భిన్నమతస్థులు ఒకరి ఆచార, వ్యవహారాల పట్ల మరొకరు సానుకూల దృక్పథంచూపటం, ఒకరి భాష, సాహిత్యాలను మరొకరు ఇష్టంగా అక్కున చేర్చుకోవటం లాంటి చర్యలద్వారా మతసామరస్యం వెల్లివిరుస్తుంది. మొదటిది సామాన్యజనం పాటించదగినది కాగా రెండవది మేధోపరమైన అంశం. మధ్యయుగాలలో అనేకమంది ముస్లిమ్, హిందూ ఆద్యాత్మికవేత్తల పరస్పర సంభాషణలు, చర్చల ద్వారా హిందూ ఇస్లాం మతాల మేళనం జరిగింది.
హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా (1238-1325), షేక్ ఫరీదుద్దీన్ గంజ్‌షకర్ (1173-1265), షా అబ్దుల్ కరిమ్ (1536-1623), షా ఇనాయతుల్లా (1655 – 1718) లాంటి సూఫీ సన్యాసులు హిందూ ముస్లిముల ఐక్యతను బోధించి ఇరుమతస్థులలో సమాన ఆదరణ పొందారు
సూఫీ వేదాంతి బాబా ఫట్టు, హిందూ గులాబ్ సింగ్ వద్ద శిష్యరికం చేసాడు. ఇతని దర్గా హిమాచల ప్రదేష్ లో నేటికీ హిందూ ముస్లిములకు దర్శనీయ స్థలం. కబీరుదాసు (1399-1518) రామ్ రహీమ్ ఏక్ హై అనే తత్వాన్ని జీవితాంతంప్రచారం చేసాడు.
నానక్ సాహెబ్ (1469-1539), దాదు దయాళ్ (1544-1603), యారి షా (1668-1725), బుల్లా సాహెబ్ (యారి షా శిష్యుడు), దరియాసాహెబ్ (1700-1780), తులసి సాహెబ్ (1760- 1842) లాంటి మహనీయులు హిందూ ముస్లిమ్ ల ఆద్యాత్మిక ఐక్యత, ఐహిక సామరస్యతల కొరకు ఎంతో కృషిచేసారు.
హిందూ ముస్లిమ్ ల మధ్య సాంస్కృతిక భావనలను ఇచ్చిపుచ్చుకోవటంలో స్త్రీలు కూడా పాటుపడ్డారు. నాని బాయి, మాతా బాయి (వీరు దాదు దయాళ్ కుమార్తెలు), దయాబాయి, క్షేమాబాయి మొదలగు వారు ఒకనాటి హిందూ ముస్లిమ్ సఖ్యతను బలపరచిన సాధకురాళ్ళు
***
గౌడియ వైష్ణవ సంప్రదాయ స్థాపకుడైన శ్రీ చైతన్య మహాప్రభుకు (1486-1533) బుద్ధిమంత ఖాన్ అనే ముస్లిమ్ అత్యంత సన్నిహితుడైన సేవకునిగా వ్యవహించేవాడు. బుద్ధిమంతఖాన్ ధనవంతుడు, దాత. ఇతను శ్రీచైతన్య మహాప్రభు, విష్ణుప్రియల వివాహం దగ్గరుండి జరిపించాడు. మహాప్రభు జరుపుతున్న హిందూభక్తి ఉద్యమంలో పాల్గొన్నాడు. అలా ఒక ముస్లిమ్ వ్యక్తి వైష్ణవ సంప్రదాయ స్థాపకుని ఆశయాలను, ఆదర్శాలను ముందుకు తీసుకొని వెళ్ళటంలో సహాయపడ్డాడు.
నజీర్ మహమ్మద్ , ఫకీర్ హబీబ్, సయ్యద్ మర్తూజా లాంటి కవులు –కృష్ణభక్తితో గీతాలు రచించారు.
ముస్లిమ్ యోగి వావర్ తొ అయ్యప్ప స్వామి, బీబి నాంచారితో వెంకటేశ్వర స్వామికి ఉన్న ఆథ్యాత్మిక సంబంధాలను ఉత్త భక్తి కథలుగా కొట్టిపారేయలేం. వాటివెనుక మన పూర్వీకులు నిర్మించదలచిన సామరస్యతను అర్ధంచేసుకోవాలి.
***
ఏ కాలంలోనైనా అధికారం సాహిత్యాన్ని ప్రభావితం చేస్తుంది. బౌద్ధం అధికారంలో ఉన్నకాలంలో త్రిపిటకాలు; హిందూరాజుల పాలనలో ఇతిహాసాలు, పురాణాలు రాయబడ్డాయి. ముఘల్ పాలనలో ప్రత్యేకంగా ఇస్లామ్ మతాన్ని ప్రబోధించే రచనలేవీ రాలేదు సరికదా హిందూ వేద వేదాంగాలు ఇతిహాసాలు పర్షియన్ భాషలోకి తర్జుమా చేయబడ్డాయి. మొఘల్ పాలకులకు తమ పాలిత ప్రజల ఆచార వ్యవహారాలను, విజ్ఞానాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ఉండేది. సమయానుకూలంగా అనేకమంది పండితులు, రాజపుత్రుల సిఫార్సులతోనో లేక స్వయంగానో- జ్యోతిష్కులు, అనువాదకులు, రాజకీయ రాయబారులు, గాయకులు, కవిపండితులు, స్థానిక సమాచారం ఇచ్చే ఉద్యోగులు లాంటి భిన్నపాత్రలలో మొఘలుల కొలువుల్లో కుదురుకున్నారు.
