Thursday, March 15, 2012

పోయిన శరత్తులో నీవెలా ఉన్నావో అలానే నాకు గుర్తు



పోయిన శరత్తులో నీవెలా ఉన్నావో అలానే నాకు గుర్తు
ఆకుపచ్చని టోపీతో....
ఒక నిశ్చల హృదయానివి.
నీ కళ్లల్లో వెన్నెల మంటలు కదం తొక్కేవి.
నీ ఆత్మజలాలపై ఆకులు రాలుతూండేవి.

నా చేతులపైకి ఎగబ్రాకుతోన్న ద్రాక్షతీగ ఆకులు
ఏమాత్రమూ ఆత్రములేని నీ ప్రశాంత స్వరాన్ని పీల్చుకొంటున్నాయి.

పారవశ్య జ్వాలలో నా దాహం దహింపబడింది
తీయని నీలి కలువ నా ఆత్మతో మెలికపడింది .

నీ నయనాలు దూరమయ్యాయి, శరత్తూ సుదూరంగా ఉంది.
నా ప్రగాఢ వాంఛలు
ఆకుపచ్చటోపీ వైపు,  పిట్టగానం వైపు, 
ఇల్లులాంటి హృదయంవైపు వలసపోయాయి.
నా ఉల్లాస చుంబనాలు బూడిదలా నేలరాలాయి.

కాంతిలో, పొగమంచులో, ప్రశాంత తటాకంలో
నువు నాకు గుర్తుకు వస్తున్నావు.

నీ కనులకు కనిపించనంత దూరంలో వెన్నెలలు కాలుతున్నాయి.
హృదయంలో శుష్కించిన శిశిర పత్రాలు  సుళ్లు తిరుగుతున్నాయి.

(Pablo Neruda - I Remember You As You Were  కవితకు స్వేచ్ఛానువాదం)
భవదీయుడు
బొల్లోజు బాబా 

Thursday, March 8, 2012

నా కొత్తపుస్తకం కవర్ పేజ్ - any suggestions pl.


ఈ ఉగాదికి ఆవిష్కరణ జరుగుతున్న నా కొత్త పుస్తక కవర్ పేజ్ ఇది.  దీనిని నా బాల్యమిత్రుడు చిన్నారి (యానాం) డిజైన్ చేసాడు.   DTP ఆపరేటర్ కొన్ని చిన్నచిన్న మార్పులు (ఫాంట్లకు) చేసాడు.  ఏమైన సలహాలు ఇవ్వగలరా? ప్లీజ్

భవదీయుడు
బొల్లోజు బాబా

Monday, February 27, 2012

ఒక హిస్టరెక్టొమీ..

కారణాలేమైనా కానీ
నెలకో రక్తపుష్పాన్ని
రాల్చే
వృక్షాన్ని సమూలంగా
పెకలించారు.

నాగరీకుని
వైద్య ప్రయోగశాలలో
స్త్రీ దేహమెపుడూ ఓ గినియాపిగ్గే!

కారణాలేమైనా కానీ
రెండుకోతల్ని భరించి
ఒక తరాన్ని సృష్టించిన
మానవజాతి మొదటి ఊయల
మూడో కోతతో
మొదలు తెగి నేల కూలింది.

పర్యవసానాలు పూర్తిగా తెలీని వైద్యంలో
గర్భసంచో టెస్ట్ ట్యూబ్.
పిల్స్, సిజేరియన్లు, ఐయుడీలు,
ఐపిల్స్, ఇదిగో ఇపుడు సర్రోగసీలు.

కారణాలేమైనా కానీ
కనిపించని కత్తెరేదో
ఏ కనపడని భాగాన్ని తొలగించిందో
ఆత్మ
పెళుసుబారి, నెర్రలుతీసి
మరుగుకోసం దేహం
అంతా తిరుగుతూ రోదిస్తోంది.
ఓదార్చటానికి
హెచ్.ఆర్.టీలు, యాంటిడిప్రెస్సెంట్స్
వెంటనే వాలిపోయాయి.

జరాయురహిత దేహమిపుడో
సజీవ టంకశాల కదా!

బొల్లోజు బాబా

(విచ్చలవిడిగా జరుగుతున్న హిస్టరెక్టొమీ ఆపరేషన్లకు వ్యతిరేకంగా...... )
(Hysterectomy = గర్భసంచి తొలగింపు - HRT hormone replacement therapy))

Friday, February 17, 2012

మూడు సంసారాలు...


