జేమ్స్ ప్రిన్సెప్ ఈస్ట్ ఇండియా కంపనీ వ్యాపారి జాన్ ప్రిన్సెప్ కుమారుడు. జాన్ ప్రిన్సెప్ 1771 లో భారతదేశం వచ్చి నీలిమందు వ్యాపారం చేసి బాగా డబ్బు గడించాడు. ఇతను 1787 లో ఇంగ్లాండుకు తిరిగి వెళిపోయి కంపనీ వ్యాపారిగా స్థిరపడ్డాడు. పార్లమెంటు సభ్యుడు కూడా అయ్యాడు. తరువాత వ్యాపార ఒడిదుడుకులవల్ల నష్టాలపాలయ్యాడు. భారతదేశంతో జాన్ ప్రిన్సెప్ కు ఉన్న వ్యాపార సంబంధాలను ఉపయోగించుకొని తన సంతానానికి ఈస్ట్ ఇండియా కంపనీలో వివిధ హోదాలలో ఉపాధులు ఏర్పాటు చేసాడు. ఇతని పదవ సంతానంగా (ఏడవ కొడుకు) జేమ్స్ ప్రిన్సెప్ 20, ఆగస్టు, 1799 న బ్రిస్టల్ లో జన్మించాడు. కొంతకాలం ఆర్కిటెక్ట్ విద్య అభ్యసించాడు. భారతదేశ టంకశాలలో నాణ్యత పరిశీలించే అధికారి ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని తెలిసి జాన్ ప్రిన్సెప్, ఇతనిని లండన్ రాయల్ మింట్ లో నాణాల నాణ్యత పరిశీలించే అధికారిగా పనిచేసే రాబర్ట్ బింగ్లీ వద్ద ఆ విద్యలో తర్ఫీదు పొందమని పంపించాడు. అలా జేమ్స్ ప్రిన్సెప్ నాణాల నాణ్యత పరిశీలించే నైపుణ్యాన్ని పొంది, 1819 లో భారతదేశంలోని ఈస్ట్ ఇండియా కంపనీ కలకత్తా టంకశాలలో నాణ్యత అధికారిగా ఉద్యోగాన్ని పొందాడు.
జేమ్స్ ప్రిన్సెప్, హూగ్లి అనే ఓడలో ప్రయాణించి 15, సెప్టెంబరు 1819 న కలకత్తా నేలపై అడుగుపెట్టాడు. అప్పటికే ఇండియాలో పనిచేస్తున్న ఇతని సోదరులు విలియం తోబి, హెన్రి తోబిలు జేమ్స్ ప్రిన్సెప్ కు సాదరంగా ఆహ్వానం పలికారు. కలకత్తా టంకశాలలో ఇతనిని HH Wilson కు సహాయకుడిగా నియమించారు. (Colin Mackenzie మరణించాక అతను సేకరించిన సుమారు లక్షపేజీల రాత ప్రతులను, పదివేలకు పైగా నాణాలు ఇతర సేకరణలను క్రోడీకరించి కేటలాగ్ చేసిన వ్యక్తే ఈ HH Wilson). కలకత్తా వచ్చిన కొత్తలో, జేమ్స్ ప్రిన్సెప్ కొన్ని Asiatic Society [1] మీటింగులకు హాజరై అవి తనకు పెద్దగా ఆసక్తి కలిగించలేదని తండ్రికి రాసిన ఒక ఉత్తరంలో తెలిపాడు. స్థానిక ప్రముఖులైన ద్వారకానాథ్ టాగూర్ (రవీంద్రనాథ్ టాగూర్ తాతగారు), రాజా రామమోహన్ రాయ్ లను కలుసుకొన్నాడు. ఆధునిక రసాయిన శాస్త్రంలో జేమ్స్ ప్రిన్సెప్ కు ఎక్కువ అభిరుచి ఉండేది. ఈస్ట్ ఇండియా కంపెనీని ఒప్పించి కలకత్తాలో ఒక ఆధునిక సైన్స్ లాబొరేటరీని స్థాపింపచేసి Salt, Opium, Nitre లాంటి వివిధ పదార్ధాల లక్షణాలపై ప్రయోగాలు చేయాలని భావించేవాడు. Asiatic Society మీటింగులో ఒకనాడు జేమ్స్ ప్రిన్సెప్ “ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలు” అనే అంశంపై చేసిన ప్రసంగం ఆనాటి కలకత్తా సమాజంలోని ఉన్నతవర్గాలలో ఇతనికి గొప్ప పేరు తెచ్చింది.
1. బెనారస్ లో ఉద్యోగం
బెనారస్ లో కొత్తగా స్థాపించిన టంకశాలకు జేమ్స్ ప్రిన్సెప్ ను 1820లో అధికారిగా నియమించటం జరిగింది. కలకత్తానుండి 800 మైళ్ళ దూరంలో ఉన్న బెనారస్ కు పడవపై బయలుదేరి నవంబరులో చేరుకొన్నాడు. బెనారస్ టంకశాలలో నాణ్యతాధికారిగా బాధ్యతలు స్వీకరించాడు. కొత్తగా నిర్మించిన తన అధికారిక నివాసం ఆకర్షణీయంగా లేదని కొన్ని ఆర్కిటెక్చరల్ మార్పులు చేయించాడు జేమ్స్ ప్రిన్సెప్. ఈ మార్పులు బెనారస్ లో విధులు నిర్వహిస్తున్న ఇతర యూరోపియన్ అధికారులకు తెగనచ్చేసాయి. జేమ్స్ ప్రిన్సెప్ భవన నిర్మాణ సామర్ధ్యం పట్ల గౌరవాభిమానాలు పెరిగాయి. ఆర్కిటెక్చర్ కు సంబంధించి ఇతనిని సలహాలు అడగసాగారు. తన అధికారిక నివాసంలో సైన్సు ప్రయోగాలకొరకు ఒక లాబొరేటరీని ఏర్పాటుచేసుకొన్నాడు. ఈ ప్రయోగశాలలో జేమ్స్ ప్రిన్సెప్ -నాణెముల కొరకు లోహములు కరిగించే కొలిమిలో ఉష్ణోగ్రతను ఖచ్చితంగా గణించే Pyrometer అనే పరికరాన్ని, ఒక వడ్లగింజలో వెయ్యోవంతు బరువు తూచగల సున్నితపు త్రాసుని కనుగొన్నాడు. ఈ ఆవిష్కరణల వల్ల జేమ్స్ ప్రిన్సెప్ కు 1828 లో Royal Society లో శాస్త్రవేత్తలకు లభించే ఫెలోషిప్ లభించింది.
