సెప్టెంబరు 26 వ తారీఖున ఆంధ్రజ్యోతి వివిధలో డా. జె. కనకదుర్గ గారు, గాథాసప్తశతి పై వ్రాసిన ఒక వ్యాసంపై నా స్పందన ఈ రోజు వివిధలో వచ్చింది. ప్రచురణకు తీసుకొన్నందుకు ఎడిటర్ గారికి, భావస్ఫోరక చిత్రాన్ని గీసిన అక్బర్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను.
పూర్తి అన్ ఎడిటెడ్ వెర్షన్ ఇది
గాథాసప్తశతిలో బాధా తప్తసతులు - ప్రాసబాగుంది కానీ పస లేదు
గాథాసప్తశతి అంటే జనబాహుళ్యంలో పచ్చి శృంగారరాతలు అని అపప్రథ ఉంది. దీనికి ప్రధానకారణం కొంతమంది పండితులు ఆ గాథలలోని ప్రకృతి వర్ణణలకు కూడా శృంగారపరమైన అన్వయాలు చేయటం కావొచ్చు. నిజానికి ఏడువందల గాథలూ అలా ఉండవు వాటిలో - ప్రకృతివర్ణణలు, దేవతల స్తుతి, అపురూపసౌందర్యవతుల, యువకుల అందాల వర్ణణలు, అన్యోన్యదంపతులమధ్య జరిగే సరససల్లాపాలు, పల్లెజీవుల ప్రణయోదంతాలు, వివిధ జీవితానుభవాలు వంటి అనేక ఆనాటి సామాజికజీవన సామస్త్యపు భిన్న పార్శ్వాలెన్నో చిన్న చిన్న ఉదంతాలరూపంలో చెప్పబడ్డాయి. రసాత్మకంగా, ధ్వని ప్రధానంగా చిక్కనికవిత్వంతో పొటమరిస్తూ ఉండటంచే కాలక్రమేణా ఈ గాథలు లాక్షణిక గ్రంధకర్తలకు ఉదాహరణలుగాను, కాళిదాసు వంటి మహాకవులకు ప్రేరణగాను నిలిచాయి.
“గాథాసప్తశతిలో బాధా తప్తసతులు” అనే పేరుతో డా. జె.కనకదుర్గ గారు వ్రాసిన వ్యాసంలో గాథాసప్తశతి లోని స్త్రీపురుష సంబంధాల అంశానికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ, అందులోంచి ఒక స్త్రీవాద కోణాన్నొకదాన్ని లేవదీసారు. సమకాలీన కళ్ళద్దాలు పెట్టుకొని పాత సాహిత్యాన్ని చూసినపుడు రంద్రాలు మాత్రమే కాదు కంకాళాలు కూడా కనిపిస్తాయనటానికి ఈ వ్యాసమొక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ వ్యాసాన్ని డా. జె కనకదుర్గ గారు అనేక అభూతకల్పనలు, విపరీత వ్యాఖ్యానాలు, ఊహకందని విషయాలతో నింపటం వల్ల- నేడు ఎవరైనా గాథాసప్తశతి అంటే అది "ఒకనాటి స్త్రీలు తమ బాధల్ని, వేదనలను, వ్యధలను వ్యక్తీకరించటానికి వ్రాసుకొన్న మహాగ్రంథంగా భావించే ప్రమాదం ఏర్పడింది.
ఈ వ్యాస ప్రారంభంలో .... "నాటి శాతవాహన సామ్రాజ్యంలోని స్త్రీలు తమ భావోద్వేగాలను ఎవరితో చెప్పుకోవాలో తెలియక కుమిలిపోయి తోటి స్త్రీలతో పంచుకోవటం జరిగింది. // ఉద్వేగభరితులైన స్త్రీలు తమ మానసిక వ్యథను సహబాధితులైన తోటి మహిళలతో పంచుకొన్న ప్రయత్నాలే ప్రచారం పొంది రాజైన హాలుని చెవులకు సోకినట్లు అర్ధమౌతుంది".... అంటూ ఒక గొప్ప ఊహాజనిత సిద్దాంత ప్రాతిపదికను ఏర్పరచి, దానిపై పేకమేడలాంటి వ్యాసాన్ని నిర్మించుకొంటూ పోయారు వ్యాసకర్త. ఈ గాథలను వ్రాసిన గాథాకారులు ఎవరో తెలుసుకొంటే పై వాక్యాలు ఎంత అజ్ఞానంతో కూడుకొన్నవో తెలుస్తుంది.
