అఖండ భారతదేశ నిర్మాత అశోకచక్రవర్తి. గత వంద సంవత్సరాలలో అశోకునిపై 1600 పుస్తకాలు, కొన్ని వేల వ్యాసాలు వచ్చాయి.
మనకు ఇద్దరు అశోకులు ఎదురౌతారు. ఒకటి శాసనాలలో, కట్టడాలలో కనిపించే చారిత్రిక అశోకుడు, పాలి, సంస్కృత, సింహళ పురాణాలలో కనిపించే పౌరాణిక అశోకుడు. ఈ రెండు పాత్రలు ఒకదానిని మరొకటి కలుషితం చేయకుండా ఉండవు. అశోకుని గురించి రాసే కథనాలలో చారిత్రిక, పౌరాణిక అశోక పాత్రలు ప్రయత్నంగానో అప్రయత్నంగానో కలిసిపోతాయి.
శ్రీలంక, టిబెట్, చైనా దేశాలలో లభించిన బౌద్ధ రచనలద్వారా లభించే అశోకుని జీవితం, తన శాసనాలలో అశోకుడే స్వయంగా చెప్పుకొన్న జీవితానికి పొడిగింపుగా భావించి – చాలామంది చరిత్రకారులు అశోకుడిని ఒక పౌరాణిక పాత్రగా మలిచారు. వీరికి ప్రధాన సాహిత్య ఆధారాలు - బౌద్ధ గ్రంథాలైన దీపవంశ, మహావంశలు; సంస్కృత రచనలైన అశోకవదన, బుద్ధ చరితలు ఇంకా హిందూ పురాణాలలో అక్కడక్కడా వచ్చే అశోకుని ప్రస్తావనలు.
రామాయణంలా అశోకుని చరిత్రకూడా భిన్న ప్రాంతాలలో, భిన్న కవులు భిన్న రీతులుగా దర్శించారు. దీనివల్ల జనబాహుళ్యంలో అశోకుని పట్ల అనేక అపోహలు ఉన్నాయి.
అశోకుడు అనే రాజు ఒక అనామక రాజు అని, ఇతనిని బౌద్ధ సాహిత్యం మహోన్నత చారిత్రిక పాత్రను ఇచ్చి పెద్ద చేసిందని Christpher Beckwith అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. కొందరు అశోకుని చారిత్రికతను కూడా ప్రశ్నించారు. కానీ ఈ వాదనలను ఇండాలజిస్టులు తిరస్కరించారు. ఈ రకపు వాదనలు అర్ధరహితం. అశోకుని శాసనాలు లిఖించబడిన బ్రాహ్మి లిపిని ప్రిన్సెప్ ఛేదించాక, ఒక గొప్ప ప్రాచీన చక్రవర్తి జీవితము, సామ్రాజ్యము మనముందు సజీవంగా తిరిగి వచ్చాయి. ఇప్పటికీ అశోకుని వ్యక్తిత్వాన్ని పౌరాణిక కథనాల ఆధారంగా బేరీజు వేస్తూ, చులకనగా మాట్లాడటం, చారిత్రిక అశోకుని పట్ల అనాదిగా బ్రాహ్మణవాదులు చూపిన అలక్ష్యానికి అది సమకాలీన కొనసాగింపు మాత్రమే.
అశోకుని పేరుకలిగిన శాసనం, 1915 లో కర్ణాటక, మస్కి అనేచోట దొరికింది. ఇందులో “దేవానాం పియ అశోక” అని ఉంది. అదే విధంగా 1954 లో మధ్యప్రదేష్ , గుజ్జర వద్ద లభించిన మరొక శాసనంలో “దేవానం పియదసి అశోకరాజ” అని ఉంది. గుజరాత్, గిర్నార్ వద్ద లభించిన CE 150 నాటి ఒక శాసనంలో అశోకచక్రవర్తి తవ్వించిన ఒక చెరువును, తాను మరమ్మత్తులు చేయించినట్లు రుద్రదమనుడు అనే రాజు “అశోకుడి” పేరును ప్రస్తావించాడు. అంటే అశోకునికి 300 ఏండ్ల అనంతరం జీవించిన రుద్రదమనుడికి అశోకుడు, అతను చేసిన నిర్మాణాలు గురించి తెలుసు. ఇవన్నీ అశోకుని చారిత్రికత, ఘనతను నిరూపిస్తాయి.
దాదాపు అశోకుని కాలంలోనే జీవించిన అలెగ్జాండర్ జీవితాన్ని ఆనాటి సమకాలీన ఇరవైకి పైగా రచనలనుంచి గ్రహించి అతని జీవితచరిత్రను సాధికారికంగా నిర్మించారు చరిత్రకారులు. అశోకునికి సంబంధించి ఒక్క సమకాలీన రచన లేదు. ఇతనికి ఆస్థాన చరిత్రకారుడు లేడు. చారిత్రిక జీవితచిత్రణ లభించలేదు. ఉన్నదల్లా అశోకుడు గతించిన 300 ఏండ్ల తరువాత, పుణ్యపురుషుల జీవనచిత్రణ అంటూ బౌద్ధ రచనలలో లభించే కొంత సమాచారం. ఇది ఏమేరకు చారిత్రికసత్యమో తెలుసుకొనే అవకాశమే లేదు.
ఇన్ని ప్రతికూలతల మధ్య చారిత్రిక అశోకుని జీవితాన్ని పునర్నిమించటానికి అశోకుడే స్వయంగా వేయించుకొన్న అనేక శిలాశాసనాలు ఈ రోజు అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా ఆనాటి అశోకచక్రవర్తి జీవితం, అతని ప్రజలు, అతని మతం గురించి చాలా విషయాలు తెలుస్తాయి.
1. అశోకుని శాసనాలు
అశోకుడు తన రాజ్యం నలుచెరగులా తనపేరుతో శాసనాలను చెక్కించాడు. ఇవి అన్నీ ప్రధమపురుషలో అశోకుడే చెబుతున్నట్లు ఉంటాయి. అశోకుడే స్వయంగా చెప్పి రాయించి ఉంటాడు. వీటిని మొత్తం మూడు భాషలు, రెండు లిపులలో రాశారు. ప్రస్తుత భారతదేశంలో బ్రాహ్మీ లిపి, ప్రాకృత భాషలో లిఖించారు, అలాగే ప్రస్తుత పాకిస్థాన్,ఆఫ్గనిస్థాన్ లలో వేయించిన శాసనాలు ఖరోష్టి లిపిలో గ్రీకు, అరామిక్ భాషలలో లిఖించారు. జేమ్స్ ప్రిన్సెప్ 1834 లో బ్రహ్మిలిపిని పరిష్కరించిన తరువాత మరుగునపడిన, జంబూద్వీప చక్రవర్తి అశోకుని జీవితము పునరుజ్జీవం పొందింది.
దేశవ్యాప్తంగా ఆనాటి ప్రజలు ప్రాకృత భాషను చదవగలిగి, అర్ధం చేసుకోగలిగేవారని భావించాలి, లేకపోతే ఇన్ని శాసనాలను చెక్కించి ప్రయోజనం లేదు. అలాగని వీటిని ప్రజలకు చదివి వినిపించమని తన అధికారులకు ఎక్కడా సూచనలు ఇచ్చినట్లు లేదు కనుక వీటిని ప్రజలే చదువుకొని ఉండాలి. అంటే బహుశా ప్రజలు 100% అక్షరాస్యులు అయి ఉండవచ్చు. దేశమంతటా అర్ధం అయ్యే ఒక ఉమ్మడి లిపి, ఉమ్మడి భాషను వృద్ధిచేయడం ద్వారా అశోకుడు తన ప్రజలతో సమర్ధవంతంగా సంభాషించగలిగాడు. ప్రాకృత భాషలను తొలగించి వచ్చిన సంస్కృతం ఒక సామాజిక వర్గం గుప్పెట్లో ఉండిపోయింది. దాన్ని ఇతరులకి నేర్పకపోవటంచే అక్షర జ్ఞానం ఎవరికీ దక్కలేదు. తద్వారా ఒకప్పుడు 100% అక్షరాస్యత ఉన్న ఈ దేశప్రజా బాహుళ్యం నిరక్షరాస్యతలోకి కూరుకుపోయింది.
అశోకుని శాసన స్తంభాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో లభిస్తున్నాయి. సౌలభ్యం కొరకు వాటిని ఇలా విభజించారు.
1. లఘు శిలాశాసనాలు (Minor rock edicts): ఇవి రెండు మాత్రమే. వీటిలో లఘుశిలాశాసనం I మొత్తం 14 ప్రదేశాలలో, లఘుశిలాశాసనం II మొత్తం 10 చోట్ల లభించాయి.
ఈ శాసనాలలో అశోకుడు బౌద్ధమతావలంబి అయిన సంగతి, ధర్మాచరణకు సంబంధించిన కొన్ని నియమాలు చెప్పబడ్డాయి.
2. బృహత్ శిలాశాసనాలు (Major rock edicts): ఇవి మొత్తం 14. శిలాశాసనం I గరిష్టంగా 8 చోట్ల దొరకగా, శిలాశాసనం XIV కనిష్టంగా 3 చోట్ల లభించింది.
ఈ శాసనాలలో ఆశోకుడు- జంతువథ నిషేదం; ప్రజల సౌఖ్యం కొరకు పాలకునిగా చేస్తున్న పనులు; బౌద్ధ ధర్మాన్ని అభివృద్ధి పరచటం; ప్రజల శ్రేయస్సుకై తాను చేస్తున్న కృషి; పరమత సహిష్ణుత; కళింగయుద్ధం లాంటి అంశాలు ఉన్నాయి.
