Saturday, March 8, 2025

ఆర్యుల దండయాత్ర – శాస్త్రీయ అవగాహన

ఆర్యుల దండయాత్ర సిద్ధాంతాన్ని మొదటగా 1870 లలో జర్మన్ పండితుడు మాక్స్ ముల్లర్ ప్రతిపాదించాడు. ఇది BCE 1500 ప్రాంతంలో మధ్య ఆసియానుండి ఆర్యులు అనే యోధ జాతి భారత ఉపఖండానికి వలసవచ్చి ఈ ప్రాంతం పై ఆధిపత్యం పొందారని చెబుతుంది. ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం ప్రకారం ఈ వలస వచ్చిన ఆర్యులు తమతో పాటు వేదసంస్కృతి, సంస్కృతభాషను తెచ్చారని ఇవి భారత ఉపఖండంలోని స్థానిక సంస్కృతులపై ప్రభావం చూపాయని ముల్లర్ అభిప్రాయపడ్డాడు.

మాక్స్ ముల్లర్ వివిధ భాషలను తులనాత్మకంగా అధ్యయనం చేసిన వ్యక్తి. మధ్య ఆసియాప్రాంతపు అవెస్తా భాషకు, సంస్కృత భాషకు గల పోలికలను ఇతను గమనించాడు. వాటి ఆధారంగా సంస్కృతబాష మాట్లాడే ఆర్యులు, మధ్యఆసియానుండి వలస వచ్చి ఉండవచ్చు అని ఊహించాడు. వేదాలలోపలి ఆధారాలు భీకరమైన దండ యాత్రలను సూచించటాన్ని గుర్తించాడు. ఈ రెండు దృగ్విషయాలను కలిపి "ఆర్యుల దండయాత్ర" సిద్ధాంతంగా చెప్పాడు.
ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు ఇన్నేళ్లతరువాత కూడా మాక్స్ ముల్లర్ ని పండితులు తీవ్రంగా విమర్శిస్తారు, ఎందుకంటే ఆర్యులు స్వదేశీయులు అని, బయటనుంచి వలసవచ్చిన వారు కారని వీరి విశ్వాసం.

కానీ నేడు ఈ ఆర్యులు The Eurasian Steppe ప్రాంతాలనుంచి c 1900 BCE and 1500 BCE మధ్య భరతఖండానికి వలసవచ్చినట్లు జన్యు అధ్యయనాల ద్వారా నిరూపించబడింది.

I. మనుషుల వలసలను జన్యువులు ఎలా నిర్ధారిస్తాయి?

ఈ రోజు ఒక జన్యువు వివిధ జనాభాలలో, వివిధ కాలాలలో ఎలా ప్రయాణం చేసింది అనే విషయం చాలా సులువుగా మేప్పింగ్ చేయగలుగుతున్నారు.

గత 15-20 ఏళ్ళుగా జన్యుశాస్త్రంలో DNA Sequencing పద్దతి ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వగలుగుతుంది. దీని ఆధారంగా ఏదేని ఆర్కియలాజికల్ సైటులో దొరికిన ఒక ప్రాచీన మానవ అవశేష సాంపిల్ లోని DNAను (జన్యువులను) గుర్తించగలుగుతున్నారు. ఒక వ్యక్తిసాంపిల్ లోని జన్యు అవశేషాలలో సుమారు 6 లక్షల జెనిటిక్ మార్కర్స్ ఉంటాయి. అంటే ఆ వ్యక్తికి మాత్రమే ఉండే DNA లక్షణాలు. ఈ మార్కర్స్ సంఖ్య ఎంత ఎక్కువ ఉంటే పరీక్షలలో వివిధ సాంపిల్స్ మధ్య అంత ఖచ్చితత్వం ఉంటుంది. ఈ సాంపుల్స్ కి కార్బన్ డేటింగ్ చేయటం ద్వారా వాటి యొక్క ఖచ్చితమైన కాలాన్ని నిర్ణయించ గలుగుతున్నారు.

