Monday, January 15, 2024

లేని గుర్రం కొరకు వెతుకులాట


భారతదేశానికి సంబంధించిన సామాజిక పరిణామక్రమంలో సింధులోయ నాగరికత (హరప్పా) అత్యంత పురాతనమైనది. దీని పరిపక్వ దశ 2600 - 1900 BCE మధ్య నడిచింది.
దీని తరువాత 1500–500 BCE మధ్య చారిత్రిక వేదికమతం విలసిల్లింది. వేదాలు రచింపబడ్డాయి. వేదాలు బ్రాహ్మణవాదానికి పునాదులు వేసాయి. ఋగ్వేద ఆర్యులు మొదట్లో పశుపాలకులుగా జీవనం సాగించి క్రమేపీ అడవులు నరికి వ్యవసాయిక జీవనంకూడా చేపట్టారు. వేదికమతం క్షీణదశకు వచ్చేకాలానికి నగరాలు, పట్టణాలు పెరిగి జైన, బౌద్ధ శ్రమణ సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇవి సంప్రదాయిక వేదికమతానికి పోటీగా నిలిచాయి. మరలా ఆరో శతాబ్దం తరువాత వేదిక మతం అప్పటికి ఉన్న అన్ని ఆరాధనవిధానాలను కలుపుకొని పురాణ హిందూమతంగా అవతరించింది.
 
బ్రాహ్మణవాదులు పురాణహిందూమతం అత్యంతపురాతనమైనదని, దాని నుంచే అన్ని మతాలు ఆవిర్భవించాయని అది అనేక వేల లక్షల సంవత్సరాల క్రితానిదని వాదిస్తారు. తమ విశ్వాసాలు అత్యంతప్రాచీనవైనవని చెప్పటం కొరకు, వైదికమత కాలాన్ని (1500BCE) దాటి మరింత వెనక్కు వెళ్ళి సింధులోయ నాగరికత ప్రజలుకూడా కూడా వేదిక ధర్మం పాటించేవారని చెబుతారు.
ఇది నిజం అవ్వాలంటే వేదాలలో విరివిగా వర్ణించబడిన గుర్రాలు, ఆకులచక్రాల రథాలు సింధులోయనాగరికతలో కూడా కనిపించాలి. ఇలాంటి ప్రయత్నాలకు “గుర్రం” అడ్డుకట్ట వేస్తుంది. ఎందుకంటే గుర్రం భరతఖండానికి దేశీయమైన ప్రాణి కాదు. బయట నుంచి ఆర్యులచే తీసుకురాబడింది.

వేదికఆర్యసమాజం గుర్రం కలిగి ఉన్న, పశుపాలక సమాజము కాగా సింధులోయ ప్రజలు వ్యవసాయక సమాజం. వీరికి గుర్రం తెలియదు.
 
శాస్త్రీయ ఆధారాలను పరిశీలించినపుడు సింధునాగరికత అంతరించిపోయాక మాత్రమే గుర్రం కనిపిస్తుంది. ఇది బ్రాహ్మణవాదులకు మింగుడు పడదు. వేదిక ఆర్యులు సింధులోయ ప్రజల కంటే తరువాత జీవించిన సమాజమని Sir. John Marshal 1931లోస్పష్టంగా చెప్పాడు.
.
1. గుర్రం ఎక్కడినుంచి వచ్చింది?

నేడు మనం చూస్తున్న గుర్రం Pontic-Caspian steppe (నేటి ఉక్రైన్, రష్యా, కజకిస్తాన్ ప్రాంతాలు) అనే ప్రాంతంలో మచ్చికచేయబడి BCE 2200 లో అక్కడినుండి వివిధ ప్రాంతాలకు విస్తరించి, త్వరలోనే ఇది ఆసియా, యూరోప్ ప్రాంతాలకు చేరిందని - Ludovic Orlando నేతృత్వంలో 162 మంది శాస్త్రజ్ఞులు, 273 వివిధ గుర్రాల జీనోమ్ లను పరిశీలించి నిర్ధారించారు. [1]
BCE 1800 నుంచి క్రమక్రమంగా ఆసియాలో ఆకులచక్రాలు కలిగిన రథాల అవశేషాలు, గుర్రాల అస్థిపంజరాలు ఆర్కియలాజికల్ తవ్వకాలలో కనిపించటం మొదలైంది. ఈ కాలానికి సింధులోయ నాగరికత పూర్తిగా క్షీణించింది. అంటే సింధులోయనాగరికత అంతరించాకా గుర్రాలు ప్రవేశించాయి. ఇది చారిత్రికంగా ఆర్యుల వలస వాదాన్ని సమర్ధిస్తుంది. ఎలాగంటే -
భారతీయ ఉపఖంఢంలోకి మూడవ విడత వలస ద్వారా c2000 BCE లో Pontic-Caspian steppe (ఉక్రయిన్, రష్య, కజకిస్తాన్) ప్రాంతాలనుంచి Yamnaya Steppe pastoralist లు గుర్రాలు కట్టిన రథాలపై భారతదేశంలోకి ప్రవేశించారు . వీరు పశుపాలకులు. వీరు తమతో pre-Sanskrit and pre-Indo-Aryan భాషలను తీసుకొని వచ్చారు. వీటినుంచి సంస్కృతం, ఇతర భారతీయ భాషలు ఆవిర్భవించాయి. వీరు ఋగ్వేద ఆర్యులు. అందుకనే ఋగ్వేదంలో గుర్రాలను వర్ణిస్తూ రెండువందలకు పైన శ్లోకాలు ఉన్నాయి.

2. సింధులోయ నాగరికతలో గుర్రం లేదు


సింధులోయ నాగరికత అవశేషాలు లభించిన చోట్ల ఇంతవరకూ జరిగిన తవ్వకాలలో గుర్రానికి సంబంధించి ఒక్క అస్థిపంజరంకానీ, ఎముకలు కానీ లభించలేదు
లభించిన అనేక టెర్రకోట మట్టిప్రతిమలలో ఒక్క గుర్రం బొమ్మకూడా లేదు. ఒకే ఒక్క గుర్రం బొమ్మనొకదానిని చూపుతారు కానీ అది గుర్రమా లేక మరేదైనా మేక లాంటి జంతువా చెప్పలేము.
సింధులోయలో లభించిన కొన్ని వందల ముద్రలలో అనేక ఇతర జంతువులైన ఏనుగులు, పులులు, ఎద్దులు, ఖడ్గమృగాలు, నీల్గై లాంటివి ఉంటాయి తప్ప ఒక్క గుర్రం బొమ్మ కలిగిన ముద్ర లభించలేదు.
సింధులోయ ప్రాంతాలలో గుర్రాల అస్థికలు BCE 1500 నుండి మాత్రమే లభిస్తూండటం కూడా ఋగ్వేద ఆర్యులు గుర్రాలులాగే రథాలు ఎక్కి బయటనుంచి వచ్చిన విషయాన్ని దృవీకరిస్తుంది. కానీ ఈ తమ విదేశీమూలాలను అంగీకరించటానికి బ్రాహ్మణవాదులు సిద్ధంగాలేరు. సింధులోయనాగరికత నుంచీ మేము ఇక్కడే నివసిస్తున్నాము, అప్పటి ప్రజలు వేదావలంబులు, మేము కూడా ఈ దేశపు మూలవాసులమేనని అని నిరూపించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆధునిక జన్యు, భాషాపరమైన ఆవిష్కరణలు వారి వాదనలను బలహీనపరుస్తాయి.

బ్రాహ్మణవాదులు కొందరు చేసే వాదనలు

1. బింబెత్క గుహ చిత్రాలు: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌సేన్ జిల్లాలో ఉన్న బింబెట్క గుహలలో, రాతి యుగం నాటి నుండి మధ్యయుగం వరకు గుహ చిత్రాల సమూహం ఉంది. ఈ చిత్రాలు 7000 సంవత్సరాలకు పైగా పురాతనమైనవిగా భావిస్తారు.
ఈ చిత్రాలలో గుర్రాలు ఉండటాన్ని, భారతదేశంలో గుర్రాలు 7000 సంవత్సరాల నుంచీ ఉన్నాయని కొందరు వాదిస్తారు. కానీ ఈ చిత్రాలు వివిధ కాలాలలో లిఖించబడ్డాయి. మొదటి దశలలో గీసిన చిత్రాలలో ఏ రకమైన గుర్రం బొమ్మలు లేవు. గుర్రం బొమ్మలు ఉన్న కాలం సుమారు 300 BCE గా గుర్తించారు. ఇది భారతదేశంలోని గుర్రాల ప్రాచీనతకు ఏ రకమైన ఆధారం కాజాలదు.
 
2. సినౌలి రథం (Sinauli Chariot) 2018 లో ఉత్తరప్రదేష్ లో సినౌలి వద్ద జరిపిన బృందం అధ్యక్షుడు సంజయ్ మంజుల్- తమకు గుర్రాలు లాగే రథం దొరికిందని అని ప్రతిపాదించగా దానిని చాలామంది అంగీకరించలేదు. ఆర్యులరథానికి ఆకులచక్రాలు ఉండటం ముఖ్యమైన చిహ్నం అని Edwin Bryan అనే ఇండాలజిస్టు అభిప్రాయపడ్డాడు. సినౌలి లో దొరికింది సాలిడ్ చక్రాలు కలిగిన బండిగా గుర్తించారు.

ఈ బండిని లాగేది ఎద్దులా లేక గుర్రమా అనేది నిర్ధారణ కాలేదు. సినౌలిలో దొరికిన బండి సమీపంలో ఏ రకమైన గుర్రం యొక్క అవశేషాలు లభించలేదు.
 
3. సుర్కోతడ (Surkotada Horse-): గుజరాత్ సుర్కోతడ వద్ద Equus caballus జాతికి చెందిన గుర్రం ఎముకలు లభించాయని ఇవి వేదపూర్వకాలానికి చెందినవవిగా గుర్తించారు. (Sharma 1974). కానీ ఈ ఎముకలు గాడిదకు చెంది ఉండవచ్చునని Meadow (1987) అభిప్రాయపడ్డాడు. ఈ ఎముకలకార్బన్ డేటింగ్ పై కూడా అనుమానాలు కలిగాయి. సుర్కోతడ వద్ద లభించినట్లు గా చెబుతున్న ఎముకలు హరప్పా సైటు పై పై పొరలలోంచి లభించాయి, వీటిని మరింత లోతుగా అధ్యయనం చేయవలసి ఉందని Richard Meadow అన్నాడు. [3]

4. 1999లో, NS Rajaraman, హరప్పాలో గుర్రాల ఉనికికి ఋజువులు ఉన్నాయని, గుర్రం ముద్ర కూడా ఉందని పేర్కొన్నారు. కానీ, అమెరికాలోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం చెందిన ఇండాలజిస్టు మైఖేల్ విట్జెల్, డిజిటల్ గ్రాఫిక్స్ ఉపయోగించి సృష్టించిన ఆ ముద్ర ఒక నకిలీ (Hoax) అని నిరూపించారు.[2]
 
ముగింపు

తమ విశ్వాసాలు వేల సంవత్సరాల క్రితానివి, లక్షల సంవత్సరాలకు పూర్వానివి అని చెప్పటం ఆధునిక కాలంలో కుదరదు. ప్రతి దానికి ఆధారాలు చూపాలి. సరైన ఆర్కియలాజికల్, భాషాపరమైన, జన్యుపరమైన ఆధారాలు చూపి ఏ వాదనైనా సహేతుకంగా చెప్పినప్పుడు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇండాలజిస్టుల పరీక్షలకు తట్టుకొని నిలబడగలుగుతుంది. లేకపోతే ప్రపంచ చరిత్రకారులముందు మన వాదనలు Hoax లు గా మిగిలిపోతాయి.
 
బొల్లోజు బాబా

[1] origin-domestic-horses-finally-established
[2] putting-the-horse-before-the-cart-what-the-discovery-of-4000-year-old-chariot-in-up-signifies, Scroll Article
[3] A Comment on “Horse Remains from Surkotada” by Sándor Bökönyi




Wednesday, January 10, 2024

చరిత్రలో వారణాసి పట్టణం

    కాశి నేల ఎంతో మంది ఆథ్యాత్మిక వేత్తలను ఆకర్షించింది. బుద్ధుడు, మహావీరుడు, శంకరాచార్యుడు ఇక్కడకు వచ్చి తమ వచనాలను బోధించారు. కాశిలో సంస్కృతం నేర్చుకోవటానికి ఎంతో మంది యువకులు దేశం నలుమూలలనుండి వచ్చేవారు. తాను రాసిన పద్యాలలో దోషాలున్నాయని పండితులు పరిహసించటంతో పట్టుదలతో ఇల్లువిడిచి కాశీ వెళ్ళి సంస్కృతం నేర్చుకొని వచ్చినట్లు తన ఆత్మకథలో చెల్లపిళ్ళ వెంకటశాస్త్రి చెప్పుకొన్నారు. ఏనుగుల వీరాస్వామి రచించిన కాశీయాత్రచరిత్ర తెలుగులో మొట్టమొదటి ట్రావెలాగ్. గతించిన పెద్దల అస్థికలు కాశీలో నిమజ్జనం చేయటం హిందువులకు ఒక పుణ్యక్రతువు. సంసారాలను త్యజించి సన్యసించినవారు కాశీ మఠాలలో చేరేవారు. జీవిత చరమాంకంలో కాశీలో శివైక్యం చెందితే జన్మరాహిత్యం పొందుతామనే ఆశతో ఎంతో మంది వృద్ధులు కాశీయాత్ర చేసేవారు.

1. కాశీకి ఉన్న వివిధ పేర్లు

    కాశీ అంటే కాంతి నగరం అని అర్ధం. ఈ పేరు కనీసం మూడు వేల సంవత్సరాలనుండి వాడికలో ఉంది. కాశీ సమీప ప్రాంతంలో బుద్ధుడు మొదటిసారిగా బోధన చేసినట్లు ఒక జాతకకథలో ఉంది. కాశీ రాజ్యానికి వారణాసి రాజధాని అని, దీని చుట్టూ అరవై మైళ్ళ పొడవుకల బలమైన గోడలు ఉన్నాయని మరో జాతక కథ చెబుతుంది. “వారణాసి” అంటే వారణ, అసి అనే రెండు నదుల సంగమ ప్రదేశం అని. ఈ రెండు నదులు వెళ్ళి గంగలో కలుస్తాయి.
ఈశ్వరుడు ఈ ప్రాంతాన్ని ఎన్నటికీ చేజార్చుకోను (అ విముక్త) అని అన్నాడట అందుకు ఈ ప్రాంతానికి “అవిముక్త” అనే పేరు కూడా ఉన్నదని ఐతిహ్యం. నిజానికి గుప్తుల కాలంలో కాశీలో అవిముక్తేశ్వరుడు, విశ్వేశ్వరుడు అని రెండు ఈశ్వరాలయాలు ఉండేవి. కాల క్రమేణా జరిగిన విరూపాల కారణంగా అవిముక్తేశ్వరుని ఆలయం కాలగర్భంలో కలిసిపోగా విశ్వేశ్వర ఆలయం మాత్రమే మిగిలింది. ఈశ్వరుడు ఈ ప్రాంతంలొ శాశ్వతనివాసం ఉంటాడు కనుక కాశికి “రుద్రవాస” అనే పేరు వచ్చింది. కాశీలో ఎక్కడైనా శవదహనం చేయవచ్చు కనుక కాశీకి “మహాస్మశాన” అనే పేరు కూడా కలదు

కాశి అంటే నగరంగా మారిన భారతీయ ఆత్మ. కాశీ ఇరుకిరుకు సందులలో తిరగటం అంటే మరో లోకంలో, మరో కాలంలో, మరో మనుషుల మధ్య సంచరించటం. ఒక హిందువునికి కాశీ అంటే ఈశ్వరుని శాశ్వత నివాస స్థలం. కాశి అంటే కాంతి. కాశి అంటే జన్మరాహిత్యాన్ని ఇచ్చే మోక్షం. సాహిత్య, ఇతిహాస, పురాణాల పరంగా కాశీ ఎంతగొప్పదని చెప్పుకొన్నప్పటికీ, కాశీ రాజకీయ చరిత్ర మాత్రం అంత సులభంగా లభించదు.

2. విదేశీయులు చేసిన కాశీ వర్ణనలు

    1584 లో Ralph Fitch అనే ఆంగ్లేయుడు కాశీలో ప్రయాణిస్తూ కాశీని ఇలా వర్ణించాడు--"ఈ ప్రాంతం Gentiles (క్రైస్తవులు కానివారు) తో నిండి ఉన్నది. విగ్రహారాధకులు. చాలా ఆలయాలు ఉన్నాయి. సింహాలు, కోతులు, నెమలులు, స్త్రీ పురుష విగ్రహాలు ఉన్నాయి. కొన్ని విగ్రహాలకు నాలుగేసి చేతులు ఉన్నాయి".