3. స్తంభశాసనాలు: ఇవి మొత్తం ఏడు చోట్ల లభిస్తున్నవి. వీటిలో – ధర్మపాలన; రాజోద్యోగులు పాటించవలిసిన విధులు; జీవహింస నిషేదం, దర్మప్రచారం లాంటి విషయాలు చెప్పబడ్డాయి.[1]
***
అశోకుని శాసన స్తంభం ఒక్కొక్కటి 9-13 మీటర్ల పొడవు ఉంటుంది. క్రింద 2 మీటర్ల వ్యాసం పైకి వెళ్ళే కొద్దీ సన్నబడుతూ ఉంటుంది. ఇవి సాధారణంగా భూమిలో రెండున్నర మీటర్ల లోతులో ఒక పెద్ద రాతిఫలకపై ఉంచి నిలబెట్టబడి ఉంటాయి. ఈ స్తంభాలు ఏకశిలా నిర్మితాలు. ఒక్కొక్కటి సుమారు 50 టన్నుల బరువు ఉంటాయి. స్తంభాగ్రముపై సింహం, వృషభం, ఏనుగు, గుర్రము, ధర్మచక్రము లాంటి వివిధ శిల్పాలు ఉంటాయి. సారనాథ్ వద్ద లభించిన అశోకుని స్తంభంపై కల నాలుగు సింహాల శీర్ష శిల్పాన్ని భారతదేశ జాతీయ చిహ్నంగా స్వీకరించారు.
వీటిని ఎలా సేకరించారు, ఎక్కడ చెక్కారు లాంటి వివరాలు తెలియరావు. అశోకుని స్తంభాలలో ఎక్కువ భాగం ఒకేరకమైన రాతిని కలిగి ఉండటాన్ని బట్టి ఇవి కేంద్రీకృతంగా తయారై, తరువాత ఎక్కడ నిలబెట్టాలో ఆ యా స్థలాలకు రవాణా చేయబడ్డాయని చెప్పవచ్చు. ఈ రాయి ఉత్తర ప్రదేష్ మీర్జాపూర్ జిల్లావద్ద ఉన్న క్వారీలనుంచి సేకరించబడి ఉండవచ్చునని పరిశీలకుల అభిప్రాయం
ఈ స్తంభాల పాలిష్ అత్యుత్తమ మెరుపును కలిగి ఉంటుంది. దీనిని మౌర్యన్ పాలిష్ అంటారు. ఇంతటి నైపుణ్యం ఆ తరువాత మరలా కనిపించలేదు. CE 1357 ఢిల్లీ సుల్తాను ఫిరోజ్ షా తుగ్లక్ తోప్రాలోని అశోక స్తంభాన్ని 42 చక్రాలు కట్టిన బండిమీద, పడవలపైనా ఢిల్లీకి తీసుకువెళ్ళినట్లు చారిత్రిక కథనం నమోదు అయి ఉంది. బహుశా ఈ విధంగానే అశోకుని కాలంలో వీటి యొక్క రవాణా జరిగి ఉంటుంది.
ఈ స్తంభాలపై శాసనాలు ముందుగానే ఉల్లేఖించి తరువాతా వాటిని నిలబెట్టటం జరిగింది. ఒక్క అల్లహాబాదు అశోక స్తంభంపై మాత్రం నిలబెట్టిన తరువాత వాటిపై శాసనాలు రాసినట్లు తెలుస్తుంది.
అశోకుడు పాతించిన 20 శాసన స్తంభాలను నేడు గుర్తించగలిగారు. ఇవి ఎక్కువగా బౌద్ధ దర్శనీయ క్షేత్రాలకు సమీపంగా ఉన్నాయి. ఇవి మొత్తం ఎన్ని వేయించాడనేది తెలియదు. 40 వరకూ ఉండవచ్చుఅంటారు. వీటిని “ధర్మ స్తంభాలు” అనేవారని 7 వ స్తంభ శాసనం ద్వారా తెలుస్తున్నది. ఇద్దరు స్త్రీలు ఒక అశోక స్తంభానికి శిరస్సులు ఆనించి ప్రార్థిస్తున్న ఒక సాంచి శిల్పం ద్వారా- ఈ స్తంభాలను కూడా ఆనాటి ప్రజలు పవిత్రంగా పూజించేవారని అర్ధమౌతుంది.
2. జంబూద్వీప చక్రవర్తి
అశోకుని శాసనాలలో తన మౌర్య వంశమూలాలను, తన తండ్రి బిందుసారుడు, తాత చంద్రగుప్తుడి పేర్లను ఎక్కడా ప్రస్తావించలేదు. తన పేరు, బిరుదు మాత్రమే చెప్పుకొన్నాడు. బిందుసారుని అనంతరం అశోకునికి సింహాసనం అంత సులభంగా దక్కలేదని, తన నూర్గురు సోదరులను హతం చేసి సింహాసనాన్ని అధిష్టించాడని బౌద్ధ రచనల ద్వారా తెలుస్తుంది. ఈ ఉదంతం జరిగినట్లు ఇతర చారిత్రిక ఆధారాలు లభించవు. ఈ ఘర్షణల కారణంగా తన పూర్వీకుల వారసత్వాన్ని చెప్పుకోవడానికి అశోకుడు ఇష్టపడి ఉండకపోవచ్చునని చరిత్రకారుడు Patrik Olivelle అభిప్రాయపడ్డాడు.
ఇది ఆనాటి ఆచారమేమో తెలియరాదు ఎందుకంటే, దాదాపు అదే కాలానికి చెందిన కళింగ ఖారవేలుని శాసనంలో కూడా అతని పూర్వీకుల పేర్లు కనిపించవు.
అశోకుడు తన ముప్పైనాలుగో ఏట BCE 268లో పట్టాభిషిక్తుడయ్యాడు. అంటే ఇతను BCE 302 లో జన్మించి ఉండాలి. అప్పటికి ఇతని తాత చంద్రగుప్తుడు రాజుగా జీవించే ఉన్నాడు. అతను 293 లో మరణించగా, తండ్రి బిందుసారుడు రాజ్యపగ్గాలు చేపట్టే నాటికి అశోకునికి 9 ఏళ్ళ వయసు. అశోకుని తాత, తండ్రులు గ్రీకు రాజ్యంతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగి, వారి రాకుమార్తెలను తమ రాణులుగా చేసుకొని ఉన్నారు. రెండుతరాలుగా గ్రీకు వనితలు అంతఃఫుర రాణులుగా ఉండటం చేత, అశోకునికి చిన్నతనంలోనే గ్రీకు దేశ సంస్కృతి సంప్రదాయాలపట్ల అవగాహన ఏర్పడింది
***
XIV నంబరు రాతిశాసనంలో “నా సామ్రాజ్యము సువిశాలమైనది” అన్నాడు అశోకుడు. ఈ సువిశాల సామ్రాజ్యానికి పాటలిపుత్రను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. I వ లఘు శిలాశాసనంలో తన రాజ్యాన్ని జంబూద్వీపమని చెప్పుకొన్నాడు. జంబు అంటే నేరేడు అని అర్ధం. నేరేడు చెట్లు ఉండే ద్వీపం కనుక జంబూద్వీపమని పేరు వచ్చింది అంటారు. ఆకార రీత్యా కూడా భరతఖంఢం నేరేడుపండును పోలి ఉంటుంది. ఈ భరతఖండం అంతటిని ఒకే భౌగోళిక ప్రాంతంగా పరిగణించి జంబూ ద్వీపం అన్నపేరును అశోకుడు మొదటిసారిగా ఉపయోగించాడు.
ఇతని శాసనాలు లభించిన ప్రాంతాల ఆధారంగా అశోకుని సామ్రాజ్యం బంగ్లాదేశ్, నేపాల్, కాశ్మీల్, ఆఫ్ఘనిస్తాన్, కర్ణాటక తమిళనాడు మధ్య విస్తరించి ఉండేదని అర్ధమౌతుంది. సంస్కృతి ఆచారవ్యవహారాల పరంగా వైవిధ్యభరితమైనది. ఈ బహుళతను రాజకీయంగా ఏకం చేయగలిగాడు. అశోకుడు తన రాజ్యానికి సరిహద్దులుగా ఉండే ఇతర రాజ్యాలను జయింపబడని రాజ్యాలు (అవిజిత) అని పిలిచేవాడు. ఈ పదం విదేశాంగరాజనీతిలో కత్తివాదర లాంటిది.
అశోకుడి రాజ్య జనాభా సుమారు 2-3 కోట్లు ఉండవచ్చునని Dyson అభిప్రాయపడ్డాడు. అప్పటికి చైనా, రోమన్ సామ్రాజ్యాలు ఇంకా అవతరించలేదు. విస్తీర్ణం, జనాభాల పరంగా అశోకుని సామ్రాజ్యం ప్రపంచంలోనే అత్యంత పెద్దది అయి ఉండే అవకాశం ఎక్కువ.
****
ఎ. కళింగ యుద్ధం:
అశోకుడు అనగానే వెంటనే స్ఫురణకు వచ్చేది కళింగ యుద్ధం. కళింగరాజ్యాన్ని ఒరిస్సా రాష్ట్రం తమదిగా చెప్పుకొంటున్నప్పటికీ, చారిత్రికంగా కళింగరాజ్యం ఉత్తరాంద్రనుండి రాజమహేంద్రవరం వరకూ విస్తరించిన ఆంధ్రప్రదేష్ భౌగోళిక ప్రాంతం.
