ఈ రోజు భారతదేశం ఎదుర్కొంటున్న పేదరికానికి, మతకలహాలకు, చైనా సమస్యకు, రాజ్యాంగసమస్యకు, ఒకప్పటి దేశవిభజనకు ఒకటేమిటి సకల అవస్థలకు జవహర్ లాల్ నెహ్రూయే కారణమని హిందుత్వవాదులు తమ ప్రచారయంత్రాంగంతో హోరెత్తిస్తారు. మరణించి 60 ఏళ్ళవుతున్నా నేటికీ నెహ్రూని భారతదేశానికి పట్టిన ఒక అరిష్టంగా, ఈ దేశాన్ని సర్వనాశనం చేసిన ఒక చారిత్రిక ద్రోహిగా చిత్రీకరించటం జరుగుతోంది. కొందరైతే మరీ చిత్రంగా నెహ్రూ పూర్వీకులు ముస్లిమ్ మూలాలు కలిగి ఉన్నారని (కలిగిఉండటం ఏదో నేరంలా) అబద్దాలు ప్రచారం చేసారు.
నెహ్రూ ప్రధానమంత్రిగా నివసించిన భవనంలో ఆయన మరణానంతరం1966 లో Nehru Memorial Museum and Library ని స్థాపించారు. దీని పేరుమార్చబడి నెహ్రూ ఉనికి నేడు నామమాత్రంగా మిగిలింది. నెహ్రూ పాఠాలు క్రమేపీ పాఠ్యపుస్తకాలనుండి తొలగించబడుతున్నాయి. 75 వ భారత స్వాతంత్రదినోత్సవ వేడుకలను పురస్కరించుకొని Indian Council for Historical Research వారు ప్రచురించిన ఒక పోస్టర్ లో నెహ్రూ చిత్రం లేదు. జైలుశిక్షరద్దుచేయమని బ్రిటిష్ వారిని క్షమాపణ అడిగిన చరిత్ర కలిగిన సావార్కర్ చిత్రం ఉంది. ముప్పై ఏళ్లపాటు బ్రిటిష్ వారితో పోరాడి, తొమ్మిదేళ్ళు జైళ్లలో మగ్గిన జవహర్ లాల్ నెహ్రూ పాత్ర ఈ దేశస్వాతంత్రోద్యమంలో గాంధిసరసన నిలుపదగినది.
ఎందుకు ఇంతవిషప్రచారం అంటే, భారతప్రజల సామూహిక చేతనలోంచి నెహ్రూ జ్ఞాపకాలను తుడిచివేయటమే లక్ష్యం. ఎందుకు తుడిచివేయాలి అనే ప్రశ్నకు ఒకే ఒక సమాధానం – ఈ దేశాన్ని హిందూ రాష్ట్రంగా కాక లౌకిక, ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దినందుకు.
****
స్వాతంత్రోద్యమంలో నెహ్రూ జైళ్ళలో ఉన్నప్పుడు “Glimpses of World History, Discovery of India లాంటి గొప్ప చారిత్రిక విశ్లేషణాత్మక రచనలు చేసాడు. ఈ రచనలు శాస్త్రీయ దృక్ఫథంతో, సమాజంపట్ల ఆధునిక అవగాహనతో సాగుతాయి. స్వతంత్ర్య భారతదేశాన్ని నిర్మించటంలో నెహ్రూ పోషించిన పాత్రకు ఈ అవగాహనే ఆధారం.
ఐదువేల సంవత్సరాలక్రితపు సింధులోయనాగరికతనుండి మొదలుపెడితే, ఆర్యులు, ఇరానియన్ లు, గ్రీకులు పార్తియన్ లు, సింథియన్ లు, హూణులు, అరబ్బులు, టర్కులు, క్రిష్టియన్ లు, జొరాష్ట్రియన్ లు , మొఘలులు ఎందరో భారతదేశంలో ప్రవేశించి తమదైన ముద్రను భారతీయ సంస్కృతిపై వేసారు. శతాబ్దాలపాటు సాగిన విదేశీ వాణిజ్యం, వలసలు, పరస్పరకలయికల ద్వారా భిన్న ఆచారాలను, సంస్కృతులను స్వీకరించటం, అనుకరించటం, తనలో కలుపుకోవటం ద్వారా భారతదేశ ఆత్మ భిన్నత్వానికి ప్రతీకగా నిలిచిందని నెహ్రూ విశ్వసించాడు. వేదఋషులు, బుద్ధుడు, అశోకుడు, అల్లావుద్దిన్ ఖిల్జి, అమీర్ ఖుస్రో అక్బర్, వివేకానందుడు, గాంధి లాంటి వారి ఆలోచనలు భారతీయ సాంస్కృతిక వైవిధ్యాన్ని తీర్చిదిద్దాయని నెహ్రూ భావించాడు.
