్తున్నారని సులువుగానే అర్ధం చేసుకొనవచ్చును.

బి. వేదాలలో అన్నీ ఉన్నాయష:
వేదాలలో ప్రపంచ శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన అనేక అంశాలు శ్లోకాల రూపంలో ఉన్నాయని సనాతన పండితులు ప్రచారం చేస్తారు. పైథాగరస్ సిద్ధాంతము, అణుబాంబు తయారీ, కాంతివేగము, పుష్పక విమానాల తయారీ, కాస్మాలజీ, క్వాంటం థీరి, ఖగోళ భౌతిక శాస్త్రము, ఆధునిక వైద్యం, గణితశాస్త్ర సిద్ధాంతాలు లాంటి అనేక శాస్త్రీయ విషయాలు సంకేతరూపంలో వేదశ్లోకాలలో నిక్షిప్తం చేయబడ్డాయి అని వాదిస్తారు. మాక్స్ ముల్లర్ అనువాదాలలో ఇలాంటి అంశాలపై కనీస ప్రస్తావనలు లేకపోవటం ఇతని పట్ల సనాతన పండితుల ఓర్వలేనితనానికి ఒక కారణం కావొచ్చు.

అలాగని ఈ పండితులు వేదాలలో ఉన్నట్లు చెబుతున్న ఈ అంశాలపై సైంటిఫిక్ జర్నల్స్ లో పేపర్స్ రాసి అంతర్జాతీయ శాస్త్రవేత్తల అంగీకారం పొందారా అంటే అదీ లేదు. ఈనాటికి కూడా వేదాలలో అన్నీ ఉన్నాయి అంటూ మాటలు చెబుతారు

సి. మాక్స్ ముల్లర్ కలోనియల్ ఏజంటా?
మాక్స్ ముల్లర్ పై సనాతన పండితులు చేసే మరొక అభియోగం ఏమిటంటే- వేదాలపై భారతీయులకు విశ్వాసం కోల్పోయేలా అనువదించటానికి బ్రిటిషర్స్ ముల్లర్ ను నియమించారని. దీనికి ఆధారంగా ముల్లర్ తన భార్యకు December 9, 1867 న రాసిన ఒక లెటర్లో “ he was especially employed to translate the Vedas in such a way that the Hindus lose faith in them” అని రాసినట్లు ఒక అబద్దాన్ని చెబుతారు.

నిజానికి ఆ లెటర్ లో పైన చెప్పిన వాక్యాలు లేవు. - It is the root of their religion, and to show them what that root is, I feel sure, the only way of uprooting all that has sprung from it during the last 3,000 years.” అనే వాక్యాలు ఉన్నాయి. ఈ వాక్యాలలో - మూడువేల సంవత్సరాలుగా వేదాల చుట్టూ పేరుకొన్న అభూతకల్పనలని, చెత్తా చెదారాన్ని తొలగించి నిజమైన సత్యాన్ని భారతీయులకు చూపటమే నా లక్ష్యం అని ముల్లర్ భావంగా అర్ధం చేసుకోవాలి. ఈ విషయం భారతీయులు తెలుసుకొనే సమయానికి నేను జీవించి ఉండకపోవచ్చును అని కూడా అంటాడు. అలాంటి ఉదాత్తమైన  వాక్యాన్ని సనాతన పండితులు వక్రీకరించారు.

నిజానికి వేదాలను అనువదిస్తూ ముల్లర్ ఎంతో ఉద్వేగాన్ని ఆథ్యాత్మిక అనుభవాలను పొందినట్లు తనపుస్తకాల ముందుమాటలలో, ఉత్తరాలలో, ప్రసంగాలలో చాలా సార్లు చెప్పాడు. India, What can it Teach us (1882) పుస్తకంలో సంస్కృత వాజ్ఞ్మయం గ్రీకు కన్న గొప్పది అని అని ప్రశంసించాడు. బున్సెన్ అనే మిత్రునికి రాసిన ఒక లేఖలో “వేదాలను చదువటం నాకెంతో ఆనందకరం. అవి నాకు ఉదయపు వెలుగులా, స్వచ్ఛమైన మలయమారుతంలా ఎంతో తేటగా, సత్యవాక్కులా అనిపిస్తాయి” అంటూ ముల్లర్ తాను వేదాలను చదవటంద్వారా పొందిన పరవశతను చెప్పాడు. ముల్లర్ ఈ పనిని వేదాలపై గౌరవంతో చేసాడు తప్ప ఎవరినో మోసగించటానికి కాదు.

డి. ముల్లర్ అనువాదం విశ్వసనీయమైనది కాదా?
ఈ వాదన చేసింది- ఆర్యసమాజ స్థాపకుడైన దయానంద సరస్వతి, బాలగంగాధర తిలక్, అరబిందో వంటి వారు. వీరు, వేదాలు అనేవి ఆథ్యాత్మిక అనుభవాలు; ప్రతీ శ్లోకం వెనుక అనేక పొరలలో అర్ధాలు ఉంటాయి; వేదాలను ప్రాచీనమానవుని ప్రార్థనలుగానో, ఇంద్రుడు అగ్ని వాయు లాంటి దేవుళ్ళను ఉత్త ప్రాకృతిక శక్తులుగానో చూడరాదు అని వాదించారు.

ఈ సందర్భంగా ఎనిమిదోశతాబ్దపు జైనకవి అయిన ఉద్యోతన సూరి చెప్పిన “పదాలకు నానార్ధాలతో, వాక్యనిర్మాణానికి వందల మెలికలతో అర్ధం చేసుకోవటానికి కష్టంగా ఉంటుంది సంస్కృత భాష” అనే మాటలు ప్రస్తావనార్హం. భాష కారణంగా వేదాలకు భిన్న భాష్యాలు చెప్పే అవకాశం ఏర్పడింది. మూడువేల సంవత్సరాలుగా చేస్తున్న భిన్న వ్యాఖ్యానాల వల్ల వేదాలలో అన్నీ ఉన్నాయష అనే నానుడి స్థిరపడిపోయింది.

మాక్స్ ముల్లర్ వేదాలను భిన్నపొరలలో చూడలేదు. వాటిని “భౌతిక దృష్టితో చూసి చారిత్రిక కోణంలోంచి” అనువదించాడు. ఇది యురోపియన్ శాస్త్రీయ పద్దతి. ఈ పని చేయటానికి ముల్లర్ తన పూర్తి జీవితాన్ని ధారవోసాడు. అలా శాస్త్రీయంగా వేదాలను అనువదించటం సనాతన పండితులకు నచ్చలేదు.

వేదాలకు మాక్స్ ముల్లర్ చేసిన అనువాదం మొదటిదీ కాదు, చివరదీ కాదు. రాజారామ్మోహన్ రాయ్ ముల్లర్ కన్నా ముందే 1835 నాటికే వేదాలలోని కొన్ని భాగాలను ఇంగ్లీషులోకి అనువదించాడు మాక్స్ ముల్లర్ తరువాత, Ralph Griffith, A.B. Keith, Arabindo, Dayananda Saraswati, S. Radhakrishnan, P. Lal, Swami Prabhupada, Wendy Doniger, Swami Sivananda లాంటి అనేకమంది వేదాలను పూర్తిగానో, కొద్ది భాగాలనో అనువదించారు. వీటిలో స్వదేశీయులు చేసినవి కూడా ఉన్నాయి.
వేదాలకు ఇన్ని స్వదేశీ అనువాదాలు ఉండగా మాక్స్ ముల్లర్ పేరు సనాతన పండితులు పదే పదే చర్చలోకి ఎందుకు తీసుకొని వస్తారంటే- మాక్స్ ముల్లర్ శాస్త్రీయదృష్టితో అనువదించటమే కాక వేదాలకు చారిత్రిక కాలనిర్ణయం చేసాడు. వేదాలను రచించిన ఆర్యులు విదేశీయులు అని ప్రతిపాదించాడు. ఇవి రెండూ ముల్లర్ ని నేటికీ ద్వేషించటానికి బలమైన కారణాలు. ఈ రోజు జన్యుపరీక్షలు అందిస్తున్న విజ్ఞానం ప్రకారం ఈ రెండు విషయాలు సత్యాలుగా నిరూపితమవుతూండటం మాక్స్ ముల్లర్ ద్రష్టత్వానికి, మేధస్సుకు గొప్ప నిదర్శనం.

5. ఆర్యుల దాడి సిద్ధాంతం, వేదకాల నిర్ణయం

భాషలను, సంస్కృతులను, మతాలను ముల్లర్ తులనాత్మక అధ్యయనం చేసాడు. ఆ పరిజ్ఞానంతో వేదాలను రచించిన ఆర్యులు మధ్య ఆసియా నుంచి 1500 BCE లో భారతఖండంలోకి ప్రవేశించి ఉంటారని ప్రతిపాదన చేసాడు. అలా వచ్చిన ఆర్యులు తమతో పాటు వేద సంస్కృతిని, సంస్కృతభాషను ఉత్తరభారతదేశంలోకి తీసుకొని వచ్చారని అన్నాడు. ఆ ప్రకారం చూసినప్పుడు వేదాలలో అత్యంత ప్రాచీనమైన ఋగ్వేదం BCE1500-1200 మధ్య రాయబడి ఉంటుందని ముల్లర్ అభిప్రాయపడ్డాడు.
అది సనాతన పండితులకు అంగీకారం కాలేదు ఎందుకంటే వేదాలు కనీసం BCE 5000 నాటివి అని వీరి విశ్వాసం. అంతేకాక ఆర్యులు స్వదేశీయులు అని, బయటనుంచి వలస వచ్చిన వారు కారని వాదిస్తారు.

6. ఆధునిక అవగాహన:

ఈ రోజు ఒక జన్యువు వివిధ జనాభాలలో వివిధ కాలాలలో ఎలా ప్రయాణం చేసింది అనే విషయం చాలా సులువుగా మేప్పింగ్ చేయగలుగుతున్నారు. ఈ ప్రాచీన DNA అధ్యయనాల ద్వారా c2000 BCE లో Pontic-Caspian steppe (ఉక్రయిన్, రష్య, కజకిస్తాన్) ప్రాంతాలనుంచి భారతదేశంలోకి Yamnaya Steppe pastoralist లు ప్రవేశించారని తెలుస్తున్నది. వీరు ఋగ్వేద ఆర్యులు.
ఈ ఆధునిక ఆవిష్కరణ -- మధ్య ఆసియా నుంచి ఆర్యులు 1500 BCEలో భరతఖండంలోకి వలస వచ్చారని చెప్పిన ముల్లర్ ప్రతిపాదనతో ఈ దాదాపు సరిపోలుతునన్నది. ఈ ఆర్యులు గుర్రాలపై వచ్చారు. వేదాలలో గుర్రాలమీద 200 శ్లోకాలు ఉన్నాయి. గుర్రాలు భారతఖండానికి చెందిన ఇండిజినస్ జంతువులు కావు. ఎక్సోటిక్ జంతువులు.  అందుకే హరప్పానాగరికతలో ఎక్కడా గుర్రాల ముద్రలు కానీ,  తవ్వకాలలో గుర్రాల అస్థిపంజరాలు కానీ కనిపించవు. ఈ సత్యం కూడా ఆర్యులు బయటనుండి గుర్రాలపై వలస వచ్చిన వారు అని ఋజువు చేస్తుంది.

ముల్లర్ వేదాలు 1500-1200 BCE మధ్య రచింపబడి ఉంటాయని ఊహించాడు. ఇది కూడా సత్యదూరం కాదని ఇండో యూరోపియన్ భాషల ఆధునిక అధ్యయనాల ద్వారా తెలుస్తున్నది.

మాక్స్ ముల్లర్ వివిధ భాషలను తులనాత్మకంగా అధ్యయనం చేసిన వ్యక్తి. ఇతనికి మధ్య ఆసియాప్రాంతపు అవెస్తా భాషకు, సంస్కృత భాషకు గల పోలికలను గమనించాడు. వాటి ఆధారంగా సంస్కృతబాషమాట్లాడే ఆర్యులు, మధ్యఆసియానుండి వలస వచ్చి ఉండవచ్చు అని ఊహించాడు. వేదాలలోపలి ఆధారాలు భీకరమైన దండయాత్రలను సూచించటాన్ని గుర్తించాడు. ఈ రెండు దృగ్విషయాలను కలిపి "ఆర్యుల దండయాత్ర" సిద్ధాంతంగా చెప్పాడు.

మాక్స్ ముల్లర్ కాలానికి జన్యుశాస్త్రం లేదు. జనాభాలలో జన్యువుల కదలికలను అంచనావేసే టెక్నాలజీ లేదు. భిన్నభాషల పదాల మధ్య సామ్యాలను వేగంగా పోల్చిచూడగలిగే కంప్యూటర్ పరిజ్ఞానం లేదు. అయినప్పటికీ ముల్లర్ వేదకాలం, ఆర్యుల దాడి సిద్ధాంతాల గురించి 90% సరైన ఊహ చేసాడు. జన్యు ఆధారాలనుబట్టి దీన్ని ఆర్యుల వలస గా నేడు అందరూ అంగీకరించినా, వేదాలలోని అంతర్గత ఆధారాలనుబట్టి దీన్ని ఆర్యుల దాడిగా సామాజిక శాస్త్రవేత్తలు పరిగణిస్తారు. వేదాలను భౌతిక దృష్టితో శాస్త్రీయ అధ్యయనం చేయటం వల్ల ఇది సాధ్యమైంది. ఇది ముల్లర్ మేధోశ్రమకు సంకేతం.

