Sunday, July 16, 2023

ఫ్రెండ్ వాల్ పై చేసిన ఒక కామెంటు



ఇస్మాయిల్ గారు కవిత్వాన్ని poetry of ideas (అభిప్రాయ కవిత్వం), poetry of experience (అనుభవ కవిత్వం) అని విభజిస్తారు.

రెండిటినీ తూకం వెయ్యటానికి ఒకేరకమైన పనిముట్లు పనికొస్తాయా అనేది ఆలోచించాల్సిన విషయం.

రెండూ భిన్నపాయలు. దేని అవసరం, సౌందర్యం, తూకం దానిదే.

శ్రీశ్రీకి నచ్చనంతమాత్రానా టాగూర్ కవి కాకుండా పోడు, అతని స్థానం క్రిందకు దిగీపోదు.

అన్ని వాక్యాలను తమవద్ద ఉన్న ఇనప చట్రాల్లో ఇమడ్చాలని చూడటం, ఇమడక కొన్నివాక్యాల అంచులు బయటకు రావటాన్ని ఆ వాక్యాల లోపంగా వ్యాఖ్యానించటం కొందరకు సరదా. అంతే.

ఏకసూత్రత ఉండాలనుకోవటం ఫాసిజ లక్షణం. (యూనిఫార్మ్ సివిల్ కోడ్ లాంటిదే ఈ యూనిఫార్మ్ పొయెట్రీ కోడ్) బహుళత్వాన్ని గౌరవించటం ఆధునికత.


బొల్లోజు బాబా

Monday, July 10, 2023

బాధామయ సందర్భం

రోజుకో
కొత్త కల్పన
కొత్త విషం
కొత్త వాదన
హృదయాలలో చేదు నింపుతాయి
మనిషికి మనిషికి మధ్య దూరాలు పెంచుతాయి
స్నేహాలను, బంధాలను, శాంతిని
మలినం చేసి ద్వేషాన్ని వ్యాపింపచేస్తాయి
ఇది ప్రజల్ని విభజించి
ఒకరిపై ఒకరిని ఉసిగొల్పుతుంది

చరిత్రలో ప్రేమ కన్నా ద్వేషమే ఎక్కువసార్లు
కొందరిని ఒకేతాటిమీదకు తీసుకొచ్చి ఉండొచ్చు
ప్రజలను మనం-వాళ్ళు అంటూ విభజించి ఉండొచ్చు
చంపమనో చావమనో శాసించి ఉండవచ్చు
అఘాయిత్యాలను అద్భుతంగా సమర్ధించి ఉండొచ్చు
ఎన్నైనా చేసి ఉండొచ్చు
కానీ
మనిషిని మనిషితో బంధించేది ప్రేమ ఒక్కటే
గాయాలను స్వస్థపరచేది ప్రేమ మాత్రమే

ప్రేమ వైపా, ద్వేషం వైపా
మనమే ఎంచుకోవాలి
మన ఎంపికే
మన భవిష్యత్తు
మన పిల్లలు జీవించబోయే లోకం


బొల్లోజు బాబా

Thursday, July 6, 2023

ఒక్కసారి లెక్కించుకోవాలి .





కాలం కుబుసం విడిచి
ముందుకు సాగే ఈ వేళ
ఒక్కసారి లెక్కించుకొందాం మిత్రమా!

ఎన్ని సార్లు ఆకులమై నేల రాలామో
చేపపిల్లలమై ఏటికెదురు కిలకలు వేసామో
వాంఛలమై పరిమళించామో
అలలగా విరిగిపడ్డామో
కలలుగా వాస్తవం నుండి జారిపోయామో
పరుగెత్తలేక వీడ్కోలు చెబుతూ
ఒడ్డునే మిగిలిపోయామో
ఒక్కసారి లెక్కించుకొందాం మిత్రమా!

లోతుగా పాతపెట్టినా ఆకుపచ్చని స్వప్నంగా
ఎలా నేలని చొచ్చుకొని రాగలిగామో
కుండపోతగా ఎండకాచిన రోజున
వర్షించే రాళ్ళని, దుఃఖకాంతిని దాటుకొని
ఆకాశంలో రంగు పతంగాలుగా ఎలా విచ్చుకొన్నామో

ఇంకా బరిలోనే ఎలా మిగిలున్నామో

ఒక్క సారి లెక్కించుకొందాం మిత్రమా!


బొల్లోజు బాబా