Sunday, March 29, 2015

గాథాసప్తశతి 4 - రమణీ మనోహరులు

{గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము, ప్రకృతి సౌందర్యం,ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.}

గాథాసప్తశతి  - రమణీ మనోహరులు
ఒక అందమైన అమ్మాయిని వర్ణించేటపుడు దేహసౌందర్యం ప్రధాన పాత్రవహించటం, అదే పురుషుని వర్ణించవలసివచ్చినపుడు అది అతనిపట్ల మనసుపడ్డ ఒక స్త్రీ మనోచిత్రణ పరంగా ఉండటం ఈ గాథలలో చాలాచోట్ల కనిపిస్తుంది.

ఒక యవ్వనవతి తను మనసుపడ్డ యువకుని గురించి తన అత్తతో ఇలా అంటుంది

అత్తా!
ఆ యువకుడ్ని తదేకంగా 
ఎంతసేపు చూసినా అలుపైతే రాదు కానీ 
కలలో నీళ్ళు తాగినట్టు దాహం తీరదు. – 93

తన ప్రియుడు ఏ ఇంట్లో (ఎవరితో) ఉన్నాడో కనిపెట్టటానికి ఈ అమ్మాయి వేసిన పధకం బాగుంది చూడండి

పండగపూట కొత్తదుస్తులు ధరించి 
పిండివంటలు ఇంటింటికీ 
తిరుగుతూ పంచుతోంది పిచ్చిపిల్ల
నువ్వెక్కడయినా కనిపిస్తావన్న ఆశతో - 328

ప్రియుడి చేతిస్పర్శ పొందటమే భాగ్యంగా భావిస్తూ ఆ విషయాన్ని గొప్పగా చెప్పుకొంటుందీ అమ్మాయి

నాకున్నవన్నీ మంటలకు బూడిదైనా
నాకు ఆనందంగానే ఉంది, ఎందుకంటే
మంటలనార్పేటపుడు
అతడు నా చేతుల్ని తాకుతూ 
నీళ్ళకడవ అందుకొన్నాడు. – 229

ఈ క్రింది గాథలో వర్ణించిన ఘటన అతిశయోక్తిగా అనిపించినా గాథాకారుని చమత్కారం అర్ధం చేసుకోవచ్చు.

నీ గొంతువినంగానే నిన్ను చూడటానికి
ఇంటినుండి పరుగులిడుతూ బయటకు వచ్చింది
నీవు వెళిపోయాకా ఆమెను 
మోసుకు తీసుకెళ్ళాల్సివచ్చింది. - 506

ఎట్టకేలకు కలుసుకొన్న ప్రియుడు మౌనంగా ఉంటే ప్రియురాలు అతన్ని ఎలా మాటల్లోకి దింపుతుందో చూడండి

చాలామంది నీ గురించి ఎంతొ చెప్పారు
ఈనాటికి నిన్ను కళ్ళారా చూస్తున్నాను
ప్రియతమా ఏదో ఒకటి మాట్లాడు
నా చెవులు కూడా తేనెను గ్రోలనీ! - 805

తాను అనుభవిస్తున్న భాదనంతా ఈమె ఎంత గడుసుగా చెపుతున్నదో చూసారా

ప్రియసఖుడా
నిన్ను చూడని స్త్రీలు మాత్రమే
సంతోషంగా ఉంటున్నారు
సుఖంగా నిద్రపోతున్నారు
చెప్పినది వింటున్నారు
మాటలుకోసం తడుముకోవటం లేదు. – 418

ప్రియుని చూసిన ఆనందాతిశయంలో చెమర్చిన నయనాలను దాచుకోలేకపోయిందట ఓ పడతి..... (వేరే అన్వయాలు కూడా చెప్పుకోవచ్చు)

నిన్నుచూచినపుడు
తల్లిదండ్రులు పక్కనున్నారని 
ఏ ఉద్వేగాన్నీ ప్రదర్శించలేదుకానీ
ఆమె రెప్పలు మూసినపుడు
ఓ కన్నీటి బిందువు జాలువారింది. – 367

ఈ గాథలోని వర్ణన నేటి సినిమా పాటలవరకూ విస్తరించి ఉందంటే అదెంత బలమైనదో ఊహించండి.