*****
ఆర్యుల వలస సిద్ధాంతంతో ఏంటి సమస్య?
ఆర్యులు విదేశీయులైతే ఈ సనాతనపండితులు కూడా టర్కీనుంచి వచ్చిన తురకలతో సమానమౌతారు. భరతఖండం అంటే మేమే అని ఇన్నాళ్ళూ చెప్పుకొన్న వారికి ఇది చాలా అవమానకరమైన స్థితి. కనుక ఆరు నూరైనా నూరు ఆరైనా ఆర్యులవలస సిద్ధాంతం తప్పు అని నిరూపించటానికి వందేళ్ళుగా ప్రయత్నిస్తున్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా మాక్స్ ముల్లర్ ను పంచింగ్ బాగ్ లా వాడుకొంటూ ఆర్యులదాడి సిద్ధాంతాన్ని ఖండిస్తున్నారు. ఇప్పుడు కొత్తగా హరప్పాలిపిలో సంస్కృత ఛాయలు ఉన్నాయని, హరప్పా సంస్కృతి వేద సంస్కృతే అని ప్రచారం ఎత్తుకొన్నారు.

రోజు రోజుకీ ఆధునిక జన్యుశాస్త్ర పరిశోధనల వలన ఆర్యుల వలస జరిగిందనే సత్యం బలంగా ఆవిష్కరింపబడుతున్నది. ఇది నేటి సనాతన పండితులకు మింగుడుపడక, Out of India Theory పేరుతో ఓ అబద్దపు సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చి -- ఆర్యులు భరతఖండంలో పుట్టినవారే, ఇక్కడనుంచి మధ్య ఆసియాకు వలస వెళ్ళి మరలా తిరిగి BCE 1500లో భరతఖండంలోకి  వెనక్కు వలస వచ్చారని గొప్ప అతి తెలివి వాదన ఒకటి మొదలుపెట్టారు.

హిందూ పండిత చరిత్రకారులు చెబుతున్న సిద్ధాంతాలను ప్రపంచవ్యాపిత ఇండాలజిస్టులు నమ్మటంలేదు. అదొక సంకట స్థితిగా మారింది సనాతనహిందూ చరిత్రకారులకు.

మరొక ఆశ్చర్యకరమైన అంశం- ఆర్యులుగా పిలవబడిన Steppe Ancestry మూలాలు కలిగిన ప్రజలలో ఉండే R1 haplogroup జన్యువు ఆధునిక భారతసమాజంలో బ్రాహ్మణులలో అధికంగాను క్రింది తరగతి ప్రజలలో తక్కువ శాతంగాను ఉన్నట్లు నేడు గుర్తించారు.

7. ముగింపు

“మాక్స్ ముల్లర్ వశిష్ట మహాముని”- వివేకానందుడు.

వేదాలు రాసిన అత్యంత ప్రాచీనమైన తాళపత్ర రూపం 11 వ శతాబ్దానికి చెందినది. East India Company అధికారులైన విలియం జోన్స్, హెచ్.హెచ్. విల్సన్ లు సేకరించి యురోపియన్ లైబ్రేరీలలో భద్రపరచిన ఋగ్వేద సంహిత అనే రాతప్రతి, 14 వ శతాబ్దపు సాయనాచార్యుడు ఋగ్వేదానికి చేసిన వ్యాఖ్యానాన్ని ప్రాతిపదికగా చేసుకొని ముల్లర్ తన అనువాదం సాగించాడు. తుదిప్రతి పరిష్కరణ సమయంలో భారతీయ సంస్కృత పండితుల సహాయం తీసుకొన్నాడు. మాక్స్ ముల్లర్ తన ముందుమాటలో – “వేదాలను అనువదించటానికి పాతికేళ్ళు కష్టపడ్డాను ఆ అనువాదాన్ని పరిష్కరించి పుస్తకరూపంలో తీసుకురావటానికి ఇరవై ఏళ్ళు పట్టింది” అని చెప్పుకొన్నాడు. మొత్తం నలభై ఐదు ఏళ్ళు. అంటే మాక్స్ ముల్లర్ తన యావజ్జీవితాన్ని ఈ వేదాలను అనువదించటానికే వెచ్చించాడు.

వేదాలను అనువదించటానికి, ఒక పేజీకి నాలుగు పౌండ్ల చొప్పున మొత్తం 9 లక్షల రూపాయిలు ఈస్ట్ ఇండియా కంపనీ నుంచి మాక్స్ ముల్లర్ తీసుకున్నాడని, అది చాలా పెద్దమొత్తం అని సనాతనవాదులు ఆరోపిస్తారు కానీ ఈ డబ్బు 45 ఏండ్లపాటు చేసిన విద్వత్సంబంధమైన పనికి పొందిన ప్రతిఫలం. దానిలోంచే పరిష్కరణ సమయంలో పెట్టుకొన్న సంస్కృత పండితులకు ఇచ్చిన జీతబత్యాలు ఖర్చు కూడా ఉంది.

స్వామి వివేకానంద 28, మే 1896 న మాక్స్ ముల్లర్ ను ఆక్స్ ఫర్డ్ లో కలిసాడు. ఆ సమయంలో వారిరువుతూ భారతీయ వేదాంతం, ఆథ్యాత్మికతలను చర్చించుకొన్నారు. అప్పటికే మాక్స్ ముల్లర్ వృద్ధాప్యానికి చేరుకొన్నాడు. వివేకానందకు ముల్లర్ పట్ల అపారమైన గౌరవం. అదే విధంగా ముల్లర్ కు కూడా వివేకానందుడంటే అవ్యాజమైన ప్రేమ. వారి కలయికను వివేకానందుడు - “ఆ వృద్ధ దంపతులను చూస్తే ఏదో ఆశ్రమంలో నివసిస్తున్న వశిష్టుడు, అరుంధతిల వలే ఉన్నారు. మాక్స్ ముల్లర్ సాయనాచార్యుని పునర్జన్మ. నేను బయలుదేరినపుడు కనుల నిండా నీరు నింపుకొని ముల్లర్ నాకు వీడ్కోలు పలికారు. మాక్స్ ముల్లర్ తో సరితూగగల సంస్కృత పండితుడు భారతదేశంలో ఒక్కడు కూడా లేడు" అంటూ ఎంతో ఆర్థ్రంగా వర్ణించాడు. 

మాక్స్ ముల్లర్, వివేకానందుడు సెక్యులరిజం అనే పదం వాడకపోయినా భారతీయ సమాజంలో సెక్యులరిజం అనే భావనలకు ఆధ్యులు అంటారు.

నేటికీ సనాతన పండితులతో తిట్టించుకొంటున్న మాక్స్ ముల్లర్ తన జీవితకాలంలో ఇండియాకు రానే లేదు. తన పనంతా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ లో ఉంటూ చేయటం ఒక కొసమెరుపు. చివరి దరహాసం ముల్లర్ దే అవుతున్నది.

బొల్లోజు బాబా


References
1. The complete works of Swami Vivekananda: Volume 6
2. religion for a secular age by Thomas J green.
3. researchguru.net/volume/Volume%2013/Issue%201/RG26.pdf
4. Sri Madhvacarya a 13th century revolutionary monk quotes Skanda Purana, an authoritative scripture, in his commentary to the Rig Veda as follows: trayoarthaha sarvavedeshu dasharthah sarvabharate vishnon sahasranamapi nirantarasatarthakam || "Vedas have at least three meanings, Mahabharata has atleast ten meanings and Vishnu Sashranama has at least 100 meanings for each word."
5. quora.com/Did-the-West-borrow-nuclear-technology-from-the-Vedas-z
6. Selected works of Dr. B. R. Ambedkar
7. India What it can teach us, Max Muller
8. Life And Letters Of The Right Honourable Friedrich Max Muller Vol.1 పేన. 346
9. వేదబాహ్యులు, బొల్లోజు బాబా






Saturday, November 2, 2024

స్వీయ అస్తిత్వం వైపు ....మురళీ కృష్ణ కవిత్వం


సుంకర గోపాల్, పాయల మురళికృష్ణ, అనిల్ డానీ, పుప్పాల శ్రీరాం, కంచరాన భుజంగరావు, లండ సాంబమూర్తి, బాల సుధాకర్ మౌళి, అవధానుల మణిబాబు, మానస చామర్తి, ఎమ్.ఎమ్. మహేష్, సురేంద్రదేవ్ చెల్లి (వీళ్ళు- ఈ సమయాన నాకు తడుతున్న పేర్లు) తెలుగు సాహిత్య రంగాన్ని మెరిపిస్తున్న యువకవి గళాలు. వీరి అభివ్యక్తి నవ్యం, వీరి వస్తు వైవిధ్యం అనంతం. వీరు కవితను నడిపించే శైలి వినూత్నం. ఇప్పటికే కొన్ని భవిష్యత్ కళాత్మక వ్యక్తీకరణ పుటలపై తమ పేర్లు లిఖించుకొన్నారు.
వీరిలో ముగ్గురు ఇప్పటికే శిఖామణి యువపురస్కారాలు అందుకొన్నారు. ఉత్తరాంద్ర కవిత్వ పాయ శ్రీ పాయల మురళీ కృష్ణ నేడు యానాంలో శిఖామణి యువపురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా నన్ను సభకు మురళిని పరిచయం చేయమన్నారు.
సమయం తక్కువ ఉంటుందని ఓ రెండు కవితలను తీసుకొని విశ్లేషించుదామని అనుకొన్నాను. పెద్ద సభ. ఒక కవిత చదవటానికే పరిమితం కావలసి వచ్చింది. నా సాహితీ గురువు శ్రీ శిఖామణి నాకు ఇచ్చిన అవకాశం ఏదైనా నాకు మహదవకాశమే. మొత్తం ప్రసంగ పాఠం. ఇది.
****

స్వీయ అస్తిత్వం వైపు ....మురళీ కృష్ణ కవిత్వం
.
పాయల మురళి కృష్ణ ఉత్తరాంధ్ర జీవితాన్ని ప్రతిభావంతంగా గానం చేస్తున్న యువకవి. ఇతని కవిత్వం సార్వజనీన మానవ ఉద్వేగాలను పదునుగా పలికిస్తాయి. తన ప్రాంతపు విధ్వంసం, పోరాటాలు, జీవన గాయాలు ఇతని కవితావస్తువులు. సమాజం పట్ల నిబద్దత కలిగిన కవి. పదాలతో, ప్రతీకలతో, భావచిత్రాలతో కవితను గొప్ప నేర్పుతో అల్లుతాడు మురళీ కృష్ణ.
శీతాకాలపు తెల్లవారు జామున…. అనే కవిత మురళి కవితా తత్వాన్ని సంపూర్ణంగా ఇముడ్చుకొన్న కవితగా నేను భావిస్తాను. ఈ కవిత శీతాకాలపు పొగమంచును ఒక ఉపమానంగా తీసుకొని, మానవజీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, సమస్యలను, ఆశలను వర్ణించింది. చివరకు సూర్యుడు ఉదయించటం ద్వారా సమస్యలను అధిగమించటం అనే ఆశావహ దృక్ఫథంతో కవిత ముగుస్తుంది.

శీతాకాలపు తెల్లవారు జామున….
.
తనమీద వ్యర్థంగా పడేస్తున్న
పాలిథీన్ సంచులు సమస్తాన్ని
గుండచేసి
నేల గాలిలోకి విసిరేసిందా
అన్నట్లుందీ పొగమంచు.
పల్లెను బంధించిన
కంపెనీలన్నీ కలిసికట్టుగా విసర్జిస్తున్న విషంలా
దేహాన్ని చుట్టుముట్టిన చలి
రోడ్డెక్కి ప్రయాణిస్తే చాలు
మింగేద్దామా అన్నట్టు ఎదురుచూస్తున్న మృత్యువు
కళ్ళపై మసక మసకగా
ముసుగులేస్తోంది
ఈ శీతాకాలపు తెల్లవారు జామున
ఎవరో ఆలమందల్ని రోడ్డుమీడకి తోలినట్లు
ఎక్కడికక్కడే అడ్డుతగులుతున్న మంచు తెరలు
ఎదురెదురు వాహనాలు
ఒకదానికొకటి
లాంతర్లు నుదిటిమీద కెక్కినట్లు
చిరుచీకట్లో కాంతులు చిమ్ముతున్నాయి
అడుగడుక్కీ
అవరోధాలు ఎదురవుతున్నప్పుడు
ఆగిపోకుండా సాగిపోవటం
అపాయమే కావొచ్చు
కానీ
కాసింత దూరంలో రానున్న వెలుగు
ఎందుకో నిలువనివ్వదు.
రోడ్డుపక్కనే పడి ఉన్న ఊరకుక్క కళేబరం
వెదజల్లుతున్న దుర్గంధం
ఇంకా చీకటిని గుర్తు చేస్తూనే ఉంది
నిరంతరాయంగా వెళ్తుంటే
ఓ ప్రభాతం ఎదురొచ్చింది
ప్రసరించే రవికిరణాలు
మంచుబిందువుల్ని పటాపంచలు చేసాయి.
అడ్డుతెరలు నమసిపోయి
రహదారి ఎప్పటిలాగే సాధారణం.
అప్పుడనిపించింది
నవజీవన యానంలో
మనసుకి మనసుకీ మధ్య
అడ్డుగోడల్లా నిలిచే
పగా ప్రతీకారాలనే పొగమంచు కురుస్తున్నప్పుడు
రవికిరణాల్లాంటివే కదా కవిత్వాక్షరాలని….


ఏం చెబుతున్నాడు ఈ కవితలో మురళి కృష్ణ

1.శీతాకాలపు పొగమంచు: పొగమంచును పాలిథీన్ సంచులను గాలిలో విసిరేసినట్లు కవి పోలుస్తున్నాడు. ఈ వర్ణన ద్వార మనిషి వాతావరణాన్ని కాలుష్యం చేసినట్లు సూచిస్తున్నాడు.

2.విషపు చలి: పల్లెలో కార్పొరేట్ సంస్థలు విస్తరించి కలుషిత వాతావరణం విషం లా మనిషిని చుట్టుముడుతుందని అంటున్నాడు.

3.రోడ్డుపై మృత్యువు ఎదురుచూస్తుంది: రోడ్డుపై ప్రయాణించే ప్రతి వ్యక్తి వేసే ప్రతి అడుగులో మృత్యువు ఎదురుపడుతుందని హెచ్చరిస్తున్నాడు. రోడ్డుపై ప్రయాణం జీవితానికి ప్రతీక.

