Thursday, March 19, 2015

గాథాసప్తశతి - 1


గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం.  గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము,  ప్రకృతి సౌందర్యం, ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.

గాథాసప్తశతి – దేవతల ప్రస్తావన
ఈశ్వరునికి శిరస్సుపై గంగ, సగభాగమై పార్వతీదేవి ఉన్నారు.  జానపద  సాహిత్యంలో గంగా గౌరీ సంవాదం పేరిట పాటలు ఉన్నాయి.  ఈశ్వరుడు సంధ్యావందనం చేసే సమయంలో చేతిలోకి గంగను తీసుకోవలసి వచ్చినపుడు, పార్వతీదేవి ఏవిధంగా కనిపించిందో అని ఈ ప్రాచీనకవి చేసిన  ఊహ ఎంతో సుందరంగా ఉంటుంది.

అర్ఘ్యమివ్వటానికి అర్ధనారీశ్వరుడు
గంగను చేతిలోకి తీసుకొన్నప్పుడు
అసూయతో ఎరుపెక్కిన గౌరీదేవి మోము
దోసిటిలో కమలమై ప్రతిబింబించింది.
అంజలి జలాలకు వందనమిడు.    -1

ప్రియురాలు సిగ్గుపడే సమయంలో ప్రియుని కనులను తనచేతులతో కప్పటం అనేది ఒక అందమైన చేష్ట.  అలా  ముక్కంటి కనులు మూయాలంటే పార్వతీదేవికి ఒకచేయి తక్కువైందట.  మరప్పుడామె ఏమి చేసిందటా?

శివపార్వతుల సంగమ సమయంలో
వలువలు తొలగగా సిగ్గిల్లిన పార్వతీదేవి
రెండుచేతులతో విభుని రెండు కళ్లూ మూసి
మూడవకంటిని ముద్దాడింది.       - 455

ఢిల్లీకి రాజయినా తల్లికి కొడుకే అన్నది ఒక నానుడి. చెట్టంత ఎత్తుకు కొడుకు ఎదిగినా  తల్లి మాత్రం  ఆకాశమై అతని తలనిమురుతుంది.  లేతప్రాయంలోనే కులకాంతల వలువలు దోచిన కృష్ణుని గురించి యశోద మాతృవాత్సల్యంతో మాట్లాడేటపుడు ..........

నా కృష్ణుడు ఇంకా చిన్నపిల్లాడే అని
యశోద అన్నపుడు,
గోపికలు కృష్ణుని చూస్తూ
ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు.     - 112

ఒక స్త్రీ మోము గుండ్రంగా, కాంతులీనుతూ ఉన్నదని చెప్పటానికి   చంద్రబింబంతో పోల్చటం అనేది అనేకమంది కవులు చేసే వర్ణన. కానీ ఇదే విషయాన్ని రెండువేల సంవత్సరాల క్రితం  గొప్ప చమత్కారంతో  ఈ ప్రాచీన కవి ఎలా చెప్పాడో చూడండి.

సుందరీ! రోజు పౌర్ణమి.
రాత్రి పెరట్లో పడుకోకు సుమీ!
రాహువు నీ ముఖాన్ని
చంద్రబింబమని అని భ్రమపడగలడు.            - 804

పై గాథలో చెప్పిన విషయమే మరింత అందంగా, మరింత గడుసుగా ఈ క్రింది గాథ లో కనిపిస్తుంది.    చందమామ-స్త్రీ మొఖము ఉపమానాన్ని ఈ గాథ పరాకాష్టకు తీసుకెళ్ళి వదులుతుంది. ఈ క్రమంలో దీనిని మించిన పదచిత్రం మరొకటేదయిన ఉందంటే అది ఖచ్చితంగా ఈ కవి వ్రాసిందే అయిఉంటుంది.

ప్రతీ పౌర్ణమి రోజునా సృష్టికర్త
చందమామను ఒకసారి తీసి
నీ మోముతో పోల్చిచూసి
చిన్నచిన్న మార్పులు చేసి
మరలా పెడుతున్నాడు.               - 207

ఆకుపచ్చని ఈకలతో, ఎర్రనిముక్కుతో రామచిలుక చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.  రామచిలుకలు సాధారణంగా ఒక గుంపుగా ఎగురుతూ ఉంటాయి.  అలాంటి ఒక రామచిలుకల గుంపు ఎగురుతూ వచ్చి వాలే దృశ్యాన్ని ఒక అందమైన పదచిత్రంగా ఈ గాథలో దర్శించవచ్చు....

రామచిలుకల దండు ఆకాశంనుండి
క్రిందకు వచ్చి వాలుతుంటే,
వైకుంఠంలోని లక్ష్మీదేవి యొక్క
పచ్చలు కెంపులు పొదిగిన నగలేవో
నేలకు జారిపడినట్లనిపిస్తోంది.           - 75  

ఈ గాథలలో మన్మధుని గురించి అనేక చోట్ల వస్తుంది.  ఒక యవ్వనవతి చన్నులను వర్ణించేటపుడు వచ్చే మన్మధుని ప్రస్తావన ఆ గాథకు గొప్ప పటుత్వాన్ని, లోతును ఇస్తూ, రోమాంచితం చేస్తుంది. .  

ఆమె చనుధ్వయం
ప్రేమను దాచుకొన్న
బంగారు లంకెబిందెలు
ఒక్కోదాని పైనా మన్మధుని
తేనెరంగు అధికార ముద్ర.                     - 813



భవదీయుడు


బొల్లోజు బాబా

No comments:

Post a Comment