Sunday, July 10, 2022

నిష్కళంక స్వాతంత్ర్యసమరయోధుడు శ్రీ అల్లూరి సీతారామరాజు


శ్రీ అల్లూరి సీతారామరాజు భూకబ్జాదారుడని, యాభై ఎకరాల భూమికొరకు అతను బ్రిటిష్ వారితో పోరాడాడని, దాన్ని కొద్దిమంది స్వాతంత్ర్యపోరాటంగా చిత్రీకరించారంటూ ఒక పోస్టు ఇటీవల వాట్సప్ గ్రూపులలో వైరల్ గా సంచరిస్తోంది.
శ్రీ అల్లూరి సీతారామరాజు జీవించి ఉండగా అతను జరిపిన పోరాటం పై వచ్చిన వార్తా కథనాలు, ఒక ఔత్సాహిక విలేఖరికి ఇచ్చిన అతని ఇంటర్వ్యూ ద్వారా – శ్రీ రామరాజు నిజాయితీగా, స్వాతంత్రపోరాటం జరిపినట్లు అర్ధమౌతుంది. శ్రీ రామరాజు మరణించిన వెంటనే వచ్చిన కొన్ని వ్యాసాలలోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవటం కూడా శ్రీ రామరాజు నిష్కళంకతను రుజువుచేస్తుంది.
 
ఈ అంశానికి సంబంధించి ఆనాటి పత్రికా కథనాలు…. వాటి విశ్లేషణా
.
1. ఆంధ్రపత్రిక April 21, 1923

రంపపితూరి నాయకుడు శ్రీ అల్లూరి సీతారామరాజు
.
శ్రీ అల్లూరి సీతారామరాజుతో శ్రీ చెరుకూరి నరసింహమూర్తి జరిపిన సంభాషణ April 21, 1923 ఆంధ్రపత్రిక లో ప్రచురింపబడింది. శ్రీ మూర్తిగారు అప్పటికే దేశంలో ప్రబలంగా నడుస్తున్న సహాయ నిరాకరణోద్యమంలో చురుకుగా పాల్గొంటున్నారు.
శ్రీ అల్లూరి సీతారామరాజు 17 వ తారీఖు ఉదయం 6:30 కు అన్నవరం పోలీసు స్టేషనును ముట్టడించి, అక్కడి పోలీసు తుపాకులను స్వాధీనం చేసుకొని, అన్నవర సత్యనారాయణస్వామి దేవాలయ సత్రంలో స్నానపానాదులు కావించి; కాసేపు జపం చేసుకొని పది గంటల సమయంలో శంకవరం గ్రామం వైపు వెళిపోయారు. ఆ రోజు మూర్తిగారు రాజు గారితో జరిపిన సంభాషణ ఇలా ఉంది.
మూర్తి: మీ రే సంకల్పముతో నీ పితూరిని నడుపుతున్నారు
రాజు: ప్రజలకు స్వాతంత్ర్యము లభించుటకే
.
మూర్తి: ఏ సాధనము వలన
రాజు: దౌర్జన్యము వలననే. యుద్ధము చేసినగాని మనకు స్వరాజ్యము రాదు
.
మూర్తి: స్వాతంత్ర్యము బడయగలుగుదునను నమ్మకము మీకు కలదా?
రాజు: రెండేండ్లలో స్వరాజ్యము తప్పక లభించునను నమ్మకము నాకు కలదు.
.
మూర్తి: రెండేండ్లలో స్వరాజ్యమెట్లు లభించును? మీ రవలంబించుచున్న పద్దతివలననే స్వరాజ్యము వచ్చునా?
రాజు: వచ్చును. తప్పక వచ్చును. నాకు అనుచరుల సంఖ్య అత్యధికముగానున్నది. జనము లోటేమియును లేదుగాని తుపాకులును మందుగుండ్లును కావలెను. వానికొరకె సంచారము చేయుచున్నాను.
.
మూర్తి: దౌర్జన్యముతో కూడిన యుద్ధములవలనను జన నష్టమువలనను ప్రపంచము విసుగు చెందియున్నది. దౌర్జన్యముకూడదను సిద్ధాంతమునే యిపుడు ప్రపంచములోని అన్నిదేశముల వారును ఆదరించుచున్నారు. జర్మనీవారుగూడా సాత్విక నిరోధమునే ప్రారంభించిరి. గాంధి మహాత్ముడు బోధించిన దౌర్జన్యరాహిత్య శాంతి సాధనములందుమాత్రమే మాకు నమ్మకముకలదు. సకలప్రపంచమునకు శాంతిమార్గమును బోధించుటకు దేవదూత గాంధిమహాత్ముని రూపమున వచ్చెనని ప్రపంచమువారందరును నమ్ముచున్నారు.
రాజు: నాకు దౌర్జన్యరాహిత్యమునందు నమ్మకము లేదు. దౌర్జన్యమువలననే స్వరాజ్యమును బడయగలుగుదుమని నేను గట్టిగా నమ్ముచున్నాను.
***
పై వార్తా కథనంలో వర్ణించిన రాజుగారి ఆకృతి: వయసు 26 ఏండ్లు, ఎత్తు 5 అడుగుల 4 అంగుళాలు; బక్కపలచన, ఆరోగ్యముతో, అందమైన దేహం; ఎప్పుడు నవ్వుమొఖముతో, వినయసంపదకలిగి, మర్యాదతో వ్యవహరిస్తారు; యోగులవలె గెడ్డము, తలవెంట్రుకలను కలిగి ఉన్నారు. ఖద్దరు ఖాకి పొట్టి నిక్కరు, ఖద్దరు చొక్కాను ధరించారు. చేతిలో పేనుబెత్తము కలదు. కాలికి చెప్పులు లేవు.
***
పై ఇంటర్వ్యూ లో శ్రీ అల్లూరి సీతారామరాజు తన ఉద్యమ లక్ష్యం స్వాతంత్ర్యాన్ని సాధించటమే అని నిర్ద్వంద్వంగా పేర్కొన్నాడు. హింసా పద్దతుల ద్వారా స్వాతంత్ర్యాన్ని సాధించాలి అని నమ్మిన సుభాష్ చంద్రబోస్ కంటే ముందే ఆ లక్ష్యాన్ని స్వప్నించటం గమనార్హం.
***

