ప్రముఖ పంజాబీ కవి శ్రీ సుర్జీత్ పతర్ - కవిత్వ పరిచయం
(An brief introduction to the poetry of famous Punjabi Poet Sri. Surjit Patar)
శ్రీ సుర్జీత్ పతర్ ప్రముఖ పంజాబీ కవి. వీరు ఏడు కవితా సంపుటులను వెలువరించారు. అనేక యూరోపియన్ నాటకాలను, నెరుడా కవిత్వాన్ని పంజాబీ భాషలోకి అనువదించారు. ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డు, సాహిత్య అకాడమీ అవార్డు, సరస్వతి సమ్మాన్ వంటి వివిధ పురస్కారాలను అందుకొన్నారు.
వీరి కవిత్వం సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కాంక్షిస్తుంది. ప్రాంతీయతా గోడలను దాటి విశ్వజనీన సత్యాలను ఆవిష్కరిస్తుంది.
కవి అనేవాడు సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిణామాలనుంచి తప్పించుకొని కవిత్వాన్ని సృజించలేడని శ్రీ సుర్జీత్ పతర్ విశ్వాసం. అందుకనే వీరి కవిత్వం కాలం అంచున నిలచి సమాజాన్ని ప్రతిబింబిస్తుంది.
పతర్ లేని పంజాబ్ సాహిత్యాన్ని, పంజాబ్ లేని పతర్ సాహిత్యాన్ని ఊహించటం కష్టమని వీరి విమర్శకులు అంటారు. శ్రీ సుర్జీత్ పతర్ వ్రాసిన కొన్ని కవితల అనువాదాలు……
1. పంజాబ్ అంటే అయిదు నదుల సంగమ ప్రదేశం అని అర్ధం. సుర్జీత్ పతర్ గారి ఈ కవితలోని మొదటి రెండు ఖండికలూ ఎవరైనా రాయగలిగేవే, కానీ మూడవ ఖంఢిక ద్వారా వీరి ప్రత్యేకత తెలుస్తుంది.
అయిదు నదుల దేశం
దుఃఖం
హింస
భయం
నిస్పృహ మరియు
అన్యాయం
నేడు ప్రవహిస్తూన్న అయిదు నదుల పేర్లు
ఒకప్పుడు అవి
సట్లెజ్
బీస్
రావి
జెలుమ్ మరియు
చెనాబ్
ఏదో ఒకనాటికి నా అయిదు నదులు
ఇలా ఉంటాయన్న ఆశ నాకు
సంగీతము
కవిత్వము
ప్రేమ
సౌందర్యము మరియు
న్యాయము.
(Eh ne Ajkal – 2014)
2. “వస్తువుల్ని వాటి మామూలు స్థానాలనుంచి తప్పించి వేరే వస్తువుల సరసన భిన్నస్థానాల్లో నిలిపితే కవిత్వమవుతుంది” అని ప్రముఖ విమర్శకులు జి. లక్ష్మి నరసయ్య అంటారు. ఈ క్రింది కవిత ఆ ప్రక్రియను అద్భుతంగా వ్యక్తీకరిస్తుంది.
పదాలు చాలా తేలికైనవి
పదాలు చాలా తేలికగా ఉంటాయి
ఎక్కడినుంచైనా తుంచి
ఎక్కడైనా అతికించవచ్చు
సముద్రం అనే పదాన్ని తీసుకొని
నవ్వు అనే పదం పక్కన చేర్చి
నవ్వే సముద్రాన్ని సృష్టించొచ్చు.
చెట్టు ని తీసుకొని
నడక కు అనుసంధానించి
నడిచేచెట్టు ని తయారు చెయ్యొచ్చు.
చాలా సులువు
రెండు పదాలను తీసుకొని జతచేసి
ఆకుపచ్చ సూర్యుడు
రక్తవర్ణ చంద్రుడు
ఎగిరే దీపాలు
పాడే తారలు అంటూ దేన్నైనా
రూపకల్పన చెయ్యొచ్చు.
తీసుకొని కలపటం సులభమే
కానీ దేన్ని తీసుకోవాలి
దేనితో కలపాలి అనేదే కష్టం
ఏ పదాన్ని ఏ పదం తో కలిపితే
శతాబ్దాలపాటు అలానే ఉంటాయో
తెలుసుకోవటం ఇంకా కష్టం
అలా కాకుంటే
వాస్తవమనే చిరుగాలి పడగొట్టవచ్చు
ఆకుపచ్చ సూర్యుడిని
రక్తవర్ణ చంద్రుడిని
పాడే తారల్ని
ఎందుకంటే
పదాలు బొత్తిగా బరువు లేనివి.
