Friday, June 5, 2009

అప్పుడు - ఎందుకు (క్రిసెంట్ మూన్ కు తెలుగు అనువాదం)

నా బుజ్జాయీ,
నీకు నేను రంగుల బొమ్మలు తెచ్చినపుడు అర్ధమయింది
మేఘాలు, జలాలపై అట్టి రంగుల నాట్యం ఎందుకుందో
పూవులు భిన్న వర్ణాలను ఎందుకు అద్దుకొన్నాయో!
నీకు రంగుల బొమ్మలు ఇచ్చినపుడు నాకర్ధమయింది.

నిన్ను ఆడించేందుకు నేపాడినపుడు తెలుసుకొన్నాను.
ఆకులలో సంగీతం ఎందుకుందో! ఆలకించే పుడమి హృదయానికి
అలలు తమ బృందగానాన్ని ఎందుకు వినిపిస్తాయో!
నిన్ను ఆడించేందుకు నేపాడినపుడు అర్ధమయింది.

మధురపదార్ధాలను నీ చేతికి అందించినపుడు తెలిసింది.
సుమపాత్రికలో మధువు ఎందుకుందో!
రహస్యంగా ఫలాలు అమృతంతో ఎందుకు నింపబడతాయో!
మధురపదార్ధాలను నీ చేతికి అందించినపుడు నాకు తెలిసింది.

నా ప్రియమైన బుజ్జాయీ
నిన్ను నవ్వించటానికి నీ మోమును ముద్దిడినపుడు
నాకు నిశ్చయముగా అర్ధమయింది.
ఎంతటి సంతసం ఆకాశం నుండి ఉదయకాంతిలో ప్రవహిస్తున్నదో!
నా దేహానికి వేసవి తెమ్మెర ఎంతటి హాయినిస్తుందో!
నిన్ను నవ్వించటానికి నీ మోమును ముద్దిడినపుడు తెలిసింది.

బొల్లోజు బాబా

మూలం: టాగోర్ క్రెసెంట్ మూన్ లోని
WHEN AND WHY అనే గీతం

7 comments:

  1. ఎంత హాయైన భావనో, నిజానికి అమ్మని కాగలినందుకు ఎంత సంతసించానో. ఈ ప్రతి పాదంలో జీవిస్తూనేవున్నానింకా. కన్నుల నిండిన ఆనంద భాష్పాల సాక్షిగా, ఈ తరహా భావనల్లో నిత్యం మునిగే నన్ను చూసి నవ్వే నా ఆరు ప్రాణాల [ఒకరు పంచ ప్రాణాలు, మరొకరు ఆరోప్రాణం అని పంచి ఇచ్చేసా] మీద ప్రమాణం చేసి తెలుపుతున్నాను - కవిత హృదయాన్ని ఇచ్చిన దేమునికి, మీ వంటి ఉన్నత ప్రమాణాల కవితలు, అనువాదాలు అందించే వారికి మరో సారి కృతజ్ఞతలు.

    ReplyDelete
  2. చాలా బావుంది..

    ReplyDelete
  3. భాష విషయంలో ఇంకా ప్రయత్నించాలి.
    అనువాదం అనిపిస్తుంది కాని సృజనానువాదం అనిపించటంలేదు.

    ReplyDelete
  4. బాబా గారు, కవిత బాగుంది. సహృదయులకొక విన్నపం. మూల కవితని ముందు పెట్టుకొని అనువదించకుండా్, పుస్తకాన్ని మూసి అనువదించి చూడండి. మీవైన పదాలు అలవోకగా జాలు వారుతాయి.

    ReplyDelete
  5. చాల బాగుందండి....చదివిన తరువాత పసిపిల్లను అయిపోతే బాగుండును అనిపిస్తుంది, కాని అలా జరుగదుగా...ప్చ్..ప్చ్

    ReplyDelete
  6. స్పందించిన అందరకూ ధన్యవాదములు
    కిరణ్ గారు భాస్కర్ గారు
    మీ సూచనలను పాటిస్తాను.
    థాంక్యూ

    ReplyDelete
  7. అనువాదం సూపర్ గా చేసారండి..

    ReplyDelete