గాథాసప్తశతి లోని 700 గాథలలో 44 హాలుని విరచితములని, మిగిలినవి సుమారు మూడువందల మంది వివిధ గాథాకారులు రచించారని పండితులు నిర్ణయించారు. వీరిలో పదిమంది మాత్రమే గాథా కవయిత్రులు ఉన్నారు. వారి పేర్లు అణులచ్చి, అసులద్ది, పహయా, భేజ్జా, మాధవి, రేవా, రోహా, వద్దావహీ, వోహా, నసిస్సహ. ( పై లెక్కలలో చిన్నచిన్న బేధాభిప్రాయాలున్నా అందరూ స్థూలంగా అంగీకరించిన వివరాలవి)
ఇక ఆ పదిమంది గాధాకవయిత్రులు మొత్తం 16 గాథలు వ్రాసినట్లు తెలుస్తున్నది. ఈ 16 గాథలను పరిశీలిస్తే వీటిలో 5 ప్రకృతి వర్ణణలు (నల్లని దున్నపోతును ఇంద్రచాపం తన మొనతో పొడిస్తే ఆ నొప్పికి ఉరుము శబ్దం వచ్చింది - అంటూ బేజ్జా చేసిన నల్లని మబ్బు, ఉరుముశబ్దంల వర్ణణ ఎంతో హృద్యంగా ఉంటుంది ), 6 గాథలు మగని/ప్రియునిపై ప్రేమ లేదా శృంగారేచ్ఛను ప్రకటిస్తూను, మిగిలిన 5 గాథలు వివిధ సందర్భాలకు చెప్పిన జీవితసత్యాలుగాను ఉన్నాయి. గాథాకవయిత్రులు వ్రాసిన ఏ గాథలోనూ వ్యాసకర్త చెప్పినట్లు ......"స్త్రీ పురుష సంబంధాలలోని అసమనైతిక సంస్కృతివల్ల బాధాతప్త హృదయులైన మహిళలు తమ వ్యథను ధ్వని పూర్వకంగా, ప్రశ్నారూపంగా, దుష్టాంతాలుగా వ్యక్తీకరించుచూ నిరసనగళాన్ని వినిపించినట్లు" ఎక్కడా కనిపించదు. ఇంతటి విపరీత వక్రీకరణకు పాల్పడటం ఒకరకంగా సాహిత్యద్రోహమే కాదు పైత్యం కూడా. ఒక వేళ ఈ గాథలను బాధతప్త స్త్రీలు వ్రాసుకొన్నవే, పురుషుని పేరిట ప్రచారించబడ్డాయి అంటూ భావించవలసి వస్తే- అది ఆనాటి సమాజంలో పురుషుడు స్త్రీ పట్ల చూపిన సహానుభూతిగా, ఉదాత్తగుణంగా అంగీకరించాల్సి ఉంటుంది. ఇక అందులో అసమనైతిక సంస్కృతి ఎక్కడున్నట్లు?