2. ఆంధ్రపత్రిక 1922 అక్టోబరు 18

రంపపితూరి మూలకారకుని వృత్తాంతము

నరసిపట్నం దగ్గరనున్న గూడెం కొండలలోనుండి బయలుదేరిన యేజన్సీ పితూరి (పితూరి-తిరుగుబాటు) విషయము ఇటీవల తెలియవచ్చు సంగతుల వలన తీవ్రముగా నున్నట్లు కనుపట్టుచున్నది. మూడువందలవరకును పోలీసుదళము పితూరిదారులను పట్టుకొనవలెనని ప్రయత్నించుచున్నది. ఇంతవరకు నిరువురు తెల్ల ఉద్యోగీయులు హతులైరి. పోలీసులు కాన్సటబిల్సు కూడా కొంతమంది చంపబడిరి. కొందరకు గాయములు తగిలెను. మలబారు విప్లవ సందర్భములో ననుభవముగల యే ఆర్. న్యాపుగారు కూడా స్వయముగా వచ్చి పితూరి ప్రాంతములను పరీక్షించి పోయిరి. పరిస్థితులు తీవ్రముగా నున్నట్లు ఇంతవరకు ప్రభుత్వముపయోగించిన బలము నిష్ప్రయోజనమగుట రుజువు చేయుచున్నది.
ఈ పితూరిని నడుపుచున్నది అల్లూరి సీతారామరాజను క్షత్రియ యువకుడని ప్రచురింపబడినది. ఆయన అద్భుతశక్తులు కలవాడని ప్రజలు చెప్పుకొందురు.
 
//ఈయనకు 25 సంవత్సరముల వయస్సుండును. ఆజాన బాహువు, విశాల వక్షస్కుడు, బలిష్ఠుడు, స్ఫురద్రూపి, పచ్చని దేహచ్ఛాయకలవాడు. నల్లనిగడ్డము పెంచెను. కాషాయవస్త్రములను ధరించి స్వరూపముచే నాకర్షించు బాలసన్యాసి. జ్యోతిషము, సాముద్రికము, వైద్యము తెలిసినవాడు. ప్రశ్నచెప్పగలడు. ఒక్కమారతనితో మాట్లాడువారు అతని వశులగుదురు. వైద్యముకొరకును, ప్రశ్నలను తెలుసుకొనుటకును, కొండవారనేకమందితని యొద్దకు వత్తురట. వారి ప్రశ్నలకు సరియైన నిదర్శనములు కనుపడుటచేతను కొండవాండ్రకాయన భగవంతుండను మూఢభక్తి గలదు.

