Saturday, July 30, 2016

“చంద్రవర్షం” లో తడిచిన అందమైన వాక్యాలు – భగ్వాన్ కవిత్వం


వడ్లబండి, బల్లకట్టు వంటి చక్కని కవితా సంపుటులను వెలువరించిన శ్రీ భగ్వాన్ తాజాగా “చంద్రవర్షం” పేరుతో వ్రాసిన కొత్త కవిత్వసంపుటి, జూలై 24 న, కొత్తపేటలో ఆవిష్కరణ జరగనుంది.

ఒక కవి తాను సృష్టించే కవిత్వంలో అతని ప్రాంతం ప్రతిబింబిస్తుంది. ఒక మెట్రోకవి పట్టుకొనే వస్తువులకూ, కనీసం పట్టణీకరణ కూడా చెందని ఊరిలో ఉండే కవి కవిత్వీకరించే వస్తువులకూ చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ తేడాని వారి వారి కవిత్వం ఇట్టే పట్టిచ్చేస్తుంది. భగ్వాన్ కవిత్వంలో కనిపించే ప్రతీకలు, పదచిత్రాలు పల్లెటూరి మట్టి పరిమళాల్ని కలిగి ఉంటాయి. నది, చెట్టు, పిట్ట, ఎండ, వాన, చలి, కాలువలు, తోటలు, జీవితానుభవాలు….. ఇవే ఈ “చంద్రవర్షం” లో కనిపించే చినుకులు, కవిసమయాలూ.

ప్రకృతికి చెట్టు పిట్టా ఎంతముఖ్యమో, కవిత్వానికి కూడా అవి అంతే ముఖ్యమన్న రహస్యాన్ని “చంద్రవర్షం” చెపుతుంది.

జీవితంలోంచి తోడుకొనే కవిత్వానికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువ. సార్వజనీనం చేయబడిన అనుభవం ఎక్కువమందికి కనక్ట్ అవుతుంది. అవే భగ్వాన్ కవిత్వానికి శక్తిని, కాంతిని ఇచ్చే అంశాలు.

ఒక సాదాసీదా అనుభవాన్ని కవిత్వం చేయటం ఎంతో ప్రతిభ ఉంటే కానీ సాధ్యం కాదు. దీన్ని భగ్వాన్ అనేక కవితలలో అలవోకగా సాధిస్తారు.

“పాత పుస్తకం” అనే కవితలో …… ఒక పాతపుస్తకాలు కొనుక్కొనే వ్యక్తి సైకిల్ పై వెళుతుంటే, అతని సంచిలోంచి ఓ పుస్తకం జారి పడిందట. ఆ వెనుకే వెళ్తున్న కవి అది చూసి, ఆ వ్యక్తిని ఎంతపిలచినా అతను వినిపించుకోకుండా వెళిపోయాడట. కవిత ఇలా ముగుస్తుంది.
నేనా పుస్తకాన్ని తీసి
భద్రంగా దాచాను
తరువాత రోజుల్లో అది
నన్ను మనిషిని చేసే పుస్తకమవుతుందని
అప్పుడు ….. నాకు తెలియదు.
----- అని. ఇక్కడ ఆ పుస్తకమేమిటో చెప్పకుండా వదిలివేయటం వల్లే ఇది కవిత్వమైంది. ఒక వేళ “ భగవద్గీత లేదా చేగువెరా” పుస్తకం అనో ఏదో ఓ పేరుని కవి చెప్పాడా “కవిత ఫెయిల్ అయి ఉండేది”. ఈ కవిత చదివిన ప్రతిపాఠకుడూ అలా తనను ప్రభావితం చేసిన పుస్తకాన్ని, అది తన చేతుల్లోకి వచ్చిన సందర్భాన్ని ఒక సారి గుర్తుచేసుకొని, తనలోనికి కాసేపు ప్రయాణిస్తాడు. అదే కదా కవిత్వం చేయాల్సిన పని.
ఈ సంపుటిలో చాలా కవితలు నేరేటివ్ పద్దతిలో ఉంటాయి. ఉదాహరణకు, టీచర్ అయిన కవి తరగతి గదిలోకి కిటికీ గుండా ఒక పిచ్చుక వచ్చి మేజాబల్లపై గెంతులాడి దాదాపు అరగంట సేపు అక్కడే సంచరించి, తుర్రుమని ఎగిరిపోయిందట. ఆ కవితను….
పిచ్చుక ఎగిరిపోయాకా నాకనిపించింది
నేను చెప్పాలనుకున్న పాఠం
తను చెప్పి పోయిందని
…… అంటూ ముగిస్తారు. ఈ కవితాశీర్షిక “పాఠం పేరు పర్యావరణం”. ఉత్త శీర్షిక ద్వారా, ఒక సాదా సీదా సంఘటనను అసాధారణమైన సందర్భంగా మార్చి కవిత్వీకరించిన తీరు అబ్బురపరుస్తుంది.

