Sunday, June 20, 2021

Imported post: Facebook Post: 2021-06-20T12:12:53

తెలుగు సాహిత్యలోకానికి మరో యువతరంగం శ్రీమతి జోశ్యుల దీక్షగారు. కవిత్వం, సమీక్ష, ఉపన్యాసం ఏ ప్రక్రియైనా చక్కని అవగాహన, ప్రతిభలతో ప్రదర్శిస్తూ రాణిస్తున్నారు. నా కవితా సంపుటిపై వారు చేసిన సమీక్ష ఇది. శ్రీమతి జోశ్యుల దీక్షగారికి నా కృతజ్జతలు. ఈ వ్యాసం ప్రస్థానం పత్రికలో జూన్ సంచికలో ప్రచురణ అయింది. ఎడిటర్ గారికి ధన్యవాదములు. థాంక్యూ దీక్ష గారు బొల్లోజు బాబా **** . మనసులను కుదిపే 'మూడో కన్నీటి చుక్క జోస్యుల దీక్ష చదువరి మనసులో దీపం వెలిగించడమే కవిత్వం చేసే పని అంటారు ఇస్మాయిల్‌. శతాబ్దాలుగా కవిత్వ ప్రయోజనం విషయంలో ఉపదేశమా? ఆనందమా? అంటూ ఆలంకారి కుల మధ్య వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. నాకెందుకో ఈ విషయంలో ఇస్మాయిల్‌ గారి నిర్వచనమే బాగా నచ్చింది. ఆనంద ఉపదేశాల సమ్మేళనం నాకిందులో కనిపించింది. ఇప్పుడు ఈ నిర్వచనానికి అక్షరాలా బల్లోజు బాబా గారి 'మూడో కన్నీటిచుక్క' కవితా సంపుటి నాకు లక్ష్య గ్రంథంగా అనిపించింది. ఇటీవల వివిధ జర్నల్స్‌లో వస్తున్న కవిత్వాన్ని పరిశీలిస్తే కొన్ని చదవగానే ఇట్టే అర్థమైపోతున్నాయి. కాని అవి పేలవంగా ఉండి వచనాన్ని విడగొట్టి ముక్కలు చేసి రాసి నట్లుగా అనిపిస్తున్నాయి. వాటిలో పెద్దగా కవిత్వంగాని, కవితాశిల్పం గాని కనిపించటం లేదు. మరికొన్ని కవితలు మొదటి నుండి చివరిదాకా ఎన్నిసార్లు చదివినా కనీసం అందులోని వస్తువుని కూడా పట్టుకోలేకపోతున్నాం. అలా రాయటం ఒక ఫేషన్‌ అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు లోపాలను అధిగమిస్తూ వచ్చిన కవితా సంపుటే బాబా గారి ఈ మూడో కన్నీటిచుక్క అని నాకనిపించింది. నాకు కవితా సంకలనాలు చదివే అలవాటు కొంచెం తక్కువే. ఒక నవలో, ఒక కథో మనల్ని కూడా తీసుకు వెళ్ళినట్లు ఈ కవితా సంపుటులు తీసుకువెళ్ళవు అని నా ఉద్దేశం. నా ఆలోచన పొరపాటు కావొచ్చు. కొన్నిసార్లు చదవటానికి ప్రయత్నించినా ఎక్కడో ఒకచోట అవి నన్ను ఆపేసేవి. అలాంటిది బాబా గారి ఈ 'మూడో కన్నీటి చుక్క' మొదలుపెట్టాక అది నన్ను కడకంటా లాక్కొనిపోయింది. ఒక నవలను ఒక పేజీ తరువాత మరొక పేజీ తిప్పుకుంటూ ఎలా చదువుకొంటూ పోతామో ఈ కవితా సంపుటి కూడా అలాగే మనల్ని తీసుకుపోతుంది. ఒక కవిత తరువాత