ఈ మొత్తం విషయాన్ని ఇలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ ప్రాంతంలో వివిధ శతాబ్దాల వ్యత్యాసంతో దొరికిన అనేక ప్రాచీన మానవ అవశేషాల సాంపిల్స్ ABCD అనే జన్యు మార్కర్లను ఏ మార్పు లేకుండా చూపుతున్నాయి. అదే కాలానికి భరత ఖండంనుంచి సేకరించిన ప్రాచీనమానవ అవశేషాలలో మొదట్లో EFGH జన్యు మార్కర్లు కనిపిస్తూ, ఒక్కసారిగా c 1900 BCE and 1500 BCE మధ్య నుంచి ఇరాన్ కు చెందిన AB జన్యువులు కనిపించటం మొదలైంది.

దీనిని బట్టి ఇరాన్ నుంచి ఆ జన్యువులు కలిగిన మనుషులు భరతఖండంలోకి c 1900 BCE and 1500 BCE మధ్య వచ్చినట్లు నిర్ధారించవచ్చు. (అలాకాక EFGH మార్కర్స్ ఇరాన్ లో కనిపించినట్లయితే భారతదేశం నుండి ఇరాన్ కు వలసలు జరిగాయని భావించవచ్చు. కానీ అలా జరగలేదు).

ఆ విధంగా జన్యు శాస్త్ర అధ్యయనాలు ఆర్యుల వలసను శాస్త్రీయంగా దృవీకరించాయి. జన్యువుల కదలికల ఆధారంగా వలసలు జరిగాయి అని ఎలా నిర్థారిస్తారనేదానికి ఇది ఒక ఊహా నమూనా. (చూడుడు. ఊహాచిత్రం).

నిజానికి ఈ మార్కర్లు ఉదాహరణలో చెప్పినట్లు అనేవి నాలుగైదు కాదు. ముందుగా చెప్పినట్లుగా ఆరులక్షల మార్కర్ల ఆధారంగా చేసిన నిర్థారణలు ఇవి.
మధ్య ఆసియా నుండి కొన్ని జన్యువులు భరతఖండంవైపు కాలానుగుణంగా కదులుతూ వచ్చాయని కొన్ని పదుల సైంటిఫిక్ పేపర్లు నిర్ధారించాయి.

II. ఆర్యుల వలస వచ్చారని నిర్ధారించిన కొన్ని అధ్యయనాలు.

భారతఉపఖండంలోకి ప్రధానంగా మూడు విడతలుగా జరిగిన వలసల వలన అది జనావాసంగా మారింది. 65 వేలఏండ్లక్రితం “Out of Africa” వలస ద్వారా ఆఫ్రికానుంచి ప్రపంచంలోని పలు చోట్లకు ఆఫ్రికా ప్రజలు విస్తరించారు. ఇది మొదటి వలస.
 
అలా భారతదేశంలోకి వచ్చిన “మొదటి భారతీయుల జన్యువులు” నేటి భారతదేశ జనాభాలో 50-65% వరకూ ఉన్నాయి. రెండవ వలస 9000-5000 వేల ఏండ్ల క్రితం మధ్య ఇరాన్ పీఠభూమినుంచి వచ్చిన Iranian Agriculturalists. వీరు భరతఖండలోకి వ్యవసాయాన్ని తీసుకొనివచ్చారు. వీరి వల్ల బార్లి, గోధుమ వ్యవసాయం భారతదేశంలో విస్తరించింది. సింధులోయ నాగరికత అభివృద్ధిచెందింది.

ఆర్యుల వలస సిద్ధాంతాన్నిబలపరుస్తూ వచ్చిన పరిశోధనా పత్రాలలో ముఖ్యమైనవి ఇవి.


1. "The formation of human populations in South and Central Asia", Authors: Vagheesh M. Narasimhan, Nick J. Patterson, Priya Moorjani, Iosif Lazaridis, ఇంకా భారతదేశంతో సహా 18 దేశాలనుంచి 114 మంది జన్యు శాస్త్రవేత్తలు. ఇది Science, September 2019 లో ప్రచురితమైంది.

ఈ అధ్యయనం ఆర్యుల వలస సిద్ధాంతాన్ని సమర్ధించింది. 8000 వేల సంవత్సరాలలో, 19 వివిధ భౌగోళిక ప్రాంతాలలో, 269 భిన్న కాలాలకు సంబంధించిన (points of times) మొత్తం 524 మంది పురాతన మానవుల జన్యు సాంపిల్స్ లోతుగా పరిశోధించి రాసిన పేపరు ఇది.