    1668 లో Tavernier అనే ఫ్రెంచి వ్యాపారి కాశీలో బిందుమాధవ స్వామి ఆలయంలో జరిగిన హారతి కార్యక్రమాన్ని ఇలా వర్ణించాడు. (Tavernier వర్ణించిన బిందుమాధవ స్వామి ఆలయం ఇప్పుడు లేదు.)-- "ఆలయ ద్వారం తెరచారు. ఒక తెరను తొలగించగా అందరూ దేవుని విగ్రహాన్ని చూస్తూ నేలపై మూడుసార్లు పడుకొని లేచారు. భక్తులు తెచ్చిన పూలను పూజారికి ఇవ్వగా అతను వాటిని విగ్రహానికి తాకించి తిరిగి ఇచ్చివేసాడు. తొమ్మిది ఒత్తులు ఉన్న ఒక దీపాన్ని భక్తుల వద్దకు తేగా వారందరూ దానికి నమస్కరించారు"

    1824 లో Bishop Reginald Heber కాశీ ఆలయాలను కుతూహలం కొద్దీ చూడటానికి వెళ్ళాడు. అప్పటికి కంపనీ పాలన స్థిరపడింది కనుక ఇతనికి పూర్ణకుంభస్వాగతం లభించి ఉంటుంది. ఆ సంఘటనను -- "నేను ఆలయంలోకి వెళ్ళగానే నా మెడలో పెద్ద పెద్ద పూలదండలు వెయ్యటం మొదలుపెట్టారు. వాటిని తొలగించటం అమర్యాద అని చెప్పటంతో తొలగించలేదు. కానీ పెద్ద పెద్ద దండలు మెడలో వేసుకొని తిరగటం ఇబ్బంది కలిగించింది" అని వర్ణించాడు

    Count Hermann Keyserling బెనారస్ గొప్పతనాన్ని ఇలా అక్షరబద్దం చేసాడు "కాశీ పవిత్రమైనది. గంగానది ఉపరితలంపై తారాడే ఆథ్యాత్మికత, దైవప్రకటన నేను చూసిన ఏ చర్చిలోనూ నాకు సాక్షాత్కరించలేదు. క్రిష్టియన్ మత బోధకుడు అవ్వాలనుకొనే ప్రతిఒక్కరు ఈ గంగానదీ తీరంపై ఒక సంవత్సరం పాటు తన ధార్మిక అధ్యయనం సాగించాలి అప్పుడే అతనికి దైవభక్తి అంటే ఏమిటో తెలుస్తుంది".

3. కాశీనగర ప్రాచీనత

    కాశీకి ఉత్తరంవైపున ఉన్న వారణ నదీ తీరంపై ఉన్న రాజ్ ఘాట్ వద్ద జరిపిన పురావస్తు తవ్వకాలు కాశీ ప్రాచీనతను తెలియచేసాయి. ఈ తవ్వకాలలో BCE తొమ్మిదోశతాబ్దానికి చెందిన కోట గోడలు, కుండ పెంకులు, ఇతర వస్తువులు లభించాయి. అవిముక్తేశ్వర భట్టారక అని పేరు కల ఆరవ శతాబ్దానికి చెందిన ఒక ముద్ర లభించింది. ఇది బహుశా కాశిలోని అవిముక్తేశ్వర ఆలయ ప్రధాన అర్చకుని ముద్ర/సీల్ కావొచ్చును. దీనిపై త్రిపుండ్రాలు, నెలవంక స్పష్టంగా గమనించవచ్చును

    సిద్ధార్ధ గౌతముడు గయలో బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధునిగా అవతరించాక, రెండువందల మైళ్ళు నడుచుకొంటూ కాశీ సమీపంలోని ఒక గ్రామాన్ని చేరుకొని అక్కడ తన ఐదుగురు శిష్యులకు మొదటిసారిగా ధర్మోపదేశం చేసాడు. ఆ ప్రదేశమే కాశికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నేటి సారనాథ్. సారనాథ్ పన్నెండో శతాబ్దం వరకూ అతి పెద్ద బౌద్ధ క్షేత్రం గా ఉండేది.

    జైన మతం కూడా కాశీ తో సన్నిహిత సంబంధాలు కలిగిఉంది. జైన మత ప్రభోధకులను తీర్థంకరులు అంటారు. వీరిలో ఏడవ తీర్థంకరుడైన సుపార్శ్వుడు; క్రీపూ ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఇరవై మూడవ తీర్థంకరుడైన పార్శ్వనాథుడు కాశీలో జన్మించినట్లు జైన రచనలద్వారా తెలుస్తుంది. బుద్ధుని సమకాలీనుడైన జైన మహావీరుడు అనేక మార్లు కాశీని దర్శించి తన బోధనలను అందించాడు. కాశీ లో పార్శ్వనాథునికి ఒక ఆలయం కూడా ఉండేది. ప్రముఖ జైన రచయిత, జిన ప్రభసూరి “ఇద్దరు జైన తీర్థంకరులకు జన్మనిచ్చి, పవిత్రగంగాజలాలతో ప్రకాశించే కాశి ఎవరికి నచ్చదు?” అని కాశీ గొప్పతనాన్ని స్తుతించాడు.

    బౌద్ధ, జైనాలు వేదాలను తిరస్కరించాయి. వేదాలను అంగీకరిస్తూ, జీవితానికి అర్ధాన్ని, మోక్ష మార్గాన్ని ప్రభోదించటానికి సాంఖ్య, యోగ, మిమాంశ, వేదాంత, న్యాయ, వైశేషిక లాంటి అనేక దర్శనాలను వైదిక ధర్మం భిన్న జ్ఞాన మార్గాలుగా నిర్మించుకొంది. ఒకరితో ఒకరు వాదించుకొంటూ, చర్చించుకొంటూ వేదాల పరిధిలో ఈ దర్శనాల నీడలో తమ ఆథ్యాత్మిక జ్ఞానానికి పదునుపెట్టుకొనేవారు. ఈ కార్యకలాపాలన్నింటికి కాశీ కేంద్రంగా ఉండేది. దేశం నలుమూలలనుంచి విద్యార్ధులు అధ్యయనం కొరకు, పండితులు గోష్టులకొరకు కాశీ వచ్చేవారు.
***
    సంస్కృత వ్యాకరణకర్త పతంజలి, ఆది శంకరాచార్యుడు, రామానుజాచార్యులు, తులసీదాసు, కబీర్ దాసు, వంటి మహామహులందరు కాశీతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు. అంతే కాదు హిందూ ధర్మంలోని వివిధ శాఖలుగా నేడు గుర్తించబడుతున్న, మధ్వ, వల్లభ, తాంత్రిక గోరక్ నాథ, యోగిని, అఘోర, వీరశైవ, కబీర్ పంత్ వంటి అనేక కల్ట్ లపై కాశీ ప్రభావం ఉంది.

    Faxian (ఫాహియాన్-405 CE) సారనాథ్ వారణాసి మీదుగా వెళ్లానని తన రాతలలో ప్రస్తావించాడు.
***

    కాశీ విశ్వనాథుని ఆలయాన్ని ప్రధమంగా ఎవరు నిర్మించారు అనేదానికి నిర్ధిష్టమైన శాసన ఆధారాలు లభించవు. రాజ్ ఘాట్ వద్ద లభించిన ఆర్కియాలజీ ఆధారాలనుబట్టి క్రీస్తుపూర్వమే కాశిలో ఒక శివాలయం మనుగడలో ఉందని భావించాలి.

    విశ్వనాథుని ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్లు అయిదో శతాబ్దానికి చెందిన వైన్యగుప్తుని పేరు ప్రముఖంగా ఇటీవల వినిపిస్తుంది.

    వైన్యగుప్తుడు గుప్తవంశానికి చెందిన రాజు. (507 CE) . ఇతను వివిధ శాసనాలలో శైవునిగా, వైష్ణవునిగా, బౌద్ధాన్ని ఆదరించిన రాజుగా చెప్పబడ్డాడు. ఇతను 500 CE - 508 CE మధ్య కాశీ విశ్వనాథుని ఆలయాన్ని పునర్నిర్మాణం చేసినట్లు బి.హెచ్.యు ప్రొఫసర్ Rana P.B. Singh ప్రతిపాదించారు కానీ ఈ ప్రతిపాదనకు సరైన ఆధారాలు చూపించలేదు.
***

    ఏడో శతాబ్దంలో వచ్చిన హ్యుయాన్ త్సాంగ్ వారణాసిని ( Polonisse) ఇలా వర్ణించాడు --"వారణాసి మూడుమైళ్ళ పొడవు, ఒక మైలు వెడల్పు తో పశ్చిమం వైపున గంగానదిని కలిగిన నగరము. జనభా సాంద్రత ఎక్కువ. వివిధ ఘాట్లతో నగరపు అంచులు దువ్వెన పళ్ళవలె ఉన్నాయి.

    ఎక్కువమంది ప్రజలు సంపన్నులు, మర్యాదస్తులు, విద్యాధికులు. వారి ఇండ్లలో విలువైన వస్తువులు ఉన్నాయి. వాతావరణం వ్యవసాయానికి అనుకూలం. అన్నిచోట్లా పచ్చని చెట్లు దట్టంగా విస్తరించి ఉన్నాయి.

    కాశిలో ముప్పైకి పైగా బౌద్ధారామాలు, మూడువేలమంది భిక్షుకులు ఉన్నారు. వందకుపైగా దేవ ఆలయాలు (Hindu), పదివేలకుపైగా దేవ భక్తులు ఉన్నారు. వీరు ప్రధానంగా మహేశ్వరుని పూజిస్తున్నారు. కొంతమంది శిరోముండనం కావించుకొని, మరికొందరు పిలకలతో, ఇంకొందరు దిగంబరంగా, మరికొద్ది మంది ఒంటినిండా బూడిదపూసుకొని ఉన్నారు.

    వారణాసి లోని ప్రధాన మహేశ్వర ఆలయంలో రాగితో చేసిన 100 అడుగుల ఎత్తైన మహేశ్వర విగ్రహం, ఎంతో అందంగా సహజంగా, రాజసం ఉట్టిపడుతూ ఉన్నది

    వారణాసికి ఉత్తర తూర్పుభాగాన అశోకుడు నిర్మించిన 100 అడుగుల ఎత్తైన ఒక స్థూపం ఉన్నది. ఇది అద్దంలా మెరుస్తూ గొప్ప పనితనంతో ప్రకాశిస్తున్నది. (1665 లో ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ ఈ స్తంభం పైకి 35 అడుగుల ఎత్తుతోను, భూమిలోకి మరో ముప్పై అడుగులపైబడి కూరుకుపోయి ఉన్నదని వర్ణించాడు. ఇది అప్పటికి లాట్ భైరవ ఆలయంలో భైరవ స్థంభంగా పూజలందుకొంటున్నది. 1860 లో Sherring అనే చరిత్రకారుడు లాట్ భైరవ స్థంభం అశోక స్థంభమని, లాట్ భైరవాలయం ఒకప్పటి బౌద్ధారామమని గుర్తించాడు - రి. Banaras, City of Light by Eck, Diana P.no 250)

    వారణాసికి పది లీల దూరంలో జింకలవనం పేరిట ఒక సంఘారామం కలదు (సారనాథ్- సారంగ=జింక. ఆరు లీలు = 1మైలు ). అనేక అంతస్తులతో, అద్భుతమైన నిర్మాణ కౌశలంతో అలరారుతున్న దీనిలో 1500 మంది విద్యనభ్యసిస్తున్నారు. ఇక్కడ 200 అడుగుల ఎత్తైన విహారం కలదు. దీని పైకప్పు బంగారు తొడుగు కలిగి ఉంది. వంద వరుసలలో గదులు నిర్మించబడి ఉన్నాయి. ప్రతి వరుస వద్ద ఒక బంగారు బుద్ధుని విగ్రహం కలదు. విహార మధ్యలో ఆరడుగుల ఎత్తైన బుద్ధుని కాంస్యవిగ్రహం జీవకళ ఉట్టిపడుతూ ఉంది."
***

    ఆరో శతాబ్దం వరకూ కాశీ లో శివుడు, విష్ణు, కృష్ణ, వాసుదేవ, బలరామ, స్కంద, సూర్య, శక్తి, దుర్గ, కాళి, చాముండ, చండిక, వినాయక లాంటి భిన్న దేవతారాధన పద్దతులు ఉన్నట్లు పురావస్తుతవ్వకాలలో లభించిన విగ్రహాలు ద్వారా తెలుస్తున్నది.

    ఆరోశతాబ్దంలో గుప్తుల పాలన ముగిసేనాటికి వైష్ణవం, శైవం, శాక్తేయం, సూర్యారాధన లాంటి ప్రధాన ఆరాధనా విధానాలు రూపుదిద్దు కొన్నాయి.
***
    Hye Cho (హే షో) ఇతను బౌద్ధాన్ని అధ్యయనం చేయటం కొరకు 724-727 CE ల మధ్య భారతదేశాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు. కాశీ విశేషాలగురించి హే షో ఇలా అన్నాడు "ఒక స్థూపంపై బుద్ధుని తొలి బోధనలు విన్న ఐదుగురు శిష్యుల ప్రతిమలను చూసాను. ( వారు కౌండిన్య, అశ్వజిత్, వష్ప, మహానమ, భద్రిక)

    ఒక భారీ స్థంభంపై నాలుగు సింహ ప్రతిమలు ఉన్నాయి. ఆ స్థంభం చాలా పెద్దది. ఐదుగురు వ్యక్తులు పక్కపక్కన నుంచునేటంతటి వ్యాసం కలిగి ఉంది. (ఇదే నేటి మనదేశ రాజ ముద్ర. Hye Cho వర్ణించిన స్థంభం నేడు సారనాథ్ మ్యూజియం లో ఉన్నది)
***

    పదకొండు, పన్నెండు శతాబ్దాలలో కాశిని కేంద్రంగా చేసుకొని పాలించిన Gahadavala రాజులు వేయించిన శాసనాలు అనేకం కాశి సమీపంలో లభించాయి. గాహదవాల వంశీకులు తమనితాము గొప్ప శివభక్తులుగా చెప్పుకొన్నారు. 

    ఈ వంశంలోని గోవిందచంద్ర (1114-1155) విష్ణువుని ఆరాధించగా, ఇతని ఇద్దరు రాణులు బౌద్ధాన్ని ఆదరించారు. సారనాథ్ స్థూపానికి చివరి మరమ్మత్తులు చేయించినది ఈ రాణులే. చంద్రదేవ అనే గాహదవాల రాజు కాశీలో ఆదికేశవ విగ్రహాన్ని ప్రతిష్టించి, అనేక కానుకలు సమర్పించుకొన్నట్లు ఒక శాసనం ద్వారా తెలుస్తున్నది.

4. కాశీ ఆలయాల విధ్వంసాలు- పునర్నిర్మాణాలు

    1194 లో మహమ్మద్ ఘోరి సేనాని కుతుబుద్దిన్ ఐబెక్ కాశిని ఆక్రమించుకొని గాహాదవాల వంశానికి చెందిన జయచంద్రుని శిరచ్ఛేధనం గావించి, అక్కడి బౌద్ధ, హిందూ, ఆలయాలను ధ్వంసం చేసాడు. అలా గాహాదవాల వంశం ఘోరమైన పరాజయంతో నమసిపోయింది.

    కాశి హిందూ పుణ్యక్షేత్రంగా క్రమక్రమంగా విస్తరిస్తున్నప్పటికీ సారనాథ్ కూడా ప్రముఖ బౌద్ధ క్షేత్రంగా సమాంతరంగా చాలాకాలం మనుగడ సాగించింది. కుతుబుద్దిన్ ఐబెక్ సేనలు కాశిని, సారనాథ్ ను నేలమట్టం చేసాక, కాశి క్రమేపీ కోలుకొంది కానీ సారనాథ్ కు రాజాదరణ లేకపోవటంతో కోలుకోలేక కాలగర్భంలో కలిసిపోయింది.
***
    ఐబెక్ విధ్వంసానంతరం కాశీ నగరం మధ్యలో విశ్వరూప అనే బెంగాలు రాజు విశ్వేశ్వరుని పేరిట ఒక విజయస్తంభాన్ని నిలబెట్టినట్లు 1212 లో వేయించిన ఒక శాసనం ద్వారా తెలుస్తున్నది.
కాశీ విశ్వనాథుని ఆలయసమీపంలో పద్మ సాధు అనే భక్తుడు పద్మేశ్వర ఆలయాన్ని (విష్ణువు) నిర్మించినట్లు 1353 నాటి ఒకశాసనంలో కలదు. ఇదే సమయంలో మణికర్ణికా ఘాట్ వద్ద మణికర్ణికేశ్వరుని ఆలయనిర్మాణం జరిగింది.