ఈ వ్యాసంలో వ్యాసకర్త వాత్సాయనుని కామసూత్ర పుస్తకం గురించి ప్రస్తావించారు. గాథాసప్తశతి, కామసూత్ర ఒకే కాలంలో రచింపకపోయినా, ఈ రెండు పుస్తకాలద్వారా ఆనాటి ప్రజలు "హాయిగా శృంగారం జరుపుకొన్నట్లు దానిగురించి ఏ శషభిషలు లేకుండా నోరారా మాట్లాడుకొన్నట్లు అర్ధం చేసుకోవాలి. "వాత్సాయన కామసూత్రం అనేది శృంగారేచ్ఛ తగ్గిపోయిన ప్రజలలో కామోద్దీపన కలిగించటానికి వ్రాయబడింది" అని వ్యాసంలో సూత్రీకరించటం అవగాహనా రాహిత్యం. ఇది చదవటానికే ఎబ్బెట్టుగా ఉంది. కామసూత్ర అనేది కామోద్దీపన కలిగించే సెక్సు బుక్కు కాదు. నిజానికి కామసూత్రలో 25% మాత్రమే శృంగారభంగిమలగురించిన వర్ణణలు ఉండి, మిగిలినదంతా మూడో పురుషార్ధ సాధనలో భార్య, భర్తల బాధ్యతలను నిర్దేశిస్తూ, దాంపత్యబంధాన్ని పటిష్టం చేయటానికి శృంగారం కూడా ఒక సాధనమని తెలియచేస్తుందని విశ్లేషకుల అభిప్రాయం. దాదాపు ఆ కాలానికే చెందిన కౌటుల్యుని అర్ధశాస్త్రం స్త్రీకి ఆస్థిహక్కు, విడాకుల హక్కు, భరణం హక్కు వంటి వివిధ హక్కులు కల్పించినప్పటికీ ఆమెను పుత్రుని ఉత్పత్తి చేసే సాధనంగానే చూసింది (సెక్స్ కోసం కాదు గమనించగలరు). బహుభార్యత్వం ఆమోదించబడింది. ఇది ఆనాటి సమాజరీతి. ఆ కాలానికి చెందిన సాహిత్యాన్ని అనుశీలనం చేసేటపుడు అప్పటి సమాజతీరుతెన్నులను దృష్టిలో ఉంచుకోవాలి కదా! వ్యాసకర్త తాను చెప్పదలచుకొన్న విషయానికి తగ్గట్టుగా ఆ గాథలను ఎలా వక్రీకరించాలా అనేదానిపైనే శ్రద్ధ చూపారు తప్ప పెద్దగా అధ్యయనం చేసినట్లు కనిపించదు.
వ్యాసంలో ఈ గాథలు కోటి వరకూ ఉండేవని వాటినుంచి 700 హాలుడు సేకరించి సంకలనపరచాడని అన్నారు. కానీ ప్రస్తుతం మనకు లభించేవి వెయ్యి గాథలు మాత్రమే. 1870 లో వెబర్ అనే జర్మన్ పండితుడు 700 గాథల మూలప్రతితో పాటు జనబాహుళ్యంలో ఉన్న మరో 300 గాథల్ని సేకరించాడు. శ్రీ రాళ్ళపల్లి వారు 1931 లో ఈ వెయ్యిలోంచి కొన్ని ప్రక్షిప్తాల్ని, పునరుక్తుల్ని తొలగించి 700 గాథలను ఎంచి తెలుగులోకి అనువదించారు.
ఈ వ్యాసకర్త ఒక చోట -- "పతియే ప్రత్యక్ష్యదైవంగా భావించమని చెప్పిన కుటుంబసంస్కృతిలో ఒదిగిన స్త్రీ తన భర్త జుట్టును కాలివేలితో పెనచి ఈడ్చుకుపోవాలనుకునేంత స్థితిలో కోపాగ్నికి గురి అవటానికి కారణం కుటుంబంలోని అసమనైతిక సంస్కృతి అని స్పష్టమవుతుంది" - అంటూ గొప్ప అపూర్వపరిశీలన చేసారు. స్త్రీలను అష్టవిధనాయికలు అంటూ విభజన చేసి, ఆయా రకపు స్త్రీలు ప్రవర్తించాల్సిన కొన్ని చేష్టలను నిర్ణయించి ఆ ప్రకారంగానే కావ్యనిర్మాణం చేయటం, అప్పటి సాహిత్యంలో కనిపించే ఒక ఆచారము, కావ్యలక్షణము. గాథాసప్తశతిలో కూడా వివిధ అష్టవిధనాయికలు వారికి నియోగింపబడిన పనులు చేస్తూ కనిపిస్తూంటారు. గాథాసప్తశతికి వ్యాఖ్యానం వ్రాసిన గంగాధర భట్టు, సాహిత్య మరియు శృంగార కావ్యాలను ఆధారం చేసుకొని ఈ గాథలలో కన్పించే వివిధ స్త్రీలను- ఖండిత, విప్రలబ్ద, విరహోత్కంఠిత, మానిని, స్వైరిణి, స్వాధీనపతిక, స్వయందూతి, కుట్టానీ, విరహిణి, ధూర్తా, కులట అంటూ వివిధ రకాలుగా విభజించాడు. పై గాథలో వర్ణింపబడిన స్త్రీని ఖండిత అంటారు. శ్రీకృష్ణుడంతటి వాడినే కాలితో తన్నించారు కవులు. అదికూడా అసమనైతిక సంస్కృతి అని అనగలరా? అలకాగృహాలలో, స్త్రీ తన సఖునికి నలుగురెదుటా ఇచ్చే గౌరవాన్ని ఇవ్వక్కరలేదన్న విషయాన్ని ఓ గాథాకారుడు చమత్కారంతో ఎలా వర్ణించాడో చూడండి.