ఈ పేపరు ఈ క్రింది విషయాలను నిష్కర్ష చేసింది.

A. మూడవ విడత వలస వలన భారతదేశ సాంస్కృతిక సామాజిక రాజకీయ రంగాలలో పెనుమార్పులు వచ్చాయి. భారతీయ ఉపఖంఢంలోకి మూడవ విడత వలస ద్వారా c 1900 BCE and 1500 BCE మధ్యలో Pontic-Caspian steppe (ఉక్రయిన్, రష్య, కజకిస్తాన్) ప్రాంతాలనుంచి Yamnaya Steppe pastoralist లు భారతదేశంలోకి ప్రవేశించారు . వీరు పశుపాలకులు. వీరు తమతో సంస్కృత భాషను, వైదిక సంస్కృతిని తీసుకొని వచ్చారు. వీళ్ళే ఆర్యులు. (ఇకపై Steppe pastoralist కు ఈ పదమే ఉంటుంది స్పష్టత కొరకు)

B. ఈ ఆర్యులను- Y-DNA మార్కర్స్ అయిన R1a-M417, R1b-M269 ద్వారాను; Autosomal DNA మార్కర్స్ అయిన Steppe_EMBA (Early Middle Bronze Age) component, steppe_MLBA (Middle to Late Bronze Age) component ల ద్వారాను గుర్తించారు.

C. ఈ ఆర్యులు వచ్చిన కాలంలోనే భరతఖండంలో కాస్త అటూ ఇటూగా సింధులోయనాగరికత అంతర్ధానం, సంస్కృతభాష (Proto-Indo-Aryan language), వైదిక సంస్కృతి మొదలవటం లాంటి అనేక సాంస్కృతిక పరిణామాలు సంభవించాయి. వీటన్నిటికీ ఈ ఆర్యులరాకకు సంబంధం ఉంది.

2. “An Ancient Harappan Genome Lacks Ancestry from Steppe Pastoralists or Iranian Farmers”. Authors: Vasant Shinde, Vagheesh M. Narasimhan, Nadin Rohland నాలుగుదేశాలకు చెందిన మొత్తం 26 మంది. ఈ పరిశోధనా పత్రం Cell జర్నల్ అక్టోబర్ 2019 సంచికలో ప్రచురింపబడింది.

ఈ అధ్యయనం హరప్పా (సింధులోయనాగరికత) లోని రాఖిగరి ప్రదేశానికి చెందిన ప్రాచీనవ్యక్తి అవశేషాలలోని DNA ను విశ్లేషణ చేసి ఈ క్రింది పరిశీలనలు తెలియచేసింది.

A. సింధులోయ నాగరికత ప్రజలలో ఆర్యుల జన్యువులు లేవు. అప్పటికే గొప్ప నగరనిర్మాణ కౌశలాన్ని కలిగి ఉన్న సింధులోయ నాగరికత ఈ ఆర్యులు వచ్చే c2000 BCE కాలానికి క్షీణదశలో ఉంది. సింధులోయ ప్రజలలో పైన చెప్పిన ఆర్యుల జన్యువులు లేకపోవటాన్ని బట్టి సింధులోయ ప్రజలు ఆర్యులు రాకముందునించే ఇక్కడ అభివృద్ధిచెందిన నాగరికతతో జీవిస్తున్నట్లు అర్థం చేసుకోవాలి.

B. స్టెప్పీ ప్రాంతాలనుండి ఆర్యులద్వారా భరతఖండంలోకి వేదసంస్కృతి, సంస్కృత భాష c2000 BCE ప్రాంతంలో వచ్చింది.

C. ఈ అధ్యయనం ఆర్యులు సింధులోయనాగరికత అనంతరం భారతఖండంలోకి ప్రవేశించినట్లు నిరూపించింది.

3. "Massive Migration from the Steppe was a Source for Indo-European Languages in Europe" (2015), Authors: Wolfgang Haak, Iosif Lazaridis, Nick Patterson, et al. Journal: Nature, March 2025.

ఈ అధ్యయనం ద్వారా స్టెప్పీ ప్రాంతాలనుండి Y-chromosome haplogroups R1a and R1b జన్యువులు కలిగిన ఆర్యులు పెద్ద సంఖ్యలో యూరప్, దక్షిణ ఆసియావైపు (ఇండియా వైపు) వలసలు వెళ్ళారని జన్యువుల కదలికల ఆధారంగా నిర్ధారించింది. ఈ పాయింటు ఆర్యుల వలసను సమర్ధిస్తుంది.