జేమ్స్ ప్రిన్సెప్ తెల్లవారు జామునే నిద్రలేచి బ్రేక్ పాస్ట్ సమయానికి ఆఫీసుపనులన్నీ ముగించుకొని, మూడు మైళ్ళ దూరంలో ఉన్న టంకశాలకు వెళ్ళి అక్కడ తనిఖీలు నిర్వహించి, పనులు పురమాయించి, ఎండవేడిమి పెరగకుండా ఉదయం పదిగంటల సమయానికల్లా తన బంగ్లాకు చేరుకొనేవాడు. ఇక రోజంతా ఖాళీ. తనకు నచ్చిన పనులు చేసుకొనే వెసులుబాటు చిక్కేది. ఆ విధంగా చిక్కిన సమయంతో బెనారస్ లో జేమ్స్ ప్రిన్సెప్ అనేక పనులు చేయగలిగాడు. అవి
1. రెండేళ్లపాటు శ్రమించి బెనారస్ పట్టణ మేప్ ను చిత్రించాడు.
2. స్థానిక యురోపియన్లు, ఈస్ట్ ఇండియా కంపనీ ఉమ్మడి వ్యయంతో ఒక చర్చి నిర్మాణం గావించాడు.
3. 1823 లో కంపనీకి అధికలాభాలు వచ్చిన సందర్భంగా దేశంలోని కొన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచటానికి నిధులు ఇస్తాం ప్రతిపాదనలు ఇవ్వండి అని అధికారులను కోరింది. అలా బెనారస్ అభివృద్ధి కమిటీకి జేమ్స్ ప్రిన్సెప్ సెక్రటరీ. నగర సుందరీకరణలో భాగంగా భవనాలకు హాని కలుగకుండా రోడ్లు వెడల్పు చేసే ప్రతిపాదనలు పంపి ఆ పనులను స్వయంగా పర్యవేక్షించాడు.
4. బెనారస్ లో గుంటలు, పల్లపు ప్రాంతాలు అధికం. వానాకాలంలో వాటిలో నీరు చేరి పట్టణం అంతా మురికిగా అపరిశుభ్రంగా మారేది. దీనికి పరిష్కారంగా నగర సుందరీకరణ నిధులతో మురుగు నీరు పారటానికి భూగర్భ సొరంగాన్ని తవ్వించాడు. ఈ సొరంగం పట్టణంలో అనేక ఏడంతస్తుల భవనాలకు క్రిందుగా, వాటి పునాదులకు ఏ మాత్రం నష్టం కలగకుండా నిర్మింపచేసి పలువురి మన్ననలు పొందాడు.
5. బెనారస్ ప్రజలు ఇతనికి కొంత భూమిని కానుకగా ఇవ్వగా, దానిని చదును చేసి, స్థానికి మార్కెట్ నిర్వహించుకొనటానికి తిరిగి దానంగా ఇచ్చివేసాడు. పట్టణ మధ్యలో ఉన్న ఆ స్థలం అప్పటికే ఎంతో విలువైనది కాగా జేమ్స్ ప్రిన్సెప్ ఆనాటికి ఒక సాధారణ కంపనీ ఉద్యోగి.
6. బెనారస్ లో ఔరంగజేబు నిర్మించిన ఒక మసీదు (ఆలంగిరి మసీదు) శిథిలావస్థకు చేరగా జేమ్స్ ప్రిన్సెప్ దాని పునాదులను బలపరచి పునర్నిమింపచేసాడు.
7. బెనారస్, కలకత్తా రహదారిపై ఒక ధనవంతుడైన హిందూ వ్యాపారి తానే ఖర్చులు పెట్టుకొంటాను అనే కోరికపై, Karamnasa నదిపై లక్షరూపాయిల వ్యయంతో ఒక వంతెనను నిర్మించాడు. మొదట్లో కంపనీ ఇంజనీర్లు అక్కడి నేల మంచిది కాదని, వరదల వల్ల కొట్టుకొనే పోయే ప్రమాదం ఉందని వంతెన నిర్మాణాన్ని వ్యతిరేకించారు. ఆ నదిని హిందువులు దాటటం ప్రమాదమని, ఒక బ్రాహ్మణుని వీపున కూర్చుని మాత్రమే ఆ నదిని దాటాలని, స్థానికులలో ఒక విశ్వాసం ఉండేది. వంతెన కడితే అలా ఆ నదిని దాటించే బ్రాహ్మణులు తమ ఆదాయం కోల్పోతారనే కారణం వల్ల కూడా ఆ వంతెన నిర్మాణానికి కొందరు అభ్యంతరం పలికారు. ఇన్ని ప్రతికూలతల మధ్య జేమ్స్ ప్రిన్సెప్ వారందరినీ ఒప్పించి వంతెన నిర్మించి అది భారీ వరదలను కూడా తట్టుకొని నిలబడగలదని నిరూపించాడు.
8. మొదటిసారిగా బెనారస్ పట్టణ జనాభా లెక్కలు తీయించాదు.
9. ప్రిన్సెప్ అద్భుతమైన చిత్రకారుడు. బెనారస్ వీధులు ఘాట్ ల చిత్రాలను స్వయంగా గీసి 1825 లో ఇంగ్లాండుకు పంపగా వాటిని Illustrations of Benares పేరుతో పుస్తకరూపంలో ముద్రించారు కాశీ విశ్వనాథుని ఆలయంలోపలికి కొంతమేరకు చొచ్చుకొని కట్టిన చారిత్రాత్మక జ్ఞానవపి మసీదు చిత్రం జేమ్స్ ప్రిన్సెప్ లిఖించినదే.
