Thursday, May 9, 2024

కులాలు బ్రిటిష్ వారి సృష్టా?


ఇటీవల ఒక ట్రెండ్ చూస్తున్నాం. సాంప్రదాయినిలా వేషంకట్టిన ఒకామె “బ్రిటిష్ వారి రాకముందు కులాలనేవి ఉండేవి కావు, ఈ కులాలన్నీ బ్రిటిష్ వారి సృష్టి, నిజానికి కులం/Caste అనే పదమే ఫ్రెంచి పదం” అంటూ ఢంకాభజాయించి చెబుతోంది. మరొక అమ్మాయి అయితే పాతకాలంలో కులాలే లేవు వర్ణాలు మాత్రమే ఉన్నాయి అంటు పేద్దగొంతుక చేసుకొని అరుంధతిలా అరుస్తూంది.

బ్రిటిష్ వారి రాకముందు సమాజంలో ఏ కులాలూ లేవని అదొక అద్భుతమైన సమాజమని, బ్రిటిష్ వారు కులాలను సృష్టించి మనల్ని విడదీశారని అంటూ కొందరు ప్రజల్ని భ్రమింపచేయటానికి ప్రయత్నిస్తారు.
మనసమాజం మొదట్లో ధర్మశాస్త్రాల ప్రకారం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలుగా విభజింపబడి ఉండేది. క్రమేపి పై మూడు వర్ణాలు ఒక్కో కులంగా స్థిరపడగా; శూద్రవర్ణం మాత్రం వృత్తులు, ఎండోగమీ కారణంగా భిన్న కులాలుగా పరిణామం చెందింది.
***

అనేక తెలుగు శాసనాలలో అష్టాదశ ప్రజ (eighteen castes), పదునెనిమిది సమయాల వారు, పదునెనిమిది జాతుల ప్రజ, సమస్త ప్రజ అనే వివిధ పేర్లతో ఒక గ్రామములో ఉండే భిన్న కులాలను సంబోధించటం గమనించవచ్చు.
ఈ పద్దెనిమిది కులాలకు చెందిన వ్యక్తులు ఆ గ్రామములో జరగాల్సిన వివిధ సామాజిక కార్యాలకు బాధ్యత వహించేవారు.

*కొక్కిరేని గ్రామంలో క్రీశ 1314 కి చెందిన ఒక శాసనంలో- కోమటి, కాంపులు, గొల్లలు, బ్రాహ్మలు, సాలె వారు, కర్ణము, లెఖపెట్టువారు అంటూ వివిధ కులాల నామాలు కనిపిస్తాయి. (రి.South Indian Inscriptions, Vol X pn.274)

*కరవడి వద్ద క్రీశ 1310 కి చెందిన ఒక శాసనంలో శెట్టి, కాంపులు, రెడ్డిలు ఇంకా ఇతరులు కలిసి రామనాథ విగ్రహానికి బహుమతులు సమర్పించుకొన్నట్లు ఉంది.
*క్రీశ 965 లో కంబదూర్ అనే గ్రామానికి చెందిన 106 గౌండులు (Gaundas-Farmers ??) ఊరి చెరువు నిర్వహణబాధ్యత వహించినట్లు శాసనం కలదు.

*నారాయణపురం క్రీశ 1132 కు చెందిన ఒక శాసనము ద్వారా ఆ ఊరిలో ముప్పై కాంపు కుటుంబాలు ఇంకా నాయకులు, 300 ఒక్కలిగ కుటుంబాలు ఉన్నట్లు అర్ధమౌతుంది.
*కాటుకూరు క్రీశ1303 కి చెందిన ఒక శాసనములో పద్దెనిమిది కులాలలో మహాజనులు, నగరము, కాంపులు, బలెజ వర్తకులు కలిసి గొపీనాథ దేవరకు బహుమతులు సమర్పించుకొన్నట్లు ఉంది.
*నాగులపాడు వద్ద లభించిన 1303 నాటి శాసనంలో కాంపులు, గొల్లవారు, కోమటిలు, ఈదరవాండ్రు, అక్కసాలలు, సాలెవాండ్రు, తెలుకలు ఆలయానికి బహుమతులు సమర్పించుకొన్నట్లు ఉంది
*క్రీశ 1111 నాటి మాచెర్ల శాసనంలో ఆదిత్యేశ్వర ఆలయాన్ని నిర్మించినందుకు తిప్పోజు, నవోజు అనే శిల్పులకు కొంత భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుస్తుంది.

* దాస నంబిలు ఆలయానికి చెందిన బృందావనాలను సాకుతూ, ఆలయంలోని వివిధ అర్చనలకు అవసరమైన దండలను, పూలను అందించేవారు. వీరి పోషణ కొరకు భక్తులు భూములు దానంగా ఇచ్చేవారు. (శాసన సంఖ్య 1238 SII V- శాసన వాక్యము- తోట దాసరులు ఇద్దరకు కూడుజీతమునకు//)

*కప్పరం దాసరుల పేరుతో ఆలయంలో ఉత్సవ విగ్రహాలను సంరంక్షించే ప్రత్యేకమైన దాసులు ఉండేవారని సా.శ.1637 నాటి నంద్యాల తామ్రశాసనం ద్వారా తెలుస్తున్నది.
*వైష్ణవభక్తులైన దొమ్మర కులస్థులు తమకు వచ్చే ఈ ఆదాయంలో కొంతభాగాన్ని దేవుడికి సమర్పించుకొన్నట్లు కొన్ని శాసనాలు కలవు. కడపజిల్లాలోని మోటకట్ల తిరువెంకటనాథునికి - పద్మరాజు కొడుకైన బసవరాజు తనకులానికి వచ్చే దొమ్మరపన్ను సమర్పించుకొన్నట్లు శాసనం వేయించాడు. (A.R.No. 11 of 1968-69.).
***

