"కవిత్వం అనేది గతించిన కాలపు పరిభాష మాత్రమే కాదు, అది ఒక సృష్టి ప్రక్రియ, కలను పునర్జీవింపచేయటం, నేనెలా ఉండాలనుకొంటానో అలా నన్ను నేను పునస్థాపించుకోవటం" -- Wadih Saadeh.
Wadih Saadeh లెబనాన్ లో ఒక చిన్న కుగ్రామంలో పుట్టి పన్నెండేళ్ల వయసులో Bierut అనే ప్రాంతానికి వలసవెళ్లాడు. ఒంటరితనం, అభద్రతా ఇతన్ని కవిత్వం వైపు నడిపించాయి. అంతర్యుద్దం వల్ల నెలకొన్న భీతావహపరిస్థితుల కారణంగా స్వదేశాన్ని విడిచి ఆస్ట్రేలియా చేరుకొన్నాడు.
తన చిన్నతనంలో ఏ యుద్ధాలు లేని, ప్రకృతి సహజ సౌందర్యాలతో ప్రకాశించే ప్రశాంత లెబనాన్ ఇతని అంతరంగంలో శాశ్వతంగా నిలిచిపోయింది. యుద్ధరక్తగాయాలతో చిధ్రమైన లెబనాన్ ప్రస్తుత వాస్తవం. ఈ రెండింటి ఘర్షణే ఇతని కవిత్వానికి నేపథ్యంగా మారింది. వాదీ సాదే కవిత్వం లెబనాన్ విషాదభరిత యుద్ధాలను కవిత్వీకరిస్తుంది. ఒక్కో కవితా - సలిపేగాయంలా, చిందిన రక్తపు చారికలా, ఒక అధివాస్తవిక ప్రపంచంలా, మెత్తని కుంచెతో గీసిన ఒక వర్ణచిత్రంలా అనిపిస్తుంది. వేదనను, దుఃఖాన్ని ఎంతో సున్నితంగా వ్యక్తీకరించటం వల్ల అది మరింత చిక్కబడింది. వాదీ సాదీ ఇంతవరకూ 12 కవిత్వసంపుటలను వెలువరించారు. "A Secret Sky" కవితా సంపుటి నుంచి కొన్ని కవితల అనువాదాలు ఇవి. ఈ సంపుటిలోని కవితలన్నీ లెబనాన్ అంతర్యుద్దాన్ని బలంగా వ్యక్తీకరిస్తాయి.
హింసతో ఆత్మహత్యాసదృశ మార్గాన్ని ఎంచుకొంటున్న ఆధునిక మానవుని పోకడను ప్రశ్నించే కవిత్వం ఇది.
1. లేకపోవటం - Absence
ఆ రోజు
పార్కులో
ఒక ఓక్ చెట్టు క్రింద ఉన్న
రెండు రాతికుర్చీలు మాత్రమే
ఖాళీగా ఉన్నాయి
అవి మౌనంగా ఉన్నాయి
ఒకదాన్నొకటి
తేరిపార చూసుకొని
భోరున విలపించాయి
2. పదాలు - Words
అతను మాట్లాడిన మాటలు
కుర్చీలపైన, మంచాలమీద,
బీరువాలలో, గోడలపైనా ఉండిపోయాయి.
ఇల్లు సర్దటానికి
ఫర్నిచర్, గిన్నెలు, గోడలు
శుభ్రం చేయటానికీ
ఒక పనిపిల్లను తీసుకువచ్చారు
గోడలకు సున్నం
ఇంట్లోకి కొత్తగొంతుకల్ని
తీసుకొచ్చారు
అయినా అతని పదాలు
ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.
3. దళం - Leaf
వారు అతన్ని మౌనంగా మోసుకొని
అతని స్నేహితులు శయనిస్తున్న
విశాలమైన మైదానంలోకి తీసుకెళ్లారు
అక్కడన్నీ శిలువలూ, సమాధిఫలకాలు
"నేను తిరిగి వస్తాను, తాళం చెవి
పూల కుండీ క్రింద ఉంది" అన్నాడతను
ఆ పువ్వుకి చెందిన ఒక రేక
అతని చేతిలో ఇంకా ఉంది.
4. ఒక చెట్టు - A Tree
రెండడుగులు ముందుకు వేసి
అతను నిన్నపాతిన మొక్కను తాకాడు
వేలికొసలనుండి అతని రక్తం
మొక్క పసరులోకి ప్రవహించింది
అతని మనసులో ఉన్న పత్రాలు
కొమ్మలపై మొలిచాయి
వెనుతిరుగుదామని ప్రయత్నిస్తే
అతనెక్కడ నిలబడ్డాడో అక్కడే ఉండిపోయాడు
అతని కాళ్ళు వేర్లుగా మారిపోయాయి.
5. అలసిన ప్రజ - Exhausted People
అలసిన ప్రజలు బజారులో కూర్చొని
మెత్తని గాలులను వింటున్నారు
బహుసా అవి
దారితప్పిన బాటసారులవో లేక
రోడ్డుపక్క వ్యాపారం సాగించే వారివో
అలసిన ప్రజలు కలుసుకొనే ప్రదేశం అది
అక్కడ పరిచిన రాళ్ళు మానవలక్షణాల్ని పొందాయి
ఎవరైనా కనిపించకపోతే వారికోసం అవి ఏడుస్తాయి
అలసిన ప్రజలు బజారులో ఉన్నారు.
రోజురోజుకూ వారి మొఖాలు పెళుసుగా
వారి జుట్టు సాయింత్రపు బలహీనకాంతిలో
మెత్తగా మారుతోంది.