2. కలకత్తాకు బదిలీ
గవర్నర్ విలియం బెంటింగ్ కలకత్తాలోని టంకశాలను విస్తరింపచేసి, బెనారస్ లోని టంకశాలను మూసివేయించటంతో జేమ్స్ ప్రిన్సెప్ 1830 లో బెనారస్ నుంచి కలకత్తాకు బదిలీ చేయబడ్డాడు. అప్పటికి కలకత్తాలో జేమ్స్ ప్రిన్సెప్ సోదరుడు విలియమ్ తోబి Palmer & Co పేరుతో నడుపుతున్న ఒక ఫైనాన్స్ కంపనీ మూడు మిలియన్ రూపాయిల మేరకు దివాళాతీయటంతో అతని ఆస్తులన్ని ప్రభుత్వం జప్తుచేసి వేలంవేసింది. దానితో రోడ్డునపడ్డ తోబి కుటుంబాన్ని తనవద్దే ఉంచుకొని పోషించసాగాడు జేమ్స్ ప్రిన్సెప్.
Salt water lake canal పనులను పర్యవేక్షించి తిరిగి వస్తుండగా గుర్రంనుంచి పడిపోయి అపస్మారక స్థితిలోకి చేరి, తిరిగి కోలుకోక, 1830 లో జేమ్స్ ప్రిన్సెప్స్ మరొక సోదరుడైన థామస్ మరణించాడు, కలకత్తా చుట్టూ ఉండే కాలువలను బాగుపరచి జలరవాణాకు ఉపయోగపడేలా చేసే ప్రొజెక్టు అది. సోదరుని మరణంతో అది అర్ధాంతరంగా ఆగిపోయింది. గవర్నరు విలియం బెంటింగ్ సూచనతో ఆ పనిని ప్రిన్సెప్స్ చేపట్టి పూర్తి చేసాడు.
జేమ్స్ ప్రిన్సెప్ 1830 లో లూసీ అనే ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆమె మరొకరిని ఇష్టపడుతున్నదని తెలిసి తన ప్రేమను వెల్లడించక హృదయంలోనే దాచుకొని, చాలాకాలం పెళ్ళిచేసుకోకుండా
ఉండిపోయాడు. చాన్నాళ్ల తరువాత, 25 ఏప్రిల్, 1835 న బెంగాల్ ఆర్మీ కల్నెల్ కూతురు Harriet ను వివాహం చేసుకొన్నాడు. వీరికి ఒక కొడుకు, కూతురు కలిగారు. కొడుకు చిన్నతనంలోనే చనిపోయాడు.
3. ఆసియాటిక్ సొసైటీ కి దిశానిర్ధేశం
1831 లో తన పై అధికారి HH Wilson సలహామేరకు Asiatic Society లో మెంబరుగా చేరాడు.
Asiatic Society లో చేరగానే జేమ్స్ ప్రిన్సెప్ ని ఆకర్షించినవి అక్కడ గుట్టలు గుట్టలుగా పేరుకొని ఉన్న కొన్ని వేల పాత నాణాలు. ఇవన్నీ కంపనీ ఆధీనంలో ఉన్న బారతదేశపు వివిధ ప్రాంతాలలో తవ్వకాలద్వారా లభించిన నాణాలు. వీటిని ఆయాప్రాంతాల కంపనీ అధికారులు పరిశోధనల నిమిత్తం కలకత్తాలోని ఆసియాటిక్ సొసైటీ కి పంపించే వారు. వీటిలో అనేక బంగారునాణాలు కూడా ఉండేవి. వీటన్నిటిని జేమ్స్ ప్రిన్సెప్ అధ్యయనం చేయటం మొదలుపెట్టాడు. శాస్త్రీయదృక్ఫథంతో Numismatics ని చూడనారంభించాడు. ఆ నాణాలను క్రోడీకరించి వాటిని పెర్షియన్, బాక్ట్రియన్, హిందూ, గ్రీకు, సింహళ అంటూ వివిధ రకాలుగా వర్గీకరించి అనేక వ్యాసాలు రాసాడు.
ఆరేళ్ళ కాలంలో రాసిన ఆ వ్యాసాలను, జేమ్స్ ప్రిన్సెప్ మరణానంతరం Essays on Indian Antiquities, Historic, Numismatic and Palaeographic, James Prinsep, అంటూ రెండు వాల్యూముల పుస్తకాలుగా తీసుకొని వచ్చారు.
1832 లో HH Wilson ఆక్స్ ఫర్డ్ లో సంస్కృతం బోధించడానికి కలకత్తాను విడిచి వెళిపోయాకా జేమ్స్ ప్రిన్సెప్ కలకత్తా టంకశాలకు ప్రధానాధికారిగా, ఆసియాటిక్ సొసైటీకి సెక్రటరీగా బాధ్యతలు చేపట్టాడు.
టంకశాల అధికారిగా విధులు చేపట్టాక జేమ్స్ ప్రిన్సెప్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పు-అంతవరకూ ముద్రిస్తున్న వెండిరూపాయిలకు బదులు మొదటి సారిగా రాగి రూపాయి నాణాలను తీసుకురావటం. ఈ రాగి నాణానికి ఒకవైపు బ్రిటిష్ చక్రవర్తి విలియం IV యొక్క శిరస్సు, మరొకవైపు ఈస్ట్ ఇండియా కంపనీ పేరు కలదు. జేమ్స్ ప్రిన్సెప్ స్వయంగాఈ నాణాన్ని డిజైన్ చేసాడు. ఇది 1835 నుండి చలామణిలోకి వచ్చింది. ఈ నాణాలను ముద్రించటానికి మొదటి సారిగా ఆవిరి యంత్రాన్ని వినియోగించాడు.
జేమ్స్ ప్రిన్సెప్ ఆసియాటిక్ సొసైటీకి సెక్రటరీగా బాధ్యతలు తీసుకున్న అనంతరం, సొసైటీ పేరును Asiatic Society of Bengal గా మార్పు చేసాడు. ఈ సొసైటీకి Asiatick Researches పేరుతో ఒక అధికారిక పత్రిక ఉండేది. అదే కాలంలో Gleanings of Science అనే ఒక పత్రిక మూతపడే స్థితికి వచ్చింది. జేమ్స్ ప్రిన్సెప్ Asiatick Researches మరియు Gleanings of Science అనే ఈ రెండు పత్రికలను విలీనం చేసి Journal of the Asiatic Society of Bengal (JASB) అనే కొత్త పేరుతో కొనసాగించాడు. దేశవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక చరిత్రకారులకు భారతదేశ చరిత్ర, సంస్కృతులను ప్రతిబింబించే తమ పరిశోధనా పత్రములు పంపమని, JASB ని వేదికగా చేసుకొమ్మని పిలుపునిచ్చాడు.