తమ ప్రియులను కనీసం స్వప్నాలలో 
దర్శించుకొనేవారు ధన్యులు
నీవు నా పక్కన లేకుంటే కలలమాట అటుంచు
నిదురే రాదు నాకు. - 397

ఈ క్రింది గాథ చాలా చాలా అందమైన ఊహ...

నిన్ను చుట్టుకొన్న నా చేతుల్ని 
బలంతో తొలగించుకొని దూరదేశానికి వెళుతున్నావు
నా హృదయం నుంచి నీ రూపు తొలగించి చూపు
అపుడు నీ బలాన్ని నేను గుర్తిస్తాను. - 749

ఇస్మాయిల్ గారు “తెరచుకొన్న పద్యం” అన్నది ఇలాంటి వాటిగురించే. పద్యం ముగిసాకా ఆ తొలుచూలు పడతి
మనసులో కోరుకునేదేమిటో పాఠకుడే పూరించుకోవాలి.

తొలిచూలు పడతిని సఖులు
నీ మనసులోని కోరిక ఏమిటని అడగగా
సిగ్గుపడుతూ భర్తను చూసింది. - 115

బొల్లోజు బాబా

Wednesday, March 25, 2015

గాథాసప్తశతి - 3 (అపురూప సౌందర్యవతులు)

{గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం. గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము, ప్రకృతి సౌందర్యం,ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.}

గాథాసప్తశతి - అపురూప సౌందర్యవతులు

ప్రపంచసాహిత్యంలో స్త్రీ సౌందర్యాన్ని వర్ణించటానికి వాడినన్ని ఉపమానాలు మరే ఇతర వస్తువుకు వాడి ఉండక పోవచ్చు. ఈ గాథలలో అనేక చోట్ల యౌవనవతుల అందాలు అపురూపమైన పోలికలతో కనిపిస్తాయి.
ఈ సుందరాంగితో పోల్చదగినవారు ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరనే విషయాన్ని ఈ ప్రాచీనకవి పరోక్షంగా ఎలా చెపుతున్నాడో చూసారా.

కోట్లాది సుందరాంగులతో
కిటకిటలాడే ఈ సువిశాల జగత్తులో
ఈమె కుడిభాగపు అందంతో సరితూగ గలిగేది
ఈమె ఎడమభాగపు అందం మాత్రమే! - 303
“కళ్లు తిప్పుకోనివ్వని అందం” అని అందరూ అనే మాటని ఈ గాథకర్త ఎంతదూరం తీసుకెళ్ళాడో తిలకించండి.
ఎవరైనా మొదటగా
ఆమె ఏ దేహభాగాన్ని చూస్తారో
వారి దృష్టి అక్కడే నిలిచిపోతుంది
ఆమె శరీరాన్ని పూర్తిగా చూసినవారే లేరు. -234
పై గాథలాంటిదే మరొకటి.
ఊరిపెద్ద కూతురు చాలా అందగత్తె
ఊరిలోని మగాళ్ళనందరినీ దేవతలుగా మార్చేసింది
ఎవరూ రెప్పలు మూయరు, ఆమెను చూస్తూన్నపుడు. - 593
ఓ అందగత్తె కనులు నీలికలువల కన్నా అందంగా ఉన్నాయి అనే విషయాన్ని ఈ గాథ చెప్పేతీరు అబ్బురపరుస్తుంది.
ప్రియుని చూసిన తన్మయత్వంలో
ఆమె కళ్ళుమూసుకోబట్టి కానీ
లేకపోతే
ఆమె జడలో ఉన్న నీలికలువను
చూసేవారేరి? - 323
ఈ క్రింది గాథలో కమలాప్తునికే పరీక్షపెడుతున్నాడీ పూర్వకవి.
సుందరీ

నీ ముఖారవిందాన్ని కొంగుతో కప్పిఉంచకు
దేన్ని తాకితే ఎక్కువ సుఖమో
దినకరుడినే తేల్చుకోనీ!
నీ ముఖాన్నా, కమలాన్నా అనేది. – 269