4. "Population genomics of Bronze Age Eurasia" by Allentoft et al. (2015)

Bronze Age (3000-1000 BCE) లో యూరప్, మధ్య ఆసియాలో పెద్ద ఎత్తున్న వలసలు జరిగాయని, ఈ వలసల వల్ల జన్యువుల తొలగింపు మరియు జన్యువుల సమ్మేళనం జరిగినట్లు నిర్ధారించింది. (genetic replacement and admixture). ఈ జన్యు అధ్యయనంద్వారా ఆర్యులు-అనార్యుల మధ్య కూడా జన్యువుల తొలగింపు, సమ్మేళనం జరిగి ఉంటుందని భావించవచ్చు.

5. "Early 'Aryans' and their Neighbors outside and inside India" Author: Michael Witzel, Published in: Journal of Biosciences, October 2019

Michael Witzel ప్రఖ్యాతిగాంచిన ప్రాచీన జన్యువుల పరిశోధకుడు. ఈ పత్రం పురాతత్వశాస్త్రం, భాషాశాస్త్రం, పాపులేషన్ జెనిటిక్స్, వేదాలనుంచి ఉటంకింపులు లాంటి వివిధ రంగాలనుంచి ఆధారాలను ఈ క్రిందివిధంగా క్రోడీకరించి ఆర్యుల వలస జరిగిందని నిరూపిస్తుంది.

A. ఆర్యులు మధ్య ఆసియానుంచి క్రమక్రమంగా భరతఖండంలోకి వలస వచ్చి ఇక్కడి ప్రజలతో కలిసిపోయారు. స్వాత్ లోయలో (పాకిస్తాన్) 1250 BCE నాటి పురాతన జన్యు సాంపిల్స్ లో భరతఖండానికి సంబంధించి మొదటి ఆర్యుల ఆనవాళ్లు కనిపించాయి.

B. హరప్పాలో సంస్కృత భాష కానీ వైదిక సంస్కృతికి చెందిన ఆధారాలు లభించలేదు. వైదిక సంస్కృతిలో హరప్పానాగరికతలో ఉన్నట్లు పట్టణాలు, అంతర్జాతీయ వాణిజ్యాలకు సంబంధించిన వర్ణనలు లేవు. ఈ పరిశీలనలు హరప్పానాగరికత, వైదిక సంస్కృతి వేరు వేరు అని నిరూపిస్తాయి.

C. ఆర్యసంస్కృతిలో గుర్రాలు కీలకం.. అందుకనే భరతఖండంలో గుర్రాలు, రథాలు 1800 BCE తర్వాత మాత్రమే కనిపిస్తాయి. ఇది ఆర్యులరాకతో సరిపోతుంది. గుర్రాలు స్థానిక జాతులు కావు. వీటిని ఆర్యులు తమతో పాటు తీసుకొని వచ్చారు

D. ఘగ్గర్-హక్రానది (దీనినే తదుపరి వచ్చిన సంస్కృతంలో సరస్వతి నది అని భావిస్తారు) వ్యవసాయ ఆధారిత హరప్పానాగరికత ఉచ్ఛదశలో కూడా నిరంతరం ప్రవహించే జీవనది కాదు. మరి హరప్పా ప్రజలు వ్యవసాయం ఎలా చేసారు అనేదానికి- పంజాబు ప్రాంతంలో అనేక నదీమడుగులు (oxbow lakes), ఇంకా హరప్పా ముద్రలలో కనిపించే నీటివాహకులు (కుండలలో నీరు మోసుకెళ్ళే నీటివాహకులు) సమాధానంగా కనిపిస్తాయి. 2000 BCE లో మిడిల్ ఈస్ట్, ఓమన్, ఇరాన్ ప్రాంతాలలో వచ్చిన వాతావరణ మార్పుల ప్రభావంచే హరప్పా ప్రజలు వలసబాట పట్టారు. అలా హరప్పానాగరికత క్షీణించింది.
 

