(ఈ వ్యాసం ప్రస్థానం ఫ్రిబ్రవరి, 2016 సంచికలో ప్రచురింపబడింది, ఎడిటర్ గారికి ధన్యవాదములు తెలియచేసుకొంటున్నాను)
పోస్ట్ మోడర్న్ కవిత్వం అస్పష్టంగా ఉంటుందనే అపప్రథ పోగొట్టుకొని నేటికి స్ఫుటితమైంది. దీనికి ఉదాహరణగా మెర్సీ మార్గరెట్ గారి “మాటల మడుగు” కవితా సంపుటిలోని కవిత్వం నిలుస్తుంది.
ఈ కవిత్వం లో- చక్కని పదచిత్రాల భాష, “ఆలోచనలు నిలువునా చినిగే దాకా” చేసుకొన్న అంతర్వీక్షణం, ఒక మనిషిగా, ఒక స్త్రీగా, ఎండ్లూరి సుధాకర్ గారన్నట్లు ఒక కిరస్తానీ కోకిలగా సాగే భిన్న అస్థిత్వాల స్వీయాత్మ ప్రకటన, నాలుగు గోడలై అంతవరకూ బంధించిన చరిత్రను నిరాకరించటమూ వంటివి వివిధ కవితలలో చక్కగా ప్రతిబింబించాయి.
కొత్త అభివ్యక్తి, కొత్త పదచిత్రాల్ని పట్టుకొన్న ఈ కవయిత్రి, ప్రస్తుత తరానికి ప్రతినిధి. అందుకనే ముందుమాటలో శ్రీ వాడ్రేవు చినవీరభద్రుడు “కవిత్వంలో ఉన్న విశేషం ఏమిటంటే ప్రతితరంలోనూ అది మళ్లా కొత్తగా మోసులెత్తుతుంది.// అలా పలకడంలో మానవానుభవానికొక కొత్తపార్శ్వం సమకూరుతుంది” అంటారు. ఆ రకంగా “మాటల మడుగు” కవిత్వం విస్పష్ట పోస్ట్ మోడర్న్ కవిత్వంగా, తెలుగు సాహిత్యంలో కొన్ని వాదాల, ఇజాల తీవ్రత తగ్గాక వీచిన కొత్త గాలి లా అనిపించక మానదు.
“మాటల మడుగు” పేరుకు తగ్గట్టుగా కవిత్వం నిండా మాటలు. హృదయాన్ని ఊచే మాటలు. అనుభూతి కలిగించిన ఆలోచనల్ని నింపుకున్న మాటలు. చాలా చోట్ల ఆ మాటలు తమ స్వంత అర్ధాల్ని వీడి వేరే రమణీయార్ధాన్ని వ్యక్తీకరిస్తుంటాయి. అదే కదా ఉత్తమ కవిత్వ లక్షణం.
కవులు అప్పుడప్పుడూ తమ కవిత్వ తత్వాన్ని ఏదో ఓ కవితలో నిర్వచించుకొంటారు (Metapoetry). వాళ్ళేం వ్రాస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఇదొక స్వీయ పరిశీలన లేదా ఎరుక. మార్గరెట్ “కొట్టివేత” అనే కవితలో…
పాత పాళీకి కొత్త మాటలు
అభ్యాసం చేయించి
తడిమే ప్రతిచూపులో
వినే ప్రతిమాటలో నూత్న వెలుగుతో
నన్ను నేను కాల్చుకోవాలి
“కొట్టివేతల నుంచి కొత్తగా పుట్టుకు రావాలి” …. (కొట్టివేత)… అంటుంది. అత్యాధునిక కవిత్వానికి చరిత్ర నిరాకరణ ఆయువుపట్టు. దీనికి అవసరమైన వ్యూహం కొత్త భాషను సృష్టించుకోవటం. దీన్నే ఈ కవయిత్రి పాతపాళీకి కొత్తమాటలు అని, కొట్టివేతలనుండి కొత్తగా పుట్టుకురావటం అనీ వ్యక్తీకరించింది. మరో కవితలో ఆ కొత్త భాష ఎలా ఉండాలో చెపుతుంది.