కలోనియల్ పీరియడ్ లో భారతదేశం ఇంకా ఇతర ప్రాంతాలనుంచి అనేక చారిత్రిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన కొన్ని వేల లోతైన పరిశోధనా వ్యాసాలు ఈ జర్నల్ లో ప్రచురించబడ్డాయి. భారతదేశ చరిత్రను అభూతకల్పనలతో కాక శాస్త్రీయంగా మదింపు వేయటంలో ఈ పత్రిక పాత్ర ఎనలేనిది. ఈ సొసైటీ నేటికీ The Asiatic Society పేరుతో కొనసాగుతున్నది.
ఆసియాటిక్ సొసైటీకి సెక్రటరీగా దాని అధికారిక జర్నల్ కు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహించే క్రమంలో, జేమ్స్ ప్రిన్సెప్ లోని జ్ఞానతృష్ణ రెక్కలు తొడిగి విహరించటం ప్రారంభించింది. దేశం నలుమూలలనుంచి అనేక శాసన ప్రతులు, నాణాలు, శిల్పాల నకళ్ళు ఇతర ఆర్కియలాజికల్ ఆవిష్కరణలు నిత్యం సొసైటీకి రిపోర్టుల రూపంలో అందేవి. గొప్ప మేధావులు తమ పరిశోధనలను జర్నల్ కు ప్రచురణకొరకై పంపేవారు. వారి అందరితో ప్రిన్సెప్ కు పరిచయాలు కలిగాయి. ఈ నేపథ్యంలో జేమ్స్ ప్రిన్సెప్ లో భారతీయ ప్రాచీన విజ్ఞానం చరిత్ర పట్ల ఎనలేని ఆసక్తి మొదలైంది. తనకాలాన్ని, మేధను భారతదేశ పాచీనచరిత్రను అధ్యయనం చేయటానికి వెచ్చించాలని నిర్ణయించుకొన్నాడు.
జేమ్స్ ప్రిన్సెప్ అంతవరకూ సమాజానికి అందించిన సేవలు ఒక ఎత్తు అయితే, అర్ధంకాకుండా ఒక మిస్టరీగా ఉన్న బ్రాహ్మి లిపిని అర్ధం చేసుకోవటం మరొక ఎత్తు. ఈ పనివల్ల జేమ్స్ ప్రిన్సెప్ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తిగా వినుతికెక్కాడు.
4. ప్రాచీన భారతదేశ చరిత్రకు తాళంచెవి బ్రాహ్మి లిపి
కొందరి అసూయ, ద్వేషం కారణంగా మృతప్రాయంగా మారిన ఒక లిపిని జేమ్స్ ప్రిన్సెప్ తిరిగి బతికించాడు. రోసెట్టా స్టోన్ పురాతన ఈజిప్షియన్ సంస్కృతి గురించిన మన అవగాహనను మార్చినట్లు, బ్రాహ్మి లిపిని అర్ధం చేసుకోవటం ద్వారా వందలసంవత్సరాలుగా దాచబడిన ప్రాచీన భారతదేశ చరిత్ర ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
కొందరి అసూయ ద్వేషం కారణంగా విస్మృతమైన ఒక మహా సామ్రాజ్యాన్ని జేమ్స్ ప్రిన్సెప్ తిరిగి సజీవంగా నిలిపాడు. అశోక చక్రవర్తి అఖండ భారతదేశ నిర్మాత. కాశ్మీరు, నేపాల్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేష్, తమిళనాడుల వరకూ ఇతని సామ్రాజ్యం విస్తరించిఉంది. తన రాజ్య సరిహద్దుల వద్ద తన శాసనాలు వేసిన స్తంభాలను పాతించాడు. అయినప్పటికీ ఇతని పేరు హిందూదేశ చరిత్రలో కనిపించదు. ఏ పురాణాలూ ఇతన్ని కీర్తించవు. ఏ రాజవంశావళులు ఇతనికి సరైన స్థానం ఇవ్వవు. అలాంటి అశోకచక్రవర్తి పేరును మరలా చరిత్రలో తిరగరాయించిన వ్యక్తి జేమ్స్ ప్రిన్సెప్.
కొందరి అసూయ ద్వేషం కారణంగా నేలపొరల్లోకి నెట్టబడిన ఈ దేశ వారసత్వమైన బౌద్ధమతం మరలా పునరుజ్జీవం పొందటంలో జేమ్స్ ప్రిన్సెప్ పాత్ర విస్మరింపరానిది.
పై మూడు పనులు భారతదేశ చరిత్రకు జేమ్స్ ప్రిన్సెప్ ఇచ్చిన కాన్కలు. 18వ శతాబ్దం వచ్చేసరికి దేశంనలుచెరగులా కనిపించే అశోకుని స్తంభాలు, శాసనాలు దానిలో ఉండే భాష , ఎక్కడ తవ్వినా బయటపడే బౌద్ధ విగ్రహాలపట్ల ఎవరికీ అవగాహన ఉండేది కాదు. స్వతహాగా జిజ్ఞాసకలిగిన కొందరు ఈస్ట్ ఇండియా కంపనీ అధికారులు వీటిగురించి తెలుసుకోవాలని ప్రయత్నించినా అశోకస్తంభం భీమసేనుడి గధ అని, దానిపై అర్ధంకాని రాత బ్రహ్మ రాత అని, బుద్ధుని విగ్రహాలు విష్ణుమూర్తి పదో అవతారమనీ కానీ బౌద్ధం ఒక దారితప్పిన మతమని పొంతనలేని సమాధానాలు వచ్చేవి తప్ప సరైన వివరాలు ఎవరూ చెప్పే వారు కాదు. బ్రాహ్మి లిపిని డెసిఫర్ చేయటం ద్వారా ఈ మొత్తం అజ్ఞానాన్ని బద్దలుగొట్టాడు జేమ్స్ ప్రిన్సెప్.
***
భారతదేశములో లిపి అనేది కనీసం సింధులోయనాగరికత నుంచి కనిపిస్తుంది (3300 BCE to 1300 BCE). లిపి వేరు భాషవేరు. ఇంగ్లీషు, ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్ లాంటి భాషలు రోమన్ లిపిలో రాస్తారు. హింది, సంస్కృతం, మరాఠి, నేపాలి, సింధి లాంటి భాషలు దేవనాగరి లిపిలో రాస్తారు. అదే విధంగా పాలి, గాంధారి, మాగధి భాషలు బ్రాహ్మి లిపిలో రాసేవారు.