    సికిందర్ లోడి (1489-1517) హయాంలో మరొకసారి కాశి ఆలయాలపై దాడి జరిగింది. ఆ తరువాత ఎనభై ఏండ్లపాటు ఏ రకమైన ఆలయాల నిర్మాణాలు జరగలేదు కాశిలో.

ఇదే కాలానికి చెందిన నారాయణభట్టు అనే పండితుడు విశ్వనాథ ఆలయ శిథిలాలను చూసి, దుఃఖపడి, తన త్రిస్థలసేతు (కాశి, గయ, ప్రయోగ స్థలాలు) అనే గ్రంధంలో (1585) శివ భక్తులను ఇలా ఓదార్చాడు--కాశీ విశ్వేశ్వరుని పురాతన స్వయంభు విగ్రహం పోయినప్పటికీ, మరో మూర్తిని మానవులే ప్రతిష్టించినప్పటికీ, ఈ కష్టకాలంలో దానినే మనం కొలుద్దాం. పాలకులు బలవంతులు కనుక, మూలవిరాట్టు లేకపోయినా ఆ పవిత్ర స్థలాన్నే సందర్శించుకొందాం, ప్రదక్షిణలు చేద్దాం, పూజించుకొందాం"
***

    తొడర్ మల్ అనే రాజు 1585 లో పూర్వీక విశ్వనాథుని ఆలయానికి వందమీటర్ల దూరంలో కొత్తగా మరో ఆలయాన్ని నిర్మించాడు.

(పై వివరాలనుబట్టి ఔరంగజేబు (1669) కంటే ముందే స్వయంభు కాశీ విశ్వనాథుని విగ్రహం తొలగించబడిందని, దాని స్థానంలో మరొకటి ప్రతిష్టించబడిందని అర్ధమౌతుంది)
***
    ఔరంగజేబు హయాంలో కాశీలోని కృత్తివాశేశ్వర, ఓంకార, మహాదేవ, మధ్యమేశ్వర, విశ్వేశ్వర, బిందుమాధవ, కాల భైరవ ఆలయాలు నేలమట్టం చేయబడ్డాయి. చాలాచోట్ల మసీదులు నిర్మించబడ్డాయి.

    1659 లో కృత్తివాశేశ్వర ఆలయం విరూపం చేయబడింది. దాని స్థానంలో ఆలంగిరి మసీదు నిర్మించారు. దానికి సమీపంలో బెనారస్ రాజైన రాజా పత్నిమాల్ పంతొమ్మిదో శతాబ్దంలో ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి కృత్తివాశేశ్వర ప్రతిమను పునప్రతిష్టించాడు.

    1585 లో తొడర్ మల్ పునర్నిర్మించిన విశ్వనాథ ఆలయాన్ని ఔరంగజేబు ఆజ్ఞలతో 1669 లో విరూపం చేసి జ్ఞానవాపి మసీదును నిర్మించారు. ఆలయానికి చెందిన ఉత్తరంవైపు గోడను యధాతధంగా ఉంచేసారు.

    పూర్వీక ఆలయంలోని జ్ఞానవపి (నుయ్యి) మాత్రం అలాగే ఉందని భక్తుల విశ్వాసం. కొందరు స్థానిక రాజులు విశ్వనాథ ఆలయం యొక్క మూల విగ్రహాన్ని భద్రపరిచారు. (ఇది బహుశా తొడర్ మల్ 1585 లో ప్రతిష్టించిన విగ్రహం కావొచ్చు)

    ముస్లిమ్ పాలకులు ఎన్నిసార్లు కాశీ ఆలయాలను విధ్వంసం చేసినా అన్నిసార్లూ హిందువులు వాటిని పునర్నిర్మించుకొంటూనే ఉన్నారు.
***

    1698 లో అంబర్ కు చెందిన బిషన్ సింగ్ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించటానికి ప్రయత్నించగా, జ్ఞానవాపి మసీదు సరిహద్దులు ఎంతవరకూ ఉన్నాయి అనే సమస్య తలెత్తి పని ముందుకు సాగలేదు. బిషన్ సింగ్ తెలివిగా జ్ఞానవాపి మసీదు చుట్టూ ఉన్న ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కొనుగోలు చేసాడు. అలా సేకరించిన స్థలాలలో ముస్లిములవి కూడా ఉన్నాయి.

    1772 లో మరాఠారాజైన మల్హర్ రావ్ హోల్కర్ జ్ఞానవపి మసీదును తొలగించి ఆలయాన్ని నిర్మించాలని ప్రయత్నించి విఫలమైనాడు.

    మల్హర్ రావ్ హోల్కర్ కొడుకు ఖండేరావు హోల్కర్. ఇతని భార్య అహల్యబాయ్ హోల్కర్. మామగారు, భర్త, కొడుకు మరణించాక అహల్యబాయ్ హోల్కర్ రాజ్య పగ్గాలను చేపట్టింది. దేశంలో ఆసేతు హిమాచల పర్యంతం అనేక ఆలయాలను, ధర్మసత్రాలను, నూతులను, ఘాట్ లను ఈమె నిర్మించింది. కాశి, గయ, సోమనాథ, అయోధ్య, మథుర, హరిధ్వార్, కంచి, అవంతి, ద్వారక, బద్రినాథ్, రామేశ్వరం, పూరీజగన్నాథ ఆలయాల పునర్నిర్మాణం/జీర్ణోద్ధరణలో ఈమె పాత్ర ఉన్నదంటే ఆశ్చర్యం కలిగించక మానదు.

    పద్దెనిమిదోశతాబ్దంలో హిందూ మత ఔన్నత్యం నిలబెట్టటంలో రాణి అహల్యాబాయ్ హోల్కర్ పోషించిన పాత్ర చారిత్రాత్మకమైనది.

    1781 లో అహల్యబాయ్ హోల్కర్ జ్ఞానవాపి మసీదుకు దక్షిణం వైపున ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకొని కొత్తగా విశ్వనాథ ఆలయాన్ని నిర్మించింది. పద్దెనిమిదో శతాబ్దాంతానికల్లా ఈ ఆలయమే కాశీప్రధాన ఆలయంగా పూజలందుకోసాగింది. నేడు మనం చూస్తున్న కాశీ విశ్వనాథ ఆలయం ఇదే.

    అహల్యబాయ్ వ్యక్తిత్వానికి అబ్బురపడిన వారెన్ హేస్టింగ్స్ 1781 లో విశ్వనాథ ఆలయానికి సరైన మార్గాన్ని, నౌబత్ ఖానా (ఢంఖా) ఏర్పాటుచేయమని స్థానిక అధికారి ఇబ్రహింఖాన్ ని ఆజ్ఞాపించాడు. ఈ ఆలయప్రాంగణంలో ఉన్న నూతికి జ్ఞానవాపి అని పేరు. ఈ నూతి నీరు జ్ఞానానికి ప్రతిరూపమని దీనిని ఈశ్వరుడే స్వయంగా తవ్వాడని భక్తుల విశ్వాసం.

5. వారణాసి తో మొఘల్ పాలకుల అనుబంధం

    మొఘల్ పాలకుల మతవిధానం చాలా సంక్లిష్టమైనది. భారతదేశాన్ని ఏకీకృతం చేసి ఢిల్లీ కేంద్రంగా ఒక మహా సామ్రాజ్యాన్ని నిర్మించాకా, భిన్న సామంతరాజులు తిరుగుబాటు చేయకుండా అదుపాజ్ఞలలో పెట్టుకోవటం చక్రవర్తి నిర్వహించాల్సిన రాజధర్మం. ఈ సామంతులలో ఎక్కువమంది హిందూ రాజులు. వీరిని నియంత్రించటానికి మతం ఒక బలమైన అంశంగా ఉండేది. ఈ క్రమంలో హిందూమతానికి ప్రధాన కేంద్రంగా ఉండిన వారణాసి తీవ్రమైన ఒడిదుడుకులకు గురవ్వక తప్పలేదు.

    వారణాసిలో హిందూ ఆలయాలను ముస్లిమ్ పాలకులు విధ్వంసం చేసారు అనేది కాదనలేని చారిత్రిక సత్యమైనప్పటికీ, యుద్ధాలు లేని సమయంలో మొఘల్ పాలకులు వారణాసిలో ప్రదర్శించిన మత సహిష్ణుత కూడా అనేక ఉదంతాల ద్వారా చరిత్రలో నిలిచిపోయింది.

• Iltutmish (1211-36) పాలనలో విశ్వనాథ ఆలయ పునర్నిర్మాణము, Alauddin Khilji (1296-1316) హయాంలో పద్మేశ్వర ఆలయనిర్మాణము జరిగాయి.

• హుమాయున్ వారణాసిలోని జంగంబడి మఠానికి నిర్వహణకొరకు మూడువందల ఎకరాల భూమిని దానమిచ్చాడు.

• అక్బర్ భారతదేశంలోని భిన్న మత సంస్కృతులను అర్ధంచేసుకొని గొప్ప సామరస్యతను ప్రదర్శించాడు. CE 1567 లో కాశిలోని ఒక శిథిలాలయాన్ని అక్కడి గవర్నరు బయాజిడ్ బయాత్, ఒక మద్రాస (పాఠశాల) గా మార్చాడనే విషయం తెలుసుకొన్న అక్బర్, అతన్ని ఆ పదవినుంచి తొలగించి, ఆ ఆలయ పోషణకొరకు రెండు గ్రామాలను దానమిచ్చాడు.

• అక్బర్ హయాంలోనే తొడర్ మల్ విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మించాడు. రాజపుత్రులు అనేక ఘాట్ ల నిర్మాణాలు చేసారు. మాన్ సింఘ్ ఆలయాలు, ఘాట్లు, కోట నిర్మించాడు.

• జహంగీర్ పాలనలో వారణాసిలో 70 ఆలయాల నిర్మాణం జరిగింది. ఇదేసమయంలో వారణాసిలో ఇరవైముగ్గురు ముస్లిమ్ యువకులు హిందూ అమ్మాయిలను ప్రేమించి హిందూమతంలోకి మారిపోయిన ఉదంతం కూడా మధ్య ఆశియా యాత్రికుడు అమిర్ అలి బాల్కి తన రాతలలో పేర్కొన్నాడు. ఇది ఆనాటి మత స్వేచ్ఛను తెలియచేస్తుంది.

• షాజహాన్ (1627-58) తనని తాను సంప్రదాయక ముస్లిమ్ రాజు గా ప్రకటించుకొన్నాడు. పాత ఆలయాలను కూల్చరాదు కొత్త ఆలయాలను నిర్మించరాదు అనే షరియత్ నియమాన్ని ఇతను పాటించి పురాతన ఆలయాల జోలికి పోలేదు కానీ వారణాసిలో కొత్తగా నిర్మించిన 76 ఆలయాలను నేలమట్టం చేసాడు.

• షాజహాన్ పెద్దకొడుకు దారా షికో వారణాసిలో కొంతకాలం నివసించి సంస్కృతం నేర్చుకొని, 1656 లో 52 ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించాడు. ఈ అనువాదానికి Sirr-i Asrar (the great Secret) అని పేరు పెట్టాడు. ఈ ఉదంతం వారణాసిలో ఒకనాటి హిందూ ముస్లిమ్ ఐఖ్యతను ప్రతిబింబిస్తుంది.

• వారణాసికి సంబంధించి ఔరంగజేబు పాత్ర వివాదాస్పదమైనది. ఇతను తన 49 ఏళ్ళ పాలనలో చాలా సందర్భాలలో హిందువులపట్ల సహిష్ణుతతో ఉన్నాడు. వారణాసికి సంబంధించి- "కాశిలో కొద్దిమంది ముస్లిం అధికారులు అక్కడి పూజారులను వేధిస్తున్నట్లు, స్థానిక ఆలయాల వ్యవహారాలలో జోక్యం చేసుకొంటున్నట్లు వార్తలు వస్తున్నాయి; అక్కడి హిందువులను కానీ, సంప్రదాయికంగా జరుగుతున్న ఆలయవ్యవహారాలను కానీ ఎవరూ భంగపరచవద్దని ఔరంగజేబు 1659 ఫిబ్రవరి 15 న జారీ చేసిన ఫర్మానాలో స్పష్టంగా పేర్కొన్నాడు.

    1680 లో గంగానదీ తీరంపై నివసిస్తున్న భగవంత్ గోసాయిన్ అనే హిందూ భక్తుడిని వేధించవద్దని స్థానిక అధికార్లను మందలించాడు.

    బ్రాహ్మణులు, ఫకీర్లు ఇళ్ళు కట్టుకొనేందుకు వినియోగించమని 1687 లో రామ్ జీవన్ గోసాయి అనే భక్తునికి కొంతభూమిని దానంగా ఇచ్చాడు. ఇది మసీదుకు సమీపంలోని భూమి కావటం గమనార్హం.
1695 లో ఔరంగజేబు కాశిలోని కుమారస్వామి మఠానికి స్థలాన్ని దానంగా ఇచ్చాడు. అదే విధంగా జంగంబడి మఠానికి కూడా సహాయం చేసాడు. కాశిలోని కేదారేశ్వరుని ఆలయ పునర్నిర్మాణానికి తోడ్పడ్డాడు.

    1669 లో కాశీ విశ్వనాథ ఆలయధర్మకర్తలుగా వ్యవహరిస్తున్న భూస్వాములు కొందరు మొఘలుల అధికారానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసారు. వీరే 1666 లో మరాఠా తిరుగుబాటు దారుడైన ఛత్రపతి శివాజి ఖైదునుండి తప్పించుకోవటంలో సహాయపడ్డారనే అనుమానంతో ఔరంగజేబు కాశీ విశ్వనాథుని ఆలయాన్ని నేలమట్టం చేయమని ఆజ్ఞాపించాడని Aurangzeb, The Life and Legacy of India’s Most Controversial King అనే పుస్తకంలో audrey truschke అభిప్రాయపడ్డారు. (మధురలో జాట్లు తిరుగుబాటు చేసి ఒక మసీదు నిర్వహకుడిని హత్యచేసిన సందర్భంలో కూడా ఔరంగజేబు మధుర ఆలయాన్ని నేలమట్టం చేయమని అనుమతినిచ్చాడు).

    కాశికి సంబంధించి ఔరంగజేబు కొన్నిసార్లు హిందు అనుకూల మరికొన్ని సార్లు ప్రతికూలంగాను ద్వంధ్వవైఖరి ప్రదర్శించాడనే సంగతి పై ఉదంతాలను బట్టి స్పష్టంగా తెలుస్తుంది. ఆ కారణంగానే- ఔరంగజేబు చేసిన ఆలయవిధ్వంసాలను ఆనాటి రాజకీయ అవసరాలుగా గుర్తించాలి తప్ప అతని మతోన్మాద చర్యలుగా తీసుకోరాదని ప్రముఖ చరిత్రకారిణి మాధురి దేశాయ్ అభిప్రాయపడ్డారు. (రి. Benaras Reconstructed, Madhuri Desai, Pn. 6)

6. పునర్వైభవం

    జ్ఞానవాపి మసీదు సమీపంలో అహిల్యాబాయి చేపట్టిన విశ్వేశ్వరుని ఆలయనిర్మాణం పూర్తయ్యాక దేశం నలుమూలలనుండి భక్తుల తాకిడి పెరిగింది. 1720 లో నిర్మించిన అన్నపూర్ణాదేవి ఆలయానికి చెందిన పూజారి పతాంకర్, పీష్వా రాజులను వేడుకొని అక్కడ నిత్యాన్నదానం జరిగే ఏర్పాట్లు చేసాడు. దీనితో విశ్వనాథ, ఇతర ఆలయాలకు విరాళాల వెల్లువ మొదలైంది. 1841 లో నాగపూర్ రాజు (Bhonslas of Nagpur) వెండి సామాగ్రి బహూకరించాడు. లాహోర్ కుచెందిన రంజీత్ సింగ్ విశ్వనాథ ఆలయగోపురానికి బంగారు పూత పూయించాడు. 1828 లో గ్వాలియర్ కు చెందిన బైజాబాయి సింధియా విశ్వనాథ ఆలయానికి ప్రాకారాలతో కూడిన మండపాలను కట్టించింది.

    నేడు కాశిలో కనిపించే కట్టడాలన్నీ అక్బర్ పాలనతరువాత నిర్మించినవే కావటం ఆశ్చర్యం కలిగించక మానదు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన కాశిలో కనీసం వెయ్యేళ్ళ పాతదైన నిర్మాణం లేకపోవటం కొన్ని శతాబ్దాలుగా జరిగిన విధ్వంసానికి అద్దం పడుతుంది. 1765 నాటి ఒక వారణాసి స్కెచ్ లో నగరం విశాలంగా ఎత్తైన భవనాలతో ఉన్నట్లు తెలుస్తుంది. ఎన్ని సార్లు నేలమట్టం చేసిన ఫీనిక్స్ పక్షిలా మరలా మరలా పైకి లేస్తూ వచ్చిందీ నగరం.