ఇంకోటి, అందులో ఏం చెప్పేరు? ఎలా చెప్పేరు? అన్న ఉత్సుకత పుస్తకం పూర్తయ్యేదాకా మనల్ని ఆగనివ్వదు. కొన్ని కవితలు కథలు చెప్తున్నట్లు, కొన్ని మనతో మాట్లాడుతున్నట్లు, కొన్ని ప్రశ్నిస్తున్నట్లు ... ఇలా వివిధ ఎమోషన్స్‌ని మన చేత మోయిస్తాయి. ఒక రైతు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతని చుట్టూ జరిగే సాధారణ సన్నివేశాల్ని 'ఒక దు:ఖానికి కొంచెం ముందు' అనే కవితలో గుండెలను పిండేటట్లు చాలా ఆర్ద్రంగా ఇలా చిత్రిస్తారు బాబా. ''చేను గట్టుపై కూర్చొని/ ఎండిన పంటను/ ఓదారుస్తున్నాడు, ఇసుక నిండిన హృదయంతో/ అప్పటికింకా అతని భార్యలో సగభాగం ఖననం చేయబడలేదు''. అతను ఆత్మహత్య నిర్ణయం తీసుకోవడానికి ముందు వున్న పరిస్థితులను అన్నింటినీ వర్ణించారు. అతని భార్యలో సగభాగం ఖననం చేయబడలేదు ... ఈ పదాలు ఆ బంధం యొక్క బరువును పాఠకుడికి చాలా సులువుగా అర్థమయ్యేట్లు అమర్చారు కదా! కవి యొక్క ఆలోచనల లోతు పాఠకుడికి తెలిసేలా రాయటం చిన్న విషయం కాదు. ఇందులో భార్య కదా అందరికన్నా నష్టపోయేది అని అర్ధమౌవుతుంది. ''అప్పటికింకా ఆ చెట్టుకొమ్మ ఉరికంబం పాత్రను ధరించలేదు''... అనటంలో సమస్తమైన సృష్టికి ప్రాణం పోసే చెట్టు కూడా ఆరోజు ఉరికంబం పాత్రను పోషించింది అనటం ఒక వైవిధ్యం. ''ఒక కవిని కలిసాను'' అనే కవిత సమాజంలో కవియొక్క స్థానాన్ని చెప్పక చెపుతుంది. ''రేపతను తన ఇంటిలో ఉండకపోవచ్చు రేపతను తన దేహంలో ఉండకపోవచ్చు రేపతను తన ఆత్మలో ఉండకపోవచ్చు కాని తన పేరులో సజీవంగా ఉంటారు'' అనటంలో ఒక కవి మాత్రం సంజీవిని వేసుకున్నట్టు సజీవంగా అతని పేరులో, అతని రచనలలో నిలిచి వుంటాడని సాధారణమైన పదాల కూర్పుతో చెపుతారు కవి. 'వేడుక' కవిత ఒక సరికొత్త అనుభూతిని కలిగించింది. ఇందులోని పసివాడు బాబాయేనేమో అనిపించింది. ''పాపం పసివాడు/ లోకం ఎదురు పడ్డప్పుడల్లా శోకంతో కన్నీరు మున్నీరయ్యేవాడు వాడి బాధ చూడలేక/ఓ దేవత వాడి నేత్రాలపై/ బీజాక్షరాలను లిఖించి/ కన్నీటి బిందువులను కవిత్వంగా మార్చే వరమిచ్చింది'' మనల్ని బాధపెట్టే ఘటనలు చాలా తారసపడతాయి మనకి. ఆ బాధని కవిత్వంగా మార్చే వరం వున్న వాళ్ళకి మరిన్ని ఎక్కువ దృశ్యాలు హృదయాన్ని తాకుతాయి. అస్తమించే వరకూ ఆ దృశ్యాలకు, ఆ కవిత్వధారకు విశ్రాంతి ఉండదు. 