ఈ మధ్య ఆంధ్రప్రదేష్ మీడియా కబుర్లు బ్లాగరి, రాముగారు “కవిత్వంలో డెబ్భై శాతం నాకు అర్థం కాదు...ఒక పాతికశాతం విషయాన్ని...'బహుశా ఈ అర్థం అనుకుంటా...' అని సరిపుచ్చుకుంటాను. సరిగ్గా అర్థమయ్యేది ఒక ఐదుశాతమే” అంటూ కవిత్వంపై ఆయన వెలిబుచ్చిన అభిప్రాయం చూసి ఆశ్చర్యం కలిగింది. ఆయనేమీ మామూలు వ్యక్తి కాదు. దశాబ్దాలుగా రచనారంగంలో ఉన్నవారే.
అంతేకాక ఈ మధ్య విడుదల అయిన ఒక కవితా సంకలనంపై బ్లాగుల్లో జరిగిన వాద ప్రతివాదాలు అందరికీ తెలిసినవే. ఈ సందర్భంగా Does Poetry matter in 21 centuary అనే పేరుతో ఒక వెబ్ సైట్ లో జరిగిన డిబేట్ నన్ను ఆకర్షించింది. అందులోని కొన్ని ఆశక్తి కరమైన అంశాలను సంక్షిప్తీకరించి పెడుతున్నాను.
కవిత్వానికి అనుకూల వాదనలు
ఇరవయ్యొకటవ శతాబ్దంలో కవిత్వం పాత్ర పదిలమే. ఇది మనల్ని ఇంకా ప్రభావితం చేస్తుందా అంటే చేస్తూనే ఉంటుందనే చెప్పుకోవాలి. వేల సంవత్సరాల క్రితం నాటి కవిత్వాన్ని శ్లోకాల (psalms) రూపంలో మనం ఇంకా ఉటంకించటం లేదా? షేక్స్ పియర్ ’టుబి అర్ నాటు బి’ -- రాబర్ట్ ఫ్రాస్ట్ “Two roads diverged in a wood, and I took the one less traveled by, And that has made all the difference." లేదా The woods are lovely, dark and deep, But I have promises to keep, And miles to go before I sleep, And miles to go before I sleep." వంటి వాక్యాలలో అర్థం, ఉద్వేగం నేటికీ నిలిచే ఉన్నాయి. ఇలాంటివి మనలను కదిలిస్తూనే ఉంటాయి. మనం కూడా వాటిని తరవాతి తరాలకు కదిలిస్తూనే ఉంటాము. --- రిక్ బెవెరా
హృదయ కెలిడియోస్కోపుతో సృజనలోతుల అన్వేషణకు, ఆత్మ ఆవిష్కరణకు, ఈ ప్రపంచాన్ని రంగులలో ఆవిష్కరించటానికీ కవిత్వమొక్కటే శరణ్యం. మనల్ని పరిపూర్ణం చేసే మాధ్యమమే కవిత్వం. మనల్ని పారవశ్యంలోకో లేక మానవ గాయాల్లోకో తీసుకెళ్ళే అంతర్ చిత్రాలు, సంకేతాలు, భావనలు వ్యక్తీకరణల సమాహారమే కవిత్వం. కవిత్వం లేకపోతే మానవ హృదయాన్ని ఆత్మను అర్ధం చేసుకోవటంలో ఒక శూన్యత నెలకొని ఉంటుంది. – చెర్రీ లార్సన్
