కప్ప దమనీ వ్యవస్థ డిసెక్షన్
విద్యార్ధులకు డిమానుస్ట్రేషన్ క్లాసది.
క్లోరోఫాం ఇచ్చిన కప్పను
డిసెక్షన్ చెక్కపై ఉంచి
కదలకుండా కాళ్ళకు మేకులు కొట్టాను.
నా చుట్టూ విద్యార్ధులు నిల్చొని
శ్రద్ధగా గమనిస్తున్నారు.
సిజర్ తో చర్మాన్ని కొద్దికొద్దిగా తొలగిస్తూ
స్టెర్నమ్ ఎముకను కత్తిరించి
ఉరఃకుహరాన్ని బయల్పరిచాను.
“మీ చేతులు వణుకుతున్నాయి సార్”
అన్నాడో విద్యార్ధి.
అప్పుడు గమనించాను
నా చేతులు విపరీతంగా వణుకుతున్నాయి.
మిగిలిన డిసెక్షన్ వెంటవెంటనే ముగించి
వచ్చేవారం మీరు చేద్దురుగాని అని చెప్పి
డిపార్ట్ మెంటుకు వచ్చేసాను.
భయమేసింది జబ్బేదైనానా అని.
కాగితం తీసుకొని నా పేరు వ్రాసుకొన్నాను
ముత్యాల్లాంటి అక్షరాలు
కొంచెం ధైర్యం వచ్చింది.
*****
విద్యార్ధుల ఒక్కొక్కరి ట్రేలో ఒక్కో కప్ప
వాళ్ళు జాగ్రత్తగా డిసెక్షన్ మొదలుపెట్టారు.
కాసేపయ్యాకా చూద్దును కదా
ప్రతి ఒక్కరి చేతులూ వణుకుతున్నాయి
అలా వణుకుతున్న చేతులతోనే
అందరూ డిసెక్షన్ చేస్తున్నారు – ఆశ్చర్యంగా!
*****
నిన్నరాత్రి
చెరువుగట్టుపై మిడతలు వాలినపుడు
గరికపూలు అలానే వణికుంటాయి.
బొల్లోజు బాబా