'పిట్టగోడపై వాలిన పిచ్చుక' ... ''పిచ్చుకా ! నిన్నటి దాకా నీవు ప్రయాణించిన మార్గాన్నీ పడిలేచిన నీ ఆత్మనీ చూడాలని అనిపిస్తోంది'' ఈ కవితలోని ఈ వాక్యాలను చదవగానే నాకు బాల్యపు తీపి గుర్తులను, బాల్యపు సంతోషాలను పోగొట్టుకున్న బాధ కలిగింది. మధుర జ్ఞాపకాలు అంతరించి పోయాయని మనసు చలించింది. గ్లోబలైజేషన్‌, నాగరికత, టెక్నాలజి అనే ఆయుధాల తో మనమే వాటిని హత్య చేసేము అనిపిస్తుంది. 'నిన్నటిదాకా' అనటంలో ఈరోజు ఆ పిచ్చుక లేదన్న భావం స్ఫురిస్తుంది. ''నాలుగు స్తంభాలు'' ... ఇది చదివితే మనిషి కాళ్ళు,కళ్ళు, మనసు అన్నింటిని ఐరన్‌లెగ్‌ అనాలేమో అనిపించింది. ఎక్కడ కాలు పెడితే, దేని మీద దృష్టి పెడితే అది నశించిపోతుంది. ప్రకృతిని మాయం చేసేస్తాడని సాగే ఈ కవిత మొత్తం ఒక కథా కవిత కింద అనిపించింది అంత ఉత్కంఠంగా సాగింది. 'నాన్నతనం' ... అసలు నాన్న గురించి ఎంత బరువైన మాటల్లో ఎన్ని పేజీలు, పుస్తకాలు రాస్తే పూర్తవుతుంది. ఎన్ని రాసినా ఇంకేదో మిగిలిపోతుంది అనిపిస్తుంది. కానీ 'నాన్నతనం' కవితలో మనం రోజూ నడిరోడ్డు మీద చూసే ప్రతి సంఘటనలో ప్రతి మనిషిలో నాన్న ఉన్నాడని చెప్పేరు. ఇకనుంచి నాకు బాధ్యతగా పనిచేసుకున్న ప్రతి మనిషిలో ఒక తండ్రి కనబడతాడు. నాకే కాదు, ఈ కవిత చదివిన ప్రతి ఒక్కరికీ కనబడతారు. 'చక్కగా ప్రేమించుకోక' ... ఇది కూడా బాబా గారి నిశిత పరిశీలనకి ఒక చక్కటి ఉదాహరణ. ఈ విషయం గురించి కూడా రాయవచ్చా? ఇందులో ఇంత మంచి ఆలోచన తీసుకోవచ్చా? అనిపిస్తుంది. ''ఒక్కసారిగా అనిపించింది తిరస్కరించిన తరువాత/ ద్వేషించనక్కరలేదని చక్కగా ప్రేమించుకోవచ్చనీ! '' తల్లిని వదిలి చిన్న పాపాయి మన దగ్గరకు రావడానికి ఇష్ట పడదు. వచ్చిన తర్వాత ఏడుస్తుంది. అమ్మ దగ్గరకి వెళ్ళగానే మనల్ని నవ్వుతూ పలకరిస్తుంది. దాని గురించే చెప్పేరు. మనం ఎవరినైన తిరస్కరించినా ద్వేషించనవసరం లేదని కొత్త సందేశం మనకి చెప్పేరు. 'ఆ మూడు రోజులు' ... నేటి సమాజంలో అవగాహనతో ఉండాల్సిన ఒక సమస్య. స్త్రీలలో ఋతుక్రమాన్ని ఒక దోషాచారంగా చూడాల్సిన సమయం కాదిది. దాన్ని రహస్యంగా చూడాల్సిన అవసరం లేదు. అది మన బాడీ నేచురల్‌ సైన్స్‌. ఈ కవిత ద్వారా ఆడవారికే కాదు, మగవారికి కూడా స్త్రీల సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో, ఎలా ఆలోచించాలో అవగాహన కలిగించేలా రాసారు. ఇలాంటి సున్నితమైన విషయాన్ని ఎంచుకొని, గుంభనమైన పదాలతో కవిత నడిపించిన తీరు చాలా ప్రశంసనీయం. ''ఏక వస్త్ర,త్రిరాత్ర అంటూ/ సౌందర్యాత్మక భాషలో కప్పెట్టిన కొన్ని దైహిక రహస్యాల పట్ల/ అసున్నితత్వం పొందాల్సిన సమయం వచ్చింది'' ఎంత సున్నితమైన విషయాన్నైనా సరే వినసొంపైన పదాల అమరికతో ఎదుటి వారికి సందేశాత్మకంగా ఇలా చెప్పొచ్చని నాకు తెలిసింది. ''పరిమళించిన ప్రేమ'' ... ఈ కవిత ఆహ్లాదాన్ని కలిగించింది చదువుతున్నంత సేపు. ఇంత చక్కని ఆలోచనను ఎక్కడ నుండి తీసుకున్నారో. ''ఒకరోజు తనకు బిగుతైన గౌనుల్ని బ్యాగులో పెట్టుకొని స్కూలుకు తీసుకెళ్ళింది ఏదో చారిటీ ప్రోగ్రాం అంటూ మర్నాడు ఉదయం ఒక గులాబీ నవ్వుతూ ప్రత్యక్షమైంది ఆ మొక్కకు చప్పట్లు కొడుతూ ఆనందిస్తోంది మా అమ్మాయి ఆ దృశ్యాన్ని/ బహుశా ఎక్కడో ఎవరో ఓ పాప తనకు సరిగ్గా సరిపోయిన గౌనును చూసుకొని మురిసిపోయినట్టి ఆనందం కావచ్చు/ ఆ గులాబీ'' ''జీవించటమే'' ... ఒకరోజు హఠాత్తుగా ఒకదారి తన గమ్యాన్ని మరిచిపోయింది. ఇది కూడా ఒక కథలా ఉత్కంఠగా చెప్పేరు. ముగింపు ఏం ఇస్తారో అని ఉత్సుకత రేకెత్తింది. ఎక్కడో ఏదో వుంది అని అది మన దగ్గర వున్న దానికన్నా గొప్పదని భ్రమపడి వెతుక్కుంటూ కాలం వృధా చెయ్యటం కంటే మనలో ఏముంది, మనం ఏం చెయ్యగలం అని ఆలోచించాలి అని. కుంటుకొంటూ పడమరవైపు వెళుతోన్న అతన్ని చూస్తుంటే అర్థమైంది/ గమ్యం అంటే ఏమిటో ఇంకెప్పుడూ అది గమ్యం కొరకు అన్వేషించలేదు ''అయితే ఏంటటా''... కొందరు మోసం చేస్తూ అడుక్కుంటున్నారు వాళ్ళని నమ్మి డబ్బులు వెయ్యకూడదు అని మనలో చాలామంది అనుకుంటాం. ఆ విషయాన్ని గురించే చెప్పిన కవిత ఇది. అసలు సిసలుగా జనాన్ని మోసం చేసే వాళ్ళని మనం మళ్ళీ మళ్ళీ నమ్ముతాం అని చెప్పేరు. జనాల్ని ఎమోషనల్‌ బ్లాక్‌మెయిల్‌ చేస్తుంది... తప్పే! పాయింటు బ్లాంకులో/ నీ సంతకాలు పెట్టించుకొందా లేక ఉపాధి కల్పన పేరుతో నీ భూములు లాక్కొందా? నీకులాంటి జరుగుబాటు లేనివాళ్ళు/ చచ్చిపోవాలా ఏమిటి? ఇది చదివితే ఆ బిచ్చమెత్తుకునే వాళ్ళు మీద జాలి వేసింది. నిజంగా మోసం చేస్తున్న వాళ్ళుని మన తరతరాల సంపదను దోచుకుంటున్న వాళ్ళని తలచుకొంటే మన మీద జాలిపడాలి మనం. Alone but Together.... ... ఇది చాలా భావోద్వేగమైన కవిత. మనకు దగ్గరైన మనిషి కాలం చేస్తే ఆ మనిషి తాలూకు జ్ఞాపకాలు అన్నీ మనకు గుర్తుకొస్తాయి. ఆ మనిషితో పెనవేసుకున్న