{గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము, ప్రకృతి సౌందర్యం,ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.}
గాథాసప్తశతి - అన్యోన్య దంపతులు
సప్తశతి గాథలలో ఎక్కువ భాగం ప్రేమానుభవాలే. భార్యభర్తల నడుమ నడిచే సరసాలు, కొత్త దంపతుల సరదాలు, కొత్తకోడలి పై కుటుంబసభ్యులు వేసే చెణుకులు వంటి వెన్నో ఈ గాధలలో కనిపిస్తాయి. వీటిద్వారా ఆనాటి సమాజపు కుటుంబవ్యవస్థ ఎలాఉండేదో అర్ధమౌతుంది.
తన ప్రేమ మరియు సుగుణాలతో భర్తను తన ఆధీనంలోకి తెచ్చుకొనే నాయికను స్వాధీనపతిక అని అంటారు. అలాంటి సుదతికి కోపం వచ్చినప్పుడు .......
పాదాలు పట్టుకొని
బతిమాలుతున్న భర్త వీపునెక్కి
చిన్నకొడుకు తైతెక్కలాడుతుంటే
అంత కోపంలోనూ ఆమెకు నవ్వాగలేదు. (11)
భర్త దేశాంతరం వెళ్ళగా అతని రాకకోసం ఎదురుచూస్తూ, చిక్కిశల్యమౌతూ ఉండే నాయికను ప్రాచీన కవులు ప్రోషిత భర్తృక అని వర్ణించారు.
అలాంటి ఒక ప్రోషితపతిక చిక్కి సగమయ్యింది అన్న విషయాన్ని ఈ గాథాకారుడు అన్యాపదేశంగా
ఎలాచెపుతున్నాడో చూడండి
చెలీ! నిజం చెప్పు!
అందరికీ ఇలానే జరుగుతుందా?
మగడు దూరదేశమేగినపుడు
భార్య గాజులు పెద్దవవుతాయా? (453)
ఇదే భావన ఈ గాథలో మంచి అందమైన పదచిత్రంలో...
ప్రవాసి భార్య పెట్టిన అన్నం ముద్దపై
జారిపడిన ఆమె గాజును చూసి
ఉచ్చు అనుకొని భయపడుతున్న కాకి
తినటానికి రావటం లేదు. (205)
ఒక ప్రోషితపతిక తన భర్త ఎప్పుడు వస్తాడో అని గోడపై గీతలతో రోజులు లెక్కించుకొంటోందట
తుఫానుకు పైకప్పు ఎగిరిపోగా
వాన నీరు గోడలవెంబడి జారుతున్నపుడు
భర్త వచ్చే రోజుకోసం గోడపై వేసుకొన్న గీతలలెక్కలు
చెరిగిపోకుండా చెయ్యి అడ్డం పెడుతుంది ఆ ఇల్లాలు. (170)
మరొక ప్రోషిత పతిక పరిస్థితి చూడండి.....
“ఎవరిగురించి ఆలోచిస్తున్నావు” అని ఆమెను అడగ్గా
“ఎవరూ లేరు” అని
భోరుభోరున ఏడవటం మొదలెట్టింది
మేము ఆమెతో కలిసి శోకించాం. (389)
ఋతు సమయంలో స్త్రీలు మొఖానికి పసుపు,నేయి కలిపిన మిశ్రమాన్ని పట్టించుకోవటం ఆనాటి ఒక ఆచారం. ఆ సమయంలో కూడా శృంగారం జరుపుకొన్నట్లు కొన్ని గాథలలో మనకు కనిపిస్తుంది. కానీ అటువంటి స్త్రీతో కలిసినట్లు నలుగురికీ తెలిస్తే నగుబాటు అవుతుందనే భయం ఉండేదని కూడా ఈ క్రింది గాథ ద్వారా తెలుస్తుంది.