7. అల్లర్లు మత ఘర్షణలు

    1809 లో జ్ఞానవాపి మసీదునుండి ముస్లిములను బయటకు పంపివేయాలనే నినాదంతో పెద్ద ఎత్తున మత ఘర్షణలు జరిగాయి. కాశిలో 50 మసీదులు నేలమట్టం చేయబడ్డాయి . ఆనాటి మాజిస్ట్రేట్ Watson, జ్ఞానవాపి మసీదును హిందువులకు అప్పగించి ముస్లిములు అక్కడనుండి తొలిగిపోవాలని ఆదేశించమని ప్రభుత్వానికి సిఫార్సు చేయగా, ప్రభుత్వం అతని ప్రతిపాదనను తిరస్కరిస్తూ March 28, 1810 న వ్రాసిన ఒక ఉత్తరంలో “ఆ మసీదు ఎలా కట్టారన్నది కాదు ముఖ్యం, దాన్ని ఎలా వినియోగించుకొంటున్నారన్నది ముఖ్యం, యధాతధ స్థితిని కొనసాగించటం సముచితం” అని వ్యాఖ్యానించటం గమనార్హం. (రి. thewire.in 27/MAY/2022)
1936 లో జ్ఞానవాపి మసీదు ఉన్న ప్రాంతం వక్ఫ్ బోర్డు కు చెందినదిగా ప్రకటించాల్సిందిగా ఆనాటి మసీదుకమిటీ కోర్టును అభ్యర్ధించగా కోర్టు ఆ కోర్కెను తిరస్కరించింది. 1942 లో మసీదు కమిటి మరలా అభ్యర్ధించగా కోర్టు జ్ఞానవాపి మసీదును అధికారికంగా మసీదుగా గుర్తిస్తూ తీర్పునిచ్చింది. (AIR 1942 Allahabad 353).

    1991 లో హిందువులు జ్ఞాన్ వాపి మసీదులో పూజలు చేసుకోవటానికి అనుమతి నివ్వమని కోర్టును కోరారు.

    ప్రార్ధనాలయాలు 1947 నాటికి ఎవరి ఆధీనంలో ఉంటే వారివి గానే పరిగణించాలని, మార్పులు చేర్పులు చేయరాదంటు 1991 సెప్టెంబరులో కేంద్రప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ తెచ్చింది.

2006, 2010 లలో కాశిలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ లను మరచిపోలేం.

2021 లో ఢిల్లీకి చెందిన కొందరు మహిళలు, జ్ఞానవాపి మసీదులో ఉన్న శృంగార గౌరి దేవికి పూజలు నిర్వహించుకొనటానికి అనుమతినివ్వమని కోర్టును కోరారు. దరిమిలా ఏప్రిల్ 2022 న జ్ఞానవాపి మసీదును వీడియో సర్వే చేసి సమర్పించమని కోర్టు స్థానిక అధికారులను ఆదేశించింది.
దీనితో మరొక సారి పాండోరా బాక్స్ తెరచుకొన్నట్లయింది.


8. ముగింపు

    25/5/2022 నుండి మూడురోజుల పాటు నేను కాశిలో ఉన్నాను., జ్ఞానవాపి మసీదు ఎక్కడో దూరంగా ఉంటుందనుకొన్న నాకు విశ్వనాథుని ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా హిందు ఆలయానికి చెందిన గోడలతో దర్శనమిచ్చింది. ఎందుకో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాను.
యుద్ధ సమయంలో యుద్ధోన్మాదంలో ఆలయాల విధ్వంసం ఒక సహజమైన ఉన్మత్తచర్యగా భావిస్తాను. మధ్యయుగాలలో ఒక రాజ్య ప్రధాన ఆలయాన్ని విరూపం చేయటం ద్వారా ఆ రాజ్యంపై విజయం సంపూర్ణమైనట్లు భావించే వారు. ఈ పనిని వివిధ హిందూ రాజులు కూడా చేసారు. అలా యుద్ధాలలో ఏదైనా ఆలయాన్ని విధ్వంసం చేస్తే యుద్ధానంతరం దానిని తిరిగి నిర్మించుకోవటమూ పరిపాటే. సోమనాథ ఆలయం ప్రతీ వందేళ్లకూ ఓసారి ధ్వంసం చేసినట్లూ దానిని తిరిగి నిర్మించుకొన్నట్లు అనేక చారిత్రిక ఆధారాలు లభిస్తాయి. భారతదేశ చరిత్రలో ఇదొక మెటా నెరేటివ్.

    ఈ క్రమంలో మొఘలులు ఏదైనా ఆలయాన్ని ధ్వంసం చేస్తే దానిని తిరిగి నిర్మించకుండా ఆ ఆలయశిథిలాలపై మసీదులు నిర్మించేవారు. ఇదొక యుద్ధతంత్రంగా పాటించారు చాలాసార్లు. రాజు మతం మారితే ఆలయం కూడా మతం మార్చుకోవటం చరిత్రలో కోకొల్లలుగా జరిగింది. కాశిలో బిందుమాధవ స్వామి ఆలయంలాగ సమూలంగా తొలగించి మసీదు నిర్మించినట్లయితే అది వేరే సంగతి. కానీ పూర్వ ఆలయానికి సంబంధించిన కుడ్యాన్ని, పునాదులను యధాతథంగా ఉంచి నిర్మించటం వల్ల భావోద్వేగాలు చెలరేగటం సహజం. తటస్థంగా ఉండే సెక్యులర్ హిందువు కూడా ఆలయగోడలతో ఉన్న జ్ఞానవాపి మసీదును చూస్తే భావోద్వేగానికి గురికాక తప్పదు.

ఇరుపక్షాలూ పంతాలకు పోకుండా సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవటం దేశ భవిష్యత్తుకు మంచిది అని భావిస్తాను, అలా జరగాలని ఆశిస్తాను.

బొల్లోజు బాబా

4/06/2022

సంప్రదించిన గ్రంధాలు
1. Power, Piety and People by Michael Dumper
2. Banaras Reconstructed, by Madhuri Desai
3. The India They Saw, by Meenakshi Jain
4. Banaras, City of Light by Diana L. Eck
5. Flight of Deities and Rebirth of Temples Episodes from Indian History by Meenakshi Jain
6. On Yuan Chwang's Travels in India, 629-645, by Thomas Watters
7. The Kasi Vishvanatha, Varanasi city, India: Construction, Destruction, and Resurrection to Heritagisation by Rana P.B. Singh and Pravin S. Rana
8. Temple Destruction And The Great Mughals’ Religious Policy In North India: A Case Study Of Banaras Region, 1526-1707 By Parvez Alam
9. Aurangzeb, The Life and Legacy of India’s Most Controversial King by Audrey Truschke
10. Temple desecration and Indo Muslim States by Richard M. Eaton
11. Wikipedia









Friday, January 5, 2024

అశోకుని శాసనాలలో - చక్రవర్తి, ప్రజలు, మతం

అఖండ భారతదేశ నిర్మాత అశోకచక్రవర్తి. గత వంద సంవత్సరాలలో అశోకునిపై 1600 పుస్తకాలు, కొన్ని వేల వ్యాసాలు వచ్చాయి.
 
మనకు ఇద్దరు అశోకులు ఎదురౌతారు. ఒకటి శాసనాలలో, కట్టడాలలో కనిపించే చారిత్రిక అశోకుడు, పాలి, సంస్కృత, సింహళ పురాణాలలో కనిపించే పౌరాణిక అశోకుడు. ఈ రెండు పాత్రలు ఒకదానిని మరొకటి కలుషితం చేయకుండా ఉండవు. అశోకుని గురించి రాసే కథనాలలో చారిత్రిక, పౌరాణిక అశోక పాత్రలు ప్రయత్నంగానో అప్రయత్నంగానో కలిసిపోతాయి.
 
శ్రీలంక, టిబెట్, చైనా దేశాలలో లభించిన బౌద్ధ రచనలద్వారా లభించే అశోకుని జీవితం, తన శాసనాలలో అశోకుడే స్వయంగా చెప్పుకొన్న జీవితానికి పొడిగింపుగా భావించి – చాలామంది చరిత్రకారులు అశోకుడిని ఒక పౌరాణిక పాత్రగా మలిచారు. వీరికి ప్రధాన సాహిత్య ఆధారాలు - బౌద్ధ గ్రంథాలైన దీపవంశ, మహావంశలు; సంస్కృత రచనలైన అశోకవదన, బుద్ధ చరితలు ఇంకా హిందూ పురాణాలలో అక్కడక్కడా వచ్చే అశోకుని ప్రస్తావనలు.
 
రామాయణంలా అశోకుని చరిత్రకూడా భిన్న ప్రాంతాలలో, భిన్న కవులు భిన్న రీతులుగా దర్శించారు. దీనివల్ల జనబాహుళ్యంలో అశోకుని పట్ల అనేక అపోహలు ఉన్నాయి.
 
అశోకుడు అనే రాజు ఒక అనామక రాజు అని, ఇతనిని బౌద్ధ సాహిత్యం మహోన్నత చారిత్రిక పాత్రను ఇచ్చి పెద్ద చేసిందని Christpher Beckwith అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు. కొందరు అశోకుని చారిత్రికతను కూడా ప్రశ్నించారు. కానీ ఈ వాదనలను ఇండాలజిస్టులు తిరస్కరించారు. ఈ రకపు వాదనలు అర్ధరహితం. అశోకుని శాసనాలు లిఖించబడిన బ్రాహ్మి లిపిని ప్రిన్సెప్ ఛేదించాక, ఒక గొప్ప ప్రాచీన చక్రవర్తి జీవితము, సామ్రాజ్యము మనముందు సజీవంగా తిరిగి వచ్చాయి. ఇప్పటికీ అశోకుని వ్యక్తిత్వాన్ని పౌరాణిక కథనాల ఆధారంగా బేరీజు వేస్తూ, చులకనగా మాట్లాడటం, చారిత్రిక అశోకుని పట్ల అనాదిగా బ్రాహ్మణవాదులు చూపిన అలక్ష్యానికి అది సమకాలీన కొనసాగింపు మాత్రమే.
 
అశోకుని పేరుకలిగిన శాసనం, 1915 లో కర్ణాటక, మస్కి అనేచోట దొరికింది. ఇందులో “దేవానాం పియ అశోక” అని ఉంది. అదే విధంగా 1954 లో మధ్యప్రదేష్ , గుజ్జర వద్ద లభించిన మరొక శాసనంలో “దేవానం పియదసి అశోకరాజ” అని ఉంది. గుజరాత్, గిర్నార్ వద్ద లభించిన CE 150 నాటి ఒక శాసనంలో అశోకచక్రవర్తి తవ్వించిన ఒక చెరువును, తాను మరమ్మత్తులు చేయించినట్లు రుద్రదమనుడు అనే రాజు “అశోకుడి” పేరును ప్రస్తావించాడు. అంటే అశోకునికి 300 ఏండ్ల అనంతరం జీవించిన రుద్రదమనుడికి అశోకుడు, అతను చేసిన నిర్మాణాలు గురించి తెలుసు. ఇవన్నీ అశోకుని చారిత్రికత, ఘనతను నిరూపిస్తాయి.
 
దాదాపు అశోకుని కాలంలోనే జీవించిన అలెగ్జాండర్ జీవితాన్ని ఆనాటి సమకాలీన ఇరవైకి పైగా రచనలనుంచి గ్రహించి అతని జీవితచరిత్రను సాధికారికంగా నిర్మించారు చరిత్రకారులు. అశోకునికి సంబంధించి ఒక్క సమకాలీన రచన లేదు. ఇతనికి ఆస్థాన చరిత్రకారుడు లేడు. చారిత్రిక జీవితచిత్రణ లభించలేదు. ఉన్నదల్లా అశోకుడు గతించిన 300 ఏండ్ల తరువాత, పుణ్యపురుషుల జీవనచిత్రణ అంటూ బౌద్ధ రచనలలో లభించే కొంత సమాచారం. ఇది ఏమేరకు చారిత్రికసత్యమో తెలుసుకొనే అవకాశమే లేదు.
 
ఇన్ని ప్రతికూలతల మధ్య చారిత్రిక అశోకుని జీవితాన్ని పునర్నిమించటానికి అశోకుడే స్వయంగా వేయించుకొన్న అనేక శిలాశాసనాలు ఈ రోజు అందుబాటులో ఉన్నాయి. వీటిద్వారా ఆనాటి అశోకచక్రవర్తి జీవితం, అతని ప్రజలు, అతని మతం గురించి చాలా విషయాలు తెలుస్తాయి.

1. అశోకుని శాసనాలు

అశోకుడు తన రాజ్యం నలుచెరగులా తనపేరుతో శాసనాలను చెక్కించాడు. ఇవి అన్నీ ప్రధమపురుషలో అశోకుడే చెబుతున్నట్లు ఉంటాయి. అశోకుడే స్వయంగా చెప్పి రాయించి ఉంటాడు. వీటిని మొత్తం మూడు భాషలు, రెండు లిపులలో రాశారు. ప్రస్తుత భారతదేశంలో బ్రాహ్మీ లిపి, ప్రాకృత భాషలో లిఖించారు, అలాగే ప్రస్తుత పాకిస్థాన్,ఆఫ్గనిస్థాన్ లలో వేయించిన శాసనాలు ఖరోష్టి లిపిలో గ్రీకు, అరామిక్ భాషలలో లిఖించారు. జేమ్స్ ప్రిన్సెప్ 1834 లో బ్రహ్మిలిపిని పరిష్కరించిన తరువాత మరుగునపడిన, జంబూద్వీప చక్రవర్తి అశోకుని జీవితము పునరుజ్జీవం పొందింది.
 
దేశవ్యాప్తంగా ఆనాటి ప్రజలు ప్రాకృత భాషను చదవగలిగి, అర్ధం చేసుకోగలిగేవారని భావించాలి, లేకపోతే ఇన్ని శాసనాలను చెక్కించి ప్రయోజనం లేదు. అలాగని వీటిని ప్రజలకు చదివి వినిపించమని తన అధికారులకు ఎక్కడా సూచనలు ఇచ్చినట్లు లేదు కనుక వీటిని ప్రజలే చదువుకొని ఉండాలి. అంటే బహుశా ప్రజలు 100% అక్షరాస్యులు అయి ఉండవచ్చు. దేశమంతటా అర్ధం అయ్యే ఒక ఉమ్మడి లిపి, ఉమ్మడి భాషను వృద్ధిచేయడం ద్వారా అశోకుడు తన ప్రజలతో సమర్ధవంతంగా సంభాషించగలిగాడు. ప్రాకృత భాషలను తొలగించి వచ్చిన సంస్కృతం ఒక సామాజిక వర్గం గుప్పెట్లో ఉండిపోయింది. దాన్ని ఇతరులకి నేర్పకపోవటంచే అక్షర జ్ఞానం ఎవరికీ దక్కలేదు. తద్వారా ఒకప్పుడు 100% అక్షరాస్యత ఉన్న ఈ దేశప్రజా బాహుళ్యం నిరక్షరాస్యతలోకి కూరుకుపోయింది.
 
అశోకుని శాసన స్తంభాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో లభిస్తున్నాయి. సౌలభ్యం కొరకు వాటిని ఇలా విభజించారు.

1. లఘు శిలాశాసనాలు (Minor rock edicts): ఇవి రెండు మాత్రమే. వీటిలో లఘుశిలాశాసనం I మొత్తం 14 ప్రదేశాలలో, లఘుశిలాశాసనం II మొత్తం 10 చోట్ల లభించాయి.
ఈ శాసనాలలో అశోకుడు బౌద్ధమతావలంబి అయిన సంగతి, ధర్మాచరణకు సంబంధించిన కొన్ని నియమాలు చెప్పబడ్డాయి.
 
2. బృహత్ శిలాశాసనాలు (Major rock edicts): ఇవి మొత్తం 14. శిలాశాసనం I గరిష్టంగా 8 చోట్ల దొరకగా, శిలాశాసనం XIV కనిష్టంగా 3 చోట్ల లభించింది. 
ఈ శాసనాలలో ఆశోకుడు- జంతువథ నిషేదం; ప్రజల సౌఖ్యం కొరకు పాలకునిగా చేస్తున్న పనులు; బౌద్ధ ధర్మాన్ని అభివృద్ధి పరచటం; ప్రజల శ్రేయస్సుకై తాను చేస్తున్న కృషి; పరమత సహిష్ణుత; కళింగయుద్ధం లాంటి అంశాలు ఉన్నాయి.

