Tuesday, December 24, 2024

డా. అంబేద్కర్ ఎందుకు రాజీనామా చేశారు?

భారతదేశాన్ని లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా తీర్చిదిద్దటంలో నెహ్రూ, డా. అంబేద్కర్ లు పరస్పరం సహకరించుకొంటూ పోషించిన పాత్ర అనన్యసామాన్యమైనది. డా. అంబేద్కర్ కు రాజకీయపరంగా నెహ్రూ ఇచ్చిన మద్దతుతో గొప్ప ఆధునిక విలువలు కలిగిన రాజ్యాంగం రూపుదిద్దుకొంది. డా. అంబేద్కర్,పండిత నెహ్రూల సంస్కరణాభిలాషకు హిందూకోడ్ బిల్ అద్దం పడుతుంది. మతవాదులు ఈ బిల్లును తీవ్రంగా అడ్డుకొన్నారు. ఈ మతవాదుల దూకుడుకు నెహ్రూ కూడా రాజకీయంగా కొంత తగ్గవలసి వచ్చింది. 1949 నుంచి దాదాపు రెండేళ్లపాటు పార్లమెంటులో హిందూకోడ్ బిల్లుపై చర్చలు జరిగాయి. కొలిక్కి రాలేదు.

ఈ బిల్లును పార్లమెంటులో డా. రాజేంద్ర ప్రసాద్, శ్యామ్ ప్రసాద్ ముఖర్జి, పట్టాభి సీతారామయ్య పండిత్ గోవింద మాలవ్య, బిహారీలాల్ భార్గవ, దుర్భంగా మహరాజా లాంటి వారు వ్యతిరేకించారు. పార్లమెంటు వెలుపల హిందూ మతగురువులు, ధార్మిక నాయకులు ఈ బిల్లును తీవ్రంగా తూర్పారపట్టారు.
 
వీరందరి వాదన ఒకటే – ఈ బిల్లు హిందూ ధర్మశాస్త్రాలపై ఆధారపడి లేదని, పాశ్చాత్యప్రభావంతో కూడిన చట్టం అని, ఇది మన సంస్కృతిని సంప్రదాయాలను మార్చటానికి ప్రయత్నిస్తున్నదని. వేల సంవత్సరాలుగా కాలపరీక్షకు తట్టుకొని నిలబడ్డ హిందూ సామాజిక ఆచారవ్యవహారాలకు ఈ బిల్లులోని అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయని విమర్శించారు. అంతేకాక మతవిషయాలపై పార్లమెంటుకు చట్టాలు చేసే యోగ్యత లేదని మతవాదులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసారు.
ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సందర్భంలో- డిశంబరు 11, 1949 న వెయ్యిమంది సనాతనవాదులు పండిత గోవింద మాలవ్య నాయకత్వంలో పార్లమెంటును ముట్టడించారు. (ఆంధ్రపత్రిక డిశంబరు 13, 1949)

ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి పునఃపరిశీలన చేయటానికి డిశంబరు 19, 1949 న పార్లమెంటులో జరిగిన ఓటింగులో పదకొండు మంది మాత్రమే బిల్లుకు అనుకూలంగా ఓట్ చేయటాన్ని బట్టి హిందూ కోడ్ బిల్లు ఏ మేరకు సనాతనులనుండి ప్రతిఘటనను ఎదుర్కొందో అర్ధం చేసుకొనవచ్చును. (ఆంధ్రపత్రిక డిశంబరు 20, 1949)

సెలక్ట్ కమిటీ రెండేళ్ళ పాటు పరిశీలించిన అనంతరం కూడా హిందూ కోడ్ బిల్ పార్లమెంటులో ఆమోదం పొందలేదు.
 
