Tuesday, April 23, 2024

ఆవు కవిత...

ఏదో టివి డిబేట్ లో
వాడిని ఒకసారి చూసాను
"మా మనోభావాలను
గాయపరుస్తావా" అంటూ చెప్పుతీసుకొని
మరొకరిని కొడుతూండటం.
ఎక్కడో టీవీలో కదా అనుకొన్నాను
తరువాత అక్కడక్కడా
అలాంటి ఘటనలు వింటూ వచ్చాను

నిన్న నేనే స్వయంగా ఎదుర్కొన్నాను

రోడ్డుకడ్డంగా ఉంటే తట్టి లేపుతున్నందుకు
"ఏంటి సర్ ఆవుని కొడుతున్నారు" అంటూ
మీద మీదకు వచ్చాడు" వాడు
 
ఊరిలో కనుమరోజున
పూజించిన చేతులతోనే, పచ్చనిచేలో పడితే
కర్ర తిరగేసి కొట్టిన వాడిని
నూతి వెలుపల కాంతి ఉందని
ఆ పట్నవాసపు కొత్త పరిరక్షకుడితో
ఎలా చెప్పాలి?

బొల్లోజుబాబా

Wednesday, April 17, 2024

బదులు

ఆరుబయట ఆనబపాదు
అడుగుకో కాయ చొప్పున
విరగకాచింది.
 
ఎప్పటిదో చిన్న విత్తనం

ఏం ఇచ్చాను నేను
అరచెయ్యంత చోటు
ఎప్పుడైనా కెక్కరించే కోళ్ళను తరిమి
నాలుగు తుంపర్ల నీరు చల్లుంటాను

అంతే
నా జీవితాన్ని పెనవేసుకొంది ప్రేమతో
సూర్యకాంతిలా

బొల్లోజు బాబా

మనవి మాటలు

గత నాలుగేళ్ళుగా రాస్తున్న చరిత్ర వ్యాసాలను వేదబాహ్యులు అనే పేరుతో పుస్తకరూపంలోకి తీసుకొని వద్దామని నిర్ణయించుకొన్నాక రాతప్రతిని ఎవరైన రివ్యూ చేస్తే బాగుంటుందని అనిపించింది.

శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్ గారు ఈ ఫేస్ బుక్ లో పరిచయం. నాలుగేళ్ళ క్రితం హిందూ ఆలయాలకు ఏం జరిగింది అనే నా పోస్టు లో వారూ నేను మొదటి సారిగా అభిప్రాయాలు పంచుకొన్నాం. ఇటీవల భిన్నమతాలలో ఉమ్మడి పాత్రలు అనే పోస్టులో కూడా చర్చించుకొన్నాం. ఈ పరిచయంతోనే శ్రీనివాస్ గారు ఎంతో ప్రేమతో నాకు Douglas Ober రాసిన Dust on the throne అనే పుస్తకాన్ని కాన్కగా కొరియర్ లో పంపించారు. చాలా సంతోషం వేసింది. అంతర్జాల మిత్రులనుండి గిఫ్ట్ అందుకోవటం అది రెండవ సారి . ఎప్పుడో బ్లాగుల కాలంలో వేల్పూరి సుజాత గారు జరుక్ శాస్త్రి పేరడీల పుస్తకాన్ని పంపించారు.
 
శ్రీనివాస్ గారు మంచి చదువరి, బహుభాషా కోవిదులు, విషయాన్ని లోతుగా అధ్యయనం చేసి నిర్ధారించుకొంటే తప్ప విశ్వసించరు. నేను చూసినంత మేర భద్రుడు గారి తరువాత నాకు తటస్థించిన అంతటి వొరేషియస్ రీడర్ శ్రీనివాస్ గారే.
 