//ఇతను వీలగునంతవరకును ప్రజలకు సేవజేయుచు వారి విశ్వాసమునకు పాత్రుడయ్యెను. ఎవరికే కష్టాలు గలిగినను సహానుభూతి చూపుచు తనకు వీలైన సహాయము చేయువాడట. మందస్మిత వదనముతో పలుకు యీతని పలుకులు జనులనాకర్షించి అతని ప్రేమింపజేయును. అతనికా చుట్టుపట్లనున్న గ్రామములలో చాల గౌరవము కలదు. కృష్ణాదేవి పేట చుట్టుపట్లనున్న అయిదారు గ్రామములలో నీయన పంచాయితీ కోర్టులను స్థాపించి ప్రజలలో న్యాయమును నెలకొల్పెను. ఏజెన్సీ యుద్యోగులా పంచాయతులను బ్రద్దలుగొట్టిరి. ఈ సందర్భమునని రాజుగారు నిరాకరణవాది యను నెపమున వానిని ఆరువారములు కైదులో ఉంచి, దోషిగ నెంచుటకు దగిన ఆధారములు లేక వదిలివేసిరి.
.
పై వార్తా కథనముద్వారా శ్రీ అల్లూరి సీతారామరాజు వ్యక్తిత్వం అర్ధమౌతుంది.
***

3. ఆంధ్రపత్రిక 1922, అక్టోబరు 4

రంపపితూరి
.
ఇద్దరు పోలీసు ఉద్యోగులును, 28 మంది పోలీసులును గుడెం కొండలలో పితూరిదారుల కొరకు వెతుకుచుండగా సెప్టెంబరు 24 వ తేదీన పితూరిదారులదరిపాటున వారిపై బడిరి. ఉద్యోగులగు స్కాటు కవర్డు, హయిటరు గార్లును ఒక కనిస్టెబును యీ ముగ్గురును మడసిరి (చనిపోయారు). ఒక హెడుకనిస్టేబుకును, ఇంకొక కనిస్టేబుకును గాయములు తగిలెను. మరియొక కనిస్టేబు కనబడనేలేదు.// ఉద్యోగుల మరణవార్త హతశేషులవలన విని వారి శవములను కొనితెచ్చుటకు కొండపైకేగుటకు ఆర్మిటేజి గారు ప్రయత్నింపగా అడవిలోనున్న పితూరిదారులు తుపాకులను కాల్చుటచే ఆర్మిటేజిగారు ముందుకు వెళ్లలేదు. ఈ రెండవప్రయత్నమున మరలనొక కనిస్టేబు హతుడయ్యెను. చనిపోయినవారి శవములను, గాయములు తగిలినవారిని పిమ్మట గ్రామవాసులు తీసుకొని వచ్చిరి.

స్కాటుకవర్డు గారికి మన్యమంతయును బాగుగా తెలియును. ఆయన చాలా సమర్ధుడు. హయిటరు గారు టెంపరరీ పోలీసు అసిస్టెంట్ సూపర్నెంటు. జర్మని యుద్ధములో, 1914 ఏడెనులో, 1919 ఆఫ్ఘను యుద్ధములో పనిచేసెను. ఈ యుద్యోగులిద్దరును హతులగుటవలన గొప్పనష్టముకలిగినది.
 
పితూరి దారుల నాయకుడగు అల్లూరి సీతారామరాజును అతని ముఖ్యానుచరులనిద్దరిని గూర్చి తెలిపినవారికిని వారిని పట్టియిచ్చిన వారికిని బహుమానము లియ్యబడునని ప్రకటింపబడెను. మన్యములో ముఠాదారులు (కౌలుదారులు) ఇట్టి తొందరలు కలిగినపుడు పోలీసులకు సహాయము చేయవలెనను షరతుకలదు గాన అట్లు సహాయము చేయవలెనని ముఠాదారులను నిర్భంధించుటకు ఏర్పాటులు చేయబడెను.
.
పై సంఘటన ద్వారా శ్రీరామరాజు ఉద్యమం ఏ మేరకు బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించిందో తెలుస్తుంది.
***