ముఘల్ చక్రవర్తులు సంస్కృత పండితులను సాంస్కృతిక రాయబారులుగా భావించి, వారికి తమ ఆస్థానాలలో గౌరవ స్థానాన్ని ఇచ్చేవారు. బాబర్ (1504-21) ఆస్థానంలో జయరాజ్, హుమయూన్ (1530-40) ఆస్థానంలో ఆనందరాయ అనే పేర్లుకల సంస్కృతపండితులు ఉండేవారు. అక్బర్ (1556-1605) కాలంలో దేశం నలుమూలలనుంచి సంస్కృత పండితులు మొఘల్ ఆస్థానంలో చేరటం ప్రారంభమైంది. అక్బర్ తన సంస్థానంలో మతపరమైన తాత్వికచర్చలకొరకు ఒక సభను (ibadatkhanah) ఏర్పరచి దాని ద్వారా ఇస్లామ్, హిందూ, బౌద్ధ, జైన, క్రిష్టియన్ పండితుల మధ్య వేదాంత చర్చ జరిపించేవాడు. అక్బరీయ కాళిదాసు, హీరవిజయ సూరి, శాంతిచంద్ర లాంటి కవులు అక్బర్ సంస్థానంలో ఉండేవారు. ఇతనిపాలనలో మహాభారతం, అధర్వణవేదం, రామాయణం, హరివంశం, యోగవాసిష్టం లాంటి హిందూ గ్రంథాలు పర్షియన్ భాషలోకి అనువదింపబడ్డాయి.
అక్బరు సంస్థానంలో పెద్ద ఎత్తున ప్రవేశించిన పండితులు, చక్రవర్తిని ఆకర్షించటానికి అనేక యుక్తులకు పాల్పడేవారు.
ఒక బ్రాహ్మణుడు ముఘల్ పాలకుల ప్రాపకం పొందటం కొరకు ‘ష్యాయక్ భావన్’ అనే పేరుతో ఇస్లాంలోకి మారిపోయి స్థానిక హిందూ పండితులకి అక్బర్ కు మధ్య సంధానకర్తగా వ్యవహరించేవాడు.
హుమాయున్ కాలంలో అప్పటికే ఉన్న పెర్షియన్ జ్యోతిష్యానికి జోడింపుగా భారతీయ జ్యోతిష్యం కూడా ముఘల్ ఆస్థానంలోకి ప్రవేసించింది. కాలక్రమేణా అనేకమంది హిందూ జ్యోతిష్కులు అక్బర్ ఆస్థానంలో చేరి, చక్రవర్తి దినచర్యలలో మంచి చెడ్డలు చెప్పటం ద్వారా రాజకీయనిర్ణయాలను ప్రభావితం చేయసాగారు. ఈ ప్రభావం ఎంతవరకూ వెళ్ళిందంటే, అక్బరుకు మూలా నక్షత్రంలో కూతురు జన్మించినందుకు శాంతిహోమాలు జరిపించటం, రోజుకు నాలుగు సార్లు దగ్గరుండి ఆయనతో సూర్యనమస్కారాలు చేయించటం వరకు వెళ్ళింది.
కొందరు పండితులు “విష్ణుమూర్తి ఈ భూమిపై బాదుషాగా అవతరించనున్నాడని, ఆ అవతారంలో ప్రపంచాన్ని జయించి, గోవులను రక్షించి, బ్రాహ్మణులను ఆదరిస్తాడని” అంటూ కొన్ని సంస్కృతవాక్యాలను నలిగి, శిథిలమైన తాళపత్రాలపై రాసుకొచ్చి, ఇవి ఋషులు రచించినవని అక్బరు చక్రవర్తికి వినిపించగా ఆ మాటలను ఆయన నిజమని నమ్మేవాడట.
మరో అనామక రచయిత 1580 ప్రాంతంలో మరింత ముందుకెళ్ళి అల్లోపనిషద్ (అల్లా యొక్క ఉపనిషత్తు) రచించాడు. హిందూ దేవీ, దేవతలు అందరూ అల్లాతో సమానులే అని చెప్పే ఒక చిన్న గ్రంథం ఇది. దీనిని అక్బర్ చక్రవర్తికి భక్తితో సమర్పించుకొన్నాడట. ఈ ప్రయత్నాలన్నీ ముస్లిం పాలకుడిని ‘నా విష్ణుఃపృథ్వీపతి’ గా మార్చటానికే అని అర్ధం చేసుకోవాలి. ఈ ప్రయత్నాలకు అక్బర్ ఎంతో కొంత ప్రభావితం అయ్యాడు.
అక్బర్ తరువాత వచ్చిన జహంగీర్ ఆ తరువాత వచ్చిన షాజహాన్ లు కూడా ఇదే బాటలో పయనించి అనేకమంది సంస్కృత పండితులను ఆదరించారు. అనేక గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదింపచేసారు. షాజహాన్ చక్రవర్తి కొలువులో కవీంద్రాచార్య, జగన్నాథ పండితరాయలు వంటి జగత్ప్రసిద్ధి గాంచిన పండితులు ఉండేవారు.
