మధ్యయుగాలలో సమాజం ధర్మశాస్త్రాలకు అనుగుణంగా నడిచేది. శాస్త్రాలు స్త్రీకి సమానస్థానం ఇవ్వలేదు. నేడు కొందరు ఏవో కొన్ని అనుకూలంగా ఉన్న శ్లోకాలు ఉటంకించి స్త్రీ గొప్పగా మనుగడ సాగించింది అని నమ్మించటానికి ప్రయత్నిస్తారు కానీ చారిత్రికంగా స్త్రీ "జీవించే హక్కు" కూడా కలిగి ఉండేది కాదని నిన్నమొన్నటి వరకూ సాగిన సతీసహగమనం లాంటి దురాచారం ద్వారా తెలుస్తుంది.
మరణించిన భర్త శవంతో పాటు అతని భార్యను అదే చితిపై దహనం చేయటాన్ని సహమరణం లేదా సహగమనం అని, భర్తమరణించిన కొన్నాళ్ళకు భర్త వాడిన వస్తువులతో పాటు అతని భార్యను కూడా దహనం చేయటాన్ని అనుమరణం అని అంటారు. బ్రాహ్మణ స్త్రీలకు సహమరణమే అర్హమని, అనుమరణం కాదని శాస్త్రాలు చెప్పాయి.
I. కొద్దిగా చరిత్ర
ముస్లిముల రాకతో హిందూ స్త్రీలను కాపాడుకోవటం కోసం సతిదహన ఆచారం వచ్చిందని కొందరు వాదిస్తారు కానీ సతి దురాచారం ముస్లిముల రాకకు కొన్ని వందల సంవత్సరాల ముందునించీ పాటింపబడుతూ ఉంది. మరణించిన భర్తతో పాటు భార్యను కూడా దహనం చేయటం గుప్తులకాలానికే కనిపిస్తుంది. ఇది మొదటగా క్షత్రియులలో మొదలై క్రమేపీ బ్రాహ్మణులకు పిదప సాంస్క్రిటైజేషన్ ప్రక్రియలో భాగంగా ఇతరకులాలకు కూడా విస్తరించింది. 1000 CE నాటికి ఇది సమాజంలో ఒక ఆచారంగా స్థిరపడిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.
అథర్వణ వేదం లోని 18.3.1 శ్లోకానికి భర్తమృతదేహం సరసన పడుకొన్న స్త్రీకి ఆమె భర్తతో పాటు సద్గతులు ప్రాప్తిస్తాయి అనే అర్ధం చెబుతారు కానీ ఇతర శ్లోకాలతో పోల్చినపుడు ఆ అర్ధం అక్కడ పొసగదు. ఇలాంటి వ్యాఖ్యానాలను సతిదహనానికి వేదాల అంగీకారం ఉంది అనేవారు చేసిన కిట్టింపుగా Anand A Yang లాంటివారు అభిప్రాయపడ్డారు. ఇక పురాణేతిహాసాలలో సహమరణం గురించి అనేక ప్రస్తావనలు కనిపిస్తాయి.
*. భర్తతో పాటు సహగమనం చేసిన స్త్రీలు స్వర్గానికి చేరుకొంటారు. -- అగ్నిపురాణం, 222:19-23.
*. సహగమనం చేసిన స్త్రీ, భర్త శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయోఅన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటుంది. -- గరుడ పురాణం,1.107:29.
*. సతి సహగమనం చేసిన స్త్రీ, తన భర్త బ్రహ్మహత్యాపాతకుడు, కృతఘ్నుడు, పరమ పాపి అయినప్పటికీ అతనిని మోక్షానికి తీసుకువెళుతుంది. స్త్రీలకు ఇదే గొప్ప విమోచనం. -- కూర్మ పురాణం, 2.34:108b-109.
*. శ్రీ కృష్ణుని అష్ట భార్యలు సహగమనం ఆచరించినట్లు విష్ణుపురాణం 5:38 చెబుతుంది.