4. ఆంధ్రపత్రిక 1923, మే 31 జూన్ 4, జూన్ 18, జూన్ 19

రంపపితూరి - వాల్తేరులో విచారణ
.
1922 అక్టోబరు నెలలో జరిగిన ఎదురుకాల్పులపై విశాఖపట్నం కోర్టులో జరిగిన విచారణ వివరాలు 1923, మే 31, జూన్ 4, జూన్ 19 వ తేదీల ఆంధ్రపత్రిక లో విపులంగా వచ్చాయి. ఈ విచారణలో దుశ్చర్తి గ్రామ కౌలుదారుడైన చెక్కా లింగం దొర ఇచ్చిన సాక్ష్యంద్వారా శ్రీ రామరాజు భూకబ్జాదారుడని చేసిన ఆరోపణ పూర్తిగా సత్యదూరమని అర్ధమౌతుంది.
శ్రీ రామరాజుకి అసిస్టెంటు కమిషనరు గారు పైడిపుట్టలో 50 ఎకరముల భూమి ఇచ్చినట్లు; సదరు ఆర్డరు ప్రకారం ఈ చెక్కా లింగందొర ఆ భూమిని శ్రీరామరాజుకు అప్పగించినట్లు; ఆయన ఆ భూమిని దున్నటము మొదలగునవి ఏమీ చేయక, వారు (రామరాజు) నేపాళదేశము వెళ్ళిపోతానని చెప్పేవారని చెక్కా లింగందొర సాక్ష్యం చెప్పాడు.
***
ఇదే విచారణలో అడపా నడిపిపడాలు అనే సాక్షి “బాస్టియన్ దొర (ఏజెన్సీ డి. తహసిల్ దారు) పెట్టు బాధలచేతనే యీ పితూరి లేచినదని ప్రజలు తరుచుగా అనుకొంటారు” అని చెప్పాడు. అదే విధంగా క్రాస్ ఎగ్జామినేషను చేస్తున్న వకీలు “బేస్టియన్ దొరగారి మహా ఉద్రేకమయిన అల్లరులే ఈ పితూరీకి కారణము. ఆయనను తీసివేస్తే ఈ పితూరీ లేకపోవును” అని వ్యాఖ్యానించాడు.
 
బాస్టియన్ దొర దురాగతాలను గురించి ఖానుబహద్దరు అబ్దులు హజీజు సాహెబు (పోలవరం కలక్టరు) కూడా తన సాక్ష్యంలో ఇలా చెప్పాడు. “ బాస్టిన్ దొరగారిని నేను ఎరుగుదును. బాస్టిన్ గారు ప్రజలను బాధపెట్టెదరు. ప్రజలచే 500 రూపాయల పనిచేయించుకొని పని బాగాచేయలేదను అబద్దపు మిషపై 100 రూపాయిలు మాత్రమే కూలీలకిచ్చేవారు. // కూలీలను తీసుకురాని ముఠాదారులకు మిరపకాయగుండను వారి మర్మస్థలములో బాస్టన్ గారు రాయించేవారు. ఇటులనే అనేక బాధలు పెట్టేవారు. నేను బాస్టిన్ గారి చర్యలను గూర్చి ఒక గట్టి రిపోర్టును వ్రాయగా బాస్టిన్ గారిని ఇప్పుడు పొట్టంగికి బదిలీ చేసినారు. సంతానం పిళ్ళై అను ఓవరుసీయరు గూడ ప్రజలను బాధపెట్టుటలో బాస్టను గారికి చాలా తోడుపడెను. ఈయనను ఈ తరువాత బర్తరవు చేసిరి//.
.
మన్యంలో బాస్టిన్ దొర అతని అనుచరులు చేసిన విధ్వంసం వలన తిరుగుబాటు వచ్చింది, అనేవాదన శ్రీరామరాజు ఉద్యమానికి ఉన్న విశాల ప్రయోజనాలను పరిమితం చేస్తుంది. బహుశా ఆ దురాగతాలు రామరాజును తక్షణం ప్రేరేపించిన అంశాలుగా భావించవచ్చు.
***
ఈ విచారణలో అగ్గిదొర అనే ఒక సాక్షిని ప్లీడరు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తూ “రెండు సంవత్సరములలో బ్రిటిషు గవర్నమెంటు యుండదని రాజుగారు చెప్పుచుండెడివారని మీకు తెలియునా? అని ప్రశ్నించగా అతను “అట్లు రాజుగారు చెప్పుచున్నట్లు వదంతి గలదు” అని చెప్పటాన్ని బట్టి శ్రీ అల్లూరి సీతారామరాజు పోరాటం అంతా బ్రిటిషు గవర్నమెంటుకు వ్యతిరేకంగా దాన్ని కూలదోయటానికి చేసిన స్వాతంత్రపోరాటంగా విశ్వసించవచ్చును.
***
ముంజేరి కౌలుదారుడైన శరభం నాయుడు తన సాక్ష్యంలో – పితూరిదారులు సెప్టెంబరు నెలలో మా వూరు వచ్చారు. వారి చేతులలో తుపాకులు కత్తులు వగైరాలు కలవు. సర్కారుపై పోట్లాటకు కుమ్ముకు రావలెనని రాజుగారు మమ్ములనడుగగా మేము రామన్నాము. “దెబ్బలాట జరుగును గనుక మీ గ్రామములో ఎవరిని ఉంచకండి దెబ్బలు తగులుతవి అని నాతో రాజుగారు చెప్పగా భయముతో నేనుపోయి మావాళ్ళనందరిని మా వూళ్ళోనుంచి పంపివేస్తిని.
పై ఉదంతం ద్వారా శ్రీ రామరాజు బ్రిటిష్ ప్రభుత్వంతో చేస్తున్న పోరాటంలో, తనకు సహకరించని వ్యక్తులకు కూడా ఏ నష్టం జరగకూడదని కోరుకొనేవాడని అర్ధమౌతుంది. ఇది ఆయన ఉదాత్త వ్యక్తిత్వంగా భావించాలి.
***