III. ఆర్యుల వలస – భారతసమాజంపై వేసిన ముద్ర

1. ఆర్యులు వర్ణవ్యవస్థను ఏర్పరచారు. సమాజాన్ని బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అంటూ నాలుగు శ్రేణులుగా విభజించారు. వీరిలో బ్రాహ్మణులు ఉన్నతులుగాను, మిగిలిన మూడు వర్ణాలు వారికి సేవచేయాలని ధర్మశాస్త్రాల ద్వారా నిర్ణయించారు. ధర్మశాస్త్రాలనేవి ఒకనాటి రాజ్యాంగం. ఇక వీరికి వెలుపల అతిశూద్రులు ఉండేవారు అతిశూద్రులు వూరివెలుపల నివసించే అంటరానివారు. ధర్మ శాస్త్రాలప్రకారం వీరసలు మనుషులే కారు.

2. ఆర్యులు తమతో పాటు సంస్కృత భాషను తెచ్చుకొన్నారు. ఇది అప్పటికే ప్రజలలో ఉన్న పాలి, పైశాచి, మగధి, మహారాష్ట్రి, కామరూపి, అపభ్రంశ, శౌరసేని, గాంధారి లాంటి అనేకరూపాలలో ఉన్న ప్రాకృతభాషను క్రమేపీ తొలగించి రాజభాషగా స్థిరపడింది. క్రమేపీ స్థానికంగా ఉండిన ప్రాకృతభాషలు అంతరించిపోయాయి. (నా బ్లాగు చూడుడు: ప్రాకృత, సంస్కృత భాషల మధ్య జరిగిన మత రాజకీయాలు)

3. యజ్ఞాలు, క్రతువులు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు వంటి దేవతల ఆరాధన, బ్రాహ్మణాధిపత్యం, షోడశ సంస్కారాలు, కర్మ, పునర్జన్మ, మోక్షం, వేదాలనుప్రమాణంగా అంగీకరించటం లాంటి భావనలతో రూపుదిద్దుకొన్న ఆర్యుల బ్రాహ్మణ(వైదిక) మతం క్రమేపీ హిందూమతంగా స్థిరపడింది.
4. సింధునాగరికత పతనానికి ఆర్యులు నేరుగా కారణం కాదని భావిస్తారు. జన్యు విశ్లేషణలు వలసలను నిర్ధారించగలవు కానీ అలా వలస వచ్చిన ఆర్యులు స్థానికులపై దాడులు చేసారా లేదా అనేది చెప్పవు. దాడులు జన్యువులలో కనిపించవు, వాఞ్మయంలో కనిపిస్తాయి. ఇదొక సమాంతర ఆధారం.

వేదాలు ఆర్యుల రచన. ముఖ్యంగా ఋగ్వేదం. ఆర్యులు రాసుకొన్న ఈ వేదసాహిత్యంలో శత్రువుల పురాలను/మూలవాసుల నగరాలను నాశనం చేయమని ఇంద్రుని ప్రార్థించే సూక్తాలు అనేకం ఉన్నాయి. ఇంద్రునికి పురందరుడు (నగరాలను ధ్వంసం చేసేవాడు) అని పేరు.
ఈదేశ మూలవాసులైన అనార్య స్థానిక తెగలకు చెందిన వ్యక్తులను, అసురులు, దస్యులు అని వేదాలలో పిలిచారు ఆర్యులు.

ఇంద్రుడు 30 వేలమంది దాసుల్ని., వృత్రాసురుడిని చంపినట్లు ఋగ్వేదంలో ఉంది. (4.30.210). మధ్య ఆసియానుంచి వలస వచ్చిన ఆర్యులు స్థానిక హరప్పా నగరాలను, ప్రజలను ధ్వంసంచేయటంగా ఈ ఉదంతాలను అర్ధం చేసుకోవాలి.

శత్రువుల గర్భంలోని పిండాలను కూడా నాశనం చెయ్యాలని దేవతలను కోరుతూ ఆర్యులు రాసిన సూక్తాలు వేదాలలో ఉన్నాయి. అనార్య రాజైన శంబరాసురుడు తమ సంస్కృతిని కాపాడుకోవటం కొరకు ఇంద్రునితో పోరాడినట్లు వేదాలలో ఉంది. ఆవిధంగా ఆర్యులు స్థానిక అనార్యులపై సాగించిన దండయాత్రలు వేదాలలో విపులంగా వర్ణించబడ్డాయి. ఆర్యులు స్థానికులపై దండయాత్ర జరిపినట్లు చెప్పటానికి వేదాలే గొప్ప సాక్ష్యం. ఆ విధంగా మాక్స్ ముల్లర్ చెప్పిన ఆర్యుల దాడి సిద్ధాంతం నిరూపితమైనట్లే.