3. శ్రీ సుర్జీత్ పతర్ కవితలలో మొదటగా చదివింది ఈ క్రింది కవితని. ప్రతీకాత్మకంగా సాగే కవిత ఇది. మంచి కవిత్వానుభవాన్ని పొందాను.
గతంలో మనం చేసే ఒక పని (మాటలతోనో లేక మౌనంతోనో) యొక్క పర్యవసానమే ఆ తదనంతర పరిణామాలను ప్రభావితం చేస్తుందంటూ సాగే ఈ కవిత నాకు బాగా నచ్చింది. మానవుడు చేసే ఏ క్రియా ఒంటరి కాదు కాల ప్రవాహంలో ప్రతీదీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవే అంటుందీ కవిత. అద్భుతమైన అభివ్యక్తి కలిగిన కవితగా భావిస్తాను.
ఆ దినం
మరలా ఎపుడైనా
ఆ దినం నాకు కనిపిస్తే
గాయపడిన హంసలాంటి
దాని తెల్లని దేహానికి
కాస్త లేపనాన్ని పూస్తాను.
అనుకొంటాం కానీ
దినం అనేది తెగతెంపులు చేసుకొని
పారిపోయే రకంకాదు.
ఎక్కడెక్కడో తిరిగి తిరిగీ
ఏదో ఓ సాయింత్రం
చిరిగిన దుస్తుల్తో ఇల్లు చేరుతుంది
లేదా
ఏదో స్టేషన్లో ఏ రైలు కోసమో
ఎదురుచూస్తూ నీకు కనపడొచ్చు.
దినాలు ఎక్కడికీ పలాయనం చెందవు.
మనం మాటలతోనో లేక మౌనంతోనో చంపేసి,
వేటి గాయాల్నైతే మనమిపుడు ఏవిధంగానూ
నయం చేయలేమో ఆ ఒకనాటి దినాల దుఃఖించే ఆత్మలే
నేటి దినాలు.
నేటి దినం యొక్క రోదన
నిన్నటిని ఎన్నటికీ చేరలేదు
ఎన్ని శతాబ్దాలైనా సరే!
Oh Din ---1993
4. లియొనార్డ్ కొహెన్ అనే కెనడియన్ కవి “రెండు పద్యాలు” అనే ఒక కవితలో – మొదటి ఖంఢికలో రాజ్యహింసకు గురయిన ఒక వ్యక్తి పట్ల సానుభూతి చూపుతూ, అతనికి జరిగిన అన్యాయం పట్ల పగతీర్చుకొంటానని సూర్యకాంతిపై ప్రమాణం చేస్తాడు. రెండవ ఖంఢికలో అతని పేరు కవితలో ప్రస్తావించటం పట్ల అతని సలహా తీసుకొంటాననీ, ఆ ఉదంతాన్ని మర్చిపోతానని అదే సూర్యకాంతిపై ప్రమాణం చేస్తాడు.
నేడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఒక భీతావహ వాతావరణం వల్ల, బుద్ది జీవులు తమ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెలువరించలేకపోతున్నారనేది ఒక నిష్టుర సత్యం. అదే ఈ కవితా వస్తువు, ఒక గొప్ప శిల్పంతో…
కవి గారు
వ్రాసిన మొదటి వాక్యాన్ని
పాలకుల తొత్తులకు భయపడి
కత్తిరించేసాను.
మరో వాక్యం వ్రాసి
ఉద్యమకారులకు భయపడి
కత్తిరించేసాను.
అలా
నా ప్రాణాలు నిలుపుకోవటానికై
అనేక వందల వాక్యాల్ని
వధించాను.
చంపబడ్డ నా వాక్యాలన్నీ
దెయ్యాలై నా చుట్టూ తిరుగుతూ
నన్ను ప్రశ్నిస్తున్నాయి
ఓ కవీ!
నువ్వు కవివేనా లేక
కవిత్వ కసాయివా?
Mr. Poet
5. చిన్నదైనా, భిన్న అర్ధాలను స్ఫురింపచేసే మంచి కవిత.
పరదేశం
రెండు మూడు
అడుగులు వేసేసరికి
విదేశీభూమిపై తేలాను
నేను నాటిన చెట్ల నీడలు
ఎంత కురచగా ఉన్నాయీ!
The Alien Land
భవదీయుడు
బొల్లోజు బాబా
No comments:
Post a Comment