Tuesday, January 13, 2015

అల్పత్వము

కోయిల గొంతులో రక్తజీర
జాతిని నిలుపుకోవటానికి
ఇదే చివరి పిలుపన్నట్లు.

పచ్చదనంతో పోటెత్తిన పత్రాలు
సూర్యుడ్ని పీల్చుకొంటాయి
రేపుండదన్నట్లు.

పువ్వులన్నీ పోటీపడతాయి
తుమ్మెద చుంబనానికై
ఈ రోజే ఆఖరన్నట్లు.

గాలిపటం వెనుక ఆ పిలగాడు
వడివడిగా పరుగెడతాడు
అదే ఈ లోకపు చివరిదైనట్లు.

చేతికందే ప్రతీక్షణమూ
కాలం అల్పత్వాన్ని
గుర్తుచేస్తూంటుంది.

బొల్లోజు బాబా

No comments:

Post a Comment