గతంలో కవులు రాజాశ్రయంలో ఉండేవారు. చనిపోయిన వందల సంవత్సరాల తరువాతకూడా వారి స్మరణ జరిగేది. కానీ నేటి మల్టిమీడియా ప్రపంచంలో, రియాల్టీ షోలు, ప్లాస్మాటీవీల జోరులో దృశ్య మాధ్యమం లేని ఉత్త పదాలు బలమైన భావోద్వేగాలని సృష్టించగలవా అని ప్రశ్నించకుండా ఉండలేం. అయినప్పటికీ కవిత్వానికి నేటికీ ప్రాధాన్యత ఉందనే నేను నమ్ముతున్నాను. నేటి కవులు పూర్వపు కవులవలె సెలిబ్రిటీలు కాకపోవచ్చు. కానీ కవిపలికే ప్రతీ పదానికీ అత్యంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే, ప్రతీ మనిషి ఒక్కో జీవితాన్ని ఒక్కో దారిలో జీవిస్తున్నాడు, నీదారిని నేను చూడలేకపోయినా నాదారిని నీవు చూడలేకున్నా, ఒకరి జీవితాల్ని, హృదయాల్ని, అనుభవాల్ని మరొకరికి చూపించాలంటే నేటికీ సాహిత్యమే శరణ్యం. అక్షరాలే మానవాళిని అనుసంధానం చేసే సాధనాలు. -- క్రిస్ట్లె హార్నాండెజ్
కవిత్వం అనేది ఈ శతాబ్దానికి తగినట్లుగా మారుతూ వస్తున్నది. ఇది వరకట్లా అది క్లిష్టంగా, అర్ధంకాని విధంగా ఉండటం లేదు. వాడుక భాష లో వ్రాసిన కవిత్వం ప్రాచుర్యం పొందుతూంది. నేటి రాప్/సినీ గీతాలలో మంచి కవిత్వం తొణికిసలాడుతున్నది. నేడు కవిత్వం కనిపించే మరో రంగం గ్రీటింగ్ కార్డుల అభినందనల్లో (ఇదో చిల్లర ఉదాహరణ కావొచ్చునేమో) కవిత్వం అద్బుతంగా ఉంటోంది. నర్సరీ రైములలో కవిత్వం పాళ్ళు తక్కువేమీ కాదు. కవిత్వానికి మనమేం సెంచరీలో ఉన్నామో అన్న స్పృహఉందనే అనిపిస్తూంది. – మెలనీ మిల్లర్
మంచిగా రాసిన కవిత మానవ అనుభవానికి చిత్తరువు లాంటిది. కవిత్వాశ్వాదన మన జీవితాల్ని పరిపూర్ణం చేస్తుంది. సృజన లేని, రాజకీయంగా కరక్ట్ అభిప్రాయాలనే చెప్పాలని శాసిస్తున్న దశకం ఇది. పాత గ్రంధాలను ”రాజకీయంగా కరక్ట్” చేస్తూ తిరిగి రాయలన్న అపవిత్ర చర్చలు జరుగుతున్న కాలమిది. ఈ సందర్భంలో మన పిల్లలకు కవిత్వాన్ని అందించటం చాలా చాలా అవసరం. కవిత్వాన్ని అర్ధం చేసుకోవటంలో నిశితమైన ఆలోచనా దృష్టి చదువరిలో ఏర్పడుతుంది. కవి ఎమి చెప్పదలచుకొన్నాడో మనం అర్ధం చేసుకొనే ప్రయత్నంలో మన ఆలోచనల, భావాల పరిధి పెరిగి మన దృక్కోణాన్ని తీక్షణ పరుస్తుంది. – కారోల్ జియోలా