4.వెలుగు-ఆశ: వెలుగులు ప్రసరించే రవి కిరణాలే జీవితానికి, కవిత్వానికి ఆశ అని చెబుతున్నాడు.
ఎంతో సరళంగా కనిపిస్తున్నా లోతైనా తాత్వికతను కలిగిన కవిత ఇది.
***

శ్రీ మురళి కృష్ణ బాధ్యత కలిగిన ఒక ఉపాధ్యాయుడు. ప్రతీ ఉపాధ్యాయ కవి తన వృత్తి గురించి ఏదో సందర్భంలో కవిత్వం రాసే ఉంటారు. అలా రాయటం ఒక అనివార్యత. ఒక ఉపాధ్యాయుని కోణం నుండి బడిని, పిల్లలను వారి ఆనందాలను, ఒక ఉపాధ్యాయుని రోజువారీ అనుభవాలను, అతని బాధ్యతలను ఈ కవిత వ్యక్తీకరిస్తుంది.
.
ఈ రోజేం కథ చెప్తారు మాస్టారు!

ఎన్ని విషాదాలనైనా
ఒకపసినవ్వు కడిగి పారేస్తుంది
బడి ప్రాంగణంలో మాత్రమే
బ్రతుకు కల్మష రహితమై కనిపిస్తుంది
ఊరో పెద్దోల్లంతా
పనిగట్టుకొని చెప్పే ఉన్నవీ లేనివీ వినీ వినీ***
మోడు బారిపోతున్న మనిషితనం
ప్రతీ ఉదయం చిలుకలు వాలిన చెట్టులా పులకించే బడిలో
మళ్లీ చివుర్లు తొడుగుతుంది
చదివిన కతల్నీ
నేర్చిన పాటల్ని
పాల బువ్వలా మార్చి
తరగతి గదికి తీసుకెళ్తే
గింజలు తెచ్చిన తల్లి పక్షి చుట్టూ
చేరిన పిల్లల్లా
చిన్నారులంతా నా చుట్టూ
సందేహాలన్నీ
చిట్టి చిట్టి తీగల్లా మారి అల్లుకుంటుంటే
నేను సమాధానాల పందిరా విస్తరిస్తాను
గొంతు మోసుకెళ్ళిన
జంతువుల అరుపుల్నీ
పిట్టల కిలకిలల్నీ
సంచిలోని బొమ్మల అట్టముక్కల్నీ
అన్నీ ఒక్కొక్కటీ విప్పి
పసి కళ్ళల్లో కేరింతల దీపాలు వెలిగించుకోవాలి
అక్షరాలకీ అంకెలకీ
గులకరాళ్ళనీ, చింతపిక్కల్నీ తొడిగింపజేసి
ఆటల్లోనూ పాటల్లోనూ
అభ్యసనాన్ని పూయింపచేయాలి
పేదరాశి పెద్దమ్మలోకీ
అందాల రాకుమారుడిలోకి
పేరు మరచిన ఈగలోకి పరకాయ ప్రవేశం చేసుకుంటూ
పరమానందయ్యగాను
తెనాలి రామలింగడి గాను
మర్యాద రామన్నగానూ
రకరకాలుగా పరిచయం కావాలి
విరామంలో
వేమన పద్యాన్ని అంకెల ఆటనీ కావాలి
“మేకా నిన్ను చంపుతా” నంటూ
పులిలో క్రౌర్యాన్ని చూపించాలి
ఇప్పుడు బడి బాటలోకి
పెద్దోళ్ళెవరూ రానవసరం లేదు
కాన్వెంటు ఆటో ప్రకటన
ఇక్కడ తప్పని సరిగా మూగబోవాలి
బడి చివరిగంట తరువాత
బడి భవనం, నేనూ ఇద్దరం నిస్సహాయులమే
రేపటి ఉదయం వరకూ
రెక్కలు తెగిన పక్షులమే
ఉదయం తొమ్మిదౌతోంది
అదిగో నా బడి పిల్లలంతా
బడికి నాకన్నా ముందే వచ్చి
తప్పిపోయిన నా బాల్యాన్ని
వెదికి పట్టుకొచ్చి పదిలంగా అప్పజెప్పే
జీవన మాధ్యమాల్లా పలకరించారు
“ఈ రోజేం కథ చెబుతారు మాస్టారు…?”

మనం ఎన్నెన్ని ఒడిదుడుకులతో ఉన్నప్పటికీ బడిప్రాంగణంలోకి ప్రవేశించగానే అవన్నీ ఒక్క పసినవ్వు కడిగిపారేస్తుంది అనే ప్రారంభం ఈ కవికి తన వృత్తి పట్ల ఉన్న పవిత్రభావనను తెలియచేస్తుంది.

ఈ కవితలో విద్యార్ధులు తెల్లని పలకలుగా, తల్లిపక్షి చుట్టూ చేరే పక్షి పిల్లల్లా, పందిరిని పెనవేసుకొనే చిట్టి తీగెల్లా కనిపిస్తారు.

ఉపాధ్యాయుడు- పరమానందయ్యగా, తెనాలి రామలింగడుగా, మర్యాదరామన్నగా, వేమన పద్యంగా, పులీమేకా ఆటలో పులిగా, మిమిక్రీ కళాకారునిగా, మెజిషియన్ గా రకరకాల వేషాలు కడతాడు. ఇవన్నీ ఉదరపోషణార్ధం కాదు, పసి "హృదయపోషణార్ధం".

ఇక బడి అంటే ఎన్ని విషాదాలనైనా కడిగేసే పవిత్ర స్థలం అట. తప్పిపోయిన కవి బాల్యాన్ని వెతికి పట్టుకొని బలవంతంగా అప్పజెప్పే జీవన మాధ్యమం అట.

ఈ కవితలో ఉపాధ్యాయుడి పాత్ర, విద్యపట్ల కవికి ఉన్న సానుకూల దృక్ఫథం, విద్యార్ధులపట్ల ఉన్న అనుబంధం లాంటివాటిని గొప్ప భావోద్వేగ పూరితంగా ఆవిష్కరించారు శ్రీ మురళీ కృష్ణ.
****
ఈ మూడవ కవిత మురళి కృష్ణ రానున్న కవితా సంకలనంలోనిది.

దారిపక్క ఉన్న ఒక చెట్టుకు వేలాడుతున్న ఒక దృశ్యాన్ని ఆధారం చేసుకొని నిర్మించిన ప్రతీకాత్మక కవిత “ఒక చెట్టు – పగిలిన అద్దం.
.
ఒక చెట్టు- పగిలిన అద్దం

దారి పక్క ఏకాంత శోకంలా ఓ చెట్టు
దాని కొమ్మకు వేలాడుతున్న పగిలిన అద్దం
వెళ్తూ వెళ్తూ ఆ అద్దాన్ని చూస్తే
ఏం కనిపించొచ్చు
రాత్రంతా ఎడతెగక కురిసిన చీకటికి
గొడుగు పట్టిన గుడ్డ ముక్క కింద
వెలుగుతున్న ఒంటరి దీపమొక్కటి తప్ప
సౌకర్యమంటే తెలియని నగ్న జీవనం
ఈ చదును చేయబడ్డ మట్టిమీద లిఖించిన
బతుకు సంతకం కనిపిస్తుందా
వలతో కట్టిన దడిలో
జడివానకు నిలవలేక
రెక్కబలం లేని పక్షులు రాల్చిన
పింఛాల అంచున మొలిచిన కన్నీటి బిందువులు
ప్రతిబింబించే దుఃఖం కనిపిస్తుందా
రెండు తపేలాలు మూడు గిన్నెలతో
కాలాన్ని ఈదుతున్న ఆ కుటుంబం
ఆకాశం విసిరిన అగ్గిశకలం సాక్ష్యంగా
భద్రతపై ఎక్కుపెట్టిన ప్రశ్నార్ధకాల్లాంటి
దేహాల చెల్లాచెదురుతనం కనిపిస్తుందా
ఒకవేళ
ఇవేవీ కనిపించలేదూ అంటే
అద్దంతప్ప ఏ పగుల్లూ కనిపించనట్టే
****

దారిపక్క ఏకాంత శోకంలా ఓ చెట్టు అనే ప్రారంభంతోనే ఒంటరితనం, నిరాశాభరిత జీవితాన్ని స్ఫురింపచేస్తాడు కవి.

అద్దం పగిలిపోయినప్పుడు ఏ దృశ్యాలను చూపుతొందో ఒక్కో పదచిత్రాన్ని పేర్చుకొంటూ వెళతాడు.

రాత్రంతా ఎడతెగక కురిసిన చీకటి, ఒంటరి దీపం, మట్టిమీద లిఖించిన సంతకం, రెక్కబలం లేక పక్షులు, రెండు తపేలాలు, మూడు గిన్నెలతో కాలాన్ని ఈదే కుటుంబం, ప్రశ్నార్ధకాలలాంటి దేహాలు….. ఇవంట కనిపించే దృశ్యాలు.

ఈ దృశ్యాల వెనుక ఉన్న దుఃఖం, కష్టం, బాధా, అసమానతలు చూడ లేని చూపు చూపే కాదని చెబుతున్నాడీ కవి.
****

ఇతని కవిత్వంలో ఉత్తరాంధ్ర నేల పల్లవిస్తుంది. దుఃఖం పలుకుతుంది. పల్లెల్లో ఎండిపోయిన చెరువు; అంతర్ధానం అయిపోతున్న పాట;ఊరి మురికిని శుభ్రం చేసే సర్విసింగ్ సెంటర్;ఊరందరకీ సౌభాగ్యాన్ని పంచిపెట్టిన తాత మలారం సంచి; ప్లాస్టిక్ చేస్తున్న విధ్వంసం; సాయింత్రాన్ని ధ్వనించే పిచ్చుకలు; ఊరి మర్రిచెట్టు స్థానంలో మొలిచిన సెల్ ఫోన్ టవర్ లాంటి ఎన్నో వస్తువులు చక్కని కవితలుగా పోత పోసుకున్నాయి ఈ సంపుటిలో.

శ్రీ పాయల మురళీ కృష్ణ శిఖామణి యువ పురస్కారాన్ని అందుకొంటున్న ఈ సందర్భంగా అతనిని అభినందిస్తున్నాను. ఈ అవార్డుకి ఇతనిని ఎంపిక చేయటం సరైన నిర్ణయమని భావిస్తున్నాను. రెండవ పుస్తకం త్వరలోనే తీసుకురావాలని ఆకాంక్షిస్తూ......
ప్రేమతో

బొల్లోజు బాబా





Friday, November 1, 2024

వరహావతారం-గోళాకార భూమి

వరాహావతార శిల్పాలు గుప్తుల కాలంలో చెక్కబడ్డాయి. ఉదయగిరి గుహలలోని 4 వ శతాబ్దపు వరాహ అవతార పానెల్ లో గుప్తరాజులను విష్ణుమూర్తి/పృధ్వీపతి గా పోలుస్తూ ఉత్తరభారతదేశంలో గుప్తుల రాజ్యాధికారాన్ని స్థిరపరచే ఒక పొలిటికల్ మెటఫర్ అని జయస్వాల్ లాంటి చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.
 
భూమి నీళ్ళల్లో మునిగి ఉన్నప్పుడు వరాహావతారం ఎత్తి విష్ణుమూర్తి ఆ భూమిని పైకి తీసాడు. ఈ సందర్భంగా హిరణ్యాక్షునితో యుద్ధం చేసి అతనిని సంహరించాడు. భూమిని స్త్రీగా చెబుతూ వరాహస్వామి ఆమెను పెళ్ళి చేసుకొని ఉద్ధరించాడని పురాణ కథనం. అంటే అంతవరకూ భూమి హిరణ్యాక్షుడు అనే రాజుది అని, అతనిని సంహరించటం ద్వారా అతని రాజ్యాన్ని/భూమిని సొంతం చేసుకొన్నాడని అర్ధం వస్తుంది.
 
దేవాసుర యుద్ధాల ప్రయోజనం ఒకటే భూమి ఆక్రమణ, అధికార విస్తరణ, బడుగువర్గాల అణచివేత అంటారు డా. బి. విజయభారతి గారు. వరాహావతారం కూడా అలాంటిదే.
గుప్తులపాలనలో హిందూమతం రాజ్యమతంగా ఆదరణపొందింది. అందుకనే పండితులు గుప్తుల పాలనను స్వర్ణ యుగం అంటారు.
 
ఈ ప్రాచీన వరహావతార శిల్పాలలో భూమి గుండ్రంగా ఉండదు. వరాహస్వామి భూదేవి రూపంలో ఉన్న స్త్రీ మూర్తిని చేతులతో ఎత్తుకొన్నట్లు ఉంటుంది.

ఇక ఆధునిక కాలానికి వచ్చేసరికి- భూమి గుండ్రంగా ఉంటుందని ప్రపంచం అర్ధం చేసుకొన్నాక వరహావతారం గుండ్రని భూమిని ఎత్తుతున్నట్లు శిల్పాలు చిత్రాలు లిఖించారు. గోళాకార భూమిని ఎత్తుకొన్న వరాహ శిల్పాలు 18 వ శతాబ్దానికి ముందు లేవు. అలా గోళాకార భూమిని ఎత్తుకొన్నట్లు చూపటం చిత్రకారుల తప్పు కాదు. అది కళ.
 
కానీ, ఇటీవల సనాతన వాదులు గుండ్రటి భూమిని ఎత్తుకొన్న వరాహావతార శిల్పం ఫొటోని చూపించి మన పూర్వీకులకు వేలసంవత్సరాలకు పూర్వమే భూమి గుండ్రంగా ఉండేదని తెలుసని. మన సనాతనధర్మ గొప్పతనానికి ఈ శిల్పమే సాక్ష్యమని ప్రచారం చేసారు. అది మోసం.
తీరా చూస్తే అది బాలాసోర్ లో 2009 లో నిర్మించిన జగన్నాథ ఆలయశిల్పం.
 
మోసం, అబద్దాలతో ఎంతకాలం ఇలా మోసగిస్తారు ఈ సనాతనధర్మ అబద్ద ప్రచారకులు

బొల్లోజు బాబా


Thursday, October 31, 2024

పెరియార్ పోరాట ఫలితం మొదటి రాజ్యాంగ సవరణ, కుల ఆధారిత రిజర్వేషన్లు


మద్రాస్ ప్రొవిన్స్ లో బ్రిటిష్ వారి పాలనలో 1928 నుంచీ వెనుకబడిన తరగతులకు కమ్యునల్ జి.వొ అమలులో ఉండేది. దీని ప్రకారం అణగారిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్ దక్కేది.
 
భారత రాజ్యాంగం 26, జనవరి 1950 నుండి అమలులోకి వచ్చింది.  1951 లో చంపకం దొరైరాజన్ అనే ఒక బ్రాహ్మణ స్త్రీ- తన కూతురికి ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ వైద్య విద్యలో సీటు రాలేదని, ఆమె కన్నా తక్కువ మార్కులు వచ్చిన ఒక వెనుకబడిన తరగతికి చెందిన మరొక విద్యార్ధికి సీటు వచ్చిందని, ఇది రాజ్యాంగంలో 15 వ ఆర్టికిల్ ప్రకారము అందరూ సమానమే అనే సూత్రానికి అనుకూలంగా లేదని - మద్రాసు హైకోర్టులో కేసు వేసింది. ఈ కేసును శ్రీ ఎమ్. కె. నంబియార్ అనే ఆనాటి ప్రసిద్ధ లాయర్ వాదించారు. మద్రాస్ హైకోర్టు రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే కనుక కులం ఆధారంగా కొందరికి రిజర్వేషన్లు కల్పించటం రాజ్యాంగ విరుద్ధం అని తీర్పునిచ్చింది.
 
ఈ తీర్పును మద్రాసు ప్రభుత్వం సుప్రీమ్ కోర్టులో సవాలు చేసింది. సుప్రీం కోర్టుకూడా ఏడుగురు జడ్జిల ధర్మాసనం ద్వారా హైకోర్టు తీర్పునే సమర్ధించి “కులాధారిత రిజర్వేషన్లు” చెల్లవు అని తీర్పు ఇచ్చింది.
 
ఈ తీర్పుపై పెరియార్ ఆధ్వర్యంలో తమిళనాడు భగ్గున మండింది. నిజానికి కమ్యునల్ జివొ ను రూపొందించి అమలుచేయించింది 1928 లో పెరియారే. ఆ జివొ వల్ల ఎందరో అణగారిన కుటుంబాలకు చెందిన వారు ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందటం చూసి పెరియార్ ఎంతో సంతోషించేవారు. స్వాతంత్ర్యం వచ్చాకా తన సొంత రాష్ట్రంలో అప్పటికే సుమారు పాతికేళ్ళుగా అమలులో ఉన్న రిజర్వేషన్లు ఆగిపోవటం పట్ల పెరియార్ తీవ్రమైన ఆవేదన చెందారు.
యావత్ తమిళ ప్రపంచం అతని ఆవేదనను, ఆగ్రహాన్ని పంచుకొంది. రానున్న ప్రమాదాన్ని పసిగట్టింది. ఎక్కడికక్కడ ధర్నాలు, నిరసనలతో తమిళనాడు మొత్తం అట్టుడికి పోయింది. ప్రపంచంలో తమిళులు ఉన్న ప్రతీచోటా ఈ తీర్పు పట్ల వ్యతిరేకత పెల్లుబికింది.
సమాన హక్కు పేరుతో అణగారిన వర్గాలు ఇతరులతో సమానం అయ్యే హక్కును కాలరాస్తున్న రాజ్యాంగంపట్ల తన నిరసనను తెలియచేసాడు పెరియార్.
 
పెరియార్ చేస్తున్న ఉద్యమంవెనుక ఉద్దేశాలను, రాజ్యాంగం వల్ల ఏర్పడిన చిక్కుముడిని అర్ధం చేసుకొన్న జవహర్ లాల్ నెహ్రూ ఆనాటి లా మినిస్టర్ డా. బి. ఆర్. అంబేద్కర్ ను పిలిచి రాజ్యాంగంలోని 15 వ ఆర్టికిల్ వల్ల కలుగుతున్న ఇబ్బందులను సవరించే ప్రక్రియ చేపట్టవలసినదిగా కోరాడు.
 
నెహ్రూ సూచన మేరకు డా. బి.ఆర్ అంబేద్కర్ 15 వ ఆర్టికిల్ లోకి 15(4) పేరుతో ఒక సవరణ ప్రతిపాదించారు. ఇది రాజ్యాంగానికి చేసిన తొలి సవరణగా చరిత్రకు ఎక్కింది. (దీనితో పాటు మరొక రెండు కూడా ఉన్నాయి)

ఈ సవరణ “దేశప్రజలందరూ సమానమే. అణగారిన వర్గాలను ఇతర వర్గాలతో సమానం చేసే కార్యక్రమాలలో మాత్రం ఈ అందరూ సమానమే అనే క్లాజు వర్తించదు” అని చెబుతుంది.
ఈ 15(4) ఆర్టికిల్ సవరణ ప్రతిపాదించే సందర్భంగా జరిగిన పార్లమెంటు డిబేట్స్ లో ఈ బిల్లును సమర్ధిస్తూ ఇలా మాట్లాడారు.
 
జవహర్ లాల్ నెహ్రూ: అనేక కారణాల వల్ల ఇప్పుడు ఉన్న తరాన్ని నిందించలేం. ముందు తరాలకి బాధ్యత ఉంది. అనేకమంది ప్రజలు ఆర్ధికంగా, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడి ఉన్నారు. కొంతమంది ఒక విషయంలో ముందు ఉన్నా అనేక విషయాలలో వెనుకబడి ఉన్నారు. ఈ నేపథ్యంలో వెనుకబడిన వారిని మనం ప్రోత్సహించాలి. వారికొరకు ప్రత్యేకంగా ఏదైనా చెయ్యాలి.
 
ఎవరో ఒక పెద్దమనిషి అంటున్నాడు- “భారతదేశంలో 80% మంది వెనుకబడిన వారే. ఎంతమందినని ప్రోత్సహిస్తారు?” అని. 80% మంది స్థితి అలా ఉంటే ఏమీ చెయ్యకుండా వారిని అలాగే ఉంచటం పరిష్కారం కాదుకదా?. వారికి అవకాశాలు కల్పించాలి- ఆర్ధిక అవకాశాలు, విద్యా అవకాశాలు లాంటివి. ఎదగనివ్వాలి వారిని.

డా. బి.ఆర్. అంబేద్కర్: ఒక జడ్జ్ ఇచ్చిన తీర్పును పాటించటానికి బద్దుడను కానీ దానిని గౌరవించటానికి బద్దుడను కాను. ఒక కులానికో/సమూహానికో రిజర్వేషన్లు ఇచ్చినపుడు, అది దక్కనివారు మరొక కులానికో సమూహానికో చెందినవారై ఉంటారనేది సత్యం. ఈ దేశంలో కొంతమంది ప్రజలను మినహాయించకుండా రిజర్వేషన్లు ఇవ్వటం సాధ్యం కాదు.
 
***

1951 జూన్ లో రాజ్యాంగానికి చేసిన 15(4) సవరణ వల్ల రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వెనుకబడిన బలహీనవర్గాలవారికి రిజర్వేషన్లు ఇచ్చే వెసులుబాటు కలిగింది.
 
ఈ సవరణే చేయకపోతే భారతదేశంలో చంపకం దొరైరాజన్ (1951) సుప్రీమ్ కోర్టు తీర్పు ప్రకారం ఏనాటికీ వెనుకబడిన వారికి రిజర్వేషన్లు ఉండకపోయేవి.

అలాజరగకుండా చూసిన పెరియార్, నెహ్రూ, డా. అంబేద్కర్ లు చిరస్మరణీయులు.
ఈ రోజు సనాతన వాదులు నరనరాన విషం నింపుకొని వీరిని నిత్యం దూషించటానికి ఉండే చాలా కారణాలలో ఆఘమేఘాలమీద చేయించిన పై రాజ్యాంగ సవరణ ఒకటి.
 
దానికి కారణమైన పెరియార్ పై రాజ్యాంగాన్ని తగలపెట్టాడని, కూతురిని పెళ్ళిచేసుకొన్నాడని లాంటి వికృతమైన అభియోగాలు చేస్తారు వీళ్ళు. పెరియార్ రాజ్యాంగంలోని కొన్ని సెక్షన్లని తగలపెట్టటం నిజమే. ఇది రాజ్యాంగం వలన కలుగుతున్న ఇబ్బందులను తెలియచెప్పటానికి చేసిన ధిక్కారం. దానికి జైలు శిక్ష కూడా అనుభవించారు పెరియార్.
 
ఇక కూతుర్ని పెళ్ళి చేసుకొన్నాడనేది అసత్యం. పెరియార్ కి 54 ఏళ్ళ వయసులో మొదటిభార్య మరణించింది (1933). విలువైన ఆస్తులు అన్యాక్రాంతం కాకూడదని, తన ఉద్యమం ఆగిపోకూడదని 1948 లో తన 68 వ ఏట పెరియార్, పార్టీ కార్యకర్తగా ఉన్న పొన్నియమ్మ అనే ముప్పై ఏండ్ల వయసు కల ఒక మహిళను పెండ్లాడాడు.

ఈమె పెరియార్ కన్నా వయసులో చిన్నదే తప్ప పెరియార్ కూతురూ కాదు, మనవరాలూ కాదు. ఒక సాధారణ పార్టీ కార్యకర్త. ఈమె పాతికేళ్ళ వయసులో పెరియార్ బాగోగులు చూసేందుకు పార్టీ పరంగా నియమించబడిన కార్యకర్త. ఈమెకు ఏ రకంగాను పెరియార్ తో చుట్టరికం లేదు.
పెరియార్ హిందూమతాన్ని జీవితపర్యంతమూ చాలా తీవ్రంగా విమర్శిస్తూనే ఉన్నాడు. కనుక సనాతన వాదులు కచ్చగట్టి పెరియార్ సొంత కూతురునినే పెండ్లాడాడు అని దుష్ప్రచారం చేస్తున్నారు. నిజానికి పెరియార్ కు సంతానమే లేదు. పెరియార్ సంపన్నుడు. ఆయన ఆస్థుల రక్షణ కొరకు, పార్టీ పురోగతికొరకు పొన్నియమ్మను పెండ్లి చేసుకొన్నాడు. అప్పట్లో అడాప్షన్ చట్టం లేదు. ఒక స్త్రీకి ఆస్తి ఇవ్వాలంటే భార్య మాత్రమే అర్హురాలు. లీగల్ కారణాలతో పెరియార్ 69 ఏండ్ల వయసులో 30 ఏండ్ల పొన్నియమ్మను పెండ్లిచేసుకోవలసి వచ్చింది.
 
శ్రీమతి పొన్నియమ్మ 1973 లో పెరియార్ మరణానంతరం పెరియార్ స్థాపించిన ద్రవిడ కజగం అనే పార్టీని చనిపోయే వరకూ నడిపించారు. పెరియార్ ద్వారా సంక్రమించిన ఆస్తులతో స్కూళ్ళను, అనాధాశ్రమాలను స్థాపించారు. 1978 లో శ్రీమతి పొన్నియమ్మ మరణించారు. చిల్లర డబ్బుల కొరకు నీతి లేని వాట్సాప్ సనాతన వాదులు పెరియార్ సొంత కూతుర్నే పెళ్లి చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నారు. ఇది హేయం.

బొల్లోజు బాబా



ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా - ముందుమాట

ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా పుస్తకానికి నేను రాసుకొన్న ముందుమాట ఇది. నిజానికి ప్రముఖ చరిత్రకారుడు శ్రీ కూచిభొట్ల కామేశ్వర రావుగారిని ఈ పుస్తకానికి ముందుమాట రాయమని అడిగి, పట్టణాల ఆవిర్భావం గురించి మీ మాటలో ప్రస్తావించండి అని కోరాను. అప్పటికే తీవ్ర అనారోగ్యకారణాలవల్ల కొన్ని ఆశీస్సులు మాత్రమే ఫోన్ లో డిక్టేట్ చేసారు.
ఆ కారణంగా, అర్బనైజేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో నేనే నా మనవిమాటలలో వివరించాను. ఈ వ్యాసం నాకెంతో ఇష్టమైనది. నిన్నచదివితే ఇంకా తాజాగానే అనిపించింది. కవర్ పేజ్ పై ఉన్నది ద్రాక్షారామ ఆలయాన్ని నిర్మించిన చాళుక్యభీముడు. బాక్ డ్రాప్ లో బిక్కవోలులో శంకోలు ధరించిన శివుడు.

ఈ పుస్తకం ఇప్పడు రెండో ముద్రణలో ఉంది. కావలసిన వారు, పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి.నారాయణ గారిని, ఫోన్ నంబరు. 9866115655 లో సంప్రదించగలరు.
 
బొల్లోజు బాబా


ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా

మనవి మాటలు

వ్యవసాయంద్వారా ఆహారోత్పత్తుల మిగులు ఏర్పడ్డాక ప్రజలు ఒక చోట స్థిరంగా నివసించటానికి మొగ్గుచూపారు. జీవించటానికి అనువుగా ఉంటూ రాజకీయ, ఆర్ధిక, మతపరమైన ప్రాధాన్యత కలిగిన జనావాస ప్రాంతాలు క్రమేపీ పట్టణాలుగా రూపుదిద్దుకొన్నాయి. మెగస్తనీస్‌ ఆంధ్రులకు ప్రాకారాలు కలిగిన ముప్పై పట్టణాలు ఉన్నాయని చెప్పాడు. ఇవి ఎక్కడెక్కడ ఉండేవో నేడు గుర్తించటానికి ఏ రకమైన ఆధారాలు లభించవు.
 
