తెరిగాథ –బౌద్ధ భిక్షుణిల ప్రాకృత గాథలు - పార్ట్ 7
[పున్నిక:]
నేను నీళ్ళు మోయు దాసిని
యజమానురాలి తిట్లకు, శిక్షలకు భయపడి
ఎంతచలిలోనైనా నేను నదిలో దిగకతప్పదు
ఓ బ్రాహ్మణుడా!
కాళ్ళుచేతులు వణికే ఇంతచలిలో
నీవు దేనికి భయపడి నీటిలో మునుగుతున్నావు?
[ఉదకసుద్ధిక:]
పున్నికా! నీకు అన్నీ తెలుసు
నదీ స్నానం సర్వపాపాలను హరిస్తుంది
దుష్కర్మలనుండి విముక్తులను చేస్తుంది
[పున్నిక:]
నీటిలో మునిగితే
పాపవిముక్తి జరుగుతుందని ఎవరన్నారు?
ఒక అంధుడు మరొక అంధునికి దారిచూపినట్లు.
అదే నిజమైతే
కప్పలు, తాబేళ్ళు, నీటిపాములు, మొసళ్లు లాంటి
జలచరాలన్నీ స్వర్గార్హత పొందిన పుణ్యజీవులేనా!.
జంతువులను వధించువారు, వలలు వేసేవారు,
ఉచ్చులు పన్నేవారు, దొంగలు, హంతకులు, దుర్మార్గులు
ఈ నీరు నెత్తిపై చల్లుకొంటే వారి వారి పాపాలు తొలగి
పుణ్యాత్ములౌతారా?
ఈ నీటికే పాపాలను తొలగించే శక్తే ఉంటే
పుణ్యాలను కూడా తీసుకుపోగలదు కదా!
అప్పుడు నీవు రెండిటినుండి విముక్తుడవు అవుతావు.
పాపభీతితో ఎముకలు కొరికే చలిలో స్నానం చేస్తూ
నీ శరీరాన్ని కష్టపెట్టుకోకు
[ఉదకసుద్ధిక:]
ఓ వనితా!
నేను తప్పు మార్గంలో వెళుతున్నాను
నీవు నన్ను ఉత్తమ మార్గం లోకి మళ్ళించావు
ఈ వస్త్రాన్ని నీకు ఇస్తున్నాను, స్వీకరించు
[పున్నిక:]
వస్త్రాన్ని నీవే ఉంచుకో, నాకు అవసరం లేదు.
దుఃఖం అంటే భయం ఉన్నప్పుడు
దుష్కర్మలు చేయవద్దు చీకట్లోనైనా లేదా వెలుగులోనైనా
చెడ్డపనులు చేసి వాటినుంచి పారిపోయినప్పటికీ
వాని తాలూకు దుఃఖం నుంచి తప్పించుకోలేవు.
దుఃఖం నుండి విముక్తి పొందాలంటే
తధాగతుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని ఆశ్రయించు
ఉపదేశాలను ఆచరించు. మంచి జరుగుతుంది.
[ఉదకసుద్ధిక:]
తధాగతుడిని, ధమ్మాన్ని, సంఘాన్ని ఆశ్రయించాను
ఉపదేశాలను ఆచరించాను. మంచి జరిగింది.
ఒకప్పుడు నేను బ్రాహ్మణసంతానాన్ని మాత్రమే
నేనీనాడు త్రివిద్యలను అభ్యసించి పరిశుద్ధుడనైన
నిజమైన బ్రాహ్మణుడను.
***
పున్నిక
.
బుద్ధుని కాలంలో పట్టణాలలో నివసించే సంపన్నుల ఇండ్లలో పనిచెయటానికి పెద్ద సంఖ్యలో సేవకులు ఉండేవారు. యూరప్ లో మాదిరిగా వీరి క్రయవిక్రయాలు జరిగినట్లు కనిపించదు కానీ పాళీ భాషలో బానిసలపై సంపన్నులు యజమాన్యహక్కులు కలిగి ఉన్నట్లు, వారిగురించి దయ, క్రూరత్వంతో కూడిన వివిధ కథలు కనిపిస్తాయి.
పున్నిక ఒక దాసి కూతురు. శ్రవస్తి పట్టణంలో అనతపిండక అనే వ్యాపారి ఇంట్లో ఈమె పనిచేసేది. ఆ ఇంట్లోనే పుట్టిన వందవ బానిస ఈమె. ప్రతిరోజు నదికి పోయి గృహావసరాలకు నీరు తీసుకొని వచ్చే అంబువాహిని ఈమె. అనతపిండకుడు గొప్ప బౌద్ధావలంబి. బుద్ధుడు సంచరించిన జెతవనం అనతపిండకునిదే.
పున్నిక దాసిగా ఉంటూనే బౌద్ధ మార్గాన నడుస్తూ బుద్ధుని బోధనలను పాటించేది. ఒకనాడు బుద్ధభగవానుని కలుసుకొని, తనకు దీక్ష ఇప్పించమని అడిగింది. ఈమె దాసి కనుక యజమాని అనుమతిలేనిదే సంఘంలో చేరే అర్హతలేనికారణంగా ఈమె అభ్యర్ధన నిరాకరించబడింది. ఇది తెలుసుకొన్న అనతపిండకుడు పున్నికకు దాస్య విముక్తి ప్రసాదించటమే కాక, తనకూతురుగా దత్తత తీసుకొన్నాడు. అలా పున్నిక బౌద్ధ దమ్మాన్ని స్వీకరించి గొప్పసాధనతో అర్హంత (జీవన్మక్తి పొందటం Arahant) స్థాయిని పొందింది.
పున్నిక లో ఆత్మవిశ్వాసం, దృఢనిశ్చయం, సాధన లు మూడు దశలలో కనిపిస్తాయి. మొదట్లో బ్రాహ్మణునితో వాదించి అతనిని బౌద్ధ ధర్మంవైపు మళ్ళించటం, పిదప యజమాని వాత్సల్యాన్ని పొంది సన్యసించే అర్హతపొందటం, చివరగా అకుంఠిత సాధనతో జీవన్ముక్తి సాధించటం.
దాదాపు రెండున్నరవేల ఏండ్లక్రితం పున్నిక అనే ఒక స్త్రీ జీవనయానం ద్వారా ఆనాటి ప్రజలలో ఉండిన మత పరమైన అవగాహనను అర్ధం చేసుకొనవచ్చును.
No comments:
Post a Comment