5. ఆర్యులు వారి స్త్రీలతో కాకుండా పురుషులు ఒక్కరే భరతఖండానికి వచ్చి స్థానిక అనార్య స్త్రీలను పెళ్ళాడారు. ఈ సందర్భంగా స్థానిక పురుషులను ఓడించి లేదా నిర్మూలించటం ద్వారా వారి స్త్రీలను గ్రహించటం జరిగి ఉండాలి. స్త్రీలకొరకు ఆర్య పురుషులు, స్థానిక పురుషుల మధ్య ఘర్షణలు జరిగాయనటానికి ఇది ఒక సంకేతం. ఆర్యసమాజం క్రమేపీ పితృస్వామ్య సమాజంగా రూపుదిద్దుకొంది స్త్రీలకు హక్కులు తగ్గాయి. బాల్యవివాహాలు, విద్యాపరమైన పరిమితులు, సతీసహగమనాలు వంటి ఆంక్షలు పెరిగాయి.

6. ఆర్యుల బ్రాహ్మణ మతం భారతీయ సమాజంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. దానిలోని వేదాలను, యజ్ఞయాగాదులను, జంతుబలులను, బ్రాహ్మణాధిక్యతను, కర్మసిద్ధాంతాన్ని, స్వర్గనరకాలు వంటి అభౌతిక అంశాలను తిరస్కరిస్తూ చార్వాక, ఆజీవిక, బౌద్ధ మతాలు వచ్చాయి. వీటిని కాలక్రమేణా తొలగించి బ్రాహ్మణమతం 600-1000 AD నాటికి పూర్తి స్థాయి హిందూమతం రూపుదిద్దుకొంది.

7. ఆర్యులు ప్రవేశపెట్టిన జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల వర్ణవ్యవస్థ (కులవ్యవస్థ), బ్రాహ్మణాధిక్యత, మంత్రాలు, క్రతువులు, స్వర్గనరకాలు, పాపం పుణ్యం లాంటి అభౌతిక భావనలు నేటికీ సమాజంలో తమప్రభావాన్ని చూపుతూనే ఉన్నాయి.

8. మరొక ఆశ్చర్యం కలిగించే అంశం- ఆర్యులలో ఉండే R1 haplogroup జన్యువు ఆధునిక భారతసమాజంలో బెంగాలు బ్రాహ్మణులలో అత్యధికంగా 72.22 శాతం, ఇతర రాష్ట్రాల బ్రాహ్మణులలో 70-30% మధ్యలో కనిపించింది. 
( రి: Y-DNA_haplogroups_in_populations_of_South_Asia)

ఇక భారతదేశ క్రిందితరగతి ప్రజలలో (Lower Castes/దళిత,బహుజనులు) ఈ ఆర్య జన్యువు 15.7 శాతం మందిలో కనిపించింది. అదే విధంగా భారతీయ గిరిజనులలో ఈ జన్యువు 7.9% మందిలో మాత్రమే గుర్తించారు.

ఈ గమనింపు ద్వారా నేటి బ్రాహ్మణులు మధ్య ఆసియా నుంచి వచ్చిన విదేశీ ఆర్యులని, దళిత బహుజన గిరిజన ప్రజలు భరతఖండంలో సింధునాగరికతా కాలంనుండి జీవిస్తున్న స్థానికులని భావించవచ్చు.

IV. ఆర్యుల వలస సిద్ధాంతంతో సమస్య ఏంటి?

1. ఆర్యుల దాడి సిద్ధాంతాన్ని బ్రాహ్మణులు అంగీకరించరు. మాక్స్ ముల్లర్ కలోనియల్ ఏజంటని, అతనికి సంస్కృతం రాదని, డబ్బులు తీసుకొని అనువాదాలు చేసాడని అంటూ అతనిపై తీవ్రమైన విష ప్రచారం చేసి ఆర్యులు వలస అనేమాట నూటయాభై ఏండ్లపాటు ప్రజలకు వినబడకుండా ఎవరూ చర్చించకుండా చేసారు. నేటికీ బ్రాహ్మణులు అనాదిగా వారు ఈ నేలకు స్థానికులని చెప్పుకొంటారు. తమ విదేశీమూలాలను అంగీకరించరు. ఈ రోజు జన్యుపరీక్షలమూలంగా ఆర్యబ్రాహ్మణులు ఈ దేశానికి మధ్య ఆసియా ప్రాంతంనుండి వలస వచ్చారని నిర్ధ్వంద్వంగా నిరూపించబడింది.