ఈ క్రింది గాథను గమనిస్తే చివరలో వచ్చే విశేషణాలు - చన్నులు, పద్యానికి కూడా సరిపోతాయి. దీనివల్ల ఈ గాథ ఖచ్చితంగా “ఆకర్షిస్తుంది”.
యవ్వనవతి చన్నులు ఎవర్ని ఆకర్షించవు!
మంచి పద్యంలా
బరువుగా, బిగుతుగా, అలంకారయుతంగా ఉండేటివి. – 428
సౌందర్యవతి శరీరంనుండి వచ్చే ఊపిరులు ఈ క్రింది గాథలో కవితా వస్తువయిన తీరు ముచ్చటగొలుపుతుంది.
ఎంత ఊదినా సరిగ్గా మండటం లేదని
పొయ్యిమీద అలుకబూనకు.
సుగంధభరితమైన నీ వూర్పులకు ఆశపడి
పొగను ఎగదోస్తుంది తప్ప
పొయి మండేలా లేదు. – 13
పెద్దగా అందగత్తెలు కాని వారి తరపున గాథాకారుడు చక్కటి చివరివాదనను (లాస్ట్ పంచ్ కిక్కు) ఇలా వినిపిస్తాడు.
ఆమె గొప్ప అందగత్తె, సుగుణవంతురాలు నిజమే
నేను పనికిరాని దానను అదీ నిజమే
కానీ ఒక్కమాట;
ఆమెలా లేని వాళ్ళందరూ చచ్చిపోవాలా ఏమిటీ? -- 512

బొల్లోజు బాబా

Sunday, March 22, 2015

గాథాసప్తశతి - ప్రకృతి వర్ణనలు

Thursday, March 19, 2015

గాథాసప్తశతి - 1

గాథ అంటే రమ్యంగా ఉండే చిన్న సంఘటన అని అర్ధం.  గాథాసప్తశతి అనేది హాలుడు అనే రాజు (శాతవాహనుడు) ఒకటవ శతాబ్దంలో ఏడువందల గాథలను సేకరించి సంకలన పరిచిన గ్రంధం పేరు. ఈ గాధలలో ఆనాటి పల్లెజీవనము,  ప్రకృతి సౌందర్యం, ప్రజల ప్రేమోదంతాలు, ఆచారాలు, అలవాట్లు కనపడుతూంటాయి. ప్రతీగాథలో చిక్కని కవిత్వం పొటమరిస్తూంటుంది.

గాథాసప్తశతి – దేవతల ప్రస్తావన
ఈశ్వరునికి శిరస్సుపై గంగ, సగభాగమై పార్వతీదేవి ఉన్నారు.  జానపద  సాహిత్యంలో గంగా గౌరీ సంవాదం పేరిట పాటలు ఉన్నాయి.  ఈశ్వరుడు సంధ్యావందనం చేసే సమయంలో చేతిలోకి గంగను తీసుకోవలసి వచ్చినపుడు, పార్వతీదేవి ఏవిధంగా కనిపించిందో అని ఈ ప్రాచీనకవి చేసిన  ఊహ ఎంతో సుందరంగా ఉంటుంది.

అర్ఘ్యమివ్వటానికి అర్ధనారీశ్వరుడు
గంగను చేతిలోకి తీసుకొన్నప్పుడు
అసూయతో ఎరుపెక్కిన గౌరీదేవి మోము
దోసిటిలో కమలమై ప్రతిబింబించింది.
అంజలి జలాలకు వందనమిడు.    -1

ప్రియురాలు సిగ్గుపడే సమయంలో ప్రియుని కనులను తనచేతులతో కప్పటం అనేది ఒక అందమైన చేష్ట.  అలా  ముక్కంటి కనులు మూయాలంటే పార్వతీదేవికి ఒకచేయి తక్కువైందట.  మరప్పుడామె ఏమి చేసిందటా?

శివపార్వతుల సంగమ సమయంలో
వలువలు తొలగగా సిగ్గిల్లిన పార్వతీదేవి
రెండుచేతులతో విభుని రెండు కళ్లూ మూసి
మూడవకంటిని ముద్దాడింది.       - 455

ఢిల్లీకి రాజయినా తల్లికి కొడుకే అన్నది ఒక నానుడి. చెట్టంత ఎత్తుకు కొడుకు ఎదిగినా  తల్లి మాత్రం  ఆకాశమై అతని తలనిమురుతుంది.  లేతప్రాయంలోనే కులకాంతల వలువలు దోచిన కృష్ణుని గురించి యశోద మాతృవాత్సల్యంతో మాట్లాడేటపుడు ..........

