Sunday, August 20, 2023

రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సహస్రాబ్ది వేడుకల ఔచిత్యమేపాటి?


రాజరాజ నరేంద్రుడు పట్టాభిషేకం జరుపుకొని 2023 ఆగస్టు 16 నాటికి వెయ్యేళ్ళు పూర్తయిన సందర్భంగా రాజరాజ నరేంద్ర పట్టాభిషేక సహస్రాబ్ది మహోత్సవాలను ఘనంగా నిర్వహించు కొంటున్నాము.
ఈ సందర్భంగా, ఈ వేడుకలకు రాజరాజనరేంద్రుడు వంటి స్వయంగా ప్రకాశించలేని; ఒక్క యుద్ధంలోకూడా విజయం సాధించని; మేనమామ వెనుక నిలిస్తే తప్ప సింహాసనాన్ని నిలుపుకోలేకపోయిన వ్యక్తి అర్హుడేనా అనే ప్రశ్న ఉదయించక మానదు.
.
1. రాజరాజ నరేంద్రుడిది ఒక సామంతరాజు స్థాయి

తూర్పుచాళుక్యరాజుల్లో రెండవ అమ్మరాజును (CE 945-970) అతని సోదరుడైన దనార్నవుడు రాష్ట్రకూటుల సహాయంతో CE970 లో చంపి వేంగిరాజ్యాన్ని హస్తగతం చేసుకొన్నాడు. ఈ దనార్నవుడిని తెలుగు చోడరాజైన జటాచోడభీముడు చంపి వేంగి సింహాసనాన్ని అధిష్టించి CE 971-999 వరకూ పాలించాడు. దనార్నవుడి కొడుకులైన శక్తివర్మ విమలాదిత్యులు కళింగకు పారిపోయారు. జటాచోడభీముడు కళింగనుకూడా జయించటంతో శక్తివర్మ, విమలాదిత్యులు తంజావూరులోని చోళచక్రవర్తి శరణుజొచ్చారు. వీరిరువురు చోళచక్రవర్తి సంరక్షణలో 27 సంవత్సరములు తంజావూరులోనే జీవించారు.

తూర్పుచాళుక్యవంశానికి చెందిన ఈ విమలాదిత్యుడు చోళచక్రవర్తి రాజరాజు కూతురు కుందవాయిని పెండ్లిచేసుకొన్నాడు. ఈ వివాహంతో చోళ చాళుక్య వంశాల మధ్య బంధానికి బీజంపడింది.
చోళ చక్రవర్తి వేంగిరాజ్యంపై దండెత్తి జటాచోడభీముడిని సంహరించి వేంగి రాజ్యాన్ని సాధించి దానికి తన అల్లుడి అన్నగారైన శక్తివర్మను రాజుగా నియమించాడు. శక్తివర్మ CE 999-1011 వరకూ వేంగి రాజ్యాన్ని పాలించాడు. అప్పటినుంచి వేంగి రాజ్యం రాజకీయంగా, సాంస్కృతికంగా చోళుల ఆధీనంలోకి వెళిపోయింది.

శక్తివర్మ అనంతరం అతని తమ్ముడు విమలాదిత్యుడు వేంగి రాజయ్యాడు. ఈ విమలాదిత్యుని కొడుకే రాజరాజ నరేంద్రుడు. పశ్చిమచాళుక్యులు వేంగి రాజ్యంపై అనేకసార్లు దండెత్తినప్పుడు చోళ చక్రవర్తి వచ్చి వేంగి రాజ్యాన్ని కాపాడేవాడు
.
విమలాదిత్యుని మరణం(1019) తరువాత రాజరాజనరేంద్రుని సవతి తమ్ముడు విజయాదిత్యుడు వేంగినాక్రమించుకొన్నాడు. తన మేమమామ రాజేంద్రచోళుని సహాయంతో రాజరాజనరేంద్రుడు తిరిగి వేంగిరాజ్యాన్ని వశపరచుకొని CE 1022, ఆగస్టు 16న పట్టాభిషేకం చేసుకొన్నాడు. చోళచక్రవర్తి రాజేంద్రచోళుని కూతురు అమ్మంగదేవిని పెండ్లాడాడు. తొమ్మిదేండ్లు పరిపాలించాడు.

