Tuesday, February 21, 2017

అమ్మ భాష


ఉగ్గుపాలతో పాటు పరవళ్ళు తొక్కుతూ ప్రవహించి
రక్తంలోకి ఇంకి పోతుంది మాతృభాష
తరువాత ఎన్ని భాషలు నేర్చుకొన్నా
అన్నీ పై పై ఆభరణాలే తప్ప
రక్తనిష్ఠం కాలేవు ఎవరికైనా.

మనకు ఈ దేహాన్ని ఇచ్చేది అమ్మయితే
ఈ ప్రపంచాన్ని పరిచయం చేసేది మాతృభాష
సృష్టి సౌందర్యాలు, జీవనోద్వేగాలు మొదటగా
మాతృభాషలోనే ఆవిష్కృతమౌతాయి.
మనం ఎలా ఆలోచించాలో
దేనిగురించి ఆలోచించాలో నేర్పుతుంది మాతృభాష
మానవజీవితంలో అమ్మ భావన ఎంత గొప్పో
అమ్మభాష కూడా అంతే ఘనమైనది.

భిన్న భాషలు, భిన్న జాతుల వారసత్వ సంపద కావొచ్చు
అమ్మ భాష మాత్రం
సమస్త మానవాళి యొక్క ఉమ్మడి సంభాషణ.

తేనెలో తీయదనం లీనమై ఉన్నట్లు
మన మాతృభాషలో మన చరిత్ర లయమై ఉంటుంది.
మన మూలాలు మన భాషలో
రహస్యంగా దాక్కొని ఉంటాయి
మన భవిష్యత్తు మన భాషలోంచి
తల వెలుపలికి సారించి చూస్తుంటుంది.
*****
సాహిత్యం మాతృభాషకి అమ్మ లాంటిది.
ఎందుకంటే
ఏ భాషైనా బతికేది, చిరకాలం నిలిచేది
దాని సాహిత్యంలోనే !

మాతృభాషకు పెద్దపీట వేయమంటే
దాని సాహిత్యానికి పెద్దపీట వేయమని అర్ధం.
మాతృభాషను కాపాడటమంటే
ఒక జాతి మూలాలను రక్షించుకోవటం.
మాతృభాషను ప్రేమించమంటే
పరభాషను ద్వేషించటం కాదు.
ఎందుకంటే
అమ్మ ఎవరికైనా అమ్మే!


బొల్లోజు బాబా

No comments:

Post a Comment