శాసనాలలో జనసాంద్రత కలిగిన ప్రాంతాలు - నగర, పుర, పట్టణ అనే మూడురకాల పేర్లతో చెప్పబడ్డాయి. పర్వతాలవంటి భవనాలతో, వ్యాపార కార్యకలాపాలు ఎక్కువగా జరిగే ఊరును ‘‘నగరము” అని; తీరప్రాంతంలో ఉండే రేవుస్థలాన్ని ‘‘పట్టణము” అని; బలమైన కోటను కలిగి ఉన్న ఊరుని ‘‘పురము” అని చరిత్రకారులు నిర్వచించారు. పిఠాపురం, రాజమహేంద్రవరం లలో బలమైన కోటలు ఉండేవి కనుక వాటికి పిష్టపురి, జననాథపురం అనే పేర్లు ఉన్నాయని ఊహించవచ్చు కానీ ఈ విభజనను అంత ఖచ్చితంగా పాటించినట్లు కనిపించదు. రాజమహేంద్ర పట్టణం (EI Vol 5 p.32), పిఠా పట్టణం (శ్రీనాథుని పద్యం) లాంటి ప్రయోగాలు కూడా ఉండటం గమనార్హం.
 
ఒక ప్రాంతంలో ఏమేరకు పట్టణీకరణ జరిగిందో అనేది అది ఆ ప్రాంతపు రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక అభివృద్ధికి, నాగరికతకు సూచిక. ఆయా పట్టణాల ఉత్థానపతనాలు ఆ ప్రాంత చరిత్రకు అద్దంపడతాయి.
 
భౌగోళికంగా వివిధ ప్రాంతాలను కలిపే రహదారులు; అన్ని వృత్తుల వారికి అవకాశాలు; ఆర్ధిక వ్యవస్థను నడిపించే ఏదైన ఒక ప్రముఖ దేవాలయం; ఓడరేవుల ద్వారా విదేశీ వ్యాపారం;ప్రజలకు రక్షణ; భిన్నమతాల మధ్య సహిష్ణుత; రాజకీయ ప్రాధాన్యత కలిగి ఉండటం- లాంటివి పట్టణీకరణకు దోహదపడే అంశాలు.
 
తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పట్టణీకరణపై ఆథ్యాత్మిక కేంద్రాల ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ప్రాచీన కాలంలో ఆలయాలు సమాజంలో Money Circulate చేసే ఆర్దిక కేంద్రాలు. ఇవి గ్రామీణ ఎకానమీని అర్బన్‌ ఎకానమీని అనుసంధానం చేసేవి. దేవుని పేరుమీద జరిగే ఈ తతంగంలో అప్పటి సమాజంలోని దాదాపు అన్ని సామాజిక వర్గాలకు ఏదోఒక పాత్ర ఇవ్వబడింది.
జిల్లాలో ప్రాచీన చరిత్ర కలిగిన ద్రాక్షారామ, సామర్లకోట, సర్పవరం, పిఠాపురం, బిక్కవోలు, పలివెల లో నెలకొని ఉన్న వివిధ ఆలయాలు ఆయా ప్రాంతాలు అభివృద్ధిచెందటానికి సహాయపడ్డాయి. బౌద్ధ, జైన మతాలకు సంబంధించి జిల్లాలో అనేక చోట్ల భారీ అవశేషాలు లభిస్తూండటాన్ని బట్టి ఈ ప్రాంతం ఒకప్పుడు బౌద్ధ, జైన విశ్వాసులకు కూడా దర్శనీయస్థలంగా ఉండేదని భావించవచ్చు. ఒక ప్రాంతంలో నెలకొన్న ఆథ్యాత్మిక కేంద్రం మతాలకు అతీతంగా ఆ ప్రాంత పట్టణీకరణ ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
 
ఆథ్యాత్మిక కేంద్రాల తరువాత జిల్లా పట్టణీకరణకు దోహదపడిన మరొక అంశం కోరంగి, ఆదుర్రు లాంటి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఓడరేవులు. పట్టణాలలో నివసించే వృత్తికారులు, వర్తకులు వివిధ వ్యాపార శ్రేణులుగా (Guilds) సంఘటితమై ఈ ఓడరేవుల ద్వారా పెద్దఎత్తున విదేశీ వ్యాపారం జరిపేవారు. కోరంగి ఓడరేవు మాత్రమే కాదు ఒకప్పటి గొప్ప నౌకానిర్మాణ కేంద్రం కూడా. పిఠాపురం కూడా ఒకనాటి ఓడరేవు కావొచ్చు అనే ఒక అభిప్రాయం ఉంది.
 
తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం కొంతకాలం కళింగరాజ్యానికి, రాజమహేంద్రవరం వేంగి రాజ్యానికి రాజధానులుగా ఉన్నాయి. అవికాక బిక్కవోలు, చాళుక్యభీమవరం, కోరుకొండ, కడలి, ముమ్మిడివరం, రంప లాంటి ప్రాంతాలు వివిధకాలాలలో రాజకీయ కేంద్రాలుగా ఉండటం వల్ల అవి పట్టణాలుగా మారి అభివృద్ధిపథంలో నడిచాయి.
 
వేంగి, కళింగ రాజ్యాలను కలిపే ప్రాచీన రహదారి జిల్లా లోని రామచంద్రపురం, బిక్కవోలు, పిఠాపురం, కొడవలి మీదుగా రామతీర్థం వైపు వెళుతుంది. ఇది సుమారు రెండువేల సంవత్సరాలనాటి జాతీయ రహదారి. ఆ విధంగా ఈ ప్రాంతం ఒకప్పటి ప్రముఖ ప్రాచీన రాజ్యాలతో అనుసంధానింపబడి ఉంది. ఈ లక్షణం కూడా పట్టణీకరణకు అనుకూలించే అంశము.
హిందు, బౌద్ధ, జైన విశ్వాసాలకు చెందిన అనేక ప్రాచీన క్షేత్రాలు జిల్లాలో కనిపిస్తాయి. బౌద్ధానికి సంబంధించి ఆదుర్రు, పిఠాపురం, గొల్లప్రోలు, కొడవలి, కాపవరం, తుని, రంపఎర్రంపాలెం, కోరుకొండ లాంటి ప్రాంతాలలో వివిధ భారీ బౌద్ధ అవశేషాలు లభిస్తున్నాయి. ఇవి ఆయా ప్రాంతాల ప్రాచీన ప్రాధాన్యతను నిరూపిస్తాయి. అదే విధంగా జిల్లాలో జల్లూరు, కాజులూరు, ఆర్యావటం, పిఠాపురం, బిక్కవోలు, తాటిపాక, రాజోలు, రామచంద్రపురం లాంటి ప్రాంతాలలో ఒకప్పుడు జైనమతం వెలసిల్లినట్లు నేడు అనేక విగ్రహాలు బయటపడుతున్నాయి.
 
ఈ భిన్న మతాలు ఒకనాడు సమాంతరంగా సహజీవనం చేసినట్లుకూడా అర్ధమౌతుంది. ప్రజలు భిన్నవిశ్వాసాలకు సహిష్ణుత కలిగి ఉండటం మానవ నాగరికత, సంస్కృతుల ఔన్నత్యానికి ఉత్తమోత్తమ నిదర్శనం.
***
ఈ పుస్తకంలో తూర్పుగోదావరికి చెందిన ప్రాచీనపట్టణాల చరిత్రను చెప్పటానికి ప్రయత్నించాను. దీనిలో హుయాన్‌ త్సాంగ్‌ పిఠాపుర సందర్శన, గుణగ విజయాదిత్యుని చారిత్రిక స్థానం, బిక్కవోలు ఆలయ శిల్ప సంపద, కోరంగి సాంస్కృతిక అంశాలు లాంటివి విశిష్టమైనవి అని తలుస్తాను.
నిజానికి ప్రాచీనపట్టణాలు అనే అంశం చాలా లోతైనది. ఎంత చదివినా తరగని మెటీరియల్‌ అందుబాటులో ఉంది. వాటిని శక్తిమేరకు క్రోడీకరిస్తూ, సులభంగా అందించాలని నేను చేసిన ప్రయత్నం ఇది. నేను విస్మరించిన లేదా నా దృష్టికి రాని అనేక అంశాలు మిగిలే ఉంటాయి అన్న స్పృహ నాకు ఎప్పుడూ ఉంటుంది.

భవదీయుడు
బొల్లోజు బాబా
అక్టోబరు 2021



Monday, October 21, 2024

One more comment ....

ఏమన్నా విమర్శిస్తే, మొదటి బాణం బ్రాహ్మణద్వేషం అనటం ఒక అనాది బ్లాక్ మెయిల్. ఒకె.
బ్రాహ్మణులపై ద్వేషం నాకెందుకు ఉంటుంది. వాళ్ళు కూడా నాకులాంటి మనుషులే కదా. నాది బ్రాహ్మనిజం పై అనంగీకారం.

నేను ప్రశ్నించింది హరనాథరావు గారిని కాదు. హరనాథరావు గారు చెబుతోన్న "గుణాన్ని/జ్ఞానాన్ని బట్టి ఎవరైనా బ్రాహ్మణుడు కావచ్చు" అనే ఐడియాని ప్రశ్నించాను.

హరనాథరావుగారితో నాకు పనిలేదు. ఆ ఐడియా మంచిది కాదు అని నమ్ముతాను. అది మన సమాజంలో బ్రాహ్మణులే అందరికన్నా పైన ఉండదగిన వారు, అబ్రాహ్మణులందరూ గుణం/జ్ఞానం లేనివారు అని, వారు బ్రాహ్మనుని కింద ఉండాలి అనే భావనను సమాజంలో పెంచిపోషిస్తుంది. దేన్నే బ్రాహ్మనిజం అంటారు. ఈ భావన ఒప్పుకోలేం.

ఇది హరనాథరావుగారికి అర్ధం కాకపోవచ్చు. అబ్రాహ్మణుడైన నాకు స్పష్టంగా తెలుస్తుంది.
వ్యక్తుల స్థాయి దాటి భావాల స్థాయిలో చర్చలు జరపండి. నాకు హరనాథరావు గారి పట్ల సాటిమనిషిపై ఉండే ప్రేమే ఉంది తప్ప ద్వేషం లేదు.


బొల్లోజు బాబా

Saturday, October 19, 2024

సనాతన ధర్మము - శూద్రులు


ఒక మిత్రుడు ఈ వాట్సప్ సందేశాన్ని పంపి దీనిపై వివరణ ఇవ్వమని అడిగాడు. నాకు తెలిసిన వివరణలు ఇవి. ఈ మెసేజ్ సారాంసం ఏమిటంటే శూద్రులు హిందూ ధర్మంలో గొప్ప మర్యాదలు పొందారు. వేదాలను అధ్యయనం చేసారు. వారిపై ఎక్కడా వివక్ష చూపినట్లు ఆధారాలు లేవు అంటూ శూద్ర ఋషులను, భక్తి సంప్రదాయ శూద్ర పంత్ లను కలగాబులగం చేసి వండిన వ్యాసం ఇది.
 
దీని వెనుక ఉద్దేశాలు ఏమిటంటే- ఈ రోజు సనాతన ధర్మం కావాలి అంటూ చేస్తున్న ప్రచారానికి హిందూ ధర్మం శూద్రులపట్ల వర్ణ వివక్ష చూపింది అనే ప్రధానమైన అభ్యంతరానికి సమాధానం చెప్పుకోవలసి వస్తున్నది. ఈ అంశానికి సమాధానంగా ఇదిగో చరిత్రలో ఈ ఈ శూద్రులు వేదాలను చదివి ఋషులయ్యారు అంటూ గొప్ప లిస్ట్ నొకదాన్ని ఇస్తున్నారు. ఏ రకమైన వివక్షా లేదని తీర్పులు ఇచ్చేస్తున్నారు.

నిజానికి పురాణాలలో శూద్ర ఋషుల వెనుక చాలా సందర్భాలలో బ్రాహ్మణ తండ్రి లేదా ఏదో దైవశక్తి ఉండటం గమనించవచ్చు. అది నిజమైన శూద్ర సమానత్వం అవ్వదు.
ముస్లిమ్ పాలన వచ్చాక వర్ణవ్యవస్థ సడలింది. బ్రిటిష్ పాలనలో పూర్తిగా చట్టవ్యతిరేకం అయ్యింది. సూఫీ వేదాంతం ప్రభావంతో శూద్ర వర్గాలు భక్తి సంప్రదాయాన్ని నిర్మించుకొన్నాయి. ఇది హిందూ ధర్మానికి ప్రతిగా నిలబెట్టిన ఆథ్యాత్మిక సంప్రదాయం. ఒకనాటి బౌద్ధ జైన మతాలతో దీనిని పోల్చవచ్చు.
 
ఇక చివరలో రొడ్డకొట్టుడు శ్లోకం పుట్టుకతో అందరూ శూద్రులే బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణులు అవుతారని గొప్ప రిఫరెన్స్ గా ఇచ్చారు. అదే సమయంలో ఈ వ్యాసంలోని వ్యక్తులు వేదాలు చదివారు బ్రహ్మజ్ఞానం పొందారు అంటూ ఒకపక్క మాట్లాడుతూ వారు బ్రాహ్మణులు అని చెప్పక శూద్రులు అని చెప్పటం- గొప్ప జోక్.
****

శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారు ... వేదాలు వింటే శూద్రుల చెవులలో సీసం పోశారు ... అంటూ విషప్రచారం చేస్తున్నారు.
వాస్తవానికి అసలు అటువంటి సంఘటనలు జరగకపోయినా బ్రిటీష్ చేసిన ప్రక్షిప్తాలను పట్టుకొని మెకాలే - మాక్స్ ముల్లర్ మానస పుత్రులు, పాశాంఢ ఎడారి మత మార్పిడి మాఫియాలు, వామపక్ష చరిత్రకారులు, రచయితలు కల్పించి రాసిన తప్పుడు రాతలను చూపించి ఇప్పటికీ కొంతమంది "మా వంటి శూద్రులను (author of this article)" హిందూ ధర్మం నుండి దూరం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు.
అసలు చరిత్రలో ఎన్నడైనా శూద్రులు వేదాలు చదివితే నాలుకలు కోసారా...??? వేదాలు వింటే శూద్రుల చెవులలో సీసం పోశారా...???