శ్రీనివాస్ గారిని ఈ వ్యాసాలను ఎడిట్ చేసిపెట్టమని అడిగాను కొంత జంకుతూనే. వారు అంగీకరించి ఎంతో లోతుగా ఈ వ్యాసాలను రివ్యూ/ఎడిట్ చేసారు. చాలా అక్షరదోషాలను, వాక్యనిర్మాణ దూడలను సరిచేసారు. ప్రతీ అధ్యాయాన్ని సమీక్షించి చెప్పిన విలువైన అభిప్రాయాలు, లోచూపు ఈ రచనను ఎంతో మెరుగుపరిచాయి. ఎడిటర్ గా పేరు వేసుకొంటాను అని అడుగగా సున్నితంగా తిరస్కరించారు.
 
జనరల్ గా నా ఏ పుస్తకానికైనా ముందుమాటలలో మిత్రులందరి పేర్లు ప్రస్తావించటం పరిపాటి. ఈ పుస్తకానికి ఒక్క శ్రీ ఉరుపుటూరి శ్రీనివాస్ గారి పేరు మాత్రమే ఉండటం వెనుక కారణం ఇది.
వారికి సదా ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను

వేదబాహ్యులు పుస్తకానికి నేను రాసుకొన్న ముందుమాట ఇది.
ఈ పుస్తకం లభించుచోటు- పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి.నారాయణ గారు, ఫోన్ నంబరు. 9866115655 సంప్రదించగలరు.
*******
మనవి మాటలు
.
ప్రాచీన భారతదేశ ప్రజల విశ్వాసాల గురించి అధ్యయనం చేయటం ఒక నిరంతర శోధన. వైదిక సంప్రదాయం హిందూమతం రూపుదిద్దుకొనకముందు ఈ నేల భిన్న సంప్రదాయాలకు, విశ్వాసాలకు ఆలవాలంగా ఉంది. హిందూ మతానికి వెలుపల బౌద్ధులు, జైనులు, చార్వాకులు, ఆజీవికులు లాంటి ఎందరో ఈ నేలపై జీవించారు. ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని నిర్మించారు.
హిందూమతం మాత్రమే భారతదేశపు ఆత్మ అని పలికే మాటలకు ఈ వేదబాహ్య సంస్కృతి ఒక కనువిప్పు.
 
కూర్మపురాణం (CE 550-800) బౌద్ధులు, జైనులు, పాంచరాత్రికులు, కాపాలికులు, పాశుపతులు అంటూ ఐదురకాల వేదబాహ్యులను పేర్కొనింది. పాంచరాత్ర పూజావిధానం (cult) మొదట్లో వేదబాహ్యంగా ఉన్నప్పటికీ క్రమేపీ వైష్ణవంలో కలిసిపోయి వేదావలంబిగా మారిపోయింది.
వేదబాహ్యులను నీతిశాస్త్రాలు చాలా తక్కువ చేసి మాట్లాడాయి. గృహస్తులెవరూ వీరిని ఆదరించరాదని మనువు; నాస్తికులను పరిహరించాలని యాజ్ఞవల్క్యుడు; సాక్షులుగా పెట్టుకోరాదని నారదుడు; ఆపత్సమయాలలో వేదబాహ్యుల ఆస్తులను రాజు స్వాధీనం చేసుకొనవచ్చునని అంతేకాక వారితో సన్నిహితంగా ఉండేవారిపై అధికపన్నులు విధించవచ్చునని కౌటిల్యుడు; వేదబాహ్యులు రాజ్యంలోకి ప్రవేశించరాదని సౌరపురాణము; వేదబాహ్యులను రాజు శిక్షించాలని శుక్రనీతిసారము- అంటూ నీతిశాస్త్రకారులు తమ గ్రంథాలలో వీరిపట్ల సమాజం వ్యవహరించాల్సిన పద్దతులను నిర్దేశించారు.
 
ఇన్ని వెలివేతలు పెట్టినా సంఘంలో వేదాలను ధిక్కరించి జీవించేవారి సంఖ్య తక్కువ ఏమీ ఉండేది కాదు.
 