3. స్తంభశాసనాలు: ఇవి మొత్తం ఏడు చోట్ల లభిస్తున్నవి. వీటిలో – ధర్మపాలన; రాజోద్యోగులు పాటించవలిసిన విధులు; జీవహింస నిషేదం, దర్మప్రచారం లాంటి విషయాలు చెప్పబడ్డాయి.[1]
***

అశోకుని శాసన స్తంభం ఒక్కొక్కటి 9-13 మీటర్ల పొడవు ఉంటుంది. క్రింద 2 మీటర్ల వ్యాసం పైకి వెళ్ళే కొద్దీ సన్నబడుతూ ఉంటుంది. ఇవి సాధారణంగా భూమిలో రెండున్నర మీటర్ల లోతులో ఒక పెద్ద రాతిఫలకపై ఉంచి నిలబెట్టబడి ఉంటాయి. ఈ స్తంభాలు ఏకశిలా నిర్మితాలు. ఒక్కొక్కటి సుమారు 50 టన్నుల బరువు ఉంటాయి. స్తంభాగ్రముపై సింహం, వృషభం, ఏనుగు, గుర్రము, ధర్మచక్రము లాంటి వివిధ శిల్పాలు ఉంటాయి. సారనాథ్ వద్ద లభించిన అశోకుని స్తంభంపై కల నాలుగు సింహాల శీర్ష శిల్పాన్ని భారతదేశ జాతీయ చిహ్నంగా స్వీకరించారు.
 
వీటిని ఎలా సేకరించారు, ఎక్కడ చెక్కారు లాంటి వివరాలు తెలియరావు. అశోకుని స్తంభాలలో ఎక్కువ భాగం ఒకేరకమైన రాతిని కలిగి ఉండటాన్ని బట్టి ఇవి కేంద్రీకృతంగా తయారై, తరువాత ఎక్కడ నిలబెట్టాలో ఆ యా స్థలాలకు రవాణా చేయబడ్డాయని చెప్పవచ్చు. ఈ రాయి ఉత్తర ప్రదేష్ మీర్జాపూర్ జిల్లావద్ద ఉన్న క్వారీలనుంచి సేకరించబడి ఉండవచ్చునని పరిశీలకుల అభిప్రాయం
ఈ స్తంభాల పాలిష్ అత్యుత్తమ మెరుపును కలిగి ఉంటుంది. దీనిని మౌర్యన్ పాలిష్ అంటారు. ఇంతటి నైపుణ్యం ఆ తరువాత మరలా కనిపించలేదు. CE 1357 ఢిల్లీ సుల్తాను ఫిరోజ్ షా తుగ్లక్ తోప్రాలోని అశోక స్తంభాన్ని 42 చక్రాలు కట్టిన బండిమీద, పడవలపైనా ఢిల్లీకి తీసుకువెళ్ళినట్లు చారిత్రిక కథనం నమోదు అయి ఉంది. బహుశా ఈ విధంగానే అశోకుని కాలంలో వీటి యొక్క రవాణా జరిగి ఉంటుంది.
 
ఈ స్తంభాలపై శాసనాలు ముందుగానే ఉల్లేఖించి తరువాతా వాటిని నిలబెట్టటం జరిగింది. ఒక్క అల్లహాబాదు అశోక స్తంభంపై మాత్రం నిలబెట్టిన తరువాత వాటిపై శాసనాలు రాసినట్లు తెలుస్తుంది.
 
అశోకుడు పాతించిన 20 శాసన స్తంభాలను నేడు గుర్తించగలిగారు. ఇవి ఎక్కువగా బౌద్ధ దర్శనీయ క్షేత్రాలకు సమీపంగా ఉన్నాయి. ఇవి మొత్తం ఎన్ని వేయించాడనేది తెలియదు. 40 వరకూ ఉండవచ్చుఅంటారు. వీటిని “ధర్మ స్తంభాలు” అనేవారని 7 వ స్తంభ శాసనం ద్వారా తెలుస్తున్నది. ఇద్దరు స్త్రీలు ఒక అశోక స్తంభానికి శిరస్సులు ఆనించి ప్రార్థిస్తున్న ఒక సాంచి శిల్పం ద్వారా- ఈ స్తంభాలను కూడా ఆనాటి ప్రజలు పవిత్రంగా పూజించేవారని అర్ధమౌతుంది.

2. జంబూద్వీప చక్రవర్తి

అశోకుని శాసనాలలో తన మౌర్య వంశమూలాలను, తన తండ్రి బిందుసారుడు, తాత చంద్రగుప్తుడి పేర్లను ఎక్కడా ప్రస్తావించలేదు. తన పేరు, బిరుదు మాత్రమే చెప్పుకొన్నాడు. బిందుసారుని అనంతరం అశోకునికి సింహాసనం అంత సులభంగా దక్కలేదని, తన నూర్గురు సోదరులను హతం చేసి సింహాసనాన్ని అధిష్టించాడని బౌద్ధ రచనల ద్వారా తెలుస్తుంది. ఈ ఉదంతం జరిగినట్లు ఇతర చారిత్రిక ఆధారాలు లభించవు. ఈ ఘర్షణల కారణంగా తన పూర్వీకుల వారసత్వాన్ని చెప్పుకోవడానికి అశోకుడు ఇష్టపడి ఉండకపోవచ్చునని చరిత్రకారుడు Patrik Olivelle అభిప్రాయపడ్డాడు.
 
ఇది ఆనాటి ఆచారమేమో తెలియరాదు ఎందుకంటే, దాదాపు అదే కాలానికి చెందిన కళింగ ఖారవేలుని శాసనంలో కూడా అతని పూర్వీకుల పేర్లు కనిపించవు.

అశోకుడు తన ముప్పైనాలుగో ఏట BCE 268లో పట్టాభిషిక్తుడయ్యాడు. అంటే ఇతను BCE 302 లో జన్మించి ఉండాలి. అప్పటికి ఇతని తాత చంద్రగుప్తుడు రాజుగా జీవించే ఉన్నాడు. అతను 293 లో మరణించగా, తండ్రి బిందుసారుడు రాజ్యపగ్గాలు చేపట్టే నాటికి అశోకునికి 9 ఏళ్ళ వయసు. అశోకుని తాత, తండ్రులు గ్రీకు రాజ్యంతో ద్వైపాక్షిక సంబంధాలు కలిగి, వారి రాకుమార్తెలను తమ రాణులుగా చేసుకొని ఉన్నారు. రెండుతరాలుగా గ్రీకు వనితలు అంతఃఫుర రాణులుగా ఉండటం చేత, అశోకునికి చిన్నతనంలోనే గ్రీకు దేశ సంస్కృతి సంప్రదాయాలపట్ల అవగాహన ఏర్పడింది
***

XIV నంబరు రాతిశాసనంలో “నా సామ్రాజ్యము సువిశాలమైనది” అన్నాడు అశోకుడు. ఈ సువిశాల సామ్రాజ్యానికి పాటలిపుత్రను రాజధానిగా చేసుకొని పరిపాలించాడు. I వ లఘు శిలాశాసనంలో తన రాజ్యాన్ని జంబూద్వీపమని చెప్పుకొన్నాడు. జంబు అంటే నేరేడు అని అర్ధం. నేరేడు చెట్లు ఉండే ద్వీపం కనుక జంబూద్వీపమని పేరు వచ్చింది అంటారు. ఆకార రీత్యా కూడా భరతఖంఢం నేరేడుపండును పోలి ఉంటుంది. ఈ భరతఖండం అంతటిని ఒకే భౌగోళిక ప్రాంతంగా పరిగణించి జంబూ ద్వీపం అన్నపేరును అశోకుడు మొదటిసారిగా ఉపయోగించాడు.
 
ఇతని శాసనాలు లభించిన ప్రాంతాల ఆధారంగా అశోకుని సామ్రాజ్యం బంగ్లాదేశ్, నేపాల్, కాశ్మీల్, ఆఫ్ఘనిస్తాన్, కర్ణాటక తమిళనాడు మధ్య విస్తరించి ఉండేదని అర్ధమౌతుంది. సంస్కృతి ఆచారవ్యవహారాల పరంగా వైవిధ్యభరితమైనది. ఈ బహుళతను రాజకీయంగా ఏకం చేయగలిగాడు. అశోకుడు తన రాజ్యానికి సరిహద్దులుగా ఉండే ఇతర రాజ్యాలను జయింపబడని రాజ్యాలు (అవిజిత) అని పిలిచేవాడు. ఈ పదం విదేశాంగరాజనీతిలో కత్తివాదర లాంటిది.

అశోకుడి రాజ్య జనాభా సుమారు 2-3 కోట్లు ఉండవచ్చునని Dyson అభిప్రాయపడ్డాడు. అప్పటికి చైనా, రోమన్ సామ్రాజ్యాలు ఇంకా అవతరించలేదు. విస్తీర్ణం, జనాభాల పరంగా అశోకుని సామ్రాజ్యం ప్రపంచంలోనే అత్యంత పెద్దది అయి ఉండే అవకాశం ఎక్కువ.

****

ఎ. కళింగ యుద్ధం: 
అశోకుడు అనగానే వెంటనే స్ఫురణకు వచ్చేది కళింగ యుద్ధం. కళింగరాజ్యాన్ని ఒరిస్సా రాష్ట్రం తమదిగా చెప్పుకొంటున్నప్పటికీ, చారిత్రికంగా కళింగరాజ్యం ఉత్తరాంద్రనుండి రాజమహేంద్రవరం వరకూ విస్తరించిన ఆంధ్రప్రదేష్ భౌగోళిక ప్రాంతం.

BCE 260 అక్టోబరు/నవంబరు నెలలలో అశోకుడు కళింగ రాజ్యం పై దండెత్తాడు. కళింగ రాజ్యం ఎలా ఉంటుంది, ఎందుకు దానిపై యుద్ధం చేయవలసి వచ్చిందో అశోకుడు ఎక్కడా చెప్పలేదు. అప్పట్లో కళింగలో యుద్ధానికి ఉపయోగపడే ఏనుగులు అధికంగా లభించేవి. ఉత్తర దక్షిణభారతదేశాలను కలిపే వ్యాపారమార్గాలు కళింగ మీదుగా వెళ్ళేవి. ఈ రెండు రాజ్యానికి అత్యంత కీలకమైన అవసరాలు. అశోకుడు కళింగపై దండెత్తడానికి ఇవి కారణాలు కావొచ్చునని చరిత్రకారులు ఊహించారు

ఈ యుద్ధం కలిగించిన భీభత్సం అశోకునికి దుఃఖం కలిగించింది. అపారమైన ప్రాణ నష్టం పట్ల అశోకుడు పశ్చాత్తాపపడ్డాడు. ప్రపంచ చరిత్రలోనే ఏ చక్రవర్తి చేయని విధంగా ఇంతటి విధ్వంసానికి కారణమైన “నన్ను క్షమించమని” ప్రజలను కోరాడు. ఇతని క్షమాపణావాక్యాలు రెండువేల మూడువందల సంవత్సరాల తరువాత కూడా మనం చదువుకోగలుగుతున్నాం. ప్రపంచ చరిత్రలో ఇదొక అరుదైన ఘటన.

‍XIII వ శిలాశాసనంలో అశోకుడు ఇలా అన్నాడు “దేవానాం ప్రియదర్శి రాజు పట్టాభిషిక్తుడైన ఎనిమిదవ ఏట కళింగరాజ్యం అతనిచే జయింపబడింది. లక్షా యాభైవేలమంది జనులు బంధీలుగా మారారు. లక్షమంది మరణించారు. మరెంతో మంది విగతులయ్యారు. // వశపడని ఒక రాజ్యం జయింపబడినపుడు అందు జనుల వధ, మరణం, నిరాశ్రయులవటం, దేవానం ప్రియునికి బాధాకరంగాను, శోచనీయంగాను తోస్తున్నది. //

// తమకు అత్యంతప్రియులైన స్నేహితులు, పరిచితులు, సహచరులు, బంధువులు అయినవారికి బాధ కలుగుతున్నప్పుడు తమ స్థితి బాగుండినా వారి బాధ తమకూ బాధాకరమే అవుతుంది. ఈ బాధను అందరూ పంచుకొంటారు. ఇది దేవానాం ప్రియునికి మిక్కిలి శోచనీయంగా ఉంది. //కళింగరాజ్యాన్ని జయించినప్పుడు ఆ దేశ జనులలో నూరోవంతు కానీ వెయ్యోవంతుకాని వధింపబడో, మరణం పొందో ఉందురని తలచుకొన్నప్పుడు దేవానాంప్రియునికి శోకం కలుగుతున్నది. అపకారం చేసినవాడిని క్షమింపవలసిందేనని దేవానాం ప్రియుని అభిప్రాయము. //……
పై శాసనంలో అశోకుడు తాను కలిగించిన నరమేధానికి పశ్చాత్తాపం ప్రకటించాడు. ఇది ప్రపంచ రాజరిక చరిత్రలో ఒక రాజు తాను చేసిన యుద్ధంలో జరిపిన నరమేధానికి చింతిస్తూ బహిరంగ క్షమాపణ ప్రకటించిన ఏకైక సంఘటన. అయినప్పటికీ జాగ్రత్తగా గమనిస్తే అశోకుడు యుద్ధాన్ని తప్పు అని చెప్పలేదు. యుద్ధంలో జరిగిన ప్రాణనష్టానికి మాత్రమే దుఃఖించాడు.

ఇదే శాసనంలో – ఆనాటి సమకాలీన గ్రీకు రాజు Antiochus ని తన మిత్రుడు అని చెబుతూ, అతని పొరుగు రాజులు అయిన Tulamaya, Antekina, Maka and Alikasundale లను కూడా ప్రస్తావించాడు. వీరు వరుసగా- Antiochus II సెల్యూకస్ మనవడు (261 – 246 BCE), Ptolemy II of Egypt (285–247 BCE), Antigonus of Macedonia(276–239 BCE), Magas of Cyrene ( 258 and 250 BCE), Alexander of Epirus (272–255 BCE).

ఈ గ్రీకురాజులు వారి పాలనా కాలాలు ప్రపంచ చరిత్రలో అప్పటికే ఖచ్చితంగా నమోదుచేయబడి ఉన్నాయి. వాటిని బట్టి కూడా అశోకుని కాలాన్ని చాలా స్పష్టంగా చరిత్రకారులు నిర్ధారించగలిగారు. అదే విధంగా పాండ్య, చోళ, సత్యపుత్ర, తామ్రపర్ణి/శ్రీలంక అంటూ దక్షిణభారత సరిహద్దులు కూడా ఆ శాసనంలో చెప్పబడ్డాయి.
***

బి. పరిపాలనా విధానం: 
అశోకుడి సామ్రాజ్యం భిన్న జాతుల, భాషల, సంస్కృతుల సమ్మేళనం. విశాలమైన రాజ్యానికి మధ్యలో రాజధాని పాటలీపుత్ర ఉంది. రాజధానినుండి నాలుగు దిక్కులలో ఏవైపు రాజ్యసరిహద్దును చేరాలన్నా 30 రోజుల సమయం పడుతుంది. వెళ్ళిరావాలంటే రెండు నెలలు. ఇది వేసవికాలపు లెక్క. వాగులు పొంగి దారులు మూసుకుపోయే కాలాలలో ఎన్ని నెలలు పడుతుందో ఎవరూ చెప్పలేరు. ఇలాంటి పరిస్థితులలో కేంద్రీయంగా పెద్ద సైన్యాన్ని కలిగి ఉంటూ, ఎక్కడికక్కడ స్థానికులచే పరిపాలన సాగించటం ద్వారా మౌర్యులు అంతటి పెద్ద రాజ్యాన్ని నియంత్రించగలిగారు. చాలా శాసనాలలో – మహామాత్రులు, రజ్జకులు, ఆర్యపుత్రులు, ప్రాదేశికులు అంటూ వివిధ అధికార హోదాలు కనిపిస్తాయి. వీరు స్థానికంగా ఉంటూ రాజాజ్ఞలను అమలుపరిచేవారు. బలమైన గూఢచారి వ్యవస్థ ఉండేది.

VI వ శిలాశాసనంలో- “నేను భోజనం చేసేటపుడు కానీ లేదా నా అంతఃపుర మందిరంలో, వాహనంలో, ఉద్యానవనంలో, రహస్యవిడిదిలో ఎక్కడ ఉన్నప్పటికీ ప్రజలకు సంబంధించిన విషయాలు వేగులు నాకు తక్షణమే చేరవేయాలి. నేను ఆదేశించిన విషయాలను అమలుపరచటంలో ఏవైనా అడ్డంకులు ఏర్పడితే వెంటనే మహామాత్రులు నా దృష్టికి తీసుకొని రావాలి” - అధికారులకు, గూఢచారులకు 24/7 అందుబాటులో ఉంటానని చెప్పటం అశోకుని పరిపాలనా శైలిని తెలుపుతుంది.