BCE 260 అక్టోబరు/నవంబరు నెలలలో అశోకుడు కళింగ రాజ్యం పై దండెత్తాడు. కళింగ రాజ్యం ఎలా ఉంటుంది, ఎందుకు దానిపై యుద్ధం చేయవలసి వచ్చిందో అశోకుడు ఎక్కడా చెప్పలేదు. అప్పట్లో కళింగలో యుద్ధానికి ఉపయోగపడే ఏనుగులు అధికంగా లభించేవి. ఉత్తర దక్షిణభారతదేశాలను కలిపే వ్యాపారమార్గాలు కళింగ మీదుగా వెళ్ళేవి. ఈ రెండు రాజ్యానికి అత్యంత కీలకమైన అవసరాలు. అశోకుడు కళింగపై దండెత్తడానికి ఇవి కారణాలు కావొచ్చునని చరిత్రకారులు ఊహించారు
ఈ యుద్ధం కలిగించిన భీభత్సం అశోకునికి దుఃఖం కలిగించింది. అపారమైన ప్రాణ నష్టం పట్ల అశోకుడు పశ్చాత్తాపపడ్డాడు. ప్రపంచ చరిత్రలోనే ఏ చక్రవర్తి చేయని విధంగా ఇంతటి విధ్వంసానికి కారణమైన “నన్ను క్షమించమని” ప్రజలను కోరాడు. ఇతని క్షమాపణావాక్యాలు రెండువేల మూడువందల సంవత్సరాల తరువాత కూడా మనం చదువుకోగలుగుతున్నాం. ప్రపంచ చరిత్రలో ఇదొక అరుదైన ఘటన.
XIII వ శిలాశాసనంలో అశోకుడు ఇలా అన్నాడు “దేవానాం ప్రియదర్శి రాజు పట్టాభిషిక్తుడైన ఎనిమిదవ ఏట కళింగరాజ్యం అతనిచే జయింపబడింది. లక్షా యాభైవేలమంది జనులు బంధీలుగా మారారు. లక్షమంది మరణించారు. మరెంతో మంది విగతులయ్యారు. // వశపడని ఒక రాజ్యం జయింపబడినపుడు అందు జనుల వధ, మరణం, నిరాశ్రయులవటం, దేవానం ప్రియునికి బాధాకరంగాను, శోచనీయంగాను తోస్తున్నది. //
// తమకు అత్యంతప్రియులైన స్నేహితులు, పరిచితులు, సహచరులు, బంధువులు అయినవారికి బాధ కలుగుతున్నప్పుడు తమ స్థితి బాగుండినా వారి బాధ తమకూ బాధాకరమే అవుతుంది. ఈ బాధను అందరూ పంచుకొంటారు. ఇది దేవానాం ప్రియునికి మిక్కిలి శోచనీయంగా ఉంది. //కళింగరాజ్యాన్ని జయించినప్పుడు ఆ దేశ జనులలో నూరోవంతు కానీ వెయ్యోవంతుకాని వధింపబడో, మరణం పొందో ఉందురని తలచుకొన్నప్పుడు దేవానాంప్రియునికి శోకం కలుగుతున్నది. అపకారం చేసినవాడిని క్షమింపవలసిందేనని దేవానాం ప్రియుని అభిప్రాయము. //……
పై శాసనంలో అశోకుడు తాను కలిగించిన నరమేధానికి పశ్చాత్తాపం ప్రకటించాడు. ఇది ప్రపంచ రాజరిక చరిత్రలో ఒక రాజు తాను చేసిన యుద్ధంలో జరిపిన నరమేధానికి చింతిస్తూ బహిరంగ క్షమాపణ ప్రకటించిన ఏకైక సంఘటన. అయినప్పటికీ జాగ్రత్తగా గమనిస్తే అశోకుడు యుద్ధాన్ని తప్పు అని చెప్పలేదు. యుద్ధంలో జరిగిన ప్రాణనష్టానికి మాత్రమే దుఃఖించాడు.
ఇదే శాసనంలో – ఆనాటి సమకాలీన గ్రీకు రాజు Antiochus ని తన మిత్రుడు అని చెబుతూ, అతని పొరుగు రాజులు అయిన Tulamaya, Antekina, Maka and Alikasundale లను కూడా ప్రస్తావించాడు. వీరు వరుసగా- Antiochus II సెల్యూకస్ మనవడు (261 – 246 BCE), Ptolemy II of Egypt (285–247 BCE), Antigonus of Macedonia(276–239 BCE), Magas of Cyrene ( 258 and 250 BCE), Alexander of Epirus (272–255 BCE).
ఈ గ్రీకురాజులు వారి పాలనా కాలాలు ప్రపంచ చరిత్రలో అప్పటికే ఖచ్చితంగా నమోదుచేయబడి ఉన్నాయి. వాటిని బట్టి కూడా అశోకుని కాలాన్ని చాలా స్పష్టంగా చరిత్రకారులు నిర్ధారించగలిగారు. అదే విధంగా పాండ్య, చోళ, సత్యపుత్ర, తామ్రపర్ణి/శ్రీలంక అంటూ దక్షిణభారత సరిహద్దులు కూడా ఆ శాసనంలో చెప్పబడ్డాయి.
***
బి. పరిపాలనా విధానం:
అశోకుడి సామ్రాజ్యం భిన్న జాతుల, భాషల, సంస్కృతుల సమ్మేళనం. విశాలమైన రాజ్యానికి మధ్యలో రాజధాని పాటలీపుత్ర ఉంది. రాజధానినుండి నాలుగు దిక్కులలో ఏవైపు రాజ్యసరిహద్దును చేరాలన్నా 30 రోజుల సమయం పడుతుంది. వెళ్ళిరావాలంటే రెండు నెలలు. ఇది వేసవికాలపు లెక్క. వాగులు పొంగి దారులు మూసుకుపోయే కాలాలలో ఎన్ని నెలలు పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇలాంటి పరిస్థితులలో కేంద్రీయంగా పెద్ద సైన్యాన్ని కలిగి ఉంటూ, ఎక్కడికక్కడ స్థానికులచే పరిపాలన సాగించటం ద్వారా మౌర్యులు అంతటి పెద్ద రాజ్యాన్ని నియంత్రించగలిగారు. చాలా శాసనాలలో – మహామాత్రులు, రజ్జకులు, ఆర్యపుత్రులు, ప్రాదేశికులు అంటూ వివిధ అధికార హోదాలు కనిపిస్తాయి. వీరు స్థానికంగా ఉంటూ రాజాజ్ఞలను అమలుపరిచేవారు. బలమైన గూఢచారి వ్యవస్థ ఉండేది.
VI వ శిలాశాసనంలో- “నేను భోజనం చేసేటపుడు కానీ లేదా నా అంతఃపుర మందిరంలో, వాహనంలో, ఉద్యానవనంలో, రహస్యవిడిదిలో ఎక్కడ ఉన్నప్పటికీ ప్రజలకు సంబంధించిన విషయాలు వేగులు నాకు తక్షణమే చేరవేయాలి. నేను ఆదేశించిన విషయాలను అమలుపరచటంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే వెంటనే మహామాత్రులు నా దృష్టికి తీసుకొని రావాలి” - అధికారులకు, గూఢచారులకు 24/7 అందుబాటులో ఉంటానని చెప్పటం అశోకుని పరిపాలనా శైలిని తెలుపుతుంది.
మనిషి పుట్టుకతోనే ఋషిఋణం, దైవఋణం, పితృఋణం అనే మూడు రుణాలతో పుడతాడని ప్రాచీనుల విశ్వాసం. ఈ ఋణం అనే మెటఫర్ పరిపాలనలోకూడా ఉంటుందని అశోకుడు చెప్పాడు. “ప్రజలకు నేను ఋణపడి ఉన్నాను. వారికి శ్రేయస్సు కల్పించటం ద్వారా వారికి అప్పుపడి ఉన్న ఋణం తీర్చుకోగలను. నా ఈ ఋణం తీరటంలో రాజోద్యోగులు నాకు సహకరించాలి” అని VI వ శిలాశాసనంలో అన్నాడు. ఇది నేటికి కూడా ఒక కొత్త ఊహే.
బౌద్ధం “రాజు దేవతలకు ప్రియమైనవాడు” అంటుంది. బ్రాహ్మణవాద మతంలో “రాజే దేవుడు”. రాజు ఎప్పుడైతే దేవుడుగా మారాడో మంచి పరిపాలన అందివ్వటం ద్వారా “ప్రజల రుణం తీర్చుకోవటం” అనే భావన కు విలువలేకుండా పోయింది. బ్రాహ్మణవాదమతం రాజాదరణ పొందటానికి ఈ “రాజే దేవుడు” అనే ఎర దోహదపడి ఉంటుంది.
నేరములకు సరైన శిక్షలు విధించే అధికారులు అయిన రజ్జుకులను నియమిస్తూ అశోకుడు అ VI వ స్తంభశాసనంలో - “సమర్ధత కలిగిన ఈ దాది నా బిడ్డను సంరక్షించగలదని నమ్మి ఎలాగైతే మనం మన బిడ్డను ఒక దాది చేతుల్లో పెడతామో, అలాగ ఈ రజ్జుకులను ప్రజల హితం కొరకు, సౌఖ్యం కొరకు నేను నియమిస్తున్నాను” అన్న మాటలను బట్టి, అశోకుడు తన సామ్రాజ్యాన్ని ఒక కుటుంబంలా, తనను ఒక కుటుంబ పెద్దలా ఊహించుకొనేవాడని అర్ధమౌతుంది.