మగడెంత బ్రతిమాలినప్పటికీ
తనకోపం తగ్గలేదన్న విషయాన్ని
ఆమె బహునేర్పుగా చెప్పగలదు
ఏకాంతమందిరంలో కూడా
మగనికి మర్యాదలు చేస్తోంది -- (88) ఈ గాథను వ్యాసకర్త చదివి ఉంటే పై వ్యాఖ్యానం చేసి ఉండేవారు కాదేమో
గాథాసప్తశతిని తెలుగులోకి అనేకమంది అనువదించారు. 1931 నాటి శ్రీ రాళ్ళపల్లి అనంత కృష్ణ శర్మ , తరువాత 1944 లో శ్రీ గట్టి లక్ష్మి నరశింహ శాస్త్రిగారు చేసిన అనువాదాలు అంతర్జాలంలో దొరుకుతున్నాయి. 2012లో శ్రీ నరాల రామారెడ్డి, సంస్కృతమూలచ్ఛాయలను ఇస్తూ, గాథాత్రిశతి పేరిట మూడు వందల గాథలను తెనిగించారు. ఇటీవలి కాలంలో శ్రీ దీవిసుబ్బారావు తెలుగులోకి గాథాసప్తశతిని అనువదించారు. ఇవి ప్రస్తుతం మార్కెట్లో లభించవచ్చు. ప్రముఖ కథకుడు శ్రీ తల్లావఝుల పతంజలిశాస్త్రి గారు కొన్ని గాథలను అనువదించారు. కులబాలదేవుడు, గంగాధరభట్టు, శ్రీ మధురనాథ శాస్త్రి వంటి పండితులు గాథాసప్తశతిపై టీకలు వ్రాసారు. శ్రీ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కొన్ని సప్తశతి గాథలను కథలుగా మలచి వ్యాఖ్యానించారు. ఎవరైనా ఒక ప్రాచీన గ్రంథంపై ఒక పరిశోధనాత్మక వ్యాసం వ్రాసేముందు దానిపై వచ్చిన వివిధ రచనలను అనుశీలన చేసి వ్రాయటం ధర్మం. కానీ ఈ వ్యాసకర్త అలాచేసినట్లు అనిపించదు. వ్యాసంలో వాసిరెడ్డి వెంకటసుబ్బయ్య గారి అనువాదం గురించి మాత్రమే ప్రస్తావించటం అలాంటి అనుమానానికి తావిస్తుంది. పరిమిత జ్ఞానంతో వ్యాఖ్యానాలు, తీర్మానాలు చేయటం సాహసమే!
ఈ వ్యాసాన్ని ముగిస్తూ -- "సంధ్యవార్చాలనుకొన్న శివుడు జలభరాంజలి యందు గౌరీ మొహం కనబడేసరికి మంత్రజపం కూడా మరచి మోవిని అటు ఇటు కదిపాడని ముగిస్తూ ఆనాటి పురుషులు భోగలాలసతో ధార్మిక కర్మాచరణలను కూడా మరచి పోయారని గ్రంథాన్ని ముగింపుచేయటంతోనే హాలుడు సమాజస్థితికి అద్దం పట్టాడని అర్ధం అవుతుంది" -- అంటారు వ్యాసకర్త. ఇంతకన్నా అన్యాయమైన భాష్యం మరొకటి మనం ఎక్కడా చూడలేం. వ్యాసకర్త మాటలకు హాలుణ్ణి తోడు తెచ్చుకోవటం మరీ వెటకారం.
