Tuesday, July 22, 2008

యూజర్ నేమ్ : మనిషి - పాస్ వర్డ్: మానవత్వం



ఓ యూజర్ నేమూ, పాస్ వర్డూ
ఇచ్చి దేముడు నన్నీలోకంలోకి దించాడు.

పాస్ వర్డెక్కడ మరచిపోతానోనని
హృదయంపై పచ్చబొట్టుగా వేయించుకున్నాను కూడా.

బాల్యం వరకూ హృదయం నాతోనే ఉంది
ఆ తరువాతే కనిపించకుండా పోయింది.
ఎక్కడైనా పారేసుకున్నానో లేక
ఎవరైనా ఎత్తుకుపోయారో నాకు గుర్తు లేదు.
అక్కడి నుండే కష్టాలు మొదలయ్యాయి.

పచ్చనితీరాలకై నే వలస పోయేటప్పుడు
అప్పటిదాకా నన్ను రెప్పలా కాపాడిన
నాలుగు వృద్ధ నయనాల జల భాషను
డీకోడ్ చెయ్యలేక పోయాను - పాస్ వర్డ్ లేక.

కారీర్ కడ్డం పడుతుందని
చిదిపించేసిన రెండునెలల పిండం
ఏదో చెప్ప ప్రయత్నించింది
రాంగ్ పాస్ వర్డ్ - ఆడియో ఫైల్యూర్.

"తాతయ్యపోయినప్పుడు నువ్వూ, పెదనాన్నా
ఎందుకు దెబ్బలాడుకున్నారు" అని
ఆర్ధిక మర్మాలు తెలియని నాకూతురు అడిగినపుడు
పాస్ వర్డ్ మర్చిపోవటం వల్లేనని
చెప్పలేకపోయాను.

అంతెందుకు
శ్రీశ్రీ వర్ణించిన బిచ్చగత్తె ప్రతీరోజూ
నా ఒక్కరి ముందే చేయి చాపుతాది.
పాస్ వర్డ్ లేదని పర్సు తెరచుకోదు.

అంతా తెలుస్తూనే ఉంది
కానీ ఏమీ చెయ్యలేని తనం.

జీవితం ఫోల్డర్ లోని శాంతి అనే ఫైలు
ఎంత ప్రయత్నించినా తెరుచుకోవటం లేదు.

దేవుడా
దయచేసి నా పాస్ వర్డ్
రిట్రీవ్ చేసి పెట్టవూ?

బొల్లోజు బాబా

(మెటఫర్స్ లేకుండా ఎందుకు వ్రాయలేరు అని ఆత్మీయంగా ప్రశ్నించిన సాయిసాహితి గారికి)

25 comments:

  1. బాబా గారు,
    అద్బుతంగా చెప్పారు.అంతకు మించి పదం కూడా తెలియట్లేదు.భలే పోలిక.

    ReplyDelete
  2. పాస్ వర్డ్. బాగుంది మీ కవిత. కోల్పోయింది హృదయాన్నైనా అది చాలా వాటికి పాస్ వర్డ్ లాంటిదని అది కోల్పోతే కూడా చాలా వాటిని కోల్పోతామని చాలా చక్కగా చెప్పారు. కాకపోతే ఇదీ మెటాఫరే కదా. మీరు మెటాఫర్ లేకుండా రాద్దామనుకున్నారా లేక మెటాఫర్ యెంత అందాన్ని తెస్తుందో చెబుదామనుకున్నారా? కొంచెం confuse అయ్యాను. arun.1202@gmail.com

    ReplyDelete
  3. I have some problem adding comment to your blog. So I have to resort to anonymous method. arun.1202@gmail.com

    ReplyDelete
  4. మెటఫర్ (రూపకం అని ముద్దుగా తెలుగులో పిలుచుకోవచ్చుగా) లేకూండా రాశారా ఇది? ఎందుకు సార్ జోకులేస్తారు? పద్యం అంతా ఒక అవిఛ్ఛిన్నమైన రూపకాలంకారం అయితేనూ?

    ఓపెనింగ బ్రహ్మాండంగా ఉంది. గుండె మీద పచ్చబొట్టు పొడిపించుకుని పారేసుకోడం కూడా బాగుంది. అక్కడి నించి కొద్దిగా పల్చబడింది. మీరు మళ్ళీ శ్రద్ధ పెడితే మిగతా పద్యానికి దీటైన అనుభవ చిత్రాల్ని సృష్టించడం మీకు కస్టం కాదు.

    అన్నట్టు తాజాగా గజని చిత్రం చూశారేంటి? హృదయం మీద పచ్చ బొట్టు అంటేనూ ..

    ReplyDelete
  5. చాలా బాగా రాసారు... సూపర్.

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. మనిషికి మానవత్వం ముఖ్యమని ఎంత బాగా చెప్పారు.
    ఈ రోడ్డు కూడలిలో అడుక్కొనే వాళ్ళని చూసినప్పుడు, పసితనంలోనే పని చేసేవారిని చూసినప్పుడు మనస్సేమిటో బరువెక్కుతుంది.