*. భర్తతో పాటు మరణించటం స్త్రీ ధర్మం. ఇది వేదాలలో చెప్పబడింది. పాములు పట్టేవాడు పుట్టలోంచి పాముని బయటకు రప్పించినట్లు సహగమించిన ఆ స్త్రీ మరణించిన భర్తను యమదూతలనుండి విడిపించి స్వర్గానికి తీసుకువెళుతుంది.-- బ్రహ్మ పురాణం 10.75.
*.వైష్ణవ ధర్మశాస్త్రం (విష్ణు స్మృతి-c700-1000 CE) మొదటగా సహగమనం గురించి ప్రస్తావించింది. భర్తకోల్పోయిన స్త్రీలకు సహగమనం ఐచ్ఛికమని చెప్పింది. (25.14)
*. భర్త మరణించిన స్త్రీ బ్రహ్మచర్యం ఆచరిస్తే ఆమె మరణానంతరం స్వర్గాన్ని చేరుకొంటుంది. అలా కాక భర్తతో పాటు సహగమిస్తే మనిషిదేహంపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటుంది. -- పరాశర స్మృతి 4.29-31
*. మహాభారతంలో సూరుని నలుగురు భార్యలు సతీ సహగమనం చేసి స్వర్గంలో భర్తను చేరుకొన్న కథ ఉంది. మహాభారతం, 16.7.24-26
*. మహాభారతంలో మాద్రి సహగమనం ప్రస్తావన ఉంటుంది.
****
510 CE లో మధ్య ప్రదేష్ లోని ఎరాన్ అనే ప్రాంతంలో గోపరాజ అనే పేరుగల సైన్యాధిపతి జ్ఞాపకార్ధం వేయించిన శాసనం అత్యంత ప్రాచీన మైన సతిశిల (sati stone) గా గుర్తించారు. దీనిలో “ఇతను (గోపరాజ) దేవతలలో శ్రేష్ఠుడైన ఇంద్రునితో సమానంగా స్వర్గానికి చేరాడు. భక్తికలిగిన, అందమైన ఇతని భార్య చిత్తశుద్ధితో చితిపై అగ్నిలో ఇతనితో సహగమనం చేసింది” అని ఉంది. అలాంటి సతిశిలలు దేశవ్యాప్తంగా పద్దెనిమిదో శతాబ్దం వరకూ వేయబడుతూనే ఉన్నాయి.
ఇలాంటి శిలలలో సాధారణంగా గాజులు ధరించిన కుడిచేయి ప్రముఖంగా కనిపిస్తుంది. ఇది సుమంగళత్వానికి సంకేతం.
Al Biruni (973-1048 CE), Ibn Battuta (1304 CE) లాంటి విదేశీ యాత్రికులు సతిదహనాల గురించి తమ రాతలలో వర్ణించారు.
కాకతీయుల పాలనలో జరిగిన సతి ఉదంతాన్ని 1210 CE నిడుబ్రోలు శాసనం చెబుతుంది. విజయనగర సామ్రాజ్యంలో సాగిన సతిదహనాలను Nuniz, Barradas వంటి పోర్చుగీస్ చరిత్రకారులు తమరచనలలో ప్రస్తావించారు.
1760 లో ఆనందగజపతి రాజుతో జరిగిన యుద్ధంలో పెద్దాపురం జగపతిరాజు మరణించాడు. అతని భార్య సతీసహగమనం చేసినట్లు మెకంజీ కైఫియ్యతుల ద్వారా తెలుస్తుంది .
II. ముస్లిమ్ పాలనలో సతిదహనం
.
మహమ్మద్ బిన్ తుగ్లక్ (1325–1351) సతి ఆచారాన్ని నిలువరించటానికి చేసిన ప్రయత్నంలో, సతిదహనం చేయాలనుకొన్నవారు తప్పని సరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని చట్టం చేసాడు.