హిందూ కోడ్ బిల్ ఆమోదం పొందనందుకు డా. అంబేద్కర్ సెప్టెంబరు 27, 1951 న లా మినిస్టర్ గా రాజీనామా చేసారు. తన రాజీనామా లేఖలో "పార్లమెంటు ప్రస్తుత సమావేశాలలోనే హిందూ న్యాయశాస్త్ర సవరణ బిల్లు నెగ్గవచ్చుననే నమ్మకంతో ఇంతవరకూ పనిచేసానని, ఆ ఉద్దేశంతోనే బిల్లులోనుంచి "వివాహం విడాకులు" భాగాన్ని ప్రత్యేకించటానికి కూడా అంగీకరించానని, ఇప్పుడు ప్రభుత్వము దానిని పూర్తిగా చంపివేసినందున రాజీనామా చేస్తున్నానని" డా. అంబేద్కర్ తెలియచేసారు. (ఈ లేఖలో డా. అంబేద్కర్ ప్రభుత్వ ఇతరవిధానాలతో తాను వ్యతిరేకిస్తున్నట్లు ఎక్కడా చెప్పి ఉండలేదు. - అక్టోబరు 13 1951 ఆంధ్ర పత్రిక)
 
పండిత నెహ్రూ ఈ లేఖకు ఆరోజే జవాబిస్తూ "హిందూ న్యాయసవరణ బిల్లు ఉపసంహరించబడి నందుకు డా. అంబేద్కర్ పొందిన ఆశాభంగాన్ని తాను గుర్తించినట్లూ, అయితే విధీ, పార్లమెంటు నియమాలూ తమకు ప్రతికూలించినట్లు, ఆ బిల్లు నెగ్గనిదే నిజమైన అభివృద్ధి ఉండదు కనుక దానికోసం ఇంకా తాను పాటు పడబోతున్నట్లూ తెలియచేసాడు.

హిందూ మహాసభ, జన సంఘ్, రామ రాజ్య పరిషద్ లాంటి మతవాద పార్టీలు ఈ బిల్లుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయగా, కాంగ్రెస్ లోని కొందరు మతవాదులు కూడా వారితో జతకలిపారు. కాంగ్రెస్ అధ్యక్షుడైన పట్టాభిసీతారామయ్య “ఈ బిల్లు విషయంలో జాగ్రత్తగా నడవకపోయినట్లయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దెబ్బతింటుంది” అని నెహ్రూను హెచ్చరించాడు. ఇలాంటి తీవ్ర ప్రతికూలతల మధ్య బిల్లును ఆమోదింపచేయటం పండిత నెహ్రూ చేతిలో కూడా ఉండకపోవచ్చు. ఈ పరిణామాలు డా.అంబేద్కర్‌ను తీవ్రంగా నిరాశపర్చాయి.

హిందూ కోడ్ బిల్ లో ఏముంది?

హిందూ సమాజంలోని కుటుంబ, వివాహం, వారసత్వం వంటి వ్యక్తిగత చట్టాలను క్రోడీకరించి ప్రవేశపెట్టిన ఒక సమిష్టి చట్టాల సముదాయాన్ని హిందూ కోడ్ బిల్ అంటారు. హిందూకోడ్ బిల్ ఒక విప్లవాత్మక చట్టం. హిందూ కుటుంబం, వివాహం లాంటి అంశాలు ఎలా ఉండాలనేది హిందూ ధర్మ శాస్త్రాలు ఏనాడో నిర్ణయించాయి. కానీ వాటిలో స్త్రీ పురుషుల మధ్య సమానత్వం, స్వేచ్ఛ ఉండదు. లింగ, కుల వివక్షలు ఉంటాయి. వాటిని తొలగించి మానవ సంబంధాలను ఆధునిక భావనలకు అనుగుణంగా నిర్వచించి, హిందూ సమాజాన్ని స్వేచ్ఛ, సమానత్వాలకు సిద్ధం చేయటం హిందూకోడ్ బిల్ ముఖ్య ఉద్దేశం.