ప్రాచీన భారతదేశంలో BCE 5వ శతాబ్దమునుంచి బ్రాహ్మి లిపి వాడుకలో ఉంది. ఈ లిపిని భారతదేశ మూలవాసుల లిపిగా చెబుతారు. BCE 3 వ శతాబ్దం, అశోకుడు కాలంలో ఇది ఉఛ్ఛస్థితిలో ఉంది. అందుకనే అశోకుని శాసనాలు అన్నీ బ్రాహ్మి లిపిలో ఉన్నాయి. ప్రాచీన బ్రాహ్మిని అశోక బ్రాహ్మి అంటారు. ఈ లిపిని అప్పట్లో సామాన్యులు కూడా చదవగలిగేవారు. (see. Child learning brahmi, Terracotta sculpture from BCE 2 centuary) కానీ క్రమేపీ ఈ లిపి నుండి తమిళబ్రాహ్మి, గుప్త బ్రాహ్మి, కళింగ బ్రాహ్మి, భట్టిప్రోలు బ్రాహ్మి లాంటి అనేక స్థానిక రూపాలు రావటం వల్ల CE4 వ శతాబ్దము నాటికే ప్రజలు క్రమేపీ మూలరూపమైన అశోకబ్రాహ్మి లిపిని మరచిపోయారు.
నాలుగో శతాబ్దంలో భారతదేశంలో ప్రయాణించిన చైనా యాత్రికుడు ఫాహియాన్, పాటలిపుత్రలోని బ్రాహ్మిఅశోక స్తంభంపై ఉన్న విషయాలు అంటూ ఎవరో స్థానికులు చెప్పిన ఏవేవో సంబంధం లేని కథలను నమోదు చేసాడు. అంటే ఆ సమయానికే బ్రాహ్మి లిపిని చదవగలిగే పరిస్థితిలేదని భావించాలి. [2]. ఏడవ శతాబ్దపు హుయాన్ త్సాంగ్ కూడా అశోక స్తంభాలను వర్ణించాడు తప్ప వాటిపై బ్రాహ్మి లిపిలో ఉన్న విషయాలను చెప్పలేదు. [3]
****
ఫిరోజ్ ఖాన్ తుగ్లక్ (1309-1388) హర్యానలోని తోప్రా వద్ద 42 అడుగుల పొడవు ఉన్న ఒక అశోక స్తంభం చూసి ఆశ్చర్యపడి, దాన్ని ఢిల్లీకి తీసుకొని రమ్మని ఆదేశించాడు. దాన్ని 42 చక్రాల భారీ వాహనంపై యమున నదీ తీరం వద్దకు చేర్చగా, అక్కడినుంచి పడవలమీద డిల్లీకి తరలించారు. ఆ స్తంభంపై ఉన్న వాక్యాలకు అర్ధం ఏమిటో తెలుసుకోవాలని ఫిరోజ్ ఖాన్ భావించాడు. కొందరు పండితులను పిలిపించి వాటిని చదవమన్నాడు. ఆ పండితులు ఆ స్తంభం భీమసేనుడి చేతి కర్ర అని; భారత యుద్ధం ముగిసాక దాన్ని తోప్రా లో విడిచిపెట్టాడని; దానిపై “ఈ స్తంభాన్ని ఫిరోజ్ ఖాన్ అనే చక్రవర్తి వచ్చి కదిపే వరకూ దాన్ని ఎవరూ కదిలించలేరు” అనే వాక్యాలు ఉన్నాయని చెప్పారట. ఇది ఆ పండితుల మోసకారితనమే కాక, బ్రాహ్మిలిపి చదవగలిగే వారు పండితులలో కూడా ఎవరూ లేరనే విషయాన్ని తెలియచేస్తుంది.
18 వ శతాబ్దం వచ్చేసరికి భారతదేశ చరిత్రను తెలుసుకోవటానికి ఎంతో మంది యూరోపియన్స్ ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా వారి కాలాన్ని, మేధను వెచ్చించే వారు. వీరికి ప్రాచీన శాసనాలు కొరుకుడు పడేవి కావు. ముఖ్యంగా బ్రాహ్మి లిపిలో ఉన్న శాసనాలు. ఈ నేపథ్యంలో Charles Wilkins 1781 లో 9వ శతాబ్దానికి చెందిన ఒక బ్రాహ్మి శాసనాన్ని చదవగలిగాడు. కానీ ఈ బ్రాహ్మి లిపి ఆధునిక బెంగాల్ లిపితో ఎంతో సారూప్యం కలిగి ఉండటంతో అది సాధ్యమైంది కానీ మరీ ప్రాచీన అశోక బ్రాహ్మిని అర్ధం చేసుకోవటంలో ఈ ముందడుగు ఏమాత్రమూ ఉపయోగపడలేదు. (బ్రాహ్మి లిపి కాలానుగుణంగా మారటం వల్ల నేటి మన తెలుగు, తమిళ, కన్నడ, బెంగాలి, దేవనాగరి లాంటి సమస్త భారతీయ లిపులు ఆవిర్భవించాయి. ఈ మార్పుల వల్ల మూల అశోకలిపికి ఇవి దూరం జరిగిపోయాయి). Charles Wilkins ను ఆదర్శంగా తీసుకొని బ్రాహ్మిలిపిపై William Jones కొంత కృషిచేసినా అది ఫలించలేదు.
****
మరో మూడు దశాబ్దాల వరకూ బ్రాహ్మి లిపిని అర్ధం చేసుకోవటంలో ఏ పురోగతి రాలేదు. ఆ తరువాత 1834 లో జేమ్స్ ప్రిన్సెప్ బ్రాహ్మిలిపిపై పనిచేయటం ప్రారంభించి 5 ఏళ్ళలో వివిధ దశలలో దాన్ని పూర్తిగా డెసిఫర్ చేయటం జరిగింది.
