1.
కవిత్వమనేది
ఆత్మలోకంలో
ఇద్దరి సంభాషణ
అది
స్వగతమూ
కాదు
ఊదరగొట్టే
ఉపన్యాసం
అంతకంటే
కాదూ.
2.
క్రోటన్ పూలు ఇంద్ర ధనసుని
పగలగొట్టుకొని
పంచుకొన్నట్లున్నాయి
లేకపోతే
మొజాయిక్ గచ్చులా
ఇన్ని రంగులెలా వస్తాయి?
3.
పేడ
పురుగులా
రోజూ
పుట్టి చచ్చే సూరీడు.
తెల్లగా
మెరిసిన కాంతిచర్మం
సంధ్య
వేళ సమీపించే కొద్దీ
పొరలు
పొరలుగా రాలి
నల్లగా
కమిలిపోతుంది.
4.
యవ్వనంలో
నీ
పంచేంద్రియాలలో
ఏదీ
నిన్ను
పవిత్రంగా
ఉంచలేదు.
5.
ఆమె
కనుల నీలిమలోకి
క్షణాలు
అదృశ్యమయ్యాయి.
దుఃఖ దృశ్యం
చిట్లి రాలినా
శీతల మేఘాలు
సంచరిస్తూనే ఉంటాయి.
6.
గాలిపటాన్ని
గద్ద
తన్నుకుపోయింది
చేతిలో
తెగిన
దారం మిగిలింది.
బొల్లోజు
బాబా
No comments:
Post a Comment