తదనంతరం వచ్చిన ఔరంగజేబు (1658-1717) ఈ ఒరవడిని కొనసాగించలేదు. దానికి కారణం- సంస్కృతం నేర్చుకొని, ఎన్నో పవిత్ర హిందూ గ్రంథాలను సొంతంగా పర్షియన్ లోకి అనువదిస్తున్న అన్నగారైన దారాషికో ను హత్యచేసి రాజ్యాధికారం చేజిక్కించుకోవటం కావొచ్చు బహుశా. దారాషుకో చక్రవర్తి కావల్సిన వ్యక్తి. అప్పటికే ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించాడు. హిందూ-ఇస్లామ్ మతాలలోని సారాన్ని పోల్చుతూ వాటి ఐఖ్యతను కోరుతూ Majma-ul-Bahrain (రెండు సాగరాల సంగమం) అనే ఉద్గ్రంథాన్ని వెలువరించాడు. ఇతను ముఘల్ చక్రవర్తి అయిఉంటే భారతదేశచరిత్ర మరోలా ఉండేదంటారు. (నేటి పండితులకు ఔరంగజేబు పై ఉండే ద్వేషానికి మూలం ఈ నిరాదరణ కూడా కావొచ్చు)
ఔరంగజేబు అనంతరంవచ్చిన చక్రవర్తులు కూడా భిన్న సంస్కృతుల వాజ్ఞ్మయాలను ఇచ్చిపుచ్చుకోవటంలో పెద్దగా ఆసక్తి చూపలేదు. అంతే కాకముఘల్ సామ్రాజ్యం రాజకీయ ఒడిదుడుకుల పాలయి 1793 నుండీ క్రమేపీ బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళిపోయింది.
***
ఎక్కడినుంచో వచ్చిన ముఘల్స్ కు ఎందుకు సంస్కృతం అంటే అంత ప్రేమ కలిగింది అంటే బహుశా వారు భారతీయతను సాధించాలని భావించి ఉంటారు – అంటుంది ప్రముఖ చరిత్రకారిణి Audrey truschke
పదిహేడవశతాబ్దం వచ్చేసరికి అప్పటికి సుమారు రెండు శతాబ్దాలపాటు బ్రాహ్మణ మేధావులు మొఘల్ పాలక కులీన వర్గాలనుండి చక్కని ఆదరణ పొందారు. కొందరైతే పర్షియన్ భాషను నేర్చుకొని అధికారిక పదవులలో ప్రవేశించారు వీరి ప్రభావం మొఘల్ పాలన చివరివరకూ కొనసాగింది. ముస్లిమ్ ప్రపంచంలో భాగంగా ఉన్నప్పటికి దాని లోపలి విషయాలను, హిందూ ముస్లిమ్ సంస్కృతుల మధ్య జరిగిన అన్యోన్యాశ్రయతను, సాంస్కృతికపరమైన సంబంధబాంధవ్యాల గురించి పండితులు తమ సంస్కృత రచనలలో అక్కడక్కడా చేసిన చెదురు మదురు ప్రస్తావనలు తప్ప పెద్దగా ఎక్కడా ప్రతిబింబింపచేయలేదు. పండితుల చారిత్రిక నిశ్శబ్దం ఇది.
భానుకరుడు
భానుకర/భానుదత్త గొప్ప సంస్కృత కవి. తండ్రిపేరు గణపతి. నిజామ్ షా/షేర్ షా ఆస్థాన కవి. గీతాగౌరీశ, కావ్యదీపిక, రసమంజరి వంటి కావ్యాలను రచించాడు. అనేక పద్యాలలో ఇతను భూరన్ నిజామ్ షా ను కీర్తించటాన్ని బట్టి భానుకరుడు అతని ప్రాపకంపొందిన కవిగా గుర్తించటం జరిగింది. భూరన్ నిజామ్ షా 1510-1553 మధ్య పాలించాడు కనుక ఇతనిని 16 వ శతాబ్దపు కవిగా నిర్ణయించారు.
***
నిజాం షా సైన్యంతో యుద్ధరంగానికి కదం తొక్కుతున్న దృశ్యాన్ని భానుకరుడు ఇలా వర్ణించాడు. ఇవన్నీ అందమైన వర్ణనలు. భూమినే మూర్చిల్ల చేయటం కవియొక్క అసమాన ఊహాశాలిత.
గుర్రపు డెక్కలు కలిగించే ఒత్తిడికి భూమి మూర్చిల్లగా
సముద్రం అలలతో ఉప్పొంగి భూమిమోముపై నీళ్ళు జల్లిందట
దిక్పాలకి బలమైన గాలులను పంపి పతాకాలతో వీవెనలు వీచిందట
మూర్చనుండి కోలుకొనే వైద్యం కొరకు
పైకెగసిన ధూళి అశ్వనీదేవతలవైపు పరుగులిడిందట
యుద్ధంలో విజయం సాధించిన నిజాం షాని భానుకరుడు ఇలా స్తుతించాడు
నిజాంప్రభువు కోపంతో శత్రువులను చూస్తే
కంటిచూపుకే వారు తునియలైపోతారు
ఆకాశంలోని సూర్యుడు కూడా ఒణికిపోతూ
అపజయమే లేని మన ప్రభువు పతాకంలో తలదాచుకొంటాడు
(రాజపతాకంలో బహుశా సూర్యబింబ చిహ్నం ఉండేదేమో)
మరొక పద్యంలో సైన్య పదఘట్టనల తాకిడి తట్టుకోలేక నేల బయటకు చాచిన ఒణికే నాలుక వలె నిజాం పతాకం రెపరెపలాడుతోన్నదని వర్ణించాడు భానుకరుడు. ఇది కూడా అసమానమైనఊహ.
ఇతని రచనలు పద్యమిత్ర తరంగిణి, పద్యవేణి, రసిక జీవన సూక్తి సుందర లాంటి సంగ్రహాలలో ఉటంకింపుల ద్వారా మాత్రమే లభిస్తున్నాయి తప్ప సంపూర్ణ కావ్యాలు లభించలేదు.