కొట్టునుంచొచ్చిన భర్తకు
వడకట్టిన చెరువునీళ్ళను
దోసకాయ చెంబుతో ఇచ్చి
మామ్మ మేనత్తల జడలు
ముడివేసిన ఘనకార్యానికి
గంతులువేస్తున్న పిల్లలను వారించి
కుంపట్లోని చల్లారిన వంకాయతో
పచ్చిపులుసు చేయటానికి
వంటింట్లోకి వెళ్ళింది -  నాయినమ్మ

పేపర్లు దిద్దుతున్న భర్తకు
స్టీలు ప్లేటుతో జంతికలు ఇచ్చి
ఎక్కడెక్కడో ఆట్లాడుకొని వచ్చిన పిల్లల్ని
కాళ్ళుకడుక్కొని పుస్తకాలు తియ్యమని చెప్పి,
స్టవ్ వెలిగించి టీ పెడుతూ
“రాత్రికి కూరేంచేయమంటారూ” అంది  -  అమ్మ

ఆఫీసు బడలికను విదిలించుకొని
పిల్లల రీడింగ్ రూమ్ డోర్ దగ్గరకు వేసి
ఫ్రీజర్ లోని కర్రీని ఓవెన్ లో ఉంచి
డ్యూటీకి వెళ్ళేముందు నేపెట్టిఉంచిన
గ్రీన్ టీ ని ఫ్లాస్క్ నుంచి కప్ లో ఒంపుకొని
సోఫాలో కూర్చొని తాగుతూ
రిమోట్ తో టీవి ఆన్ చేసింది  -  నా భార్య

బొల్లోజు బాబా

Wednesday, February 1, 2012

ఫ్రాగ్మెంట్స్ 6

1.  వానచినుకూ
     సాగర హృదయం
     ఒకరిలోకి మరొకరు
     కరిగిపోతూ మరలా
     మిత్రులైపోయారు

2.  ఒకే ఒక్క రాగంతో
     చిమ్మెట
     తెల్లారేదాకా
     సూర్యుడ్ని
     పైకి లేవనియ్యలేదు

3.  అమావాస్య రాత్రి
     చందమామ
     శకలాలు శకలాలుగా
     విడిపోయి
     తిరుగుతోంది భువిపై
     మిణుగురుల రూపంలో

4.  చికన్ కూర
     అమ్మ వడ్డించింది
     మెత్తని ముక్కలన్నీ
     మాయమయ్యాయి


5.  ఆ కాన్సర్ పిలగాని
     నవ్వు
     కన్నీళ్ళ కన్నా
     ఎక్కువ
     బాధిస్తోంది


బొల్లోజు బాబా




Monday, January 16, 2012

నువ్వు కాదు నేనే



స్వప్నానికి నాకూ మధ్య
మంచులా పరచుకొంటున్నది
నా శ్వాసా లేక నీదా?

ఎన్నెన్ని అస్ఫష్ట దృశ్యాలు!

నేలకొరిగిన తూనీగపై పూల వాన
అద్భుత సమాధి
చుంబించుకొన్న పెదాలు అదృశ్యమైనా
ఇప్పటికీ  పరిమళించే ప్రేమలా

కొలను అలలపై
ఏటవాలు కాంతిపుంజం
సన్నగా ఒణుకుతోంది
నీ జ్ఞాపకాలపై నా హృదయంలా

నీవు పంపించే వసంతాలకు
ఎడారి దూరంలో నేను
నీకై  నా ఆత్మ కోయిల పాడే పాట
నాకే చేదు చేదుగా అనిపిస్తోంది

తనమార్గాన్ని తానే అల్లుకొంటూ
సాగిపోతోంది కాలం సాలీడల్లే

ఒంటరితనం శూన్యమేమీ కాదు కానీ
తీవ్రమైన అలసట మాత్రం  
చీకటిలా మెరుగుతూంటుంది

జ్ఞాపకాలు నాని ఉబ్బి
వికృతంగా తయారయ్యాయి
గాలినిండా మృత్యువాసన

నా కవితల్లో నువ్వంటే నువ్వు కాదు  నేనే


బొల్లోజు బాబా

Sunday, January 8, 2012

జీవితం

1.
ఎవరూ నడవని
దారి కదాని
ఉత్సాహంగా
ముందుకుపోతూంటే
జీవితం నవ్వుతో
“ఓయ్ పిచ్చిమొద్దూ
నేనిక్కడుంటే అటెక్కడికి
పోతున్నావ్? అంది 
వెనుకనుంచి.



2. 
ఒక మధ్యాహ్నం
ఒంటరిగా సాగిపోతూంది
నేనూ ఒంటరిగానే గదిలో
స్వారీ చేసే నిశ్శబ్దంతో

ఒకే ఫాను
ఒకే కుర్చీ
ఒకే టేబులు
ఒకే నేను
నిశ్శబ్దంగా
మధ్యాహ్నంలోకి
ఒలికిపోయాం
ఇక అది మమ్మల్ని మోసుకొంటూ...

సూర్యుని మొహం
ఎర్రగా కందిపోయింది అసూయతో



బొల్లోజు బాబా