***
"జవహర్ లాల్ నెహ్రూ నా వారసుడు. రాజాజి కాదు, వల్లభాయ్ పటేలు కాదు. నేను వెళిపోయాకా నా ఆదర్శాలను కొనసాగించే వ్యక్తి నెహ్రూ అని నమ్ముతాను" అని గాంధీ 1942 నుంచే చెప్పసాగాడు. గాంధీ భావజాలాన్ని నెహ్రూ అంది పుచ్చుకొన్నాడు. వీళ్ళిద్దరి ఆలోచనలను “గాంధి-నెహ్రూ మోటిఫ్” గా నేడు చరిత్ర కారులు గుర్తిస్తున్నారు. ఈ గాంధి-నెహ్రూ మోటిఫ్ లో ప్రచలితమయ్యే సార్వభౌమాధికారం, ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, పేదలపట్ల పక్షపాతం, శాస్త్రీయ దృక్ఫథం అనే విలువలు భారతీయ ఆత్మగా చెప్పబడ్డాయి. పై విలువల ఆధారంగా నెహ్రూ స్వతంత్ర భారతదేశాన్ని తీర్చిదిద్దాడు.
****
దేశవిభజన ప్రపంచంలోనే అతిపెద్ద మానవ విస్థాపనం. ఐదు లక్షల మంది చనిపోయారు. మిలియన్ల కొద్దిప్రజలు నిరాశ్రయులయ్యారు. ఆధునిక భారతదేశం ఎదుర్కొన్న మొదటి సంక్షోభం ఇదే. దేశవ్యాప్తంగా ఎక్కడచూసినా మతకల్లోలాలు. దేశానికి పెద్దదిక్కు అయిన మహాత్మాగాంధి మతోన్మాదానికి బలి అయ్యారు.
విభజిత భారతదేశాన్ని లౌకిక, ప్రజాస్వామిక విలువలపై నిర్మించాలని సంకల్పించిన గాంధి-నెహ్రు మోటిఫ్ పరీక్షకు పెట్టబడిన కాలం అది. హిందూమత ప్రాతిపదికన దేశనిర్మాణం జరగాలని పెద్ద ఎత్తున అల్లర్లు చుట్టుముట్టాయి. ఇంటిరిమ్ ప్రధానిగా ఉన్న నెహ్రూ, ఆనాటి డిప్యూటి ప్రధాని హోమ్ మంత్రిగా ఉన్న వల్లభాయ్ పటేల్ మద్దతుతో ఆర్.ఎస్.ఎస్. సంస్థను నిషేదించి సుమారు 25 వేలమంది దాని కార్యకర్తలను బందీ చేయించాడు.
ఇలాంటి దశలో ప్రజలందరకీ ఓటుహక్కుతో సార్వత్రిక ఎన్నికలకు సిద్ధపడటం నెహ్రూ తీసుకొన్న అతిపెద్ద సాహసోపేతనిర్ణయం. ఈ రోజు భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం అని పిలవబడుతుందంటే ఆనాడు నెహ్రూ వేసిన పునాదే కారణం.
1951 ఎన్నికలు - భారతదేశం మతప్రాతిపదికన హిందూరాష్ట్రంగా ఉండాలా లేక లౌకిక, ప్రజాస్వామ్య దేశంలా ఉండాలా అనే రెండు నిర్ణయాలమధ్య జరిగిన రిఫరెండంగా భావించవచ్చు.