అన్ని బంధాలు, బంధుత్వాలు మన కళ్ళముందు మెదులుతాయి. అదే మన కళ్ళకు కట్టినట్టు చెప్పేరు ఈ కవితలో. ''ఒక చావు వంద చావుల్ని బతికిస్తుంది'' అనటంలో ఆత్మీయులు ఒక్కరెవరైనా మరణిస్తే వారితో అనుబంధమున్న వారంతా ఒక్కొక్కరు వరుసగా ఎలా గుర్తు కొస్తారో ఈ కవితలో చెప్తారు బాబా. ఈ కవిత చదవగానే బంధాలు చాలా విలువైనవి... బతికి ఉన్నప్పుడే వాటిని కాపాడుకోవాలి అనిపిస్తుంది. ''ఏం పని ఉంటుంది నీకూ...?'' కవితలో ఇంట్లో వుండే ఆడవాళ్ళని పనిలేకుండా ఉంటారని చులకనగా చూస్తారు. కాని కవి ఈ కవితలో ఆమె పనితనాన్ని, ఆమె కష్టాన్ని వ్యంగ్యధోరణిలో వివరిస్తారు. ఆమె గనుక ఒక్కరోజు ఇంటిని పట్టించుకోకపోతే ఇల్లు ఇల్లులా ఉండదనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు వివరిస్తారు. 'అస్తిత్వం' ఈ ప్రపంచం ఏది నీలో వుండకూడదు అని అనుకుంటుందో అదే నువ్వు. అదే నీ వ్యక్తిత్వం దాన్ని వదులుకోకు దాన్నే ప్రేమించు అని ఎంత తేలికైన పదునైన మాటలతో చెప్పారో నిన్ను ఎలా చూడాలని ప్రపంచం అనుకుంటుందో అలా వేషం కట్టి మారిపోకు అని ''ఈ ప్రపంచం/ ఏవి నీకు ఉండకూడదని ఆశిస్తుందో అదే నీ అస్తిత్వం వాటిని కోల్పోకు కర్ణుడి కవచకుండలాలని కోల్పోయినట్లు ఇంకొకరి అభిప్రాయంగా ఉండేకన్నా నువ్వే ఓ సిద్ధాంతంలా మారు'' ... అంటారు ఈ కవిత.. అణిచివేయాలని చూసే సమాజానికి ఎదురు తిరగాలి అనే స్ఫూర్తిని కలిగిస్తుంది. ఇలా ఇందులో వున్న కవితలన్నీ కూడా దు:ఖాన్ని, ఆనందాన్ని కలిగించాయి. కొన్ని ప్రశ్నించాయి. కొన్ని బాధ్యతని గుర్తు చేసాయి. కొన్ని కొత్త భావాలకు అక్షర రూపాన్ని ఎలా ఇవ్వాలో నేర్పాయి. బాబా ఈ సంపుటి చివర కొన్ని మెరుపుల్లాంటి ఫ్రాగ్మెంట్స్‌ని ఇచ్చారు. మూడో కన్నీటిచుక్క అంటే ఏంటో చివ్వరి ఫ్రాగ్మెంట్స్‌లో ఇలా చెబుతారు. ''ఏ రెండు / కన్నీటి చుక్కలు ఒకేలా ఉండవు వాటిని చూసినపుడు/ జారిన మూడో కన్నీటి చుక్క కవిత్వం'' ఈ సంపుటిలో మేధావి ప్రదర్శన ఎక్కడా కనబడలేదు. సృజన కనబడింది. కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ముఖ్యంగా చేరాల్సిన కవితా వస్తువులు అన్నీ పాఠకుడికి చేరాయి. అవును అలా చేరటమే కవిత్వం యొక్క పరమావధి. కవి యొక్క సాఫల్యత. జోస్యుల దీక్ష p.s. ఈ పుస్తకాన్ని archive.org నుంచి డౌన్లోడ్ చేసుకొనవచ్చును.

No comments:

Post a Comment