జగన్నాథ పండితరాయలు
జగన్నాథపండితరాయలు (1590-1670) పదిహేడవ శతాబ్దపు కవి పండితుడు, సంగీతకారుడు. ఇతను పుష్టిమార్గీయ వైష్ణవసమాజాన్ని స్థాపించిన శ్రీమద్ వల్లభాచార్యుని మునిమనవడు. జగన్నాథుని తండ్రి శ్రీ పెరమభట్ట వారణాసిలో విద్యనభ్యసించి, శ్రీమద్ వల్లభాచార్యుని మనవరాలిని పెండ్లాడి మధురసమీపంలోని గోకులం వద్ద స్థిరపడ్డాడు . అలా జగన్నాథపండితరాయల తల్లి తరపు ముత్తాత వల్లభాచార్యుడు కాగా తండ్రితరపు పూర్వీకులు ఆంధ్రప్రదేష్, అమలాపురం వద్ద కల ముంగండ అగ్రహారానికి చెందినవారు.
జగన్నాథ పండితరాయలు ముఘల్ చక్రవర్తులైన జహంగీర్, షాజహాన్ ల ఆస్థాన పండితునిగా విశేషగౌరవం పొందాడు. భామిని విలాసము, రసగంగాధర, గంగాలహరి, పంచవిలాసములు, చిత్రమిమాంసఖండన ఇతని లభిస్తున్న రచనలు. ఆనందవర్ధనుడి ప్రసిద్ధిచెందిన ధ్వన్యాలోకముతో పోల్చదగిన గొప్ప అలంకార శాస్త్ర గ్రంథం రసగంగాధర. దీనిలో “రమణీయార్థ ప్రతిపాదక శబ్ధమే కావ్యం” అంటూ కావ్యానికి ఇచ్చిన నిర్వచనం ఈనాటికీ ఎంతో విలువైనది. సంప్రదాయాలను ధిక్కరించి ముస్లిమ్ మతానికి చెందిన ఒక మహిళను పెండ్లాడటం ఇతని ధీరవ్యక్తిత్వాన్ని పట్టిచూపుతుంది.
జగన్నాథపండితరాయలు ముఘల్ సంస్థానంలోకి ఎలా ప్రవేశించాడనేదానిపై అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి.
జగన్నాథుని కుటుంబం ఉంఛవృత్తి (భిక్షాటన) సాగించేది. విస్తరాకుల కొరకు ప్రతిరోజు ఒకచెట్టు ఆకులను కోసుకొనేవారట. ఒకనాడు ఆ తోట కాపలాదారు ఆకులుకోస్తున్న జగన్నాథుని అడ్డగించి “ఈ ప్రాంతాన్ని చక్రవర్తిగారు మా యజమానికి కానుకగా ఇచ్చారు, ఇకపై ఇక్కడి చెట్ల ఆకులను కోయరాదు” అన్నాడు. ఈ సంఘటనకు మ్రాన్పడిన జగన్నాథుడు ఆ ఊరి కరణం వద్ద ఈ విషయం చెప్పగా అతను “అవును నిజమే. నువ్వేమైనా చెప్పాలనుకొంటే చక్రవర్తిగారితోనే చెప్పుకో” అంటూ అవమానించాడట. ఆ మాటను పట్టుకొని జగన్నాథుడు నిజంగానే ఢిల్లీ వెళ్ళి ముఘల్ చక్రవర్తి జహంగీర్ ను కలిసి ఆయనను తన పాండిత్యంతో మెప్పించి ఆస్థానపండితునిగా స్థానం దక్కించుకొన్నాడట.
మరొక కథనం ప్రకారం జగన్నాథుడు మేవార్ మహారాజు జగత్ సింగ్ ఆస్థానపండితుడు. ఒకనాడు ముఘల్ చక్రవర్తి సభలో -రాజపుత్రులు క్షత్రియులు కారు; సంస్కృతము అరబిక్ భాషకంటే ప్రాచీనమైనది కాదు అనే రెండు అంశాలపై వాదోపవాదాలు జరిగాయట. పండితులు రెండుగా చీలిపోయారు. ఈ నేపథ్యంలో మేవార్ మహారాజు ఆదేశాలపై వాదించటానికి ఢిల్లీ వెళ్ళిన జగన్నాథుడు నిండు సభలో- రాజపుత్రులు క్షత్రియులేనని, సంస్కృతము అత్యంత ప్రాచీనభాష అని తన వాదనలు వినిపించి అందరిని మెప్పించాడట. అలా చక్రవర్తి ప్రశంసలకు పాత్రుడై కొలువులో చేరాడట.
జగన్నాథుడు కొంతకాలం జైపూర్ లో ఉన్నాడు. అప్పుడు మిత్రుడైన ఒక ముస్లిమ్ అధికారితో ఇస్లామ్ మతంపై లోతైన చర్చలు జరిపి అతనిని వాదనలో ఓడించాడట. ఆ అధికారి ఢిల్లీ వెళ్ళి ఈ విషయాన్ని చక్రవర్తికి చెప్పగా, ఆయన జగన్నాథుని పరీక్షించాలనే కోరికతో తనవద్దకు రప్పించుకొని అతని ప్రతిభపట్ల నమ్మకం కుదిరి తన ఆస్థానంలో నియమించుకొన్నాడంటూ మరొక కథనం ప్రచారంలో ఉంది.