“నేను రాజ్యాభిషిక్తుణ్ణయిన ఈ ఇరవై ఆరు సంవత్సరాలలొ ఇరవైఅయిదుసార్లు కారాగృహవాసులను విడుదల చేయించాను” అనే V వ స్తంభ శాసన వాక్యం ద్వారా అశోకుడు కారాగార శిక్ష అనుభవిస్తున్న వారిపట్ల చూపిన కరుణ ప్రకటితమౌతుంది. నేరస్థులపట్ల అతిదయ, అతి క్రౌర్యం కాక మధ్యే మార్గం అవలంబించాలని అధికారులకు ఆదేశించేవాడు.
***
“దేవానాం ప్రియదర్శి చేత రెండు విధాల వారయిన చికిత్సకులు నియమించ బడినారు. మనుష్య చికిత్స, పశుచికిత్స ఏర్పాటు చేయబడినాయి. మనుష్యులకు ఉపయోగించేవి, పశువులకు ఉపయోగించేవి అయిన ఓషధులు ఎక్కడెక్కడ లేవో అక్కడ అంతా అవి తీసుకొని రాబడి నాటింపబడినాయి. ఇట్లే వేళ్లు, పండ్లు ఎక్కడెక్కడ లేవో అక్కడక్కడ అవి తీసుకొని రాబడి నాటింపబడినాయి. పశువులకు, మనుషులకు ఉపయోగించే నిమిత్తం మార్గాలలో చెట్లు నాటబడినాయి. బావులు త్రవ్వబడినాయి.” (II వ శిలాశాసనం)
"రహదారులకు ఇరువైపులా బాటసారులకు, పశువులకు నీడనిచ్చేందుకు మర్రి, మామిడి చెట్లు నాటించాను. ప్రతి ఎనిమిది క్రోసులకు ఒక బావి చొప్పున తవ్వించాను". అని చెప్పుకొన్నాడు. (VII వ స్తంభశాసనం)
అశోకుడు రోడ్లకిరువైపులా చెట్లు నాటించటం, బావులు తవ్వించటం, ఫల వృక్షాలను, ఔషద మొక్కలను ఎక్కడెక్కడి నుంచో తెప్పించి నాటించటం, మనుషుల, పశువుల వైద్యులను ఏర్పాటు చేయటం, పశువులకు, మనుషులకు పానశాలలను నిర్మించటం అనేది నేటికీ అవసరపడే ప్రజాప్రయోజన పనులు.
పై పనులు నేను చేయించాను అని బహిరంగంగా శిలాశాసనం వేయించుకోవటం లో నిజాయితీ కనిపిస్తుంది. ఒక రకంగా రాజే స్వయంగా “పబ్లిక్ ఆడిట్” చేయించుకొంటున్నట్లుగా అనుకోవచ్చు.
3. ప్రజలు
అశోకుని శాసనాలు ప్రధానంగా రాజుకి, ప్రజలకు, రాజుకి అధికారులకు మధ్య జరిగిన సంభాషణలు. వీటిలో ఆనాటి సమాజం గురించిన ప్రస్తావనలు నేరుగా లేకపోయినా పరోక్షంగా గ్రహించవచ్చు.
“దాసుల, భృత్యుల యెడల అనురాగం, ప్రతిపత్తి (రెస్పెక్ట్) కలిగి ఉండాలని” వివిధ శాసనాలలో కనిపిస్తుంది. దాసులు, భృత్యులు సేవక వర్గానికి చెందినవారు. వీరిలో భృత్యులు వారు చేసిన పనులకు కూలి పొందుతారు. ఐచ్ఛికంగా సేవలందించే కూలీలు. వీరికి ఏ మేరకు స్వేచ్ఛ ఉందనేది, అంటే తన సేవలను కావల్సిన యజమానికి అందించగలిగే స్వేచ్ఛ ఉన్నదో లేదో తెలియరాదు. దాసు/దస్యులు ఒకరకంగా బానిసలు. వీరికి స్వేచ్ఛ లేదు. యజమానుల ఆధీనంలో ఉంటారు. చెప్పిన పని చేస్తూ, ఇచ్చిన తిండి తింటూ జీవిస్తారు.
అశోకుని సమాజంలో ఆ కాలపు ఇతర సమాజాలవలే, బానిసత్వం రాజామోదం పొందిన వ్యవహారం. ఈ బానిసలు ఎలా వస్తారు అనేప్రశ్నకు XIII వ శిలాశాసనంలో సమాధానం దొరుకుతుంది. ఆ శాసనంలో “కళింగ యుద్ధంలో లక్షమంది చనిపోగా, లక్షా యాభైవేలమంది జనులు బంధీలుగా తరలింపబడ్డారు” అని ఉంది. బంధీలుగా మార్చి తరలింపబడిన ఈ లక్షా యాభైవేలమందిని బహుశా దస్యులుగా చేసి విక్రయించడమో లేదా Warbooty గా పంచుకోవడమో జరిగి ఉంటుంది.
అశోకుడి కాలంలోనే రాసిన “ఆపస్తంభ ధర్మశాస్త్రం” లో యజమాని తను, తన కుటుంబం పస్తులుండి అయినా దస్యులకు, బృత్యులకు తప్పని సరిగా ఆహారం అందించాలని ఉంది. (ఆపస్తంభ ధర్మసూత్ర 2.9.11)
బుద్ధభగవానుడు ఒకనాడు పుత్త సిగాలా అనే గాహాపతితో (యజమాని) “అతని వద్ద ఉన్న దస్యులను ప్రేమగా చూసుకొమ్మని, వారి శక్తికి అనుగుణంగా పని కేటాయించమని, చక్కని ఆహారము అందించమని, అనారోగ్యానికి గురయితే అవసరమైన శలవులు ఇవ్వమని” చేసిన ఉద్బోధ ఆనాటి సమాజంలోఈ దస్యుల జీవనాన్ని కళ్ళకు కడుతుంది.
***
అశోకుని సామ్రాజ్యం భౌగోళికంగా విభిన్నమైనది. భిన్నజాతుల సమ్మేళనం. అశోకుడు తొమ్మిది రకాల జాతులను పేర్కొన్నాదు. వారు కాంబోజ, గాంధార, Ristikas and Nabhapanktis in the northwest; Paladas, Bhojas, Andhras, Kalingas and Pitinikas in the Deccan. వీరిలో ఎక్కువమంది గిరిజన తెగలకు చెందినవారు.
అశోకుడు వర్ణవ్యవస్థ గురించి ఏ రకమైన ప్రస్తావనలు చేయలేదు. అశోకుని శాసనాలలో చాతుర్వర్ణ వ్యవస్థలో మొదటి వర్గమైన బ్రాహ్మన పేరు మాత్రమే కనిపిస్తుంది. అది ఒక వర్ణంగా కాక, ఒక మతసమూహంగా చెప్పబడింది. అంటే అశోకుడు వాడిన బ్రాహ్మనపాషండులు అనే పదం బ్రాహ్మణవాదమతాన్ని ఆచరించేవ్యక్తులు అనే అర్ధంలో ఉంటుంది తప్ప ఒక సామాజిక వర్గంగా కాదు. సామాన్యశకం రెండో శతాబ్దంకు పూర్వం సంస్కృతం కాని భాషలలో వేసిన శాసనాలలో బ్రాహ్మనికల్ వర్ణవ్యవస్థ గురించి ఎక్కడా కనిపించదని Johannes Bronkhorst అనే చరిత్రకారుని పరిశీలన. ప్రాచీన తమిళ శాసనాలలో కూడా వర్ణ వ్యవస్థ కనిపించదు.
అశోకుడు వర్ణవ్యవస్థ గురించి మౌనంవహించాడా లేక అప్పటికి అది ఇంకా స్థిరపడలేదని భావించవచ్చా అనేది చర్చనీయం.
***
అశోకుని శాసనాలలో స్త్రీల సామాజిక స్థితి గతులను ఊహించగలిగే అంశాలు పెద్దగా ప్రతిబింబించ లేదు. రాణి స్తంభశాసనమని ఒక శాసనం ఉంటుంది. కాని ఇది రాణి తనకు తానుగా ప్రకటించింది కాదు. అశోకుని రెండవరాణి అయిన కారువాకి చేసిన దానాలు, ఒసగబడిన వనాలు, గృహాలు ఆమె పేరనే గణింపబడాలని అశోకుడే స్వయంగా వేయించిన శాసనం ఇది. దీని ద్వారా- రాణికి సొంత ఆదాయవనరులు ఉండేవని, వాటిని ఆమె ఖర్చుపెట్టుకొనే అధికారం ఉందని అర్ధం అవుతుంది తప్ప ఆమెకు గల సామాజిక హోదాలు, బాధ్యతలు తెలియరావు. కొన్ని శాసనాలలో తల్లి, సోదరి, బౌద్ధ భిక్కుణి, మంగళకర దీవెనలు ఇచ్చే స్త్రీ జనం అంటూ సమాజంలోని వివిధ స్త్రీలగురించి ప్రస్తావనలు చేసాడు తప్ప వారి బాధ్యతలు, హక్కులు బోధపడవు. ఇక వేరే ఏరకమైన స్త్రీ ప్రాతినిధ్యం కనిపించదు. అప్పటి సమాజం పితృస్వామికమైనది కావొచ్చు. కాగా బౌద్ధ రచనలలో అశోకుని అయిదుగురు భార్యలు ఉన్నట్లు, వారిలో చిన్న భార్య తిస్సరక్క గయ్యాళిగా వ్యవహరించేదని, బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షాన్ని కూల్చివేసిందని, సవతికొడుకుని అంధుణ్ణి చేసిందని అనేక కథనాలు కనిపిస్తాయి. వీటికి చారిత్రిక ఆధారాలు లభించవు.