ఈ బిల్లును సంప్రదాయ మత వాదులు తీవ్రంగా వ్యతిరేకించారు. హిందూ ధర్మశాస్త్రాలు నిర్ధేశించినట్లు హిందువులు జీవిస్తారని; ధార్మిక విషయాలలో చట్టాలు చేసే హక్కు పార్లమెంటుకు లేదని అంటూ ఆందోళనలు చేసి హిందూ బిల్ ను అడ్డుకొన్నారు.
హిందూ బిల్ లో ప్రతిపాదించిన అంశాలను గమనిస్తే, డా. అంబేద్కర్ ఎంతటి దార్శనికత కలిగిన మనిషో, ధర్మశాస్త్రాల నిర్ధేశించినట్లుగా హిందూ కుటుంబం నడుచుకోవాలి అంటూ మతవాదుల ఎంతటి మూర్ఖపు వాదన చేసారో అర్ధమౌతుంది.

హిందూ కోడ్ బిల్---

1.బాల్యవివాహాలను నిషేదించింది. వివాహవయస్సు నిర్ణయించి, వధూవరుల పరస్పర అంగీకారంతో వివాహం జరగాలని చెప్పింది.
2.కులాంతర, మతాంతర వివాహాలను అనుమతించింది
3.స్త్రీలకు దత్తత తీసుకొనే హక్కు కల్పించింది
4.స్త్రీలకు విడాకులు ఇచ్చే హక్కు కల్పించబడింది. (ఈ క్లాజుకి భారతీయ సమాజం కుప్పకూలిపోతుందని పార్లమెంటులో మతవాదులు గగ్గోలు పెట్టారు)
5.విడాకులు తీసుకొన్న మహిళ జీవన బృతిగా మనొవర్తిపొందే హక్కు కల్పించింది
6.బహుబార్యత్వాన్ని నిషేదించింది
7.కుమార్తెలకు, కుమారులతో సమానంగా తండ్రి ఆస్తిలో హక్కు కల్పించింది. పెద్ద కొడుకుకు మాత్రమే ఆస్తిలో హక్కు కలిగి ఉండే ఆచారాన్ని నిషేదించింది.
8.స్త్రీలు ఆస్తిని కొనుగోలు చేసే హక్కు కల్పించింది
9.తండ్రితో సమానంగా పిల్లలకు తల్లి సహజ సంరక్షకురాలిగా ఉండే హక్కు కల్పించింది
10 స్త్రీలకు సమాన హక్కులు కల్పించబడ్డాయి

పైన చెప్పిన అంశాలన్నీ స్త్రీ స్వేచ్ఛ, సాధికారికతకు సంబంధించిన అంశాలు. భారతదేశం రెండువేల సంవత్సరాలుగా పాటించిన సామాజిక విలువలకు ఇవి పూర్తిగాభిన్నమైనవి, కొత్తవి.
ధర్మశాస్త్రాలలో బాల్య వివాహాలు ఉంటాయి. కులాంతర వివాహాలు చేసుకోరాదు. స్త్రీలకు తండ్రి ఇచ్చిన స్త్రీధనంపై హక్కులు తప్ప మరే విధమైన ఆస్తి హక్కులు లేవు. భర్త దేశాంతరాలు పట్టిపోయినా, నపుంసకుడైనా విడాకులు కోరవచ్చు తప్ప మరే ఇతరకారణాలతో కాదు. మనోవర్తి లేదు. బహుభార్యత్వం ఉంది. పెద్దభార్య పెద్ద కొడుకే ఆస్తికి వారసుడు. స్త్రీపురుషులు సమానులు కాదు. బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, ముసలితనంలో కుమారుని సంరక్షణలో ఉండాలని స్త్రీకి స్వాతంత్రం లేదని మనుధర్మశాస్త్రం చెప్పింది.