పై కథనాలు ఊహాగానాలు కావొచ్చు. జగన్నాథుని మాతామహుని పేరు విట్టలేశుడు. ఇతను గొప్ప పేరుగాంచిన వైష్ణవ సన్యాసి. అక్బర్ సమకాలీనుడు. అక్బర్ అంతఃపురకాంతలలో కొందరు వైష్ణవం పట్ల ఆకర్షితులై, విట్టలేశుని ద్వారా వైష్ణవమతం పుచ్చుకొన్నారు. అలా విట్టలేశునికి ముఘల్ సంస్థానంలో ప్రవేశము, చక్రవర్తులతో సంబంధబాంధవ్యాలు ఏర్పడ్డాయి. ఆ పరిచయంతో విట్టలేశుని మనుమడైన జగన్నాథుడు ముఘల్ చక్రవర్తి కొలువులో సులువుగానే ప్రవేశించి ఉండవచ్చు.
***
జగన్నాథుడు ముఘల్ కొలువులో ఉండగా లవంగి అనే ముస్లిమ్ అమ్మాయిని ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు. లవంగి ఒక అంతఃపురకాంత. ఈమె నూర్జహాన్ ఆశ్రితురాలు. నూర్జహాన్ దైవభక్తి కలిగిన స్త్రీ. ఆమె నిర్భాగ్యులైన బాలికలను చేరదీసి విద్యాబుద్ధులు నేర్పి వారిని అర్హతకలిగిన హిందు లేదా ముస్లిమ్ యువకులకు ఇచ్చి వివాహం జరిపించేదట. అలా నూర్జహాన్ ద్వారా రక్షణ పొందిన వారిలో లవంగి ఒకరు. జగన్నాథుడు లవంగి ద్వారా పొందిన కొడుకు చిన్నవయసులోనే మరణించాడు. ఈ మతాంతర వివాహం వల్ల జగన్నాథుడు జీవితాంతం స్వజనుల ఆక్షేపణలకు గురయినట్లు అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒకనాడు జగన్నాథుడు వారణాసిలో గంగానదిలో స్నానం చేయబూనగా అక్కడి పండితులు “నువ్వు ముస్లిమ్ స్త్రీని పెళ్ళిచేసుకొని కులభ్రష్టత్వం పొందావుకనుక గంగను తాకరాదని” నిలువరించారట. (అలాచేసింది అద్వైతవేదాంతి అప్పయ్యదీక్షితులు అంటారు కానీ వీరిరువురు సమకాలీనులు కారు). ఈ సందర్భంగా జగన్నాథ పండితరాయలు గంగాలహరి పేరుతో గంగాస్తుతి చేసి గంగామాతను ప్రసన్నం చేసుకొని సచ్ఛీలుడిగా నిరూపించుకొన్నాడని ఒక ఐతిహ్యం. చనిపోయాడని మరొక కథనం కూడా కలదు.
1620 లలో జహంగీరు ఆస్థానంలో కవిగా జగన్నాథుడు స్థానం సంపాదించుకొన్నాడు. షాజహాన్ ఆస్థాన చరిత్రకారులు రచించిన Padshahnama లో “మార్చ్ 9, 1634 న (22nd Rabius AH 1044) జగన్నాథ కళావంత్ అనే గాయకుడు, చక్రవర్తిని కీర్తిస్తూ పన్నెండు అందమైన పద్యాలు సమర్పించుకోవటం జరిగింది. వాటికి సంతసించిన ప్రభువుల వారు, వెండితో తులాభారం గావించి, మొత్తం 4,500 రూపాయిలు బహుమతిగా ఇచ్చారు. “పండితరాయ” అనే బిరుదును కూడా ప్రసాదించారు” అని ఉన్నది. ఈ జగన్నాథ కళావంత్ అనే గాయకుడిని జగన్నాథకవిగా చరిత్రకారులు నిర్ధారించారు. ఆ విధంగా జగన్నాథుడు జగన్నాథపండితరాయలుగా మారిన చారిత్రిక సందర్భం లిఖించబడింది . (కారణాలు తెలియరావు కానీ, జగన్నాథుడు, కవీంద్రుడు లాంటి సంస్కృత కవులను ముఘల్ చరిత్రకారులు తమ రాతలలో dhrupad గాయకులుగా వర్ణించారు).
***
నూర్జహాన్ సోదరుడు, షాజహాన్ మామగారు అయిన ఆసిఫ్ ఖాన్ యొక్క విజయాలను కీర్తిస్తూ జగన్నాథుడు “ఆసిఫ్ విలాసము” అనే కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఒక పద్యం
ఆసఫ్ ఖాను యుద్ధంలో గణ్యుడు, దేవతలచే గౌరవింపబడినవాడు. ప్రపంచవిజేతకు సన్నిహితులుగా ఉండే అందరి రాజులలో ఆసఫ్ ఖాను- వాక్యాలలో కావ్యం వంటివాడు, కావ్యానికి ధ్వని, ధ్వనికి రసము, రసములలో శృంగారము వంటివాడు. అన్ని శాస్త్రాలను ఔపాసన పట్టిన ఆసఫ్ ఖాన్ నవాబు తన మాధుర్యము, ఘనత కారణంగా విమర్శకుల హృదయాలను గెలుచుకొన్నాడు.
1641 లో ఆసిఫ్ ఖాన్ చనిపోయినపుడు జగన్నాథుడు ఇలా విలపించాడు.
ఆసిఫ్ ఖాను మరణంతో అతని యశస్సు, అతని ఆశ్రితులు నశించటం సహజం.
కానీ ఇదేమి వింత! అతని కీర్తి ఈ సువిశాల పృధ్విపై దశదిశలా వ్యాపిస్తున్నది! //
ఆసిఫ్ ఖానుకు సమానుడు ఈ భూమిపై లేడు.
