Russell’s viper (Vipera russellii)
కాలేజ్ గార్డెన్ లో రెండు కొండచిలువలు తిరుగుతున్నాయని మా విద్యార్ధులు  చెప్పటంతో చూడటానికి వెళ్ళాం.  నిజానికి అవి కొండచిలువలు కావు.  అత్యంత విషపూరితమైన  రక్త పింజరలు.  ఇవి పొడపాముల జాతికి చెందినవి.  సాధారణంగా వీటిని కొండచిలువలుగా పొరపడుతూంటారు.  కొండచిలువలకు శరీరంపై మచ్చలు అడ్డదిడ్డంగా (ఒక పాటర్న్ లేకుండా/సౌష్టవరహితంగా) ఉంటాయి.  కానీ పొడపాముల మచ్చలు ఒక క్రమపద్దతిలో ఉంటాయి.  వీటి విషం హీమోటాక్సిక్ రకానికి చెందింది.  అంటే విషం రక్తం పై ప్రభావితం చూపి రక్త కణాల్ని విచ్చిన్నం చేస్తుంది.  దీని కాటు బారిన పడితే, ఆరుగంటలలోగా ఆంటివీనం ఇవ్వకపోతే, మూడు నాలుగు రోజులలో శరీరం లోని రక్తం విచ్చిన్నమై, చర్మంపై పెద్దపెద్ద ఎర్రని బొబ్బలు తేలి మరణిస్తారు.చాలా బాధాకరమైన మరణం.  
 చాలా సంవత్సరాల క్రితం నా మిత్రుడు దీని కాటుకు గురయ్యాడు. ఏదో పురుగు కుట్టి ఉంటుందని అశ్రద్ధ చేయటంతో రెండోరోజుకు చర్మం పై ఎర్రని దద్దుర్లు లేచాయి.  మూడో రోజుకు అవి పెద్దవై విస్తరించాయి.  హాస్పటల్ కి తీసుకెళితే, లాభం లేదని డాక్టర్లు చెప్పారు.  నాలుగోరోజున అతన్ని చూడటానికి వెళ్ళినప్పుడు,  అతని శరీరంపై  ఎర్రని బొబ్బలు ఎర్రగా కాల్చిన అరెశలు పేర్చినట్లుగా ఉన్నాయి.  ఆ మరునాడు అతను మరణించాడు. చాలా విషాద కరమైన మరణం.
కొండచిలువలే కదా అని వాటితో పరాచికాలాడుతున్న విద్యార్ధులను హెచ్చరించాం.  కాసేపటికి అవి మెల్లగా మరోచోటికి జారుకొన్నాయి
బొల్లోజు బాబా

