నువ్వు కాదు నేనే
స్వప్నానికి నాకూ మధ్య
మంచులా పరచుకొంటున్నది
నా శ్వాసా లేక నీదా?
ఎన్నెన్ని అస్ఫష్ట దృశ్యాలు!
నేలకొరిగిన తూనీగపై పూల వాన
అద్భుత సమాధి
చుంబించుకొన్న పెదాలు అదృశ్యమైనా
ఇప్పటికీ పరిమళించే ప్రేమలా
కొలను అలలపై
ఏటవాలు కాంతిపుంజం
సన్నగా ఒణుకుతోంది
నీ జ్ఞాపకాలపై నా హృదయంలా
నీవు పంపించే వసంతాలకు
ఎడారి దూరంలో నేను
నీకై నా ఆత్మ కోయిల పాడే పాట
నాకే చేదు చేదుగా అనిపిస్తోంది
తనమార్గాన్ని తానే అల్లుకొంటూ
సాగిపోతోంది కాలం సాలీడల్లే
ఒంటరితనం శూన్యమేమీ కాదు కానీ
తీవ్రమైన అలసట మాత్రం
చీకటిలా మెరుగుతూంటుంది
జ్ఞాపకాలు నాని ఉబ్బి
వికృతంగా తయారయ్యాయి
గాలినిండా మృత్యువాసన
నా కవితల్లో నువ్వంటే నువ్వు కాదు నేనే
బొల్లోజు బాబా
No comments:
Post a Comment