4. మతం
బుద్ధునికి, అశోకుని మధ్య కాలంలో బౌద్ధమతం ఎలా మనుగడ సాగించి ఉండేది అనే ప్రశ్న చరిత్రకారులుకు ఒక సవాలు. ఎందుకంటే BCE ఆరవ శతాబ్దం నుండి BCE మూడవ శతాబ్దం వరకూ బౌద్ధమతానికి సంబంధించి చాలా తక్కువ ఆర్కియలాజికల్ ఆధారాలు లభిస్తున్నాయి. ఆ కారణంగా కొందరు బుద్ధుడే లేడని, బుద్ధుడు అనే ఒక కాల్పనికపాత్రను అశోకుడు సృష్టించాడని మూర్ఖంగా వాదిస్తారు. బౌద్ధం పట్ల అనాదిగా బ్రాహ్మణవాదులు చూపిన అలక్ష్యానికి ఇది సమకాలీన కొనసాగింపు.
బుద్ధుని మహానిర్వాణం అనంతరం గంగానది ఎగువ ప్రాంతంలో బౌద్ధమతం స్థిరపడి ఇతర ప్రాంతాలకు క్రమక్రమంగా విస్తరిస్తూన్న కాలంలో అశోకుడు బౌద్ధధర్మాన్ని స్వీకరించి దాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేసాడు. ఈ రోజు దేశంలో అడుగడుగునా ఎక్కడ తవ్వినా లభించే బౌద్ధ విగ్రహాలు, శిథిలాలు కనిపించటానికి కారణం ఆ రోజు అశోకుడు ఇచ్చిన ప్రోత్సాహమే అనేది నిర్వివాదాంశం. అలాగని అశోకునికి పూర్వం బౌద్ధమతం ఉనికి అంతంతమాత్రమే అని చెప్పలేం.
బుద్ధునికి అశోకునికి మధ్య ఉన్న నాలుగు శతాబ్దాల అంతరంలో బౌద్ధమత ఉనికికి ఈ క్రింది ఆధారాలు నేడు మనకు లభిస్తున్నవి.
నేపాల్ లోని బుద్ధుని జన్మస్థలమైన లుంబినిలో మాయాదేవి ఆలయం వద్ద జరిగిన తవ్వకాలలో BCE ఆరోశతాబ్దానికి చెందిన వృక్ష ఆరాధన చిహ్నాలు లభించాయి. ఇవి బౌద్ధం ప్రారంభదశలనాటి నిర్మాణాలు కావచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు.
1950 లలో వైశాలి వద్ద జరిపిన పురావస్తు తవ్వకాలలో మట్టితో నిర్మితమైన స్తూపం బయటపడింది. ఇది అశోకుడి కంటే ముందు కాలానికి చెందిందిగా గుర్తించారు. [2]
Piprahwa/కపిలవస్తు స్తూపం వద్ద ఒక భరిణిలో దొరికిన బుద్ధునివని చెప్పబడే అవశేషాలను 1971 లో K.M. Srivastava కార్బన్ డేటింగ్ చేయించగా, అవి క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దానికి చెందినవి గా నిర్ధారణఅయింది . [3]
బుద్ధుని జీవితంతో సంబంధం కలిగిన 6 ప్రదేశాలు బౌద్ధులకు పవిత్రమైన దర్శనీయక్షేత్రాలు. అవి- బుద్ధుని జన్మస్థలమైన లుంబిని; సిద్ధార్థుడు సంసారిక జీవితాన్ని గడిపిన ప్రదేశము వైశాలి; సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్ధునిగా అవతరించిన బోధగయ; మొదటి ప్రవచనాన్ని ఇచ్చిన సారనాథ్; చాలాకాలం నివసించి తన బోధనలను అందించిన కోశాంబి, రాజగ్రిహలు. అశోకుడు BCE మూడో శతాబ్దంలో ఈ ప్రదేశాలలో స్తంభాలను నిలబెట్టాడు. అంటే ఈ ప్రాంతాలు అప్పటికే ప్రజలచే దర్శనీయ బౌద్ధక్షేత్రాలుగా గుర్తింపబడి, విరాజిల్లుతుండేవని ఊహించవచ్చు.
అశోకుడి కన్న ముందే కాశ్మీర్ లో బుద్ధిజం ఉండేది. బుద్ధుడు పరినిర్వాణం చెందిన 50 ఏండ్ల అనంతరం ఆనందుని శిష్యుడైన మధ్యాంతిక అనే బౌద్ధ అర్హంతు ద్వారా బౌద్ధమతం కాశ్మీరులో ప్రవేశపెట్టబడిందని Thomas Watter అభిప్రాయపడ్డాడు. అశోకుని కన్న పూర్వం సురేంద్రుడు అనే రాజు బుద్ధిజాన్ని కాశ్మీరు లో ఆదరించాడని కల్హణుడు ప్రస్తావించాడు. [4]
అశోకుని పూర్వం కూడా బౌద్ధం ఈ నేలపై గణనీయంగా మనుగడ సాగించిన వైనాన్ని పై ఆధారాలు ఋజువు చేస్తాయి.
***
BCE 257 June లో వేయించిన I వ లఘు శిలాశాసనంలో తాను బౌద్ధాన్ని స్వీకరించినట్లు అశోకుడు ఇలా చెప్పుకొన్నాడు. “నేను ఉపాసకుడిగా మారి రెండున్నర సంవత్సరములు కావచ్చింది. ఒక సంవత్సరం క్రితం సంఘాన్ని సందర్శించాను. అప్పటినుంచీ మిక్కిలి ఉత్సాహవంతుడనై ఉన్నాను. జంబూద్వీపములో జనులకు తెలియని దేవతలను నేను జనులతో కలిపాను. ఈ ఉత్సాహానికి కారణం అదే. గొప్పవారు మాత్రమే కారు క్రిందిస్థాయి వారు కూడా సాధనచేసినట్లయితే, గొప్ప స్వర్గాన్ని అందుకోగలరు”.
పై శాసనాన్ని అశోకుడు భారతదేశం అంతటా వేయించాడు. ఇవి ఇప్పటివరకూ భౌగోళికంగా 14 వేరు వేరు చోట్ల దొరికాయి. ఈ శాసనంలో అశోకుడు మొదటిసారిగా ఉపాసక, సంఘ అనే బౌద్ధ పరిభాషను ఉపయోగించాడు. “జనులకు తెలియని దేవతలను నేను జనులతో కలిపాను” అనే వాక్యం ఆసక్తిదాయకం. అప్పటివరకూ ప్రబలంగా లేని బౌద్ధమతాన్ని ఎక్కువమంది ప్రజలకు చేరవేయగలిగానని చెబుతున్నట్లు అర్ధం వచ్చింది.
అదేవిధంగా “క్రిందిస్థాయివారు కూడా సాధనచేసినట్లయితే” అనే మాట కూడా – ఆనాటి సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వర్గాలకు కూడా ఈ మతాన్ని చేర్చానని అశోకుడు చెబుతున్నాడా అనేది ఆలోచించాల్సిన విషయం.
***
ఎ. ధర్మప్రచార యాత్రలు:
సాధారణంగా చక్రవర్తులు తన రాజ్యంలో పర్యటిస్తూ, సామంతులు, అధికారులతో దేశ భద్రత, అంతఃకలహాలు, పన్నుల రాబడి, చేపట్టాల్సిన నిర్మాణాలు, ప్రజల క్షేమం లాంటి అంశాలను చర్చిస్తారు. ఇంకా విందు వినోదాలలో సేదతీరతారు.
తన పదకొండవ పాలనా సంవత్సరం BCE 258 లో మృగయవినోద యాత్రలకు బదులుగా బౌద్ధ తీర్థయాత్రలకు వెళ్లాడు అశోకుడు.
ఆ విషయాన్ని VIII వ శిలాశాసనంలో ఇలా చెప్పుకొన్నాడు-“ఒకప్పుడు దేవానాంప్రియుడు విహారయాత్రలు చేసేవాడు. కానీ ఇక్కడ అతను సంబోధి (బోధగయ) నగరానికి ధర్మయాత్ర చేసినాడు. ఈ యాత్రలలో శ్రమణ, బ్రాహ్మణులను దర్శించి వారికి సువర్ణదానాలు ఇవ్వటం, దేశప్రజలకు ధర్మోపదేశం చేయటం జరుగుతూ ఉండెను”
అశోక చక్రవర్తి తీర్థయాత్రలు చేయటం ఆనాటి రాజరికపు అలవాట్లలో కొత్తది. అప్పటి మత వ్యవహారాలలో బ్రాహ్మణులు, శ్రమణులు రెండు భిన్న దృవాలు. ఒకరు బ్రాహ్మణవాద ధర్మాన్ని అవలంబిస్తే, మరొకరు బౌద్ధ లేదా జైన ధర్మాలను ప్రచారించేవారు. తీర్థయాత్రలు చేస్తూ ఇలా బ్రాహ్మణ, శ్రమణులను దర్శించటం, వారికి దానాలొసగటం, ప్రజలకు బౌద్ధ ధర్మప్రచారం చేయటం లాంటి పనులు ఆ తరువాత కూడా అశోకుడు కొనసాగించి ఉంటాడు. ఎందుకంటే మరో పదేళ్ల తరువాత బుద్ధుని జన్మస్థలం అయిన లుంబినిని దర్శించుకొని ఆ సందర్భాన్ని లిఖిస్తూ అక్కడ ఒక స్తంభాన్ని పాతించాడు.