అక్బర్ (1556–1605) ఆస్థాన చరిత్రకారుడు అబుల్ ఫజల్ రచించిన అక్బర్ నామ లో సతి గురించి “భర్త చనిపోయిన స్త్రీకి ఇష్టమున్న ఇష్టం లేకపోయిన చితిపై దహనం చేయటం హిందువుల ఆచారం" అని చెప్పబడింది. అక్బర్ ఈ సతి దురాచారాన్ని నిషేదించాడు. ఈ నిషేదాన్ని అమలుపరచటానికి అధికారులను నియమించాడు.
ఇతని తరువాత జహంగిర్ కూడా సతి దహనం, ఆడశిశువుల హననం లాంటి దుశ్చర్యలను నిషేదించాడు. కానీ ఇవి ఉత్తర్వులకే పరిమితమైనాయి.
షాజహాన్, ఔరంగజేబులు కూడా సతిపట్ల కఠినంగానే వ్యవహరించి, బాలవితంతువులకు విద్యాబుద్ధులు నేర్పమని ఆదేశాలు జారీచేసినా అవి ఈ దురాచారాన్ని శాశ్వతంగా పరిష్కరించలేదు. దీనికి కారణం ఆనాటి హిందూ సమాజం శాస్త్రాల ప్రకారం జీవించటమే ధర్మంగా భావించటం, అన్యమతాల ఆచారాలలో ఎక్కువ జోక్యం కల్పించుకోకూడదు అనే రాజధర్మం కూడా కావొచ్చు.
III. బ్రిటిష్ పాలన
“ సతి” ఆచారాన్ని 1787 లో పీష్వా పాలకుల వద్ద రెసిడెంట్ గా ఉన్న C Malet అనే బ్రిటిష్ అధికారి గుర్తించి ఉన్నతాధికారులకు నివేదించాడు. 1788 లో బెనారస్ రెసిడెంట్ Jonathan Dungan, భర్త చనిపోయాడు అనే పుకారును నమ్మి అతని భార్యను బంధువులు బలవంతంగా ఇంట్లో ఉంచి దహనం చేసారనే దారుణమైన విషయాన్ని లార్డ్ కార్న్ వాలిస్ కు తెలియచేసాడు.
1789 లో షాహాబాద్ కలక్టర్ M.H. Brooks, తన అధికారాలను ఉపయోగించి సతి ఆచారాన్ని నిలుపుదల చేయించిన ఒక సంఘటనను పై అధికారులకు చెప్పినప్పుడు “నువ్వుచేసిన పని మంచిదే కానీ ఇకపై ఆ ఆచారంలోని అమానవీయతను వాళ్ళు తెలుసుకొనేలా చేయి తప్ప వారిపై బలప్రయోగం చేయకు” అని సలహా ఇచ్చారు.
1805 లో బీహార్ లో పన్నెండేళ్ళ బాలికను బలవంతంగా సతిదహనం చేయిస్తున్నప్పుడు JR Elphinstone, అనే మాజిస్ట్రేట్ అనుమతులకొరకు ఎదురుచూడకుండా తన విచక్షణ అధికారాలతో నిలుపుదల చేయించినట్లు, దానికి ఆ బాలిక ఎంతో సంతోషించినట్లు తెలియచేస్తూ- ఈ దురాచారం పట్ల భవిష్యత్తులో ఎలా వ్యవరించాల్సిందో తదుపరి ఉత్తర్వులు ఇవ్వమని ప్రభుత్వాన్ని అడిగాడు. జావా యుద్ధం, లార్డ్ కార్న్ వాలిస్ మరణం వంటి అనేక కారణాలవల్ల ఈ అంశం చాన్నాళ్ళు మరుగునపడిపోయింది.
సతిదహనాలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల జరుగుతున్నట్లు, చాలా సందర్భాలలో సతికి పాల్పడే అమ్మాయికి అధికమోతాదులో మత్తుపదార్ధాలు ఇచ్చి దహనం చేస్తున్నట్లు వస్తున్న రిపోర్టులను ఆధారంగా చేసుకొని 1812 లో ప్రభుత్వం హిందూ పండితులతో చర్చించి, సతిదహన నియంత్రణ కొరకు ఈ క్రింది నియమావళిని ప్రతిపాదించింది -
ఎ. బంధువులు, పండితులు, ఇతరుల వత్తిడి లేదా బలవంతంపై ఆ మహిళ సతిదహనంలో పాల్గొనటం లేదని నిర్ధారించుకోవాలి
బి. సతిదహన సమయంలో ఆ మహిళకు మత్తుపదార్ధాలు ఇవ్వలేదని తేల్చాలి
సి. ఆ మహిళకు 16 ఏళ్లకన్న తక్కువ వయసు ఉండరాదు. బహిష్టులో ఉండరాదు. . గర్భవతి అయి ఉండకూడదు.
డి. ఈ ఆచారం హిందువులకు మాత్రమే అనుమతించబడింది. ఆ మహిళ కనుక తన పోలీసులకు అయిష్టతను తెలియచేసినచో వెంటనే బలప్రయోగంతో ఆ సతిదహనాన్ని నిలుపుచేయాలి.
ఇన్ని చేసినా హిందూ మతాచారాలకు అనుగుణంగా పండితుల సలహాలతో, సతిదహనాలు దేశవ్యాప్తంగా జరగటం బ్రిటిష్ అధికారులను ఆశ్చర్యపరచేది. ఇది ఏ స్థాయిలో జరుగుతుందో అర్ధం చేసుకోవటానికి, 1815 నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ఈ సతిదహనం చేసుకొన్న స్త్రీల పేర్లు, భర్త కులం, వయస్సు, లాంటి వివరాలు సేకరించసాగింది. బెంగాలుకు సంబంధించి 1815-1818 ల మధ్య జరిగిన సహగమనాల సంఖ్యలు ఇలా ఉన్నాయి.
1815 లో 378, 1816 లో 442, 1817 లో 707, 1818 లో 839
1817, 1818 లలో కలరా మరణాలు ఎక్కువగా ఉండటం వలన సతిదహనాల సంఖ్యకూడా ఎక్కువగా నమోదయ్యింది.
మద్రాసు డివిజనుకు సంబంధించి 1816 నాటికి మూడేళ్ళ సతిదహన లెక్కలు ఇవి
గంజాం- 45; విశాఖపట్నం- 6; రాజమండ్రి లో ఇద్దరు బ్రాహ్మలు, ఒక రాజు, ఆరుగురు శూద్రులు; మచిలిపట్నం – 42: గుంటూరు – 14: నెల్లూరు- 12: చిత్తూరు – 13: కుంబకోణం – 18
ఆనాటి ఫ్రెంచి పాలిత యానాంలో 1830లో జరిగిన ఒక సతిదహన ఉదంతాన్ని ప్రముఖ ప్రపంచయాత్రికుడు CPT Laplace, Travel around the world అనే పుస్తకంలో గ్రంథస్థం చేసాడు .
IV. బ్రిటిష్ పార్లమెంటు పేపర్లలో సతిదహనం పై జరిగిన చర్చలు
భారతదేశంలో తన అధికారిక వ్యవహారాలకు సంబంధించి ఈస్ట్ ఇండియా కంపనీ అఫిషియల్ రిపోర్టులను లండన్ లో ఉండే బ్రిటిష్ పార్లమెంటుకు సమర్పించేది. వీటిని పార్లమెంటరీ పేపర్స్ (PP) అంటారు. భారతదేశంలో ఉండే గవర్నర్ జనరల్ బ్రిటిష్ పార్లమెంటు నిర్ణయాలకు లోబడి పనిచేసేవారు.