CE 1031 లో విజయాదిత్యుడు తిరిగి వేంగినాక్రమించుకొని రాజరాజ నరేంద్రుని వేంగినుండి తరిమేసి నాలుగేండ్లు పాలించాడు. రాజరాజనరేంద్రుడు పిల్లనిచ్చిన మామ అయిన చోళచక్రవర్తి సహాయంతో తిరిగి వేంగిని సాధించుకొని తిరిగి CE 1035 లో రాజయ్యాడు.
పశ్చిమ చాళుక్యు రాజైన మొదటి సోమేశ్వరుడు CE 1047 లో వేంగిని జయించాడు. తాను వేంగీపురవరేశ్వరుణ్ణని చెప్పుకొన్నాడు. 1051 వరకు రాజరాజనరేంద్రుడు చోళరాజ్యమైన తిరువాయూరులో తలదాచుకొన్నాడు. 1051, 1054 లలో పశ్చిమచాళుక్యులతో చోళులు చేసిన యుద్ధాలలో చోళసైన్యం తిరిగి వేంగిని సాధించటంలో విజయం పొందలేకపోయింది.
పశ్ఛిమచాళుక్య సోమేశ్వరుని చేతిలో ఓడిపోయిన రాజరాజ నరేంద్రుడు గత్యంతరం లేక సమాధానపడి సోమేశ్వరుని సార్వభౌమత్వాన్ని అంగీకరించి పశ్చిమ చాళుక్య సామంతుగా CE1062 వరకూ ప్రశాంతంగా వేంగిని పాలించాడు.
రాజరాజ నరేంద్రుని పాలన అంతా చోళ చక్రవర్తి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేది సొంత సామర్ధ్యం కనిపించదు. చోళరాజ్యానికి ఒక సామంతరాజ్యంగా వేంగిని దిగజార్చిన ఘనత రాజరాజనరేంద్రునిది.
.
2. గుణగవిజయాదిత్యుడు నిజమైన ఆంధ్రతేజం

