Friday, September 30, 2011

అదే గులాబీ.....

చేతిలో రంగుల ఉత్తరం
గులాబీ పువ్వుతో
ఆ అబ్బాయి బస్సుకై
ఎదురుచూస్తున్నాడు

తను గుర్తుకొచ్చింది
ఒకనాటి
పూర్తికాని చుంబన పరిమళం
ఎదంతా పరచుకొంది

ఆ అబ్బాయి కళ్ళు
ఆగిన ప్రతి బస్సునీ
వెతుకుతున్నాయ్.


అతను అచ్చునాకులానే
ఉన్నాడనిపించింది
అవే కళ్ళు ...
అవే చూపులు ...
అదే గులాబీ ...


ఏమో నేనే
ఆ అబ్బాయినేమో!
ఆ అబ్బాయే
నేనేమో!

మరోసారి తడుముకొన్నాను
జెబులోని
గులాబీ రేకల గరగరల్ని


బొల్లోజు బాబా
చేతిలో రంగుల ఉత్తరం
గులాబీ పువ్వుతో
ఆ అబ్బాయి బస్సుకై
ఎదురుచూస్తున్నాడు

తను గుర్తుకొచ్చింది
ఒకనాటి
పూర్తికాని చుంబనపరిమళం
ఎదంతా పరచుకొంది
ఎక్కడుందో! ఏంచేస్తూందో!

ఆ అబ్బాయి కళ్ళు
ఆగిన ప్రతి బస్సునీ
వెతుకుతున్నాయ్.
అతను అచ్చునాకులానే
ఉన్నాడనిపించింది
అవే కళ్ళు
అవే చూపులు
అదే గులాబీ

ఏమో నేనే
ఆ అబ్బాయినేమో!
ఆ అబ్బాయే
నేనేనేమో!

మరోసారి తడుముకొన్నాను
జెబులోని
గులాబీ రేకల గరగరల్ని.

Friday, September 23, 2011

ఎంతదృష్టం......

ఎంతదృష్టం!
కనులున్నాయి
కనులు కనే
కలలున్నాయి
కలలు ఆవిష్కరించే
హాయైన లోకాలున్నాయి
ఎంతదృష్టం!


గాయాల్ని
ఇముడ్చుకొనే
హృదయముంది
హృదయ గాయాల్ని
నయం చేసే
కాలం ఉంది
కాలాన్ని వేటాడే
జీవితం మిగిలే ఉంది
ఎంతదృష్టం!


అన్ని వైఫల్యాలనూ
అక్కున చేర్చుకొనే
ప్రకృతుంది
ప్రకృతి పొరల్లో
ప్రాణాన్ని గింజను చేసి
పాతిపెట్టే మృత్యువుంది
మృత్యు స్పర్శను
నిత్యం స్వప్నించే
కనులున్నాయి......
ఎంతదృష్టం!


లేకపోతేనా
ఇన్ని వైరుధ్యాలున్న లోకాన్ని
దాటటం ఎంత కష్టం!


బొల్లోజు బాబా

Monday, September 12, 2011

కవిత్వం


ఆమె వచ్చి కూర్చొంది
ఇద్దరి మధ్యా నిశ్శబ్దం
రివ్వున వీస్తోంది

ఎక్కడి నుంచైతే నా భవిష్యత్తుని
ప్రారంభించానో ఆ పెదవులు
సన్నగా కంపిస్తున్నాయి

కానీ
ఆ నాటి కరుణ స్పందన కాదిది

ఇరువురి మౌనం
ఆ క్షణాల్ని కోసుకొంటూ సాగుతోంది
నదిని చీల్చుకొంటూ సాగే నావలా

హృదయ వేదికపై
మృత   జ్ఞాపకాల
కరాళ నృత్యం

శకలాల్ని ఒక్కొక్కటీ
ఏరుకొంటున్నాను

జారిపోతున్న చీకటినంతా
కూడదీసుకొని
"ఇక వెళ్తాను" అని లేచింది
"వెళ్ళొస్తాను" అను
"వస్తే....... వెళుతున్నానుగా!" అంది

నా నిస్సహాయ చూపుల్ని
విడిపించుకొని
ఆమె వెళిపోయింది
.............

రెండోసారీ
పునర్జన్మించాల్సినంత
జీవన కాంక్ష
ఎంతకీ కలగట్లేదు

ఇక శలవ్!

బొల్లోజు బాబా