ఎ. మొదటి దశ
జేమ్స్ ప్రిన్సెప్స్ బెనారస్ లో పనిచేస్తున్న సమయంలో ఒకనాడు అలహాబాదు కోటను సందర్శించాడు. కోటవెలుపల ఎండ,వానలకు మగ్గుతున్న ఒక పెద్ద స్తంభాన్ని చూసాడు. దానిపై ఉన్న అక్షరాలు శిథిలమైపోతున్నాయి. ఆ అక్షరాలలో మొఘల్ చక్రవర్తి జహంగిర్ పేరును గుర్తించి, ఇది చారిత్రికంగా విలువైన స్తంభం అయి ఉంటుందని భావించి అలహాబాదులోనే పనిచేస్తున్న TS Burt అనే అధికారిని ద్వారా, ఆ స్తంభంపై ఉన్న శాసనాల నకలును తెప్పించుకొని అధ్యయనం చేసాడు.
ఆ స్తంభాన్ని స్థానికులు భీముని గధ అని పిలుచుకొంటారు. దీనిపై భిన్నకాలాలో ముగ్గురు చక్రవర్తులు వేయించిన మూడు శాసనాలు ఉన్నాయి. మొదటిది అశోకుడు బ్రాహ్మిలిపిలో వేయించిన శాసనం. రెండవది సముద్రగుప్తుడు (c. 335–375 CE) తన విజయాలను నమోదుచేస్తూ సంస్కృతంలో వేయించిన ప్రశస్థి శాసనం. మూడవది జహంగీర్ పర్షియన్ భాషలో వేయించిన శాసనం. పై మూడు శాసనాలలో బ్రాహ్మి లిపిలో ఉన్న మొదటి శాసనం గురించి Note on Inscription No.1 of the Allahabad Column అనే పేరుతో జేమ్స్ ప్రిన్సెప్1834 లో ఒక వ్యాసం రాసి దాదాపు బ్రాహ్మి లిపి పై ఏర్పడిన ముప్పై ఏళ్ళ నిశ్శబ్దాన్ని ఛేదించాడు. [4]
ఈ వ్యాసంలో జేమ్స్ ప్రిన్సెప్ బ్రాహ్మి లిపి లక్షణాలను కొన్ని ప్రతిపాదించాదు.
1. బ్రాహ్మి లిపి abugida రకపు లిపి అని గుర్తించాడు. అబుగిడా లిపి అంటే - అక్షరాలకు గుణింతాలు, ఒత్తులు ఉంటూ, ఇతర అక్షరాలతో కలిసి సంయుక్తాక్షరాలను ఏర్పరచే లక్షణం కలిగిఉండటం. మన తెలుగు భాష అలాంటిదే. (ఇంగ్లీషు అలా కాదు ఏ అక్షరానికి ఆ అక్షరమే లెక్క.)
2. పై శాసనంలో ఒక్కొక్క అక్షరం ఎన్ని సార్లు వచ్చిందో లెక్కించాడు. ఒక్కో అక్షరం ఐదు రూపాలలో ఉన్నట్లు గుర్తించాదు. కింద ఇచ్చిన ఫొటోలో 𑀫 (మ) అనే అక్షరం 32 సార్లు వచ్చిందని, దాని ఇతర రూపాలు 𑀫𑀸 (మా) 3 సార్లు, 𑀫𑁂 (మే) 11 సార్లు రావటాన్ని బట్టి ఈ అక్షరాల మధ్య ఒక పాటర్న్ ను గమనించాడు. అది సంస్కృతం కంటే ప్రాకృతబాషకు దగ్గరగా ఉందని భావించాడు.
3. బ్రాహ్మి లిపిలో అచ్చులు హల్లులు ఉంటాయని చెప్పాడు
.
బి. రెండవ దశ
.
మొదటి దశలో జేమ్స్ ప్రిన్సెప్ ఆ శాసనంలోని అక్షరాలను గుర్తించగలిగాడు. వాటి పేటర్న్ ను గ్రహించాడు. వాటిని ఎలా పలకాలో తెలియదు. అలహాబాదు శాసనం పై జేమ్స్ ప్రిన్సెప్ రాసిన వ్యాసాన్ని చదివిన Hodgson తాను ఇదివరలో నేపాల్ సమీపంలోని Mathiah and Radhai అనే గ్రామాలనుంచి సేకరించిన కొన్ని శాసనాలుకూడా ఇదే విధంగా ఉన్నాయని భావించి వాటి నకళ్ళను పంపించాడు.
అలహాబాదు, Mathiah and Radhai, ఫిరోజ్ షా (ఢిల్లి) స్తంభ శాసనాలు మొత్తం మూడు బ్రాహ్మి శాసనాలు ప్రిన్సెప్ వద్ద ఉన్నాయి. వాటిని అధ్యయనం చేసి కొన్ని కొత్త విషయాలను గమనించి 1834 లో మరొక వ్యాసాన్ని రాసాడు [5] . దానిలో-
1. త 𑀢𑀸 అనే అక్షరానికి య 𑀬𑀸 అనేఅక్షరం జతపరచినపుడు 𑀢𑁆𑀬𑀸 త్య అనే సంయుక్తాక్షరం ఏర్పడుతుందని గుర్తించాడు. (See Table)
2. ఈ మూడు శాసనాలు 𑀤𑁂𑀯𑀦𑀫𑁆𑀧𑀺𑀬𑁂 𑀧𑀺𑀬𑀤𑀲𑀺 𑀮𑀚 అనే వాక్యంతో ప్రారంభమౌతున్నాయని గమనించాడు. ఆ వాక్యాలను “దేవనంపియే పియదసి లజ” అని చదవాలని; దాని అర్ధం Beloved of the Gods, King Priyadarsin అని; అది అశోక చక్రవర్తిని సూచిస్తుంది అని ప్రిన్సెప్ కే కాదు అప్పటికి ఎవరికీ తెలియదు. అయినప్పటికీ ఆ వాక్యం గురించి ప్రిన్సెప్ ఇలా ఊహించాడు – “అది అనేక విజయాలు సాధించిన రాజు పేరు కావొచ్చు; లేదా మతసంబంధమైన వాక్యం కావొచ్చు; బౌద్ధులకు లేద బ్రాహ్మణులకు ముఖ్యమైన వాక్యం కావొచ్చు” ఈ మూడు ఊహలు దాదాపు సరైనవే.