గాథాసప్తశతి మొదటి మరియు చివరి గాథలు శివస్తుతికి సంబంధించినవి. ఇక్కడ ఉదహరింపబడిన గాథకు శ్రీ దీవి సుబ్బారావు గారి అనువాదం ఇలాఉంది
సంధ్యవార్చేటప్పుడు దోసిటజలంలో
గౌరి ముఖం ప్రతిఫలించటం చూసి
మంత్రం మర్చిపోయి
ఊరికే పెదాలు కదుపుతున్న
శివుడికి నమస్కరించండి 7-100
ఈ గాథలో కవి చమత్కారమంతా దోసిటజలంలో గౌరి ముఖం ప్రతిఫలించటం వద్ద ఉంది. ఎందుకంటే శివుడు అర్ధనారీశ్వరుడు కనుక. శరీరంలో సగభాగమై ఉన్న గౌరీదేవి మొఖాన్ని అంజలిజలాలలో చూడగానే శివుడు మంత్రం మరచిపోవటానికి కారణం "భోగలాలస" కాదు ప్రేమ అనురాగము. అది ఆ ఆదిదంపతుల దాంపత్యరహస్యం. భార్యాభర్తలంటే ఒకరిలో ఒకరు లీనమై ఆదిదంపతుల్లా కలసిమెలసిజీవించాలని ఆ గాథాకారుడు కోరుకొంటున్నాడు. అంతటి ప్రేమమూర్తి అయిన శివునికి నమస్కరించమంటున్నాడు. ఇదొక మంగళస్తుతి. మొత్తం గాథలోని చమత్కారాన్ని, ధ్వనిని, భక్తిని వదిలేసి "ఆనాటి ప్రజలు భోగలాలసులని, విచ్చలవిడి సమాజానికి హాలుడు అద్దంపట్టాడని" అనటం ఎంతవరకూ భావ్యమో వ్యాసకర్తే ఆలోచించుకోవాలి.
డా. జె. కనకదుర్గ గారి వ్యాసంలోని మిగిలిన గాథల ఉటంకింపు, వాటి ద్వారా చేసిన తీర్మానాలు దాదాపు ఇదే స్థాయిలో ఉన్నాయి. (గాథలను ఉటంకించేటపుడు నంబరు ఇవ్వటం సాంప్రదాయం. దీనిని వ్యాసకర్త పాటించలేదు). ఈ గాథలలో ప్రోషితపతికలబాధలు అనేకచోట్ల కనిపిస్తాయి (భర్త దేశాంతరం వెళ్ళగా అతని రాకకోసం ఎదురుచూసే భార్యను ప్రోషితపతిక అంటారు) . అలాంటి ఒక గాథలో
చెలీ! నిజం చెప్పు
అందరికీ ఇలానే జరుగుతుందా?
మగడు దూరదేశమేగినపుడు
భార్య గాజులు పెద్దవవుతాయా? (453) అని అని ఓ ప్రోషితపతిక ప్రశ్నిస్తుంది. ఇలాంటి గాథలలో- ధ్వనిని, కరుణరసాన్ని, భర్తగురించి చిక్కిపోయేంత బెంగపెట్టుకొన్న ఆ స్త్రీ అనురాగాన్ని, ఆనాటి రాజకీయ ఆర్థిక, కుటుంబ పరిస్థితులను చూడాలి తప్ప- భార్యని ఒంటరిని చేసేసి దూరదేశాలలో వ్యాపారాల పేరుతో భర్త సుఖిస్తున్నాడని ఆరోపించటం ఎంతవరకూ సమంజసం?
గాథాసప్తశతిలో శృంగార రస ప్రధాన గాథలు ఎక్కువగా ఉన్నప్పటికీ, అంతకు మించిన సౌందర్యం, తాత్వికత కలిగిన ఇతర గాథలు కూడా ఉన్నాయి. గాథాసప్తశతి ధ్వని ప్రధాన కావ్యం. అనేక వ్యాఖ్యానాలకు ఆస్కారం ఉండే కావ్యం. అయినప్పటికీ వ్యాసకర్త ప్రతిపాదించినట్లు ఇదేమీ అసమనైతిక సంస్కృతికి అద్దం పట్టే రచన కాదని, వివిధ గాథలు ఆనాటి స్త్రీ పురుషుల అన్యోన్యతను చూపుతాయిని జాగ్రత్తగా గమనిస్తే తెలుస్తుంది - ఉదాహరణకు ఓ స్వాధీన పతికకు కోపం వచ్చినపుడు ఆ భర్త ఏంచేసాడో చూడండి--
పాదాలు పట్టుకొని
బతిమాలుతున్న భర్త వీపునెక్కి
చిన్నకొడుకు తైతెక్కలాడుతుంటే
అంత కోపంలోనూ ఆమెకు నవ్వాగలేదు (11) -- ఇందులో అసమనైతిక సంస్కృతి ఉందా లేక దాంపత్యజీవితాన్ని హాయిగా మలచుకోవటం ఉందో డా. జె. కనకదుర్గ గారే చెప్పాలి.
బొల్లోజు బాబా