కవిత్వాన్ని వివిధ వ్యక్తులు వివిధ రకాలుగా అర్ధం చేసుకొంటారు. కొంతమందికి కవిత్వం అంటే స్కూలులో బట్టీవేయవలసి వచ్చే కొన్ని హింసాత్మక పారాగ్రాఫులు. మరికొంతమందికి కవిత్వం అంటే అసలేమీ కాకపోవచ్చు. మనం 21 వ శతాబ్దంలోకి వచ్చేసాం కదాని కవిత్వం అప్రస్తుతం అని భావించక్కరలేదు. ఎందుకంటే కవిత్వం అంటే ఒక వ్యక్తీకరణ, ఒక కళారూపం, ఒక కధారూపం. ఎలా అంటే
కవిత్వం ఒక వ్యక్తీకరణ: కవిత్వాన్ని అర్ధం చేసుకోవటం సులువైన పనికాదు. కవిత్వం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అన్న విషయంలో మనం తరచూ గందరగోళానికి గురవుతూంటాం. కవిత్వం ఇలా ఉండాలని కవిత్వానికి సంబంధం లేని కొన్ని సూత్రాలను ప్రతిపాదించుకొంటాం. ఆ సూత్రాలకు అనుగుణంగా కవిత్వం రావటం లేదని బాధపడుతూంటాం. ఎవరేమనుకొన్నప్పటికీ కవిత్వం అనేది కవియొక్క అభివ్యక్తి (expression). ఇది వాని హృదయంనుంచో, మెదడులోంచో లేక ఆత్మలోతుల్లోంచో మొలకెత్తుతుంది. కొన్నిసార్లు ఇది మసకమసకగానో లేక ప్రకాశవంతంగానో బయటకు వస్తుంది. ఇది కొన్ని దృశ్యాలను, ఉద్వేగాలను, ప్రేమను, ఆనందాన్ని, బాధను తెలియచేస్తూంటుంది. ఏది ఏమైనప్పటికీ ఒక కవి తన చుట్టూ ఉన్న ప్రపంచంతో పంచుకోవాలని తనలోలోపల్లోంచి బయటకు తీసిన పదార్ధమే కవిత్వం.
కవిత్వం ఒక కళారూపం: జాక్స్ న్ పోల్లక్ (ఒక అబ్ స్ట్రాక్ట్ పెయింటరు) చిత్రాన్ని చూసిన ఒక వ్యక్తి దానికి అర్ధం ఏమిటని అడగవచ్చు. అదే చిత్రాన్ని చూసిన మరొకరు భావోద్వేగానికి గురయి చెమ్మగిల్లిన కళ్లతో వెనుతిరగవచ్చు. రెండో వ్యక్తికి తెలుసు పోల్లక్ గీసిన చిత్రం లోని అర్ధమేమిటో. కవిత్వం కూడా అంతే. అందరికీ అర్ధం కావాలనేమీ లేదు. అలాగని అందరికీ అర్ధం కాకుండా కూడా ఉండదు. ఎందుకంటే కవిత్వమొక కళా రూపం అంతే. కళా రూపం కనుక కవిత్వానికి ఉండాల్సిన విలువ ఉండాల్సిందే అది ఏ శతాబ్దమైనా.
కవిత్వం ఒక కధ: హోమర్ కాలం నుంచి డికిన్ సన్ కాలం వరకూ కవిత్వం లో కధను చెప్పటం ఒక ప్రక్రియ. అది గొప్ప గాధలు కావొచ్చు, లేక చిన్న చిన్న సంఘటనలు కావొచ్చు. కధలు అనేవి మానవ చరిత్రని లిఖించే శిలా శాసనాలు.