5. శ్రీ రామరాజు గురించి స్వైరు దొర ఒక రిపోర్టు ప్రభుత్వానికి సమర్పించాడు. అది ఇలా ఉంది. (ఆంధ్రపత్రిక 31 మే, 1923)

“నేను అల్లూరి శ్రీ రామరాజుగారిని పిలిపించి మాటలాడితిని. అతని వయసు 25 ఏండ్లు-ఆయన విద్యాధికుడు. ఆంగ్లమున చాలా బాగుగా మాటలాడగలడు. ఆయన తనచరిత్ర నిటుల తెలిపెను. కృష్ణాజిల్లా మోగల్లు గ్రామమున నేను జననమై 14 వ ఏడు వచ్చువరకు నచటనేయుండి పిమ్మట కొంతకాలము రాజమంద్రిలోను తరువాత రామచంద్రపురమున, జాతీయపాఠశాలలోను విద్యనభ్యసించితిని. విరాగినై యరణ్యవాసముచేసి తరువాత సన్యసించునుద్దేశముతో నాలుగేండ్లక్రితమీ మన్యప్రాంతమునకు వచ్చితిని” అని రాజుగారు నాతో చెప్పిరి. అది మొదలుగా నరశీపట్నము మున్నగుచోట్లకు వెళ్ళుచున్నను తరుచు మన్యములోనే కొండలలోను అడవులలోను ఆయన తిరుగుచుండెను-ప్రజలలో చిన్న చిన్న సివిలు దావాలను పరిష్కరించుటకు ఆరునెలలక్రితము పంచాయితీ కోర్టులనేర్పరచెను.
 
// “నాకు దివ్యశక్తులు కలవని అవివేకముచే ప్రజలు తలంచు చున్నారు- నేను పితూరి ప్రారంభించెదనను వదంతులు బయలుదేరినవి-నాకు అసహాయోద్యమముతో సంబంధమేమియును లేదు” అని రాజుగారే నాతో చెప్పిరి. మీరు మన్యమును వదిలి నరిశీపట్నం వెళ్లవలెనని నేను తెలుపగా వెంటనే ఆయన అంగీకరించెను-అసిస్టెంటు కమీషనరు 31 వ తేదీని నరిశీపట్నమునకు రాగా ఆయన యెదుట రాజుగారు వ్రాతమూలమున గూడనిచ్చెను-ఇపుడితడు ప్రభుత్వమునకు వ్యతిరేకముగా నేమియును చేయదలచినట్లగుపడలేదు గాన ఇతనిపై చర్యజరుపుటనవసరము- అని ఆ రిపోర్టు సారాంసము.
.
1922 లో శ్రీరామరాజును అరస్టుచేసి, ఆరువారాలపాటు బంధీగా ఉంచి, రాజద్రోహం చేసినట్లు ఏ రకమైన ఆధారాలు లభించక విడిచిపెట్టినప్పుడు విచారణాధికారిగా స్వైరు దొరగారు రాసిన రిపోర్టు అది.
 