వ్యాకరణ వాసనలేని
ఆధిపత్య అధీనత లేని
అణచివేత ధిక్కరణలకు తావులేని
ప్రవహిస్తున్న ఒక రహస్య నదిని కనుగొనడానికి
సమసమాజ స్థాపన చేసే సంస్కృతిలా ఉరకలేసే
నదిలాంటి భాషను కనుగొనటానికి …. (మాట్లాడ నివ్వండి) అంటూ ఆ కొత్తభాష స్వరూపాన్ని, దానికై జరిపే తన అన్వేషణను తెలియచేస్తుంది.
“పదచిత్రాలతో ఆలోచించటమే కవిత్వం” అని అంటారు కవి విమర్శకుడు శ్రీ సీతారాం. “మాటల మడుగు” లో అనేక కవితలు అద్భుతమైన పదచిత్రాలతో అలరాలుతుంటాయి. ఆయా పదచిత్రాలు కూడా చక్కని సందర్భశుద్ధి, పొందికతో అమరి అపూర్వమైన పఠనానుభూతిని కలిగిస్తాయి.
చుట్టూ చీకటి
అడుగుతీసి అడుగేస్తే
ఇసుకలా తగిలే చీకటి … (చీకటి దీపం)… చీకటి ఇసుకలా తగలటం అనేది ఒక నూతన అభివ్యక్తి.
ఏ యుగాలనాటి మౌనధ్యానంలో
పునీతులై జ్వలిస్తారో కవులు
కాగితంపై అడుగేసి
కవిత్వమై వెలుగుతారు … (కవులు-కాగితం)… ఇక్కడ జ్వలించటం, వెలగటం అనే రెండు పదాల ద్వారా సృష్టించిన ఈ పదచిత్రం ‘కవిత్వమనేది కవుల మనోకాంతి అని అది లోకాల్ని వెలిగిస్తుందనీ’ సూచిస్తుంది.
చీకటి దండెం మీద
ఎవరో
జ్ఞాపకాలు ఆరేసుకున్నారు …. (చీకటి దండెం)… అనటంలో ఒక నిద్రరాని రాత్రివేళ పదే పదే గుర్తుకు వచ్చే కొన్ని అనుభూతులు వ్యక్తమౌతాయి.
ఒక పరిచయం ముగుస్తూనే
పగలునుండి రాత్రిని
వేరుచేసే కవ్వమేదో
మనసుని చిలికి
జ్ఞాపకాల వెన్నని చేతిలో
చంద్రుని ముద్దగా చేసి వెళుతుంది….(పరిచయం ముగుస్తూనే)…. ఒక పరిచిత వ్యక్తి జ్ఞాపకాలను వెన్నగా, ఆ వెన్నని మరలా చంద్రుని ముద్దగా వర్ణించటం ఒక అద్భుతమైన కల్పన.
ఈ సంపుటిలో అనేక సామాజికాంశాలపై స్పందించి వ్రాసిన వివిధ కవితలు కనిపిస్తాయి. “అమానత్ స్వరం” (నిర్భయ ఉదంతం) అనే కవితలో, “తల్లి దండ్రులారా వీలైతే మీ కొడుకులకు స్త్రీలను గౌరవించటం నేర్పండి” అంటుంది. లక్షింపేట ఉదంతంపై వ్రాసిన ఓ కవితలో “ఇక్కడ ఒక్కో శ్వాస విస్ఫోటనం చెందే అణుబాంబు అవుతుంది” అని హెచ్చరిస్తుంది. రియానేహ్ పై వ్రాసిన ఓ కవితలో “నీ ఉత్తరం చదివాక నేను మౌనంగా ఉండలేకపోతున్నాను” అంటూ సహానుభూతిని ప్రకటిస్తుంది. సామాజిక వివక్ష, రాజ్యహింస ల పట్ల మార్గరెట్ స్పందించిన తీరులో తనదైన గొంతుక, బలమైన వ్యక్తీకరణ కనిపిస్తాయి. అటువంటి కవితలు నిరలంకారంగా కనిపించవచ్చు కానీ వాటిలో కవిదృక్పధం ఉంటుంది. అలాంటి కవితలే ఈమె ఎవరివైపు నిలబడి కవిత్వం చెపుతున్నదో అర్ధమయ్యేలా చేస్తాయి.