“History of India is nothing but the battle between Buddhism and Brahmanism.” – Dr. B.R. Ambedkar

ఈ వైదిక, అవైదిక విశ్వాసాలు చరిత్రలో ఘర్షించుకొన్నాయి. ఒకదానినొకటి మెరుగుపరుచుకొన్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. వేదబాహ్యులు భారతీయ ఆత్మను, బహుళతను తీర్చిదిద్దారు. వ్యక్తులు గతించిపోతారేమో కానీ వారు చేసిన ఆలోచన నమసిపోదు
‌‍****
బాబ్రిమసీదు కూల్చివేత ఆధునిక భారతదేశ చరిత్రలో కీలకమలుపు. ద్వేషం, విభజన నింపుకున్న రాజకీయాల కారణంగా ఒకే దేవుడు, ఒకేమతం, ఒకే సంస్కృతి లాంటి అంశాలు ముందుకు వచ్చాయి. ఇవి భారతీయ ధర్మంలోని బహుళతను విచ్ఛిన్నం చేస్తున్నాయి.
ఇప్పుడు అన్నిచోట్లా మెజారిటేరియన్ వాదం ప్రబలంగా నడుస్తూంది.
 
ఈ దేశ సంస్కృతిని నిర్మించటంలో ప్రధాన పాత్రవహించిన వేదబాహ్యులు నేడు సమాజపు అంచుల్లోకి నెట్టబడ్డారు. నిజానికి వీరు ఈ దేశమూలవాసులు.
 
చరిత్రలో వేదబాహ్యులు నెరపిన సామాజిక, సాంస్కృతిక పాత్రను గురించి ఈ వ్యాసాలు మాట్లాడతాయి. స్వేచ్ఛ, సమానత్వం, కార్యకారణ వివేచన, లౌకికత్వం కొరకు వారు ఎలా నిలబడ్డారో చెబుతాయి. నేటి మెజారిటేరియన్ భావజాలానికి ఒకనాడు సమవుజ్జీలుగా నిలిచిన భిన్న ప్రత్యామ్నాయ విశ్వాసాలకు ఈ పుస్తకం అద్దంపడుతుందని ఆశిస్తున్నాను.
ఈ పుస్తకరచనలో శ్రీ విరుపుటూరి శ్రీనివాస్ గారు చేసిన సూచనలు, సలహాలు ఎంతో విలువైనవి. ఈ పుస్తకం యొక్క ప్రతి అథ్యాయాన్ని సమీక్షించి చెప్పిన విలువైన అభిప్రాయాలు, లోచూపు ఈ రచనను మెరుగుపరచాయి. వారి మేధకు, వెచ్చించిన కాలానికి నేను ఋణపడి ఉన్నాను.
 
బొల్లోజు బాబా
17/3/2024
.
ఈ పుస్తకం లభించుచోటు- పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి.నారాయణ గారు, ఫోన్ నంబరు. 9866115655 దయచేసి ఆదరించండి.



ఇటీవల వార్తల్లో వినుతికెక్కిన పిఠాపురానికి ఘనమైన చరిత్ర ఉంది.



ఇటీవల వార్తల్లో వినుతికెక్కిన పిఠాపురానికి ఘనమైన చరిత్ర ఉంది. చరిత్ర తెలియని కొందరు పిఠాపురం లాంటి ఒక కుగ్రామం .... అంటూ మాట్లాడుతున్నారు. వారికోసం....
.
క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంనుండి పిఠాపురం గొప్ప పట్టణంగా విరాజిల్లింది. క్రీపూ 2వ శతాబ్దంలో వేయించిన ఖారవేలుని హాథిగుంఫా శాసనంలో కనిపించే పిథుండా పిఠాపురమే అనటానికి ఆధారాలు ఉన్నాయి.
 
పిఠాపుర సమీపంలో ఉన్న బౌద్ధ ఆరామం కొడవలి వద్ద క్రీశ 2 వ శతాబ్దంనాటి శాతవాహనరాజు వేయించిన శాసనం లభించింది.