మనిషి పుట్టుకతోనే ఋషిఋణం, దైవఋణం, పితృఋణం అనే మూడు రుణాలతో పుడతాడని ప్రాచీనుల విశ్వాసం. ఈ ఋణం అనే మెటఫర్ పరిపాలనలోకూడా ఉంటుందని అశోకుడు చెప్పాడు. “ప్రజలకు నేను ఋణపడి ఉన్నాను. వారికి శ్రేయస్సు కల్పించటం ద్వారా వారికి అప్పుపడి ఉన్న ఋణం తీర్చుకోగలను. నా ఈ ఋణం తీరటంలో రాజోద్యోగులు నాకు సహకరించాలి” అని VI వ శిలాశాసనంలో అన్నాడు. ఇది నేటికి కూడా ఒక కొత్త ఊహే.

బౌద్ధం “రాజు దేవతలకు ప్రియమైనవాడు” అంటుంది. బ్రాహ్మణవాద మతంలో “రాజే దేవుడు”. రాజు ఎప్పుడైతే దేవుడుగా మారాడో మంచి పరిపాలన అందివ్వటం ద్వారా “ప్రజల రుణం తీర్చుకోవటం” అనే భావన కు విలువలేకుండా పోయింది. బ్రాహ్మణవాదమతం రాజాదరణ పొందటానికి ఈ “రాజే దేవుడు” అనే ఎర దోహదపడి ఉంటుంది.

నేరములకు సరైన శిక్షలు విధించే అధికారులు అయిన రజ్జుకులను నియమిస్తూ అశోకుడు అ VI వ స్తంభశాసనంలో - “సమర్ధత కలిగిన ఈ దాది నా బిడ్డను సంరక్షించగలదని నమ్మి ఎలాగైతే మనం మన బిడ్డను ఒక దాది చేతుల్లో పెడతామో, అలాగ ఈ రజ్జుకులను ప్రజల హితం కొరకు, సౌఖ్యం కొరకు నేను నియమిస్తున్నాను” అన్న మాటలను బట్టి, అశోకుడు తన సామ్రాజ్యాన్ని ఒక కుటుంబంలా, తనను ఒక కుటుంబ పెద్దలా ఊహించుకొనేవాడని అర్ధమౌతుంది.

“నేను రాజ్యాభిషిక్తుణ్ణయిన ఈ ఇరవై ఆరు సంవత్సరాలలొ ఇరవైఅయిదుసార్లు కారాగృహవాసులను విడుదల చేయించాను” అనే V వ స్తంభ శాసన వాక్యం ద్వారా అశోకుడు కారాగార శిక్ష అనుభవిస్తున్న వారిపట్ల చూపిన కరుణ ప్రకటితమౌతుంది. నేరస్థులపట్ల అతిదయ, అతి క్రౌర్యం కాక మధ్యే మార్గం అవలంబించాలని అధికారులకు ఆదేశించేవాడు.
***

“దేవానాం ప్రియదర్శి చేత రెండు విధాల వారయిన చికిత్సకులు నియమించ బడినారు. మనుష్య చికిత్స, పశుచికిత్స ఏర్పాటు చేయబడినాయి. మనుష్యులకు ఉపయోగించేవి, పశువులకు ఉపయోగించేవి అయిన ఓషధులు ఎక్కడెక్కడ లేవో అక్కడ అంతా అవి తీసుకొని రాబడి నాటింపబడినాయి. ఇట్లే వేళ్లు, పండ్లు ఎక్కడెక్కడ లేవో అక్కడక్కడ అవి తీసుకొని రాబడి నాటింపబడినాయి. పశువులకు, మనుషులకు ఉపయోగించే నిమిత్తం మార్గాలలో చెట్లు నాటబడినాయి. బావులు త్రవ్వబడినాయి.” (II వ శిలాశాసనం)

"రహదారులకు ఇరువైపులా బాటసారులకు, పశువులకు నీడనిచ్చేందుకు మర్రి, మామిడి చెట్లు నాటించాను. ప్రతి ఎనిమిది క్రోసులకు ఒక బావి చొప్పున తవ్వించాను". అని చెప్పుకొన్నాడు. (VII వ స్తంభశాసనం)

అశోకుడు రోడ్లకిరువైపులా చెట్లు నాటించటం, బావులు తవ్వించటం, ఫల వృక్షాలను, ఔషద మొక్కలను ఎక్కడెక్కడి నుంచో తెప్పించి నాటించటం, మనుషుల, పశువుల వైద్యులను ఏర్పాటు చేయటం, పశువులకు, మనుషులకు పానశాలలను నిర్మించటం అనేది నేటికీ అవసరపడే ప్రజాప్రయోజన పనులు.

పై పనులు నేను చేయించాను అని బహిరంగంగా శిలాశాసనం వేయించుకోవటం లో నిజాయితీ కనిపిస్తుంది. ఒక రకంగా రాజే స్వయంగా “పబ్లిక్ ఆడిట్” చేయించుకొంటున్నట్లుగా అనుకోవచ్చు.

3. ప్రజలు

అశోకుని శాసనాలు ప్రధానంగా రాజుకి, ప్రజలకు, రాజుకి అధికారులకు మధ్య జరిగిన సంభాషణలు. వీటిలో ఆనాటి సమాజం గురించిన ప్రస్తావనలు నేరుగా లేకపోయినా పరోక్షంగా గ్రహించవచ్చు.

“దాసుల, భృత్యుల యెడల అనురాగం, ప్రతిపత్తి (రెస్పెక్ట్) కలిగి ఉండాలని” వివిధ శాసనాలలో కనిపిస్తుంది. దాసులు, భృత్యులు సేవక వర్గానికి చెందినవారు. వీరిలో భృత్యులు వారు చేసిన పనులకు కూలి పొందుతారు. ఐచ్ఛికంగా సేవలందించే కూలీలు. వీరికి ఏ మేరకు స్వేచ్ఛ ఉందనేది, అంటే తన సేవలను కావల్సిన యజమానికి అందించగలిగే స్వేచ్ఛ ఉన్నదో లేదో తెలియరాదు. దాసు/దస్యులు ఒకరకంగా బానిసలు. వీరికి స్వేచ్ఛ లేదు. యజమానుల ఆధీనంలో ఉంటారు. చెప్పిన పని చేస్తూ, ఇచ్చిన తిండి తింటూ జీవిస్తారు.

అశోకుని సమాజంలో ఆ కాలపు ఇతర సమాజాలవలే, బానిసత్వం రాజామోదం పొందిన వ్యవహారం. ఈ బానిసలు ఎలా వస్తారు అనేప్రశ్నకు XIII వ శిలాశాసనంలో సమాధానం దొరుకుతుంది. ఆ శాసనంలో “కళింగ యుద్ధంలో లక్షమంది చనిపోగా, లక్షా యాభైవేలమంది జనులు బంధీలుగా తరలింపబడ్డారు” అని ఉంది. బంధీలుగా మార్చి తరలింపబడిన ఈ లక్షా యాభైవేలమందిని బహుశా దస్యులుగా చేసి విక్రయించడమో లేదా Warbooty గా పంచుకోవడమో జరిగి ఉంటుంది.

అశోకుడి కాలంలోనే రాసిన “ఆపస్తంభ ధర్మశాస్త్రం” లో యజమాని తను, తన కుటుంబం పస్తులుండి అయినా దస్యులకు, బృత్యులకు తప్పని సరిగా ఆహారం అందించాలని ఉంది. (ఆపస్తంభ ధర్మసూత్ర 2.9.11)

బుద్ధభగవానుడు ఒకనాడు పుత్త సిగాలా అనే గాహాపతితో (యజమాని) “అతని వద్ద ఉన్న దస్యులను ప్రేమగా చూసుకొమ్మని, వారి శక్తికి అనుగుణంగా పని కేటాయించమని, చక్కని ఆహారము అందించమని, అనారోగ్యానికి గురయితే అవసరమైన శలవులు ఇవ్వమని” చేసిన ఉద్బోధ ఆనాటి సమాజంలోఈ దస్యుల జీవనాన్ని కళ్ళకు కడుతుంది.
***

అశోకుని సామ్రాజ్యం భౌగోళికంగా విభిన్నమైనది. భిన్నజాతుల సమ్మేళనం. అశోకుడు తొమ్మిది రకాల జాతులను పేర్కొన్నాదు. వారు కాంబోజ, గాంధార, Ristikas and Nabhapanktis in the northwest; Paladas, Bhojas, Andhras, Kalingas and Pitinikas in the Deccan. వీరిలో ఎక్కువమంది గిరిజన తెగలకు చెందినవారు.

అశోకుడు వర్ణవ్యవస్థ గురించి ఏ రకమైన ప్రస్తావనలు చేయలేదు. అశోకుని శాసనాలలో చాతుర్వర్ణ వ్యవస్థలో మొదటి వర్గమైన బ్రాహ్మన పేరు మాత్రమే కనిపిస్తుంది. అది ఒక వర్ణంగా కాక, ఒక మతసమూహంగా చెప్పబడింది. అంటే అశోకుడు వాడిన బ్రాహ్మనపాషండులు అనే పదం బ్రాహ్మణవాదమతాన్ని ఆచరించేవ్యక్తులు అనే అర్ధంలో ఉంటుంది తప్ప ఒక సామాజిక వర్గంగా కాదు. సామాన్యశకం రెండో శతాబ్దంకు పూర్వం సంస్కృతం కాని భాషలలో వేసిన శాసనాలలో బ్రాహ్మనికల్ వర్ణవ్యవస్థ గురించి ఎక్కడా కనిపించదని Johannes Bronkhorst అనే చరిత్రకారుని పరిశీలన. ప్రాచీన తమిళ శాసనాలలో కూడా వర్ణ వ్యవస్థ కనిపించదు.

అశోకుడు వర్ణవ్యవస్థ గురించి మౌనంవహించాడా లేక అప్పటికి అది ఇంకా స్థిరపడలేదని భావించవచ్చా అనేది చర్చనీయం.
***


అశోకుని శాసనాలలో స్త్రీల సామాజిక స్థితి గతులను ఊహించగలిగే అంశాలు పెద్దగా ప్రతిబింబించ లేదు. రాణి స్తంభశాసనమని ఒక శాసనం ఉంటుంది. కాని ఇది రాణి తనకు తానుగా ప్రకటించింది కాదు. అశోకుని రెండవరాణి అయిన కారువాకి చేసిన దానాలు, ఒసగబడిన వనాలు, గృహాలు ఆమె పేరనే గణింపబడాలని అశోకుడే స్వయంగా వేయించిన శాసనం ఇది. దీని ద్వారా- రాణికి సొంత ఆదాయవనరులు ఉండేవని, వాటిని ఆమె ఖర్చుపెట్టుకొనే అధికారం ఉందని అర్ధం అవుతుంది తప్ప ఆమెకు గల సామాజిక హోదాలు, బాధ్యతలు తెలియరావు. కొన్ని శాసనాలలో తల్లి, సోదరి, బౌద్ధ భిక్కుణి, మంగళకర దీవెనలు ఇచ్చే స్త్రీ జనం అంటూ సమాజంలోని వివిధ స్త్రీలగురించి ప్రస్తావనలు చేసాడు తప్ప వారి బాధ్యతలు, హక్కులు బోధపడవు. ఇక వేరే ఏరకమైన స్త్రీ ప్రాతినిధ్యం కనిపించదు. అప్పటి సమాజం పితృస్వామికమైనది కావొచ్చు. కాగా బౌద్ధ రచనలలో అశోకుని అయిదుగురు భార్యలు ఉన్నట్లు, వారిలో చిన్న భార్య తిస్సరక్క గయ్యాళిగా వ్యవహరించేదని, బుద్ధుడు జ్ఞానోదయం పొందిన బోధి వృక్షాన్ని కూల్చివేసిందని, సవతికొడుకుని అంధుణ్ణి చేసిందని అనేక కథనాలు కనిపిస్తాయి. వీటికి చారిత్రిక ఆధారాలు లభించవు.


4. మతం


బుద్ధునికి, అశోకుని మధ్య కాలంలో బౌద్ధమతం ఎలా మనుగడ సాగించి ఉండేది అనే ప్రశ్న చరిత్రకారులుకు ఒక సవాలు. ఎందుకంటే BCE ఆరవ శతాబ్దం నుండి BCE మూడవ శతాబ్దం వరకూ బౌద్ధమతానికి సంబంధించి చాలా తక్కువ ఆర్కియలాజికల్ ఆధారాలు లభిస్తున్నాయి. ఆ కారణంగా కొందరు బుద్ధుడే లేడని, బుద్ధుడు అనే ఒక కాల్పనికపాత్రను అశోకుడు సృష్టించాడని మూర్ఖంగా వాదిస్తారు. బౌద్ధం పట్ల అనాదిగా బ్రాహ్మణవాదులు చూపిన అలక్ష్యానికి ఇది సమకాలీన కొనసాగింపు.
బుద్ధుని మహానిర్వాణం అనంతరం గంగానది ఎగువ ప్రాంతంలో బౌద్ధమతం స్థిరపడి ఇతర ప్రాంతాలకు క్రమక్రమంగా విస్తరిస్తూన్న కాలంలో అశోకుడు బౌద్ధధర్మాన్ని స్వీకరించి దాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపచేసాడు. ఈ రోజు దేశంలో అడుగడుగునా ఎక్కడ తవ్వినా లభించే బౌద్ధ విగ్రహాలు, శిథిలాలు కనిపించటానికి కారణం ఆ రోజు అశోకుడు ఇచ్చిన ప్రోత్సాహమే అనేది నిర్వివాదాంశం. అలాగని అశోకునికి పూర్వం బౌద్ధమతం ఉనికి అంతంతమాత్రమే అని చెప్పలేం.
బుద్ధునికి అశోకునికి మధ్య ఉన్న నాలుగు శతాబ్దాల అంతరంలో బౌద్ధమత ఉనికికి ఈ క్రింది ఆధారాలు నేడు మనకు లభిస్తున్నవి.
నేపాల్ లోని బుద్ధుని జన్మస్థలమైన లుంబినిలో మాయాదేవి ఆలయం వద్ద జరిగిన తవ్వకాలలో BCE ఆరోశతాబ్దానికి చెందిన వృక్ష ఆరాధన చిహ్నాలు లభించాయి. ఇవి బౌద్ధం ప్రారంభదశలనాటి నిర్మాణాలు కావచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు.
1950 లలో వైశాలి వద్ద జరిపిన పురావస్తు తవ్వకాలలో మట్టితో నిర్మితమైన స్తూపం బయటపడింది. ఇది అశోకుడి కంటే ముందు కాలానికి చెందిందిగా గుర్తించారు. [2]
Piprahwa/కపిలవస్తు స్తూపం వద్ద ఒక భరిణిలో దొరికిన బుద్ధునివని చెప్పబడే అవశేషాలను 1971 లో K.M. Srivastava కార్బన్ డేటింగ్ చేయించగా, అవి క్రీస్తుపూర్వం 5 వ శతాబ్దానికి చెందినవి గా నిర్ధారణఅయింది . [3]
బుద్ధుని జీవితంతో సంబంధం కలిగిన 6 ప్రదేశాలు బౌద్ధులకు పవిత్రమైన దర్శనీయక్షేత్రాలు. అవి- బుద్ధుని జన్మస్థలమైన లుంబిని; సిద్ధార్థుడు సంసారిక జీవితాన్ని గడిపిన ప్రదేశము వైశాలి; సిద్ధార్థుడు జ్ఞానోదయం పొంది బుద్ధునిగా అవతరించిన బోధగయ; మొదటి ప్రవచనాన్ని ఇచ్చిన సారనాథ్; చాలాకాలం నివసించి తన బోధనలను అందించిన కోశాంబి, రాజగ్రిహలు. అశోకుడు BCE మూడో శతాబ్దంలో ఈ ప్రదేశాలలో స్తంభాలను నిలబెట్టాడు. అంటే ఈ ప్రాంతాలు అప్పటికే ప్రజలచే దర్శనీయ బౌద్ధక్షేత్రాలుగా గుర్తింపబడి, విరాజిల్లుతుండేవని ఊహించవచ్చు.
అశోకుడి కన్న ముందే కాశ్మీర్ లో బుద్ధిజం ఉండేది. బుద్ధుడు పరినిర్వాణం చెందిన 50 ఏండ్ల అనంతరం ఆనందుని శిష్యుడైన మధ్యాంతిక అనే బౌద్ధ అర్హంతు ద్వారా బౌద్ధమతం కాశ్మీరులో ప్రవేశపెట్టబడిందని Thomas Watter అభిప్రాయపడ్డాడు. అశోకుని కన్న పూర్వం సురేంద్రుడు అనే రాజు బుద్ధిజాన్ని కాశ్మీరు లో ఆదరించాడని కల్హణుడు ప్రస్తావించాడు. [4]
అశోకుని పూర్వం కూడా బౌద్ధం ఈ నేలపై గణనీయంగా మనుగడ సాగించిన వైనాన్ని పై ఆధారాలు ఋజువు చేస్తాయి.
***
BCE 257 June లో వేయించిన I వ లఘు శిలాశాసనంలో తాను బౌద్ధాన్ని స్వీకరించినట్లు అశోకుడు ఇలా చెప్పుకొన్నాడు. “నేను ఉపాసకుడిగా మారి రెండున్నర సంవత్సరములు కావచ్చింది. ఒక సంవత్సరం క్రితం సంఘాన్ని సందర్శించాను. అప్పటినుంచీ మిక్కిలి ఉత్సాహవంతుడనై ఉన్నాను. జంబూద్వీపములో జనులకు తెలియని దేవతలను నేను జనులతో కలిపాను. ఈ ఉత్సాహానికి కారణం అదే. గొప్పవారు మాత్రమే కారు క్రిందిస్థాయి వారు కూడా సాధనచేసినట్లయితే, గొప్ప స్వర్గాన్ని అందుకోగలరు”.
పై శాసనాన్ని అశోకుడు భారతదేశం అంతటా వేయించాడు. ఇవి ఇప్పటివరకూ భౌగోళికంగా 14 వేరు వేరు చోట్ల దొరికాయి. ఈ శాసనంలో అశోకుడు మొదటిసారిగా ఉపాసక, సంఘ అనే బౌద్ధ పరిభాషను ఉపయోగించాడు. “జనులకు తెలియని దేవతలను నేను జనులతో కలిపాను” అనే వాక్యం ఆసక్తిదాయకం. అప్పటివరకూ ప్రబలంగా లేని బౌద్ధమతాన్ని ఎక్కువమంది ప్రజలకు చేరవేయగలిగానని చెబుతున్నట్లు అర్ధం వచ్చింది.
అదేవిధంగా “క్రిందిస్థాయివారు కూడా సాధనచేసినట్లయితే” అనే మాట కూడా – ఆనాటి సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వర్గాలకు కూడా ఈ మతాన్ని చేర్చానని అశోకుడు చెబుతున్నాడా అనేది ఆలోచించాల్సిన విషయం.
***ఎ. ధర్మప్రచార యాత్రలు:


