Sunday, March 2, 2025

ఔరంగజేబు మతవిధానం


భారతదేశం అనాదిగా మతవైవిధ్యానికి, భిన్న సంస్కృతుల మేళవింపుకు ప్రసిద్ధి. హిందూ ముస్లిమ్, క్రిస్టియన్ ల మధ్య సామరస్యాన్ని సూచించే, దర్గాలు, సూఫీ సంతుల పండగలు, ఫీర్ల ఉత్సవాలు, వేళాంకన్ని లాంటి సంస్కృతులతో ప్రజలందరూ పరస్పరసహకారం, సహనంతో జీవించారు. ఇటివల హిందుత్వ శక్తులు ఈ సామరస్యాన్ని ధ్వంసం చేసి సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంచటానికి ప్రణాళికాబద్దంగా ప్రయత్నిస్తున్నాయి.

అజ్మీర్ లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిస్టీ, ఢిల్లీకి చెందిన హజ్రత్ నిజాముద్దీన్ ఔలియా వంటి సూఫీ సంతుల దర్గాలను హిందువులు ముస్లిములు వచ్చి దర్శించుకొంటారు. ఇవి ఒకరకంగా ఈ రెండు మతాలు కలుసుకొనే చోట్లు. ఈ సహిష్ణుతను నాశనం చేసే ప్రయత్నాలు ఇటీవల చూస్తున్నాం.

ఈ మధ్యకాలంలో చర్చిలపై, క్రైస్తవ విశ్వాసులపై దాడులు జరుగుతున్నట్లు పేపర్లలో చూస్తున్నాం. ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే మసీదుకు వెళ్ళి తాయత్తు కట్టించుకోవటమో, ఏ చర్చి ఫాదరునో ఇంటికి పిలిపించుకొని ప్రార్థన చేయించుకోవటమో బహుజనులలో అనాదిగా వస్తున్న ఆచారం. కానీ ఈనాడు ఇలాంటి కలయికలు జరగకుండా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు కొందరు. ఇవన్నీ మనుషులమధ్య చిచ్చులు పెట్టి, వారిని విభజించే కుట్రలుగా అర్ధం చేసుకోవాలి.

అంతేకాక ఔరంగజేబులాంటి ముస్లిమ్ పాలకులను కొందరు క్రూరపాలకులుగా చిత్రించే ప్రయత్నాలు పదే పదే జరుగుతున్నాయి. అతని పాలనలో జరిగిన కొన్ని సంఘటనలను ముందుకు తీసుకొచ్చి వాటికి లేని పోని కల్పనలు జోడించి దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవి ప్రజలను విభజించి, వారిలో ద్వేషభావాలను పెంపొందించటానికి ఉద్దేశించిన ఎత్తుగడలు.
ఔరంగజేబు ఆరవ మొఘల్ చక్రవర్తి. దాదాపు యాభై ఏండ్లు పాలించాడు. భారతదేశ చరిత్రలో ఔరంగజేబు లక్షలాది హిందువులను ఊచకోత కోసాడని, వేలాది ఆలయాలను ధ్వంసం చేసాడని చెబుతారు కానీ వాటికి సరైన చారిత్రిక ఆధారాలు లభించవు.******


ఔరంగజేబును ఎందుకు ద్వేషిస్తున్నారని ఎవరినైనా హిందుత్వ వాదులను అడిగితే- ఔరంగజేబు సోదరులను, సంతానాన్ని హత్యలు చేయించాడని, హిందువులపై జిజియాపన్ను విధించాడని చెబుతారు. ఇంతకు మించి ఔరంగజేబు గురించి చెడు చెప్పటానికి వారివద్ద కూడా ఏమీ ఉండదు.
రాజ్యాధికారం స్థిరపరచుకొనే క్రమంలో దాయాదులను తొలగించటం రాచరిక వ్యవస్థలో సహజం. ఈ పని ఔరంగజేబు ఒక్కడే కాదు బాబర్, హుమాయున్, అక్బర్, షాజహాన్ లాంటి ముఘల్ పాలకులందరూ చేసారు. శత్రుశేషం లేకుండా చూడటం రాజ్యంలో అంతర్యుద్ధాన్ని, తిరుగుబాట్లను, అస్థిరతను నివారించటం కొరకేనని రాజకీయనిపుణులు చెబుతారు.

జిజియా పన్ను అనేది ఇస్లామేతర విశ్వాసులు- రాజ్య రక్షణ, మతపరమైన స్వేచ్ఛ పొందేందుకు, మిలటరీ సర్వీసు నుండి మినహాయింపు కొరకు చెల్లించాల్సిన పన్ను. ఇది అల్లాఉద్దిన్ ఖిల్జి కాలంనుండి (1296–1316) అమలులో ఉన్న విధానం. దీనిని1564 లో అక్బర్ నిషేదించాడు. ఔరంగజేబు 1678 లో ఆర్థికకారణాలతో జిజియాపన్నును తిరిగి విధించాడు.

స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, పేదవారు, సన్యాసులు, బిచ్చగాళ్ళు, పిచ్చివాళ్ళు, బ్రాహ్మణులు (అభ్యర్ధనలమేరకు) జిజియాపన్ను నుండి మినహాయించబడ్డారు. అదే సమయంలో ముస్లిములు జకాత్ పన్ను (Alms Tax) చెల్లించేవారు. మధ్యయుగాల యూరప్ లో ప్రజలు స్వేచ్ఛగా జీవించటానికి Chevage, pogroms లాంటి పన్నులు ఉండేవి. ఇంతా చేసి ఈ జిజియాపన్ను ఖజానా ఆదాయంలో 1% మాత్రమే.

పై రెండు అంశాలపై పండితులు చేసిన విషప్రచారం మాటున ఔరంగజేబు చేసిన ఎన్నో పరిపాలనా సంస్కరణలు మరుగున పడిపోయాయి. ఉదాహరణకు: హిందువులు పుణ్యక్షేత్రాలు సందర్శించుకొనేటపుడు చెల్లించాల్సిన Pilgrim Tax (Ziyarat Tax), వస్తురవాణాపై విధించే Rahdari (Transit Tax), చిరువ్యాపారాలు చేసుకొనేవారిపై విధించే Pandari (Market Tax), వృత్తిపన్ను, వివాహపన్ను లాంటి సుమారు 80 రకాల పన్నులను ఔరంగజేబు రద్దుపరిచాడు. రోజు ప్రజలకు దర్బారు దర్శనం ఇచ్చి అనేక సమస్యలను అక్కడకు అక్కడ పరిష్కరించేవాడు.
ఈ రోజు అఖండ భారతదేశం అని దేనినైతే భావిస్తున్నామో దానిలో 90% భూమిని ఔరంగజేబు ఒకే గొడుగుకిందకు తీసుకు వచ్చినట్లు " The Mughal Empire at its height 1707" అనే వికిపీడియా మేప్ చూస్తే అర్ధమౌతుంది.

మద్యపానం, నల్లమందులకు ఔరంగజేబు దూరంగా ఉన్నాడు. వాటిని రాజాస్థానంలో నిషేదించాడు. రాజ్యంలో కూడా మద్యపాన నిషేదం ఉండేది. చక్రవర్తులకు సహజంగా ఉండే విలాసవంతమైన జీవితాన్ని తిరస్కరించాడు. ఖురాన్ కు రాతప్రతులు తీసి వాటిద్వారా వచ్చిన ఆదాయంతో జీవించేవాడు. ఖజానా నుంచి సొంతఖర్చులకు ధనాన్ని తీసుకొనేవాడు కాదు.
******
ఔరంగజేబు సుమారు మూడు శతాబ్దాల క్రితం 23, మార్చ్ 1707 న మహారాష్ట్ర లో చనిపోయాడు. అతని చివరి కోర్కెమేరకు అతని గురువైన Sayyad Zainoddin Shiraizi సూఫీ వేదాంతి సమాధి మందిరములో అతి సామాన్యంగా ఖననం చేసారు.
నేను ఇక్కడికి ఒక అనామకుడిలా వచ్చాను, ఒక అనామకుడిలా నిష్క్రమిస్తున్నాను – ఔరంగజేబు.
హుమాయాన్, షాజహాన్ సమాధులతో పోల్చితే ఔరంగజేబు సమాధి అతను కోరుకొన్నట్లుగానే అనామకంగా మిగిలిపోయింది చరిత్రలో. బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఔరంగజేబు సమాధిని పాలరాతితో నేడు మనం చూస్తున్న విధంగా నిర్మింపచేసాడు.

ఔరంగజేబు గతించిన మూడు శతాబ్దాలతరువాత కూడా రాజకీయాలకు ఒక గొప్ప ముడిసరుకుగా మిగిలాడు. తవ్వేకొద్దీ ఓట్లు రాల్చే సాధనమయ్యాడు.
****

ఈ మధ్య యుట్యూబ్ లో Dr Ram Puniyani వీడియో ఒకటి చూసాను. దానిలో ఔరంగజేబు వివిధ రాజకీయ కారణాలవల్ల 12 ఆలయాలను, కొన్ని మసేదులను ధ్వంసం చేసాడని, వందకు పైగా హిందూఆలయాల నిర్మాణానికి, పోషణకు సహాయపడ్డాడని ఈ అంశాలను శోధించి డా.బి.ఎన్ పాండే పుస్తకం రచించాడని చెప్పాడు. కొద్దిగా వెతకగా Aurangzeb And Tipu Sultan Evaluation Of Their Religious Policies అనే పేరుతో డా. బి.ఎన్. పాండే రాసిన పుస్తకం (1996) కనిపించింది.

నిజానికి ఈ పుస్తకంలోని వివరాలన్ని Audrey Truschke, Richard M. Eaton లాంటి వారు తమ రచనలలో అనేక సార్లు ప్రస్తావించారు. (వాటన్నిటికి ఒరిజినల్ సోర్స్ ఈ బి.ఎన్ పాండే రచన).

ఈ పుస్తకంలో డా. బి.ఎన్ పాండే ఔరంగజేబు మతపరమైన తటస్థతను పాటించాడని, అనేక హిందూ దేవాలయాలకు, మఠాలకు ఆర్థిక సహాయం చేసాడని ఆధారాలతో నిరూపించారు. డా.బి.ఎన్ పాండే రాసిన Aurangzeb Religious Policies భాగానికి ఈ క్రింది వ్యాసం ఉరామరి అనువాదం. యధాతథ అనువాదం కాదు. సంక్షిప్తీకరించబడినది. ప్రధమ పురుషలో ఉంటుంది.
అదనపు వివరాలకొరకు డా. పాండే గారి పుస్తకం లింకులో ఇచ్చాను చదువుకొనగలరు.

ఈ పుస్తకంలో నన్ను ఆకర్షించినది ఏమిటంటే…. ఔరంగజేబు హిందువులకు జారీ చేసిన ప్రతి ఫర్మానులోను “సామ్రాజ్యం శాశ్వతంగా నిలిచేందుకు వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి” అనే వాక్యం. ఔరంగజేబుకు హిందూ దేవుళ్ళపట్ల వ్యతిరేకభావన లేదని ఈ వాక్యం తెలియచేస్తుంది.

ఔరంగజేబు హిందూ ద్వేషి అనే ప్రచారం పండితుల సృష్టి. ఔరంగజేబు అన్న అయిన దారాషికో పండితుల సాంగత్యంలో సంస్కృతం నేర్చుకొన్నాడు. ఇతనితో, ఉపనిషత్తులు, ఇతరకావ్యాల అనువాదాలు చేయించారు. ఇతను రాజైతే తమకు తిరుగులేదని పండితులు భావించి ఉంటారు. ఇది ఔరంగజేబుకు నచ్చలేదు అన్నను తొలగించి, కళలు కవులను ఆస్థానంలో నిషేదించటం ద్వారా పండితులను దూరంపెట్టాడు. ఔరంగజేబుపై అనాదిగా పండితులకు ఉన్న ద్వేషానికి గల కారణమిది . ( బ్లాగులో చూడుడు: మొఘల్ పాలకులు -సంస్కృత పండితులు వ్యాసం)

ఇప్పటివరకు ఈ పండితులు చేసిన దుష్ప్రచారాన్ని పక్కనపెట్టి, ఔరంగజేబును చారిత్రిక దృష్టికోణంలోంచి పునర్మూల్యాంకనం చేయాల్సిన అవసరం ఉంది.
******
.
.
ఔరంగజేబు మతవిధానం- డా. బి.ఎన్ పాండే రచన ఉరామరి అనువాదం.
.
1948-53 మధ్య, నేను అలహాబాద్ మున్సిపాలిటీ చైర్మన్‌గా ఉన్న సమయంలో, ఒక దాఖిల్ ఖారిజ్ (మ్యూటేషన్) కేసు నా పరిశీలనకు వచ్చింది. ఇది గంగా, యమునా సంగమంలో ఉన్న సోమేశ్వర్ నాథ్ మహాదేవ్ ఆలయానికి అంకితమైన ఆస్తిపై జరిగిన వివాదం. మహంత్ మరణించిన తరువాత, ఆస్తిపై ఇద్దరు హక్కుదారులు ప్రత్యర్థులుగా నిలిచారు. వారిలో ఒకరు, అతనివద్ద వంశపారంపర్యంగా ఉన్న కొన్ని పత్రాలను సమర్పించారు. ఆ పత్రాలు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ జారీ చేసిన ఫర్మాన్లు (రాజాజ్ఞ). ఔరంగజేబ్ ఆ ఆలయానికి జాగీర్ (భూమి), కొంత నగదు బహుమతి అందజేశాడని పేర్కొంది. నేను ఆశ్చర్యపోయాను. నాకు అనుమానం కలిగింది. ఆ ఫర్మాన్లు నకిలీవిగా అనిపించాయి.

విగ్రహాలను ధ్వంసం చేసే వ్యక్తిగా పేరుగాంచిన ఔరంగజేబ్, ఒక హిందూ ఆలయానికి పూజ, భోగం కోసం జాగీర్ ఇవ్వడం ఎలా సాధ్యం? అతను విగ్రహారాధనను ఎలా సమర్ధించగలడూ? లాంటి ప్రశ్నలు నాకు కలిగాయి.

నిజానికి ఆ పత్రాలు నకిలీవేనని నాకు నమ్మకం కుదిరింది. కానీ, తుది నిర్ణయం తీసుకునే ముందు, పర్షియన్ మరియు అరబిక్‌లో మహా పండితుడైన సర్ తేజ్ బహదూర్ సప్రూ అభిప్రాయం తీసుకోవాలని భావించాను. నా ఆఫీసు ముగిసాకా, నేరుగా ఆయన వద్దకు వెళ్లాను. ఆ పత్రాలను ఆయన ముందు ఉంచి, ఆయన అభిప్రాయాన్ని కోరాను. ఆ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించిన తరువాత, డాక్టర్ సప్రూ అవి నిజమైన ఫర్మాన్లే అని నిర్ధారించారు. ఆపై, ఆయన తన సహాయకుడిని, గత 15 సంవత్సరాలుగా అలహాబాద్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న వారణాసి జంగంబాడి శివాలయం కేసు ఫైలును తెప్పించమని ఆదేశించారు. ఆ ఆలయ మహంత్ కూడా ఔరంగజేబ్ జారీ చేసిన అనేక ఫర్మాన్లను కలిగి ఉన్నట్లు తెలిసింది.

దీంతో, నాకు ఔరంగజేబ్ వ్యక్తిత్వం కొత్తగా కనిపించటం మొదలైంది.  ఎంతో ఆశ్చర్యపోయాను.

డాక్టర్ సప్రూ సూచన మేరకు, నేను భారతదేశంలోని వివిధ ప్రధాన ఆలయాల మహంత్‌లకు లేఖలు రాసి, ‘వారి ఆలయాలకు సంబంధించి, ఔరంగజేబ్ ఫర్మాన్లు జారీ చేసి ఉంటే, వాటి ఫోటోకాపీలు పంపమని’ కోరాను. ఇంకా పెద్ద ఆశ్చర్యం ఎదురైంది. మహాకాళేశ్వర ఆలయం (ఉజ్జయిని), బాలాజీ ఆలయం (చిత్రకూట్), ఉమానంద ఆలయం (గౌహతి), శత్రుంజయ జైన ఆలయాలు, మరియు ఉత్తర భారతదేశంలోని అనేక ఇతర ఆలయాలు, గురుద్వారాల నుండి ఔరంగజేబ్ జారీ చేసిన ఫర్మాన్ల ప్రతులు నాకు అందాయి. ఈ ఫర్మాన్లు 1659 A.D నుండి 1685 A.D. మధ్య జారీ చేయబడ్డాయి.

ఇవి కొద్ది ఉదాహరణలు మాత్రమే అయినప్పటికీ, ఔరంగజేబ్‌పై చరిత్రకారులు వ్రాసినది పాక్షికం మాత్రమే, అది పూర్తిగా ఏకపక్షంగా ఉందని అర్ధమైంది. భారతదేశం విస్తారమైన దేశం, వేలాది ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. తగిన పరిశోధన చేస్తే, మరిన్ని ఉదాహరణలు బయటపడతాయి, ఇవన్నీ ఔరంగజేబ్ హిందువుల పట్ల ఉదారభావంతో వ్యవహరించినట్లు నిరూపిస్తాయి.

ఈ ఫర్మాన్లపై పరిశోధన చేస్తూ, నేను శ్రీ గ్యాన్ చంద్ మరియు పాట్నా మ్యూజియం మాజీ క్యూబేటర్ డాక్టర్ పి.ఎల్. గుప్తా వంటి ప్రముఖ చరిత్ర పరిశోధకులను కలిశాను. వారు కూడా ఔరంగజేబ్ చరిత్రపై విశేష పరిశోధనలు చేస్తున్నారు. నాకు సంతోషం కలిగించింది. ఎందుకంటే, మరికొందరు విజ్ఞానవేత్తలు, నిజమైన చరిత్రను వెలుగులోకి తీసుకురావడానికి తమ వంతు సహాయాన్ని అందిస్తున్నారు. పక్షపాతంగల చరిత్రకారులు, మొఘల్ పాలనను పూర్తి ముస్లిం పరిపాలనగా చూపిస్తూ, ఔరంగజేబ్‌ను కేవలం క్రూర ముస్లిం పాలకునిగా మాత్రమే చిత్రీకరించారు.
ఒక కవి వ్యథతో ఇలా వ్రాశాడు:

"తుమ్ హేన్ లేఖ్ కె సారీ దస్తాన్ మేన్ యాద్ హై ఇత్నా;
కే ఆలంగీర్ హిందు కుష్ థా, జాలిమ్ థా, సితం గర్ థా..."

(భారతదేశంలో వెయ్యి సంవత్సరాల ముస్లిం పాలన గురించి మాట్లాడేటప్పుడు, వాళ్లు కేవలం ఇంతే గుర్తు పెట్టుకుంటారు – ఆలంగీర్ (ఔరంగజేబ్) హిందువులను హత్య చేసిన వాడు, క్రూరుడైన పాలకుడు అని!)

ఔరంగజేబ్‌ను హిందూ వ్యతిరేక పాలకుడిగా ముద్ర వేసిన వాటిలో, "బనారస్ ఫర్మాన్" అనే ప్రసిద్ధ ఫర్మాన్‌ను ప్రస్తావిస్తారు. ఇది వారణాసిలోని మోహల్లా గౌరీ ప్రాంతానికి చెందిన ఒక బ్రాహ్మణ కుటుంబానికి ఇచ్చిన ఉత్తర్వు. 1905లో ఒక వివాదంలో ఈ ఫర్మాన్ నగర మేజిస్ట్రేట్ ఎదుట సమర్పించబడింది. 1911లో "జర్నల్ ఆఫ్ ది ఆసియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్" లో ఇది ప్రచురితమైంది. అప్పటి నుంచి చరిత్రకారులు దీనిని తరచూ ప్రస్తావిస్తూ వస్తున్నారు.

ఈ ఫర్మాన్ మార్చి 10, 1659 నాడు, వారణాసిలోని స్థానిక అధికారికి జారీ చేయబడింది. ఒక బ్రాహ్మణుడు తన ఆలయంపై కొందరి వేధింపులను ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశాడు. ఈ ఫర్మాన్‌లో, "పురాతన ఆలయాలను కూల్చకూడదు, కొత్త ఆలయాలు నిర్మించకూడదు" అని ఉంది. మరీ ముఖ్యంగా, హిందువులకు ఉపద్రవం జరగకుండా చూడాలని, వారు శాంతిగా నివసిస్తూ, రాజ్యం కొనసాగడానికి దేవునికి ప్రార్థనలు చేయాలని పేర్కొనబడింది.

ఔరంగజేబ్ హిందువులను వేధించేందుకు ఈ ఫర్మాన్‌ను జారీ చేయలేదని స్పష్టంగా తెలుస్తోంది. అప్పటివరకు ఉన్న ఆచారం ప్రకారం, కొత్త ఆలయాలను నిర్మించకూడదని మాత్రమే పేర్కొన్నాడు. కానీ, హిందువుల భద్రత విషయంలో అతను చాలా కఠినంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది.

బనారస్‌లోని మరో ఫర్మాన్ కూడా అదే సూచిస్తుంది:

"మహారాజ ధీరాజ్ రాజా రామ్ సింగ్ (బనారస్) తన తండ్రి నిర్మించిన భవనాన్ని భగవత్ గోసాయి అనే గురువుకు నివాసంగా ఇచ్చిన సంగతి, కానీ కొందరు ఆయనను వేధిస్తున్నారని తెలుపుతూ, వారి హక్కులను పరిరక్షించాలని కోరిన మీదట” – అలా జరిపించాలని అధికారులను ఆదేశిస్తూ ఔరంగజేబు ఫర్మానా జారీచేసాడు.
ఇలాంటి మరికొన్ని ఫర్మాన్లు కూడా ఉన్నాయి. జంగంబారి మఠాన్ని కొందరు ముస్లిములు ఆక్రమించుకొన్నారని కొందరు జంగములు ఔరంగజేబు దర్బారులో మొరపెట్టుకోగా, “ విచారణ చేసి ఆ ముస్లిములదే తప్పయినట్లు తేలినచో వారిని అక్కడనుంచి తొలగించి తగిన విధంగా శిక్షింవలసిందని అధికారులను ఆదేశించాడు. అలా కొన్ని ఫర్మాన్లు, హిందువుల హక్కులను కాపాడటానికి ఔరంగజేబ్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చినట్లు సూచిస్తున్నాయి.

ఇదంతా చూస్తే, ఔరంగజేబ్‌ను కేవలం హిందూ వ్యతిరేక పాలకుడిగా ముద్ర వేసే చరిత్ర పాక్షికమని తెలుస్తుంది. అతడు హిందువులకు న్యాయం చేయడంలోనూ, వారి ఆలయాలను రక్షించడంలోనూ శ్రద్ధ వహించినట్టు స్పష్టమవుతోంది. ఇలాంటి నిజమైన చరిత్రను వెలుగులోకి తేవడం చాలా అవసరం!

ఈ ఫర్మాన్ అతను హిందూ మతం పట్ల సమ న్యాయం పాటించటమే కాక , హిందూ భిక్షువులకు నిసార్ (ద్రవ్య సహాయం) పంపిణీ చేయడంలో ఆయన ఏ భేదాభిప్రాయం చూపలేదనే విషయాన్ని కూడా వెల్లడిస్తుంది. 178 బీఘాల భూమిని (110 ఎకరాలు) జంగములకు ఔరంగజేబ్ స్వయంగా దానం చేసినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే, ఈ భూమిని గురించి మరొక ఫర్మాన్ 1661 CE. 29th April తేదీన జారీ చేయబడింది, ఇందులో ఈ విధంగా ఉంది:

"పర్గనా హవేలీ, బనారస్ (సుభా అలహాబాద్‌కి చెందిన) ప్రస్తుత, భవిష్యత్ అధికారులందరికీ తెలియజేయునది ఏమనగా… చక్రవర్తి ఆదేశాల ప్రకారం, బనారస్‌ పరగణాలో 178 బీఘాల భూమి జంగముల జీవనోపాధికి కేటాయించబడింది. దానిపై ఇతరులు ఎవరికీ హక్కులు లేవు. జంగములు హక్కులు నిరూపించబడ్డాయి, వారు ఇంకా జీవించి, భూమిని అనుభవిస్తూ ఉన్నారు కాబట్టి, గతంలాగే మళ్లీ ఈ భూమిని వారికి బహుమతిగా కేటాయిస్తున్నాము. ఈ భూమిని పన్నురహిత భూమిగా ప్రకటించడమైనది, వారు వారి వారసులు పరంపరానుగతంగా ఉపయోగించుకోవాలి. అలాగే, ఆ జంగములు చక్రవర్తి సామ్రాజ్యం శాశ్వతంగా నిలిచేలా దేవుని ప్రార్థన చేయాలి."
****
బనారస్ పట్టణంలో ఒక హిందూ మత గురువుకు భూమిని 1687 CE .లో ఔరంగజేబ్ అనుగ్రహించినట్లు మరో ఫర్మాన్ ఉంది:

"ఈ శుభ సమయంలో ఒక ఫర్మాన్ జారీ చేయబడింది. బనారస్‌లోని బెణీమాధో ఘాట్ వద్ద గంగా తీరాన ఉన్న 5.8 దిరా కొలత గల కొంతభూమి నిర్మాణరహితంగా ఖాళీగా ఉంది. ఇది బైతుల్ మాల్ (రాజకీయ ఖజానా) ఆధీనంలో ఉంది. కాబట్టి, ఈ భూమిని రామ్ జీవన్ గోసాయిన్ మరియు అతని కుమారునికి ఈనాం భూమిగా మంజూరు చేస్తున్నాము.

పవిత్ర బ్రాహ్మణులు, భక్తులు నివసించడానికి గృహాలు నిర్మించేందుకు వీలుగా ఈ భూమిని ఉపయోగించాలి. అలాగే, వారు భగవంతుని ధ్యానంలో లీనమై, మా దివ్య సామ్రాజ్యం శాశ్వతంగా నిలిచి ఉండేందుకు ప్రార్థనలు చేయాలి. మా కుమారులు, మంత్రులు, ఉమరా (ఉన్నత అధికారులు), దర్బార్ అధికారి, కోత్వాల్‌లు (స్థానిక పాలకులు) – ప్రస్తుత, భవిష్యత్ శాసనాధికారులు – ఈ ఫర్మాన్‌ను నిరంతరంగా పాటించేందుకు కృషి చేయాలి. పై పేర్కొన్న భూమి, మంజూరు పొందిన వ్యక్తి మరియు అతని వారసుల అధీనంలో ఉండాలని, అన్ని రకాల పన్నులు, రుసుముల నుండి మినహాయించాలని మరియు ప్రతీ సంవత్సరం కొత్త సనద్ (అధికార పత్రం) కోరవద్దని ఆదేశిస్తున్నాము."
*****

ఔరంగజేబ్ తన ప్రజల మతపరమైన భావోద్వేగాలను గౌరవించేందుకు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాడో మరొక ఉదాహరణ చూస్తే స్పష్టమవుతుంది.

ఆయన తన పాలన తొమ్మిదో సంవత్సరంలో గౌహతిలోని ఉమానంద ఆలయ పూజారి సుదామన్ బ్రాహ్మణునికు జారీ చేసిన ఫర్మాన్ దీనికి నిదర్శనం. ఈ ఆలయానికి, దాని పూజారికి, అస్సాంలోని హిందూ పాలకులు గతంలో కొంత భూమి కొంత అటవీ ఆదాయం అందజేసి పోషించారు. ఔరంగజేబ్ అస్సాంను జయించిన వెంటనే, ఈ హక్కులను పునరుద్ధరించి, ఆలయ భూమి మరియు ఆదాయాన్ని ఆ బ్రాహ్మణునికి మంజూరు చేస్తూ ప్రత్యేక ఫర్మాన్ జారీ చేశాడు.

గౌహతి ఫర్మాన్‌లో ఇలా ఉంది:
"సర్కార్ దక్షిణ పరిధిలోని పటా బెంగేసర్ గ్రామంలో పరగణా పండు ప్రాంతానికి చెందిన రైతులందరికీ తెలియజేయునది ఏమనగా…. గ్రామ సకారా నుండి 2½ బిస్వా భూమి, దీనికి 30 రూపాయల ఆదాయం ఉండేది, గత పాలకుల ఆదేశాల ప్రకారం సుదామన్ కు, అతని కుమారుడు ఉమానందకు ఆలయ పూజారిగా సేవలందించినందుకు ఇది కేటాయించబడింది. అప్పటి హక్కుదారులు ఇప్పటికీ ఉన్నారని నిర్ధారించబడింది. కాబట్టి, ఈ భూమిని, ఆదాయాన్ని మేము వారికే తిరిగి మంజూరు చేస్తున్నాము.

అధికారులు దీన్ని శాశ్వతంగా వారి అధీనంలోనే ఉంచాలి, భోగార్ధం ఉపయోగించుకునేందుకు వీలు కల్పించాలి. అలాగే, మేం పాలించే సామ్రాజ్యం శాశ్వతంగా నిలిచేందుకు వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఈ భూమిపై ఎటువంటి పన్నులు, రుసుములు విధించరాదు. ఏటా కొత్త సనద్ ఇవ్వాలని కోరరాదు. ఈ ఆదేశం మా పాలన తొమ్మిదవ సంవత్సరంలోని 2వ సఫర్ (ఆగస్టు 20, 1666 CE) తేదీన జారీ చేయబడింది."
*****

ఔరంగజేబ్ హిందువుల మత విశ్వాసాల పట్ల సహనభావం కలిగి ఉన్నాడని ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయ పూజారుల వాదనలు మరింత బలపరుస్తాయి.

శివునికి అంకితమైన ప్రధాన దేవాలయాల్లో మహాకాళేశ్వర ఆలయం ఒకటి. ఇక్కడ అఖండ దీపం నిరంతరం వెలుగుతూ ఉండటానికి నాలుగు శేర్ల నెయ్యి ఈ దీపానికి సమకూర్చబడేది. ముఘల్ పాలనలో కూడా ఇది కొనసాగించబడినట్లు పూజారులు చెబుతున్నారు. ఔరంగజేబ్ కూడా ఈ సంప్రదాయాన్ని గౌరవించాడని వారు పేర్కొంటున్నారు. అయితే, దీనిని నిర్ధారించడానికి వారి వద్ద ముఘల్ చక్రవర్తుల అధికారిక ఉత్తర్వులు లేవు. కానీ, 26 సెప్టెంబర్ 1651 CE న ఔరంగజేబ్ తండ్రి పాలనలోని మురాద్ బక్ష్ ఈ ఉత్తర్వు ఇచ్చినట్లు వారు తెలియజేశారు.

హకీమ్ ముహమ్మద్ మెహ్దీ అనే అధికారిక చరిత్రకారుడు పాత పత్రాలను పరిశీలించి, ఈ పూజారి వేసిన పిటిషన్ నిజమేనని ధృవీకరించాడు. దాని ప్రకారం, స్థానిక తహసీల్దార్ ఈ అఖండ దీపానికి నాలుగు శేర్ల అక్బరీ నెయ్యి అందజేయాలని ఉత్తర్వు ఉంది.

ఈ ఉత్తర్వు ముహమ్మద్ సాదుల్లా చేత 1740.లో మళ్లీ నకలు చేయబడింది. అంటే, అసలు ఉత్తర్వు జారీ చేయబడిన 92 సంవత్సరాల తర్వాత దీనికి నకలు తీసారు.
*****

ఈ వాస్తవాలు పరిశీలిస్తే, ఔరంగజేబ్ పూర్తిగా హిందూ వ్యతిరేకుడని చెప్పడం తగదు. అతను అనేక ఆలయాలకు రక్షణ కల్పించాడు, హిందూ పూజారులను గౌరవించాడు, మరియు వారి జీవనోపాధిని కొనసాగించేందుకు భూములు కేటాయించాడు. మఘల్ చరిత్రను పూర్తిగా ఒకే కోణంలో చూడకుండా, మరింత సమగ్ర దృష్టితో పరిశీలించాలి.

ఆ ఆలయంలో భద్రపరిచిన మరికొన్ని రాజసంబంధ పత్రాలు అప్పటి మహంత్ లక్ష్మీ నారాయణ ద్వారా నాకు తెలిసాయి. అతని వద్ద కూడా ఔరంగజేబు కాలానికి చెందిన కొన్ని పత్రాలు ఉన్నాయి.
ఇతిహాసకారులు సాధారణంగా అహ్మదాబాద్ నగరసేఠ్ నిర్మించిన చింతామణి దేవాలయం విధ్వంసం గురించి మాత్రమే మాట్లాడుతారు. కానీ అదే ఔరంగజేబు శత్రుంజయ మరియు అబూ దేవాలయాలు నిర్మించటానికి అదే నగరసేఠ్‌కు భూములను ఇచ్చిన విషయాన్ని మౌనంగా వదిలేస్తారు.

శత్రుంజయ దేవాలయానికి భూమిని మంజూరు చేసిన సనద్ (రాజాజ్ఞ):

సతీదాస్ అనే నగల వ్యాపారికి పాలితానా జిల్లాలోని (సోరఠ్ సర్కార్ పరిపాలనా కింద ఉన్న) శత్రుంజయ అనే ప్రాంతంలో కొంత భూమి అతనికి శాశ్వతంగా ఇవ్వబడింది.

ఈ భూమి తదుపరి తరాలకు కూడా కొనసాగాలని, భవిష్యత్ పరిపాలకులు ఈ ఫర్మాన్‌ను ఖచ్చితంగా పాటించాలని, ప్రతీ సంవత్సరం కొత్త సనద్ కోరాల్సిన అవసరం లేకుండా ఈ భూమిని శాశ్వతంగా ఆ స్వాములకు అప్పగించామని పేర్కొన్నారు.

ఔరంగజేబు సేవలకు ప్రతిఫలంగా నగరసేఠ్‌కు మరో భూదానం:
సంతిదాస్ జవహరి, శ్రావక వర్గానికి ( వ్యాపార?) చెందిన వ్యక్తి, తన విశేష సేవల కారణంగా పాలితానా గ్రామాన్ని, శత్రుంజయ కొండను, అక్కడి దేవాలయాన్ని, ఇంకా అక్కడ లభించే కలపను స్వేచ్ఛగా వినియోగించుకునే హక్కును పొందాడు.
అదేవిధంగా, జునాగఢ్‌లోని గిర్నార్ కొండను, సిరోహి పరిపాలనలోని అబూ కొండను కూడా శ్రావక సముదాయానికి బహుమతిగా ఇచ్చారు. ఈ భూముల పరిపాలనలో ఎవరూ అంతరాయం కలిగించరాదని, ఎవరైనా ఆ భూములపై హక్కు వాదిస్తే, దేవుని శాపానికి గురికావలసి వస్తుందని రాజు ప్రకటించాడు.
*****

ఔరంగజేబు విశ్వనాథ దేవాలయం విధ్వంసం & గోల్కొండ మసీదు కూల్చివేత:

వారణాసి వద్ద ఔరంగజేబు బసచేసినపుడు చేస్తున్నప్పుడు, హిందూ రాజులు విశ్వనాథ దేవాలయంలో పూజలు నిర్వహించాలని కోరారు. కానీ, అక్కడ ఒక మహారాణి అదృశ్యమవడంతో గందరగోళం ఏర్పడింది. తన అధికారుల ద్వారా ఔరంగజేబు విచారణ జరిపిస్తే, గణేశుడి విగ్రహం వెనుక ఉన్న ఒక రహస్య సొరంగంలో అపహరణకు గురైన రాణిని దాచిఉంచారని తెలిసింది. రాణిపై అంతటి కుట్రకు పాల్పడినందుకు శిక్షగా ఆలయాన్ని పూర్తిగా తొలగించాలని ఔరంగజేబు ఆదేశించాడు.

గోల్కొండ మసీదు విధ్వంసం:
గోల్కొండ పాలకుడు తన కప్పాన్ని చక్రవర్తికి సమర్పించలేదు. దీంతో, ఔరంగజేబు గోల్కొండపై దండయాత్ర చేసి, ఖజానాను స్వాధీనం చేసుకున్నాడు. ఈ సందర్భంగా, అక్కడి మసీదును కూడా ధ్వంసం చేయించాడు.

ఈ సంఘటనలు, ఔరంగజేబు ఆలయాలైనా, మసీదులైనా చట్టం ముందు సమానంగా చూడాలని నడిచినతీరు తెలిపే ఉదాహరణలుగా పేర్కొనవచ్చు.

*****
బిషంబర్ నాథ్ పాండే (23 డిసెంబర్ 1906 – 1 జూన్ 1998) ఒక స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సేవకుడు, మరియు భారత పార్లమెంటులో సభ్యుడు. పాండే తన జీవితాన్ని జాతీయ సమగ్రత (నేషనల్ ఇన్¬teగ్రేషన్) కోసం అంకితం చేశారు మరియు గాంధేయ మార్గాన్ని విస్తరించేందుకు కృషి చేశారు. బి.ఎన్ పాండే కు చరిత్రపట్ల విశేషమైన ఆసక్తి. భారతదేశంలో మతసామరస్యం గురించి చారిత్రిక ఆధారాలతొ ప్రచారం చేసారు.
.
బొల్లోజు బాబా