ఈ పార్లమెంటు పేపర్లలో 1821-30 లమధ్య సతిదహనం గురించి విస్త్రుతమైన చర్చలు జరగాయి. వీటి ద్వారా సతిసహగమన నిషేదం వెనుక ఉండిన ఆనాటి సామాజిక పరిస్థితులను అర్ధం చేసుకోవచ్చును. వాటిలోంచి ఇవి కొన్ని ఉటంకింపులు
1. గవర్నర్ జనరల్ మోయిరా (1812-1829): స్థానిక హిందూ చట్టాలపై విదేశీపాలకులమైన మన ప్రభావం పరిమితమైనది. బ్రిటిష్ అధికారులు సతిదహనం విషయంలో జోక్యం చేసుకోవటంపై జాగ్రత్తగా ఉండాలి ప్రజల మతపరమైన అభిప్రాయాలలో ప్రభుత్వం జోక్యం చేసుకొంటోందనే అభియోగం రాకుండా చూసుకోవాలి (PP 1821:243)
2. లండన్ లో ఉన్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 1823 లో – సతిదహనం అనే ఆచారానికి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇవ్వదని, అలా చేసి సతిదహనం అనే క్రియలో భాగస్వామి కావటం తమకు ఇష్టం లేదని, శాసనకర్తలుగానే కాక క్రైస్తవులుగాకూడా అట్టి ఆచారాలను తాము అంగీకరించబోమని అన్నారు. (PP 1824: 45).
3. కలకత్తా నుండి వెలువడే Quarterly friend of India అనే పత్రిక 1822 లో- బ్రిటిష్ పాలకులు హిందూ చట్టాలపై స్వేచ్చానుసారంగా నిర్ణయాలు తీసుకునే శక్తిని కలిగి ఉంటే, అభాగ్యులైన హిందూ విధవలను కనికరంతో కాపాడగలిగే హక్కు ఉండేది” అని వ్యాఖ్యానించింది (PP 1822: 22)
4. సతిదహనానికి ఒక మహిళ తనంతట తాను సిద్ధపడినప్పుడు మనమేం చేయగలం అనే వాదనకు సమాధానంగా, ఇ. వాట్సన్ అనే న్యాయమూర్తి- “ఒక మహిళ సతిదహనానికి సిద్ధపడి తన ఆమోదం తెలిపినప్పటికీ ఆ ఆమోదం చట్టపరంగా పూర్తిగా చెల్లనిది/విలువలేనిది కావాలి. ఆమె కోరికపై ఆమెను చంపేవారు చట్టం ముందు హంతకులుగానే పరిగణింపబడాలి” అన్నాడు. (PP 1821: 99)
5. పై అభిప్రాయాన్ని మరింత విపులంగా Ewer అనే బ్రిటిష్ అధికారి “సతికి సిద్ధపడిన మహిళ స్వచ్చందంగా ఆ పని చేస్తున్నట్లు నమ్మలేమని, అది బలవంతం లేదా ప్రలోభపెట్టటం వలన మాత్రమే జరిగే ప్రక్రియ అని; ఎక్కువశాతం హిందూమహిళలను మానసికంగా ప్రభావితం చేయటం సులభమని; ఆమె స్వచ్చందంగానే దహనానికి సిద్ధపడుతున్నాను అని చెప్పినప్పటికీ ఆమె మాటలు ఆమె నిజమైన భావాలను తెలియజేయవు” అన్నాడు (PP 1821: 227)
6. పార్లమెంటరీ పత్రాలలో పండితులను “నిత్యం ఆకలిగొన్న” వారిగా వర్ణించారు. Ewer అనే బ్రిటిష్ అధికారి ఈ మొత్తం సతిఆచారాన్ని ఇలా చూసాడు-- మొదటి సతిఆచారం జరిగిన కొద్దికాలంలోనే పండితులు దీనిని సరైన రీతిలో నిర్వహించినట్లయితే తమకు మంచి ఆదాయవనరుగా మారుతుందని గుర్తించారు. అప్పటి అత్యంత గౌరవనీయ రచయితలు సతిని శ్రేష్టమైన పుణ్యకార్యంగా, విధవ మరియు ఆమె భర్త ఆత్మలకు అలాగే కుటుంబంలో మిగిలిన ఇతర బంధువులకు మంచి ఫలితాలు కలుగుతాయి అని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం, సంబంధిత పూజావిధానాలు జరిపించటానికి పండితుల హాజరు తప్పనిసరి చేసారు. (PP1821: 231)
7. Council Governor-General అయిన Lord Amherst, ఇలా అన్నాడు- స్త్రీలు చిన్నతనం నుండి ఒక విశ్వాసంతో పెరుగుతారు, అంటే సతీగమనం చేయడానికి ఒప్పుకోవడం ద్వారా వారు తప్పనిసరి కర్తవ్యాన్ని మాత్రమే కాకుండా, తమకూ మంచి పేరు వస్తుందని, తమ కుటుంబం ప్రతిష్ట పెరుగుతుందని భావిస్తారు. సతీగమనం చేయడానికి నిరాకరిస్తే, పిరికితనం, భర్తపట్ల అంకితభావం లేకపోవడం అనే అపవాదును ఎదుర్కోవలసి వస్తుందని భయపడతారు (PP1824:43).
