Monday, April 26, 2021

Imported post: Facebook Post: 2021-04-26T00:57:23

భారతదేశం నా మాతృభూమి - మీనా కందసామి India is my Country by Meena Kandasamy . ఇంతటి విధ్వంసంలోకి మనల్ని నడిపించిన నియంతలా, మృత్యువు కూడా రకరకాల వేషాలు ధరించటం నేర్చుకొందీవేళ బరువైన పూలదండలు లేవు, శవాల బొటనవేళ్ళను కలిపిముడివేసే వారు లేరు. బిగుసుకుపోయిన వాటి చేతులను దగ్గరకు చేర్చి సరిచేసేవారు లేరు. మృతుల దేహాలపై కొత్తదుస్తులను కప్పేవారు లేరు. ఫ్రీజరు బాక్సులు లేవు. సుగంధద్రవ్యాలను చల్లేవారు లేరు. ముక్కు, చెవుల రంద్రాలలో దూది ఉండలు ఉంచి, నుదిటిపై రూపాయిబిళ్ళను పెట్టేవారు లేరు. దుఃఖితస్త్రీల రోదనలు లేవు. గుండెలుబాదుకొంటూ, దుస్తులు చింపుకొంటూ ఏడ్చేవారు లేరు. సందర్శకుల తాకిడిలేదు. గదిలోంచి అలలుఅలలుగా వెక్కివెక్కి విలపించే గొంతులు లేవు. స్త్రీలు, పిల్లలు శ్మశానానికి రాకూడదంటూ శాసించే పురుష స్వరాలు వినిపించవు. డొక్కలో మోచేతితో పొడిచి "తరువాత శవం లేచేది మీ ఇంట్లోనే" అని గుసగుసగా మాట్లాడేవారు లేరు. మద్యం లేదు. చావు బాజాలు లేవు. పాడెమోసేవారు లేరు. పాడే లేదు. నోట్లో బియ్యపు గింజలు పొసే వారులేరు. సామూహిక ఓదార్పులు లేవు. ఎడతెగని కన్నీళ్ళు లేవు. ఉన్నదల్లా... కనుచూపుమేర విస్తరించిన తెల్లని ప్లాస్టిక్ దుప్పటిలో చుట్టిన అనామక శవాల ప్రవాహం. అనుమతించబడిన ఒక ఒంటరి బంధువు తండ్లాట. వరుసలు వరుసలుగా పేర్చి అంటించిన చితులు. ఏ దుఃఖమూ లేని జ్వాలలు, బూడిద. కాలటానికి ఇష్టపడని కట్టెలను పైకి క్రిందకీ సర్ధుతూ భయపెట్టే పొగల మధ్య తిరుగాడే శవదహన కార్మికులు. అంతిమ యాత్రలో నిమజ్జనం చేయటానికి అస్థికలు లేవు, వీడ్కోలులు లేవు, చివరి పలుకులు లేవు. మృతుల కొరకు విలపిస్తాం. మన జడత్వం పట్ల దుఃఖిస్తాం, "భారతదేశం నా మాతృభూమి" అని రోజూ గర్వంగా చెప్పుకొనే వాక్యానికి లోగొంతుకతో "నా మాతృభూమి ఒక శ్మశాన వాటిక" అనే మాటల్ని జోడించుకొని శోకిస్తాం. . Source: India is my country by Meena Kandasamy అనువాదం: బొల్లోజు బాబా

No comments:

Post a Comment