ఆయనమాటలు అమృతం; ఆయన వ్యక్తిత్వం రత్నగర్భ;
ఆయన కీర్తి అమృతకిరణాలు కలిగిన చంద్రకాంతి; ఆయన జ్ఞానం సాగరసమానం.
షాజహానుని కీర్తిస్తూ జగన్నాథపండితరాయలు చెప్పిన పద్యాలు
ఈ లోకంలో సహాయంకొరకు
ఇద్దరు ఈశ్వరులను మాత్రమే వేడుకోవాలి
ఒకరు ఢిల్లీశ్వరుడు మరొకరు సర్వేశ్వరుడు
ఆదరించటంలో మిగిలినవారెవరూ వీరికి సమ ఉజ్జీలు కారు.
ఓ షాబుద్దిన్ మహరాజా! నీవంటి సుగుణాలు కలిగిన వారు
ఈ ప్రపంచంలో మరొకరు ఉండరు
సృష్టికర్త మరోప్రపంచాన్ని పునఃసృష్టించినా
అక్కడ కూడా నీకు సమానుడు ఉండడు.
ఓ పాలసంద్రమా!
నీవు దేవుని ప్రత్యేక సృష్టి అని; అనంతమైన ఘనత, లోతు, రత్నాలతో
అనుగ్రహింపబడిన దానవని గర్వించకు;
ఎందుకంటే నీకు సమానంగా ఢిల్లీ చక్రవర్తి దారాషుకో ఉన్నాడు
***
షాజహాన్ ను చెరసాలలో పెట్టటం; అతని కుమారుడు, తనకెంతో ఆప్తమిత్రుడైన దారాషికో హత్యగావింపబడటం (1659) జగన్నాథపండితరాయలిని తీవ్ర మనస్తాపానికి గురిచేసాయి. దారాషికో ను స్తుతిస్తూ “జగదాభరణ” అనే స్మృతి గీతాన్ని రచించాడు
ఇతను మొఘల్ ఆస్థానపండితుడిగా 1660 వరకూ ఉండి బయటకు వచ్చేసాడు. తరువాత బెంగాల్, కూచ్ బేహార్ రాజయిన ప్రాణనారాయణ వద్ద కొన్నాళ్ళు ఆశ్రయం పొందాడు. జీవిత చరమ దశను వారణాసిలో గడిపాడు.
రాజాస్థానాలలో సత్యానికి తావులేదని, నిజాయితీ ఉండదని, ఋజువర్తనులకు రాజసేవ నరకప్రాయంబని తలచి ప్రశాంతంగా జీవించాలని వారణాసి వెళ్ళే సమయంలో రాసిన పద్యం అయి ఉంటుంది ఇది…
ఓ గార్దభమా! ఎన్నాళ్ళిలా ఎండుగడ్డి తింటూ,
బట్టలమూటలు మోసుకొంటూ తిరుగుతావు?
రాజుగారి అశ్వదళంలో చేరి మంచి గ్రాసం తిను
అక్కడ నువ్వు గాడిదవని ఏ అధికారీ గుర్తించడులే!
తోక ఉన్న ప్రతీదీ అశ్వమని భావిస్తారు వారు
రాజుగారు కూడా వారినే విశ్వసిస్తారు
సత్యానికి చోటు లేదు అక్కడ.
వారణాసిలో జగన్నాథపండితరాయలిని సంప్రదాయ బ్రాహ్మణులు మతాంతర వివాహం చేసుకొన్నాడనే నెపంతో అనేక అవమానాలపాలు చేసారు. ఒక కథనం ప్రకారం అయితే…. ఆ అవమానాలకు మనస్తాపం చెందిన జగన్నాథపండితరాయలు, భార్య లవంగితో కూడి గంగానదిలోకి మెట్టుమెట్టుకూ ఒక్కో పద్యం చొప్పున చెప్పుకొంటూ దిగుతూ 53 పద్యాలు చెప్పేసరికి భారాభర్తలు ఇరువురూ గంగానదిలో కొట్టుకుపోయి మరణించారట. ఇది కల్పన కావొచ్చు. రాజాశ్రయం కోల్పోయి, వృద్ధాప్యం మీదపడగా శ్రీనాథుని వలే కష్టాలపాలయి అనామకంగా మరణించి ఉండవచ్చు ఈ కవిరాజు. అభిమానులెవరో జగన్నాథపండితరాయలి దయనీయనిష్క్రమణను గౌరవనీయంగా మార్చటానికి పై కథను కల్పించి ఉంటారు.
హీరవిజయ సూరి
హీరవిజయ సూరి (1526-1595) గుజరాత్ కు చెందిన సంస్కృత పండితుడు. జైన మతావలంబి. ఇతను 1582 లో అక్బర్ కోరికపై ఫతేపూర్ సిక్రి లో జరిగే భిన్నమతాల తాత్విక చర్చలలో జైనమతం తరపున పాల్గొనటానికి వచ్చాడు. ఇతని వైదుష్యంపై అక్బరుకు గౌరవం ఏర్పడింది. ఇతనికి “జగద్గురు” అనే బిరుదునిచ్చి సత్కరించాడు. ఇతని అహింసాబోధనలకు అక్బరు ఎంతో ప్రభావితం అయ్యి, వారంలో కొన్ని రోజులు మాంసాహారం తీసుకొనే వాడు కాదు.