ఒకరు అక్షరీకరించిన రసాన్ని పూర్తిగా అర్ధం చేసుకోవటం సులభం కాకపోవచ్చు కానీ ఒకరు ఆవిష్కరించిన రసం అప్రాధాన్యమైనదని తీర్మానించటం దుస్సాధ్యం అది ఏ శతాబ్దమైనప్పటికీ. – డనెల్లె కార్త్
21 వ శతాబ్దంలో కవిత్వం అంతరించిపోతున్న ఒక వ్యాపకంగాను, సాంకేతికంగా వెనుకబడిన పాతకాలపు వ్యక్తులు కొనసాగిస్తున్న తెలివితక్కువ వ్యవహారం గాను మిగిలిపోయింది. అక్కడక్కడా కవిత్వసభలు జరుగుతున్నప్పటికీ, ఆహూతులలో, తమ కవిత వినిపించే చాన్సు ఎప్పుడువస్తుందా అని ఎదురుచూసే కవులే ఉంటున్నారు. ఒక నాటి కవులు పొందిన కీర్తిని సినీ తారలు, క్రీడాకారులు, అరాచకంగా ఎత్తులకెదిగిన కొద్దిమంది హైజాక్ చేసేసారు. ఇది సమాజానికి మంచిది కాదు, ఇప్పుడే కవిత్వావసరం సమాజానికి మరింత ఎక్కువ. ఎందుకంటే జెట్టు స్పీడులో పోతున్న ఈ ప్రపంచానికి, కవిత్వం కాసేపు ఆగి లోతుగా ఆలోచించుకొనే అవకాసాన్నిస్తుంది. మెదడుకు పనిచెప్పే క్రాస్ వర్డ్ పజిల్స్ లేదా సుడొకు లాంటి ఆటల్లో ఆలోచనా పరిధి పరిమితంగా ఉంటుంది. (జవాబు వస్తే ఇక ఆట ముగిసినట్లే). కానీ కవిత్వంలో వస్తువు, వాక్య నిర్మాణం, భాష ప్రయోగం, పదాల ఎంపిక వంటి విషయాలలో అనంతమైన అవకాశాలు ఉంటాయి. కనుక కవిత్వం మనసుకు ఆత్మకు స్వేఛ్చనిస్తుంది.
కవిత్వం మన ఎమోషన్లకు అద్బుతమైన మార్గం చూపిస్తుంది. మన బాధలకు, నిరాశలకు, కోపానికి, ఒత్తిడులకు చక్కటి అవుట్ లెట్ ను కళాత్మకంగా కల్పించి మంచి పరిష్కారమార్గాల్ని సూచిస్తుంది. – అల్లన్ ఎమ్ హెల్లెర్
వ్యతిరేక వాదనలు
కవిత్వం చచ్చిపోతూన్నదా లేక అదింకా జీవం ఉన్న కళారూపమా? అన్న ప్రశ్న ఈ చారిత్రిక సంధికాలంలో తలెత్తటం సహజమే. కవిత్వం అనేది మౌఖిక ప్రక్రియద్వారా తరతరాలుగా అందించబడిన ఒక కళారూపం.
చరిత్రను గమనిస్తే- పబ్లిక్ రంగము, వ్యక్తిగత రంగాలు విస్పష్టంగా ఉండేవి. ఇల్లు వ్యక్తిగతమైన రంగం గాను, ప్రదర్శన శాలలు/రాజ సభలు పబ్లిక్ రంగాలుగా పనిచేసేవి. ఈ ప్రదర్శన శాలలలో కళాకారులు, కవులు వారివారి కళలను సభికులముందు ప్రదర్శించేవారు. వాటి మంచి చెడ్డలను అక్కడ చర్చించటం జరిగేది. ఇందులో కళల ప్రదర్శన కు మౌఖికరూప ప్రక్రియ ప్రధాన పాత్ర వహించేది. నేడు అట్లాంటి ప్రదర్శన శాలలు అంతరించిపోయాయి. వాటి స్థానాన్ని దృశ్యరూప మాద్యమం ఆక్రమించింది. ఇలాంటి దృశ్య ఆధారిత కళల ప్రదర్శనా వాతావరణంలో చాలా కళారూపాలు అంతరించటం మొదలైంది. అందుకనే పత్రికల, పుస్తకాల అమ్మకాలు పడిపోయాయి. కవిత్వం ముఖ్యంగా ఒక శబ్దాధారిత ప్రక్రియ. కనుక అంతరించక తప్పదు. ఈ దృశ్యాధారిత మాద్యమ ప్రభంజనంలో కవిత్వం అనేది ఒక తెల్లకాగితం పై వ్రాసిన అక్షరాలు మాత్రమే – చాలా సందర్భాలలో ఆ తెల్లకాగితం విలువకూడా లేని. – హ్యూమా రషిద్