సాధారణంగా చక్రవర్తులు తన రాజ్యంలో పర్యటిస్తూ, సామంతులు, అధికారులతో దేశ భద్రత, అంతఃకలహాలు, పన్నుల రాబడి, చేపట్టాల్సిన నిర్మాణాలు, ప్రజల క్షేమం లాంటి అంశాలను చర్చిస్తారు. ఇంకా విందు వినోదాలలో సేదతీరతారు.
తన పదకొండవ పాలనా సంవత్సరం BCE 258 లో మృగయవినోద యాత్రలకు బదులుగా బౌద్ధ తీర్థయాత్రలకు వెళ్లాడు అశోకుడు.
ఆ విషయాన్ని VIII వ శిలాశాసనంలో ఇలా చెప్పుకొన్నాడు-“ఒకప్పుడు దేవానాంప్రియుడు విహారయాత్రలు చేసేవాడు. కానీ ఇక్కడ అతను సంబోధి (బోధగయ) నగరానికి ధర్మయాత్ర చేసినాడు. ఈ యాత్రలలో శ్రమణ, బ్రాహ్మణులను దర్శించి వారికి సువర్ణదానాలు ఇవ్వటం, దేశప్రజలకు ధర్మోపదేశం చేయటం జరుగుతూ ఉండెను”
అశోక చక్రవర్తి తీర్థయాత్రలు చేయటం ఆనాటి రాజరికపు అలవాట్లలో కొత్తది. అప్పటి మత వ్యవహారాలలో బ్రాహ్మణులు, శ్రమణులు రెండు భిన్న దృవాలు. ఒకరు బ్రాహ్మణవాద ధర్మాన్ని అవలంబిస్తే, మరొకరు బౌద్ధ లేదా జైన ధర్మాలను ప్రచారించేవారు. తీర్థయాత్రలు చేస్తూ ఇలా బ్రాహ్మణ, శ్రమణులను దర్శించటం, వారికి దానాలొసగటం, ప్రజలకు బౌద్ధ ధర్మప్రచారం చేయటం లాంటి పనులు ఆ తరువాత కూడా అశోకుడు కొనసాగించి ఉంటాడు. ఎందుకంటే మరో పదేళ్ల తరువాత బుద్ధుని జన్మస్థలం అయిన లుంబినిని దర్శించుకొని ఆ సందర్భాన్ని లిఖిస్తూ అక్కడ ఒక స్తంభాన్ని పాతించాడు.
BCE 248 లో వేయించిన లుంబిని స్తంభ శాసనంలో అశోకుడు ఇలా అన్నాడు..........“బుద్ధ శాక్యముని ఇక్కడ జన్మించినందువల్ల, దేవానం ప్రియదర్శి రాజు తన రాజ్యాభిషేకకాలం ఇరవయ్యో సంవత్సరంలో ఇక్కడకు స్వయంగా వచ్చి దీనిని పూజించాడు. భగవానుడయిన బుద్ధుడు ఇక్కడ జన్మించాడని తెలపడానికి ఇక్కడ ఒక శిలాస్తంభాన్ని స్థాపించాడు. లుంబినీ గ్రామంవారు పన్నులు చెల్లింపనక్కర లేకుండా కట్టడి చేశాడు”
అశోకుడు ధర్మయాత్ర జరుపుతూ తన రాజ్యం నలుమూలలా శాసనాలు వేయించగలిగాడు. బుద్ధభగవానుడు జన్మస్థలం వద్ద నివసించే ప్రజలకు పన్ను మినహాయింపు నివ్వటం ఒక ఉదారపూర్వక చర్య. ఈ శాసనాలలో తన మతపరమైన విశ్వాసాలను స్పష్టంగా ప్రజలకు తెలియజేయ గలిగాడు. తనతో చేతులు కలిపి, తన విశ్వాసాలను స్వీకరించమని ఈ శాసనాలద్వారా అశోకుడు తన రాజ్యప్రజలకు ఆహ్వానం పలికాడు.


బి. దిశానిర్ధేశం:


కలకత్తా, బైరాతు పట్టణానికి సమీపంలో కొండగుట్టలమీద ఒక శిలపై ఒక శాసనము చెక్కిఉన్నది. దీనిలో అశోకుడు బౌద్ధాచార్యులను, భిక్ష, భిక్షుణి వర్గాలను ఉద్దేశించి వారేమేమి గ్రంథాలను చదవాలో, నిత్యం మననం చేయాలో చెప్పాడు.
ఈ శాసనములో అశోకుడు..........“మగధరాజయిన ప్రియదర్శి సంఘానికి అభివాదనం చేసి, వారు నిర్బాధంగా, సౌఖ్యంగా ఉండవలెనని కోరుతున్నాడు.// అయ్యలారా సద్ధర్మం చిరస్థాయిగా ఉండగలదు. 1. వినయమత్కరం 2. ఆర్యవంశాలు 3. అనాగత భయాలు 4. మునిగాథలు 5.మౌనేయ సూత్రాలు 6. ఉపతిష్య ప్రశ్నలు 7. రాహుల వాదం, మొదలుగా భగవానుడయిన బుద్ధుడు అసత్యాన్ని గూర్చి తెలిపిన అంశాలను, అయ్యలారా, అనేక భిక్షువర్గాలు, అనేక భిక్షుణీ వర్గాలు ఆ ధర్మాల అర్ధాలను పదే పదే వింటూ వాటిని గూర్చి ధ్యానించెదరుగాక అని నేను కోరుతున్నాను//”
మొత్తం అశోకుని అన్ని శాసనాలలో ఇది మాత్రమే నేరుగా భిక్షుకులను సంబోధిస్తుంది. ఈ శాసనంలో అశోకుడు తనని తాను దేవానాం ప్రియుడు అని చెప్పుకోడు, మగధరాజుగా సంబోధించుకొన్నాడు. బహుశా తాను మాట్లాడుతున్నది బౌద్ధగురువులతో కనుక దేవతలకు ఇష్టమైనవాడు అని చెప్పుకోలేదని అనుకోవచ్చు. ఈ శాసన శైలి ఎంతో వినయంగా ఉంది. భంతే (బౌద్ధావలంబి) అనే మాటను పదే పదే ఉపయోగించాడు. ఈ శాసనంలో అశోకుడు చెప్పిన బౌద్ధ గ్రంథాలలో కొన్ని తెలియరావు.
ఇవి ఆనాడు ప్రముఖంగా ఉండిన బౌద్ధ సాహిత్యం కావొచ్చు. 1. వినయసముకసె- ఇది సంఘంలో క్రమశిక్షణ నియమాలను తెలుపుతుంది. 2. అలియవసాని – ఇది బౌద్ధ సన్యాసి పాటించాల్సిన మార్గదర్శనాలను చెబుతుంది. 3. అనాగత భయాలు- బౌద్ధసన్యాసులు ఎదుర్కొనే ప్రమాదాలగురించి. 4&5 మునిగాథలు, మౌనేయ సూత్రాలు- ఇవి బౌద్ధ సన్యాసి లక్షణాలను, సన్యాసం యొక్క స్వభావంలను వర్ణిస్తాయి. 6. ఉపతిశ్య ప్రశ్నలు- బుద్ధుని శిష్యుడు సరిపుత్త బుద్ధభగవానుని తో చేసిన తాత్విక సంభాషణలు. 7. రాహులో వాద- బుద్ధుడు రాహులునికి ఇచ్చిన ఉపదేశం.


సంఘంలో క్రమశిక్షణ, అంకిత భావం పెరగటానికి పై ఏడు గ్రంథాలను అశోకుడు ప్రతిపాదించాడు. వాటిని అందరూ పదే పదే పఠించాలని కోరాడు. I వ లఘుశిలాశాసనంలో అశోకుడు “నేను ఉపాసకుడిగా మారి రెండున్నరేళ్ళు అయింది. సంఘాన్ని దర్శించాకా ఉత్సాహంగా ఉంది” అన్న అశోకునికి , బౌద్ధం పట్ల పాండిత్యం, అవగాహన నిండిన ఈ శాసనవాక్యాలురాసిన అశోకునికి మధ్య ఎంతో పరిపక్వత కనిపిస్తుంది. ఈ శాసనం ఎప్పుడు వేయించాడో తెలియరాదు కానీ బహుశా పది పదిహేను ఏండ్ల పాటు సాగించిన బౌద్ధ గ్రంథాల అధ్యయనం తరువాత వేయించి ఉండొచ్చు.

సి. సంఘబేధం:

బౌద్ధసంఘంలో బేధాలు సృష్టించి విడదీసే ప్రయత్నాలు అప్పట్లోనే మొదలయ్యాయని, వాటిని నివారించటానికి అశోకుడు క్రమశిక్షణా చర్యలను ప్రతిపాదించాడని కొన్ని శాసనాలద్వారా తెలుస్తుంది.
సారనాథ్ స్తంభశాసనంలో సంఘబేధం గురించి ఇలా ఉన్నది…......“//సంఘాన్ని ఎవడూ విడదీయకూడదు. భిక్షుకుడు కాని, భిక్షుకి కాని ఎవరైనా సంఘాన్ని విడదీస్తే వారికి తెల్లదుస్తులు కట్టించి మరోచోట నివసించేట్లు చేయాలి//

సంఘబేధం అంటే సంఘనియమాలను అతిక్రమించటంగా తీసుకోవాలి. సంఘంలో నివసించేవారు కాషాయ దుస్తులు ధరిస్తారు. ఇలా సంఘంలో చీలికలు తీసుకువచ్చేవారికి తెల్లదుస్తులు ధరింపచేసి సంఘానికి వెలుపల నివసించేలా చేయటం అంటే ఒకరకంగా వారిని సంఘంనుంచి వెలివేయటం.
పై వాక్యాలకు కొనసాగింపుగా, ఈ శాసనాన్ని అధికారులు ఎలా అమలుచెయాలో ఉత్తర్వులు కూడా కనిపిస్తాయి. అవి....……// “ఈ శాసనం యొక్క ప్రతిని ఈ కార్యాలయం (మహామాత్రు అధికార) లోను మరొక ప్రతిని ఉపాసకుల గృహంలోను ఉంచవలెను.
ఉపవాసదినాలలో ఈ శాసనం లోని విషయాలపట్ల ఉపాసకులందరూ విశ్వాసం కల్గి ఉండేలా చెయటానికి మహామాత్రులు కూడా అక్కడకి తప్పక పోతుండవలెను. మీ అధికార పరిథి ఎంతవరకూ ఉందో అంతవరకూ ఒక ఉద్యోగిని ఈ శాసనాన్ని చెప్పటానికి పంపవలెను”

పై వాక్యాలు అశోకుడు తన ఉత్తర్వులను అమలు పరిచే విధానాన్ని తెలియచేస్తుంది. ఈ రకపు SOP లు మరే ఇతర శాసనాలకు లభించలేదు. ఒక రాజశాసనం ఎలా ప్రజలలోకి తీసుకెళ్ళబడేదో పై వాక్యాలు చెబుతాయి. అశోకుడు పై శాసనంయొక్క రెండు ప్రతులు మహామాత్రులకు పంపించి ఉంటాడు. ఒకదానిని వారి కార్యాలయంలో ఉంచుకొని మరొకదానిని తన అధికారికపరిథి లో ఉన్న అందరు సంఘ ఉపాసకులకు ప్రదర్శించి, నెలకి ఒకసారి జరిగే వారి సమావేశాలలో ఈ శాసనాన్ని వారికి చేరేలా చూడమని మహామాత్రులను కోరుతున్నాడు. ఇదంతా సంఘాన్ని బలహీనపరచే శక్తులను అశోకుడు ఎదుర్కొన్న తీరుగా గుర్తించాలి.
***
.
డి. లౌకిక వాదం:
బ్రాహ్మణవాద సాహిత్యంలో వేదాలను ధిక్కరించిన, వేదధర్మమును ఖండించిన వారిని పాషండులని పేర్కొనడం జరిగింది. ఈ సమూహంలో బౌద్ధులు, జైనులు, ఆజీవికులు, చార్వాకులు మొదలగు వివిధ వేదవిరుద్ధచరణము కలిగినవారిని చేర్చారు. అశోకుని శాసనాలలో పాషండ అనే పదం అనేక సార్లు వస్తుంది. అశోకుని కాలంలో ఈ పాషండ పదానికి ఆ విధమైన నిందార్థం లేదు. తటస్థ అర్ధం ఉండేది. అశోకుని రాజ్యంలో బౌద్ధం, జైనం, ఆజీవికం వంటి ప్రధాన ధార్మిక మార్గాలు ఉన్నాయి. ఈ మూడింటిని కలిపి అశోకుడు అనేక సార్లు పాసంద(పాషండ) పేరుతో తన శాసనాలలో పేర్కొన్నాడు.
1. దేవానాం ప్రియుడు సమస్త పాషండ జనులందరకూ సన్యాసులైనా, గృహస్థులైనా, దానములు ఇచ్చి, ఇతర సత్కారములు చేసి గౌరవించుచున్నాడు. //
.............//ఒక పాషండ శాఖ/మతం కి చెందిన వ్యక్తులు అసందర్భంగాతమ శాఖను పొగుడుకోవడం, ఇతర శాఖ/మతాలను నిందించడం చేయరాదు. పరశాఖల/మతం వారిని కూడా గౌరవించవలెను. ఇట్లు చేయుట వలన తన మతాన్ని అభివృద్ధి చేసుకోవటంమే కాక ఇతర శాఖలవారికి ఉపకారం కలిగించిన వారు అయెదరు. తన వారిని స్తుతిస్తూ ఇతరశాఖల వారిని నిందించేవాడు తన శాఖకే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు// సమస్త జనులకు ధర్మాభివృద్ధే ముఖ్యము తప్ప దానం కాని, పూజ కాని అంత ముఖ్యాలు కావు అని దేవానాం ప్రియుడు తలుస్తున్నాడు. (XII శిలాశాసనము)
పై వాక్యాలు నేరుగా భిన్న మతావలంబులను సంబోధిస్తున్నాయి. ఒకరినొకరు గౌరవించుకోండి, మర్యాద ఇచ్చిపుచ్చుకోండి అని పలుకుతున్నాడు అశోకుడు. అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించి, దాన్ని ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లాడని సంప్రదాయకథనాలు చెబుతాయి. కానీ శాసనాలలో అలా కనిపించదు- అన్ని ఆరాధనవిధానాలతో పాటు బౌద్ధాన్ని కూడా పోషించాడు తప్ప బౌద్ధమతానికి పెద్దపీటవేసినట్లు ఉండదు. ఇదే రెండువేల ఏళ్ళ క్రితం అశోకుడు ప్రపంచానికి చాటిచెప్పిన లౌకికభావన.