సి. మూడవ దశ
ఆ తరువాత రెండేళ్లపాటు ఏ రకమైన పురోగతి లేదు. 1836 లో Christian Lassen అనే నార్విజియన్ స్కాలర్ ఇండో బాక్ట్రియన్ రాజు Agathocles (BCE 190) వేయించిన ద్విభాషా నాణాలపై ఒక వ్యాసం రాసాడు [6].
అలెగ్జాండర్ భరతఖండంలోని కొన్ని పశ్చిమ ప్రాంతాలను జయించి వాటిని పరిపాలించుకొమ్మని తన సైన్యాధికారులకు అప్పగించి వెనుతిరిగాడు. అలా గాంధారలో విడిచి వెళ్ళిన సైన్యాధికారుల సంతతి ఈ Agathocles రాజు. ఇతను వేయించిన నాణెంపై ఇతని పేరు ఒకవైపు Basileōs Agathokleous (King Agathocles) అని గ్రీకులోను, మరొకవైపు 𑀅𑀕𑀣𑀼𑀓𑁆𑀮 𑀭𑀸𑀚 (Agathukla raja) బ్రాహ్మిలోను ఉన్నాయి. Lassen కు గ్రీకు వచ్చు కనుక గ్రీకు లిపిని బట్టి బ్రాహ్మిలో ఉన్న అక్షరాలను పోల్చగలిగాడు.
1. ఇది చదివిన ప్రిన్సెప్ కు ఎంతో ఉత్సాహం వచ్చింది. ఇతను అప్పటికే ప్రాచీన నాణాల అధ్యయనంలో అథారిటీగా పేరుతెచ్చుకొన్నాడు. ఇతనివద్ద ఉన్న అనేక ద్విభాషానాణాలను Lassen తరహాలో మరలా పరిశీలించి మరికొన్ని బ్రాహ్మి అక్షరాలను అర్ధం చేసుకోగలిగాడు.
2. సాంచి దానశాసనాలు అన్నింటిలో చివర 𑀤𑀸𑀦𑀁 అక్షరాలు ఉన్నట్లు గమనించాడు. ఇవి బహుశా “దానం” అనే పదాన్ని సూచించవచ్చని సరిగానే ఊహించాడు ప్రిన్సెప్. అలా మరో రెండుఅక్షరాలను గుర్తించాడు [7] .
3. బ్రాహ్మి లిపి కొద్దికొద్దిగా తనని తాను తెరుచుకోవటం మొదలైంది. ప్రతిశాసనంలో మొదటి వాక్యం దేవనంపియే పియదసి లజ” అని ఉండటం ప్రిన్సెప్ ను ఆశ్చర్యానికి గురిచేసేది. ఇతను రాజు అయితే ఇతని రాజ్యం భరతఖండమంతటా విస్తరించి ఉందని అర్ధమయింది కానీ దేవానంప్రియ పేరుతో ఏ రాజు పేరు హిందూ పురాణాలలోకానీ, రాజుల వంశానుక్రమణికల్లో కానీ ఎక్కడా ఎంతవెతికిన కనిపించలేదు.
4. ఆ రాజు ఎవరు అనే దానికి సమాధానం - శ్రీలంకలో 3 వ శతాబ్దంలో పాలిభాషలో రచింపబడిన దీపవంశ అనే గ్రంథంలో లభించింది. దీపవంశ గ్రంథాన్ని శ్రీలంకలోని బ్రిటిష్ అధికారి George Turnour అనువదించాడు. అందులో “Piyadassi … who, the grandson of Chandragupta, and own son of Bindusara” అనే వాక్యాన్ని పరిశీలించమని అతనే స్వయంగా ప్రిన్సెప్ కు పంపించాడు. దాన్ని వివరిస్తూ George Turnour స్వయంగా ఆసియాటిక్ జర్నల్ లో ఒక వ్యాసం రాసాడు [8]. అలా దేవనంపియే పియదసి అనే వాక్యం అశోక చక్రవర్తిని సంబోధిస్తున్నదని నిర్ధారణ అయింది [9] .
5. బ్రాహ్మి లిపికి పాలి భాషతో ఉన్న సంబంధాన్ని గ్రహించిన జేమ్స్ ప్రిన్సెప్, పాలి భాష తెలిసిన రత్న పౌల అనే సహాకుడినిపెట్టుకొని బ్రాహ్మి లిపిని సంపూర్ణంగా డెసిఫర్ చేసాడు. ఆ తరువాత బ్రాహ్మికి దగ్గరగా ఉండే ఖరోష్టి లిపిని కూడా పరిష్కరించాడు.
6. 1837 లో ప్రిన్సెప్ ఫిరోజ్ షా స్తంభంపైన ఉన్న మొత్తం ఏడు అశోకశాసనాలను పూర్తిగా పరిష్కరించి ఆసియాటిక్ జర్నల్ లో ఒక పత్రం ప్రచురించాడు [10]
7. అప్పటికి నలభై ఏళ్ళుగా అసియాటిక్ సొసైటీ లైబ్రేరీలో పడి ఉన్న గయ వద్దలభించిన రెండు అశోకుని శాసనాలను జేమ్స్ ప్రిన్సెప్ పరిష్కరించి 1837 లో ప్రచురించాడు [11]. ఇది అశోకుడి మనవడైన ధశరధ అనే మగధ రాజు వేయించిన శాసనము.
8. వివిధ శాసనాల ఆధారంగా అశోకుని పాలనలో జరిగిన ప్రముఖ ఘట్టాలను గుర్తించాడు.
9. ప్రిన్సెప్ వివిధ శాసనాలను పరిష్కరించుకొంటూ వెళుతున్న దశలో అన్నిచోట్లా మొదటి వాక్యం “దేవనంపియే పియదసి లజ” (Beloved of Gods, king Piyadasi) అంటూ మొదలై చివరి వాక్యం “హవం అహ” (Thus spake) తో ముగిస్తుందని గమనించాడు. ఈ రెండు వాక్యాలను కలపితే సంపూర్ణ అర్ధం ఇలా వస్తుంది. Thus spake King Piyadasi, Beloved of the Gods. (దేవునిచే ప్రేమించబడిన రాజు, పియదాసి ఇలా అన్నాడు)
***
.
5. అర్ధాంతర నిష్క్రమణ
.