మార్గరెట్ కవిత్వం గూఢంగా ఉంటూ ఒక్కోసారి చదువరిని లోనికి రానీయనంత ఇరుకుగా కూడా అనిపిస్తుంది. కొన్ని చోట్లయితే పైకి ఒక మామూలు అర్ధానిస్తూ, నిధిని కనుక్కోమని సవాలు విసురుతూ ఉంటుంది. ఇలా పైకి కనిపించే అర్ధం ఒకటి, అంతర్లీనంగా మరొక అర్ధాన్ని కలిగిఉండటం పోస్ట్ మోడర్న్ కవిత్వం యొక్క మరొక లక్షణం. “మిగిలిపోయిన దారం” అనే కవిత - పూలు వాడిపోయాయి, దారం మాత్రం ఆ పూల జ్ఞాపకాలలో ఒంటరిగా మిగులుంది అంటూ సాగుతుంది. ఈ కవితలో ఒకచోట ఆ దారం “ప్రశ్నలకొక్కాలకు మనల్ని వేలాడదీస్తుంది” అనటం ద్వారా ఇది మామూలు వాచ్యంగా చెప్పిన వస్తుకవిత కాదని అర్ధమౌతుంది. కానీ కవయిత్రి ఎక్కడా బయటపడదు. భిన్న అన్వయాలను చదువరులకే విడిచిపెడుతుంది.
మార్గరెట్ కవిత్వానికి శక్తి, పుష్టి, ఆయుషుని ఇచ్చేది ఆమె కవితలలో విస్తారంగా దర్శనమిచ్చే మెటానిమీ. కవిత్వంలో మెటనిమీ అంటే ఒక పదానికి బదులుగా ఆ పదంతో దగ్గర సంబంధమున్న మరొక పదాన్ని ఆస్థానంలో వాడటం. పోస్ట్ మోడ్రన్ కవిత్వానికి మెటానిమీ వెన్నెముక వంటిది. కానీ మెటానిమీ వాడటం కత్తిమీద సాము. కవి ఉద్దేశించిన భావాల్ని చదువరి అందుకోలేక పోతే ఆ కవిత అస్ఫష్టలోయలోకి జారినట్లే. పోస్ట్ మోడర్న్ కవిత్వం అర్ధం కావటం లేదన్న విమర్శలు మొదట్లో ఎదుర్కోవల్సివచ్చింది ఇందుకే. “మాటల మడుగు” కవిత్వంలో కనిపించే మెటానిమీ తేటగా, నూతనంగా ఉంటూ కవితలోని అంతరార్ధాన్ని తెలుసుకోమని కవ్విస్తూంటుంది. ముడివిప్పుకొన్న చదువరికి మంచి పఠనానుభవాన్ని కలిగిస్తుంది.