ధర్మశాస్త్రాలలో చెప్పిన అంశాలు భారతీయ సంస్కృతి అని, వాటిని రాజ్యాంగంలో పొందుపరచాలని మతవాదులు పోరాడారు. ప్రజాస్వామిక లక్షణాలతో ఉన్న హిందూకోడ్ బిల్ ను వ్యతిరేకించారు. బిల్లును పార్లమెంటులో ఓడించారు. లౌకిక ప్రజాస్వామిక విలువలు కలిగిన దేశాన్ని నిర్మించాలని కలలు కన్న డా. అంబేద్కర్ ను తీవ్ర నిరాశకు గురిచేశారు. నిరసనగా డా. అంబేద్కర్ లా మంత్రిగా రాజీనామా చేసారు. స్వతంత్ర భారతదేశంలో ఒక అంశాన్ని విభేదిస్తూ చేసిన మొట్టమొదటి రాజీనామా ఇది.

ముగింపు

ఆ తదనంతరం 1955-56 మధ్య ఈ బిల్లును- the Hindu Marriage Act, Hindu Succession Act, Hindu Minority and Guardianship Act, and Hindu Adoption and Maintenance Act అనే పేర్లతో దఫదఫాలుగా చట్టాలుగా చేయటం జరిగింది. నేడు భారతీయ మహిళ స్వేచ్ఛగా, సాధికారంగా జీవనం సాగిస్తున్నదంటే డా. అంబేద్కర్ రూపొందించిన హిందూ కోడ్ బిల్ మరియు దాన్ని సాకారం చేసిన పండిత నెహ్రూ దృఢ సంకల్పమే కారణం.
****
రాజ్యాంగం ఆర్టికిల్ 44 లో ప్రజలందరకూ ఒకటే వ్యక్తిగత చట్టాలు అమలుకావాలంటే యూనిఫార్మ్ సివిల్ కోడ్ (UCC) తీసుకురావలసి ఉంటుందని రాసుకున్నాం. భారతదేశం వైవిధ్యభరితమైనదని మైనారిటీలకు సంబంధించి వారు కోరుకుంటే UCC లోకి రావచ్చని పండిత నెహ్రూ అప్పట్లో వ్యాఖ్యానించారు.

UCC తీసుకొస్తే ముస్లిములకు ఉండే నాలుగు పెళ్ళిళ్ళు చేసుకోవటం, 16 ఏళ్ళకే వివాహ వయస్సు లాంటి హక్కులను కోల్పోతారు. ట్రిపుల్ తలాక్ హక్కు ఇప్పటికే తొలగించారు. ముస్లిమ్ సమాజాన్ని ఏదో చేసేయ్యాలని హిందుత్వవాదులు UCC తీసుకొస్తామని పదే పదే ప్రకటనలు చేస్తుంటారు.
నిజానికి UCC వల్ల హిందూ సమాజం కూడా గణనీయంగానే ప్రభావితమౌతుంది. హిందూ కోడ్ బిల్ భారతదేశపు హిందువులలో ఉండే భిన్నత్వాన్ని గౌరవిస్తుంది. UCC వస్తే సిక్కులు కృపాణం ధరించటం, కొన్ని చోట్ల గిరిజనులు ప్రత్యేక వివాహ చట్టాలను కలిగి ఉండటం, హిందూ ఉమ్మడికుటుంబం పేరిట పొందే ప్రత్యేక టాక్సు మినహాయింపులు వారసత్వ హక్కులు, గోవా లాంటి ప్రాంతాలలో హిందువులు పొందే కొన్ని ప్రివిలేజస్, ఉత్తరాఖాండ్ లాంటి చోట హిందువులు పాటించే విభిన్నమైన ఆచారాలు లాంటివి కోల్పోవలసి ఉంటుంది.

ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని 2018 లో లా కమిషన్, గొప్ప సాంస్కృతిక వైవిధ్యం కలిగిన భారత దేశంలో UCC సాధ్యంకాదు వాంఛనీయం అసలే కాదు అని రిపోర్ట్ ఇచ్చింది.

బొల్లోజు బాబా



















No comments:

Post a Comment