హిందూ రాష్ట్రంగా దేశాన్ని తీర్చిదిద్దాలని కోరుకొన్న హిందూ మహాసభ, జన సంఘ్, రామ రాజ్య పరిషద్ పార్టీలు 6 శాతం ఓట్లతో 489 సీట్లలో10 లోక్ సభ స్థానాలను పొందగా భారతదేశాన్ని ప్రజాస్వామ్య, సెక్యులర్ దేశంగా తీర్చిదిద్దుతామనే హామీతో ఎన్నికల బరిలో దిగిన నెహ్రూ నేత్రుత్వంలోని కాంగ్రెస్ 364 సీట్లు దక్కించుకొంది. ఇది ఆనాటి ప్రజల విజ్ఞత. వారు ఈ దేశం లౌకిక ప్రజాస్వామిక దేశంగా ఉండాలని కోరుకొన్నారు. నిజానికి చారిత్రికంగా అదే భారతదేశ ఆత్మ.
****
మతవాదులనుండి భారతదేశం ఎదుర్కోబోతున్న ప్రమాదాలను నెహ్రూ ఆనాడే గుర్తించాడు. ఆర్ ఎస్ ఎస్ పై విధించిన నిషేదాన్ని రెండేళ్ళ తరువాత తొలగించినపుడు “ఆర్ ఎస్ ఎస్ సంస్థ ఫాసిజ లక్షణాలను కలిగి ఉంటుంది, దాని కదలికలపై నిఘా పెట్టండి” అని నెహ్రూ వివిధ ముఖ్యమంత్రులను కోరాడు.
"భారతీయజనసంఘ్, మతం, సంస్కృతి పేరుతో ప్రజల మధ్య విషాన్ని, ద్వేషాన్ని వ్యాపింపచేస్తుంది" అని తన ఎన్నికల ప్రచారంలో విమర్శించాడు.
1952 ఎన్నికలలో విజయం సాధించాకా నెహ్రూ ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీలకు రాసిన ఒక ఉత్తరంలో “ఈ ఎన్నికలలో మతతత్వ శక్తులతో మనం నేరుగా కలబడి విజయం సాధించటం గొప్ప విషయం. కానీ ఈ విజయం సంపూర్ణం కాదు. మతతత్వ శక్తుల పట్ల మనం మరింత అప్రమత్తతతో ఉండాలి” అని హెచ్చరించాడు.
“మతం ఆధారంగా ఎవరైనా మరొక వ్యక్తిపై చేయి ఎత్తితే, ప్రభుత్వం వద్ద ఉన్న అన్ని వనరులను అతనిపై ఉపయోగించి అతన్ని నిలువరిస్తాం” అంటూ 1951 లో మహాత్మగాంధి జయంతి రోజున చేసిన ప్రసంగంలో అన్నాడు.
మతతత్వ శక్తులపట్ల నెహ్రూ అంచనాలు వాటిని నిలువరించిన విధానం పై మాటల ద్వారా అర్ధం చేసుకొనవచ్చు.
****
భారతదేశంలో ఉన్న భిన్న భాషలు, సంస్కృతులు, మతాలు, సామాజిక ఆర్ధిక స్థితిగతులు అన్నీ మనుగడసాగించాలంటే స్వేచ్ఛాయుత పరిస్థితులల్లో ప్రజాస్వామ్యం ఉండాలని నెహ్రూ అభిప్రాయపడ్డాడు. దాదాపు ఇదే భావనను సమకాలీనంగా "మతతత్వ ఫాసిజం వల్ల భారత ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లనుంది" అని అమర్త్యసేన్ అంటారు.
దేశం యొక్క సార్వభౌమత్వం ఆ దేశం ఆర్ధికంగా నిలదొక్కుకున్నప్పుడే సిద్ధిస్తుంది అని నమ్మిన నెహ్రూ అనేక పబ్లిక్ రంగ సంస్థలను స్థాపించి పారిశ్రామికీకరణకు; పెద్దపెద్ద ఆనకట్టలను నిర్మించి వ్యవసాయాభివృద్ధికి; వివిధ ఉన్నత విద్యా సంస్థలను నెలకొల్పి విద్యాభివృద్ధికి; అనేక పరిశోధనా సంస్థలను స్థాపించి శాస్త్ర సాంకేతిక ప్రగతికి బాటలు వేసాడు. సాహిత్య అకాడెమి, లలిత కళా అకాడమీ, సంగీత్ నాటక్ అకాడమీలు స్థాపించి సాంస్కృతిక పరిరక్షణ చేసాడు. ఇవన్నీ ఆధునిక భారతదేశపు పునాదులు.