ఒక గ్రామములో వంశపారంపర్య సేవకులు మొత్తం పన్నెండు మంది ఉండేవారు. వారు, నంబివాడు (officiating priest in Vishnu temple, రెడ్డి head farmer, కరణము town clerk, పౌరోహితుడు village priest, తలారి the watchman, వడ్లవాడు, the carpenter, కమ్మరవాడు blacksmith, కుమ్మరవాడు the pot maker, చాకలవాడు, మంగలవాడు, మాలవాడు pariar, మాదిగవాడు.

వీరిని “బారబలావతీలు” అంటారు. కొత్తగా ఏర్పడిన గ్రామాలకు రాజు ఈ వృత్తులవారిని కేటాయించేవాడు. వీరు గ్రామమును విడిచి వెళ్ళకుండా వారికి వృత్తిమాన్యములు లేదా జీవన భృతిని గ్రామం చూపించి వీరి సేవలు పొందేవారు. (వీరు ఆ గ్రామాన్ని విడిచి వెళ్ళరాదు. ఈ ఆర్టిసాన్స్/చేతివృత్తుల వారు ఒక వేళ మెరుగైన జీవనం కొరకు పారిపోతే చేతులు ఖంఢించి శిక్షించేవారు). ఇది ఒకనాటి మన గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ.

బారాబలావతీ అనేది ఉర్దూ పదం. అంటే బ్రిటిష్ వారు రాకముందే గ్రామాలలో ఈ పన్నెండు కులాలతో కూడిన ఒక వ్యవస్థ ముస్లిమ్ పాలనలో ఉండేదని అర్ధం చేసుకోవాలి.
***

పైన చెప్పిన శాసనాలలోని సమూహాలకు కులం/Caste అనే పేరు చెక్కి ఉండకపోవచ్చు కానీ ఆ సమూహాల పేర్లు నేటి కులాల పేర్లు ఒకటే కావటం గమనార్హం. వీళ్ళ అతి తెలివి ఎలాంటిదంటే- Face అనే పదం ఇంగ్లీషు వాడు తీసుకొచ్చాడు కనుక అంతకు ముందు నీకు ముఖమే ఉండేది కాదు అని వాదించేటంత.

కులాలు బ్రిటిష్ వారి సృష్టి అని వారు రాకముందు ప్రజలందరూ ఎంతో సామరస్యంతో కలిసి మెలసి ఉండేవారని, బ్రిటిష్ వారు వచ్చి మనల్ని కులాలుగా విడదీసారు అని చెబుతారు వీరు. .
నిజానికి వీళ్ళ బాధ అది కాదు. అంతవరకూ పై వర్ణాలవారికి శూద్రులు సేవచేయాలి అంటూ శాసించి వారిపై శతాబ్దాలపాటు పెత్తనం సాగించారు. బ్రిటిషర్స్ ఆ అణగారిన వర్గాలకు విద్య, ప్రాధమిక హక్కులు కల్పించి వారిని పై వర్ణాల సరసన కూర్చోపెట్టినందుకు కలిగిన బాధ ఇది. బ్రిటిష్ వారు వెళిపోయి ఇన్నేళ్లవుతున్నా వారికి పడి ఏడవటం ఇంకా ఆపరు.

నిజానికి ఈ రోజు రాజ్యాంగం కూడా అణగారిన వర్గాల హక్కులను పదిలపరచింది. ఒక్క డా.అంబేద్కర్ కాక మరొకరెవరైనా రాజ్యాంగం రాసి ఉన్నట్లయితే, ధర్మశాస్త్రాల ఆధారంగా రాయబడి ఉండేది. ఆ ప్రమాదాన్ని తప్పించానని డా. అంబేడ్కర్ గర్వంగా చెప్పుకొన్నారు.
అందుకే రాజ్యాంగాన్ని మార్పించేసి మరలా ధర్మశాస్త్రాల ఆధారంగా నడిచిన పాతరోజులకు సమాజాన్ని తీసుకుపోవాలని ఉవ్విళ్ళూరుతున్నది ఈ వర్గాలే. ఈ రోజు రాజ్యాంగం మార్చుతామనే కూతలవెనుక కుట్ర అది.

పైన చెప్పిన కులాలలో ఎక్కువ శూద్రకులాలు ఉన్నాయి. హిందూ ధర్మశాస్త్రాలు ఈ శూద్రకులాలకు, వారికి వెలుపల ఉన్న చండాలురకు విధించిన ఆంక్షలు గురించిన చర్చ మరింత పెద్దది.

బొల్లోజు బాబా

పైన చెప్పిన శాసనాలకు - T Venkateswara Rao, గారు చేసిన Local bodies in Pre Vijayanagara Andhra A D 1000 to A D 1336 అనే పి.హెచ్.డి గ్రంథం ఆధారం. ఇది shodhganga లో లభ్యం.



1 comment:

  1. -

    ఎప్పటివీ కులముల్ ? మును
    పెప్పటి కాలపు వ్యవస్థ? పెనుభూతంబై
    ముప్పుకలిగించె ప్రజలకు
    తప్పును సరిచేయ వలయు దమ్ముగ బాబా!





    ReplyDelete