Friday, March 30, 2012

మూల్యాంకనం



జవాబు పత్రాన్ని పట్టుకోగానే
ఓ ఏడాది కాలాన్ని
చేతిలోకి తీసుకొన్నట్లుంటుంది.
ఏదో అపరిచిత జీవితాన్ని
తడుముతున్నట్లనిపిస్తుంది.

పాస్ మార్కులు వేయమంటూ
కన్నీటి ప్రార్ధనో, వెయ్యినోటో, ఫోన్ నంబరో
లేక శాపాల బెదిరింపో వంటి చేష్టలు
బిత్తరపరచినా
ఇన్నేళ్ళ చదువులో ఎక్కడా తగలని
ఒక వాక్యమో, కొత్త కోణమో, వివరణో
తళుక్కు మన్నపుడు
కవిత్వం చదివినంత
ఆనందమౌతుంది.

జవాబు పత్రాల్ని మెదడు తూకం వేస్తే
హృదయం మూల్యాంకనం చేస్తుంది.

ఈ స్టూడెంట్ కి
మమ్మీ డాడీ దీబెట్టి బెస్టాఫ్ లక్ చెప్పారో లేదో
హైలైటర్స్, స్కెచ్ పెన్ లు కొనివ్వలేదు కాబోలు
స్కేలు కూడా లేదేమో..
పేపరు మడతే మార్జినయ్యింది.
ఈ అక్షరాలు వ్రాసిన చేయి
పొలంపనులు చేసిందో, రాళ్ళు మోసిందో
పెట్రోలు కొట్టిందో లేక అంట్లే తోమిందో
అక్షరాల నిండా మట్టి వాసన ... మట్టి వాసన...
హృదయానికి మట్టివాసన ఎంతిష్టమో!

జవాబులు సరిగ్గా రాయకపోవటానికి కారణం
ఒక్క చదవకపోవటమేనా... లేక
ఆ సమయంలో జబ్బుచేసిందా?
ముందురోజు తండ్రికి తలకొరివి పెట్టాడా?
పెళ్ళిబట్టలలో నేరుగా పరీక్షహాలుకు వచ్చిందా?
సమస్యలనుంచి రేపు పారిపోవాలనుకొంటున్నాడా?
ఖాళీ జవాబు పత్రం ప్రశ్నల పత్రమౌతుంది

పేపర్లు దిద్దటం అంటే ఒక్కోసారి
పత్రికల్లో పతాక శీర్షికలవటం కూడా
ఆత్మహత్యగానో, అత్యుత్తమ రాంక్ అనో.

బొల్లోజు బాబా

Wednesday, March 28, 2012

ఫ్రెంచిపాలనలో యానాం పుస్తకం గురించి


“ఫ్రెంచిపాలనలో యానాం” పేరుతో నే వ్రాసిన వ్యాస సంపుటి మొన్న ఉగాది రోజున శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి చేతులమీదుగా ఆవిష్కరింపబడింది.  ఆ వ్యాసాలన్నీ యానాం స్థానిక పత్రిక అయిన “జనమిత్ర” లో 2010-2011 పదినెలలపాటు సీరియల్ గా వచ్చాయి. వాటిలో కొన్నిభాగాలను ఈ బ్లాగులో కూడా ఉంచటం జరిగింది.  ఆ తరువాత వాటికి అనేక మార్పులు చేర్పులు చేసి, పుస్తకరూపంలోకి తీసుకురావటం జరిగింది. 

ఈ పుస్తకరచనకు అవసరమైన చాలా సమాచారాన్ని http://gallica.bnf.fr/  వెబ్ సైట్ నుంచి గ్రహించాను.  మరికొంత గూగుల్ బుక్స్ నుంచి, పాండిచేరీ హిస్టారికల్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ నల్లం వెంకటరామయ్య గారు కొంత సమాచారాన్ని అందించారు.  యానాం లో ఉన్న పాతతరం వ్యక్తులు తమ అనుభవాలను చెప్పారు.  మరియు ఇతర పుస్తకాలు కూడా తోడ్పడ్డాయి.  (ఆయా రిఫరెన్సులను ఎక్కడికక్కడ పుస్తకంలోనే ఇచ్చాను).  ఇది దాదాపు ఓ రెండు సంవత్సరాలపాటు జరిపిన శ్రమ.  మొత్తం సమాచారాన్ని విశ్లేషించి, వ్యాఖ్యానించి, పర్యవసానాల్ని చర్చించి ఈ క్రింది హెడ్డింగులుగా విభజించి, సాధ్యమైనంత మేరకు  పునరుక్తి లేకుండా జాగ్రత్త తీసుకొని రచించాను.  యానానికి సంబంధించిన కొన్ని అరుదైన పైయింటింగ్స్, ఫొటోలను పుస్తకంలో పొందుపరచాను.