ముగింపు
1. నెహ్రూ పాలనని మతాన్ని వేరు చేసాడు. భిన్నత్వాన్ని అంగీకరించి ప్రజలందరూ ఒకరిని ఒకరు గౌరవించుకొంటూ, కలుపుకొనిపోతూ కలిసిమెలసి జీవించాలని ఆకాంక్షించాడు. ఇది మతవాదులకు నచ్చలేదు. మెజారిటేరియన్ మతంగా హిందూమతం ఇతరులపై ఆధిపత్యం సాగించాలని వారు ఆశించారు. దీనికి నెహ్రూ తనజీవితకాలంలో అనుమతించలేదు.
2. దేశవిభజన విషయంలో నెహ్రూ తొందరపడ్డాడని మతవాదులు ఆరోపిస్తారు. దేశవిభజన ఆనాటికి ఒక చారిత్రిక ఆవశ్యకత. జిన్నా నాయకత్వంలోని ముస్లిమ్ లీగ్ పాకిస్తాన్ ఏర్పాటుపై గట్టిగా పట్టుబట్టింది. “డైరెక్ట్ యాక్షన్” కు పిలుపునిచ్చింది.
ఇలాంటి సందర్భంలో దేశవిభజన నిలుపుచేసే శక్తి నెహ్రూకి కానీ గాంధీకి కానీ లేకుండాపోయింది.
మతకల్లోలాలలో చెలరేగిన హింస తన ప్రాణాలకు ప్రమాదం కలిగించే నేపథ్యంలో కూడా - నెహ్రూ వీధుల్లో తిరుగుతూ ఇరుపక్షాలను సర్ది చెప్పేందుకు యత్నించాడు. బీహార్‌లో ఒక సందర్భంలో, "నేను హిందూ-ముస్లిం అల్లర్ల మధ్యదారిలో నిలబడి ఉన్నాను. ఇరుపక్షాలకు చెందినవారు ఒకరిపై ఒకరు దాడి చేయాలనుకుంటే, అది నా శవం మీదుగా చేయాలి" అని నెహ్రూ అన్నాడు. నెహ్రూ ఆ మాటలు పలికినప్పుడు, ఆయనను ఉన్నత వర్గానికి చెందిన ఒక విలాసవంతులైన వ్యక్తిగా చిత్రించే ధోరణికి భిన్నంగా అనిపిస్తుంది.
విభజనానంతర దేశాన్ని రాజకీయంగా స్థిరపరచటం, శాంతిని పునరుద్దరించటం, ప్రగతి పథంలో నడిపించటం లాంటి కీలక అంశాలలో నెహ్రూ పాత్ర చాలా విలువైనది.
3. జవహర్ లాల్ నెహ్రూ పండితుడు. చరిత్రను, ప్రపంచ గమనాన్ని అర్ధం చేసుకొన్న పండితుడు. మానవజాతి పరిణామక్రమంలో మతం ఆదిమ లక్షణంఅని, స్వేచ్ఛ, సమానత్వం ఆధునిక లక్షణాలని ఎరుక కలిగినవాడు. భారతదేశ వైవిధ్యం, బహుళతపై అవగాహన కలిగినవాడు. స్వతంత్రభారతదేశాన్ని లౌకిక, ప్రజాస్వామిక దేశంగా మలచాడు.
గాంధీ హత్యద్వారా అల్లకల్లోలం సృష్టించి, నెహ్రూను ఒంటరిని చేసి దేశాన్ని హిందూరాష్ట్రంగా చేసెయ్యాలని ఆశించిన మతతత్వ శక్తులను శాయశక్తులా ఎదుర్కొన్నాడు. హిందూ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకొన్నాడు. ఇది మతవాదులకు నచ్చలేదు. నెహ్రూ పై హిందుత్వవాదుల ద్వేషానికి మూలాలు ఇక్కడ ఉన్నాయి.
4. సోమనాథ్ ఆలయం, అయోధ్య లాంటి హిందూ ఆలయాలను పునర్నిర్మించటంలో నెహ్రూ అలసత్వం ప్రదర్శించాడనే మరొక విమర్శ చేస్తారు. ప్రభుత్వానికి మతానికి సంబంధం ఉండకూడదనేది నెహ్రూ ఆలోచన. అంతే కాక చారిత్రిక దాడులలో జీర్ణమైన ఆలయాలజోలికి పోవటం ”గాయాలను” పెద్దవిచేసుకోవటమే అనే భావన కూడా ఉండొచ్చు.