8. ఒక చండాల స్త్రీ సతీదహనానికి అనుమతి కోరగా, ఆమె అతిశూద్ర స్త్రీ అయినప్పటికీ స్థానిక పండితులు ఆమెకు శూద్ర స్త్రీ స్థానాన్ని కల్పించి సతిసహగమనానికి అనుమతించారు (PP1825:42)
9. చేనేత కులస్థులలో భర్తశవంతో పాటు సజీవంగా ఉన్న భార్యను ఖననం చేయటం సతిసహగమన ఆచారం. ఇంతటి అమానవీయ ఆచారాన్ని ఇంకా కొనసాగించటం ఎంతో అభ్యంతరకరంగా ఉందని కౌన్సిల్ వైస్ ప్రెసిడెంట్ అభిప్రాయపడ్డారు (PP1821:179) .
V. ముగింపు
ఆచారాలు, సేవాధర్మం, పాతివ్రత్యం లాంటివి అనాదిగా హిందూ స్త్రీకి ఊపిరాడనివ్వకుండా చేసాయి. సనాతన ధర్మంలో హిందూ స్త్రీ ఎలా జీవించాలి అనే అంశంపై “స్త్రీ ధర్మ పద్దతి” అనే ఒక సంస్కృతగ్రంథం మార్గదర్శనం చేస్తుంది. దీనిలో ఉదయం లేచినదగ్గరనుంని పడుకొనే వరకూ హిందూ స్త్రీ ఎలాంటి విధివిధానాలను (మలమూత్ర విసర్జనాదులతో సహా) పాటిస్తే పతివ్రతగా పేరుతెచ్చుకొంటుందో ఎంతో విపులంగా వర్ణించబడింది.
ఈ గ్రంథంలో భర్తమరణించిన స్త్రీ సహగమనం చేసినట్లయితే లభించే పుణ్యం గురించి అనేక శ్లోకాలలో ఎంతో రసవత్తరంగా చెబుతాడా పండితుడు. ఈ గ్రంథాన్ని 18 వ శతాబ్దంలో త్రయంబకయాజ్వన రచించాడు. దీనినిబట్టి 18 వ శతాబ్దం వరకూ కూడా సతి సహగమనంను పండితులు ఏ రకంగా బతికించుకొంటూ వచ్చారో అర్ధం చేసుకొనవచ్చును.
