Monday, February 27, 2012

ఒక హిస్టరెక్టొమీ..

కారణాలేమైనా కానీ
నెలకో రక్తపుష్పాన్ని
రాల్చే
వృక్షాన్ని సమూలంగా
పెకలించారు.

నాగరీకుని
వైద్య ప్రయోగశాలలో
స్త్రీ దేహమెపుడూ ఓ గినియాపిగ్గే!

కారణాలేమైనా కానీ
రెండుకోతల్ని భరించి
ఒక తరాన్ని సృష్టించిన
మానవజాతి మొదటి ఊయల
మూడో కోతతో
మొదలు తెగి నేల కూలింది.

పర్యవసానాలు పూర్తిగా తెలీని వైద్యంలో
గర్భసంచో టెస్ట్ ట్యూబ్.
పిల్స్, సిజేరియన్లు, ఐయుడీలు,
ఐపిల్స్, ఇదిగో ఇపుడు సర్రోగసీలు.

కారణాలేమైనా కానీ
కనిపించని కత్తెరేదో
ఏ కనపడని భాగాన్ని తొలగించిందో
ఆత్మ
పెళుసుబారి, నెర్రలుతీసి
మరుగుకోసం దేహం
అంతా తిరుగుతూ రోదిస్తోంది.
ఓదార్చటానికి
హెచ్.ఆర్.టీలు, యాంటిడిప్రెస్సెంట్స్
వెంటనే వాలిపోయాయి.

జరాయురహిత దేహమిపుడో
సజీవ టంకశాల కదా!

బొల్లోజు బాబా

(విచ్చలవిడిగా జరుగుతున్న హిస్టరెక్టొమీ ఆపరేషన్లకు వ్యతిరేకంగా...... )
(Hysterectomy = గర్భసంచి తొలగింపు - HRT hormone replacement therapy))

20 comments:

  1. ఒక కవయిత్రి అయినా (being woman)ఇంత హృద్యంగా రాయలేదేమో అనిపిస్తోంది బాబా గారూ! ప్రతి లైనూ ఎంతో ఔపురూపంగా తోస్తోంది.

    నెలకో రక్తపుష్పాన్ని

    రాల్చే

    వృక్షాన్ని సమూలంగా

    పెకలించారు.

    కారణాలేమైనా కానీ

    కనిపించని కత్తెరేదో

    ఏ కనపడని భాగాన్ని తొలగించిందో

    ఆత్మ

    పెళుసుబారి, నెర్రలుతీసి

    మరుగుకోసం దేహం

    అంతా తిరుగుతూ రోదిస్తోంది._________

    కదిలిపోతోంది మనసు!

    ఇంతకంటే ప్రస్తుతానికి మాటలు లేవు

    ReplyDelete
  2. అవాక్కు అవ్వడము అంటే ఏంటో తెలిసింది. అద్భుతమైన కవిత .

    ReplyDelete
  3. బాబాగారు
    చాలా రోజుల తర్వాత మీ నుంచో అద్భుతమైన కవిత. చాలా బాగుందండి. ముఖ్యంగా ఈ లైనులు...

    రెండుకోతల్ని భరించి
    ఒక తరాన్ని సృష్టించిన
    మానవజాతి మొదటి ఊయల
    మూడో కోతతో
    మొదలు తెగి నేల కూలింది.

    W/Regards - Saikiran

    ReplyDelete
  4. chaalaa manchi kavitha.mee sahaanbhoothiki krithajnathalu.
    malleeswari.

    ReplyDelete
  5. ప్రతి పదం లో వ్యక్తమైన ధారణ మీ వ్యతిరేకతకి అద్దం లా ఉంది. ప్రతి స్పందన కవిత గానే ఉబికింది బాబా గారు. దాన్ని ఆపటానికి 5-6 గంటలు పట్టింది. పక్వానికి వచ్చీ రాని గెల దింపగానే మొదలుకి నరికినట్లుగా, పురిటి సమయం/నెప్పి పడనీయకనే సిజేరియన్ చేసి, ఆ..అంటే హిస్టరెక్టొమీ చేసేస్తున్న స్థితిని చాలా బాగా రాసారు. వైద్యం పట్ల అవగాహన లేని వారొక ప్రక్కన, వృత్తి పట్ల నిబద్దత లేని వారు మరొక పక్కన.

    ఇక్కడ అప్రస్తుతమైనా : ఇక్కడ ఏది కవితా వస్తువో - దాదాపు ఒక పుష్కరం క్రితం వచ్చిన "9 నెలలు" సినిమాలో - అదే గర్భసంచి ప్రధానాంశం గా దర్శకుడు క్రాంతికుమార్, భర్త కి వైద్యానికి డబ్బు అవసరపడి, ఒక నిరక్ష్యరాసురాలు మరొకరి బిడ్డని మోయటానికి సిద్దపడటం/అంటే తన సంచీనీ అద్దెకివ్వటం చూపారు. ఇక్కడ ఒక తరానికి ఊయల అయితే, అక్కడ ఒక ప్రాణానికి ఉట్టి/ఊత, తన భర్త ప్రాణానికి చేయూత. అది గుర్తుకు వచ్చింది.

    మరొక్కసారి అభినందనలు.