5. నెహ్రూ మిశ్రమ ఆర్ధిక విధానాలను విమర్శిస్తారు కానీ భారతదేశం ఆర్ధికంగా, సామాజికంగా పరిపుష్టి చెందటంలో మిశ్రమ ఆర్ధిక విధానాలే కారణం. ఈనాడు పబ్లిక్ రంగ సంస్థలు, విమానాశ్రయాలు, గనులు, పోర్టులు, అడవులు, టెలికామ్, ఇన్సూరెన్స్ లాంటి ప్రజల ఆస్తులు విక్రయానికి గురవుతూ, ఎవరి జేబులు నిండుతున్నాయో ఆలోచిస్తే నెహ్రూ ఆర్ధికవిధానం ప్రజలకు ఏ మేరకు మేలు చేసిందో అర్ధమౌతుంది.
6. నేటి హిందుత్వ వాదులు నెహ్రూ కి ప్రత్యామ్నాయంగా పటేల్ ని సావార్కర్ ని ప్రతిష్టిస్తున్నారు. గాంధి, నెహ్రూ, పటేల్ లు దేశభక్తులు. దేశ సమగ్రత కోరుకొన్నారు. ముగ్గురూ సమన్వయంతో దేశాభ్యున్నతికొరకు కలిసి పనిచేసారు. గాంధి 1948 లో, పటేల్ 1950 లో మరణించటంతో నెహ్రూ ఒంటరి అయిపోయాడు. ఇక భారతదేశ చరిత్రలో వీరసావార్కర్ పాత్ర వివాదాస్పదమైనది ఇతను నేడు సర్వత్రా నడుస్తున్న హిందుత్వ ఐడియాలజీకి ఆద్యుడుగా చెప్పుకోవచ్చు. ఇది విభజన, ద్వేషం నింపుకొన్న మార్గం. గాంధి- నెహ్రూ- పటేల్ ల మధ్య ఇమడనిది.
1951 ఎన్నికలలో నెహ్రూకు 75% స్పష్టమైన ప్రాతినిధ్యం ఇచ్చారు ప్రజలు. డా.అంబేద్కర్ సహాయంతో జవహర్ లాల్ నెహ్రూ స్వతంత్ర్య భారతావనికి గొప్ప రాజ్యాంగాన్ని ఏర్పరచి, లౌకిక, ప్రజాస్వామిక దేశంగా తీర్చిదిద్దారు. నేడు కొందరు నెహ్రూ పేరును భవనాలకు సంస్థలకు తొలగిస్తూ, అతనిపై అబద్దాలు కట్టుకథలు ప్రచారం చేస్తున్నారు. వాటి వెనుక ఉద్దేశం ఒకటే, మెజారిటేరియన్ వాదాన్ని ఒప్పుకోలేదన్న కోపం. ఎందుకు ఒప్పుకోలేదో ఏనాటికైనా సత్యం అందరూ తెలుసుకొంటారు. ఈ దేశానికి నెహ్రూ తప్పించిన ఉపద్రవాన్ని గుర్తుచేసుకొంటారు.
బొల్లోజు బాబా
తెప్పించిన అన్న పదాన్ని మొదట తెచ్చిన గా చదివి బెంబేలుపడిపోయా ! ఆ తరువాత టపా చదివి కొంత ఊరట ~
ReplyDeleteనెహ్రూ గారి గురించి నాల్గు మంచి మాటలువినడం పుణ్యమే !
ఎవరి భావజాలం అనుగుణంగా వారు తమ వాదనలు వినిపించవచ్చు. కాశ్మీరు సమస్య, చైనా యుద్ధం, లౌకిక వాదం ముసుగులో హిందూ వ్యతిరేక చర్యలు, చరిత్ర వక్రీకరణ, sickular పాఠ్య పుస్తకాలు ...
ReplyDeleteఅయితే బహుళార్థ సాధక ప్రాజెక్టులు, ఉన్నత విద్యా సంస్థలు సాంకేతిక సంస్థలు వంటివి నెహ్రూ చేపట్టిన మంచి పనులు అనడంలో సందేహం లేదు.
ప్రతి నాయకుడు పాలనలో తప్పించిన తెప్పించిన , నొప్పించిన మెప్పించిన అంశాలు ఉంటాయి.