ఈ సందర్భంగా ఈ పోలీసు చెరనుండి నన్ను విడిపించమని శ్రీ రామరాజు పోలవరం డివిజను కలక్టరైన ఫజులా సాహెబు గారికి అర్జీ పెట్టగా, ఆయన రాజుకు యాభై యకరాల భూమిఇప్పించి పైడిపుట్టి గ్రామములో ఉండి వ్యవసాయము చేసుకొని జీవించమని ఆజ్ఞాపించాడు. దుశ్చర్తి కౌలుదారుడైన చెక్కా లింగందొర కు ఆ మేరకు ఉత్తర్వులు జారీచేసాడు. (రి. శ్రీ రామరాజు ప్రశంస - మద్దూరి అన్నపూర్ణయ్య ఆంధ్రభారతి జూలై, 1928)

బహుసా ఆ నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ చేయను అని కాగితాలపై సంతకాలు పెట్టించుకొని ఉంటారు. కానీ శ్రీ అల్లూరి సీతారామరాజు లక్ష్యం, గమ్యం వేరే ఉన్నప్పుడు ఆ సంకల్పాన్ని సంతకాలు నిలువరించగలవా?
 
ఆ తదనంతరం ఆ భూమినాకు అవసరం లేదు అంటూ, మీ ఇష్టం వచ్చినవారికి ఇచ్చుకోవచ్చును అంటూ 14-06-1922 న ఒక ఉత్తరం ద్వారా శ్రీ రామరాజు చెక్కా లింగందొర కు తెలియచేసాడు. ఈ సంఘటన ద్వారా కూడా శ్రీ రామరాజు తృణప్రాయమైన సంపదలకొరకు తన వ్యక్తిత్వాన్ని, లక్ష్యాన్ని అమ్ముకొనే వ్యక్తి కాదని నిరూపితమౌతుంది.
***
6. శ్రీ రామరాజు ప్రశంస - మద్దూరి అన్నపూర్ణయ్య ఆంధ్రభారతి జూలై, 1928

స్వరాజ్యమే అతని లక్ష్యము

…. కానీ అది పితూరీ కాదు. అది స్వాతంత్ర్య యుద్ధము. బాష్టియను దుండగములు భూముల రిజర్వేషను వలన ప్రభుత్వముపై కోయదొరలలో జనించిన ద్వేషమును శ్రీ రామరాజు ఊతగాగొని స్వరాజ్యము లభించినగాని శాశ్వతసౌఖ్యము జేకూరదని అతడు నిష్కర్షగా బోధించియుండవలెను.
 
//స్వరాజ్యమే తన పరమావధియైనటుల తనకు కుడిభుజములైన గాం సోదరులతో స్పష్టముగా చెప్పినట్లు ఒక పితూరీదారుడు కోర్టులో చెప్పెను. సిఐడి సబినస్పెక్టరు గుండాల శ్రీనివాసరావు గారు కూడా కోర్టులో స్వరాజ్యముకొరకే యుద్ధముజేస్తున్నానని రాజు తనతో చెప్పినట్లు తెలిపినాడు. కాన ముమ్మాటికిని ఆయన వుద్దేశం స్వరాజ్యస్థాపనమే అని రూఢియగుచున్నది.
***

7. శ్రీ అల్లూరి రామరాజు గారు - భోగరాజు పట్టాభిసీతారామయ్య, భారతి 1-7-1928

//శ్రీ రామరాజుగారు దోపిడి చేయలేదు. పితూరిగావింపలేదు. స్వార్ధముకొరకు ఘోరకృత్యములు సలుపలేదు. తన దేశవిముక్తికొరకు బ్రిటిషువారిపై యుద్ధము చేసెను. ఆనాడు నానాఫర్నవీసు, రాణీలక్ష్మీభాయి మున్నగువారు భారత స్వాతంత్ర్య యుద్ధముకొరకు యెటుల పోరాడిరో అటులనే 3 సంవత్సరములకాలము, బ్రిటిషు ప్రభుత్వోద్యోగులకు పూర్వసూచనలు గావించి, బహిరంగ యుద్ధములకై స్థల కాలనిర్ణయములతో నాహ్వానములనంపుచు, యుద్ధమును జరిపెను.
.
8. ముగింపు

శ్రీ రామరాజును బ్రిటిష్ వారితో సహా ఆయన సమకాలీనులు సరిగానే అర్ధం చేసుకొన్నప్పటికీ నేడు కొందరు ఆయన భూకబ్జా దారుడని, సొంత భూమికోసం బ్రిటిష్ వారితో చేసిన పోరాటాన్ని స్వాతంత్ర్యపోరాటంగా చిత్రీకరిస్తున్నారంటూ దుర్మార్గమైన కట్టుకథలను ప్రచారం చేస్తూ చరిత్రను వక్రీకరించబూనటం గర్హనీయం.
 