19 వ శతాబ్దం వరకూ కవిత్వమే అత్యున్నతమైన సాహిత్య ప్రక్రియ. కధ లేదా నవలా ప్రక్రియ అప్పటికే ఉన్నప్పటికీ ఆకాలంలో కవులకు వచ్చినంత పేరు రచయితలకు రాలేదు. ఈనాటి చాలామందికి ఆనాటి రచయితల పేర్లే తెలియవు. కానీ ఇరవయ్యవ శతాబ్దం వచ్చేసరికి పరిస్థితి తారుమారయ్యింది. నేడు కవి కంటే రచయిత ప్రముఖుడుగా చలామణీ అయ్యే పరిస్థితి వచ్చింది. నేడు చాలా మంది ఔత్సాహిక కవులకు కవిత్వం అనేది ఒక మానసిక అవుట్ లెట్ గా మారిపోయిందనటంలో సందేహం లేదు. సార్వజనీనత కోల్పోయింది. ఏదో కొద్దిమందికే అర్ధం అయ్యే ప్రక్రియగా మారిపోయింది. కవిత్వం స్వీయనిర్మిత శిఖరం నుంచి దిగివచ్చి, మేధోపరంగా తాజాగా తయారయి, ప్రజాస్వామికంగా అందరికీ అందుబాటులోకి వచ్చినపుడే అది నేటి మల్టిమీడియా దాడిని ఎదుర్కొని నిలబడగలదు. – లెప్లెన్
కవిత్వం నేడు డబ్బునిచ్చే ప్రక్రియ కాదు. డబ్బులేని ప్రక్రియలు బతికే అవకాశాలు లేవు. -- సాండీ షాన్
ప్రస్తుతకాలం హారీపోటర్, ది సింప్సన్ సినిమాలు, Myspace, sms ల ప్రపంచం. ఇవే నేటి కాలపు కళారూపాలు, వ్యక్తీకరణ మాధ్యమాలు. ఒకప్పుడు కవులు రాక్ స్టార్ లకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు కలిగి ఉండేవారు. కానీ ఈ రోజు కవులు ఏవో స్థానిక పత్రికల్లో ఎక్కడో ఓ మూల తమ కవిత పబ్లిష్ అయితే చాలులే అనే స్థాయికి చేరుకొన్నారు. మనలో ఎంతమంది 1970 ల తరువాత వచ్చిన కవులలోని ఓ ముగ్గురి పేర్లు చెప్పమంటే టకటకా చెప్పగలరు?
మనలో ఎంతమంది ప్రతిరోజూ కవిత్వం చదువుతున్నారు. నిన్నచదివిన నవలలానో లేక చూసిన సినిమాలానో ఎంతమంది తమమిత్రుల వద్ద తాము చదివిన కవిత్వం గురించి చర్చిస్తున్నారు? దురదృష్టవశాత్తు కవిత్వం తన మాస్ అప్పీల్ ను కోల్పోయింది. కవియొక్క మేధోశక్తిని, శ్రమని సమాజం హర్షించే స్థితిలో లేదు. యవ్వనంలో ఉన్న ఈ శతాబ్దం హారీపోటర్ పేజీలు తిప్పుకొంటోంది. – సి.సి. వాగో
భవదీయుడు
(ఈ పోస్టుకు ఇంట్రోగా రాముగారిని తీసుకోవటం ఆయనను నొప్పిస్తే క్షంతవ్యుడను. పై అభిప్రాయాలలో – చెర్రీ లార్సన్ భావాలతో నేను ఏకీభవిస్తాను. పై వ్యాఖ్యలు ప్రపంచ కవిత్వధోరణులని ప్రతిబింబించినా తెలుగులో కూడా అదే పరిస్థితి ఉంది —బొల్లోజు బాబా)