    ReplyDelete
  6. ప్రతి పదం లో వ్యక్తమైన ధారణ మీ వ్యతిరేకతకి అద్దం లా ఉంది. ప్రతి స్పందన కవిత గానే ఉబికింది బాబా గారు. దాన్ని ఆపటానికి 5-6 గంటలు పట్టింది. పక్వానికి వచ్చీ రాని గెల దింపగానే మొదలుకి నరికినట్లుగా, పురిటి సమయం/నెప్పి పడనీయకనే సిజేరియన్ చేసి, ఆ..అంటే హిస్టరెక్టొమీ చేసేస్తున్న స్థితిని చాలా బాగా రాసారు. వైద్యం పట్ల అవగాహన లేని వారొక ప్రక్కన, వృత్తి పట్ల నిబద్దత లేని వారు మరొక పక్కన.

    ఇక్కడ అప్రస్తుతమైనా : ఇక్కడ ఏది కవితా వస్తువో - దాదాపు ఒక పుష్కరం క్రితం వచ్చిన "9 నెలలు" సినిమాలో - అదే గర్భసంచి ప్రధానాంశం గా దర్శకుడు క్రాంతికుమార్, భర్త కి వైద్యానికి డబ్బు అవసరపడి, ఒక నిరక్ష్యరాసురాలు మరొకరి బిడ్డని మోయటానికి సిద్దపడటం/అంటే తన సంచీనీ అద్దెకివ్వటం చూపారు. ఇక్కడ ఒక తరానికి ఊయల అయితే, అక్కడ ఒక ప్రాణానికి ఉట్టి/ఊత, తన భర్త ప్రాణానికి చేయూత. అది గుర్తుకు వచ్చింది.

    మరొక్కసారి అభినందనలు.

    ReplyDelete
  7. ఆ ఆపరేషన్ భాదితురాలని నేను
    ఎందుకో,ఏదో ఇది అని వ్యక్తపరచలేని ఓకే విచిత్రా వేదనకలిగింది నాకు ఆ సమయం లో,
    అందరు అది ఏదోఒక మాములు విషయం లా అమ్మయ్య వో భాద తీరిపోతుంది ,అని అంటుంటే, నాకు
    దుఖం వచ్చింది. అక్కడికి అడిగాను డాక్టర్ గారిని,తప్పదా అంటే అవును అని అన్నారు
    బాబా గారు మీరు అన్నట్లు కారణాలు ఏవైనా అవని ఈ జన్మకింతే కదా అని
    భాధ వేసింది.
    మా వారు నా భావాలని,ఉద్వేగాని పంచుకొని నాకు మానసికంగా అండ గానిలిచారు.
    మన శరీరం నుంచి ఒక భాగాని కోసి తీసి వెయ్యడం అది యెంతో పరమపూజ్యమిన సృష్టి కారకం,కావడం నిజం
    గాభాదే

    అలాంటి మా భాద గురుంచిమీరు రాసిన
    కవితకి మీకు వేల వేల జోహార్లు

    ReplyDelete
  8. బాబా గారూ,
    ఇది చాలా చక్కని విషయం(Subject). సమకాలీన సమస్యలకు స్పందించక నేటి కవిత్వం పక్కదారి పడుతోంది అనిపిస్తుంది నాకు. నా దృష్టిలో అది "intellectualize" అవుతోంది... అంటే ఒక కవి మరో కవిని మెప్పించడాఅనికో, ప్రశంశలు పొందడానికో తప్ప తన నిజమైన అనుభూతిలోంచి కవిత రావడంలేదు. కవిత చదివిన తర్వాత తిలక్ చెప్పిన కవి అనుభూతి పాఠకుడికి కూడ అందాలి. అసలు దగ్గర లోపం ఉండడం వల్లనేమో, కొసరుదగ్గర కూడా అంతే.
    అభినందనలతో.

    ReplyDelete
  9. chala rojula tarvata o manchi kavita chadiva..baagundandee baba garoo

    ReplyDelete
  10. బాబా, చాలా బాగుంది. సూటిగా, అంతే పదునుగా...
    @మూర్తి గారు: ఈ కవిత మన అనువాద గ్రూపు కోసం చేస్తే బాగుంటుందేమో!!

    ReplyDelete
  11. cheppaDAniki maaTalu lEvugAnI meeru paDDa badha maatram "AksharAlA" ardamaindi.Excellent bAbA garU :-)

    ReplyDelete
  12. స్పందించిన అందరికీ ధన్యవాదములండీ

    అందరికీ వందనాలు

    భవదీయుడు
    బొల్లోజు బాబా

    ReplyDelete
  13. దీన్ని మళ్ళీ ఎక్కడన్నా ప్రచురిస్తే .. శీర్షిక "కడుపుకోత" అని పెడితే??

    ReplyDelete
  14. మంచి సరియైన టైటిలు.

    ReplyDelete
  15. మా ఇంట చేరిన విషాదాన్ని ప్రతిబింబించింది

    ReplyDelete
  16. చాలా చక్కగా ఉంది!

    నా అజ్ఞానానికి మన్నించాలి, తెలియక అడుగుతున్నా. ఈ కింద లైన్లలో రెండు కోతలు, మూడవ కోత దేనిని సూచిస్తున్నాయి? ఇద్దరు పిల్లల్ని కన్నాక గర్భసంచి తొలగించడాన్నా?

    కారణాలేమైనా కానీ
    రెండుకోతల్ని భరించి
    ఒక తరాన్ని సృష్టించిన
    మానవజాతి మొదటి ఊయల
    మూడో కోతతో
    మొదలు తెగి నేల కూలింది.

    ReplyDelete