***
బ్రిటిష్ అధికారి విలియం కేరీ 1799 లో మొదటిసారిగ సతీదహనాన్ని చూసి చలించిపోయాడు. జాషువా మార్ష్ మాన్, విలియం వార్డ్ వంటి మిత్రులతో కలిసి ఈ సతి దురాగతాన్ని రూపుమాపటానికి బ్రిటిష్ పార్లమెంటులో తనకు ఉన్న పరిచయాలను ఉపయోగించుకొని ఎంతగానో శ్రమించాడు. సతిని నిషేదించమని కోరుతూ అనేక వ్యాసాలు రాసాడు. వీరితో ఆధునిక భావాలు కలిగిన రాజారామ్మోహన్ రాయ్ చేతులు కలిపాడు. స్వామినారాయణ శాఖ వ్యవస్థాపకుడైన సహజానంద్ స్వామి కూడా సతినిషేదాన్ని సమర్ధించాడు. వీరిపై స్థానిక సనాతన బృందాల నుండి ప్రతిఘటన ఉండేది.
ఎట్టకేలకు తొలి గవర్నర్ జనరల్ లార్డ్ విలియం బెంటింక్ 4, డిశంబరు 1829 న రెగ్యులేషన్ XVII ను జారీ చేసి సతి దహనం చట్టవ్యతిరేక, శిక్షించదగిన నేరంగా ప్రకటించాడు.
దీనిపై సనాతనులనుంచి తీవ్రమైన ప్రతిఘటన వచ్చింది. ప్రధానంగా రాధాకాంత్ దేవ్ స్థాపించిన ధర్మ సభ అనే సంస్థ సతినిషేదాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. (ఇదే సంస్థ 1856 లో వితంతుపునర్వివాహ చట్టాన్ని వ్యతిరేకించింది)
సతిఆచారాన్ని నిషేదించటం అనేది “భారతీయుల ఆచార వ్యవహారాలలో కలగచేసుకోము” అని మూడవ జార్జి చక్రవర్తి ఇచ్చిన హామీకి వ్యతిరేకంగా ఉందని సనాతనులు వాదించారు. బీహార్, బెంగాల్ ఒరిస్సాల నుంచి కొన్ని వేలమంది సంతకాలు చేసిన పిటిషనులు ప్రభుత్వానికి సమర్పించారు. ఈస్ట్ ఇండియా కంపనీ ప్రభుత్వం సతీదహనాన్ని నిషేదించటాన్ని 1830 లో లండన్ ప్రివీ కౌన్సిల్ లో సవాలు చేసారు సనాతనులు.
రాజా రామ్ మోహన్ రాయ్ ఈ సనాతనుల వాదనను ఖండిస్తూ సతిని ఎందుకు నిషేదించాలో కౌంటర్ పిటిషన్ లు పార్లమెంటులో సమర్పించాడు. ఇతను చేసిన పోరాటంవల్ల 1832 లో సతినిషేదానికి సంపూర్ణ ఆమోదం లభించింది.
****
హిందూ ధర్మశాస్త్రాలు స్త్రీ కి సముచిత స్థానం ఇవ్వలేదు. బాల్యవివాహాలు, బహుభార్యత్వం, ఆస్తి హక్కులేకపోవటం, స్వేచ్ఛలేకపోవటం, విడాకులు తీసుకొనే స్వతంత్రత లేకపోవటం లాంటివి కొన్ని ఉదాహరణలు. వీటన్నిటికీ పరాకాష్టలాంటి ఆచారం ఈ సతీదహనం. బహుజనులలో సతీసహగమనం పొందిన స్త్రీలను పేరంటాళ్ళుగా కొలుస్తారు.
ఇవన్నీ సామాజిక రుగ్మతలు. వీటిని భారతీయసమాజం తొలగించుకొనే ప్రతిదశలోనూ సనాతనులు అడ్డుపడ్డారు. ఇవన్నీ మా ఆచారాలు మీరెవరు మార్చటానికి అంటూ తీవ్రంగా ప్రతిఘటించారు. స్త్రీలకు ఆధునిక ప్రజాస్వామిక హక్కులను కల్పించే హిందూకోడ్ బిల్లును పార్లమెంటులో చర్చిస్తున్న సమయంలో డిశంబరు 11, 1949 న వేయిమందికి పైన సనాతనులు పార్లమెంటును ముట్టడించి ఆ బిల్లు అమలుకాకుండా చూసారు. ఈ రకపు వాదనలు నేడు కూడా వినిపిస్తాయి. ఎవరైనా రేషనల్ గా మాట్లాడితే విశ్వాసాలమీద దాడిగా భావిస్తారు కొందరు.