నా కృష్ణుడు ఇంకా చిన్నపిల్లాడే అని
యశోద అన్నపుడు,
గోపికలు కృష్ణుని చూస్తూ
ముసిముసి నవ్వులు నవ్వుకొన్నారు.     - 112

ఒక స్త్రీ మోము గుండ్రంగా, కాంతులీనుతూ ఉన్నదని చెప్పటానికి   చంద్రబింబంతో పోల్చటం అనేది అనేకమంది కవులు చేసే వర్ణన. కానీ ఇదే విషయాన్ని రెండువేల సంవత్సరాల క్రితం  గొప్ప చమత్కారంతో  ఈ ప్రాచీన కవి ఎలా చెప్పాడో చూడండి.

సుందరీ! రోజు పౌర్ణమి.
రాత్రి పెరట్లో పడుకోకు సుమీ!
రాహువు నీ ముఖాన్ని
చంద్రబింబమని అని భ్రమపడగలడు.            - 804

పై గాథలో చెప్పిన విషయమే మరింత అందంగా, మరింత గడుసుగా ఈ క్రింది గాథ లో కనిపిస్తుంది.    చందమామ-స్త్రీ మొఖము ఉపమానాన్ని ఈ గాథ పరాకాష్టకు తీసుకెళ్ళి వదులుతుంది. ఈ క్రమంలో దీనిని మించిన పదచిత్రం మరొకటేదయిన ఉందంటే అది ఖచ్చితంగా ఈ కవి వ్రాసిందే అయిఉంటుంది.

ప్రతీ పౌర్ణమి రోజునా సృష్టికర్త
చందమామను ఒకసారి తీసి
నీ మోముతో పోల్చిచూసి
చిన్నచిన్న మార్పులు చేసి
మరలా పెడుతున్నాడు.               - 207

ఆకుపచ్చని ఈకలతో, ఎర్రనిముక్కుతో రామచిలుక చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.  రామచిలుకలు సాధారణంగా ఒక గుంపుగా ఎగురుతూ ఉంటాయి.  అలాంటి ఒక రామచిలుకల గుంపు ఎగురుతూ వచ్చి వాలే దృశ్యాన్ని ఒక అందమైన పదచిత్రంగా ఈ గాథలో దర్శించవచ్చు....

రామచిలుకల దండు ఆకాశంనుండి
క్రిందకు వచ్చి వాలుతుంటే,
వైకుంఠంలోని లక్ష్మీదేవి యొక్క
పచ్చలు కెంపులు పొదిగిన నగలేవో
నేలకు జారిపడినట్లనిపిస్తోంది.           - 75  

ఈ గాథలలో మన్మధుని గురించి అనేక చోట్ల వస్తుంది.  ఒక యవ్వనవతి చన్నులను వర్ణించేటపుడు వచ్చే మన్మధుని ప్రస్తావన ఆ గాథకు గొప్ప పటుత్వాన్ని, లోతును ఇస్తూ, రోమాంచితం చేస్తుంది. .  

ఆమె చనుధ్వయం
ప్రేమను దాచుకొన్న
బంగారు లంకెబిందెలు
ఒక్కోదాని పైనా మన్మధుని
తేనెరంగు అధికార ముద్ర.                     - 813

భవదీయుడు

బొల్లోజు బాబా

Monday, March 16, 2015

"ఫ్రెంచిపాలనలో యానాం" పుస్తకం కినిగెలో లభ్యం

నే రచించిన "ఫ్రెంచిపాలనలో యానాం" (The Colonial History of Yanam) పుస్తకం కినిగెలో ఈ క్రింది లింకులో లభిస్తుంది.  ఆశక్తికలిగిన మిత్రులు దయచేసి ప్రోత్సహించవలసినదిగా ప్రార్ధిస్తున్నాను.

http://kinige.com/book/French%20Palanalo%20Yanam

భవదీయుడు
బొల్లోజు బాబా