2. “ఉత్తరపశ్ఛిమ ప్రాంతాల యవనులలో తప్ప మిగిలిన అన్ని దేశాలలోను బ్రాహ్మణులు, శ్రమణులు ఉన్నారు. ఏదో ఒక విశ్వాసాన్ని పాటించని పాషండులు లేని భూభాగమే లేదు ఈ జగతిని” అంటూ తన రాజ్యంలో ఉన్న మతవైవిధ్యాన్ని స్పష్టంగా చెప్పాడు అశోకుడు. (XIII వ శిలాశాసనము). యవనులు కూడా ఏదో ఒక ఆరాధనా విధానాన్ని కలిగి ఉండేవారని తెలుస్తుంది.
3. // భిన్నశాఖలకు చెందిన పాషండులందరిని నేను గౌరవించాను వివిధ రకాలుగా పూజించాను. జనులవద్దకు నేనే స్వయంగా పోయి కలవటమే నాకు ప్రధానం. నా రాజ్యాభిషిక్తకాలం ఇరవై ఆరోఏట నా చేత ఈ ధర్మలిపి లిఖించబడింది. (VI స్తంభశాసనం)
4.//సకల పాషండుల వ్యవహారములు చూడటానికి వివిధ మహామాత్రులను నియమించాను. కొందరు బ్రాహ్మనుల, కొందరు ఆజీవికుల, కొందరు నిర్గ్రంథుల (జైనుల) వ్యవహారాలను చూస్తూ ఉండాలని ఆజ్జాపించాను. నా మహామాత్రులు తమకు నియోగింపబడిన సంఘమువారి యందు మాత్రమే కాక ఇతర పాషండ జనులను గురించి కూడా వ్యాపృతులై ఉండెదరు. (VII స్తంభశాసనం)

అశోకుని కాలంలో మతపరమైన బహుళత్వం ఉండేది. ప్రజలు భిన్న మత విశ్వాసాలను కలిగి ఉండేవారు. వారిని పాషండులని పిలిచారు. పై వివిధ శాసనాలలో అశోకుడు పాషండ అనే పదాన్ని భిన్న మతాలు అని చెప్పటానికి వాడినట్లుగా అర్ధమౌతుంది. ఈ పాషండులు సన్యాసి లేదా గృహస్థు జీవితాలను సాగించేవారు. అశోకుడు ఈ భిన్న మతాల మధ్య సఖ్యత నెలకొల్పటానికి ప్రయత్నించాడు. వసుధైకకుటుంబాన్ని స్థాపించాలనుకొన్నాడు.

5.దేవానాం ప్రియుడు సమస్త పాషండ జనులు తమకు ఇష్టము వచ్చిన చోట నివసింపవచ్చునని కోరుతున్నాడు (VII వ శిలా శాసనము)

ఎందుకు అశోకుడు ప్రత్యేకించి అలా చెప్పవలసి వచ్చిందో ఆసక్తి కలిగిస్తుంది. దీనికి సమాధానంగా – ఒకప్పుడు ఈ పాషండులు (భిన్న మతావలంబులు) అశోకుని రాజ్యంలో స్వేచ్ఛగాసంచరించే అవకాశం ఉండేదికాదేమోనని; కొందరు సామంత రాజులు ఏదో ఒక మతాన్ని ఆదరించి ఇతర మతాలను తన రాజ్యం గుండా వెళ్లనివ్వకుండా ఆపేవారని Rajeevi Bhargava అనే చరిత్రకారుడు అభిప్రాయపడ్డాడు.
దీనికి ఆధారాలుగా అశోకుని సమకాలీనుడైన కౌటిల్యుడు పాషండులని ఊరికి వెలుపల ఉంచాలి అనిచెప్పిన మాటలు; అశోకుని తరువాత వ్యక్తి అయిన మనువు – జూదరులని, నేరస్థులను, సారాయి వ్యాపారులను, పాషండులను, రాజు దేశాబహిష్కరణ చెయ్యాలని అన్న మాటలు- చూపారు

ఈ నేపథ్యంలో అశోకుడు, తాను విశ్వసించిన బౌద్ధ మతానికి ఏమాత్రమూ ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని మతాలకు సమాన అవకాశం ఇస్తూ ఎవరైనా ఎక్కడైనా స్వేచ్ఛగా సంచరించవచ్చునని శాసనం వేయించాడు. అధికారులను పర్యవేక్షించమని ఆదేశించాడు. ఇది అశోకుని పరమతసహిష్ణుతను చూపుతుంది. ఇది ఒకరకంగా ఆధునిక లౌకిక వాదం లాంటిది.

ఇ. అహింసో పరమోధర్మ:

అనేక శాసనాలలో అశోకుడు అహింసను ప్రోత్సహించాడు. హింస కూడదని బోధించాడు. I వ శిలా శాసనంలో “తన రాజ్యంలో ఇక్కడ జంతువులను చంపరాదు; బలి ఇవ్వకూడదు, సమాజ ఉత్సవాల కొరకు జనులు ఒకచోట గుంపులు చేరకూడదు//పూర్వము దేవానాంప్రియుని వంట ఇంటిలో వందలు వేలు జీవజంతువులు ఆహారముకొరకు చంపబడేవి. కాని, ఈ ధర్మశాసనము లిఖించబడిన కాలంలో దినానికి రెండు నెమళ్ళు, ఒక లేడి (అదియును నిత్యమూ చంపబడటం లేదు), ఇట్లా రోజుకు మూడు ప్రాణులు మాత్రమే చంపబడుతున్నవి, ఇక ముందు ఈ మూడు ప్రాణులను కూడా చంపకూడదు” అని చెప్పాడు.

ప్రజలకు తాను ఒక విషయాన్ని చెప్పేటపుడు దాన్ని నేను పాటిస్తున్నాను అని చెప్పుకోవటం ద్వారా వారి విశ్వాసాన్ని పొందే ప్రక్రియగా దీన్ని చూడాలి.

సమాజ ఉత్సవాలలో జంతుబలులు జరిగేవి. అసాంఘిక శక్తులు చెలరేగేవి. మధ్యం ప్రవహించేది. వీటిని అదే కాలానికి చెందిన కౌటిల్యుని అర్ధశాస్త్రంలో ఉత్సవాల రోజులలో మద్యాన్ని ఎవరైనా తయారుచేసి అమ్ముకొనేందుకు రాజు నాలుగు రోజులపాటు అనుమతించాలని ఉంది. అశోకుడు ఈ ఉత్సవాలను, వాటిలో జరిగే జంతుబలులను, మద్యసేవనాన్ని నిషేదిస్తున్నాడు.

"జనులు ఒకచోట గుంపులు చేరకూడదు" అనటం బహుశా మతం అనేది వ్యక్తిగతంగా సాధన చేయాల్సిన అంతర్యానం తప్ప సామాజికంగా గుంపులు గూడి ఆరాధించాల్సిన విషయం కాదని అశోకుని అభిప్రాయం కావొచ్చు.

ఇలా జరగాలని ఆశించటం ఆదర్శవాదం. చాలా సందర్భాలలో ఆదర్శవాదం సామాజికంగా విఫలమవటం చరిత్రలో కనిపిస్తుంది.

ఏడవ స్తంభశాసనం (ఢిల్లీ తోప్రా స్తంభం) లో “మార్గమునందు పశువులకును, మనుష్యులకును, నీడగానుండుటకు మర్రిచెట్లను వేయించితిని, మామిడితోటలను వేయించితిని. ఎనిమిది క్రోసుల కొకటిచొప్పున నూతులను తవ్వించి, వానిలోనికి దిగుటకు మెట్లను కట్టించితిని. పశువులకు, మనుష్యులకు ఉపయోగము నిమిత్తము అనేక పానశాలలను నిర్మించితిని”. అంటూ మనుషులతో పాటు సమస్త జీవరాసి మనుగడకొరకు తాను ఏమేం చేసాడో చెప్పుకొన్నాడు.

అశోకుడు ఒక గొప్ప పాలకుడు మాత్రమే కాకుండా, ఒక గొప్ప పర్యావరణవేత్త కూడా. అతను జంతుబలులను నిషేదించటం ద్వారా వన్యప్రాణుల సంరక్షణ, చెట్లు నాటించటం ద్వారా అడవుల సంరక్షణ, ఒకచోట లభించని ఔషదమొక్కలను వేరేచోటనుంచి తెప్పించినాటించటం ద్వారా జీవవైవిధ్య పరిరక్షణ ఇంకా బావులు తవ్వించటం ద్వారా నీటి సంరక్షణ లాంటి అనేక రకాలుగా పర్యావరణానికి హితం చేసే చర్యలు తీసుకున్నాడు.

అశోకుడు BCE 232 లో మరణించాడు. మొత్తం 36 ఏండ్లు పరిపాలించాడు. ఇతని తరువాత మగథ సామ్రాజ్యాన్ని ఇతని మనుమడు దశరథుడు 8 ఏళ్ళు, సంప్రతి 9 ఏళ్ళు, శాలిశుల్క 13 ఏళ్ళు, దేవవర్మ 7 ఏళ్ళు, శతధన్వన్ 8 ఏళ్ళు, బృహద్రథుఁడు 7 ఏళ్ళు పరిపాలించారు. ఈ బృహద్రథుఁడు BCE 181 లో అతని బ్రాహ్మణ సైన్యాధ్యక్షుడు పుష్యమిత్ర శృంగుడు హత్యచేసి మౌర్యవంశాన్ని తుదముట్టించి శుంగవంశాన్ని స్థాపించాడు. ఈ వంశం137 ఏండ్లపాటు భారతదేశాన్ని పాలించింది.

అశోకుని కొడుకులు మనవలు, తండ్రి తాతల వలే సమర్ధులు కారు. సుదీర్గంగా పాలించలేకపోయారు. అశోకుని వలె ఎవరూ తమ అభిప్రాయాలను శాసనాలుగా నిక్షిప్తం చేయలేదు. అన్ని మతాలను ఐక్యం చేయాలన్న అశోకుని స్వప్నం అతనితోనే అంతరించిపోయింది.

భారతదేశ చరిత్రలో బ్రాహ్మణవాదులు పొందిన రాజకీయ, సామాజిక, ఆధ్యాత్మిక అధికారం చాలా ముఖ్యమైనది. దీనిని బ్రాహ్మణీయ అసాధారణత్వం (Brahmanical exceptionalism) అంటున్నారు. అశోకుని రాజనీతి బ్రాహ్మణవాదుల సామాజిక, రాజకీయ ప్రాధాన్యతను సవాలు చేసింది. దీనికి ప్రతిగా బ్రాహ్మణవాదులు “బ్రాహ్మణీయ అసాధారణత్వాన్ని” బలపరిచే వాదనలను తమ సాహిత్యంలో నిర్మించుకొన్నారు. బుద్ధుడు, అశోకుడు బోధించిన అహింస, కరుణ సూత్రాలకు సమాంతరంగా, రాముడు, యుధిష్టరుడు పాత్రలను సృష్టించి వాటిని, బ్రాహ్మణ వ్యవస్థ యొక్క యోధులు, ధర్మపాలకులుగా చిత్రీకరించుకొన్నారు.

మహాభారతం అశోకునితో సంబంధాన్ని కలిగి ఉంటుందని ప్రముఖ చరిత్రకారిణి Madeleine Biardeau అభిప్రాయపడింది. భారతంలోని యుధిష్టరుడి పాత్ర అశోకుడి పాత్రకు బ్రాహ్మణీయ సాహిత్యరూపం అని ప్రముఖ ఇండాలజిస్ట్ James L. Fitzgerald అభిప్రాయపడ్డాడు.

ఈ ఇతిహాసాలు ఎక్కడా అశోకుని పేరు చెప్పవు. పురాణాలలో ఏదో ఒకటి రెండు వాక్యాల ప్రస్తావన తప్ప అశోకుడి చారిత్రిక పాత్రను పూర్తిగా తుడిచిపెట్టబడింది. బ్రాహ్మణీయ ఆధిపత్యాన్ని అంగీకరించిన యుధిష్టరుని పాత్ర ద్వారా చక్రవర్తి ఎవరైనా సరే బ్రాహ్మణవాదానికి ప్రాముఖ్యతను ఇచ్చి వ్యవహరించాల్సి ఉంటుందని ప్రచారం చేసి తమ బ్రాహ్మణీయ అసాధరణత్వాన్ని పదిలపరచుకొన్నారు.

***
అశోకుని అనంతరం అతని వసుధైకకుటుంబ భావనలు క్రమేపీ తెరవెనక్కి పోయాయి. అశోకుడు బారాబర్ వద్ద కొన్ని గుహలను ఆజీవికులు (ఇదొక మతం అప్పట్లో) కు నిర్మించి ఇచ్చాడు. ఆ దాన శాసనంలో ఆజీవికులు అనే పేరును కొట్టివేసి ఇతరులు ఆ గుహలను ఆక్రమించుకొన్నారు. అదే విధంగా అన్ని ఆరాధనా శాఖలను సూచించే పాషండ అనే పేరును “వేదాలను వ్యతిరేకించే మతం” అనే అర్ధం వచ్చేలా బ్రాహ్మణవాదమతం స్థిరపరచింది.

అయినప్పటికీ రాజు అన్ని మతాలను ఆదరించాలి అనే భావన CE మొదటి శతాబ్దానికి చెందిన హాతిగుంఫా శాసనంలో- జైన ఖారవేలుడు తనని తాను “సర్వపాషండపూజకో” (One who honours all Pasandas) అని సంబోధించుకొని అన్ని పాషండశాఖలను ఆదరిస్తాను అని చెప్పుకొన్నాడు.
ఆ తరువాత మరలా 1800 సంవత్సరాల తరువాత ముఘల్ చక్రవర్తి అక్బర్ ప్రజలందరి విశ్వాసాలను గౌరవిస్తూ Din-i-ilahi (Religion of God) అనే మతాన్ని స్థాపించాడు.

***
పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు అశోకుడి గొప్పతనం తెలుసు. అశోకుడు శిలలపై ఏం లిఖించాడో, ఈ నేలపై ఏ ఏ నిర్మాణాలు చేసాడో నెహ్రూకి అవగాహన ఉంది. తనకూతురికి ప్రియదర్శిని అని అశోకుని పేరుపెట్టాడు. 1931 లో జైలునుండి ఇందిరాప్రియదర్శినికి రాసిన ఒక ఉత్తరంలో అశోకుడి గురించి చెబుతూ “చరిత్రపుటలు లక్షలాది రాజుల పేర్లతో నిండి ఉన్నప్పటికీ, వారి ఘనత, రాజసం, ప్రతిష్టల మధ్య అశోకుని పేరు మాత్రం ప్రత్యేకంగా మెరుస్తుంది…. ఒక గొప్ప కాంతినిండిన నక్షత్రంలా” అని H.G. Wells కొటేషన్ ను ఉటంకించాడు.

అశోకుని ధర్మచక్రాన్ని జాతీయజండాలోకి, నాలుగు సింహాల చిహ్నాన్ని స్వతంత్ర భారతదేశ రాజముద్రగాను నెహ్రూ స్వీకరించాడు. అశోకుని వలె నెహ్రూ కూడా అన్ని మతాలను సమాదరించే లౌకికవాద రాజధర్మాన్ని పాటించాడు. అశోకుని పేరుమీద విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పాడు. ఇది అశోకునిపై నెహ్రూకి ఉన్న అమితమైన గౌరవానికి తార్కాణం.

ఈరోజు భారతదేశం నలుమూలలా ఎగిరే జాతీయజండాపై, అధికారిక పత్రాలపై, స్టాంపులపై, ప్రతిఒక్కరి జేబుల్లో కరన్సీ రూపంలో అశోకస్తంభాగ్రంపై నిలచిన సింహాల చిహ్నం ఉండటం – నిజంగా అశోకుడి పునరుజ్జీవనం.

బొల్లోజు బాబా












1. ఈ రచనలో ఉటంకించిన అశోక శాసనముల వాక్యములకు- డా. సివి రామచంద్రరావు రచించిన అశోక ధర్మశాసనాలు, చిలుకూరి నారాయణరావు రచించిన అశోక చక్రవర్తి ధర్మశాసనములు అనే పుస్తకములు ఆధారము.
[2] An Archaelogical history of Indian Buddhism, by Lars Fogelin. Pn. 83
[3] The Relics of Culture, Vol I William Anderson Gittens- pn.78
[4] Some Aspects of Religion and Politics in Ancient Kashmir, Umar Ahmad Khanday, Journal of Critical reviews, Vol issue 01, 2019)




సంప్రదించిన పుస్తకాలు
1. Portrait of Philosopher King, Patrik Olivelle
2. Early Buddhist Visibility, Mizanur Rahman
3. Ashoka in Ancient India, Nayanjot Lahiri
4. Ashoka, The search for India’s Lost Emporer, Charles Allen
5. An archaeological history of Indian Buddhism, Lars Fogelin
6. Asoka and the Decline of the Mauryans, Romila Thapar
7. Internet, Wiki, ChatGPT