హీరవిజయ మొఘల్ ఆస్థానంలో తనకున్న పరపతిని ఉపయోగించి కొన్ని రాజకీయ ఉత్తర్వులను సంపాదించాడు. 1584 లో ప్రముఖ జైన “పర్యుషన” పండుగకాలంలో 12 రోజుల పాటు జంతుబలులను నిషేదించే రాజాజ్ఞను పొందాడు. ముఘల్ దండయాత్రలలో ఖైదీలుగా తీసుకుపోయిన వారిని అక్బర్ చే విడుదల చేయించాడు. ఫతేపూర్ సిక్రీ సమీపంలో జైనులు పవిత్రంగా చూసుకొనే “దామర చెరువు” లో చేపలను పట్టుకోవటాన్ని నిలుపుచేసే ఉత్తర్వు ఇప్పించాడు. ఇలా విధించిన నిషేదం గురించి చక్రవర్తి గ్రామాలలో చాటింపు వేయించాడు. ఈ పనులన్నీ అహింసను జీవినవిధానంగా చేసుకొన్న జైనమతస్థులందరికీ సంతోషం కలిగించిన అంశం.
శాంతిచంద్ర అనే జైన కవి కృపాశకోశ (దయానిధి) అనే పేరుతో రాసిన అక్బరు జీవిత చరిత్రలో ఈ చేపలవేట నిషేదాన్ని ఇలా వర్ణించాడు-
భూలోక చంద్రుడైన అక్బరుని పుణ్యమహిమచేత
చేపలను ముక్కులతో పట్టుకొని తినే కొంగలు కూడా
జాలిపడి వాటిని తినటం మానేసాయి
ఇదే కావ్యంలో శాంతి చంద్ర అక్బరు సుగుణాలను ఇలా వర్ణించాడు
అతను జిజియాపన్ను తొలగించాడు
అనేక ఆలయాలు విరూపం కాకుండా కాపాడాడు
ఎందరో యుద్ధ బంధీలను దయతో విడుదల చేయించాడు
అందరినీ సమాదరించాడు
ఆలమందలు దూడలకు నిర్భయంగా జన్మనిచ్చాయి
అక్బర్ ఆస్థాన చరిత్రకారుడు అబుల్ ఫాజిల్ కూర్పుచేసిన ఆనాటి 140 మంది ప్రముఖవ్యక్తుల జాబితాలో హీరవిజయ సూరిది 21 వ స్థానం.
*****
గోసాయి జద్రుప్/చిత్రరూప్
గోసాయి జద్రుప్ ఒక బ్రాహ్మణ సాధువు. ఇతనిని వివిధ సమయాలలో 1617 నుంచి 1620 మధ్య జహంగీర్ చక్రవర్తి కనీసం 6 సార్లు సందర్శించినట్లు ముఘల్ చరిత్రకారులు లిఖించారు. “గోసాయి జద్రుప్ వేదాంతం, సూఫీయిజంలలో గొప్ప పాండిత్యం కలిగిన వ్యక్తి. తన తండ్రి అక్బర్ చక్రవర్తి కూడా జద్రుప్ ను ఉజ్జయిని వద్ద ఒకసారి సందర్శించాడు (1601)” అని జహంగీర్ చెప్పేవాడట. అక్బర్ కానీ, జహంగీర్ కానీ జద్రుప్ ను ఆస్థానానికి పిలిపించుకొని మాట్లాడటం కాక, తామే స్వయంగా జద్రుప్ ఆశ్రమానికి వెళ్ళి అతనితో సంభాషించే వారంటే జద్రుప్ పట్ల ఎంతటి గౌరవం కలిగిఉండేవారో ఊహించుకోవచ్చు.
జద్రుప్ 1560 ప్రాంతంలో జన్మించి ఉండవచ్చు ఎందుకంటే 1618 లో జహంగీర్ ఇతనిని కలిసినప్పుడు 60 ఏళ్ల వయసు ఉండవచ్చు అని అన్నాడు. అప్పటికే జద్రుప్ భార్యబిడ్డలను త్యజించి సన్యాసిజీవనాన్ని సాగిస్తున్నాడు. జహంగీర్ తనకొడుకు ఖుశ్రోను తనపై తిరుగుబాటు చేసినందుకు1606 లో ఖైదు చేయించాడు. ఖుశ్రో మామగారు జద్రుప్ ను కలిసి ఖుశ్రోను జైలునించి విడుదల చేయిమని జహగీరు చక్రవర్తికి చెప్పమని కోరాడు. జద్రుప్ జహంగీర్ ను ఖుశ్రోను క్షమించి విడుదల చేయమని కోరగా, అతను అంగీకరించి విడుదల చేసాడట.
మధురలో హకిం బేగ్ అనే ఒక ముస్లిం అధికారి జద్రుప్ కు కొరడా దెబ్బల శిక్ష విధించగా (ఏం నేరం చేసాడో తెలియరాదు), జహంగీర్ చక్రవర్తి హకిం బేగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసి విధులనుండి శాశ్వతంగా తొలగించాడట . జద్రుప్ సూచనలపై ప్రాచీన భారతదేశ తూనికలు, కొలతలను జహంగీర్ తన రాజ్యంలో ప్రవేశపెట్టాడు.
1623 ప్రాంతంలో జద్రుప్ ఉజ్జయిని నుండి వారణాసి కి మారిపోయి 1638 లో అక్కడే మరణించాడు.
గోసాయి జద్రుప్ తో జహంగీర్ మాట్లాడుతున్న వర్ణచిత్రం పారిస్ మ్యూజియంలో భద్రపరచబడి ఉన్నది.