వివరణ:హిందూ ధర్మశాస్త్రాలు శూద్రులను  బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాల వారికి సేవలు చేయాలని  చెప్పాయి. కాస్త చదువుకొంటే ఈ విషయాలు తెలుస్తాయి. ఈ ధర్మశాస్త్రాలను రాసింది క్రీపూ నుండి క్రీశ 6 వ శతాబ్దం మధ్య. అప్పటికి బ్రిటిష్ వారు లేరు, వామపక్ష చరిత్రకారులు లేరు. శూద్రుడు వేదాలు వింటే ఏం చెయ్యాలో హిందూ ధర్మశాస్త్రాలు ఇలా చెప్పాయి.
 
1. ద్విజుణ్ణి అవమానించిన శూద్రుని నాలుక కోసివేయాలి (మను 8.270)

2. కాత్యాయనుని ఆదేశాల ప్రకారం శూద్రుడు వేదాలను పొరపాటునగాని, పొంచి ఉండిగానీ విన్నట్లయితే అతని నాలుక రెండుగా చీల్చబడుతుంది. అతని చెవులలో సీసం పోయబడుతుంది.
3. శూద్రుడు ఉన్నతజాతికి ధర్మాన్ని ఉపదేశిస్తే రాజు వాడి నోట్లో, చెవిలో మండుచున్న నూనెను పోయించాలి (మను 8.272)

4. శూద్రుడు మతధర్మ సూత్రాలు బోధిస్తున్నా, వేదమంత్రాలు ఉచ్ఛాటన చేస్తున్నా బ్రాహ్మణున్ని అవమానిస్తున్నా అతనికి శిక్షగా నాలుక తెగనరికి వేయాలి (బృహస్ఫతి స్మృతి)

5. శూద్రుడెవరైనా ఉద్దేశపూర్వకంగా వేదమంత్రోచ్ఛాటనను ఆలకిస్తున్నట్లయితే అతని చెవుల్లో సీసంగాని, లక్క గాని కరిగించి పోయాలి, వేదపఠనం చేస్తున్నట్లయితే, అతని నాలుక కోసివేయాలి. వేదపాఠాన్ని స్ఫురణకు తెచ్చుకొంటున్నట్లయితే అతని శరీరాన్ని రెండుగా ఖండించాలి (గౌతమ ధర్మ సూత్రాలు)

6. శూద్రకులజులు ద్విజునిపై అసత్యారోపణ చేసినా, అవమానించినా, బ్రాహ్మణులకు వారి విధులకు సంబంధించి పాఠాలు చెప్పినా రాజోద్యోగులు వారి నాలుకలు కత్తిరింపచేయాలి. (నారద స్మృతి)

7. ఇక పై సూత్రాలు ఎప్పుడైనా సామాజికంగా అమలులో ఉన్నాయా అని ప్రశ్నిస్తారు కొందరు. నిన్నమొన్నటి వరకు ఉన్నాయి. పీష్వాల పాలనలో అబ్రాహ్మణుడు ఎవరైనా వేదమంత్రాలను పఠిస్తే వారి నాలుకలను కత్తిరించేవారు. ఈ చట్టాన్ని ధిక్కరించి వేదాలను ఉచ్ఛరించిన అనేకమంది కంసాలుల నాలుకలను కత్తిరించమని ఉత్తర్వులు ఇచ్చారు. ఈ బ్రాహ్మణులు కంసాలులు గొడవలు ఈస్ట్ ఇండియా కంపనీ ప్రెసిడెంటువద్దకు వచ్చినట్లు Resolution of Government Dated 28th July 1779 ద్వారా తెలుస్తున్నది.
 
ఇక సమకాలీనంగా జరిగిన కొన్ని వందల వర్ణ వివక్షా దాడుల ఉదాహరణలను న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లతో సహా డా. అంబేద్కర్, రచనలు ప్రసంగాలు సంపుటం 5 లో పొందుపరిచారు. వాదించటానికి కొంచెం చదువుకొని రావాలి.

పరమ పవిత్ర శ్రీమద్ రామాయణ మహా కావ్యాన్ని రచించిన బోయవాడు అయిన రత్నాకర పూర్వ నామం కలిగిన వాల్మీకి మహర్షుల వారు శూద్రుడు కాదా...???

వివరణ: మన వేదాలు ఇతిహాసాలు పురాణాలు అన్ని విదేశీ ఆర్యపండిత రాతలు. వీరు వచ్చి స్థానిక ద్రవిడ, నాగ జాతులను జయించి, వారిని శూద్రులు, అతిశూద్రులుగా (ఎస్సీ) విభజించి ఆధిపత్యం చలాయించారు. వేదాలు, పురాణాలు ఇతిహాసాలు ఆర్యపండిత ఆధిపత్యాన్ని స్థిరపరచే రాతలు. ఈ ప్రక్రియలో కొన్ని రాతలు వారే రాసుకొని అవి శూద్రుల, అతిశూద్రుల రాతలుగా ప్రచారం చేసారు.
చాలా సందర్భాలలో తండ్రి బ్రాహ్మణుడై ఉంటాడు. అలా ఇవి మీరాతలే, మీరు ఆర్యపండితుల ఆధిపత్యాన్ని అంగీకరించినట్లు మీరే రాసుకొన్నారు చూడండి అంటూ చెప్పటం ఒక రకమైన మార్కటింగ్ టెక్నిక్.
ఇక వాల్మీకి బ్రాహ్మణుడు.  పేర్లు, అగ్నిశర్మ/లోహ జంఘ. బోయ అని కల్పించారు..
 
మత్స్య గ్రంధికి జన్మించి పంచమ వేదం శ్రీమద్ భగవద్గీత, మహా భారతం వంటి పరమ పవిత్ర సనాతన గ్రంధాలను లిఖించిన కల్పి అనే పూర్వ నామం కలిగిన వ్యాస మహర్షుల వారు శూద్రుడు కాదా...??
 
వివరణ: వ్యాసుడు: బ్రాహ్మణ పరాశురుడికి జన్మించాడు. తాత బ్రాహ్మణ వశిష్టుడు. ఇతను శూద్ర స్త్రీకి పుట్టాడు. క్షేత్రబీజ ప్రాధాన్యతలను అనుసరించి ఇతను బ్రాహ్మణుడు. 
 
శూద్రునిగా పుట్టి దస్య కుమారుడు అయినా వేద జ్ఞానాన్ని ఆర్జించి రుషి అయి ఆత్రేయోపనిషత్తు, ఆత్రేయ బ్రాహ్మణమును రచించిన ఆత్రేయ ఋషి వారు శూద్రుడు కాదా...???

వివరణ: ఆత్రేయ కాదు ఐతరేయ. తల్లి దాసి. పేరు ఐతరేయ. ఆమెకు ఒక గొప్ప తపోసంపన్నుడైన ఋషివల్ల మహిదాసుడు అనే కొడుకు పుట్టాడు. ఇతనిని తండ్రి సరిగ్గా పోషించటం లేదని, ఐతరేయ భూదేవిని ప్రార్ధించగా భూదేవి ప్రత్యక్షమై ఐతరేయ మహిదాసకు గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించినట్లు, ఆ శక్తితో ఐతరేయ మహిదాసు ఐతరేయ బ్రాహ్మణాన్ని రచించినట్లు – ఒక కథనం. ఇందులో దైవశక్తి చెప్పబడింది.

పుట్టుకతో శూద్రునిగా జూదగానికి పుట్టినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషిగానే కాదు ఆచార్యులుగా ప్రఖ్యాతి గాంచిన ఐలశు ఋషి వారు శూద్రుడు కాదా...???

వివరణ: కవశ ఐలూశ అనే ఋషి దాసికి జన్మించాడు. ఒక రోజు బృగు, అంగీరసుడులు యజ్ఞం చేస్తుండగా ఐలూశు డు వచ్చి వారి సరసన కూర్చున్నందుకు ఆ బ్రాహ్మణులు ఇతనిని తక్కువ కులజుడివని దూషించి, ఒక నీరు దొరకని ఎడారిలోకి తరిమేసారు. అక్కడ ఇతనికి సరస్వతి కటాక్షం లభించింది. సరస్వతి నది ఇతని వెంటే నడిచింది. ఆ మహిమకు బ్రాహ్మణులు ఆశ్చర్యపోయి ఇతనిని ఋషిగా అంగీకరించారు. ఈ కథలో దైవశక్తి చెప్పబడింది తప్ప బ్రాహ్మణులు శూద్రులను సోదరభావంతో స్వీకరించినట్లు చెప్పబడలేదు.

శూద్రురాలికి పుట్టిన జాబల కుమారుడైన సత్యాకాం వేద సారాలను గ్రహించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, గురు విధేయతతో గౌతమ మహర్షుల వారినే మెప్పించిన సత్యాకాం, జాబల మహర్షుల వారు శూద్రుడు కాదా..???

వివరణ: దాసి అయిన జాబాలి కొడుకు సత్యకామ.  జాబాలి ఇతనిని హరిద్రుమతుడు అనే గురువు వద్దకు విద్యనేర్చుకొనేందుకు పంపుతుంది. ఉపనయనయనం చేసే ఉద్దేశంతో అతని కులగోత్రములు అడుగగా, నాకు తెలియవు అంటుంది తల్లి. ఆ గురువు దివ్య దృష్టితో అతని జన్మను తెలుసుకొని గాయత్రిమంత్రం ఉపదేశిస్తాడు.

జాబాలి పై దయతో గౌతముడు అనేబ్రాహ్మణుడు అతనికి బ్రాహ్మణ హోదా ఇస్తాడు తప్ప స్వంతంగా/పోరాడి గడించుకొన్నది కాదు. దీన్ని బ్రాహ్మణాధిక్యతగానే చూడాలి.

శూద్రురాలికి పుట్టినా కూడా వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతి గాంచిన బ్రహ్మర్షి మాతంగి మహర్షుల వారు శూద్రుడు కాదా. ??

వివరణ: మతంగుడు మూల వాసి. ఇతను నాస్తికుడు, ఋషి. ఇతని ఆలోచనలు ఆర్యధర్మానికి భిన్నమైనవి. ఇతను అందరూ మైత్రీభావనతో మెలగాలని చెప్పేవాడు. వేదబాహ్యుడు. అయినప్పటికీ ఇతనిని ఆర్యబ్రాహ్మణులు హిందూ ధర్మంలోని ఋషిగా ప్రచారించుకొన్నారు. ఇతనికి ఆశ్రమాలు కలవు. ఇతని కుమారుడు కపిలుడు. యోగసాంఖ్యశాస్త్రకర్త. మతంగుడే నేటి పంచమవర్ణానికి ఆదిపురుషుడుగా చెబుతారు.

బ్రాహ్మణ అగస్త్యుడు దక్షిణానికి వచ్చి తన శిష్యులతో ఆశ్రమాలు ఏర్పరచుకొనే క్రమంలో అప్పటికే ఇక్కడ ఉన్న మతంగుని ఆశ్రమాలను ఆక్రమించుకోగా, మతంగుడు మరొక చోటుకు తరలిపోవలసి వచ్చిందని ఒక కథనం కలదు.

పుట్టుకతో శూద్రురాలి కుమారుడైనా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఖ్యాతి గాంచిన విదురుడు హస్తినాపుర రాజ్యంలో మంత్రిగా సేవలు అందించాడు.ఇతడు శూద్రుడు కాదా.???

వివరణ: సంతానం కొరకు అంబ ను వ్యాసునితో సంభోగించటానికి వెళ్లమంటే, వ్యాసుని గడ్డాలు చూసి ఇష్టపడక, అంబ ఒక దాసిని పంపుతుంది. అలా బ్రాహ్మణ మూలాలు కలిగిన వ్యాసుడి కి దాసికి పుట్టిన సంతానం విదురుడు. ఇతను శూద్రుడు కాదు. క్షేత్రబీజ ప్రాధాన్యతలను బట్టి బ్రాహ్మణుడే.

పుట్టుకతో శూద్రుడు అయిన వత్సుడు గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషివత్స గా ప్రఖ్యాతిగాంచలేదా...? వీరు శూద్రుడు కాదా...??? Ref:-(ఆత్రేయ బ్రాహ్మణము - 2.19)

వివరణ: వత్సుడిని అతని సోదరుడే నువ్వు శూద్ర స్త్రీకి పుట్టావు అని నిందించగా, కాదు నేను బ్రాహ్మణుడినే అని వాదించి అగ్నిప్రవేశం చేసి తన దోషాన్ని తొలగించుకొన్నాడు. ( మను 8-116). కనుక ఇతను బ్రాహ్మణుడు.

శూద్రునికి జన్మించినప్పటికీ అద్భుత మేధో సంపత్తి, బ్రహ్మ జ్ఞానంతో ఋగ్వేదంనందలి కొన్ని ఋక్కులకు కర్తయై బ్రాహ్మణత్వం పొందిన "కవష ఐలుషుడు" శూద్రుడు కాదా...???

వివరణ: కవశ ఐలుషుని గురించి ఇదివరకే పైన చెప్పటం జరిగింది. ఈ పాయింటు రిపీట్ అయింది. బ్రాహ్మణత్వం పొందాడు అని చెబుతూ మరలా చివర్లో శూద్రుడు కాదా అని ప్రశ్నిస్తారెందుకు?   అంటే........

సాక్షాత్తు శ్రీ కృష్ణ పరమాత్ముడు శూద్రులు అయిన గొల్ల వారి ఇంట్లో పెరిగాడు యశోదమ్మకి మాతృ ప్రేమని పంచాడు !! ఎవరిని ఎవరికి బానిసలుగా చూడమని ఎక్కడ కూడా చెప్పలేదు.

