Saturday, February 26, 2011

నగరంలో చిరుత

నగరంలో చిరుత

జనావాసంలోకి చిరుత ప్రవేశించింది.
పాపం అది దారి తప్పి కాదు ఇటువస్తా.
తను పుట్టిన ప్రదేశాన్ని చూసుకొందామని వచ్చింది.
ఎటెళ్లాలో తెలియక ఓ ఇంటి బాత్ రూం లో దూరింది.

లక్షల విలువచేసే దాని మచ్చల చర్మం మెరుస్తోంది.
ఆ నిగారింపు తెలియకూడదని కామోసు
అది చీకటి మూలల్లోకి నక్కుతోంది.

తన ఒక్కో గోరు మూడేసి వేలని విన్నట్లుంది
గోళ్లనన్నీ లోనకు లాగేసుకొంది.

తన ఎముకలపొడి తులం వెయ్యి రూపాయిలని వినగానే
దానికి వెన్నులోంచి చలి మొదలైంది.
రక్షించండి, రక్షించండీఅని అరచింది దీనంగా.
జనాలు భయంతో పరుగులు తీసారు.

ఓ అత్యుత్సాహి దానికి కొంచెం దగ్గరగా నుంచొని
సెపియా టోన్ లో ఫొటోలు తీయించుకొంటున్నాడు.

మీడియావాడొకడు ఎక్స్ క్లూసివ్ కవరేజ్ కోసమని
దానిని కర్రతో పొడిచి కెమేరా ఆన్ చేస్తున్నాడు.
కర్రతో పొడిచి కెమేరా ఆన్ చేస్తున్నాడు .........

ఆ హడావిడిలో బాత్ రూం తలుపు గడియ ఊడింది.
ఒక ఉరుకులో అది బయటపడి
ఇక వెనక్కు తిరిగి చూడకుండా పరిగెట్టింది.
మానవ మృగాలకు దూరంగా ...  చెట్లు నరికిన అడవి వైపు.

 బొల్లోజు బాబా

1 comment:

  1. chala baga rasaru.

    http:/kallurisailabala.blogspot.com

    ReplyDelete