గుణగవిజయాదిత్యుడు కలివిష్ణువర్ధనుడి కొడుకు. ఇతను తూర్పుచాళుక్యరాజులలో సుదీర్ఘకాలం పాలించి, రాజనీతిజ్ఞుడిగా, గొప్ప యుద్ధవీరుడిగా అత్యంత పేరుప్రఖ్యాతులు గడించాడు. CE 848 లో సింహాసనాన్ని అధిష్టించాడు. 44 ఏండ్లు పాలించాడు. ఇతనికి త్రిపురమర్త్యమహేశ్వర, త్రిభువనాంకుశ, బిరుదాంకభీమ, గుణకనల్ల అనే బిరుదులు కలవు. అరవీరభయంకరుడైన పండరంగడు, కాదేయరాజ ఇతని సేనానులు, బుద్ధిశాలి అయిన వినాయాదిశర్మన్ ఇతని మంత్రి.
గుణగవిజయాదిత్యుడు నెల్లూరు కోటను ధ్వంసం చేసి బోయకొట్టములను జయించి వేంగి రాజ్యంలో విలీనం చేసాడు. CE 866 లో గుణకవిజయాదిత్యుడు రాష్ట్రకూట రాజైన అమోఘవర్షుని చేతిలో ఓడిపోయాడు. చాన్నాళ్ళు అతనికి సామంతుగా వ్యవహరించాడు.
CE 880లో అమోఘవర్షుడు మరణించాక గుణగవిజయాదిత్యుడు స్వతంత్రాన్ని ప్రకటించుకొని రాష్ట్రకూటులపై దండెత్తి విజయం సాధించాడు. వారి రాజధాని మన్యఖేతను (కర్ణాటక) నేలమట్టం చేసాడు. రాష్ట్రకూటరాజు రెండవ కృష్ణుడు ఓడిపోయి పారిపోయి తిరిగి గుణగవిజయాదిత్యుని వద్దకు ముకులితహస్తాలతో శరణార్ధిగా రాగా అతని రాజ్యాన్ని అతనికి ఇచ్చివేసి భారీ సంపదలను కానుకలుగా స్వీకరించాడు.
ఉత్తర, పశ్చిమ రాజ్యాలను జయించి వారి సామ్రాజ్య చిహ్నాలయిన గంగ యమున లను తీసుకొచ్చి తాను నివసిస్తున్న బిక్కవోలు పట్టణంలో నిర్మించిన ఆలయానికి ద్వారపాలకులుగా ప్రతిష్టింపచేసాడు. ఇతను బిక్కవోలులో గోలింగేశ్వర, చంద్రశేఖర, రాజరాజేశ్వర ఆలయాలను, ఇంకా చేబ్రోలులో మహాశేన ఆలయాన్ని నిర్మించాడు.
***
గుణగవిజయాదిత్యుడు తెలుగు భాషను ప్రోత్సహించాడు. ఇతని కాలంలో వేయించిన అద్దంకి పండరంగని శాసనంలో ఆనాటి తెలుగుభాష తరువోజ చందస్సులో మొదటిసారిగా శాసనాలకు ఎక్కింది. నన్నయపూర్వుడైన నన్నెచోడుడు “మునుమార్గకవి లోకంబున వెలయగ దేశి కవిత పుట్టించి తెనుంగును నిలిపిరంధ్ర విషయంబున జన చాళుక్యరాజు మొదలుగ పలువుల్” అంటూ పూర్వ చాళుక్యరాజులు తెలుగు భాషను ప్రోత్సహించారు అన్నాడు. ఏ చాళుక్యరాజో తెలుపలేదు. అది బహుసా గుణగవిజయాదిత్యుడే కావొచ్చు.
ఇతని సాతులూరు తామ్రశాసనంలోని భాష సంస్కృతమైనప్పటికీ అంత్యప్రాసలున్న చంపకమాల లక్షణాలు ఉండటంచే అది ఎవరో తెలుగు కవి వ్రాసిందేనని అంటారు. గుణగవిజయాదిత్యుని తమ్ముడు యుద్ధమల్లుడు విజయవాడలో కట్టించిన కుమారస్వామి ఆలయశాసనాన్ని మధ్యాక్కర తెలుగుచందస్సులో వేయించాడు.
గుణగవిజయాదిత్యుడు ఒక యుద్ధంలో శతృరాజైన మంగిరాజ తలను నరికి దానితో బంతిఆట ఆడుకొన్నాడని, చక్రకూటాన్ని (త్రికళింగరాజధాని) దగ్ధంచేసాడని పిఠాపురం శాసనంలో కలదు. ఇతను శివభక్తుడు, వేదవేదాంగాలు నేర్చిన బ్రాహ్మణులకు అనేక గ్రామాలను దానం ఇచ్చినట్లు, కట్లపర్రు, సాతలూరు, పొన్నగి సిసలి తామ్రశాసనాలు ద్వార తెలుస్తున్నది.
.
3. రాజరాజ నరేంద్రుడిని ఎందుకు ఆకాశానికి ఎత్తేసారు?
.
CE 1922 లో రాజరాజనరేంద్రుడు పట్టాభిషేకం చేసుకొని 900 ఏండ్లు అయిన సందర్భంగా భావరాజు వెంకటకృష్ణారావు సంపాదకీయంలో శ్రీ రాజరాజనరేంద్ర పట్టాభిషేక సంచిక వెలువడింది. దీనిలో మల్లంపల్లి సోమశేఖరశర్మ, చిలుకూరి నారాయణరావు, కొమర్రాజు వెంకటలక్ష్మణరావు, చిలుకూరు వీరభద్రరావు, జయంతి రామయ్య వంటి మహామహుల వ్యాసాలు ఉన్నాయి.
 
ఈ సంచికను శ్రీ మోదుగుల రవికృష్ణ- అదనపు వివరణలు, మరిన్ని అధోజ్ఞాపికలు, ఇటీవలి ఫొటోలతో 2022 లో పునర్ముద్రించారు.
 
చరిత్రలో ఒక సాదాసీదా సామంతురాజు స్థాయి కూడా కాని రాజరాజ నరేంద్రుని ఆంధ్ర తేజంగా అభివర్ణించటానికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తాయి.
 