వివరణ: కృష్ణుని పాత్రద్వారా  మనుస్మృతిలోని వర్ణవిభజనను ఆర్యపండితులు చెప్పించారు- నేనే నాలుగు వర్ణాలను సృష్టించాను. వాటికి ధర్మాలు నిర్ణయించాను. స్వధర్మమే పాటించాలి వీడరాదు అని చెబుతాడు గీతలో. అంటే శూద్రుడు జీవితాంతం శూద్రుడిగానే ఉంటూ పై మూడు వర్ణాలకు సేవలు చేసుకోవాలని అర్ధం. మీ శూద్రులలో ఒకడే ఇలా చెప్పాడు అని ఆ పాత్రతో చెప్పించటం, అందరినీ ఒప్పించే ప్రక్రియ. Manufacturing of opinion అని చెప్పొచ్చు.

మహర్షులకి కూడా దక్కని శ్రీరాముడి ఆలింగనం నిమ్న జాతివాడుగా భావించబడే పల్లెకారుడు (మత్స్యకారుడు) గుహుడికి దక్కింది. ఆనాడు అంత తేడాలు ఉంటే మరి శ్రీ రాముడికి పల్లెకారుడితో స్నేహం ఎలా ఉంటుంది..? మరి గుహుడు శూద్రుడు కాదా...???

వివరణ: గుహుడు కిరాతరాజు. ఇతను మతంగుని వలె మూలనివాసి. స్థానికుడు. ఆర్యులు దక్షిణాపథానికి వచ్చే క్రమంలో అనేక స్థానిక రాజులతో సంబంధాలు పెట్టుకొన్నారు. వారిలో గుహుడు ఒకడు. ఇతను ఆర్యులవైపు ఉన్నాడు కనుక అస్మదీయుడయ్యాడు. ఆర్యపండితులకు వ్యతిరేకంగా ఉండిన వారిని అవతారాలు ఎత్తి మరీ సంహరించినట్లు కథలు కథలుగా పురాణాలు రాసుకొన్నారు.

అద్భుతమైన వేద జ్ఞానంతో, సుమధుర గానంతో సాక్ష్యాత్ ఆ శ్రీరామచంద్రుల వారికే తన ఎంగిలి ఫలాన్ని తినిపించిన శబరి శూద్రురాలు కాదా...???

వివరణ: శబరి మాతంగ ఆశ్రమవాసి. మూల నివాసి. ఆర్య సంస్కృతికి వెలుపలి వ్యక్తి. ఆర్యులను ఆహ్వానించింది కనుక ఆర్య సాహిత్యంలో చోటు దక్కించుకోగలిగింది.

స్వయంగా కవి పండితుడు, సాహితీ సమరాంగణ సార్వభౌముడు, వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి భోజుడిగా ప్రఖ్యాతుడు అయిన శ్రీ కృష్ణ దేవరాయలు వారు శూద్రుడు కాదా...???

వివరణ: అతను రాజు. హిందూ ధర్మం ప్రకారం శూద్రరాజులు పట్టాభిషేకసమయంలో సువర్ణగర్భ యాగం చేసి దండిగా సువర్ణాన్ని పండితులకు దానం ఇస్తేనే అతనికి పాలించే అర్హత వస్తుంది. శూద్ర శివాజీని కొందరు పండితులు ఈ క్రతువు చేయటానికి నిరాకరించగా, భారీ ఎత్తు ధనాన్ని ఇచ్చి పట్టాభిషిక్తుడయినట్లు చరిత్ర చెబుతుంది. రాజు శూద్రుడైనా king maker గా బ్రాహ్మణుడు ఉండటం జన్మ ఆధారిత వర్ణ వ్యవస్థ వేసిన మాస్టర్ ప్లాన్.

అఖండ భారతాన్ని అప్రతిహతంగా పాలించిన, ముర అనే శూద్ర మహిళకు జన్మించినా వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగినచంద్రగుప్త మౌర్య శూద్రుడు కాదా...???

వివరణ: చూడుడు పై పాయింటు వివరణ. నిజానికి మౌర్య సామ్రాజ్యాన్ని పతనం చేసి నిర్మించిన ఇతర సామ్రాజ్యాలేవి అంతటి విశాలమైనవి, అఖండ భారతాన్ని పాలించినవి కావు
.
మట్టిబొమ్మలను మహారణానికి జట్టునడిపిన శాలివాహనుడు కుమ్మరివృత్తికి చెందినవాడు. మరి ఆయన శూద్రుడు కాదా...???

వివరణ: చూడుడు పై పాయింటు వివరణ

విశ్వ కర్మలలో 6 తెగలు ఉన్నాయి. వడ్రంగి, కంసాలి మొదలైనవి వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. మంగలులను నాయీ బ్రాహ్మణులు అంటారు, వారిలో కూడా యజ్ఞోపవీతాన్ని ధరించేవారు ఉన్నారు. ఇక కుమ్మరులు వీరిలో యజ్ఞోపవీతాన్ని ధరించే సంప్రదాయం ఉంది. ఇక మాదిగలలో వారికి ప్రత్యేక పురోహిత వర్గం ఉంది. వారు యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు. వీరిలో అనేక లక్షల మంది వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానం కలిగి పౌరోహిత్యం చేస్తున్నారు. మరి వీరందరూ శూద్రులు కాదా...???

వివరణ: అవును నిజమే. అన్నీ ఉన్నాయి. శూద్రజంధ్యధారులు చరిత్రలో ఎంతో పోరాటం చేసి ఉపనయన హక్కును నిలుపుకొన్నారు (ఆర్యపండితులు ఉపనయనాన్ని మూడు వర్ణాలకే పరిమితం చేయకముందు అన్ని వర్ణాలవారు, స్త్రీలతో సహా అందరకు ఉపనయన హక్కు ఉండేది). ఇది గొప్ప విషయం. శూద్రజంద్య ధారులు ఆలయ గర్భగుడిలో ప్రవేశించి మూల మూర్తిని అర్ఛించే అర్హత కలిగిన నాడు వీరు బ్రాహ్మణ జంద్యధారులతో సమానం అవగలరు అనే సూక్ష్మవిషయాన్ని గ్రహించాలి. ఇలాంటి సన్నివేశం ఇటీవలి తంగలాన్ సినిమాలో ఉంది.

వేద కాలంలో పుట్టుకతో శూద్ర కుటుంబంలో పుట్టినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఋషిగా మారి, జనశృతి పౌత్రయణ జరిపిన రైక్వ ఋషి వారు శూద్రుడు కాదా...???

వివరణ: రైక్వ ఋషి, జన శృతి అనే శూద్రరాజు వద్ద బహుమతులు గ్రహించి అతనికి విద్యలు నేర్పినట్టు చాంధోగ్య ఉపనిషత్ లో ఉన్నది. ఆకాలంలో జైన బౌద్ధాలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. జైన బౌద్ధాలలో శూద్ర బ్రాహ్మణ బేధాలు లేవు. రైక్వ ఋషి జైనుడో బౌద్ధుడో అయ్యే అవకాశం ఎలా కాదనగలరు?

కుమ్మరి వృత్తి చేసేవారి కుటుంబంలో జన్మించినా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో, భక్తితో, మెప్పించిన భక్త తుకారాం శూద్రుడు కాదా

వివరణ: 12 వ శతాబ్దం నుంచి భారతదేశంలో వ్యవస్థీకృత ముస్లిం పాలన మొదలైంది. వైదిక విద్యను స్థానంలో క్రమేపీ ఇస్లామిక్ విద్య రాసాగింది. ఇది అంతవరకూ సమాజంలో బిగుసుకుపోయి ఉన్న వర్ణ వ్యవస్థను బద్దలు కొట్టింది. ఎంతో మంది శూద్రులు విద్యనభ్యసించసాగారు. పెర్షియన్ భాషలో విద్యాబోధన సాగింది.

ముస్లిమ్ పాలకులు స్థానిక ప్రజల మతపరమైన విశ్వాసాలను గౌరవించారు. బాబర్ కాలంనుంచి ముఘల్ పాలకులు సంస్కృత పండితులను చేరదీసారు. హుమాయున్ అక్బర్ లు పరమతసహనానికి నమూనాగా నిలిచాడు. జహంగీర్, షాజహాన్ లు కూడా అదే బాటలో నడిచారు.
హజ్రత్ నిజాముద్దిన్ ఔలియా (13 వ శతాబ్దం), షా ఇనాయతుల్ల (17 వ శతాబ్దం) లాంటి సూఫీ సన్యాసులు హిందూ ముస్లిమ్ ఐక్యతను బోధించారు. నానక్ సాహెబ్ దాదు దయాల్, బుల్లా సాహెబ్, తులసి సాహెబ్ లాంటి మహనీయులు హిందూ ముస్లిమ్ ఐక్యతకు కృషిచేసారు.

ఈ నేపథ్యంలోంచే భక్తి ఉద్యమం మొదలైంది.ఈ భక్తి ఉద్యమం ఇస్లామ్ మతంలోని ఎకేశ్వరోపాశన నుండి ప్రేరణ పొందింది. హిందు మత లక్షణాలైన కులమతాల వివక్ష లేదు, సంస్కృతం బోధనా భాష కాదు. స్థానిక భాషలలో కీర్తనలు రాసుకొన్నారు ఈ భక్తి కవులు. దేవుని చేరుకోవటానికి మధ్యలో పూజారి అవసరంలేదు. పూజలు, క్రతువులు, యజ్ఞాలు యాగాలు అవసరం లేదు. హిందూ ధార్మిక గ్రంథాలైన వేదాలు, పురాణాలు, ఇతిహాసాల ప్రస్తావన లేదు. ఉత్త భక్తి తో ఎవరైనా దేవుడిని చేరుకోవచ్చు అని చేసిన ఉద్యమమే భక్తి ఉద్యమం. దీనిని నడిపించింది శూద్రులు, ముస్లిము సూఫీలు. ఇది పరమతసహనానికి సూచనగా నిలిచింది.

క్రతువులు, వేదాలు, పురాణాలు, సంస్కృతం, వర్ణవ్యవస్థ, యజ్ఞాలు, పూజారులు ఉండే సనాతన ధర్మానికి భక్తి ఉద్యమానికి అసలు సంబంధమే లేదు. ఈ రోజుకీ ఈ భక్తి ఉద్యమంలోని సంత్ (భక్తి ఉద్యమ నిర్మాతలు) లను వారు శూద్రులని హిందూ పీఠాధిపతులు గుర్తించరు

ఈ వ్యాసంలో తుకారం, నారాయణ గురు, కబీరు, రవి దాస్, మీరాభాయ్, సంత్ ఘాసి దాస్ లాంటి వారిని హిందూమతం ఉత్పత్తి చేసిన శూద్ర ఋషులుగా చెప్పటం వక్రీకరణ. వారు హిందూ ధార్మికతను ధిక్కరించి, వెలుపలకి వచ్చి ఒక ఉద్యమాన్ని నడిపిన గొప్ప సామాజిక సంస్కర్తలు. అంతేకాక మరికొందరు ఋషులు జైన మతానికి చెందినవారు కూడా కావొచ్చు. ఎందుకంటే దాదాపు 15 శతాబ్దం వరకూ జైనం మనుగడలో ఉంది. వారిని హిందూ ఋషులుగా అప్రాప్రియేట్ చేసుకోవటం లోతుతక్కువ వాదన.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానంతో ఋషిగా మారిన ఋషి నారాయణగురు వారు శూద్రుడు కాదా...???

వివరణ: ఇతను బ్రిటిష్ ఇండియాలో 19 వ శతాబ్దపు సంఘ సంస్కర్త. శూద్రుడు. కేరళాలో హిందూ మతంలోని కులవ్యవస్థపై, బ్రాహ్మణాధిక్యతపై పోరాడిన వీరుడు.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన కబీర్_దాస్ శూద్రుడు కాదా...???

వివరణ: 15 వ శతాబ్దపు ముస్లిమ్ పాలనలో కబీర్ దాస్ ఒక భక్తి ఉద్యమకారుడు. ఇతనిపై సూఫీల ప్రభావం ఉంది. ఇతను ఇస్లామ్ మతాన్ని స్వీకరించాడు. ఇతనిని ఇప్పటికీ హిందూముస్లిములు సమానంగా ఆదరిస్తారు. హిందూ బ్రాహ్మణులు కబీర్ ను ఎన్నో కష్టాలపాలు చేసినట్లు అనేక కథలు కలవు.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో బెంగాలీ మహారాజు లక్ష్మణ్ సేన్ కు రాజగురువుగా ఎనలేని సేవలు అందించిన ఋషి ధోయి శూద్రుడు కాదా...???

వివరణ: థోయి 12 వ శతాబ్దానికి చెందిన కవి. పావన దూత అనే కావ్యాన్ని రచించాడు. హిందుఋషా కాదా చెప్పలేం.

శూద్రునిగా పుట్టినా కూడా కళంగినథార్ శిష్యరికంలో వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానంకలిగిన తమిళ బోగర్ చైనా దేశం వెళ్లి హిందూ ధర్మ ప్రచారం చేశారు. మరి ఈయన శూద్రుడు కాదా...???

వివరణ: సిద్ధవైద్యం తెలిసిన తమిళ వ్యక్తి. పురాణ వ్యక్తి. చారిత్రిక వివరాలు తెలియరావు. క్రీపూ 3000 కి చెందిన వ్యక్తి అంటారు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్ ?

మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో 63 శైవ నాయనార్లలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "ఆదిపట్టన్" శూద్రుడు కాదా...???

వివరణ: చోళులకాలంలో నివసించిన శైవభక్తుడు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్ ?

కళింగ రాజ్యాన గోవులు కాసే వారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, కలిగిన "అచ్యుతానంద" శూద్రుడు కాదా...???

