Wednesday, May 31, 2017
Sunday, May 28, 2017
కవిత్వంలో ఇమేజ్, మెటఫర్, సింబల్ లు
ఇమేజ్
ఒక చక్కని వర్ణన మాత్రమే. ఇక వేరే అర్ధాలేమీ ఉండవు
1. కిటికీలోంచి చూస్తే
వెలుతురునిండిన బెజ్జాలతో పిల్లం గోవిలా
ఊళవేసుకుంటూ దూసుకుపోతోంది రైలు -- ఇస్మాయిల్
2. నిన్నరాత్రి ఎక్కడెక్కడికో
తప్పిపోయిన
నీడల్ని లాక్కొచ్చి
భవనాలకు, చెట్లకు
మనుష్యులకూ అతికిస్తున్నాడు
సూర్యుడు
తన కిరణాల దారాలతో!
మొదటి ఉదాహరణలో ఒక రైలు రాత్రిపూట ఎలా కనిపిస్తుందో చేసిన వర్ణన ఉంది. ఆ ఇమేజ్ సౌందర్యమే కవిత్వం. అంతకు మించి ప్రయోజనాన్ని కానీ వేరే అర్ధాన్ని కానీ ఆ వాక్యంనుంచి పొందలేము. ఆ ఇమేజ్ ను సృష్టించటంలోనే కవి ప్రతిభ దాగి ఉంటుంది.
రెండవ ఉదాహరణకూడా అంతే ఆ దృశ్యం ఎంతవరకూ చూపగలదో అంతవరకూ మాత్రమే మనం చూడగలం.
మెటఫర్
చెప్పిన విషయం కాక మరో అర్ధాన్ని కలిగిఉండటం.
1. తనని బాధిస్తున్న ప్రపంచపు ముల్లుని
పీకి పారేసి
ఈ పిల్ల చకచక ఎటో నడిచిపోయింది (ఆత్మహత్య) -- ఇస్మాయిల్
2. ఈ రోజుకూడా సూర్యుడు బహుసా
ఆకాశపుటటెండెన్స్ రిజిష్టరులో
రెండు సంతకాలూ చేసేసి వెళిపోయుంటాడు.
మొదటి ఉదాహరణలో ఆ పిల్ల ప్రపంచపు ముల్లుని పీకి పారేయటం అన్న క్రియ కాదిక్కడ ప్రధానం. ఆ చేష్ట ద్వారా కవి చెప్పదలచుకొన్నది ఆ అమ్మాయి ఆత్మహత్యచేసుకొంది అని అన్యాపదేశంగా చెప్పటం. ఇక్కడ ఆత్మహత్యకు ప్రపంచపు ముల్లుని పీకిపారేయటం అనే క్రియ మెటాఫర్ గా మారింది.
రెండో ఉదాహరణలో ఆ రోజు యధావిధిగా సూర్యుడు ఉదయించి అస్తమించాడు అన్న విషయాన్ని చెప్పటం జరిగింది.
సింబల్
చెప్పిన విషయంతో పాటు మరో అర్ధాన్ని కలిగి ఉండటం.
1. సూర్యుని కోల్పోయినందుకు కన్నీరు రాల్చుకొంటే
నక్షత్రాలను కూడా చేజార్చుకోవలసి వస్తుంది. -- టాగూర్
2.సంజె వేళ
దీపాలు వెలిగించారు
ఎవరి దీపాలు వారివి. -- ఇస్మాయిల్
మొదటి ఉదాహరణలో చెప్పిన విషయంతో పాటు - జీవితంలో ఎదురుదెబ్బతగిలినప్పుడు ఏడుస్తూ కూర్చుంటే ఉన్న ఆనందాలను కూడా అనుభవించలేవు అనే ఒక జీవితపాఠం కూడా సింబాలిక్ గా తెలుస్తుంది.
రెండవ ఉదాహరణలో కూడా ఎవరి దీపాలు వారివి అనటంలో విశ్వప్రేమను చూపించేది సూర్యుడే నని చెప్పటం/జీవనయానంలో ఎవరి వెలుగులు వారివి అని సూచించటం.
బొల్లోజు బాబా
Subscribe to:
Posts (Atom)