యూట్యూబ్ లో పిచ్చుక శబ్దాన్ని
ఇయర్ ఫోన్ లో వినే నేను
కిటికీలోంచి ఒక పిచ్చుకైనా కనిపిస్తుందని
ఆరాటపడటంలో తప్పేమీలేదనుకొంటాను//
(కిటికీ దగ్గర/శ్రీ విరించి విరివింటి) అంటూ ఆర్థ్రంగా పలికే ఓ పట్టణ కవి, అప్పుడప్పుడూ పిచ్చుకలని చూసే భగ్వాన్ లాంటి ఓ గ్రామీణ కవి - ఒకే వస్తువును దర్శించిన తీరు, అభివ్యక్తీకరించిన భిన్న కోణాలు ఇక్కడ గమనార్హం.

కొత్తగా ఎక్కడైనా వంతెన నిర్మాణం జరిగితే ఆ ప్రాంతం చాలా వేగంగా మార్పులకు గురవుతుంది. యానాం వంతెన కట్టాకా అక్కడి ప్రజల జీవితాలలో వచ్చిన మార్పులను డైరెక్టర్ వంశీ ఓ కథలో అద్భుతంగా చెప్పుకొస్తాడు. భగ్వాన్ కూడా “ఒక వాస్తవం” అనే కవితలో కొత్తగా కట్టిన వంతెన గురించి వ్రాస్తూ….
అంత వరదలోనూ
అటూ ఇటూ పడవలు నడిపిన
సాహస వీరులెక్కడ//
ప్రయాణికుల పలకరింతలతో
పులకరించిన రేవుకిపుడు
మాట పడిపోయింది// -
--- అన్న వాక్యాలలో నాస్టాల్జియాలోకి వెళిపోయినట్లు అనిపించినా
వంతెన్ని కాదని నాగరికత విలసిల్లలేదు
వంతెన్ని కాదని ఊరు విశాలంగా విస్తరించలేదు.
ఇప్పుడు వంతెన ఒక వాస్తవం//…
.. అంటూ ఒక సమకాలీన సత్యాన్ని ఆవిష్కరిస్తాడు.
వస్తువైవిధ్యం ఈ కవితలకు మంచి పఠనీయతను కలిగించింది. కరంటుపోయిన రాత్రి, మాస్టారి కుర్చీ, ఒక రోజు బస్సు ప్రయాణం, నిద్రలేవటం, బస్సు నడపటం, నేనో పిచ్చుకను చూసాను, తోటకు వీడ్కోలు, ప్రవాహం వంటి వివిధ దైనందిక విషయాలు కవిత్వమై మెరిసాయి ఈ సంపుటిలో.

పుస్తకావిష్కరణ సభ విజయవంతంగా జరగాలని కోరుకొంటూ- భగ్వాన్ గారికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు, అభినందనలు…..

భగ్వాన్ గారి ఫోన్ నంబరు: 9393533336
భవదీయుడు
బొల్లోజు బాబా

అనుభూతి పరిమళాలు అద్దుకొన్న "ద్విభాషితాలు”


"తెలుగు కవిత్వం ప్రధానంగా రీతి కవిత్వం. ఇది బహుసా సంస్కృత సాహిత్యం నుంచి కూడా మనకు వచ్చిఉంటాది. రీతి కవిత్వం అంటే ఏదైనా కూడా వర్ణణాత్మకంగా ఉండాలి, వివరంగా ఉండాలి, ధారాళంగా ఉండాలి, కవిత్వ ధార ఉండాలి. – వాడ్రేవు చినవీరభద్రుడు, ప్రముఖ కవి, విమర్శకులు." 

ప్రముఖ వైణిక విద్వాంసుడు శ్రీ ద్విభాష్యం నగేష్ బాబు రచించిన “ద్విభాషితాలు” కవిత్వ సంపుటిలోని కవితలను పరిశీలించినట్లయితే- వీరభద్రుడు గారు అన్నటువంటి ధార కనిపిస్తుంది. అక్షర విన్యాసం, వివరణాత్మక వర్ణణలు ఈ కవితలను సౌందర్యభరితం చేసాయి. అదే సమయంలో గుండెను తడిపే ఆర్థ్రత అంతర్జలలా ప్రవహిస్తూంటుంది.
మనం రోజూ చూసే దృశ్యాలు, కలిగే అనుభవాలు, పొందే అనుభూతులు శ్రీ నగేష్ బాబు కలం లోంచి జాలువారి చక్కని కవితావాక్యాలుగా శిల్పీకరించుకొన్నాయి. సరళమైన శైలి, వస్తువైవిద్యం, సౌందర్యాన్ని పట్టిచ్చే సూక్ష్మ దృష్టి, మారుతున్న మానవవిలువలను గుర్తించి వాటిని నిలుపుకోవటానికి చేసే ప్రయత్నం, కల్మషమెరుగని హృదయం ప్రకటించే సామాజిక స్పృహ, ఏదైనా ఒక సత్యవాక్యమో సుందరస్వప్నమో దొరకకపోతుందా అంటూ లోలోపలికి చేసుకొనే అంతర్వీక్షణా – ఇవీ శ్రీ నగేష్ బాబు కవితా లక్షణాలు.