BCE 248 లో వేయించిన లుంబిని స్తంభ శాసనంలో అశోకుడు ఇలా అన్నాడు..........“బుద్ధ శాక్యముని ఇక్కడ జన్మించినందువల్ల, దేవానం ప్రియదర్శి రాజు తన రాజ్యాభిషేకకాలం ఇరవయ్యో సంవత్సరంలో ఇక్కడకు స్వయంగా వచ్చి దీనిని పూజించాడు. భగవానుడయిన బుద్ధుడు ఇక్కడ జన్మించాడని తెలపడానికి ఇక్కడ ఒక శిలాస్తంభాన్ని స్థాపించాడు. లుంబినీ గ్రామంవారు పన్నులు చెల్లింపనక్కర లేకుండా కట్టడి చేశాడు”
అశోకుడు ధర్మయాత్ర జరుపుతూ తన రాజ్యం నలుమూలలా శాసనాలు వేయించగలిగాడు. బుద్ధభగవానుడు జన్మస్థలం వద్ద నివసించే ప్రజలకు పన్ను మినహాయింపు నివ్వటం ఒక ఉదారపూర్వక చర్య. ఈ శాసనాలలో తన మతపరమైన విశ్వాసాలను స్పష్టంగా ప్రజలకు తెలియజేయ గలిగాడు. తనతో చేతులు కలిపి, తన విశ్వాసాలను స్వీకరించమని ఈ శాసనాలద్వారా అశోకుడు తన రాజ్యప్రజలకు ఆహ్వానం పలికాడు.
బి. దిశానిర్ధేశం:
కలకత్తా, బైరాతు పట్టణానికి సమీపంలో కొండగుట్టలమీద ఒక శిలపై ఒక శాసనము చెక్కిఉన్నది. దీనిలో అశోకుడు బౌద్ధాచార్యులను, భిక్ష, భిక్షుణి వర్గాలను ఉద్దేశించి వారేమేమి గ్రంథాలను చదవాలో, నిత్యం మననం చేయాలో చెప్పాడు.
ఈ శాసనములో అశోకుడు..........“మగధరాజయిన ప్రియదర్శి సంఘానికి అభివాదనం చేసి, వారు నిర్బాధంగా, సౌఖ్యంగా ఉండవలెనని కోరుతున్నాడు.// అయ్యలారా సద్ధర్మం చిరస్థాయిగా ఉండగలదు. 1. వినయమత్కరం 2. ఆర్యవంశాలు 3. అనాగత భయాలు 4. మునిగాథలు 5.మౌనేయ సూత్రాలు 6. ఉపతిష్య ప్రశ్నలు 7. రాహుల వాదం, మొదలుగా భగవానుడయిన బుద్ధుడు అసత్యాన్ని గూర్చి తెలిపిన అంశాలను, అయ్యలారా, అనేక భిక్షువర్గాలు, అనేక భిక్షుణీ వర్గాలు ఆ ధర్మాల అర్ధాలను పదే పదే వింటూ వాటిని గూర్చి ధ్యానించెదరుగాక అని నేను కోరుతున్నాను//”
మొత్తం అశోకుని అన్ని శాసనాలలో ఇది మాత్రమే నేరుగా భిక్షుకులను సంబోధిస్తుంది. ఈ శాసనంలో అశోకుడు తనని తాను దేవానాం ప్రియుడు అని చెప్పుకోడు, మగధరాజుగా సంబోధించుకొన్నాడు. బహుశా తాను మాట్లాడుతున్నది బౌద్ధగురువులతో కనుక దేవతలకు ఇష్టమైనవాడు అని చెప్పుకోలేదని అనుకోవచ్చు. ఈ శాసన శైలి ఎంతో వినయంగా ఉంది. భంతే (బౌద్ధావలంబి) అనే మాటను పదే పదే ఉపయోగించాడు. ఈ శాసనంలో అశోకుడు చెప్పిన బౌద్ధ గ్రంథాలలో కొన్ని తెలియరావు.
ఇవి ఆనాడు ప్రముఖంగా ఉండిన బౌద్ధ సాహిత్యం కావొచ్చు. 1. వినయసముకసె- ఇది సంఘంలో క్రమశిక్షణ నియమాలను తెలుపుతుంది. 2. అలియవసాని – ఇది బౌద్ధ సన్యాసి పాటించాల్సిన మార్గదర్శనాలను చెబుతుంది. 3. అనాగత భయాలు- బౌద్ధసన్యాసులు ఎదుర్కొనే ప్రమాదాలగురించి. 4&5 మునిగాథలు, మౌనేయ సూత్రాలు- ఇవి బౌద్ధ సన్యాసి లక్షణాలను, సన్యాసం యొక్క స్వభావంలను వర్ణిస్తాయి. 6. ఉపతిశ్య ప్రశ్నలు- బుద్ధుని శిష్యుడు సరిపుత్త బుద్ధభగవానుని తో చేసిన తాత్విక సంభాషణలు. 7. రాహులో వాద- బుద్ధుడు రాహులునికి ఇచ్చిన ఉపదేశం.
సంఘంలో క్రమశిక్షణ, అంకిత భావం పెరగటానికి పై ఏడు గ్రంథాలను అశోకుడు ప్రతిపాదించాడు. వాటిని అందరూ పదే పదే పఠించాలని కోరాడు. I వ లఘుశిలాశాసనంలో అశోకుడు “నేను ఉపాసకుడిగా మారి రెండున్నరేళ్ళు అయింది. సంఘాన్ని దర్శించాకా ఉత్సాహంగా ఉంది” అన్న అశోకునికి , బౌద్ధం పట్ల పాండిత్యం, అవగాహన నిండిన ఈ శాసనవాక్యాలురాసిన అశోకునికి మధ్య ఎంతో పరిపక్వత కనిపిస్తుంది. ఈ శాసనం ఎప్పుడు వేయించాడో తెలియరాదు కానీ బహుశా పది పదిహేను ఏండ్ల పాటు సాగించిన బౌద్ధ గ్రంథాల అధ్యయనం తరువాత వేయించి ఉండొచ్చు.
సి. సంఘబేధం:
బౌద్ధసంఘంలో బేధాలు సృష్టించి విడదీసే ప్రయత్నాలు అప్పట్లోనే మొదలయ్యాయని, వాటిని నివారించటానికి అశోకుడు క్రమశిక్షణా చర్యలను ప్రతిపాదించాడని కొన్ని శాసనాలద్వారా తెలుస్తుంది.
సారనాథ్ స్తంభశాసనంలో సంఘబేధం గురించి ఇలా ఉన్నది…......“//సంఘాన్ని ఎవడూ విడదీయకూడదు. భిక్షుకుడు కాని, భిక్షుకి కాని ఎవరైనా సంఘాన్ని విడదీస్తే వారికి తెల్లదుస్తులు కట్టించి మరోచోట నివసించేట్లు చేయాలి//
సంఘబేధం అంటే సంఘనియమాలను అతిక్రమించటంగా తీసుకోవాలి. సంఘంలో నివసించేవారు కాషాయ దుస్తులు ధరిస్తారు. ఇలా సంఘంలో చీలికలు తీసుకువచ్చేవారికి తెల్లదుస్తులు ధరింపచేసి సంఘానికి వెలుపల నివసించేలా చేయటం అంటే ఒకరకంగా వారిని సంఘంనుంచి వెలివేయటం.
పై వాక్యాలకు కొనసాగింపుగా, ఈ శాసనాన్ని అధికారులు ఎలా అమలుచెయాలో ఉత్తర్వులు కూడా కనిపిస్తాయి. అవి....……// “ఈ శాసనం యొక్క ప్రతిని ఈ కార్యాలయం (మహామాత్రు అధికార) లోను మరొక ప్రతిని ఉపాసకుల గృహంలోను ఉంచవలెను.
ఉపవాసదినాలలో ఈ శాసనం లోని విషయాలపట్ల ఉపాసకులందరూ విశ్వాసం కల్గి ఉండేలా చెయటానికి మహామాత్రులు కూడా అక్కడకి తప్పక పోతుండవలెను. మీ అధికార పరిథి ఎంతవరకూ ఉందో అంతవరకూ ఒక ఉద్యోగిని ఈ శాసనాన్ని చెప్పటానికి పంపవలెను”
పై వాక్యాలు అశోకుడు తన ఉత్తర్వులను అమలు పరిచే విధానాన్ని తెలియచేస్తుంది. ఈ రకపు SOP లు మరే ఇతర శాసనాలకు లభించలేదు. ఒక రాజశాసనం ఎలా ప్రజలలోకి తీసుకెళ్ళబడేదో పై వాక్యాలు చెబుతాయి. అశోకుడు పై శాసనంయొక్క రెండు ప్రతులు మహామాత్రులకు పంపించి ఉంటాడు. ఒకదానిని వారి కార్యాలయంలో ఉంచుకొని మరొకదానిని తన అధికారికపరిథి లో ఉన్న అందరు సంఘ ఉపాసకులకు ప్రదర్శించి, నెలకి ఒకసారి జరిగే వారి సమావేశాలలో ఈ శాసనాన్ని వారికి చేరేలా చూడమని మహామాత్రులను కోరుతున్నాడు. ఇదంతా సంఘాన్ని బలహీనపరచే శక్తులను అశోకుడు ఎదుర్కొన్న తీరుగా గుర్తించాలి.
***
డి. లౌకిక వాదం:
బ్రాహ్మణవాద సాహిత్యంలో వేదాలను ధిక్కరించిన, వేదధర్మమును ఖండించిన వారిని పాషండులని పేర్కొనడం జరిగింది. ఈ సమూహంలో బౌద్ధులు, జైనులు, ఆజీవికులు, చార్వాకులు మొదలగు వివిధ వేదవిరుద్ధచరణము కలిగినవారిని చేర్చారు. అశోకుని శాసనాలలో పాషండ అనే పదం అనేక సార్లు వస్తుంది. అశోకుని కాలంలో ఈ పాషండ పదానికి ఆ విధమైన నిందార్థం లేదు. తటస్థ అర్ధం ఉండేది. అశోకుని రాజ్యంలో బౌద్ధం, జైనం, ఆజీవికం వంటి ప్రధాన ధార్మిక మార్గాలు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి అశోకుడు అనేక సార్లు పాసంద(పాషండ) పేరుతో తన శాసనాలలో పేర్కొన్నాడు.