క్రీశ 4 వ శతాబ్దంలో సముద్రగుప్తుడు వేయించుకొన్న ప్రసస్తి శాసనంలో పిఠాపురాన్ని జయించానని గర్వంగా చెప్పుకొన్నాడు

వేంగి రాజ్య స్థాపన నిజానికి 7వ శతాబ్దంలో పిఠాపురంలో కుబ్జవిష్ణువర్ధనుడిచే జరిగింది.
హుయాన్ త్సాంగ్ క్రీశ 631 లో పిఠాపురం సందర్శించి ఉండొచ్చునని ఆధారాలు ఉన్నాయి.
 
కాలక్రమేణా తూర్పుచాళుక్యులు, కొప్పుల నాయకులు, గజపతులు,పూసపాటి రాజులు గోల్కొండ నవాబులు, బ్రిటిష్ వారు ఈ పట్టణాన్ని పాలించారు
 
దోనేపూడి శాసనంలో (క్రీశ1337) పిఠాపురపట్టణ వర్ణనలు ఈ విధంగా ఉన్నాయి

పిఠాపురీ జయతి తత్ర సమస్తదేవ
శక్తి ప్రయత్నపరికల్పిత తోరణశ్రీః
యస్యాస్సునిర్మలనభోముకురాంతరాలే
ధత్తే సురేంద్రనగరీప్రతిబింబలీలమ్
 
(తాత్పర్యం: సమస్తదేవతలు కొలువున్న పిఠాపురం యొక్క అందాలు ఎంతటి దివ్యమైనవి అంటే ఆకాశం అనే అద్దంలో పిఠాపురం అందాలే ఆ ఇంద్రుని అమరావతి అందాలుగా ప్రతిబింబిస్తున్నాయి)

యత్ సౌధాగ్రనిషణ్ణవారవనితావక్త్రేందుమధ్యస్థితః
స్వైరం నైషవిభావ్యతే హిమరుచిస్తేభ్యోవిభిన్నాకృతిః
ఏవం చేతపి శకితేనరచితో ధాత్రాకళంకస్ఫుటమ్
నోచే దీదృశి నిర్మలే కథ మిదమ్ మాలిన్య ముజ్జృంభతే.
 
(తాత్పర్యం: పిఠాపురం భవనాల మిద్దెలపై వెన్నెలలో కూర్చున్న నాట్యకత్తెల గుండ్రని వెలుగులీనే మొఖాలలో కలిసిపోయి చంద్రుడు కనిపించటం లేదట. అందుకని బ్రహ్మదేవుడు చంద్రునిపై నల్లమచ్చలు పెట్టటంతో ఆ అప్సరసల ముఖబింబాల మధ్య చంద్రబింబాన్ని గుర్తించటం వీలయిందట)

ఒకనాటి పిఠాపురం భౌతిక వర్ణనను ఒక పద్యంలో శ్రీనాథుడు ఇలా చిత్తరువుగా నిలిపాడు
సీ|| ఏటేట విలినీట నిరుగారునుం బండు
బ్రాసంగు వరిచేల బసిడిచాయ
బరిపాకమున వేరుపనసపండుల తావి
ఇందిందిరములకు విందుసేయు
వేబోక ఒలుపారు వింధ్యాద్రిపవనంబు
పోకపువ్వుల తావి బుక్కిలించు
వేశ్యవాటికలందు విహరించు వలరాజు
ననయంబు జెఱకువిల్లును ధరించు
తే.గీ. నారదంబులవలపు పొన్నల బెనగి
విచికిలామోదములతోడ వియ్యమందు
బాటలీపుష్ప కేతకీపరిమళములు
పొదల విలసిల్లు బీఠికాపురమునందు.