పసుపు,నేయి మొఖానికి రాసుకొని ఉన్నప్పుడు
ముక్కు తగలకుండా, నుదురు తాకకుండా
పెదవులు సారించి ఆమె ఇచ్చిన చుంబనాన్ని
నేనెన్నటికీ మరువలేను. - 22
ఆ కాలంలో బహుభార్యత్వం ఉండేదని అనేక గాథల ద్వారా తెలుస్తుంది. అలాంటప్పుడు సవతుల మధ్య ఈర్ష్య, అసూయలు సహజమే. ఈ క్రింది గాథలో, చిన్నభార్య కలవకూడని స్థితిలో ఉన్నప్పటికీ, మగడు ఆమెతోనే ఉంటున్నాడని ......
చిన్నభార్య మొఖాన రాసుకొన్న
పసుపు నేయిలని
భర్త చాతీపై మరకలుగా చూసిన
అతని ఇతర భార్యలు
గుడ్లనీరు కుక్కుకొని శోకించారు. – 529
ఇది కూడా దాదాపు అలాంటిదే
రాత్రివేళ ఆమె పెదవులనుంచి భర్త
చెరిపేసిన ఎరుపుదనం తెల్లారాక
ఆమె సవతుల నిద్రపోని కళ్ళల్లో ప్రత్యక్షమైంది - 106
ఒక చిత్రమైన ఊహ....
కొడుకు భర్త మధ్య కూర్చున్న ఆ ఇల్లాలి
చనుద్వయంలో ఒకటి పాలు కార్చితే
మరొకటి చక్కిలిగింత పొందుతోంది
ఈ గాథాకారుడు చేసిన ఊహ భిన్న అర్ధాలను స్ఫురించేదిగా ఉంటుంది....
“చూడు నీ కొడుకేంచేసాడో” అంటూ ఆమె
రేగుపండుపై నాటుకొన్న పిల్లవాని పాలపళ్ళ
గుర్తుల్ని భర్తకు నవ్వుతూ చూపిస్తోంది. (200)
ఈ క్రింది గాథలోని పదచిత్రం ఎంతో ఉదాత్తంగాఅనిపించటమే కాక ఆనాటి సమాజాన్ని పట్టిచూపుతుంది.
ఊరికాపు అయిన మగని చాతీ
మానిన గాయాలతో ఎగుడుదిగుడుగా ఉండటం చే
దానిపై తలాన్చి పడుకొన్న భార్యకు నిద్రపట్టటం లేదు
కానీ
ఊరు ప్రశాంతంగా నిదురపోతోంది. (31)
కోడలు వచ్చి కొడుకును కొంగున కట్టేసుకోగా, పనికికూడా వెళ్ళటం లేదట ఆ కొత్తబిచ్చగాడు ...... పాపం
వర్తకుడా!
నీకు ఏనుగు దంతాలు, పులిచర్మాలు
ఇదివరకట్లా ఎలా సరఫరా చేయగలం?
కొత్తకోడలు వయ్యారంగా పిరుదులు
తిప్పుకుంటూ ఇంట్లో తిరుగుతూంటే! (951)
ఇది ఒక గమ్మత్తైన ఆలోచన.....
విచ్చుకొన్న నెమలి పురిలా చెదిరిన జుట్టు
వణికే తొడలు, తేలేసిన కళ్ళు-
మగరాయుడిలా రమించాలనుకొన్న ఓ మగువా
తెలిసిందా మగాడి కష్టం ఎంతటిదో?
ఇది ఒక అద్బుతమైన ఊహ.......
రాత్రివేళ ఆలుమగలు
మాట్లాడుకొన్న మాటల్ని విన్న రామచిలుక
ఉదయాన్నే అందరిఎదుటా వాటిని వల్లెవేస్తుంటే
సిగ్గుతో బెదిరిపోయిన కొత్తకోడలు
చిలుకనోరు మూయించటానికి
చెవిపోగులోని కెంపును తొలగించి
దానిమ్మగింజ ఇదిగో తిను అని అందిస్తోంది
ఏంచేయాలో తెలీక.
బొల్లోజు బాబా
No comments:
Post a Comment