కేవలం ఎనిమిది వందలమంది అనుచరులతో, అరకొర ఆయుధసంపత్తితో రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించబూనటాన్ని అవగాహనా రాహిత్యంగా కాక మాతృదేశ దాస్యశృంఖలాలను విడిపించాలన్న జ్వలించే తీవ్రమైన కాంక్షగానే చూడాలి. ప్రాక్టికల్ గా ఆలోచించే నేటి తరానికి అలా పోరాడటం వెనుక నిప్పులాంటి నిష్కల్మషమైన చిత్తశుద్ధి, నిజాయితీ ఉండేవనే విషయం నమ్మబుద్ధికాక ఏవో స్వార్ధప్రయోజనాలు ఉండే ఉంటాయని సరిపెట్టుకోచూడటం, ఆ మేరకు వక్ర భాష్యాలు చెప్పటం విషాదకరం.
 
శ్రీ రామరాజు ఉదంతంలో భిన్న వ్యవస్థలు కలవరపడిన వైనం ఆనాటి వార్తాకథనాలద్వారా స్పష్టంగా అర్ధమౌతుంది

కాంగ్రెస్ పార్టీ అప్పటికి సహాయనిరాకరణోద్యమం పేరిట మెత్తమెత్తగా స్వాతంత్ర్యపోరాటం జరుపుతోంది. శ్రీ రామరాజు మన్యంలో జరుపుతున్న ఈ సాయుధ పోరాటం తమపీకకు ఎక్కడ చుట్టుకొంటుందో అని- మన్యం అనేది దుర్గమమైన కీకారణ్యం. అక్కడకు కాంగ్రెస్ నాయకులు వెళ్ళి ఆ ప్రజలను ప్రభావితం చేసి పితూరీ లేవదీసే అవకాసమే లేదు అని ప్రకటించి చేతులు దులుపుకొంది.

బ్రిటిష్ ప్రభుత్వం ఈ పితూరి ప్రభుత్వంపై కాదని, ఏదో స్థానిక బాస్టిన్, సంతానం వంటి అధికారుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా రేగిన చెదురుమదురు అల్లర్లని ప్రకటించుకోవటానికి ఆరాటపడింది.
 
పితూరీదారులు ఊర్లను దోచుకొన్నారని వైజాగ్ లో జరిగిన కోర్టు విచారణలో పదే పదే సాక్షులతో చెప్పించినప్పటికీ, చాలామంది సాక్షులు పితూరి దారులు బియ్యం, వంట సామాగ్రి, పడుకోవటానికి మంచాలు ఎత్తుకుపోయారని చెప్పారు తప్ప ధనకనక వస్తువులు దోచుకొన్నట్లు చెప్పలేదు. అంతే కాక స్త్రీలను చెరిచిన దాఖలాలు కూడా కానరావు. ఇది శ్రీ రామరాజు నాయకత్వ పటిమగా అర్ధం చేసుకోవాలి.

శ్రీ రామరాజుకు 50 ఎకరాలు భూమి ఆశచూపి ఉద్యమాన్ని నీరుకార్చాలని చూడటం కూడా ఆనాటి ప్రభుత్వం చేసిన ఒక ప్రయత్నం.

ఇక అన్ని ప్రయత్నాలు విఫలమై, ఈ ఉద్యమం దావానలమై ప్రజలలో విస్తరిస్తున్నదన్న సంగతి గ్రహించిన ప్రభుత్వం, చివరకు ఎన్కౌంటర్ రూపంలో శ్రీరామరాజును మట్టుబెట్టటం జరిగింది. తనను ప్రశ్నించేవారిపై రాజ్యం చేసే చివరి దరహాసమని అనాదిగా పదే పదే రుజువయ్యే పరమ సత్యమది.
 
బొల్లోజు బాబా
9/7/2022















No comments:

Post a Comment