(తాత్పర్యం: ఎటు చూసినా బంగారు వన్నెల వరిచేలు, తుమ్మెదలకు విందు చేసే బాగా ముగ్గిన పనస పండ్ల సువాసనతోను; వింధ్య పర్వతపు పోక పువ్వుల పరిమళాలను పుక్కిలించే చల్లనైన గాలులతోను; మన్మధుడు తన చెరుకు వింటిని ఎక్కుపెట్టే వేశ్య వాడలతోను; పొన్నపూలు, పాటలీ పుష్పాలు, పరిమళాలు వెదజల్లే పొదలు కలిగిన పిఠాపురం -- లాంటి వాక్యాలలో శ్రీనాథుడు (1380-1470) ఆనాటి పిఠాపురం picturesque సౌందర్యాన్ని కళ్లముందు నిలుపుతాడు)
 
***
పిఠాపురం వేల సంవత్సరాల ఘన చరిత్ర కలిగిఉంది. శతాబ్దాలపాటు ఆంధ్ర దేశానికి రాజధానిగా వ్యవహరించిన ప్రాచీన పట్టణమైన పిఠాపురవైభవం గురించి సుమారు 30 పేజీల వ్యాసం ఇటీవలే ద్వితీయముద్రణకు వచ్చిన "తూర్పుగోదావరి ప్రాచీనపట్టణాలు" పుస్తకంలో కలదు. లభించుచోటు- పల్లవి పబ్లికేషన్స్, శ్రీ వి. నారాయణ గారు, ఫోన్ నంబరు. 9866115655 సంప్రదించగలరు.

బొల్లోజు బాబా



చివరిచూపుల తరువాత....

బాడీని పూడ్చిపెట్టాక
స్నానం చేసి
ఉప్పుకల్లు నోట్లో ఉంచుకొని
దీపం వెలుగుకి దణ్ణం పెట్టుకొని
బస్సెక్కేసాను.

సీట్లో కుదురుకున్నాకా
కలలు కబళించాయి
జ్ఞాపకాలు, కలలు కలగలిసిపోయి
వింతైన లోకంలో దించాయి

అక్కడ
ముడుతలు పడిన చేతుల్ని
పెదాలవద్దకు తీసుకొని
నేను పుట్టినప్పుడు నా చిట్టి చేతివేళ్ళమధ్య
మృదువుగా తన చూపుడు వేలు ఉంచినంత
మెత్తగా ముద్దుపెట్టుకొన్నానట

తన చివరి ఫోన్ కాల్ లో 'చూడాలనుందిరా'
అన్నవెంటనే శలవుపెట్టి పద్మా, పిల్లలతో వెళ్ళి
తనతో వారం రోజులు గడిపిపానట

ఎర్రటి ఎండలో నిలుచుని
తనని పాతిన చోట ఏర్పడిన మట్టి దిబ్బను
చేతులతో తడుముతూ జార్చుకొన్న
కన్నీళ్ళు ఆ నెర్రలలోకి ఇంకిపోయాయట

కుంపటిపై అటూ ఇటూ సర్దబడే
మొక్కజొన్న కండెలా హృదయం
డ్రింకు సీసాలో చిక్కుకొని తెల్లార్లూ
ఎగబాకుతూనే ఉన్న చిమ్మెటలా ఆలోచనలు

సార్, మీ స్టాప్ అన్న కండక్టర్ కేకతో లేచి
బాగ్ తీసుకొని బస్సుదిగి పద్మకు ఫోన్ చేసి
"పిల్లల్ని స్కూల్ నుండి పికప్ చేసుకొని
వస్తాను, నువ్వు వెళ్ళక్కరలేదు" అని చెప్పాను


బొల్లోజు బాబా

పారిపోలేం...

ఇక్కడ ఉండాలంటే
ఈ దేహం ఉండాలి
దీన్ని విడిచి ఎక్కడికీ పారిపోలేం
ఇది చిరిగి జీర్ణమైపోయాకా
నూతన వస్త్రాలను ధరించవచ్చుననే
ఆశ ఒక్కటే
ఇన్ని లోపాలతో, గాయాలతో ఉండే
ఈ దేహాన్ని మోసుకొని తిరిగేలా చేస్తుంది

ఇంత వరకు అందరూ అదే చేసారు
నవ్వుతూ, ఏడుస్తూ, ప్రేమిస్తూ....

బొల్లోజు బాబా