2. c 1900 BCE and 1500 BCE మధ్య ఆర్యబ్రాహ్మణులు, సంస్కృతం భారతదేశంలోకి వలస వచ్చినట్లు అంగీకరించాల్సిన పరిస్థితులలో హిందూ పురాణ ఇతిహాసాలలో చెప్పిన కాలక్రమణికను (Time line) ఆమేరకు సవరించుకోవాలి. అంటే భారతం 5 వేల ఏండ్లక్రితానిది, రామాయణం 10 వేల సంవత్సరాల క్రితం జరిగిందని అంటూ చెప్పే కథనాలు మార్చుకోవాలి.
3. అనాదిగా ఈ దేశంలో పాటింపబడుతున్న హిందూధర్మమే సనాతన ధర్మం అని చెబుతున్న నిర్వచనం కూడా మారిపోతుంది. ఎందుకంటే ఈ దేశంలో హిందూధర్మం కంటే ముందు సింధునాగరికత వర్ధిల్లింది. అదే నిజమైన సనాతన ధర్మం అవుతుంది. హరప్పా ముద్రలలో కనిపించే నాగారాధన, యోగ ముద్రలు, అమ్మదేవతల ఆరాధన లాంటివి నిజమైన సనాతనధర్మం అని అంగీకరించాల్సి ఉంటుంది. ఆ సంస్కృతి పండితులది కాదు. ఈనాటికీ హరప్పా సంస్కృతిని గ్రామదేవతల రూపంలో బతికించుకొన్న బహుజనులది

4. ఆర్యుల వలస సిద్ధాంతాన్ని అంగీకరించినపుడు, చరిత్రలో ఈ ఆర్యపండితులు జన్మాధారిత వర్ణ/కుల వ్యవస్థను కల్పించి దానితో ఇంతకాలం ఈ సమాజాన్ని వర్ణాలుగా విభజించి తమను ఉన్నత స్థానంలో పెట్టుకొని సాగించిన దుర్మార్గపు ఆధిపత్యపు గుట్టు రట్టవుతుంది.
5. ఆర్యులు విదేశీయులైతే వారి జన్యువులు కలిగిన ఈ పండితులు కూడా టర్కీనుంచి వలసవచ్చిన తురకలతో సమానమౌతారు.

భరతఖండం అంటే మేమే అని ఇన్నాళ్ళూ చెప్పుకొన్న వారికి ఇది చాలా అవమానకరమైన స్థితి. కనుక ఆరు నూరైనా నూరు ఆరైనా ఆర్యులవలస సిద్ధాంతం తప్పు అని నిరూపించటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా హరప్పాలిపిలో సంస్కృత ఛాయలు ఉన్నాయని, హరప్పా సంస్కృతి వేద సంస్కృతే అని ప్రచారం ఎత్తుకొన్నారు.

Out of India Theory పేరుతో ఓ అబద్దపు సిద్ధాంతాన్ని తెరమీదకు తెచ్చి -- ఆర్యులు భరతఖండంలో పుట్టినవారే, ఇక్కడనుంచి మధ్య ఆసియాకు వలస వెళ్ళి మరలా తిరిగి BCE 1500లో భరతఖండంలోకి వెనక్కు వలస వచ్చారని గొప్ప అతి తెలివి వాదన ఒకటి మొదలుపెట్టారు. దీనికి జన్యువుల వలసలను నిర్ధారించే ఆధారాలను చూపలేకపోయారు.

హిందూ పండిత చరిత్రకారులు చెబుతున్న సిద్ధాంతాలను ప్రపంచవ్యాపిత ఇండాలజిస్టులు నమ్మటంలేదు. అదొక సంకట స్థితిగా మారింది సనాతనహిందూ చరిత్రకారులకు. మాక్స్ ముల్లర్ ని బుకాయించినట్లు బుకాయించటం ఇప్పుడు సాగటం లేదు. ఈ నిర్ధారణలు అన్నీ ఖచ్చితత్వంతో చెప్పే జన్యుశాస్త్రం పరిధిలోకి వెళ్ళిపోయాయి.