1. దేవానాం ప్రియుడు సమస్త పాషండ జనులందరకూ సన్యాసులైనా, గృహస్థులైనా, దానములు ఇచ్చి, ఇతర సత్కారములు చేసి గౌరవించుచున్నాడు. //
.............//ఒక పాషండ శాఖ/మతం కి చెందిన వ్యక్తులు అసందర్భంగాతమ శాఖను పొగుడుకోవడం, ఇతర శాఖ/మతాలను నిందించడం చేయరాదు. పరశాఖల/మతం వారిని కూడా గౌరవించవలెను. ఇట్లు చేయుట వలన తన మతాన్ని అభివృద్ధి చేసుకోవటంమే కాక ఇతర శాఖలవారికి ఉపకారం కలిగించిన వారు అయెదరు. తన వారిని స్తుతిస్తూ ఇతరశాఖల వారిని నిందించేవాడు తన శాఖకే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు// సమస్త జనులకు ధర్మాభివృద్ధే ముఖ్యము తప్ప దానం కాని, పూజ కాని అంత ముఖ్యాలు కావు అని దేవానాం ప్రియుడు తలుస్తున్నాడు. (XII శిలాశాసనము)
పై వాక్యాలు నేరుగా భిన్న మతావలంబులను సంబోధిస్తున్నాయి. ఒకరినొకరు గౌరవించుకోండి, మర్యాద ఇచ్చిపుచ్చుకోండి అని పలుకుతున్నాడు అశోకుడు. అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించి, దాన్ని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాడని సంప్రదాయకథనాలు చెబుతాయి. కానీ శాసనాలలో అలా కనిపించదు- అన్ని ఆరాధనవిధానాలతో పాటు బౌద్ధాన్ని కూడా పోషించాడు తప్ప బౌద్ధమతానికి పెద్దపీటవేసినట్లు ఉండదు. ఇదే రెండువేల ఏళ్ళ క్రితం అశోకుడు ప్రపంచానికి చాటిచెప్పిన లౌకికభావన.
2. “ఉత్తరపశ్ఛిమ ప్రాంతాల యవనులలో తప్ప మిగిలిన అన్ని దేశాలలోను బ్రాహ్మణులు, శ్రమణులు ఉన్నారు. ఏదో ఒక విశ్వాసాన్ని పాటించని పాషండులు లేని భూభాగమే లేదు ఈ జగతిని” అంటూ తన రాజ్యంలో ఉన్న మతవైవిధ్యాన్ని స్పష్టంగా చెప్పాడు అశోకుడు. (XIII వ శిలాశాసనము). యవనులు కూడా ఏదో ఒక ఆరాధనా విధానాన్ని కలిగి ఉండేవారని తెలుస్తుంది.
3. // భిన్నశాఖలకు చెందిన పాషండులందరిని నేను గౌరవించాను వివిధ రకాలుగా పూజించాను. జనులవద్దకు నేనే స్వయంగా పోయి కలవటమే నాకు ప్రధానం. నా రాజ్యాభిషిక్తకాలం ఇరవై ఆరోఏట నా చేత ఈ ధర్మలిపి లిఖించబడింది. (VI స్తంభశాసనం)
4.//సకల పాషండుల వ్యవహారములు చూడటానికి వివిధ మహామాత్రులను నియమించాను. కొందరు బ్రాహ్మనుల, కొందరు ఆజీవికుల, కొందరు నిర్గ్రంథుల (జైనుల) వ్యవహారాలను చూస్తూ ఉండాలని ఆజ్జాపించాను. నా మహామాత్రులు తమకు నియోగింపబడిన సంఘమువారి యందు మాత్రమే కాక ఇతర పాషండ జనులను గురించి కూడా వ్యాపృతులై ఉండెదరు. (VII స్తంభశాసనం)
అశోకుని కాలంలో మతపరమైన బహుళత్వం ఉండేది. ప్రజలు భిన్న మత విశ్వాసాలను కలిగి ఉండేవారు. వారిని పాషండులని పిలిచారు. పై వివిధ శాసనాలలో అశోకుడు పాషండ అనే పదాన్ని భిన్న మతాలు అని చెప్పటానికి వాడినట్లుగా అర్ధమౌతుంది. ఈ పాషండులు సన్యాసి లేదా గృహస్థు జీవితాలను సాగించేవారు. అశోకుడు ఈ భిన్న మతాల మధ్య సఖ్యత నెలకొల్పటానికి ప్రయత్నించాడు. వసుధైకకుటుంబాన్ని స్థాపించాలనుకొన్నాడు.
5.దేవానాం ప్రియుడు సమస్త పాషండ జనులు తమకు ఇష్టము వచ్చిన చోట నివసింపవచ్చునని కోరుతున్నాడు (VII వ శిలా శాసనము)
ఎందుకు అశోకుడు ప్రత్యేకించి అలా చెప్పవలసి వచ్చిందో ఆసక్తి కలిగిస్తుంది. దీనికి సమాధానంగా – ఒకప్పుడు ఈ పాషండులు (భిన్న మతావలంబులు) అశోకుని రాజ్యంలో స్వేచ్ఛగాసంచరించే అవకాశం ఉండేదికాదేమోనని; కొందరు సామంత రాజులు ఏదో ఒక మతాన్ని ఆదరించి ఇతర మతాలను తన రాజ్యం గుండా వెళ్లనివ్వకుండా ఆపేవారని Rajeevi Bhargava అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు.
దీనికి ఆధారాలుగా అశోకుని సమకాలీనుడైన కౌటిల్యుడు పాషండులని ఊరికి వెలుపల ఉంచాలి అనిచెప్పిన మాటలు; అశోకుని తరువాత వ్యక్తి అయిన మనువు – జూదరులని, నేరస్థులను, సారాయి వ్యాపారులను, పాషండులను, రాజు దేశాబహిష్కరణ చెయ్యాలని అన్న మాటలు- చూపారు
ఈ నేపథ్యంలో అశోకుడు, తాను విశ్వసించిన బౌద్ధ మతానికి ఏమాత్రమూ ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని మతాలకు సమాన అవకాశం ఇస్తూ ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించవచ్చునని శాసనం వేయించాడు. అధికారులను పర్యవేక్షించమని ఆదేశించాడు. ఇది అశోకుని పరమతసహిష్ణుతను చూపుతుంది. ఇది ఒకరకంగా ఆధునిక లౌకిక వాదం లాంటిది.
ఇ. అహింసో పరమోధర్మ:
అనేక శాసనాలలో అశోకుడు అహింసను ప్రోత్సహించాడు. హింస కూడదని బోధించాడు. I వ శిలా శాసనంలో “తన రాజ్యంలో ఇక్కడ జంతువులను చంపరాదు; బలి ఇవ్వకూడదు, సమాజ ఉత్సవాల కొరకు జనులు ఒకచోట గుంపులు చేరకూడదు//పూర్వము దేవానాంప్రియుని వంట ఇంటిలో వందలు వేలు జీవజంతువులు ఆహారముకొరకు చంపబడేవి. కాని, ఈ ధర్మశాసనము లిఖించబడిన కాలంలో దినానికి రెండు నెమళ్ళు, ఒక లేడి (అదియును నిత్యమూ చంపబడటం లేదు), ఇట్లా రోజుకు మూడు ప్రాణులు మాత్రమే చంపబడుతున్నవి, ఇక ముందు ఈ మూడు ప్రాణులను కూడా చంపకూడదు” అని చెప్పాడు.
ప్రజలకు తాను ఒక విషయాన్ని చెప్పేటపుడు దాన్ని నేను పాటిస్తున్నాను అని చెప్పుకోవటం ద్వారా వారి విశ్వాసాన్ని పొందే ప్రక్రియగా దీన్ని చూడాలి.
సమాజ ఉత్సవాలలో జంతుబలులు జరిగేవి. అసాంఘిక శక్తులు చెలరేగేవి. మధ్యం ప్రవహించేది. వీటిని అదే కాలానికి చెందిన కౌటిల్యుని అర్ధశాస్త్రంలో ఉత్సవాల రోజులలో మద్యాన్ని ఎవరైనా తయారుచేసి అమ్ముకొనేందుకు రాజు నాలుగు రోజులపాటు అనుమతించాలని ఉంది. అశోకుడు ఈ ఉత్సవాలను, వాటిలో జరిగే జంతుబలులను, మద్యసేవనాన్ని నిషేదిస్తున్నాడు.
"జనులు ఒకచోట గుంపులు చేరకూడదు" అనటం బహుశా మతం అనేది వ్యక్తిగతంగా సాధన చేయాల్సిన అంతర్యానం తప్ప సామాజికంగా గుంపులు గూడి ఆరాధించాల్సిన విషయం కాదని అశోకుని అభిప్రాయం కావొచ్చు.
ఇలా జరగాలని ఆశించటం ఆదర్శవాదం. చాలా సందర్భాలలో ఆదర్శవాదం సామాజికంగా విఫలమవటం చరిత్రలో కనిపిస్తుంది.