కథనాత్మక పద్దతిలో నడిచే “దోసిలిలో నది” అనే కవితలో మెటానిమీ ఉత్తమ స్థాయిలో ప్రకాశిస్తూ గొప్ప కవితానుభూతి ఇస్తుంది. “బయటకి ప్రవహించేందుకు దారివెతుకుతూ నాలుగుగోడల మధ్య ఒకనది” అంటూ మొదలౌతుంది కవిత. ఒక వలసపక్షి గోడపై వదిలిన విత్తనం వల్ల గోడ బలహీనమై ఒక పక్కకు ఒరగగా, నదికి రెక్కలొచ్చి, సహాయానికి, సహనానికి నిలువెత్తు సాక్ష్యమై స్వేచ్ఛగా ప్రవహించిందట. ఆ నదిని తీసుకొన్న ప్రతిఒక్కరి దోసిలిలో పక్షిలా మారుతూనే ఉందట. మార్మికంగా సాగే కవిత ఇది. ఇక్కడ నదికి బదులుగా ఆ స్థానంలో మతవిశ్వాసాలు/ఒక జాతి అస్థిత్వం/ స్వేచ్ఛ అనే పదాలతో భిన్న విధాలుగా అన్వయం చెప్పుకోగలిగేలా కవిత ఉండటం కవయిత్రి ఊహా పటిమకు, నిర్మాణకౌశలతకు అద్దంపడుతుంది.
కొందరు వ్రాసే కవిత్వంలో మతప్రస్తావన చాలా సార్లు అన్యమతం పట్ల ధూషణ లేదా విధ్వంశక స్థాయిలలోనో కనిపిస్తుంది. కానీ “మాటలమడుగు” కవిత్వంలో అలా ఉండదు. ఈ సంపుటిలోని రెండు, మూడు కవితల్లో కవయిత్రి తాను విశ్వసించే మతం తాలూకు పరిభాష దొర్లుతుంది. అది ఆ మతం లోని ఉదాత్తమైన భావనల్ని కవిత్వీకరించటం గమనార్హం. ఉదాహరణకు - “పొరలు రాలిన క్షణం” అనే కవితలో “అయినా పర్లేదు/‘దమస్కు మార్గానికి’/ ఇప్పుడు చేరానన్న ఆనందం” అంటుంది కవయిత్రి. ఇక్కడ “దమస్కు మార్గం” అనే వాక్య ఔదాత్యం అర్ధం చేసుకోవాల్సి ఉంటుంది. సౌలు అనే వ్యక్తి డమస్కస్ దారిలో ఏసుక్రీస్తు దర్శనాన్ని పొందుతాడు. అంతవరకూ ఏసు పట్ల అవిశ్వాసి అయిన సౌలు విశ్వాసిఅయి, సెయింట్ పాల్ గా మారి ప్రభువు దివ్యత్వాన్ని గానం చేసి ధన్యతనొందినట్లు బైబిలు ద్వారా తెలిసే ఒక మహిమాన్విత ఉదంతం. ఆంగ్లభాషలో Road to Damascus ను ఒక వ్యక్తి జీవితంలో కలిగిన ఏదేని ఒక గొప్ప దైవీకమైన మార్పును వర్ణించే ఇడియమ్ లా వాడతారు. తెలుగు కవిత్వాన్ని పరిపుష్టం చేసే ఇలాంటి ప్రయోగాలు ఆహ్వానించదగినవి.
ప్రశ్నలగది, వెన్నెల స్నేహితా, సముద్రాంబర, జోలాలి వంటి కవితలు శిల్పపరంగా గొప్పగా ఉన్నాయి. ఈ పుస్తకానికి ఆత్మీయ మాటలు వ్రాసిన కవి, విమర్శకుడు అఫ్సర్ అన్నట్లు “మెర్సీ యెన్ని కవిత్వదూరాలు వెళ్ళిందో అక్కడల్లా తన footprints లాంటి వాక్యాల్ని ముద్రించి సాగిపోయింది.
మంచి కవిత్వాన్ని ఇష్టపడే వారికి మెర్సి మార్గరెట్ “మాటల మడుగు” తప్పక నచ్చుతుంది.
కాపీల కొరకు
Mercy Margaret
1-4-61/12, Ranga Nagar
Musheerabad, Hyderabad, 500080
040/64643525
mercydachiever@gmail.com