సౌందర్యం అనేది ఈ కవిని వెంటాడే లౌల్యం. అనేక కవితలలో ఈ విషయం తెలుస్తూంటుంది. అందుకనే ….

“ఉదయాస్తమయాల అంచులు
వర్ణరంజితమైనప్పుడు
దృశ్యమే ఐశ్వర్యం (అమృతవర్షం) అంటూ రంగులద్దుకొన్న సంధ్యలను వర్ణిస్తాడు. 


నవ వధువు లజ్జాభరిత వదనంలా
సరస్సులో కలువలు
హిమస్నాన కేళీవిలాసంలో తడిసి
మలయపవనంలో… దేహాల్ని ఆరబెట్టుకొంటున్న పైర్లు
(లోపలిస్పర్శ) అంటూ సుందర దృశ్యాన్ని మన కళ్లముందు నిలుపుతాడు.

వెలుగు పడమటిపొలం మలుపు తిరిగినప్పుడు…
పక్షుల రెక్కలపై వాలి… గూడు చేరుతుంది రాత్రి (రాత్రిగీతం)
అంటూ చీకటిపడేవేళని అద్బుతపదచిత్రంగా లిఖిస్తాడు.

వేడెక్కిన సముద్రం ఎల్ నినో ప్రయోగించి…
నగర వీధుల్లో పడవల్ని తిప్పుతోంది (సంవత్సరోత్సవం)
అన్న వాక్యాల్లో నేడు ఆధునిక మానవుడు చేస్తున్న ప్రకృతివిధ్వంశాన్ని అన్యాపదేశంగా ప్రస్తావిస్తాడు.

మంచి ఎత్తుగడ, నడక, ముగింపులతో సాగిన “వైణికుని సాధన” అనే కవిత, స్వయంగా వైణికవిద్వాంసుడయిన శ్రీ నగేష్ బాబు మాత్రమే వ్రాయగలిగే కవిత.

ఇంట్లో గోడవారన నిలబెట్టిన వీణను చూస్తే….
నానుంచి నేను విడిపోయి..
నాకోసం నిరీక్షిస్తున్నట్లుంది
తరాల సంస్కృతిని నాకు ఉపదేశం చేయడానికి
నా ముందు ప్రత్యక్షమై
దీక్షలో కూర్చొన్న మహారుషిలా వుంది…….
అంటూ మొదలైన కవిత “వీణ నా తపస్సు/వీణ నా యశస్సు// నాకు వరంగా దొరికిన ధనస్సు!” అంటూ ముగుస్తుంది. సునాదవైణికునిగా పలు జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలెన్నో ఇచ్చిన ఒక విద్వాంసుని జీవితంతో వీణావాద్యం ఎలా పెనవేసుకుపోయిందో కవితాత్మకంగా ఆవిష్కరిస్తుందీ కవిత.

“అద్దం మీద పిచుక” కవితలో- అద్దంమీద పిచుక తన ప్రతిబింబాన్ని ఎలాగైతే శోధించుకొంటుందో అలాగే మనిషికూడా ఒక్కసారైనా అద్దంమీద పిచుక కావాలి, తనని తాను తవ్వుకోవాలి అంటారు నగేష్ బాబు. Know Thyself అని సోక్రటిస్ అన్న మాటకు ఒక చక్కని Alligory ను జోడించి గొప్ప తాత్విక భావాన్ని హృద్యంగా వర్ణించారు.

“నాన్న” అనే శీర్షిక పెట్టి “అమ్మ” పై వ్రాసిన కవిత చాలా కరుణరసార్థ్ర భరితంగా ఉంది. చాలా మంచి కవిత ఇది.
“లోపలి స్పర్శ” కవితలో కనిపించే అంతర్వీక్షణం, “దర్శనం” లో చూపించిన దైవత్వం, “మెరుపు” లో పలికిన మౌనప్రేమ, “మూడు కాళ్ళ కుందేలు” కవితలో వ్యక్తమైన వ్యంగ్యం, – వంటివి “ద్విభాషితాలను” ఉత్తమ కవిత్వంగా నిరూపిస్తాయి.