ఒకరినొకరు చూసుకొని
తాము గాజు బొమ్మలమని అనుకొన్న మరుక్షణం
వారి కళ్ళు పెళుసుగామారి
ముక్కలు ముక్కలుగా పగిలిపోయాయి.
6. జీవితం - Life
కాలక్షేపానికి
అతను ఒక కూజాను చిత్రించాడు.
కూజాలో ఒక పూవును గీసాడు
పేపరునుండి పరిమళం పైకిలేచింది
ఒక నీళ్ళ జగ్గును చిత్రించాడు
కొంచెం నీరు తాగి
మరికొంత కూజాలో పూవుపై చల్లాడు
ఒక గదిని, ఒక మంచాన్ని చిత్రించాడు
దానిపై నిద్రపోయాడు
నిద్రలేచిన తరువాత
లోతుఅందని ఒక సముద్రాన్ని చిత్రించాడు
అది అతన్ని ఈడ్చుకుపోయింది.
7. అక్కడి జీవితం - Life There
అక్కడ తన బిడ్డను పూడ్చి
అతని పక్కనే తనూ పరుండటానికి
చాన్నాళ్ళు ఎదురుచూసింది ఆమె.
చివరకు
వారామెను అదే మట్టిలోకి దించారు.
అక్కడ ఆమెకు ఒకరోజు వయసుమాత్రమే
ఆమె బిడ్డ మాత్రం
ముసలివాడయిపోయాడు
8. రాత్రి ఆపద -- Night Visit
వాళ్లు తమ పిల్లలతో
మొక్కలను కాపాడే దేవత గురించి
ఉదయాన్నే కిటికీవద్దనున్న
మల్బరీ చెట్టుపై వాలి
పాటలు పాడే కోయిల గురించి
రేపు ద్రాక్షలు అమ్మి కొనబోతున్న
కొత్తబట్టల గురించి మాట్లాడుకొంటున్నారు.
పిల్లలు నిద్రలేచాకా వారి తలగడల క్రింద
కనుక్కోబోతున్న ప్రత్యేక ఆశ్చర్యాల
గురించి కూడా మాట్లాడుకొన్నారు
కానీ కొంతమంది సాయుధులు వచ్చి
వారి కథలను ముగింపచేసి
గోడలపై ఎర్రని మరకలు చిందించి
వెళ్లిపోయారు.
9. వలస పోవటం Migration by Wadih Saadeh
వాళ్లు వెళిపోయేటపుడు ఇంటికి తాళం వెయ్యలేదు
వీధి కుక్కకోసం, పక్షులకోసం తొట్టెలో నీళ్ళు నింపిఉంచారు,
డైనింగ్ టేబుల్ పై బ్రెడ్డు, కూజానిండా నీళ్ళు ఇంకా
నిల్వచేసిన చేపల టిన్నూ వదిలి వెళ్లారు.
వెళ్ళేముందు వాళ్ళేమీ మాట్లాడలేదు
అయితే వారి నిశ్శబ్దమే ఒక ఒప్పందం
తలుపుతో, కూజాతో, టేబుల్ పై బ్రెడ్డుతో.
వారి పాదముద్రల్ని స్పర్శించే
ఒకే ఒక దయామయి కాలిబాట
ఆ తరువాతెప్పుడూ వారిని చూడలేదు
ఎంతప్రయత్నించినా.
ఒకరోజు ఉదయంనుంచి సాయింత్రం వరకూ
గోధుమ బస్తాల్ని మోసీమోసీ అలసిపోయిన ఆ బాట
వారు తమ చోటును గోడలలో విడిచి వెళ్ళటం గమనించింది.
కొన్ని చేపలు రెక్కలుఆడిస్తూ ఏవో అదృశ్యతీరాలకు
ఈదుకొంటూపోవటాన్ని సముద్రం గుర్తుచేసుకొంది.
ఒక వీధికుక్క ప్రతీ సాయింత్రమూ వచ్చి
వారి ఇంటిముందు అరుస్తూండేదని
ఆ వూరిలోనే ఉండిపోయిన కొంతమంది
చాలాకాలం చెప్పుకొన్నారు.
దేశబహిష్కృతుడిగా జీవనం, మాతృభూమిపై మమకారం అనే రెండు భావాల మధ్య సంఘర్షణ కారణంగా వాదీ సాదీ కవిత్వంలో ఆధునికోత్తర శూన్యవాదం బలంగా ప్రతిబింబిస్తుందని విమర్శకుల అభిప్రాయం. వాదీ సాదీ కవిత్వాన్ని గమనిస్తే భీభత్సాన్ని, హింసను, దుఃఖాన్ని వ్యక్తీకరించటానికి బరువైన, జుగుప్సకలిగించే పదాలను వాడాల్సిన అవసరం లేదనీ, నాజూకైన తేలికపదాలతో కూడా అంతే స్థాయి భావోద్వేగం కలిగించవచ్చని అర్ధమౌతుంది. అలా వ్రాయటం నేటికాల కవిత్వలక్షణంగా భావించాలి. "A Secret Sky లో నేను లెబనాన్ యుద్దంలో మరణించిన నా సహచరులకు ప్రాణం పోసాను" అన్న వాదీ సాదీ మాటలకు ఈ సంపుటిలోని ప్రతీ కవిత అద్దంపడుతుంది. ఈ కవితలను అరబిక్ భాషనుండి ఇంగ్లీషులోకి Anne Fairbairn అనువదించారు.
బొల్లోజు బాబా