రుద్రకవి
రుద్రకవి ముఘల్ కుటుంబీకులపై నాలుగు కావ్యాలు రచించాడు. అవి అక్బర్ కుమారుడు దన్యాల్ షా పై దానషాహరచరిత్ర Dānaśāhacarita-(1603), రాజ ప్రముఖుడైన ఖాన్ ఇ-ఖాన్ గురించి ఖానఖానాచరిత్ర khānakhānacarita (1609), జహంగీర్ పై జహంగీరచరిత్ర Jahāngīracarita, 1610-1620) షాజహానుపై కీర్తిసముల్లాస Kīrtisamullāsa (1610-1620) కావ్యాలు. వీటిలో ముఘల్ ప్రముఖులను హిందూ రాజులను కీర్తించినట్లే ఇంద్రుడు, చంద్రుడు, ఈశ్వరుడు, విష్ణువు లాంటి ఉపమానాలతో పోల్చటం సంప్రదాయ సంస్కృతకావ్యాల ఒరవడి గానే కాక వారందరినీ హిందూ సంస్కృతిలోకి తీసుకువచ్చే ప్రయత్నంగా కూడా అర్ధం చేసుకోవచ్చు.
***
ముగింపు
ముఘల్ పాలకులు బాబరు కాలం నుంచీ సంస్కృత పండితులను చేరదీసారు. అనేక హిందూ పురణేతిహాసాలను పర్షియన్ భాషలోకి అనువదింపచేసారు. భారతీయ పెర్షియన్ సంస్కృతుల మేళనం కొరకు పాటుపడ్డారు. 1501-1722 మధ్య అనేకమంది మంది కవులు ఇరాన్, మధ్య ఆసియాలనుండి భారతదేశం వలస వచ్చారు. బాబర్ స్వయంగా కవి. గజల్స్ రచించేవాడు. హుమాయున్, జహంగీర్, షాజహాన్ లు కవిత్వం పట్ల ఎంతో మక్కువ కలిగి ఉండేవారు. వీరి ఆస్థానాలలో Tahir Bukhari, Qara Bahadur Khan, Maulana Nadiri Samarkandi, Talib Amuli, Nur Jahan, Muhammad Quli Salim Tahani లాంటి ప్రముఖ పెర్షియన్ కవులు ఉండేవారు.
ఒక్క ఔరంగజేబ్ మాత్రం సాహిత్యంపై విముఖత చూపాడు. ఇతని పాలనలో ఆస్థాన కవులు లేరు.
***
బహదూర్ షా జఫర్
చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్ కు (1775-1862) యుద్ధాలకంటే కవిత్వం అంటే ఎక్కువ ఇష్టం. ఇతని ఆస్థానంలో మీర్జాగాలిబ్, మొమిన్ ఖాన్ వంటి గొప్ప కవులు ఉండేవారు. ఇతను స్వయంగా మంచి కవి. బ్రిటిష్ వారిపై ఇతను 1857 లో చేసిన తిరుగుబాటు విఫలమైనప్పుడు ఆ సందర్భాన్ని ఇలా సాహిత్యంలో నిక్షిప్తం చేసాడు.
అయ్యో! ఎంత గొప్ప తిరుగుబాటు ఇది
దయలేని కాలం వల్ల
ఢిల్లీ ఒక్క క్షణంలో జాఫర్ చేతుల్లోంచి జారిపోయింది.
అయినా బహదూర్ షా తన భారతీయుల పోరాట పటిమపట్ల ఆశావహంగానే ఉన్నాడు ఇలా
భారతీయులకు నిజాయితీ,
ఆత్మగౌరవం ఉన్నంతవరకూ
ఎన్నటికైనా హిందూస్థాన్ ఖడ్గం
లండన్ సింహాసనం ముందు
తళుక్కున మెరవకపోదు.
.
బహదూర్ షాని రాజకీయ ఖైదీగా బంధించి రంగూన్ కు తరలించింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆ సందర్భంలో అతను రాసుకొన్న చివరి కవిత్వం ఇది.
.
నీవు నన్ను చక్రవర్తిని చేసాననుకొన్నావు
కానీ నేను నా కిరీటాన్ని బిక్షాపాత్రగా,
నమ్మించి ద్రోహం చేయబడిన దానిలా
మిగుల్చుకొన్నాను //
తనకు ప్రియమైన భూమిలో ఖననం కొరకు
ఆరడుగుల స్థలం కూడా లేని
జాఫర్ ఎంతటి దురదృష్టవంతుడు
.
బహదూర్ షా ను స్థానికులు ఒక సూఫీ తాత్వికునిగా భావించి ఆశీర్వాదాలు తీసుకొనేవారట. బహదూర్ షా జాఫర్ November 7th, 1862 న మరణీంచాడు. రంగూన్ (బర్మా) లోనే ఖననం చేయబడ్డాడు. ఇతని సమాధి చాన్నాళ్ళు కాలగర్భంలో ఉండిపోయింది.
1991 లో స్థానిక వర్కర్లు డ్రైనేజ్ కొరకు కాలువలు తవ్వుతున్నప్పుడు, భూమిలో 3 అడుగుల లోతులో ఇతని సమాధి కనిపించింది. జాఫర్ ను "Emperor-Saint" గా గుర్తించి, ప్రస్తుతం దాని వద్ద ఒక సూఫీ దర్గా నిర్మించారు.
ఎవరు నా తరపున ప్రార్ధిస్తారు?
నాకొక పూలగుత్తి తీసుకొస్తారు?
నాకోసం ఒక కొవ్వత్తిని వెలిగిస్తారు?
నేను ఒట్టి చీకటి సమాధిని తప్ప మరేమి కాదు--- అంటూ బహదూర్ షా రాసుకొన్న వాక్యాలు గుండెల్ని మెలిపెడతాయి .
2012 లో భారత ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఈ దర్గాని సందర్శించి బహదూర్ షా జాఫర్ కు నివాళులు అర్పించారు.
బొల్లోజు బాబా