రచయిత ఫోన్.నం: 9849439170
మెయిల్: nageshbabuveena@gmail.com
*****
29-7-2016 న పల్లెపాలెంలో జరిగిన ఈ పుస్తకావిష్కరణ సభలో, శ్రీ వాడ్రేవు వీరలక్ష్మీ దేవి, శ్రీ దాట్ల దేవదానం రాజు, శ్రీ అదృష్ట దీపక్, శ్రీ మధునాపంతుల సత్యనారాయణ మూర్తి, శ్రీ శిఖామణి లు పాల్గొన్నారు.
బొల్లోజు బాబా

అనుకరణ -- by Palestinian poet Fady Joudah

చిన్నపిల్లలతో సంభాషిస్తున్నట్లు చెప్పే కవిత్వం పైకి సరళంగా కన్పిస్తున్నా లోతైన అర్ధాల్ని పొదువుకొని ఉంటుంది. ఇలాంటి కవితలలో మనం మరచిపోతున్న మానవత్వాన్ని చిన్నపిల్లల ప్రశ్నల ద్వారా లేదా పనుల ద్వారా మన ముందుంచుతాడు కవి. చాలా గడుసుగా మనల్ని దోషుల్ని చేస్తాడు. అదొక మంచి కవిత్వసంవిధానం.
Fady Joudah పాలెస్తీనాకు చెందినవాడు కనుక ఇదేదో పాలెస్తీనా నిర్వాసితుల గొడవలా అనిపించినా, మనప్రభువులు చేస్తూన్న అశ్వమేధయాగం లాంటి భూసేకరణల నిర్వాసితులకూ వర్తించే ఒక సార్వజనీన అంశం కూడా.
కాలానికి, ప్రాంతానికి అతీతంగా ఉండటం గొప్పకవిత్వ లక్షణం కాదూ?


అనుకరణ -- by Palestinian poet Fady Joudah

తన సైకిల్ హేండిల్స్ మధ్య
గూడుకట్టుకొన్నసాలెపురుగుని
రెండువారాలుగా
అదిలించ లేదు మా అమ్మాయి
దానంతట అదే వెళిపోయే వరకూ
ఎదురుచూసింది. 


నీవు దాని గూటిని తొలగించి ఉన్నట్లయితే
అది తెలుసుకొనేది కదా "ఈ ప్రదేశం తన ఇల్లు కాదని;
నీవూ చక్కగా సైకిల్ తొక్కుకొని ఉండేదానవు" అన్నాను నేను


మనచుట్టూ ఎంతోమంది
నిరాశ్రయులు అవుతున్నది అలానే కదూ?'
అంది మా అమ్మాయి. 


Poem by Palestinian poet Fady Joudah
తెలుగు అనువాదం: బొల్లోజు బాబా

Friday, July 22, 2016

ప్రణయం


అంతవరకూ
ఇరుకిరుగ్గా ప్రయాణించిన కెరటం
తీరం పెదాలపై
నురగ పువ్వులుగా విచ్చుకొంది
నీటి నవ్వులుగా పరుచుకొంది.
బొరియలోకి దూరింది కుర్రపీత
భూమిని మరోసారి ప్రేమించటానికి


బొల్లోజు బాబా

Sunday, July 3, 2016

మిత్రులకు ఆహ్వానం
10-07-2016 ఆదివారం షోయబ్ హాల్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాద్ నందు, నా రెండు పుస్తకాల ఆవిష్కరణ జరగనుంది.
ఈ సభకు అధ్యక్ష్యత శ్రీ శిఖామణీ గారు, ఆవిష్కర్త శ్రీ శివారెడ్డిగారు, వక్తలు శ్రీ ఎం.నారాయణశర్మగారు, శ్రీ సత్యశ్రీనివాస్ గారు. సభానిర్వహణ శ్రీ యాకూబ్ గారు.
...
ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న కవిసంగమం, కవిసంథ్య లకు అనేకానేక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను.
చక్కని ఆహ్వాన పత్రికను డిజైన్ చేసిన శ్రీ బంగారు బ్రహ్మం గారికి ధన్యవాదాలు.
కవిమిత్రులం నలుగురూ కలిసి నాలుగు మాటలు మాట్లాడుకొనే సందర్భంగా దీన్ని నేను భావిస్తాను. అవకాశం, అందుబాటు ఉన్న మిత్రులు వస్తారని, అక్కడ కలుద్దామని ఆశిస్తూ…..
భవదీయుడు
బొల్లోజు బాబా