1.       ఫ్రెంచియానాంలో సాగిన వాణిజ్యం
2.       ఆనాటి చట్ట వ్యవస్థ
3.       ప్రకృతి భీభత్సాలు
4.       సామాజిక సంస్థలు
5.       ఫ్రెంచియానాంలో జరిగిన బానిసల వ్యాపారం
6.       బాల్యవివాహాలు - శారదాబిల్లు
7.       అప్పటి రాజకీయ చిత్రం
8.       విద్యావ్యవస్థ
9.       ఆనందరంగపిళ్ళై డైరీలలో యానాం ప్రస్తావన
10.   యానాం ఫ్రెంచిసమాధులు చెప్పే గాధలు
11.   యానాన్ని పరిపాలించిన పెద్దొరలు
12.   తెలుగుభాషకు సేవలందించిన ఫ్రెంచి దేశస్థులు
13.   ఆనాటి సామాజిక వ్యవస్థ
·         ముస్లిములు – మసీదు చరిత్ర
·         క్రిష్టియనులు – చర్చి చరిత్ర – వివిధ చర్చిఫాదర్లు – బొటానిక్ గార్డెన్ ఆఫ్ యానాం
·         హిందువులు – అలనాటి కులగణన, దేవాలయాలు
·         1767 నాటి ఒక అరుదైన యానాం వ్రాతప్రతి
·         ఫ్రెంచి జాతీయౌత్సవాలు – యానాం
·         షోల్ షెర్, మారియన్నె విగ్రహాల ఆవిష్కరణ
·         యానాంలో జరిగిన సతీసహగమన ఉదంతం
·         యానాంకు చైనా బంగారం
·         ఫ్రెంచివిప్లవసమయంలో యానాంలో ఏంజరిగింది
·         ఫ్రాన్స్ మ్యూజియంకు చేరిన యానాం రొయ్యలు
·         అదనపు జడ్జిలుగా స్థానిక పెద్దలు
·         మెడల్స్ మరియు హానర్స్
·         మన్యం జమిందారీ
14.   ఫ్రెంచియానాం ఆర్ధిక స్థితిగతులు
15.   ప్రజాప్రయోజనాల పనులు
16.   అలనాటి సాహితీ వేత్తలు
17.   ఆనాటి ప్రజల వితరణ
18.   ఫ్రెంచిపాలన చివరి రోజులు
19.   యానాం విమోచనోద్యమం
20.   యానాన్ని ఆంధ్రాలో ఎందుకు కలపలేదు?

పై ఇరవై వ్యాసాలు మొత్తం 201 పేజీలు. 14 పేజీల పుస్తకముందు భాగం.  మొత్తం పుస్తకం 215 పేజీలు.

ఈ పుస్తకాన్ని “Colonial History of Yanam”  గా అభివర్ణించవచ్చు.  ఇందులో ఉన్న చాలా అంశాలు ఇంతవరకూ ఏ ఇతర పుస్తకాల్లో లేని విషయాలు.  ఈ పుస్తకం వ్రాయటంలో నా ప్రధాన ఉద్దేశ్యం ఆర్చైవ్స్ లో మరుగునపడిఉన్న చాలా సంగతులను నలుగురుకీ తెలియచెప్పటం.  ఒక రకంగా చెప్పాలంటే “గతించిన కాలానికి దృశ్యరూపం”  (1723-1954) ఇవ్వటానికి చేసిన ఒక ప్రయత్నం.  ఈ పుస్తక రచనకు సుమారు రెండువేలకు పైన ఫ్రెంచి డాక్యుమెంట్లను పరిశీలించి ఉంటాను. నాకు ఫ్రెంచి రాదు.  గూగుల్ ట్రాన్స్లేటర్ మరియు ఆన్ లైన్ ట్రాన్స్ నిఘంటువులు అద్బుతంగా ఉపయోగపడ్డాయి.  నాకు వచ్చిన కొన్ని సందేహాలను ఈ బ్లాగులోనే కొంతమంది మిత్రులు నివృత్తి చేసారు. 

ఇక పుస్తకానికి  మంచి స్పందనే వస్తున్నది.  ముద్రణకు అయిన ఖర్చులో సగం వచ్చినా చాలనే అనుకొంటున్నాను. ఎందుకంటే ఈ పుస్తకం రాసేటపుడు నాకు కలిగిన తృప్తి అంతకన్నా ఎక్కువేనని భావిస్తాను. 


భవదీయుడు

బొల్లోజు బాబా

పుస్తకం లభించు ప్రదేశాలు

వెల: 150/-

1.Student Book Centre,
Main Road,
Yanam 533464

2.Palapitta Books
403, Vijayasai Residency
Salim Nagar, Malakpet
Hyderabad -36



Sunday, March 25, 2012

ఫ్రెంచిపాలనలో యానాం - పుస్తకావిష్కరణ

యానాం ఉగాది ఉత్సవాలలో నా మూడవపుస్తకం "ఫ్రెంచిపాలనలో యానాం"  పుస్తకావిష్కరణ, శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి చే జరిగింది. నా పుస్తకంపై ప్రముఖ కవి, రచయిత శ్రీ దాట్ల దేవదానం రాజు గారు ప్రసంగించారు. ఒక పెద్ద సభలో నాకొరకు పావుగంట సమయం కేటాయించిన యానాం ఎమ్మెల్యే శ్రీ కృష్ణారావు గారికి కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.

యండమూరి గారి గురించి ఇది వరలో నేచేసిన ఒక కామెంటు ఇక్కడ....

http://raji-fukuoka.blogspot.in/2011/11/blog-post_21.html

మరి అలాంటి పెద్దమనిషి నా పుస్తకాన్ని ఆవిష్కరించటం అంటే ..... what else I need అనిపించే విషయం కాక మరేమిటి?

(ఫొటోలో మధ్యలో తెల్ల డ్రెస్ లో ఉన్నది శ్రీ కృష్ణారావు, శ్రీ గిరిబాబు, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ యండమూరి, శ్రీ పి.ఆర్. ఎల్. స్వామి )
భవదీయుడు
 బొల్లోజు బాబా
 
 

Thursday, March 15, 2012

పోయిన శరత్తులో నీవెలా ఉన్నావో అలానే నాకు గుర్తు



పోయిన శరత్తులో నీవెలా ఉన్నావో అలానే నాకు గుర్తు
ఆకుపచ్చని టోపీతో....
ఒక నిశ్చల హృదయానివి.
నీ కళ్లల్లో వెన్నెల మంటలు కదం తొక్కేవి.
నీ ఆత్మజలాలపై ఆకులు రాలుతూండేవి.

నా చేతులపైకి ఎగబ్రాకుతోన్న ద్రాక్షతీగ ఆకులు
ఏమాత్రమూ ఆత్రములేని నీ ప్రశాంత స్వరాన్ని పీల్చుకొంటున్నాయి.

పారవశ్య జ్వాలలో నా దాహం దహింపబడింది
తీయని నీలి కలువ నా ఆత్మతో మెలికపడింది .

నీ నయనాలు దూరమయ్యాయి, శరత్తూ సుదూరంగా ఉంది.
నా ప్రగాఢ వాంఛలు
ఆకుపచ్చటోపీ వైపు,  పిట్టగానం వైపు, 
ఇల్లులాంటి హృదయంవైపు వలసపోయాయి.
నా ఉల్లాస చుంబనాలు బూడిదలా నేలరాలాయి.

కాంతిలో, పొగమంచులో, ప్రశాంత తటాకంలో
నువు నాకు గుర్తుకు వస్తున్నావు.

నీ కనులకు కనిపించనంత దూరంలో వెన్నెలలు కాలుతున్నాయి.
హృదయంలో శుష్కించిన శిశిర పత్రాలు  సుళ్లు తిరుగుతున్నాయి.

(Pablo Neruda - I Remember You As You Were  కవితకు స్వేచ్ఛానువాదం)
భవదీయుడు
బొల్లోజు బాబా 

Thursday, March 8, 2012

నా కొత్తపుస్తకం కవర్ పేజ్ - any suggestions pl.


ఈ ఉగాదికి ఆవిష్కరణ జరుగుతున్న నా కొత్త పుస్తక కవర్ పేజ్ ఇది.  దీనిని నా బాల్యమిత్రుడు చిన్నారి (యానాం) డిజైన్ చేసాడు.   DTP ఆపరేటర్ కొన్ని చిన్నచిన్న మార్పులు (ఫాంట్లకు) చేసాడు.  ఏమైన సలహాలు ఇవ్వగలరా? ప్లీజ్

భవదీయుడు
బొల్లోజు బాబా