    ReplyDelete
  8. చాలా చాలా బాగు0ద0డి.

    నాలుగు రోజుల క్రిత0 రాసి ఈ రోజు పోస్ట్ చేద్దామనుకుని డ్రాఫ్ట్ లో పెట్టుకున్న నా కవితలోని 3 లైన్లు మీ కవితలో వున్నాయి :(

    ఇ0త ఆర్ధ్రత తో నేనెప్పటికి రాయగలనో?

    ReplyDelete
  9. చాలా బాగుంది బాబా గారు,ఒపెనింగ్ అదుర్స్:)

    ReplyDelete
  10. చాలా ఆర్ద్రంగా సాగింది.ఎంత బాగుందంటే వెంటనే ప్రింట్ కమేండ్ ఇచ్చి కాపీ తీయకుండా ఉండలేనంత.నా జీవితంలో నేను చేసిన ఒకట్రెండు తప్పులు నా ఎదురుగా నిలిచి నన్ను ప్రశ్నించాయి.సమాధానం చెప్పుకోలేకపోయాను.
    ధన్యవాదాలు.

    ReplyDelete
  11. నరేంద్ర భాస్కర్ S.P
    నమస్తే,
    కవిత చాలా బాగుంది సర్,

    ReplyDelete
  12. @ రాధిక .. మీ ప్రశ్న చూస్తే నవ్వొచ్చింది. మీ కవిత్వం స్నేహపు చినుకుల జల్లులలో ఆర్ద్రతతో నిండి ఉన్నదనే మీ అభిమానులంతా అనుకుంటున్నారు. నాకూ మీ కవిత్వం అంటే ఇష్టమే .. కానీ ఇంకా అంతకంటే ఛాలా బాగా రాయగలరని నమ్మకం కూడా.
    ప్రముఖ కవి వాడ్రేవు భద్రుడు ఒక పద్యంలో అంటారు ..
    నన్ను నేను తవ్వుకోవాలి నాలోకి, తోడుకోవాలి నాలోంచి
    ఒక్క చుక్క మంచి నీటి కోసం, ఒక్క మంచి మాట కోసం... అని.
    (పూర్తి పాథం ఇక్కడ)
    ఇదే అర్ద్రత రహస్యం. మరిక తవ్వకాలు మొదలెట్టండి :)

    ReplyDelete
  13. క్రాంతి కుమార్ గారు
    ధన్యవాదములు.

    అరుణ్ గారు మెయిల్ ఇచ్చాను గమనించారా?

    కొత్తపాళీగారికి
    మెటఫర్లు అన్న మాటను తప్పుగా వాడినట్లు మీ కామెంట్ ద్వారా తెలుసుకున్నాను. చాలా చాలా థాంక్స్.
    కవిత నచ్చినందుకు ధన్యవాదములు.
    ఇక సాయిసాహితి గారు కోరినదేమిటంటే: నా కవితలలో అది అలా ఉంది ఇది ఇలా ఉంది అనేటటువంటి ఉపమానాలు ఎక్కువగా ఉంటాయని, పదచిత్రాల ఆడంబరత అధికంగా ఉంటుందనీ, అవేమీ లేకుండా ఎందుకు వ్రాయలేవని ప్రశ్నించారు.
    కానీ మీ కామెంటుని బట్టి అలా వ్రాయాలని ప్రయత్నించి మరలా అందులోకే పోయినట్లున్నాను.
    మీరిచ్చిన లింకు చూసాను. చాలా చాలా గొప్పకవిత. వాడ్రేవు గారు కలాం రచనల అనువాదకుని గానే ఎక్కువ తెలుసు.

    నాగరాజా గారు
    ధన్యవాదములు

    వర్మగారు
    మీకామెంటు నేను చదివాను. చాలాబాగుంది. ఎందుకు తీసివేసారు. మళ్ళీ పెట్టేయనా.

    కలగారు
    థాంక్యూ
    కవిగారు
    నెనర్లు

    రాధికగారు
    మీరిలా కామెంటు చేయటం మీ మోడేష్టీ. అంతే.

    ఫణీంద్ర గారు
    థాంక్స్

    నరసింహ గారు
    ఈ కవిత మీకు నచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ వాఖ్య నా కవితకు సార్వజనీనతను కలిగించినట్లు గా భావిస్తున్నాను.
    నెనర్లు.

    జగదీష్ గారు, నరేంద్ర భాస్కర్ గారు, మీకు ఈ కవిత భావావేశం కలిగించినందుకు హేపీ గాఉంది.

    అందరికీ ధన్యవాదములు.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  14. బాబా గారు,
    మానవత్వం పరిమళించే..
    అంటూ మనస్సు తియ్యగా మూలిగిందండి మీ కవిత చదివాక.
    కవిత చాలా ఆర్ధ్రతతో నిండి ఉంది. మీ నుంచి ఇంకా మంచి కవితలు ఆశిస్తూ (ఆంగ్ల పదబంధాలు లేకుండా :-D)
    ప్రతాప్.