A. మహాభారత అనువాదం ప్రారంభింపచేయడం ఇతడు తెలుగునేలకు చేసిన మేలుగా చెబుతారు కానీ దాని కర్తృత్వం, కాలం విషయాలలో అనేక వివాదాలు ఉన్నాయి. (చూడుడు. నన్నయ భట్టారక చారిత్రము-కాశిభట్ల బ్రహ్మయ్య – 1901)

B. హిందూ ధర్మ విస్తరణ: రాజరాజనరేంద్రునికి పూర్వ చాళుక్య రాజులు బౌద్ధ, జైన, హిందూ ధర్మాలను సమాదరించారు. రాజరాజనరేంద్రుని తండ్రి విమలాదిత్యుడు జైనమతావలంబి. ఇతని గురువు త్రైలోక్యదేవ సిద్ధాంతదేవ అనే జైనాచార్యునికి విశాఖపట్నం రామతీర్థం వద్ద గుహాలయం ఉండేది.

రాజరాజనరేంద్రుడు హిందూ ధర్మాన్ని ప్రోత్సహించాడు. క్రమేపీ జైనులకు వేంగి రాజ్యంలో ఆదరణ తగ్గిపోయింది. ఈ కాలంలోనే వృషభనాథ తీర్థ అనే జైన ముని రాజమహేంద్రవరం నుంచి వరంగల్ కు వలసపోయినట్లు వరంగల్ కైఫియ్యత్ ద్వారా తెలుస్తుంది.
రాజరాజనరేంద్రుడిని “సమస్త వర్ణాశ్రమధర్మ రక్షణ మహామహిమన్ మహినొప్ప” అని కీర్తించాడు నన్నయ. “మనుమార్గు” డని వర్ణించాడు.
 
ఆంధ్రనాట హిందూధర్మం విస్తరించటానికి మహాభారత రచన ఎంతగానో తోడ్పడింది. నన్నయభారతంలో బ్రాహ్మణ ప్రసక్తి వచ్చిన ప్రతిసందర్భంలోను మూలంకంటే ఎక్కువగా పెంచి చెప్పిన ఉదాహరణలనేకం ఉన్నాయి అంటారు రంగనాథాచార్యులుగారు (రి. తెలుగు సాహిత్యచరిత్ర-ముదిగంటి సుజాతారెడ్డి పే.నం. 60)

ఆ విధంగా రాజరాజనరేంద్రుడు వర్ణాశ్రమధర్మ రక్షణ పేరిట బ్రాహ్మణీయ భావజాలాన్ని ప్రోత్సహించాడు. మనుమార్గాన్ని పదిలపరచాడు. క్రమేపీ సమాజంలో అప్పటికి ప్రబలంగా ఉన్న జైనం, అంతంతమాత్రంగా ఉన్న బౌద్ధం ఆంధ్రదేశంలో క్షీణదశకు చేరాయి.
 
ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు చరిత్రకారులు రాజరాజనరేంద్రుడికి పెద్దపీటవేయటానికి పై రెండు అంశాలు దోహదపడిఉంటాయి.

 
ముగింపు
.
తెలుగు వారి చరిత్రలో రాజరాజ నరేంద్రుని (1019-1061) గురించి ఎందుకో చాలా ఎక్కువచేసి మాట్లాడుకొంటాం. కానీ చారిత్రికంగా రాజరాజ నరేంద్రుడు ఆంధ్రదేశాన్ని తమిళరాజులకు తాకట్టు పెట్టిన వ్యక్తిగా కనిపిస్తాడు. ఇతని కాలంలో ఇక్కడ నుంచి అపారమైన సంపదలు తమిళ రాజ్యానికి తరలిపోయాయి.