V. ముగింపు

భారతదేశానికి ఆర్యుల రాక అత్యంత ప్రభావశీలమైన సంఘటన. భారతీయ మత, సామాజిక, భాష, రాజకీయ వ్యవస్థలపై బలమైన ముద్ర వేసింది.. ఆర్యుల రాక అనార్యప్రజల జీవితాల్ని పూర్తిగా మార్చివేసింది. సమాజంలో జన్మ ఆధారిత హెచ్చుతగ్గుల కులవ్యవస్థ ప్రభావం మామూలిది కాదు. ఈనాటికీ భారతసమాజానికి దానినుండి విముక్తి లేదు. అనార్యుల భాషలు (?), మతాలు ఆచారాలు క్రమంగా నశించాయి లేదా ఆర్యబ్రాహ్మణ సంస్కృతిలో కలిసిపోయాయి.

కొన్ని ఆచారాలు పండితులచే పామర విషయాలు అంటూ తృణీకరణకు గురయి- అమ్మదేవతలు, నాగారాధన లాంటి ఆచారాలుగా అక్కడక్కడా మనుగడ సాగిస్తూ ఉండవచ్చు.

ఆర్యుల వలసకు ఉన్నట్లు ఆర్యుల దండయాత్రకు శాస్త్రీయమైన ఆధారాలు లేవు కానీ ఆర్యులు స్థానికులపై దండయాత్ర చేసినట్లు వేదాలలో కొన్ని ఆధారాలు కనిపిస్తాయి.

ఆర్యసంస్కృతి స్త్రీల స్థితిని కిందకు జార్చింది. సంప్రదాయాలపేరిట పురుషుని కన్నా తక్కువ సమానురాలను చేసింది.

ఆర్యబ్రాహ్మణ సంస్కృతిని తిరస్కరించిన చార్వాక, ఆజీవిక, బౌద్ధ జైన సంస్కృతులు ఒకనాటి సామాజిక తిరుగుబాట్లు. వాటి ప్రభావం దాదాపు వెయ్యేళ్ళు ఈ సమాజంపై ఉండింది. 600-1000 CE మధ్య శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు ఆ పిదప మధ్వాచార్యులు వంటి పండితుల కృషివల్ల బౌద్ధజైనాలు కాలగర్భంలో కలిసిపోయాయి. వైదికమతం హిందూమతంగా స్థిరపడింది మరీ ముఖ్యంగా బలమైన వైష్ణవమతంగా.

సంస్కృతం నేర్చుకోకూడదు, ఆలయప్రవేశం లేదు, ఉపనయనం కూడదు, వేదాలు వినరాదు అంటూ హిందూమతం దళిత, బహుజనులకు వివిధ ఆంక్షలు పెట్టి ఉక్కిరిబిక్కిరిచేసిన నేపథ్యంలో మధ్య యుగాలలో అనేక భక్తి ఉద్యమాలు వచ్చాయి. ఇవి వేదాలను, సంస్కృతాన్ని తిరస్కరించాయి. అందరూ సమానము, ఆరాధనే ముఖ్యం అని ప్రవచించాయి. ముస్లిం పాలనలో సూఫీఉద్యమాలు కూడా భక్తి, ప్రేమలతో భగవంతుడిని చేరవచ్చునని బోధించాయి. సూఫీలను హిందువులు కూడా అనుసరించారు.

ఇవన్నీ భారతదేశ చరిత్రలో బయటనుంచి వచ్చిన ఆర్యసంస్కృతికి స్థానిక అనార్య సంస్కృతికీ అనాదిగా జరిగిన ఘర్షణలు. నేటికీ మహాత్మా ఫూలే, డా. అంబేద్కర్, పెరియార్ భావజాలాల రూపంలో ఈ ఘర్షణ కొనసాగుతూనే ఉంది.

ఆఫ్టర్ ఆల్ ఆథ్యాత్మిక అనేది ప్రతిమనిషికి మానసికావసరం.


బొల్లోజు బాబా







No comments:

Post a Comment