వివరణ: అత్యుతానంద దాస. 16 వ శతాబ్దం. ముస్లిమ్ పాలనలో జీవించాదు. ఇతను గోకాపరుల కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు. తండ్రి Dinabandhu Mohanty. ఇతను కరణాలు. లేఖన వృత్తి.

కళింగ రాజ్యాన కాటికాపరి వృత్తి చేసేవారి ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ఐదుగురు పంచసఖాలలో ఒకరిగా ప్రఖ్యాతి చెందిన "బలరాం దాస్" శూద్రుడు కాదా...???

వివరణ: బలరామ్ దాస్ 16 వ శతాబ్దం. ముస్లిమ్ పాలనలో జీవించాడు. వీరు కాటికాపరి వృత్తి కాదు. తండ్రి Somanatha Mahapatra. ఇతను కరణాలు. వీరు సంపన్నులు.

కళింగ రాజ్యాన మత్స్యకారుల కుటుంబంలో పుట్టిన కూడా అద్భుతమైన జ్ఞానం, వేద పఠనం, గొప్ప బ్రహ్మ జ్ఞానంతో ఋషిగా వెలుగొందిన "భీమ దిబారా" శూద్రుడు కాదా...???

వివరణ: అవును శూద్రుడే. ఇతను 17 వ శతాబ్దానికి చెందిన వాడు. అప్పటికి ముస్లిమ్ పాలన, బ్రిటిష్ వారి ప్రభావంచే మనుధర్మం వెనక్కి వెళ్ళి శూద్రులందరూ విద్యనభ్యసిస్తున్నారు.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన ఋషి రవిదాస్ శూద్రుడు కాదా...???

వివరణ: రవిదాస్, మీరాభాయి లు భక్తి సంప్రదాయానికి చెందిన 15 వ శతాబ్దపు కవులు. ముస్లిమ్ సూఫీ సంప్రదాయం అనుసరించారు. రవిదాస్ పంత్ చర్మకారకులానికి చెందిన వ్యక్తి. హిందూ ధర్మాన్ని తిరస్కరించిన శూద్ర భక్తి కవి.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన ముని నామ్ దేవ్ శూద్రుడు కాదా...???

వివరణ: నామ్ దేవ్ 13 వ శతాబ్దంలో ముస్లిమ్ పాలనలో జీవించిన భక్తి కవి. భూస్వామ్య శూద్రకులస్థుడు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్ ? ఇతను వేదాలను అనుసరించలేదు.

శూద్రుల ఇంట పుట్టి వేదాలను అభ్యసించి, గొప్ప బ్రహ్మ జ్ఞానం, పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చోఖ మేళ" శూద్రుడు కాదా...???

వివరణ: చొక్కమేళ మరాఠా భక్తిసంప్రదాయ కవి. 14 వ శతాబ్దం. ముస్లిమ్ పాలనలో ఆథ్యాత్మిక అన్వేషణ చేసిన మహర్ కులస్థుడు. ఇతనిని బ్రాహ్మణ పండితులు ఆలయంలోకి అనుమతించలేదు. ఆ కారణంగా సొంత ఆలయాన్ని నిర్మించుకొన్నాడు. వేదాలను, హిందూ ధర్మాలను అంగీకరించలేదు. ఇతను వేదాలను అభ్యసించాడని ఎక్కడ ఉంది? రిఫరెన్స్

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన "సంత్ కణ్హోపుత్ర" శూద్రుడు కాదా...???

వివరణ: సంత్ కన్నోఫుత్ర స్త్రీ. రాజ నర్తకి. 15 వ శతాబ్దంలో ముస్లిమ్ పాలనలో విఠలుని ఆరాధించి కవిత్వం చెప్పిన కవయిత్రి. ఈమె వేదాలను అభ్యసించినట్లు ఎక్కడ ఉంది? రిఫరెన్స్

" మహారాజు కవార్ధ" రాజ గురువు వేద జ్ఞాన సముపార్జన, బ్రహ్మ జ్ఞానం సంపాదించిన శూద్రుడైన "గురు బాలాక్ దాస్" ...!

వివరణ: గురుబాలక్ దాస్ 19 వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో జీవించిన భక్తి సంప్రదాయానికి చెందిన సంత్. కులవ్యవస్థకు వ్యతిరేకంగా ఇతను చేస్తున్న బోధనలు ప్రజలలో విస్తరిస్తున్నాయని తెలిసిన అగ్రవర్ణ హిందువులు ఇతన్ని కత్తులతో పొడిచి చంపేసారు.

జష్పూర్ యువరాజు రాజ్ కుమార్ దిలీప్ సింగ్ రాజ గురువు శూద్రుడైన "గురు రామేశ్వర్ ప్రసాద్ గాధర".!

వివరణ: గురు రామేశ్వర్ యోగి 1905-1996 మధ్య జీవించిన చత్తిస్ గఢ్ కు చెందిన ఆథ్యాత్మిక వేత్త. ఇతను గిరిజనుల అభ్యున్నతి కొరకు పాటుపడిన సామాజిక కార్యకర్త. 

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "సంత్ ఘాసిదాస్" శూద్రుడు కాదా...???

వివరణ: సంత్ ఘాసిదాస్ 19 వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో జన్మించాడు. భక్తి సంప్రదాయానికి చెందిన సంత్ గురువు.

జన్మతః శూద్రునిగా జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన తమిళులకు ఆరాధ్యుడు అయిన, "తిరు వల్లువార్" శూద్రుడు కాదా...???

వివరణ: తిరువళ్ళువార్ జైనుడు. హిందూమతానికి చెందిన వ్యక్తే కాదు. ఇతని కాలానికి హిందూమతం ఇంకా దక్షిణభారతదేశానికి రానేలేదు. ఇక బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ఎక్కడిది. ఇదొక ఊతపదంగా ఉంది ఈ వ్యాసం మొత్తంలో. ఆ పదాలు పడితే తప్ప హిందుమతం అని అనుకోరని కాబోలు.

మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "గురు విఠల్ రాంజీ షిండే" శూద్రుడు కాదా...???

వివరణ: గురు విఠల్ 20 వ శతాబ్దపు సామాజిక కార్యకర్త. దళితులు, సమాజంలో వెలివేయబడినవారి అభ్యున్నతికి పాటుపడిన సంఘ సంస్కర్త. వర్ణ వ్యవస్థను వ్యతిరేకించారు. బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యం ఎక్కడిది. రిఫరెన్స్.

మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "సోయరా భాయ్"శూద్రురాలు కాదా...??

వివరణ: ఈమె పైన చెప్పిన 14 వ శతాబ్దపు ముస్లిమ్ పాలనలో భక్తికవి గా పేరుగాంచిన చర్మకార చొక్కమేళ సంత్ యొక్క భార్య. ఈ దంపతులు వేదాలను అంగీకరించలేదు. గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యం ఎక్కడిది. రిఫరెన్స్?

మధ్య భారతంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెంది శివ, వైష్ణవ బేధాలను రూపుమాపిన "శోభి రామ్" శూద్రుడు కాదా...???

వివరణ: శోభిరామ్ 18 వ శతాబ్దం బ్రిటిష్ పాలనలో గురు శివనారాయణ వద్ద శిష్యరికం చేసిన ఒక చమర్ యోగి. వేద పాండిత్యం రిఫరెన్స్??

పంజాబ్ లో రజక వృత్తి చేయువారు కుటుంబంలో జన్మించినా కూడా గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "నామ్ దేవ్" శూద్రుడు కాదా...???
వివరణ: ఇది రిపీట్

మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బహిరామ్ చోఖమేల" శూద్రుడు కాదా.??

వివరణ: బహిరామ్ బాబా 1800 లలో జీవించిన యోగి. ఇతనికి వేదపాండిత్యం నేర్చుకొన్నాడని రిఫరెన్స్ లు ??.

మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "బంకా మహర్" శూద్రుడు కాదా.??

వివరణ: ఇతను పైన చెప్పిన చొక్కమేళ కు బావమరిది. 14 వ శతాబ్దం. ముస్లిమ్ పాలన. వీళ్ళు వేదాలను తిరస్కరించారు. వేదపాండిత్యం ???

మరాఠా రాజ్యంలో చర్మకార వృత్తి చేయువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "భాగు" శూద్రుడు కాదా.??

వివరణ: భాగు మహరిన్ మహర్ కులానికి చెందిన భక్తి కవయిత్రి. ఈమె గురించి వివరాలు తెలియరావు. భక్తి సంప్రయానికి చెందిన వ్యక్తి.

మరాఠా రాజ్యంలో చెప్పులు కుట్టువారు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతిచెందిన "చన్నయ్య" శూద్రుడు కాదా.??

వివరణ: మదరా చన్నయ్య 11 వ శతాబ్దానికి చెందిన కన్నడ కవి. బసవని శిష్యుడు అంటారు
.
ఉత్తర భారతంలో పారిశుద్ధ్య వృత్తి చేయు కుటుంబంలోపుట్టి గొప్ప బ్రహ్మ జ్ఞానం, వేద పాండిత్యంతో ప్రఖ్యాతి చెందిన "గోపాలానంద్ మహరాజ్ " శూద్రుడు కాదా.??

వివరణ: పంతొమ్మిదో శతాబ్దపు సాధువు. స్వామినారాయణ సంప్రదాయానికి చెందిన వ్యక్తి. అనేక పుస్తకాలు రాసాడు. 1908 లో మరణించారు.

ఇలా చెప్పుకుంటే పోతే అనేక లక్షల మంది శూద్ర హిందువులు వేదాలు చదివి, బ్రహ్మ జ్ఞానం పొంది ఋషులుగా, మునులుగా, పంత్ లా, సాధు లా ఎనలేని ఖ్యాతి పొందారు, పొందుతూ హిందూ ధర్మానికి ఎనలేని సేవ చేస్తున్నారు...!
జన్మనా జాయతే శూద్రః
కర్మణా జాయతే ద్విజః
వేద జ్ఞానేషు విప్రాణాం
బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః
ఒక బ్రాహ్మణునికి జన్మించినా పౌరుషం కల్గి యుద్ద విద్యలు నేర్చి క్షత్రియుడు కావచ్చు. ఒక శూద్రునికి జన్మించినా మేధోసంపత్తితో బ్రాహ్మణుడు కావచ్చు.

వివరణ: 12 వ శతాబ్దం నుండి ముస్లిముల పాలన కారణంగా కొంతమేరకు వర్ణ వ్యవస్థ పగుళ్ళు తీసింది. శూద్రులు వేదాలను, పురాణాలను పక్కనపెట్టి భక్తి ఉద్యమాన్ని నడిపించారు. ఇది ఎక్కువగా వర్ణవ్యవస్థకు, క్రతువులకు హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. దీనికి ప్రేరణ ముస్లిమ్ పాలకుల సూఫీ వేదాంతం. దాన్ని ఆధారం చేసుకొని శూద్రులు, అతిశూద్రులు తమ ఆథ్యాత్మిక ప్రపంచాన్ని భక్తి ఉద్యమం ద్వారా నిర్మించుకొన్నారు. దీనిలో హిందూ మత ప్రమేయం తక్కువ.

ఇక పై శ్లోకంలో బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అంటున్నప్పుడు పైన చెప్పిన ఋషులను, సంత్ లను నేటికీ శూద్రులుగానే ఎందుకు పిలుస్తున్నారు మీరు?. వారికి బ్రహ్మ జ్ఞానం వచ్చిందని పేరు పేరుకి చెప్పినపుడు వారు శూద్రులు, చమరులు అని కులాలుగా ఎందుకు చెబుతున్నారు? వారు బ్రాహ్మణులు అని ఎందుకు చెప్పటం లేదు?
ఇంతచిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు. అంటే జన్మనా జాయితే అనేది అంతా బూటకం. పై పై నాటకం.

పోనీ గత రెండువందలేళ్ళుగా బ్రహ్మజ్ఞానం వల్ల ఏ శూద్రుడు బ్రాహ్మణుడిగా మారాడో లెక్కలు తీయండి. కేస్ట్ సర్టిఫికేట్లు ఆధారాలుగా చూపి మాట్లాడాలి. గాలి కబుర్లు కాదు.  లేదూ దుర్గుణాలు కలిగిన ఏ బ్రాహ్మణుడు  శూద్రుడిగా మారాడో చెప్పండి. 

 దొంగతనం మొదలైన అపరాధాలలో శూద్రునకు 8 రెట్లు దండన విధిస్తే, వైశ్యునకు 16 రెట్లు, క్షత్రియునకు 32 రెట్లు బ్రాహ్మణునకు 64 లేక 100 లేక 128 రెట్ల దండన విధించాలని మనువు ఆదేశించారు. శిక్షల విషయంలో ప్రక్షిప్త శోకాలు కనిపించిన మహానుభావులకు ఈ శ్లోకాలు ఎందుకు కనిపించలోదో విజ్ఞులైన మీరు గ్రహించగలరనుకుంటాను.!

వివరణ: ఈ శ్లోకానికి మూలం ఏటో చెప్పాలి? ఈ విధంగా చివరన ఎక్కడిదో నంబరుతో సహా ఇచ్చినట్లు…… అంతే తప్ప ఉత్తినే ఏదో నాలుగులైన్లు రాసి చెబితే ఎలా నమ్మేది.

బ్రాహ్మణుడు క్షత్రియుల్ని దూషిస్తే యాభైపణాలు, వైశ్యుల్ని దూషిస్తే ఇరవై ఐదు పణాలు, శూద్రుణ్ణి దూషిస్తే పన్నెండు పణాలు శిక్ష విధించాలి. అదే ఒక శూద్రుడు బ్రాహ్మణున్ని అవమానిస్తే ఆ శూద్రుని నాలుక కోసివేయాలి. మను: 8.270)

ద్విజుని కులాన్ని, పేరును అమర్యాదగా ఉచ్చరించిన శూద్రుని నోట్లో పదివేళ్ళ పౌడగున్న ఇనుప మేకును ఎర్రగా కాల్చి దూర్చాలి. (మను 8.271)
****

బొల్లోజు బాబా