    ReplyDelete
  15. బాబా గారు,
    ఇప్పుడున్న ప్రపంచానికి మానవత్వం అని చెప్పటం మొదలు పెడితే అర్ధం కాదు. ఎందుకంటే మన ఆరాధ్య దైవం శ్రీ హనుమంతున్ని కూడా హనుమాన్ గా పరిచయం చేసుకుంటున్న దౌర్భాగ్యులం మనం. అందుకే మీ కవిత లోని మొదటి వాక్యాలు ఈ సమజానికి చేరగలవని భావిస్తున్నా.

    "ఓ యూజర్ నేమూ, పాస్ వర్డూ
    ఇచ్చి దేముడు నన్నీలోకంలోకి దించాడు.

    పాస్ వర్డెక్కడ మరచిపోతానోనని
    హృదయంపై పచ్చబొట్టుగా వేయించుకున్నాను కూడా"

    అన్నట్టు మీరు ఈ మధ్య నా బ్లాగు పై కినుక వహించారని అనిపిస్తుంది. ఏం నేరం చేసానో తెలియరాలేదు.

    ReplyDelete
  16. బాబా గారు,
    నా పాటలకి మీ వ్యాఖ్యలు చూసా. ధన్యవాదలు.మూషికవరం టపా చూసారా?

    ReplyDelete
  17. అందుకే మీ లాంటి వాళ్ళు రాయడం మాకు అవసరం... రాబోయే తరానికి కూడా మీరు రాసింది అర్ధమయిపోతుంది... మీ రచనలు చూస్తే నాకనిపిస్తుంది... మీరు మీ ముందు తరాన్ని ఎంతబాగా అర్ధం చేసుకున్నారో, మీ తరాన్ని, మీ తరవాత తరాన్ని కూడా అర్ధం చేసుకుంటున్నారని... మార్పుని అర్ధం చేసుకుని, సాదరంగా ఆహ్వానించగలరని... మీ రచనల్లో మీరు చూపించే వైవిధ్యం నన్ను అలా అనుకునేట్టు చేస్తుంది...

    ReplyDelete
  18. "బాల్యం వరకూ హృదయం నాతోనే ఉంది
    ఆ తరువాతే కనిపించకుండా పోయింది."
    బాబాసాహిబ్, మీ హృదయం, మానవత్వం మాకు కనిపిస్తున్నాయి. స్పందించే మీ గుణం కూడా.
    "కారీర్ కడ్డం పడుతుందని
    చిదిపించేసిన రెండునెలల పిండం" - పోటీ ప్రపంచం లో అయిష్టంగా జరుగుతున్న పచ్చి నిజం. ఈ అతివాస్తవికత కొన్ని సార్లు భయపెడితే, మరి కొన్ని సార్లు ఆలోచింపచేస్తుంది.

    ReplyDelete
  19. నేను ఆలస్యంగా వచ్చేసరికీ, చెప్పాల్సినవన్నీ అందరూ చెప్పేసారు. వచ్చానుకాబట్టి మిమ్మల్ని కనీసం అభినందించి పోదామని ఈ కామెంట్ రాస్తున్నా.

    ReplyDelete
  20. నేనూ ఇవ్వాళే చూసాను...అద్భుతంగా ఉంది అని తప్ప, చెప్పడానికేమీ మిగల్లేదు...

    ReplyDelete
  21. ప్రతాప్ గారు
    ధన్యవాదములు.
    ఇక ఇంగ్లీషు పదాలగురించయితే--just like that. thats all.
    మురళి గారికి
    మీరన్నది నూరు శాతం కరక్టే. ధన్యవాదములు.

    దిలీప్ గారికి
    మీ వివరణ నాకు చాలా కిక్కునిస్తుంది. (అదేదో కిక్కనుకునేరు)

    రావు గారికి
    మీరు మొదటి సారిగా విచ్చేసి కామెంటిచ్చనందుకు చాలా చాలా కృతజ్ఞతలు సారూ.

    మహేష్ గారూ
    మీ ఆత్మీయతకు నాకు పదాలు సరిపోవు. చాలా చాలా కృతజ్ఞ్తలు.

    గిరీష్ గారికి
    చూసి అభిప్రాయాన్ని తెలిపినందుకు ధన్యవాదములు సారు.

    బొల్లోజు బాబా

    ReplyDelete
  22. ఎంత సింపుల్ గా ఉందో, అంతే అర్ధవంతం గా ఉంది... గొప్ప కవుల లక్షణంలా ఉంది... ముఖ్యంగా ఈ లైన్లు వాస్తవికతకూ, హ్రుదయానికీ మరీ దగ్గరగా వచ్చాయి -

    "తాతయ్యపోయినప్పుడు నువ్వూ, పెదనాన్నా
    ఎందుకు దెబ్బలాడుకున్నారు" అని
    ఆర్ధిక మర్మాలు తెలియని నాకూతురు అడిగినపుడు
    పాస్ వర్డ్ మర్చిపోవటం వల్లేనని
    చెప్పలేకపోయాను."

    ReplyDelete