1838 నుంచి జేమ్స్ ప్రిన్సెప్ ఆరోగ్యం క్షీణించసాగింది. మొదట్లో విపరీతమైన తలనొప్పి జ్వరం వచ్చేది. ఇతని వైద్యుడు అది Bilous affection (పైత్యసంబంధి) గా భావించి అలా మందులు ఇచ్చాడు. ఏమాత్రం మెరుగుదల రాలేదు.
వాతావరణ మార్పు జరిగితే ఆరోగ్యం కుదుటపడొచ్చుననే ఆశతో జేమ్స్ ప్రిన్సెప్ తన పరిశోధనా ప్రణాళికలన్నీ హఠాత్తుగా నిలుపుచేసి ఇంగ్లాండుకు బయలుదేరాడు. సముద్రప్రయాణం, ఉప్పుగాలి ఇతని ఆరోగ్యాన్ని మరింత క్షీణింపచేసింది. బాగా కృశించిన స్థితిలో ఇంగ్లాండు చేరాడు. ఒక ఏడాదిపాటు తన సోదరి వద్ద ఉన్నాడు మెదడుకు సంబంధించిన వ్యాధి ముదిరిపోవటంతో 22 ఏప్రిల్, 1840 న నలభయ్యవ ఏట తుదిశ్వాస విడిచాడు.
ఇతను భారతదేశంలో గడిపిన ఇరవై సంవత్సరాలు గొప్ప ఫలవంతమైనవి.
జేమ్స్ ప్రిన్సెప్ మరణవార్త విన్న మిత్రులు చాలా విచారించారు. అందరూ పూనుకొని జేమ్స్ ప్రిన్సెప్ స్మారకార్థం గంగానది ఒడ్డున జేమ్స్ ప్రిన్సెప్ పేరిట ఒక చక్కని భవనాన్ని నిర్మించారు. ఇది నేటికీ కలకత్తాలో ఒక పర్యాటక ప్రదేశంగా నిలిచి ఉంది. అతని పరిశోధనా పత్రాలన్నీ పుస్తకరూపంలోకి తీసుకొని వచ్చారు. National Portrait Gallery (బ్రిటిష్ ప్రముఖుల చిత్రాలు కలిగి ఉండే లైబ్రేరీ) ఇతని కాంశ్య పతకాన్ని ఏర్పాటుచేసారు.
నిరంతరమైన జిజ్ఞాస, మొక్కవోని దీక్ష, ఎదురైన సమస్యను పరిష్కరించాలనే తపన, కఠోర శ్రమ తో కూడిన జేమ్స్ ప్రిన్సెప్ వ్యక్తిత్వం ఏనాటికీ ఆదర్శనీయమే. ఒక భాషను అవగతం చేసుకోవటంలో ఇతను చేసిన కృషి అసామాన్యం. దాదాపు రెండువేల సంవత్సరాలపాటు విస్మృతికి గురయిన అశోకచక్రవర్తిని, భరతఖండం దాదాపు అంతటా విస్తరించిన అతని సామ్రాజ్యాన్ని ప్రపంచానికి తెలియచేసిన జేమ్స్ ప్రిన్సెప్ కృషి చరిత్రలో నిలిచిపోయింది.
సుమారు పదిహేనువందల ఏండ్లపాటు మరుగునపడి, కల్పనలతో కట్టుకథలతో నింపబడిన భారతదేశ సాధికారిక చరిత్రను వెలికి తీసిన జేమ్స్ ప్రిన్సెప్ నిజంగానే ప్రాతఃస్మరణీయుడు.
బొల్లోజు బాబా
Foot Notes
[1] ఆసియా ప్రాంతపు చరిత్ర, సంస్కృతి, భాషలు, శాస్త్రీయ విజ్ఞానము లాంటి అంశాలపై పరిశోధనలు జరిపే లక్ష్యంతో బ్రిటిష్ లాయర్, ఓరియంటలిస్ట్, విలియం జోన్స్ 15 జనవరి 1784 న Asiatic Society అనే సంస్థను స్థాపించాడు.
[2] Ashoka in Ancient India, Nayanjot Lahiri pn 300
[3] Asoka and the Decline of the Mauryas, 2012 Romila Thaper, Preword Asoka pn 8
[4] Note on Inscription No.1 of the Allahabad Column, Journal of Asiatic Society of Bengal, Vol III 1834, pn.114
[5] ‘Note on the Mathiah Lath Inscription’, JASB, Vol. III, 1834.
[6] Volume 5 of JASB in 1836
[7] J. Prinsep, ‘Note on the Facsimiles of Inscriptions from Sanchi near Bhilsa, taken by Captain Ed. Smith, and on the Drawings of the Buddhist Monument, presented by Captain W. Murray’, JASB, Vol. VI, 1837
[8] George Turnour, ‘Further Notes on the Inscriptions on the Columns at Delhi, Allahabad, Betiah, etc’, JASB, Vol. VI, 1837.
[9] నిజానికి అశోకుని పేరుకలిగిన శాసనం, 1915 లో కర్ణాటక, మస్కి అనేచోట దొరికింది. ఇందులో “దేవానాం పియ అశోక” అని ఉంది. అదే విధంగా 1954 లో మధ్యప్రదేష్ , గుజ్జర వద్ద లభించిన మరొక శాసనంలో “దేవానం పియదసి అశోకరాజ” అని ఉంది..
[10] Interpretation of the Most Ancient of the Inscriptions on the Pillar called the Lat of Firuz Shah, near Delhi, and of the Allahabad, Radhia and Mattia Pillar or Lat Inscriptions which agree herewith’, JASB, Vol. VI, 1837.
[11] James Princep,Facsimiles of Ancient Inscriptions’, JASB, Vol. VI, 1837
.
References
1. Essays On The Antiquities Of India James Prinsep, Vol. I
2. Ashoka in Ancient India, Nayanjot Lahiri
3. Asoka and the Decline of the Mauryas, 2012 Romila Thaper
4. Ashoka, The search for a lost emperor' by Charles Allen
5. The search for the Buddha : the men who discovered India's lost religion by Allen, Charles
6. Journal of Asiatic Society of Bengal different Volumes
7. Inscriptions of Asoka vol I, by E. Hultzsch,
8.The archaelogy of South Asia, from Indus to Asoka, by Robin Conigham and Ruth Young
9. allthingsindology.wordpress
10. wiki