ఏడవ స్తంభశాసనం (ఢిల్లీ తోప్రా స్తంభం) లో “మార్గమునందు పశువులకును, మనుష్యులకును, నీడగానుండుటకు మర్రిచెట్లను వేయించితిని, మామిడితోటలను వేయించితిని. ఎనిమిది క్రోసుల కొకటిచొప్పున నూతులను తవ్వించి, వానిలోనికి దిగుటకు మెట్లను కట్టించితిని. పశువులకు, మనుష్యులకు ఉపయోగము నిమిత్తము అనేక పానశాలలను నిర్మించితిని”. అంటూ మనుషులతో పాటు సమస్త జీవరాసి మనుగడకొరకు తాను ఏమేం చేసాడో చెప్పుకొన్నాడు.
అశోకుడు ఒక గొప్ప పాలకుడు మాత్రమే కాకుండా, ఒక గొప్ప పర్యావరణవేత్త కూడా. అతను జంతుబలులను నిషేదించటం ద్వారా వన్యప్రాణుల సంరక్షణ, చెట్లు నాటించటం ద్వారా అడవుల సంరక్షణ, ఒకచోట లభించని ఔషదమొక్కలను వేరేచోటనుంచి తెప్పించినాటించటం ద్వారా జీవవైవిధ్య పరిరక్షణ ఇంకా బావులు తవ్వించటం ద్వారా నీటి సంరక్షణ లాంటి అనేక రకాలుగా పర్యావరణానికి హితం చేసే చర్యలు తీసుకున్నాడు.
అశోకుడు BCE 232 లో మరణించాడు. మొత్తం 36 ఏండ్లు పరిపాలించాడు. ఇతని తరువాత మగథ సామ్రాజ్యాన్ని ఇతని మనుమడు దశరథుడు 8 ఏళ్ళు, సంప్రతి 9 ఏళ్ళు, శాలిశుల్క 13 ఏళ్ళు, దేవవర్మ 7 ఏళ్ళు, శతధన్వన్ 8 ఏళ్ళు, బృహద్రథుఁడు 7 ఏళ్ళు పరిపాలించారు. ఈ బృహద్రథుఁడు BCE 181 లో అతని బ్రాహ్మణ సైన్యాధ్యక్షుడు పుష్యమిత్ర శృంగుడు హత్యచేసి మౌర్యవంశాన్ని తుదముట్టించి శుంగవంశాన్ని స్థాపించాడు. ఈ వంశం137 ఏండ్లపాటు భారతదేశాన్ని పాలించింది.
అశోకుని కొడుకులు మనవలు, తండ్రి తాతల వలే సమర్ధులు కారు. సుదీర్గంగా పాలించలేకపోయారు. అశోకుని వలె ఎవరూ తమ అభిప్రాయాలను శాసనాలుగా నిక్షిప్తం చేయలేదు. అన్ని మతాలను ఐక్యం చేయాలన్న అశోకుని స్వప్నం అతనితోనే అంతరించిపోయింది.
భారతదేశ చరిత్రలో బ్రాహ్మణవాదులు పొందిన రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక అధికారం చాలా ముఖ్యమైనది. దీనిని బ్రాహ్మణీయ అసాధారణత్వం (Brahmanical exceptionalism) అంటున్నారు. అశోకుని రాజనీతి బ్రాహ్మణవాదుల సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను సవాలు చేసింది. దీనికి ప్రతిగా బ్రాహ్మణవాదులు “బ్రాహ్మణీయ అసాధారణత్వాన్ని” బలపరిచే వాదనలను తమ సాహిత్యంలో నిర్మించుకొన్నారు. బుద్ధుడు, అశోకుడు బోధించిన అహింస, కరుణ సూత్రాలకు సమాంతరంగా, రాముడు, యుధిష్టరుడు పాత్రలను సృష్టించి వాటిని, బ్రాహ్మణ వ్యవస్థ యొక్క యోధులు, ధర్మపాలకులుగా చిత్రీకరించుకొన్నారు.
మహాభారతం అశోకునితో సంబంధాన్ని కలిగి ఉంటుందని ప్రముఖ చరిత్రకారిణి Madeleine Biardeau అభిప్రాయపడింది. భారతంలోని యుధిష్టరుడి పాత్ర అశోకుడి పాత్రకు బ్రాహ్మణీయ సాహిత్యరూపం అని ప్రముఖ ఇండాలజిస్ట్ James L. Fitzgerald అభిప్రాయపడ్డాడు.
ఈ ఇతిహాసాలు ఎక్కడా అశోకుని పేరు చెప్పవు. పురాణాలలో ఏదో ఒకటి రెండు వాక్యాల ప్రస్తావన తప్ప అశోకుడి చారిత్రిక పాత్రను పూర్తిగా తుడిచిపెట్టబడింది. బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని అంగీకరించిన యుధిష్టరుని పాత్ర ద్వారా చక్రవర్తి ఎవరైనా సరే బ్రాహ్మణవాదానికి ప్రాముఖ్యతను ఇచ్చి వ్యవహరించాల్సి ఉంటుందని ప్రచారం చేసి తమ బ్రాహ్మణీయ అసాధరణత్వాన్ని పదిలపరచుకొన్నారు.
***
అశోకుని అనంతరం అతని వసుధైకకుటుంబ భావనలు క్రమేపీ తెరవెనక్కి పోయాయి. అశోకుడు బారాబర్ వద్ద కొన్ని గుహలను ఆజీవికులు (ఇదొక మతం అప్పట్లో) కు నిర్మించి ఇచ్చాడు. ఆ దాన శాసనంలో ఆజీవికులు అనే పేరును కొట్టివేసి ఇతరులు ఆ గుహలను ఆక్రమించుకొన్నారు. అదే విధంగా అన్ని ఆరాధనా శాఖలను సూచించే పాషండ అనే పేరును “వేదాలను వ్యతిరేకించే మతం” అనే అర్ధం వచ్చేలా బ్రాహ్మణవాదమతం స్థిరపరచింది.
అయినప్పటికీ రాజు అన్ని మతాలను ఆదరించాలి అనే భావన CE మొదటి శతాబ్దానికి చెందిన హాతిగుంఫా శాసనంలో- జైన ఖారవేలుడు తనని తాను “సర్వపాషండపూజకో” (One who honours all Pasandas) అని సంబోధించుకొని అన్ని పాషండశాఖలను ఆదరిస్తాను అని చెప్పుకొన్నాడు.
ఆ తరువాత మరలా 1800 సంవత్సరాల తరువాత ముఘల్ చక్రవర్తి అక్బర్ ప్రజలందరి విశ్వాసాలను గౌరవిస్తూ Din-i-ilahi (Religion of God) అనే మతాన్ని స్థాపించాడు.
***
పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు అశోకుడి గొప్పతనం తెలుసు. అశోకుడు శిలలపై ఏం లిఖించాడో, ఈ నేలపై ఏ ఏ నిర్మాణాలు చేసాడో నెహ్రూకి అవగాహన ఉంది. తనకూతురికి ప్రియదర్శిని అని అశోకుని పేరుపెట్టాడు. 1931 లో జైలునుండి ఇందిరాప్రియదర్శినికి రాసిన ఒక ఉత్తరంలో అశోకుడి గురించి చెబుతూ “చరిత్రపుటలు లక్షలాది రాజుల పేర్లతో నిండి ఉన్నప్పటికీ, వారి ఘనత, రాజసం, ప్రతిష్టల మధ్య అశోకుని పేరు మాత్రం ప్రత్యేకంగా మెరుస్తుంది…. ఒక గొప్ప కాంతినిండిన నక్షత్రంలా” అని H.G. Wells కొటేషన్ ను ఉటంకించాడు.
అశోకుని ధర్మచక్రాన్ని జాతీయజండాలోకి, నాలుగు సింహాల చిహ్నాన్ని స్వతంత్ర భారతదేశ రాజముద్రగాను నెహ్రూ స్వీకరించాడు. అశోకుని వలె నెహ్రూ కూడా అన్ని మతాలను సమాదరించే లౌకికవాద రాజధర్మాన్ని పాటించాడు. అశోకుని పేరుమీద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు. ఇది అశోకునిపై నెహ్రూకి ఉన్న అమితమైన గౌరవానికి తార్కాణం.
ఈరోజు భారతదేశం నలుమూలలా ఎగిరే జాతీయజండాపై, అధికారిక పత్రాలపై, స్టాంపులపై, ప్రతిఒక్కరి జేబుల్లో కరన్సీ రూపంలో అశోకస్తంభాగ్రంపై నిలచిన సింహాల చిహ్నం ఉండటం – నిజంగా అశోకుడి పునరుజ్జీవనం.
బొల్లోజు బాబా
1. ఈ రచనలో ఉటంకించిన అశోక శాసనముల వాక్యములకు- డా. సివి రామచంద్రరావు రచించిన అశోక ధర్మశాసనాలు, చిలుకూరి నారాయణరావు రచించిన అశోక చక్రవర్తి ధర్మశాసనములు అనే పుస్తకములు ఆధారము.
[2] An Archaelogical history of Indian Buddhism, by Lars Fogelin. Pn. 83
[3] The Relics of Culture, Vol I William Anderson Gittens- pn.78
[4] Some Aspects of Religion and Politics in Ancient Kashmir, Umar Ahmad Khanday, Journal of Critical reviews, Vol issue 01, 2019)
సంప్రదించిన పుస్తకాలు
1. Portrait of Philosopher King, Patrik Olivelle
2. Early Buddhist Visibility, Mizanur Rahman
3. Ashoka in Ancient India, Nayanjot Lahiri
4. Ashoka, The search for India’s Lost Emporer, Charles Allen
5. An archaeological history of Indian Buddhism, Lars Fogelin
6. Asoka and the Decline of the Mauryans, Romila Thapar
7. Internet, Wiki, ChatGPT
No comments:
Post a Comment