నిజానికి ఈ పాత విషయాలు ఇప్పుడెందుకు అంతాబాగానే ఉంది కదా అంటూ కొందరు వాదిస్తారు. కానీ మనం నడిచి వచ్చిన దారిని మరచిపోతే, చేసినతప్పులే మరల మరలా చేసే ప్రమాదం ఉంటుంది. గతం ఎంతో అందమైనది అంటూ తిరిగి అక్కడకే నడిపించాలని; ఆధునిక ప్రజాస్వామిక యుగలక్షణాలైన స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం అనే పునాదులపై నిర్మించుకొన్న రాజ్యాంగం బదులు మనుధర్మశాస్త్రాన్ని అమలుపరచాలని కుట్రలు పన్నుతున్న కాలంలో ఉన్నాం మనం. చరిత్ర అర్ధం కాకపోతే ఏ వర్గాల ఆధిపత్యం తిరిగి నెలకొల్పటానికి ఈ కుట్రలు పన్నుతున్నారో అర్ధం కాదు.
****
సతి దురాచారాన్ని నిషేదించిన ఒక బెంటింగ్, వితంతుపునర్వివాహచట్టాన్ని ప్రవేశపెట్టిన ఒక డల్ హౌసీ, బాల్యవివాహాలను రద్దు చేసిన ఒక లార్డ్ ఇర్విన్, హిందూకోడ్ బిల్ ప్రవేశపెట్టిన ఒక డా. బి.ఆర్. అంబేద్కర్ లాంటివారు ప్రాతఃస్మరణీయులు.
బొల్లోజు బాబా
రిఫరెన్సులు
1. Religion and Philosophical Research E-ISSN: 2667-6583 Haziran | June 2020 Volume: 3 - Sayı | Number: 5, A Brief Historical Background Of Sati Tradition In India, Pn. 45
2. The dharmasastric debate on widow burning, David Brick, Yale University
3. మెకంజీ కైఫియ్యతులు, తూర్పుగోదావరిజిల్లా, బొల్లోజు బాబా
4. Susil Chaudhuri, ‘Sati as Social Institution and the Mughals’, Proceedings of the Indian History Congress, vol. 37 (1976), pp. 218 223.)
5.Calcutta Review 1868, vol 47, pn 221
6. ఫ్రెంచిపాలనలో యానాం-బొల్లోజు బాబా
7. Hindu Pasts, Women, Religion, Histories, Vasudha Dalmia. Chapter: Sati as a Religious Rite: Parliamentary Papers on Widow Immolation
8. https://www.jstor.org/stable/4397528
9. The perfect Wife, Sridharmapaddhati, by I Julia Leslie pn.293
10. The Dharmasastric Debate on Widow-Burning,David Brick, Yale University
This comment has been removed by a blog administrator.
ReplyDeleteవ్యాసం లో వేదాలకు సంబంధించి అది కాదు అని చెప్పినా సరే ఇంకా అదే ఊటంకింపు ఇస్తున్నారంటే మీ బాధ అర్థం చేసుకోగలను.
ReplyDeleteమిగిలిన ఊటంకింపులు తప్పూ అని చెప్పండి. అప్పుడు చర్చిద్దాం.
ఎంతకాలం ఇలా బుకాయిస్తారు. కమ్ ప్రిపేర్డ్ friends
This comment has been removed by a blog administrator.
ReplyDeleteమీవైన అభిప్రాయాలుంటే చెప్పండి. చర్చిద్దాం. కాపీ పేస్టులు నా బ్లాగుపై చెయ్యకండి.
Deleteసబ్జెక్టు మాట్లాడండి. జడ్జ్ మెంట్స్ పాస్ చెయ్యకండి.