[‘ఒకనాటి ఆంధ్ర రాజధాని పిఠాపురం” అనే ముప్పై పేజీల వ్యాసం ముగింపు వాక్యాలివి. రానున్న “తూర్పుగోదావరి జిల్లా-ప్రాచీనపట్టణాలు” పుస్తకం నుంచి )
.
ముగింపు
నేటి సమాజం మతప్రాతిపదికన నిలువునా చీలిపోయింది. హిందుయేతర మతాలు అన్యమతాలుగా పరిగణింపబడుతున్నాయి.
మధ్యయుగాలలో భారతదేశానికి వచ్చిన ముస్లిములను బయటనుంచి వచ్చినవారిగా, అదే విధంగా కలోనియల్ పాలనలో క్రిష్టియన్ మతం స్థానిక ప్రజలను మార్పిడులకు గురిచేసినట్లుగా మతవాదులు అభిప్రాయపడతారు. బ్రిటిష్ పాలకులు జనగణన చేసేటపుడు భారతదేశ ప్రజలకు మతం, కులం అనే అస్తిత్వాలను ఆపాదించి విభజించారని ఆ కారణంగా సమకాలీనసమాజం నేడు భిన్న సమూహాలుగా బిగుసుకుపోయిందని మరి కొందరి అభిప్రాయం.
బ్రిటిష్ పాలనకు ముందు భారతీయసమాజం అంతా ఏకతాటిపై లేకపోయినప్పటికీ క్రీస్తుపూర్వం నుంచీ ఈ నేలపై భిన్నవిశ్వాసాలు సహజీవనం చేసాయి. బౌద్ధం, జైనం, హిందూమతం, ఇస్లామ్ విశ్వాసాలను ఆచరించిన ప్రజలు ఒకప్పుడు కలిసిమెలిసి జీవించారని ఒకరినొకరు గౌరవించుకొన్నారని చరిత్రలో అనేక ఆధారాలు కనిపిస్తాయి.
క్రీశ. 1324 నాటి విలసతామ్రశాసనంలో తెలుగునాట తుగ్లక్ యుద్ధోన్మాదంతో జరిపిన అకృత్యాలను రికార్డు చేస్తుంది. ఆధిపత్యపోరులలో “యుద్ధోన్మాదంతో జరిగిన విధ్వంసాన్ని” మినహాయిస్తే “ప్రశాంత పాలనాసమయంలో ” హిందూ ముస్లిమ్ సంస్కృతులు సమాజంలో కలగలసిపోవటం గమనించవచ్చు.
కృష్ణదేవరాయలు మసీదులు కట్టించాడు, పర్షియన్ తరహా నిర్మాణాలు నిర్మించాడు. హిందూరాజులలో “సుల్తాను” అని పిలిపించుకోవటం ఒక బిరుదుగామారింది. ఇబ్రహిం కుతుబ్ షాను మల్కిభరామునిగా కవులు సొంతం చేసుకొన్నారు. సాహిత్యం, శాసనాలలో ఎక్కడా ముస్లిమ్ వ్యతిరేకత కనిపించదు. కుతుబ్ షాహి పాలనలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో కూడా వెలువరించేవారు. ఈ కాలంలోనే తెలుగుభాషలోకి అనేక ఉర్దూపదాలు వచ్చి చేరాయి. సూఫీ, పీర్ల సంస్కృతులు సమాజంలో ఆదరణ పొందాయి
ఒరిస్సారాజులకు గజపతులని, విజయనగర రాజులను నరపతులని, గోల్కొండరాజులను అశ్వపతులని సమానహోదాతో హిందూ ముస్లిమ్ రాజులు వ్యవరించుకొన్నారు. దీనికి ప్రధానకారణం అనాదిగా భారతదేశంలో భిన్న సంస్కృతులు ఒక జీవనవిధానంగా ఉండటమే.
శాతవాహనులు హిందూ మతాన్ని అవలంబించినా అనేక బౌద్ధ ఆరామాలు, చైత్యాలు నిర్మించారు వాటి నిర్వహణకు దానాలు ఇచ్చారు. కొన్ని శాతవాహన నాణాలపై జైనమతానికి చెందిన శ్రీవత్స ముద్ర ఉండటాన్ని బట్టి వారు జైనాన్ని కూడా సమాదరించారని భావించాలి.
జైనమతానికి చెందిన కళింగరాజు ఖారవేలునికి “సర్వ పసంద పూజక” (అన్ని ఆరాధన పద్దతులను గౌరవించేవాడు) “సర్వ దేవయతన సంస్కరణ” (అన్ని ఆరాధనా విధానాలకు ఆలయాలు నిర్మించేవాడు) అనే బిరుదులు కలవు.
కుబ్జ విష్ణువర్ధనుడు తాను వైష్ణవుడని చెప్పుకొన్నప్పటికీ ఇతని భార్య అయ్యణ మహాదేవి జైన మతాన్ని అవలంబించింది. జైనులకు అనేక బసతులను నిర్మించింది. విష్ణువర్ధనుడి కాలంలోనే పిఠాపురం గొప్ప బౌద్ధక్షేత్రంగా విలసిల్లటం మరో విశేషం.
గుణగవిజయాదిత్యుడు శైవుడైనప్పటికీ ఇతని వద్ద సేనానిగా పనిచేసిన పండరంగని కుటుంబం జైనమతాన్ని పాటించేవారు. శైవమతాలంబక రెండవ అమ్మరాజు ఒక జినాలయానికి మైలంపూడి అనే గ్రామాన్ని దానంగా ఇచ్చాడు.
ఈ ప్రాంతంలో ఒకసమయంలో హిందూ, బౌద్ధం, జైనమతాలు సమాదరణ పొందాయి. చాలాకాలం ప్రజలు భిన్నవిశ్వాసాలను పాటిస్తూ, ఒకరిపట్ల మరొకరు సహిష్ణుత ప్రదర్శించుకొంటూ కలిసిమెలసి జీవించారనటానికి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కుయ్యేరు గ్రామంలో ఒక ప్రాచీన జైనాలయానికి చెందిన స్తంభంపై జైన, హిందూ శిల్పాలను పక్కపక్కనే ఉండటం గమనించవచ్చును నేటికీ. కాలక్రమేణా కొన్ని విశ్వాసాలు రాజాదరణ కోల్పోవటంతో క్రమేపీ కనుమరుగయ్యాయి. అయినప్పటికీ ఈ వ్యాస ప్రారంభంలో చెప్పినట్లు భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే జైన, బౌద్ధ, హిందూ, ముస్లిం, గురుపూజ సంప్రదాయాలకు పిఠాపురం అనాదిగా ఆలవాలంగా ఉంటూ వస్తున్నది.
బొల్లోజు బాబా
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment