Sunday, February 23, 2025

శంభాజి గురించి అతని సమకాలీన రచయిత ఏమన్నాడు?

ఛత్రపతి శివాజి కుమారుడు శంభాజి. (1657-1689). ఇతను శివాజి వారసునిగా మరాఠాసామ్రాజ్యాన్ని 1680 – 1689 ల మధ్య పరిపాలించాడు. వెనిస్ దేశానికి చెందిన నికలావొ మనుచ్చి అనే యాత్రికుడు, చరిత్రకారుడు రచించిన స్టోరియో దొ మొగోర్ ( Storia Do Mogor 1653—1708 By Niccolao Manucci) అనే గ్రంథంలో శంభాజి గురించిన వివరాలు లభిస్తాయి. నికొలవొ మనుచ్చి శంభాజీని నేరుగా కలిసి అతనితో సంభాషించిన వ్యక్తి. సమకాలీనులు చేసిన వ్యాఖ్యలు చారిత్రికంగా ఎంతో విలువైనవి. ఆ మేరకు వీటిని తటస్థ కథనాలుగా గుర్తించవచ్చు.

వివిధ కాలాలలో నికొలవొ మనుచ్చి శంభాజి గురించి చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.

1. శివాజి ఎన్నో విజయాలు సాధిస్తున్నప్పటికీ అతని కుమారుడు శంభాజీ పట్ల నిరంతరం చింతించేవాడు. శంభాజీ అదుపులేని దురలవాట్లు కలిగి ఉండేవాడు. ఇతరుల భార్యలను స్వాధీనపరచుకొనేవాడు. ఇతని దుశ్చర్యలగురించి అనేకమంది అధికారులు, కులీనులు శివాజికీ పిర్యాదులు చేసేవారు. ఇతనివల్ల కలిగే అసంతృప్తి వల్ల తిరుగుబాటు సంభవించవచ్చుననే ఊహతో శంభాజీని బంధించి ఏదో ఒక కోటలో ఖైదీగా పంపాలని శివాజి నిర్ణయించుకొన్నాడు.
చిన్నకుమారుడైన రామ్ రాజాను రాజ్యానికి వారసునిగా ప్రకటించాలని భావించాడు. ఈ విషయం గ్రహించిన శంభాజి ఔరంగజేబు సైన్యాధ్యక్షుడైన దిలార్ ఖాన్ తో చేతులుకలిపి అతని ఆశ్రయం పొందాడు. మనుచ్చి, పేనం 204, వాల్యూం 2

2. తన తండ్రి శివాజి మరణించాడని విన్న వెంటనే శంభాజి బీజాపూర్ నుండి బయలు దేరి తండ్రి రాజ్యంలో ప్రవేశించాడు. రాజ్యానికి తన తండ్రితన వారసునిగా ప్రకటించిన తమ్ముడు రామ్ రాజాను ఖైదుచేయించాడు. తాను అధికారం కైవశం చేసుకోవటం ఇష్టం లేని అధికారులను హతమార్చాడు. ఒకసారి శంభోజి తన కత్తి నాకు (నికొలవొ మనుచ్చికి) చూపుతు ఆ సందర్భంలో ఈ కత్తితో ముప్పై మంది తలలను నరికాను. ఇంకా అనేకమంది కళ్ళు పీకించానని చెప్పాడు. ( మనుచ్చి పేనం. 233)

(రాజ్యాన్ని హస్తగతం చేసుకోగానే శంభాజి- శివాజి వద్ద మంత్రిగా పనిచేసిన అన్నాజి దత్తు ఆస్థిని జప్తు చేయించి అతన్ని ఏనుగులతో తొక్కించి చంపించాడు; రామ్ రాజ తల్లి శివాజి రెండవభార్య అయిన సోయెరాబాయి కి మరణ దండన విధించాడు. తన తమ్ముడు రామ్ రాజాను రాజుని చేయటానికి ప్రయత్నించిన అనేక మంది అధికారులను, బంధువులను హతమార్చాడు -History Of The Mahrattas, by Grant Duff, 1878, పేనం 136-7)

4. శంభాజి విజయాలు అతని ప్రతాపం కాదు. అతని వద్ద పనిచేసే అధికారుల గొప్పదనం. (మనుచ్చి, పేనం. 258)

5. ఇతరుల భార్యల పట్ల శంభాజి అనుచితంగా ప్రవర్తించటం పై అతని అధికారులు అతనితో గొడవపడేవారు. (మనుచ్చి, పేనం. 257)

6. దురలవాట్లు స్వభావంగా మారతాయి. స్త్రీలపట్ల శంభాజికి ఉన్న వ్యామోహం ఇతనిని ఔరంగజేబుకు పట్టుబడేలా చేసింది. శంభాజీ సంగమేశ్వర్ వద్ద బసచేసినపుడు మంత్రి కాబ్ కలిష్ అక్కడకు కొద్దిదూరంలో ఒక గ్రామంలో గొప్ప అందమైన వివాహిత మహిళ ఉందని చెప్పాడు. శంభాజీ ఆ మహిళను ఎలాగైనా చేజిక్కించుకోవాలని నిర్ణయించుకొని అక్కడకు బయలుదేరాడు. ఈ విషయాన్ని కాబ్ కలిష్ ఔరంగజేబుకు ఉప్పందించటంతో అతను ఐదువేల మంది అశ్వదళాన్ని పంపి శంభాజీని పట్టి బంధించారు. ఒంటెకు కట్టి గుడారాల చుట్టూ తిప్పారు. కళ్ళు పీకి, గుండెను చీల్చి మృతదేహాన్ని చెత్తకుప్పపై కుక్కలకు ఆహారంగా వేసారు. ( మనుచ్చి pn. 310-312)

(నికొలవొ మనుచ్చి కథనంలో ఎక్కడా ఔరంగజేబు శంభాజీని మతం మారమని కోరినట్లు కానీ దాన్ని శంభాజి తిరస్కరించినట్లు కానీ లేదు. ఇలాంటి ఉద్వేగపూరిత మతాభిమాన కథనాలు ఆ తరువాత కాలంలో కల్పించినవి కావొచ్చు)

ముఘల్ సైనికులు చుట్టుముట్టినప్పుడు శంభాజి సైనికులు పారిపోయారు. ఆ కొద్దిసమయంలోనే శంభాజి గడ్డం గీసుకొని, సన్యాసి దుస్తులు ధరించి మారువేషం వేసుకొని నేలమాళిగలో దాక్కున్నాడు. సైనికులు ఆ ప్రదేశాన్ని కనిపెట్టి మెడలో ముత్యాలహారం, ఉంగరాల ఆధారంగా శంభాజీని గుర్తించి బంధించి చేతులు కట్టి జుట్టుపట్టుకొని ముఘల్ సైన్యాద్యక్షుడైన ముకర్రబ్ ఖాన్ వద్దకు తీసుకువెళ్ళారు- (House of Shivaji, Sir. Jadunath Sarkar pn231)
****

ఇది స్థూలంగా ఛత్రపతి శివాజి కుమారుడైన శంభోజిని అతని సమకాలీనుడైన నికొలవొ మనుచ్చి చూసిన విధానం.

దీని ద్వారా శంభోజి ఒక మామూలు మానవ లౌల్యాలు, ప్రాణభయం కలిగిన వ్యక్తిగా అర్ధమౌతుంది. యుద్ధాలు, ఒకరిని ఒకరు దోచుకోవటాలు, చిత్రహింసలు పెట్టటాలు, చంపుకోవటాలు మిడివియల్ కాలంలో సహజాతి సహజం. ఒకడు శాంతి కాముకుడు మరొకడు హింసావాది అని చెప్పటానికి లేదు. ఎవరూ శుద్ధపూసలు కారు. ఎవరి అవసరాలు, ఎవరి బతుకు పోరాటం వారిది. చంపటమో చావటమో ఒకటే జీవనశైలి. అన్ని మతాలదీ ఇదే దారి. ఆనాటి కాలమానపరిస్థితులను గుర్తించకుండా వీడు మంచి వీడు చెడ్డ అని తీర్పులివ్వటం ప్రజలను విభజించటం, వారి మధ్య ద్వేషం పెంచటం కొరకే.

భారతదేశ చరిత్రలో ఆ కాలానికి దేశభక్తి, స్వాతంత్ర్యం లాంటి భావనలు లేవు. ఉన్నదల్లా రాజ్యకాంక్ష. దక్కించుకొన్న దాన్ని నిలబెట్టుకోవాలనే కిల్లర్ ఇన్ స్టింక్ట్. ఇంకా కొండొకచో కార్నల్ డిజైర్స్.

అలాంటి అమానవీయ రాజకీయాలకు అవతల రెక్కాడితే కానీ డొక్కాడని ప్రజలు, ఎప్పుడు ఏ ఉపద్రవం రానుందో అంటూ బిక్కుబిక్కుమంటూ అభద్రతతో బతికే వ్యాపారులు, కులీనులు ఉన్నారు. ఇవీ మధ్యయుగాల జీవితాలు.
***

సినిమా అనేది కళాత్మక వ్యక్తీకరణ. చారిత్రిక అంశాలతో సినిమాలు తీసినపుడు బాధ్యతగా ఉండటం ఎంతో అవసరం. ఒక మతానికి చెందిన వారిని వీరులుగాను, మరొక మతానికి చెందిన వారిని క్రూరులుగాను చిత్రించటం వల్ల ఆయా సామాజిక సమూహాలమధ్య వైషమ్యాలకు కారణమౌతారు. చరిత్రను శోధించి నిజాలు తెలుసుకొనే ఓపిక ఎవరికీ ఉండదు. సినిమాలో చెప్పిందే నిజమైన చరిత్ర అని భావించి సినిమాహాళ్ళలోనే ప్రతిజ్ఞలు చేస్తూ ఉద్వేగాలకు గురయి, భోరుభోరున ఏడుస్తున్న తరం ఒకటి మనముందు ఉంది. అంతటి గొప్ప మాధ్యమం సినిమా.

ఇలాంటి నేపథ్యంలో అభూతవిశ్వాసాలను, అబద్దపు ఉద్వేగాలను ప్రజలలో రగిలించటం నైతికపతనం. పసిమనసుల్ని కలుషితం చేయటం.

చరిత్ర అనేది ప్రజల సామూహిక మెమొరీ. దానిలోంచి కొందరిని సమూలంగా తుడిచివేయాలనో లేదా వారిని దుర్మార్గులుగా చిత్రించాలనో చేసే ప్రయత్నాలు కళాత్మక స్వేచ్ఛ అవదు. సామాజిక ద్రోహం అవుతుంది.
బొల్లోజు బాబా
సంప్రదించిన పుస్తకాలు
1. STORIA DO MOGOR 1653—1708 BY NICCOLAO MANUCCI
2. History Of The Mahrattas, by Grant Duff, 1878
3. House of Shivaji, Sir. Jadunath Sarkar pn231
4. History of the Mahrattas by Edward Scott Waring
5. Historical Fragments Of The Mogul Empire, by Robert Orme



శంకరాచార్యుని పోస్టుపై ఒక మిత్రునితో మంచి చర్చ జరిగింది

శంకరాచార్యుని పోస్టుపై ఒక మిత్రునితో మంచి చర్చ జరిగింది. ఆ పోస్టుకు కొనసాగింపుగా ఆ కామెంట్లను ఒక పోస్టుగా పెడుతున్నాను.
.
మీరు పారమార్ధిక ప్లేన్ లోంచి మాట్లాడుతున్నారు. భౌతికంగా అలా లేదు. శంకరుడే స్వయంగా చెప్పాడు శూద్రుడు విద్యకు అనర్హుడు అని. ఎవరు ఎక్కడుండాలో వాళ్ళు అక్కడుండాలని. బౌద్ధ జైనాల్ని నిర్మూలించటంలో పాపం లేదని.
వీటిని మినహాయించి చేసే ఏ వాదనైనా, చెప్పే ఏ అన్వయమైనా నేటికీ సాగిస్తున్న మోసం అని భావిస్తాను.
.
బౌద్ధజైన సిద్ధాంతాలు కనుమరుగు అయ్యాయని చెప్పలేదు. అవి హిందూమతంలోకి అస్సిమిలేట్ అయ్యాయని పంచాయత ఆరాధన పారాగ్రాఫులో చెప్పాను.
అద్వైతాన్ని సిద్ధాంతపరంగా బౌతికవాదులు ఎదుర్కోలేరు. చార్వాకులు ప్రత్యక్ష ప్రమాణాన్ని , బౌద్ధులు ప్రత్యక్ష మరియు అనుమాన ప్రమాణాలను మాత్రమే అంగీకరించిన భౌతికవాదులు.
వీటితో పాటు ఉపమాన, శబ్ద, అర్ధాపత్తి, అనుపలబ్ది లాంటి ప్రమాణాలను కూడా అంగీకరిస్తారు అద్వైతులు.
వీరిద్దరి మధ్యా శాస్త్ర చర్చలో అద్వైతులే విజయం సాధిస్తారు. ఎందుకంటే శబ్ద, ఉపమాన అర్ధాపత్తి లాంటి వాటికి ఆధారాలు చూపక్కరలేదు. అభౌతికమైన అంశాలను కూడా వాటిసాయంతో సత్యాలుగా చలామణీ చేయించవచ్చు.
కనుక వారిరువురి పోటీలో అద్వైతులు నెగ్గటం మోసపూరితమైనది.
శంకరుడు చేసిన పని అది. ఈ పని ద్వారా బ్రాహ్మణాధిక్యత వచ్చి, బ్రాహ్మణుడినే ఈ ఆథ్యాత్మిక క్రతువులలో అధిపతిగా నిలిపినపుడు- శతాబ్దాలుగా పండితులు ఈ మోసాన్ని అనేక తలతిక్క అన్వయాలతో సమర్ధిస్తూనే ఉన్నారు.
వ్యాసంలో ఎక్కడో చెప్పినట్టు ఈ పురాణపురుషులు చెప్పినది ఏమిటి అని కాక, దానివల్ల సమాజం ఏ ఏ మలుపులు తీసుకొంది అనేది ముఖ్యం. నాకు కనిపించేది ఏమిటో స్పష్టంగా చెప్పాను. ఈ శంకరాచార్యుని నిర్వాకం వల్ల అశాస్త్రీయత, మూఢత్వం, బ్రాహ్మణాధిక్యత, వర్ణవ్యవస్థ లాంటి అవలక్షణాల వైపు సమాజం ప్రయాణించింది. అది పండితులకు మేలు చేసింది కనుక శంకరుడిని భక్తితో నేటికీ పూజిస్తారు.
నేను అలా చూస్తున్నాను. అలా గతం నాకు కనపడుతుంది. మీకు మరోలా కనిపించవచ్చుననే అవకాశాన్ని కాదనను.
.
తత్వం నాశనం అయిందని ఎవరన్నారు. ఎందుకు పదే పదే అంటారు ఆ మాట. నేను స్పష్టంగా చెప్పాను. తత్వాలు అస్సిమిలేట్ అయ్యాయని. ఏటా శంకరజయంతులు ఎవరు చేస్తున్నారు?
వైవిధ్యం శంకరుడితో వచ్చిందా? హాస్యాస్పదం. శంకరుని కాలానికే భిన్న పాయలు ఉన్నాయి.
మీరు భౌతిక స్థాయిలో మాట్లాడండి. శంకరనిర్వాకం వల్ల సమాజంలో ఏం జరిగి ఉంటుందో చెప్పాను. అలా జరగలేదని ఉపపత్తులు ఇవ్వండి. ఏ వేవో మాట్లాడితే ఎలా?
ఇస్లాంని కానీ క్రిస్టియానిటీని గానీ గౌరవించటం, సూఫీ దర్గా కల్చర్ ని ఆదరించటం అనేది బౌద్ధజైన కాపాలికాదుల్ని నిర్మూలించిన శంకరాచార్యుని వల్ల వచ్చింది అంటే హాస్యాస్పదంగా అనిపిస్తుంది.
నిజానికి ఈ సమాదరణ అనేది భారతదేశ ఆత్మ. అశోకుని 12 వ శాసనంలో ఇలా ఉంది.
///ఒక పాషండ శాఖ/మతం కి చెందిన వ్యక్తులు అసందర్భంగాతమ శాఖను పొగుడుకోవడం, ఇతర శాఖ/మతాలను నిందించడం చేయరాదు. పరశాఖల/మతం వారిని కూడా గౌరవించవలెను. ఇట్లు చేయుట వలన తన మతాన్ని అభివృద్ధి చేసుకోవటంమే కాక ఇతర శాఖలవారికి ఉపకారం కలిగించిన వారు అయెదరు. తన వారిని స్తుతిస్తూ ఇతరశాఖల వారిని నిందించేవాడు తన శాఖకే ఎక్కువ అపకారం చేసిన వాడవుతాడు// సమస్త జనులకు ధర్మాభివృద్ధే ముఖ్యము తప్ప దానం కాని, పూజ కాని అంత ముఖ్యాలు కావు అని దేవానాం ప్రియుడు తలుస్తున్నాడు. (XII శిలాశాసనము)///
క్రీపూ 3 వ శతాబ్దానికి శంకరాచార్యుడు ఎక్కడున్నాడు. సమత, సహిష్ణుతలను ఈ నేలకు నేర్పిందే బౌద్ధ, జైనాలు. వాటిని నిర్మూలించి ఈ రోజు మనందరినీ అన్యమతాలను పీక్కుతినే జాంబీలుగా చేసింది ఎవరు? యూట్యూబ్ తెరవండి ఒకసారి అర్ధమౌతుంది.

బొల్లోజు బాబా

Saturday, February 8, 2025

ఆది శంకరాచార్యుడు - ఆథ్యాత్మిక దండయాత్ర


వైదికమతంలోని వర్ణవ్యవస్థ, యజ్ఞయాగాదులు, బ్రాహ్మణాధిక్యతను నిరసిస్తూ బౌద్ధ, జైన మతాలు ఆవిర్భవించాయి. వైదికమతాన్ని (బ్రాహ్మణమతం) ధిక్కరించి బౌద్ధం ఒక ప్రత్యామ్నాయ ఆథ్యాత్మికమార్గాన్ని ఏర్పరచింది. బ్రాహ్మణులను అత్యున్నతవర్గంగా పరిగణించే కులవ్యవస్థను బుద్ధుడు ఖండించాడు. మనుషులందరూ సమానమేనని, జన్మత హెచ్చుతగ్గులు ఉండవని ప్రకటించాడు. ఆత్మ, దేవుడు ఉనికిని అంగీకరించలేదు. మౌర్యులు, కుషానులు, కొంతమేరకు గుప్తులు బౌద్ధమతాన్ని ఆదరించటంతో బౌద్ధం సుమారు వెయ్యేళ్లకుపైన (BCE 6 నుండి CE 8 వ శతాబ్దం) భారతదేశంలో అప్రతిహతంగా మనుగడ సాగించింది. క్రతువులు జంతుబలులు కాక ధ్యానం అంతఃచేతన ద్వారా ప్రజలు నైతిక వర్తనను, మెరుగైన జీవితాన్ని పొందాలని బౌద్ధం ప్రవచించింది. ధర్మకీర్తి, శాంతిరక్షిత, నాగార్జునుడు వంటి వారు బౌద్ధబోధనలను సర్వోత్కృష్ట స్థాయికి తిర్చిదిద్దారు.

బౌద్ధమతం వర్ణాలకు అతీతంగా ప్రజలందరినీ సమానంగా చూడటంతో సామాన్యప్రజలు ఎక్కువగా ఆకర్షితులయ్యారు. జనాభాలో అధికశాతం బౌద్ధం ఆచరించారు. ఇది ఒకరకంగా వైదిక/బ్రాహ్మణ మతానికి సైద్ధాంతిక సవాలు. జీవన్మరణ సమస్య.

బ్రాహ్మణమతానికి బౌద్ధం విసిరిన ఈ సవాలును మొదటగా స్వీకరించింది ఆదిశంకరాచార్యుడు. చరిత్రకారులు ఇతను c. 788-820 CE మధ్య జీవించిన వ్యక్తి అని నిర్ణయించారు. కోటవెంకటాచలం లాంటి వారు శంకరాచార్యుని కాలం BCE 509-477 గా చెబుతారు. నిజానికి శంకరాచార్యుని ప్రచ్ఛన్న బౌద్ధుడని (crypto buddha) అందరూ అన్నారు కనుక బుద్ధుని తరువాత పెట్టవలసి వచ్చింది కానీ లేకపోతే తీసుకువెళ్ళి బుద్ధుడికన్నా పూర్వుడని చెప్పేవారే ఈ పండితులు.
 
1. జీవిత చరిత్ర

శంకరుని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన చారిత్రిక ఆధారాలు పెద్దగా లభించలేదు. అతని పుట్టుక, వ్యక్తిత్వం, అతను చేసిన ఆథ్యాత్మిక దండయాత్ర, మఠాల స్థాపన, అతని మరణం లాంటి విషయాలు – 14 వ శతాబ్దం నుంచి లభించే “శంకరవిజయాలు” పేరిట విద్యారణ్యుడు, ఆనందగిరి, చిద్విలాసుడు లాంటి కవులు రచించిన శంకరుని జీవితచరిత్రలు, ఇంకా శంకర విరచితమని చెప్పబడే వివిధ వ్యాఖ్యాన గ్రంథాల ద్వారా తెలుస్తాయి.

ఆది శంకరాచార్యుడు కేరళలోని కాలడి గ్రామంలో సంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన తండ్రి పేరు శివగురు, తల్లి పేరు ఆర్యాంబ. చిన్న వయస్సులోనే వేదాలు, ఉపనిషత్తులు మరియు తర్కశాస్త్రంలో ప్రావీణ్యం సాధించాడు. తల్లి అనుమతితో సన్యాసం స్వీకరించి, గురువు గోవింద భగవత్పాదుల చెంతకు వెళ్లి వేదాంత విద్యను అభ్యసించారు.

ఆది శంకరాచార్యుడు అద్వైత వేదాంతాన్ని ప్రబలంగా ప్రచారం చేశారు. బ్రహ్మమే పరమ సత్యం, జగత్ మిథ్య (మాయ), జీవాత్మ పరమాత్మలు ఒక్కటే అనే భావనల్ని అద్వైతతత్వంగా చెబుతారు.
శంకరాచార్యుడు భారతదేశమంతా తిరిగి తన బోధనలను వ్యాప్తి చేశాడు. నాలుగు మఠాలను స్థాపించారు: అవి కర్ణాటకలో శృంగేరి మఠం, గుజరాత్ లో ద్వారకా మఠం, ఉత్తరాఖండ్ లో జ్యోతిర్ మఠం (జోషిమఠం), ఒడిశాలో పూరీ మఠం. శంకరాచార్యుడు ఈ మఠాలను ధార్మిక నాయకత్వం, సనాతన హిందూ ధర్మపరిరక్షణ కొరకు స్థాపించారు. వీటికి అధిపతులుగా వేదాధ్యయనం చేసిన పండితులే ఉంటారు.
 
శంకరాచార్యుడు ఉపనిషత్తుల, భగవద్గీత, బ్రహ్మసూత్రాలకు భాష్యాలు; భజ గోవిందం, సౌందర్యలహరి, నిర్వాణ షట్కమ్ వంటి రచనలు చేసాడు.  శంకరాచార్యుడు తన 32వ ఏట   హిమాలయాలో కేదారనాథ్ వద్ద వెళ్లి జీవ సమాధిని పొందాడు.
ఇదీ స్థూలంగా శంకరాచార్యుని జీవిత చరిత్ర.

2. బౌద్ధంపై ఆథ్యాత్మిక దండయాత్ర

శంకరాచార్యుడు బౌద్ధ మరియు జైన ప్రభావాలకు వెనుకబడ్డ హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించాడు.
 
శంకరాచార్యుని కాలానికి బౌద్ధం భారతదేశంలో బలంగానే ఉంది. ఏడో శతాబ్దంలో భారతదేశాన్ని సందర్శించిన యవాన్ చ్వాంగ్ దేశంలో దేవాలయాలతో పాటు బౌద్ధారామాలు, బౌద్ధబిక్కులు పెద్దసంఖ్యలో ఉన్నట్లు నమోదు చేసాడు. 
****

బౌద్ధులు చార్వాకులు ఈ సమాజంలో హేతుబద్దమైన ఆలోచనలను ప్రోత్సహించారు. వారు ఈ ప్రపంచానికి ఆధారమేమిటని సత్యాన్వేషణ చేసారు. ఈ ప్రపంచం ఇంద్రియాల ద్వారా తెలుసుకోగలిగే సత్యంగా భావించారు.
 
శంకరాచార్యుడు జగత్తు మిథ్య అని ప్రకటించటం వల్ల ఈ ప్రపంచాన్ని అర్ధం చేసుకొనే ప్రయత్నానికి విలువలేకుండా అయిపోయింది. సత్యాన్వేషణను మొగ్గలోనే తుంచేసాడు. వైద్యం, రసాయిన శాస్త్రం ఖగోళ శాస్త్రం వంటి వివిధ శాస్త్రాల అథ్యయనం శంకరాచార్యుని తరువాత కుంటుపడింది. భారతీయ ప్రాచీన ఆవిష్కరణలు చాలామట్టుకు శంకరాచార్యునికి ముందు బౌద్ధ జైన లేదా వైదిక ఋషులు సాధించినవే. శంకరాచార్యుడు ప్రతిపాదించిన అద్వైతసిద్ధాంతం సమాజాన్ని మిథ్యావాదం, అలౌకిక అంశాలవైపు నడిపించి శాస్త్రీయ ఆవిష్కరణలను తిరోగమింపచేసింది.
 
దుఃఖం వాస్తవమైనది కాబట్టి దానినుండి విముక్తి పొందటమే జీవితలక్ష్యంగా బౌద్ధులు చెప్పారు. దుఃఖాన్ని ఒప్పుకొని దానిని అధిగమించే మార్గాలను సూచించారు. శంకరాచార్యుడు జగత్ మిథ్య అనటం వల్ల దుఃఖం కూడా ఒక అబద్దం అయిపోయింది. ఇది మానవ దుఃఖాన్ని ఒక మాయగా తోసిపుచ్చుతుంది. దీనివల్ల అమానుషమైన వర్ణ వ్యవస్థ లోని నిచ్చెనమెట్లలో కిందనున్న సాటిమానవుడు అత్యంత హేయమైన దుర్భర జీవనాన్ని గడపటం పట్ల ఇతరులకు ఏ రకమైన సహానుభూతి లేకుండా పోవటమే కాక ఈ భావన వర్ణ వ్యవస్థను సమర్ధించటానికి దోహదపడుతుంది. సమాజంలో ఉన్న అసమానతలు, దారిద్ర్యం, వివక్షను పట్టించుకోదు. ఈ జగమేమాయ అయినప్పుడు ఈ వివక్షపట్ల బాధితులు పోరాటం చేయాలన్న స్పృహను కూడా కోల్పోయేలా చేస్తుంది.
****

బౌద్ధసూత్రాలను కొన్నింటిని శంకరాచార్యుడు కాపీ కొట్టటంచేత శంకరాచార్యుడిని ప్రచ్ఛన్న బౌద్ధుడని చెబుతారు. అలా బుద్ధునితో పోలిక తీసుకురావటం ఒక కుట్ర. శంకరాచార్యునికి బుద్ధునికి ఆచరణలో నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. బుద్ధుడు వైదిక క్రతువులను వర్ణ వ్యవస్థను ఖండించగా, శంకరాచార్యుడు వాటికి మసిపూసి మారేడు కాయ చేసి వేదాలను ఉల్లంఘించరాదని, వర్ణ వ్యవస్థ సదా ఆచరణీయం అని చెప్పాడు. బౌద్ధారామాలలో శూద్ర, అతిశూద్ర స్త్రీలకు ప్రవేశం ఉండగా శంకరమఠాల్లో బ్రాహ్మణ పురుషులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. నిజానికి బౌద్ధాన్ని నిర్మూలించటంలో శంకరాచార్యుని పాత్ర గణనీయమైనది. అలాంటి శంకరాచార్యుడిని ప్రచ్ఛన్న బౌద్ధుడని అనటం- వ్యాసుడు శూద్రుడు, వాల్మీకి బోయ అనటం లాంటి వక్రీకరణ. వారు చెప్పే మాటలకు లెజిటమసీ కల్పించటం కొరకు పండితులు చెప్పే అసత్యాలు అవి.
****

14 వ శతాబ్దంలో మాధవాచార్యులు (విద్యారణ్యస్వామి) రచించిన శంకర దిగ్విజయ లోని 1.27-56 శ్లోకాల సారాంశం ఇలా ఉంది.
 
“లోకంలో బౌద్ధులు, జైనులు శైవ కాపాలికులు ఎక్కువకావటం చేత వైదిక ధర్మం నిర్లక్ష్యం చేయబడుతున్నదని దేవతలందరూ శివుని వద్దకు వెళ్ళి మొరపెట్టుకొన్నారట. దానికి శివుడు “నేను ఆది శంకరాచార్యునిగాను, తనకుమారుడైన కార్తికేయుడు కుమారిల భట్టుగాను అవతరించి తర్కశక్తితో ఆ మతాలను ఖంఢిస్తామని అదే విధంగా ఇంద్రుడు సుధన్వ రాజుగా జన్మించి వైదికధర్మ పునరుద్ధరణకు తోడ్పడతాడని” చెప్పాడు. ఈ ఉదంతం ద్వారా శంకరాచార్యుడు సాక్షాత్తూ శివావతారం అని, బౌద్ధ, జైన కాపాలికా ధర్మాలను నిర్మూలించటం కొరకే అతను జన్మించాడని అర్ధమౌతుంది
 
ఉజ్జయినిని పాలించిన సుధన్వ రాజు శంకరాచార్యుడు, కుమారిల భట్టుల ప్రోత్సాహంతో హిమాలయాలనుండి రామేశ్వరం వరకూ గల అనేక వేల బౌద్ధారామాలను, బౌద్ధులను నిర్మూలించాడని శంకర దిగ్విజయంలో మాధవాచార్యుడు చెప్పాడు. ఏడవ శతాబ్దపు చైనాయాత్రికుడు హ్యుయాన్ త్సాంగ్ రాతలలో ఉజ్జయినిని ఒక బ్రాహ్మణ రాజు పాలిస్తున్నాడని ప్రస్తావించాడు. మృచ్చకటిక నాటకంలో ఉజ్జయిని రాజుయొక్క బావమరిది బౌద్ధులను పీడించసాగాడు అనే మాట ఉంటుంది. ఈ రెండు ఆధారాలు శంకరదిగ్విజయ గ్రంథంలో చెప్పిన బ్రాహ్మణ సుధన్వ రాజు చారిత్రికతను తెలియచేస్తాయి .
 
శంకరదిగ్విజయ ఏడో సర్గ లో- కుమారిల భట్టు శంకరునితో "ఈ భూమి బౌద్ధులతో నిండిపోయింది వేదాలను పట్టించుకొనేవారు లేరు. నేను బౌద్ధులను జయించి వేదాలకు పునర్వైభవం తీసుకొని వస్తాను" అనగా దానికి శంకరాచార్యుడు "భట్టా నీవు బౌద్ధులను నిర్మూలించటానికి అవతరించిన కారణ జన్ముడవు. నీకు ఏ పాపము అంటదు" అని అంటాడు. (7- 77-121 Sankara Digvijaya,Translated by Swamy Tapasyananda, Ramakrishna math publication)

“శంకరాచార్యుడు బౌద్ధసన్యాసులను వాదనలో ఓడించి వారిని సజీవంగా కాల్చి చంపాడు. దీన్ని మత పిచ్చి కాక మరెలా పిలవగలం” అంటాడు స్వామి వివేకానందుడు.
 
శంకరాచార్యుడు దేశం అంతా తిరిగి బౌతికవాదులైన బౌద్ధులతో శాస్త్ర చర్చలు జరిపి – జగం మిథ్య, అహం బ్రహ్మస్మి, జీవాత్మే పరమాత్మ అంటూ పొంతనలేని పారమార్ధిక వాదనలతో ఓడించి వారిని సామూహిక దహనాలలో హతమార్చాడు. ఇది దుర్మార్గమైన క్రూసేడ్లతో సమానం.
శంకరాచార్యుని బృందం ఒక క్రమపద్దతిలో బౌద్ధ, జైన, కాపాలిక లాంటి హైందవేతర మతాలపై దాడి జరిపింది. ఈ రోజు దేశం అంతటా ఎక్కడ తవ్వితే అక్కడ లభించే విరూపమైన బుద్ధుని విగ్రహాలు శంకరాచార్యుని కాలం నాటివే.
 
అప్పటికి ఉన్న బౌద్ధ ఆరామాన్ని శంకరాచార్యుడు తొలగించి శృంగేరి పీఠాన్ని ఏర్పరచాడంటారు. CE రెండు మూడు శతాబ్దాలలో నాగార్జునకొండ వద్ద విజయపురి అనే పట్టణం గొప్ప బౌద్ధఆరామంగా విలసిల్లినట్లు శాసనాధారాలు కలవు. శంకరాచార్యుడు తన అసంఖ్యాకమైన అనుచరులతో నాగార్జున కొండవచ్చి అక్కడి బౌద్ధఆరామాలను ధ్వంసం చేసాడని నాగార్జున కొండ వద్ద జరిపిన తవ్వకాల రిపోర్టులో A.H.Longhurst అన్నాడు . అదే విధంగా బౌద్ధక్షేత్రమైన శ్రీశైలం, బద్రినాథ్, పూరి, శబరిమలై, తిరుపతి లాంటి బౌద్ధ ఆరామాలను హిందూ ఆలయాలుగా మార్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.
 
నేడు సంఘీయులు జరుపుతున్నట్లుగా ఒకప్పుడు శంకరాచార్యుడు హైందవేతర మతాలపై జరిపిన ఆథ్యాత్మిక దండయాత్ర ఇది.
 
3. కరడు కట్టిన మనువాది శంకరాచార్యుడు

శంకరాచార్యుడు దేశంనాలుగు వైపులా స్థాపించిన పీఠాలకు ఒక్కో ఆచార్యుని నియమించాడు. ఎవరి పీఠపరిథిలో వారు అక్కడి ప్రజలలో వర్ణాశ్రమ ధర్మాలను కాపాడాలని 26 శ్లోకాల “మహానుశాసనం” ను రచించాడు. దానిలోని కొన్ని శ్లోకాల అర్థాలు ఇవి…..

మేము సాధించిన వర్ణాశ్రమ ధర్మములను తమ పరిధులలోని ప్రజలలో రక్షితములు అగునట్లు చూడవలెను (శ్లోకం నంబరు 3) ఇక్కడ మేము సాధించిన అనే పదం ప్రధానము.
 
నా చే నిర్మించబడిన ఈ ఆర్యమర్యాద యధావిధిగా నాలుగు మఠములద్వారా రక్షింపబడునట్లు పీఠాధిపతులు తమ శక్తిని వినియోగించవలెను. (8 వ శ్లోకం)

ధర్మసంరక్షణార్ధము సుధన్వ మహారాజునకు గల అధికారమును ఇంద్రాజ్ఞవలె పాలింతురు గాక (14 వ శ్లోకము).
 
చాతుర్వర్ణములవారు యధాశక్తి ఈ గురుపీఠములను అర్చింతురుగాక (17 వ శ్లోకము)

ఈ నియమములన్నియు మనువు, గౌతముడు మొదలైన వారు చెప్పినవే (22 వ శ్లోకము)

కృతయుగమును బ్రహ్మదేవుడును, త్రేతాయుగమందు వశిష్ఠమహర్శియును, ద్వాపరయుగమున వ్యాసమహర్షియును జగద్గురువులై యుండిరి. ఈ కలియుగమున నేనే జగద్గురువునై అవతరించితిని. (శ్లోకం 25)
 
బౌద్ధం వల్ల ఒడిదుడుకులకు గురైన సనాతన హిందూవర్ణ వ్యవస్థను తానే తిరిగి స్థాపించానని; దానిని మీరు కాపాడుకోవాలని; చాతుర్వర్ణాలు ఈ గురుపీఠాలను యధాశక్తి సేవించుకోవాలని “మహానుశాసనం” ద్వారా చెప్పాడు. ఇది ఒకరకంగా ఆయామఠాలను నడిపించటానికి రాసుకొన్న "corporate governance manual" లాంటిది.
 
శంకరమఠాలు నేటికీ ఈ సూత్రాలపైనే నడుస్తున్నాయి. శంకరాచార్యుడు ఈ మఠాలను వర్ణాశ్రమధర్మాన్ని కాపాడటానికి, దానికి ప్రచారం కల్పించటానికి స్థాపించాడు. ఇతను దేశంలో వివిధ ప్రాంతాలు తిరుగి, మండనమిశ్ర, భాస్కర, కుమారిల భట్ట, భాస్కర వంటి పండితులతో శాస్త్ర చర్చలు జరిపి వారిని ఓడించి తన బోధనలకు విస్త్రుత ప్రచారం కల్పించినట్లు శంకరవిజయాలు చెబుతాయి.
****

బౌద్ధం ప్రభావంచే వేదాలు ఉపనిషత్తులు తీవ్రమైన విమర్శకు గురయ్యాయి. ఆ సమయంలో శంకరాచార్యుడు ఉపనిషత్తులకు వ్యాఖ్యానం చెప్పాడు. వేదాలను తిరిగి చర్చలోకి తీసుకొని వచ్చి వైదిక పునర్వికాసానికి దోహదపడ్డాడు. ఇతను ఈ పని చేయకపోయి ఉన్నట్లయితే బౌద్ధం ఘాతానికి వైదికమతం కాలగర్భంలో కలిసిపోయి ఉండేది.
*****

"శ్రవణాథ్యయనార్థ ప్రతిషేధాత్ స్మృతేశ్చ........." అనే బ్రహ్మసూత్రానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో శూద్రునికి వేదాలు వినడం నిషిద్ధమని, ఒకవేళ వింటే అతని చెవుల్లో సీసం కరిగించి పోయాలని, వేదాలు పలికితే నాలుక కొసివేయాలని అంటూ అనేక ఉపపత్తులు ఇస్తాడు. శంకరాచార్యుడు చేసిన ఇలాంటి వ్యాఖ్యానాలను అంతవరకు బౌద్ధమతం మనుషులందరూ ఒకటే అంటూ వెయ్యేళ్ళుగా తన బోధనల ద్వారా సాధించిన సమతను కాలరాసి సమాజంలో వర్ణవ్యవస్థను పునర్ ప్రతిష్టించే ప్రయత్నంగా అర్ధం చేసుకోవాలి. శూద్రునికి చదువు నిషిద్ధం అంటూ శంకరాచార్యుని చేసిన ఈ దిశానిర్ధేశం అనంతరం రాసిన అనేక పురాణేతిహాస వ్యాఖ్యానాలలో ప్రతిబింబించింది.

బ్రహ్మసూత్రకు శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో 9 అపశూద్రాధికరణం 34-38 లలో శూద్రునికి ఉపనయన సంస్కారం లేదు కనుక వేదాధ్యయనం లేదు. వేదాధ్యయనం లేదు కనుక బ్రహ్మ విద్యాధికారం లేదు అని స్పష్టంగా శూద్రులు విద్యనేర్చుకోవటానికి అర్హులు కారని ప్రకటించాడు.
ప్రాచీనకాలంలో ఆర్య అనార్య జాతులందరికీ ఉపనయన సంస్కారం ఉండేది. క్రమేపీ ఇది శూద్రులకు నిరాకరింపబడింది. ఉపనయనం ఉండటం ఒక గౌరవ సూచనగాను, లేకపోవటం దాసత్వం గాను మారిపోయింది. ఇది సమాజాన్ని నిలువునా చీల్చింది. ఉపనయనం ఉన్న పైమూడు వర్ణాలు అధికులుగాను, ఉపనయనం లేని శూద్రులు వారి సేవకులుగాను మిగిలిపోయారు. ఆ విధంగా శూద్రులు దాదాపు పరాజితులైనారు. ఇక అతిశూద్రులైతే ఈ మొత్తం ప్రక్రియలో పూర్తిగా బహిష్కృతులు.
****
 
శంకరాచార్యుడు భగవద్గీతలోని 18.41 శ్లోకానికి ఇచ్చిన వ్యాఖ్యానంలో గత కర్మల ఫలితంగా బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూద్రుల జన్మలు నిర్ణయమౌతాయని కర్మ సిద్ధాంతాన్ని సమర్ధిస్తాడు. కర్మ భావన అనేది ఈ జన్మలో జరుగుతున్న విషయాలకు గతజన్మలో చేసిన కర్మలే కారణం అనే వాదన. ఇది జాతిలో స్వేచ్ఛా సంకల్పం, వ్యక్తిగత ప్రయత్నాల అవసరాన్ని తగ్గిస్తుంది. ప్రజల మధ్య విభజనలు, హెచ్చుతగ్గుల పట్ల వారు ఏ పోరాటమూ చేయక అన్యాయాన్ని నిష్క్రియంగా స్వీకరించేలా చేస్తుంది. నా బ్రతుకు ఇంతే అనే నిరాశావాద ధోరణి ప్రబలుతుంది. నిజానికి వర్ణవ్యవస్థ ద్వారా 80% ప్రజలను బానిసలుగా రెండువేల సంవత్సరాలుగా కిక్కురుమనకుండా తొక్కిపెట్టటానికి దోహదపడిన మంత్రాంగంలో కర్మ సిద్ధాంతం ఒకటి.
 
భగవద్గీతలో “చాతుర్వర్ణం మయా సృష్టం….4.13 అనే శ్లోకంలో కృష్ణుడు బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య శూద్రవర్ణాలను వారి వారి గుణములు, కర్మలను బట్టి నాచే సృష్టించబడ్డాయి అంటాడు. ఈ శ్లోకానికి శంకరాచార్యుడు చెప్పిన భాష్యంలో తమోగుణము కలిగిన శూద్రులు పై మూడు వర్ణాలైన బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య వర్ణాలకు అవసరమగు సేవలు చేస్తూ జీవించాలని అన్వయం చెప్పాడు. ఇది మనుధర్మాన్ని సమాజంలో స్థిరపరచటం.
****

3. హిందూమత ఆవిర్భావం

1500–500 BCE మధ్య కాలంలో ఇంద్రుడు, అగ్ని వరుణుడు, సోముడు వంటి దేవతలు, యజ్ఞయాగాదులు, వేదాలు, ఉపనిషత్తులు ప్రభావంతో నడిచిన మతాన్ని వైదికమతం గా చెబుతారు. 600 BCE లో ఈ వైదికమతంలో విచ్చలవిడిగా సాగిన యజ్ఞయాగాదులు, బలులకు నిరసనగా బౌద్ధ, జైన, చార్వాక, ఆజీవిక లాంటి అనేక మతాలు పురుడుపోసుకొన్నాయి. వీటిలో బౌద్ధం సామాజిక సమానత్వం కలిగిఉండటం, కర్మకాండల ఒత్తిడి, జాతి ఆధిపత్యం లేకపోవటం, సరళమైన నైతిక జీవనం లాంటి అంశాలతో ప్రజలను ఆకట్టుకొంది. ఎక్కువమంది సామాన్యులు బౌద్ధంలో చేరారు. బౌద్ధం తాకిడికి వైదికమతం తన ప్రాభవాన్ని కోల్పోయింది. 600 CE నాటికి వైదిక మతం శైవం, వైష్ణవం, శాక్తేయం (శక్తి ఆరాధన), సౌర్యం (సూర్యారాధన), గణాపత్యం (గణపతి ఆరాధన), స్కంద (కార్తికేయ ఆరాధన) ఇంకా కాపాలిక, పాశుపత అంటూ శాఖోపశాఖలుగా చీలిపోయింది. అనైక్యత ఆవరించింది. శంకరుని కాలానికి 72 రకాల మతాలు ఉండేవని అంటారు.
ఇలాంటి నేపథ్యంలో శంకరాచార్యుడు తెరపైకి వచ్చాడు. బౌద్ధాన్ని మాయావాదనలతో కర్కశంగా అణచివేసాడు. వేదాలకు ఉపనిషత్తులకు భాష్యాలు రచించి వాటికి పునర్వైభవం కల్పించాడు. చీలిపోయిన వైదిక మతశాఖలన్నింటిని ఒక్కటిగా చేసి “పంచాయతన ఆరాధన” విధానాన్ని ప్రవేశపెట్టి దానికి బ్రాహ్మణుడిని అధిపతిని చేసాడు.

శివుడు, సూర్యుడు గణేషుడు, పార్వతీ దేవి, విష్ణువులను ప్రధానదేవతలుగా ఆరాధించటాన్ని పంచాయత పూజావిధానం అంటారు. ఈ విధంగా చేయటం వల్ల వేదాలను అనుసరించే శాఖలన్నీ ఒక్కటి అయ్యి బలంపుంజుకొన్నాయి. బుద్ధుడిని విష్ణువుయొక్క అవతారంగా కట్టుకథలు కల్పించారు. ఈ విధానం ప్రాచీనభారతదేశపు మతపరమైన సాంస్కృతిక వైవిధ్యాన్ని క్షీణింపచేసింది. ఆథ్యాత్మికామార్గాలలోని భిన్నత్వాన్ని చెరిపేసింది. ఆయా మతాల అవలంబులను బలవంతంగా హిందు ధర్మంలోకి కలిపేయటం లేదా నిర్మూలించటం జరిగింది. ఇదొకరకమైన ఆథ్యాత్మిక క్రూసేడ్.

వైదిక మతం బౌద్ధమతంలోని ధ్యానం, ఆరామసంస్కృతి, విగ్రహారాధనలను స్వీకరించింది. జైనంనుంచి అహింస, సన్యాసి జీవితం, కర్మ సిద్ధాంతం లాంటి అనుకూల అంశాలను గ్రహించింది. వేదాలకు, ధర్మశాస్త్రాలకు సాంస్కృతిక రూపంగా అష్టాదశ పురాణాలను, రామాయణ, మహాభారత పురాణాలను సృష్టించుకొంది. అలా వైదిక మతం క్రమేపీ నేడు మనం చెప్పుకొంటున్న హిందూమతంగా రూపాంతరం చెందింది.

ఈ ప్రక్రియలో శంకరాచార్యుడు పోషించిన పాత్ర రాజకీయమైనది. ఈ క్రమంలో హిందూమతం స్థిరీకరించబడిందని మాట్లాడతారు తప్ప ఏరకమైన అసమానతలు, వివక్ష లేకుండా సమాజాన్ని- సమానత్వం వైపు, శాస్త్రీయతవైపు నడిపించిన బౌద్ధమతం తొలగించబడిందని ఎవరూ మాట్లాడుకోరు. బౌద్ధమతం క్షీణించటానికి ఉన్న అనేక కారణాలలో శంకరాచార్యుడు జరిపిన దాడి కూడా ముఖ్యమైనదే.

4. ముగింపు

శంకరాచార్యుడు 8 వ శతాబ్దపు వ్యక్తి అని మనకు 14వ శతాబ్దంలో వివిధ వ్యక్తులు రాసిన అతని జీవిత చరిత్రల ద్వారా అర్ధమౌతుంది. మధ్యలో ఉండిన ఆరు శతాబ్దాల ఖాళీకి సంబంధించి ఏ రకమైన ఆధారాలు లభించవు. శంకరాచార్యుడు స్థాపించినట్లు చెబుతున్న మఠాలలో కూడా శాసనాలు 14 వ శతాబ్దం నుండి మాత్రమే లభిస్తాయి. శంకరాచార్యుని సమకాలీన శాసనాలు కానీ ఉటంకింపులు కానీ దొరకలేదు. ఇతను ఒక వ్యక్తా అనేక వ్యక్తులా అనేది కూడా చెప్పలేం. ఇతను చాణుక్యుడిలా కల్పిత పాత్రకావచ్చుననే సందేహం కూడా ఉంది. సాధారణంగా చారిత్రిక వ్యక్తుల కన్నా పురాణవ్యక్తులే శక్తివంతంగా ఉంటారు. అలా శంకరాచార్యుడు నేడు శ్రీరామచంద్రునిలా పురాణపురుషుడు. పూజనీయుడు. చరిత్రను దాటి పురాణపురుషునిగా ఎదిగిన వ్యక్తి చరిత్రాతీతుడు అయిపోతాడు. ఇక అతనికి ఆపాదించబడ్డ శక్తులను నిరూపించటం చారిత్రికంగా అసాధ్యం. వారిపై చర్చను ఈ మహిమలపైనకాక ఆ మహిమలు సమాజాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయనే చారిత్రిక సత్యాలపైనే చెయ్యాల్సి ఉంటుంది. అంతమాత్రానా అతన్నీ అతని మహిమల చారిత్రికతను ఒప్పుకొన్నట్లు కాదు.
****

శంకరాచార్యుడు సామాన్యప్రజలతో సంబంధాలు పెట్టుకోలేదు. ఇతని బుధజనవర్గం వేదపండితులు. వైదికరచనలకు వ్యాఖ్యానాలు రాయటం; వర్ణాశ్రమ ధర్మాలను స్థిరీకరించటం; మఠాలు క్రతువుల ద్వారా బ్రాహ్మణాధిక్యతను స్థాపించటం; స్త్రీలకు శూద్రులకు చదువును నిరాకరించటం; బౌద్ధులను నిర్మూలించి బౌద్ధారామాల ఆక్రమణ చేయటం లాంటివి శంకరాచార్యుడు చేసిన పనులు. వీటిలో ఏవీ 90 శాతం దేశ ప్రజలకు ఉపయోగకరం కావు సరికదా వారిని పీడించేవే.

శంకరాచార్యుడు ఉపనిషత్తులకు, బ్రహ్మసూత్రాలకు, భగవద్గీతకు చేసిన వ్యాఖ్యానాలు బౌద్ధ జైన మతాల తాకిడికి రెపరెపలాడుతున్న వైదిక ధర్మాన్ని నిలబెట్టిందని పండితులు పదే పదే చెబుతారు. “రాముడు రాక్షసులందరిని నాశనం చేసి సీతను రక్షించినట్లే, శంకరాచార్యుడు వేదాలను దూషించే బౌద్ధులను ఓడించి, ఉపనిషత్తుల సత్యమైన సీతకు పూర్వపు వైభవాన్ని పునరుద్ధరించాడు. మూడు లోకాలకు మేలు చేసిన గొప్ప శంకరునికి విజయం కలుగుగాక!” అని శంకరదిగ్విజయలో మాధవాచార్యుడు శంకరుని వేనోళ్ళ కొనియాడతాడు. (4-110)

శంకరాచార్యుని అద్వైత సిద్ధాంతం సామాన్యప్రజలకు అర్ధం కాదు. నేటికీ దానికి అన్వయం చెప్పటం సులభం కాదు. అయినప్పటికీ పండితులు అదేదో మానవేతిహాసపు మహావిష్కరణ అంటూ ప్రచారం చేసారు. శంకరుని వ్యాఖ్యానాలను చూపి వర్ణవ్యవస్థ, కర్మ సిద్ధాంతం, బ్రాహ్మణాధిక్యతను బతికించుకొని సమాజాన్ని మూఢనమ్మకాలలోకి, అసమానతలలోకి నడిపించి ధర్మం పేరుతో శూద్ర అతి శూద్ర వర్గాలను, వారి శ్రమను దోచుకుతినడానికి తెరలేపారు పండితులు.

ఈ మొత్తం చారిత్రిక మలుపులో పండితులు పోషించినపాత్ర, వారు పొందిన సామాజిక హోదా అత్యంత అమానవీయమైనది.

శంకరాచార్యునిచే ప్రవేశపెట్టబడినదిగా చెప్పే పంచాయతన ఆరాధనా విధానం వల్ల ఈదేశపు సాంస్కృతిక వైవిధ్యం అంతరించింది. బ్రాహ్మణుడు ప్రధానంగా జరిగే రిచువల్స్ కి ప్రాధాన్యత పెరిగింది.

శంకరాచార్యులు కాశీలో గంగానదిలో స్నానం చేసి వస్తుండగా ఒక చండాలుడు ఎదురుపడతాడు. అప్పటి ఆచారం ప్రకారం శంకరాచార్యులు అతన్ని దూరంగా ఉండమని చెబుతాడు. చండాలుడు శంకరాచార్యుని దేహాన్ని చూసి "మీరు దేహాన్ని దూరంగా ఉండమంటున్నారా లేక ఆత్మను దూరంగా ఉండమంటున్నారా?" అని ప్రశ్నిస్తాడు. ఈ ప్రశ్నకు శంకరాచార్యులు తన అజ్ఞానాన్ని తెలుసుకొని చండాలుని సాక్షాత్తు శివునిగా గుర్తించి నమస్కరిస్తాడు. శంకర దిగ్విజయంలో చెప్పిన ఈ చండాలుని వృత్తాంతం చూపుతూ శంకరాచార్యుడు అంటరానితనాన్ని నిరసించాడని, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా నిలిచాడని కొందరు పండితులు వాదిస్తారు. నిజానికి పై ఘట్టంలో సమానభావన ఎక్కడ ఉంది? అదే శంకరదిగ్విజయంలో శంకరాచార్యుడు సాక్షాత్తూ శివావతారమని చెప్పినప్పుడు చండాలుని రూపంలో వచ్చిన మరొక శివుడు ఎవరు? ఇవన్నీ అన్వయాలపేరుతో పండితులు చేసే మోసాలు.

శంకరాచార్యుని ప్రభావం నేటికీ సమాజంలో ఉంది. ఉదాహరణకు డా. అంబేద్కర్ మహాసయుడు పార్లమెంటులో హిందూకోడ్ బిల్ ప్రవేశపెడుతున్నప్పుడు కర్ణాటకలోని శంకరాచార్యుని స్కూల్ కు చెందిన సంకేశ్వర మఠాధిపతి "గంగాజలం పవిత్రమైనది కావచ్చు, కానీ అది వీధి కుళాయి ద్వారా వస్తే, దానిని పవిత్రంగా పరిగణించలేము. అదేవిధంగా, 'ధర్మశాస్త్రం' (హిందూకోడ్ బిల్) ఎంత ప్రామాణికమైనదైనా, డాక్టర్ అంబేద్కర్ వంటి 'మహర్' నుండి వచ్చినందున దానిని ప్రామాణికంగా పరిగణించలేము" అన్నాడు. శతాబ్దాలతరువాత కూడా శక్తివంతంగా నిలిచిన శంకరాచార్యుని “మహానుశాసనం” అది.

వర్ణవ్యవస్థను సమాజంలో స్థిరపరచి బౌద్ధం వల్ల మసకబారిన బ్రాహ్మణాధిక్యతకు పునర్వైభవం తెప్పించినందుకు నేటికీ పండితులు శంకరాచార్యుడిని “శంకరభగవత్పాదులు” అనీ, సాక్షాత్తూ శివావతారమనీ గొప్ప భక్తి ప్రపత్తులతో, కృతజ్ఞతాపూర్వకంగా పిలుచుకొంటారు. శంకర జయంతి పేరిట ఏటా పెద్దఎత్తున పూజలు, వేడుకలు జరుపుకొంటారు.
***

ఈరోజు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛతో చదువుకొని గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్న బహుజనులు, ఒకప్పుడు తాము బానిసత్వపు చీకటిలోకి ఎలా నెట్టబడ్డారో, శతాబ్దాలుగా అక్కడే ఎలా ఉంచబడ్డారో ఆ మంత్రాంగాన్ని అర్థం చేసుకునే క్రమంలో శంకరాచార్యుడు పోషించిన పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించాలి. గతమెంతో గొప్పది, అందరినీ అక్కడికే నడిపిస్తాం అంటూ పండితులు ప్రచారిస్తున్న నేపథ్యంలో ఇలాంటి అవగాహన అవసరం.

బొల్లోజు బాబా


సంప్రదించిన పుస్తకాలు
1. 1. Brahma Sutra Bhasya Of Shankaracharya by Swami Gambhirananda, pn233
2. శ్రీశంకరావతార చరితము, యఱ్ఱాప్రగడ వేంకట సూర్యనారాయణ మూర్తి
3. The Buddhist Antiquities of Nagarjunkonda, by A.H.Longhurst, Delhi, 1938, p.6.
4. complete Works of Swami Vivekananda, vol. VII, p.116
5. Tirupati Balaji was a Buddhist Shrine, by K. Jamanadas
6. Sankara Digvijaya, Translated by Swamy Tapasyananda, Ramakrishna math publication.
7. శ్రీశంకర విజయము, చిలుకూరు వెంకటేశ్వర్లు
8.ఆదిశంకరాచార్య వ్యక్తిత్వం తత్వం – రావిపూడి వెంకటాద్రి
9. Decline and Fall of Buddhism, by Dr.KJamnadas
10. Slavery, Jyothirao Phule
11. On Hinduism, Wendy Doniger
12. వేదబాహ్యులు, బొల్లోజు బాబా