చోళచక్రవర్తి వీరరాజేంద్ర తంజావూరు ఆలయంలో CE 1048లో వేయించిన ఒక శాసనంలో- వేంగిని, ఇతరప్రాంతాలను పశ్చిమచాళుక్యులనుండి తన తండ్రి తిరిగి సాధించగలిగాడని- అక్కడనుండి ఏటా లక్షాపదివేల బస్తాల ధాన్యం, 340 బంగారు వరహాలు ఆలయబాంఢాగారానికి వచ్చే ఏర్పాట్లు చేసాడని చెప్పుకొన్నాడు. (ప్రాచీనపట్టణాలు-తూర్పుగోదావరి జిల్లా- పే.నం.66)
తిరువాయూరు ఆలయంలోని ఒక శాసనంలో చోళ “సామంతు” అయిన వేంగి విమలాదిత్యదేవర్ ఎనిమిది వెండికలశాలను దేవదేవునికి సమర్పించుకొన్నట్లు ఉన్నది. ఇక్కడ సామంతు అనే పదం ముఖ్యం. చోళులు తూర్పుచాళుక్యులను సామంతులుగానే చూసేవారని అర్ధమౌతుంది.
ఏ రకమైన పెద్ద ఆలయాలు రాజరాజనరేంద్రుని పాలనలో ఆంధ్రలో నిర్మించబడలేదు. ఇదే కాలంలో తమిళనాట బృహదీశ్వర, ఐరావతేశ్వర, తంజావూరు రాజరాజేశ్వర లాంటి ప్రముఖ ఆలయాల నిర్మాణం జరగటం కాకతాళీయం కాకపోవచ్చు. తన జీవిత చరమాంకంలో రాజమహేంద్రవరం నుండి రాజరాజనరేంద్రుడు తంజావూరు తరలిపోయాడు.
రాజరాజ నరేంద్రుని విషయంలో అర్హతకు మించిన అందలం ఎక్కించామేమో మనం అని అనిపించకమానదు.
 
నిజానికి ఈ రోజు ఉత్తరాంద్రనుంచి రాయలసీమ అంటూ ఆంధ్ర ప్రదేష్ అని దేన్నైతే మనం పిలుచుకొంటున్నామో ఆ మేప్ నిర్మాత గుణగ విజయాదిత్యుడు. చోళ, పల్లవరాజులపై దండెత్తి జయించి అపారమైన బంగారాన్ని ఆంధ్రకు తీసుకొచ్చాడు. ఒకానొక దశలో తన మేనమామ అయిన అమోఘవర్షుని చేతిలో ఓడిపోయి సుమారు పదిహేనేళ్ళు అతను బ్రతికున్నంతకాలమూ సామంతుగా కట్టుబడి ఉన్నాడు. ఇదొక మానవీయకోణంగా అనుకోవచ్చు. తరువాత విజృంభించి జైత్రయాత్ర చేసి తూర్పు ఉత్తర, కర్ణాటక ప్రాంతాలను జయించి తనరాజ్యాన్ని విస్తరింపచేసాడు.
రెండవ దశలో పదిహేనేళ్లపాటు ఇతను రాష్ట్రకూటుల సామంతుగా ఉన్నప్పుడు ఏ రకమైన యుద్ధాలు లేని ప్రశాంత సమయమది. చేతినిండా అపారమైన బంగారం ఉంది. అనేక పట్టణాలు, దేవాలయాల నిర్మాణాలు చేసే అవకాశం చిక్కింది. బిక్కవోలులో ఇతను ఆలయాలు నిర్మించాడు. రాజమహేంద్రవరం పట్టణాన్ని నిర్మించింది గుణగవిజయాదిత్యుడు అనే వాదన కలదు
ఆంధ్రతేజంగా పిలువబడటానికి రాజరాజ నరేంద్రునికంటే గుణగవిజయాదిత్యునికే ఎక్కువ అర్హత ఉంది.
 
మతకోణాన్ని మినహాయించి చూస్తే రాజరాజనరేంద్రుడు ఒక చోళసామంతరాజుగా కనిపిస్తాడు. గుణగవిజయాదిత్యుని విస్మరించి ఇతని పట్టాభిషేకమహోత్సవాలను చేసుకోవటం పునరాలోచన చేయాల్సిన అంశంగా భావిస్తాను.
 
బొల్లోజు బాబా



2 comments:

  1. మీరు భలే విషయాలని ఆరా తీసి
    ఉత్సుకత కలిగించే విధంగా సరి కొత్త కోణంలో వ్రాస్తారండి


    ReplyDelete